సిపాయి కథలు – శిష్ట్లా ఉమామహేశ్వరరావు వ్రాసిన విలక్షణమైన తెలుగు కథలు
సిపాయి కథలు – శిష్ట్లా ఉమామహేశ్వరరావు వ్రాసిన విలక్షణమైన తెలుగు కథలు
ఆధునిక తెలుగు సాహిత్యంలో సైనిక, యుద్ధ వాతావరణాల ప్రస్తావన చాలా అరుదుగా కనిపిస్తుంది. రెండవ ప్రపంచయుద్ధంలో విశాఖపట్నం మీద బాంబులు పడడం వంటి చారిత్రక ఘటనలు ఉన్నా, సరిహద్దులకు దూరంగా ఉండటం, సైన్యంలో చేరే తెలుగువారి సంఖ్య తక్కువ కావడం కారణాలు అనుకోవచ్చేమో. రెండవ ప్రపంచయుద్ధపు మాంద్యపు రోజుల్లో ఆరుద్ర, శ్రీశ్రీ, కొడవటిగంటి కుటుంబరావు వంటి ప్రముఖరచయితలు చాలామంది మిలటరీలో కొంతకాలం ఉద్యోగం చేసినవారే. ఐనా మిలటరీ జీవితం కథావస్తువుగా వచ్చిన రచనలు తక్కువే. అట్లూరి పిచ్చేశ్వరరావు కథలు కొన్నిటిలో నేవీ ఉద్యోగుల జీవితం గురించి ఉన్నట్లు గుర్తు. మునిపల్లె రాజుగారి కొన్ని కథల్లో మిలటరీ జీవితం ఉంటుంది. నాకు గుర్తున్నంతవరకూ, అంగర వేంకట కృష్ణారావుగారి విరామం ఒక్కటే నిజమైన మిలటరీ జీవితం నేపధ్యంగా సాగిన నవల. యద్దనపూడి వంటి రచయితల నవలల్లో, కథల్లో కొన్నిసార్లు మిలటరీ జీవితం నేపథ్యం కనిపించినా, వాటిలో వాస్తవికత తక్కువ.
మిలటరీ జీవితం గురించే ప్రత్యేకంగా కథలు వ్రాసిన వాడు తెలుగులో ఆధునిక కవితా వైతాళికులలో ముఖ్యుడిగా చెప్పబడే కవి కావటం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఆయన కవితలు ఇప్పుడు సకృత్తుగానే లభ్యమౌతున్నా, గత శతాబ్దపు పూర్వార్థపు కవితా చరిత్ర తెలిసినవారు శిష్ట్లా ఉమామహేశ్వరరావుని “అతి నవ్యులలో అతి నవ్యు”నిగా, “వైచిత్రికీ, విచిత్ర ప్రయోగ పరతకీ పేరు మోసిన”వాడుగా కీర్తిస్తారు. ఇప్పుడు లభ్యం కాని శిష్ట్లా కవిత “మారో మారో మారో” (1928) మహాప్రస్థానం కవితకు ప్రోద్బలమని శ్రీశ్రీయే స్వయంగా చెప్పాడు. శిష్ట్లా ఉమామహేశ్వరరావు గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. అతను ‘ఉన్మత్త భావశాలి’, “సాహిత్యరంగంలో ‘స్వైర విహార ధీరుడు”. కె.వి.రమణారెడ్డిగారి మాటల్లో, “జీవితంలోనూ, సాహిత్యంలోనూ ‘అరాచకం’ (anarchy) శిష్‌ట్లాకు పర్యాయ వాచకం.”
సిపాయి కథలు 1946లో ‘యువ’ ప్రచురణగా గ్రంథరూపంలో వచ్చాయట. ఇంకొన్ని సిపాయి కథలు 1947-48 మధ్య నెల్లూరునుండి వచ్చే జమీన్‌రైతు పత్రికలో కూడా వచ్చాయట. ఈ కథల్ని మళ్ళీ 1984లో, కె.వి.రమణారెడ్డి గారు సంకలించగా, విజయవాడ నవోదయా పబ్లిషర్స్ వారు ప్రచురించారు. ఈ సంకలనంలో 21 కథలున్నాయి.
