వివేకానందుని ఉత్తరాలు

swami_vivekanandaవివేకానందుడి గూర్చి చెప్పాలంటే ఎక్కడ ప్రారంభించాలో, ఎక్కడ ముగించాలో అర్థం కాదు. జ్ఞాపకాలు, అనుభవాలు అనుభూతులు ఒకటా రెండా! పేరు వినగానే నరాల్లో రక్తం పరుగులు తీస్తుంది. చిమ్మ చీకటిని నిట్టనిలువునా చీల్చే విద్యుల్లతనొకదానిని మానవ శరీరం లో బంధించారేమో అన్నట్లుండే రూపం,విషయాన్ని చూడగానే దాని మర్మాలను తెలుసుకోగల అపారమైన మేధస్సు, చేతిలో చిల్లిగవ్వకూడా లేకున్నా ఒక గొప్ప సంస్థను నిర్మించిన కార్యదక్షత, నమ్మినవాటికోసం ప్రపంచం మొత్తాన్ని ధిక్కరించి నిలబడగల సత్తా… నిద్రాణమైన ఒక జాతిని మొత్తము పునరుత్తేజితం చేసిన వ్యక్తిత్వం… వెరసి వివేకానందుడొక అద్భుతం.

వివెకానందుడినీ, ఆయన రచనలని పరిచయం చేయబోవటం సాహసమే అవుతుంది. పరిచయాలు అఖ్ఖర్లేని వ్యక్తి వివేకానందుడు. అయినా, ఆయన మీద వెలువడిన ఒకానొక పుస్తకంతో నా అనుభవాన్ని పంచుకునే ఉద్దేశ్యమే ఈ వ్యాసం. ఆ పుస్తకమే Letters of Swami Vivekananda (వివేకానందుని ఉత్తరాలు). వివేకానందుడు తన జీవితకాలంలో తన సహచరులకు, స్నేహితులకు, విద్వాంసులకు, శిష్యులకు మొదలగు వారికి రాసిన ఉత్తరాలలో అందుబాట్లో ఉన్న ఉత్తరాల సంకలనమే ఈ పుస్తకం. ఇది ఒక రకం గా వివేకానందుని ఆత్మకథ. ఉత్తరాలు ఆలోచనలు అడ్దంకులు లేకుండా ప్రవహించే చోటు. ఉత్తరాలు మనిషి సంతోషాన్ని, వ్యధను, కోరికలను ఆశయాలనూ భేషజాలు లేకుండా వ్యక్తపరిచే చోటు. వ్యక్తి గూర్చి తెలుసుకోవడానికి ఇది ఎంత మహదావకాశం? ఇక పుస్తక వివరాల్లోకి వెళితే…

అద్వైత ఆశ్రమం వారు ఈ పుస్తకాన్ని వివేకానందుడు రాసిన ఉత్తరాలనన్నింటిని తేదీల సహాయంతో ఒకదాని తర్వాత ఒకటి అమర్చి ప్రచురించడం వల్ల ఆయా సమయాల్లో ఆయన మనఃస్థితి మనకు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. అదే ఈ పుస్తకంలోని సౌందర్యం. పండితులతో తార్కిక వాదనలు, విద్వాంసుల నుంచి సందేహ నివృత్తి, తనతో పాటుగా రామకృష్ణుని పాదాల వద్ద కూర్చున్న సహచరులతో సమాలోచనలు, తన వ్యక్తిత్వానికి ఆకర్షితులైన రాజులు, జమీందారులు, సామాన్యులు మొదలగు వారికి దిశా నిర్దేశాలు, అక్కడక్కడా కవిత్వం వెరసి ఇది తన సొంత అక్షరాలతో చిత్రించిన జీవనచిత్రం.