ఈ సంకలనంలో మొదటి కథ గురకానందం మార్పు మిలటరీ జీవితానికీ, మిలిటరీ వ్యక్తులకీ సంబంధించిన కథ కాదు. కథా వస్తువులోనూ, శైలిలోనూ మిగతా కథలతో ఏసంబంధమూ లేని ఈ కథను, ఈ సంకలనంలో, అందునా మొదటికథగా ఎందుకు చేర్చారో, నాకు అర్థం కాలేదు. ఆఖరు కథ శాంతమూ, సౌఖ్యమూ కూడా మిలటరీ జీవితపు కథ కాదు. సంకలనకర్త సిపాయికథలకు అటూ ఇటూ అట్టల్లా ఈ కథలు వాడుకున్నారేమో. ఇంకో కథ లెఫ్టినెంట్ తులసి మిలటరీ వ్యక్తుల కథే ఐనా, మిగతా కథల్లా ఒక సిపాయి చెప్పిన కథ గాదు; సిపాయి జీవితపు కథా కాదు; నిడివిలో పెద్దది – ఐదు అధ్యాయాల కథ; ముఖ్యకథా వస్తువు ప్రేమ. లెఫ్టినెంట్
ఈ మూడు కథల్నీ కాసేపు పక్కకి పెట్టేస్తే, మిగతా 18 కథలూ ఒక సిపాయి ఉత్తమ పురుషలో చెప్పినట్లుగా ఉంటాయి. తెలుగు సిపాయిలు ఎక్కువగా ఉన్న పటాలంలో జరిగిన (లేక ఒకరికొకరు చెప్పుకున్న) కథలు. ఒక కథకు మాత్రం కథాస్థలం అరేబియా. మిగతా కథల్లో చాలావరకూ అస్సోం (కొమిల్లా, గౌహతి) ప్రాంతాల్లో బ్రహ్మపుత్రకు అటో ఇటో జరిగిన కథలు. కొన్ని కథలు సిపాయిలు సెలవుల్లో ఉన్నప్పుడు జరిగినవి. చాలాకథల్లో కథ చెప్పే సిపాయి పేరు అబ్బాయిగారి సుబ్బాయి. లమ్డీకే లచ్చన్న చాలా కథల్లో ముఖ్య పాత్రధారి. ఇంకా పెదబొండాయి, గన్నరు గుర్నాధం, గూబ గోసాయి చాలా కథల్లో కనిపిస్తారు. ఈ అబ్బాయిగారి సుబ్బాయికే అగ్రహారబ్బడితె అని కూడా పేరు ఉన్నట్టుంది.
ఒక్క కథలో మాత్రమే యుద్ధం ప్రస్తావన కనిపిస్తుంది. సంకలనకర్త రమణారెడ్డిగారి మాటల్లో
జపాన్ సేనలు ఆజాద్ హింద్ ఫౌజ్‌ను వెంటబెట్టుకుని మనదేశం మీదకు దాడి చేయనున్న తరుణం. దాన్ని తిప్పికొట్టే సన్నాహాలలో భాగంగా సైనిక శిబిరాలు నెలకొల్పుకుని, బ్రిటిష్ సామ్రాజ్య సంరక్షకులుగా మన సిపాయీలు ఎదురు చూస్తూ, తీరికగా, దాదాపు నిశ్చింతతో, కాలక్షేపం చేస్తూ వచ్చిన సమయం. కాబట్టి సర్దాలకూ వినోదాలకూ పుష్కలమైన అవకాశం. డాదాపు అందరూ తెలుగు ‘జోదు’లే. అందునా అధిక భాగం గుంటూరు ‘గొప్ప’ బిడ్దలే. ఇంకా చూస్తే, సాంఘికంగా ఎక్కువ మందిది సంఘంలో కింది మెట్టే. అంచేతనే వాళ్ళ మాటలు మొరటువి. జోక్‌లు నేలబారువి. చేష్టలు కొంటెవి