అధికశాతం ఉత్తరాలు ఆంగ్లంలోనే రాసినా, బెంగాలి లో రాసిన ఉత్తరాలనుకూడా అద్వైతాశ్రమం వారు ఆంగ్లంలోకి అనువదించారు. చదవటం మొదలుపెట్టిన తర్వాత అన్నింటికంటే మొదటగా పాఠకుడిని ఆకర్షించేది వివేకానందుడి కి భాష మీద ఉన్న పట్టు. పదాలతో ఆయన గారడీ చేస్తాడు. కళ్ళతో చదివి మెదడుతో విశ్లేషించేలోపు విషయం గుండెను తాకుతుంది. హిందూయిజం గూర్చి మాట్లాడుతూ – “No religion on earth preaches the dignity of Humanity in such a lofty strain as Hinduism, and no religion treads on the necks of the poor and low in such a fashion as Hinduism” (మానవజాతి ఉన్నతిని హిందూయిజం లాగా మహోన్నతంగా మరే ఇతర మతమూ బోధించలేదు, అలాగే పేద నిమ్న వర్గాల ప్రజల కుత్తుకల మీద హిందూయిజంలాగా నడిచెళ్ళిన మతమూ లేదు. — ఇది స్వేచ్ఛానువాదం.) తన సన్నిహితులకు రాసిన ఇంకొక ఉత్తరంలో తన గురించి ఏమంటాడో చూద్దాం: “I will tell you what is to my taste; I cannot write and I cannot speak, but I can think deeply, and when I am heated, can speak fire” -ఎంత నిజం! అసలు పరిచయమే లేని ఇంకొక కొత్త సమాజానికి(అమెరికా) కు వెళ్ళి, అక్కడి తన మొట్టమొదటి ప్రసంగంలో, మొదటి మాటను(“Brothers and sisters of America”) వినగానే అంత అపూర్వమైన స్పందన ఎందుకువచ్చి ఉంటుంది? ఇంతకు ముందు సోదర సోదరీమణులారా అన్న ప్రయోగాన్ని ఎవ్వరూ వాడలేదా? వాడారు. కానీ మాట్లాడే వ్యక్తి వ్యక్తిత్వం యొక్క గొప్పదనం, ఎదుట ఉన్న అశేష జన సమూహాన్ని నిజంగానే సోదర సోదరీమణులని అనుకున్న సంస్కారం ఆ మాటలకు అంతటి బలాన్ని, ఆకర్షణనూ ఇచ్చాయి.

నన్నాకర్షించిన మాటలన్నీ ఇక్కడ రాయాలంటే అదో చిన్నపాటీ పుస్తకం అవుతుంది. ఈ వ్యాసపు ఉద్దేశ్యం అది కాదు కాబట్టి నన్ను నేను అదుపు చేసుకుంటున్నా. ఒక్క విషయం మాత్రం చెప్పగలం. వివేకానందుణ్ణి చదవటం అంటే భారత దేశాన్ని గురించి చదవడం. ఋషుల్లో కి ఋషి, బుద్ధుడిలా అపారమైన జాలి కలిగిన వాడు, శంకరుని లా అద్భుతమైన మేధస్సు గలవాడు… ఈ రెండింటి కలయిక ఇంతకుముందెన్నడూ ఒకే వ్యక్తి రూపంలో సంభవించలేదేమో అనటం అతిశయోక్తి కాదు. ఓ ఆరు సంవత్సరాల క్రిందట మొదటి సారిగా ఈ పుస్తకాన్ని చదవడం మొదలుపెట్టినరోజు నా జీవితాన్ని ఈ పుస్తకం ఇంత సమూలంగా మార్చేస్తుందన్న ఊహలేదసలు. పేజీ తర్వాత పేజీ అజ్ఞానపు పొరలను ముక్కలు ముక్కలు చేస్తూ వివేకానందుడు!

“భారత దేశం Third world country . “కులవ్యవస్థ” దేశానికి పట్టిన చీడ. భారతీయులు అధికశాతం అనైతిక జీవులు. బ్రాహ్మణులు సమజాన్ని ఎప్పుడో పీడించారు. అవినీతి వెళ్ళూనుకుపోయింది. భారతీయుల పురాణాలు పెద్ద జోక్! జ్యోతిషశాస్త్రం, వాస్తు లాంటి “నిర్హేతుక” భావాలను అంటిపెట్టుకుని జీవిస్తారు భారతీయులు…..” పద్దెనిమిదేళ్ళ పాఠశాల చదువు తర్వాత నా ధోరణి అది. సంస్కృతి మనిషికి ఇచ్చే అనుభవాలు కూ, పాఠశాలల్లో బోధింపబడే “విజ్ఞానం” అనబడే దానికి అసలు పొంతనలేకుంటే అలాంటి వ్యవస్థలో నుంచి ఉద్భవించిన సగటు భారతీయ విద్యార్థినే నేను. ఆ నేపథ్యంలో చదివిన ఈ పుస్తకం నా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నేను చూసే విధానాన్ని మార్చేసింది. మూర్ఖత్వాన్ని ధిక్కరిస్తూ, పేదల బలహీనుల కోసం చివరి శ్వాస వరకూ తపిస్తూ, మిషనరీల దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ, వేదాంత సారాన్ని ఆచరణలో చూపిస్తూ… వివేకానందుడు చదువరుల మనసులపై చెరగని ముద్ర వేస్తాడు.

తన దేశాన్ని, సంస్కృతిని గూర్చి తెలుసుకోవాలనుకున్న అందరూ చదవాల్సిన పుస్తకం ఇది. తనను తాను ఏ మతానికీ పరిమితం చేసుకోని ఈ మహానుభావుడి మాటలను మతం పేరుతో ప్రజలకు అందకుండా చేసిన “సెక్యులర్” భారత ప్రభుత్వానికి నేనెoతో ఋణపడి ఉన్నాను. పాఠ్యపుస్తకాల్లో వివేకానందుడి రచనలు ఉండుంటే, భారత ప్రభుత్వం ఆయనకు చెయ్యల్సిన మర్యాద చేసి ఉంటే నేను మిగతావాటన్నిటి లాగే దీనిని కూడా విస్మరించేవాడినేమో! అనుకుంటాం గానీ గంజాయి వనంలో తులసి మొక్కను పట్టడం సులభం ఏం కాదు!

సంబధిత లంకె:  http://www.ramakrishnavivekananda.info/

ఈ పుస్తకాన్ని ఇక్కడ కొనవచ్చు.

Ramakrishna Math
Opposite Indira Park,
Domalguda, Hyderabad – 029.
Phone : 27633936 / 27633937

హైదరాబాదులో ఉన్నవారు ఎవరైనా ఈ పుస్తకం చదవాలని ఆసక్తి ఉన్నవాళ్ళు నన్ను సంప్రదిస్తే, నేను ఈ పుస్తకాన్ని పంచుకోగలను.

You Might Also Like

17 Comments

  1. Srinivas Nagulapalli

    సమీక్ష బాగుంది. ఒక్కటే వెలితి. అయిపోయింది.

    అందరూ అన్నివేళలా ఆనందాన్నే కోరుకుంటారు,దుఃఖాన్ని కాదు. చూసేది విషాదాంతమైన horror సినిమా అయినా సరే, అదీ ఆనందం కోసమే! కాని, ఆనందాన్ని కోరుకున్నంతగా వివేకాన్ని కోరుకుంటున్నామా అన్నదే ప్రశ్న. వివేకంలేని ఆనందం విషాదకరం, తొందరగానైనా తరువాతైనా. వివేకం ఉంటే ఆనందం అనివార్యం, తొందరగానైనా తరువాతైనా. నూరేండ్ల చిలుకు కిందట చెప్పిన మాటలైనా అవి నేటికీ వర్తిస్తాయి. ఎందుకంటే, మనిషి ఎంతో వైజ్ఞానికంగా ఆర్థికంగా సాంఘికంగా అభివృద్ధి చెందినా ఇప్పటికీ మనిషినీ, సంఘాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని సతమతం చేసే పరిస్థితుల యొక్క మూలాలు ఎక్కువశాతం వివేకరాహిత్యమే అనిపిస్తుంది- ఆలోచనల్లో ఆచరణల్లో.

    అద్వైతాన్ని అద్వితీయంగా అనుభవించి, ఆవిష్కరించి, జాతి నరనరాలలో తరతరాల వరకు తరగని వెలుగును స్ఫూర్తిని నింపే వివేకానందుని మాటలు, భావాలు నిత్య చైతన్య ప్రదాయకాలు, వెరసి వివేక ఆనంద దాయకాలు.
    ====
    విధేయుడు
    _శ్రీనివాస్

  2. పుస్తకం » Blog Archive » నన్ను చదివే పుస్తకం..

    […] ఒక రస్కిన్ బాండ్ లేదా టాగోర్, లేదా వివేకానంద. వీళ్ళెవ్వరూ కాకపోతే కొత్త మోజైన […]

  3. hima

    chla baga vundi. i feel it

  4. hima

    naku vivekananda swami gurinchi telusukovalani chala vundi atuvanti samayamlo mee column chadavadam chala bavundi neneu tappakunda a pustakam konadaniki prayatnistanu. chala thanks

  5. Yogi

    @Sairam Kulkarni

    I support your sentiments in the fullest possible measure, Yes there is no other Vivekananda 🙂

    I guess the lines you quoted should be understood that – “This article is just a humble beginning, there will be more people writing about Vivekananda in future too.” 🙂

  6. sairam kulkarni

    కుమార్- మీరన్నది నిజమే! కానీ మీకు ఒక హామీ – ఇది ఆరంభం మాత్రమే, ఇంకా భవిష్యత్తులో నేనూ ఇంకా చాలా మంది వివేకానందుని గూర్చి రాస్తూనే ఉంటారు

    I want to comment on above lines

    Vivekanda was(is , will) only one …..chala mandi vivekanandulu kaleru leru karu….

    i took the exact phrase ..