స్వంత అనుభవాలను, చిన్న చిన్న సంఘటనలను మాండలికంలో చిన్న కథలుగా వ్రాయటం నామినితో మొదలయ్యిందని, నామిని బాటనే చాలామంది నడుస్తున్నారని వాడుకలో ఉన్న మాట. ఈ పని శిష్ట్లా ఉమామహేశ్వరరావు ఏనాడో చేశాడని తెలుస్తుంది ఈ కథలు చదివితే. వీలు దొరికినప్పుడల్లా సారాయో (లేకపోతే చాయో) తాగుతూ, సిగరెట్లు కాలుస్తూ, పేకాట ఆడుకుంటూ, ఎంపీలకు (మిలటరీ పోలీసులకు), సీనియర్ ఆఫీసర్లకూ దొరక్కుండా తప్పించుకుంటూ ఒకరికొకరు చెప్పుకునే కతలివి. ఒక్కొక్కరికీ ఒక్కో బిరుద నామం: మూడుమొకాల నర్సిగాడు, నక్కాయి గాడు, లమ్డీకే లచ్చన్న, గుంయి గుంయి గురివి వగైరా. ఆ పేర్ల వెనక కూడా కథలు ఉంటాయి. ఒకోసారి సీనియర్ ఆఫీసర్లకు ఠోకరా తినిపించి పబ్బం గడుపుకోవడం ఉంటుంది. ఒకోసారి అతితెలివికిపోయి మీదకు తెచ్చుకోవటమూ ఉంటుంది. అక్కడక్కడా కనిపించే ఆడవారిమీద మనసుపోవడమో, లేక వారితో అవసరాలు తీర్చుకోవడమో ఉంటుంది. మిలటరీలో ఉన్న రకరకాల వాళ్ళ ప్రవర్తన, మసస్తత్వాల చిత్రణ రేఖామాత్రంగా ఉంటుంది. కొన్ని కథలకు ఆఖర్లో ఉండే మెలిక ముఖ్యం. చాలాకథల్లో కొంటెతనమూ, చమత్కారమూ ముఖ్యవస్తువులు. కానీ, పడిపోయిన సిపాయి కథ ఆర్ద్రంగా ఉంటుంది.
గురకానందం మార్పు హాస్యప్రధానమైన కథ. మిగతా కథల్లాగానే కథ చెప్పటంలో కొంత వ్యంగ్య ధోరణి ఉంది. శాంతమూ, సౌఖ్యమూ కథలో గుర్తుంచుకోవలసిన విశేషమేమీ కనిపించలేదు. లెఫ్టినెంట్ తులసి కథ పై తరగతి వాళ్ళ కథ. లెఫ్టినెంట్ తులసి డాక్టరు, అందగత్తె, మంచి హృదయం ఉన్నది, సేవ చేయటం కోసమే మిలటరీలో చేరింది. ఆస్తి కూడా చాలా ఉంది కాని ఆమె మైనరు కావటం వల్ల ఆస్తికీ, ఆమెకూ మేనత్త రాంబాయే గార్డియను. సెలవుల్లో ఇంటికి మద్రాసు వచ్చింది. యీ లీవులో ఆమెకు డాక్టర్ మహీపతికి పెళ్ళి చేద్దామని రాంబాయి ఉద్దేశం. కొద్దిగా ముదిరిన బ్రహ్మచారి కెప్టెన్ రావుకు కూడా తులసి అంటే ఇష్టమే. మద్రాసులో పైతరగతివాళ్ళ మధ్య జరిగే ఈ ప్రేమల కథ ఇందాక చెప్పినట్టుగా మిగతా సిపాయి కథలకంటే భిన్నంగా ఉంటుంది.
శిష్ట్లా ఉమామహేశ్వరరావు గుంటూరు జిల్లా మంచాళ అగ్రహారంలో జన్మించారు. నవంబరు 2, 1909 జన్మదినం అని చెప్పబడుతున్నా ఆ తేదీపట్ల కొన్ని సందేహాలు ఉన్నాయి. 1953లో మరణించాడని చెప్పుకోవటం. అతని మరణం తేదీ, ఇతర వివరాలూ నిర్దుష్టంగా తెలీవు. బెనారస్ యూనివర్శిటీలో ఆంగ్లంలో ఎం.ఏ. పట్టా పుచ్చుకొన్నాడు. కొడవటిగంటి కుటుంబరావు, మాధవపెద్ది గోఖలేలకు బంధువు. భారీ మనిషి; భరించటం కష్టమైన మనిషి అని కొన్ని కథలు వ్యాప్తిలో ఉన్నాయి. శ్రీశ్రీని ఒకసారి కట్టేసి గుంటూర్లో గడ్డివాములకు మంటపెట్టి కాల్చేయడానికి ప్రయత్నించాడన్న కథ శ్రీశ్రీ అనంతంలోనూ, అబ్బూరి వరదరాజేశ్వరరావు కవనకుతూహలంలోనూ కనిపిస్తాయి.
శ్రీరంగం నారాయణబాబు, సభాపతి శివశంకరశాస్త్రి, ఆరుద్ర, సోమసుందర్, శ్రీశ్రీ వంటి వారిచే కవిగా శిష్ట్లా విరివిగా ప్రశంసలు పొందాడు; శ్రీశ్రీ కన్నా శిష్ట్లాయే గొప్ప కవి అని శివశంకరశాస్త్రిగారు, ఇతరులు అనేవారని వరద రాజేశ్వరరావు కథనం. సిపాయి కథలే కాకుండా ఆంగ్లోఇండియన్ కథలు అనే పుస్తకం కూడా ప్రచురితమయ్యింది. ఆకాశవాణి కథలు, మరికొన్ని కథలు కూడా వచ్చాయట. అవేవీ ఇప్పుడు దొరుకుతున్నట్టు లేదు. అగ్రహారబ్బడితె వంటి కథలతో సంభ్రమాశ్చర్యాలు కలిగించాడని రమణారెడ్డిగారు, అగ్రహారబ్బడితె brilliant self analysis అని కుటుంబరావుగారు మెచ్చుకున్నారు. ఆ కథ కూడా దొరుకుతున్నట్టు లేదు.
ఈ కథలు గొప్ప కథలు అని చెప్పను కానీ, వీటిలో ఉన్న వాతావరణ చిత్రణ మెచ్చుకోదగ్గది, విలక్షణమైనది. ఇంగ్లీషులో ఎమ్మే ఉండి, తెలుగు సాహిత్యం బాగా తెలిసిన ఈ కవి, రచయిత, మిలటరీలో ఒట్టి సిపాయిగా (కనీసం జమేదారో, హవల్దారో కూడా కాకుండా) ఎట్లా ఉన్నాడో, ఈ నాటుబాసని, ఈ పాత్రలనీ ఎక్కడ ఎలా పట్టుకొన్నాడో వింతగా అనిపిస్తుంది.
నవోదయావారు తమ ట్రేడ్‌మార్కు నాణ్యతతో, బాపు గారి అందమైన ముఖచిత్రంతో, అచ్చు తప్పులు లేకుండా ఈ పుస్తకం ప్రచురించారు. కె.వి.రమణారెడ్డిగారు విపులమైన ముందుమాట వ్రాశారు
ఈ సిపాయి కథలను వాటి విలక్షణతకోసం, చరిత్ర కోసం (దేశ చరిత్ర, తెలుగు సాహిత్య చరిత్ర కూడ), యాస, బాసలకోసం చదవాలి.
*********
సిపాయి కథలు (Sipaayi Kathalu – Sishtla Uma Maheswara Rao)
శిష్ట్లా ఉమామహేశ్వరరావు (1909-1953?)
మొదటి ప్రచురణ: 1946, యువ ప్రచురణలు
మలి ప్రచురణ: 1984
సంకలనం: కె.వి.రమణారెడ్డి
నవోదయ పబ్లిషర్స్
విజయవాడ – 520 002
136 పేజీలు; 10 రూ.
Anil
http://www.eemaata.com/em/issues/201103/1675.html
link lo “Padipoyina Sipai” ane katha chadavavachhu.
Evaraina ee book(SIPAI KATHALU) and Pusapati krishnam raju gari kathalu reprint chesthe bagundu.
Jampala Chowdary
@Anil: Thanks.
మీరు ఇచ్చిన లంకెని వ్యాసానికి జత పరుస్తున్నాను.
ఆ కథపై ఈమాట సంపాదకుడు శ్రీ వేలూరి వెంకటేశ్వరరావు వ్యాఖ్యానం ఇక్కడ చదువవచ్చు.
dvenkat
దొరకని పుస్తకాల గురించి చెప్పి ఊరించేస్తున్నారు…