  7. YOGI » Letters of Swami Vivekananda

    […] Originally Published on pustakam.net […]

  8. Aruna

    “వివేకానందుడి గూర్చి చెప్పాలంటే ఎక్కడ ప్రారంభించాలో, ఎక్కడ ముగించాలో అర్థం కాదు.”
    True.

    రామకృష్ణ పరమహంస, సాయిబాబా వంటి వారి బోధనలను పరిశీలిస్తే, వారు జనబాహుళ్యాన్ని ఓర్పు గా చెయ్యి పట్టుకు నడిపించుకుంటూ వెలుగు వైపుకు తీసుకెళ్ళారు అనిపిస్తుంది. అదే స్వామీ వివేకానంద పుస్తకాలు చదివితే, ఈయన గాఢాంధకారం లో మునిగిపోయిన వారి చుట్టూ వున్న చీకటిని Awake! Arise! Stop not till the goal is reached! అన్న ఒక్క మాట తో చెదరగొట్టి వాళ్ళ ముందు వెలుగు ను సాక్షాత్కరింపచేశారు అనిపిస్తుంది. ఇప్పటి మన వుత్తుత్తి స్వాతంత్రం నుంచి నిజమైన స్వాతంత్రం వైపుకు వెళ్ళడానికి ప్రతి ఒక్కరు వివేకానందుని గూర్చి తెల్సుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది.

  9. FengBlao

    మంచి సమీక్ష. సాధారణం గా సమీక్షలు రాసే చట్రంలో తనని తాను బంధించకుండా ఇలా రాసేవారి అవసరం ఉంది. ఇంకా వివేకానంద గురించి ఆలోచించే జనం ఉండటం ముదావహం

    “the history of world is nothing but the history of a few men who had faith in themselves” – vivekananda

  10. రఘు బుర్రి

    యోగి గారు మీ సమీక్ష చాలా బాగుంది, పరిచయం చేసినందుకు నెనర్లు.

  11. యోగి

    స్నేహ, చైతన్య – కృతజ్ఞతలు
    సౌమ్య – కృతజ్ఞతలండీ, మీరు చెప్పిన పుస్తకం కూడా చదువుతాను
    పూర్ణిమ – థాంక్స్ నేను చెప్పలి.. మీకు, “పుస్తకం” వెనకున్న వారికందరికీ – ఇలాంటి అవకశం కల్పించినందుకు 🙂
    కుమార్- మీరన్నది నిజమే! కానీ మీకు ఒక హామీ – ఇది ఆరంభం మాత్రమే, ఇంకా భవిష్యత్తులో నేనూ ఇంకా చాలా మంది వివేకానందుని గూర్చి రాస్తూనే ఉంటారు 🙂

  12. కుమర్

    ఈ ఇన్ఫర్మేషన్ సరి పోలేదని నా అభిప్రాయం.
    మరింత సమాచారం ఇస్తే బాగుంటుంది
    వివేకానందుడి గురించి ఒక సేపెరేట్ వర్గం పెడితే ఇంకా బాగుంటుంది
    దయ చేసి ఆలోచించండి
    లేదా ఇదే పుస్తకం మీద మరొక వ్యాసం రాయండి
    కుమార్

  13. చైతన్య క్రిష్ణ పాటూరు

    స్నేహగారన్నట్లు వెంటనే కొని చదవాలనిపించేటట్లుంది మీ సమీక్ష.

  14. పూర్ణిమ

    >> వివేకానందుణ్ణి చదవటం అంటే భారత దేశాన్ని గురించి చదవడం.

    ఇది నాకు అనుభవమే! మీరీ వ్యాసాన్ని ఎలా రాసుంటారబ్బా అన్న కుతూహలం కొద్దీ చదివాను, పుస్తకం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కన్నా! కొన్ని పుస్తకాలు మనలో భాగమైపోతాయి, an integral part of us. అలాంటి వాటి గురించి ఒక పుస్తక రూపేనా ఆసక్తి కలిగేలా రాయడం, చాలా కష్టం! మీరు అది చాలా బాగా చేశారు.

    అభినందనలు! మీ నుండి మరిన్ని వ్యాసాలకై ఎదురుచూస్తాను.

    పూర్ణిమ

  15. సౌమ్య

    @yogi: అన్నట్లు… ఇలా ఉత్తరాల సంకలనాల ద్వారా ఆత్మకథ అన్న భావన కలిగించడం ఇటీవలే టాగోర్ ఉత్తరాలు-వ్యాసాలు కూర్చి తయారు చేసిన ఆయన “ఆత్మకథ” my life in my words ద్వారా బాగా అర్థమైంది. మీరు ఇదివరలో చదవలేదంటే ఆ పుస్తకం కూడా చదవండి.

  16. సౌమ్య

    బాగుందండీ వ్యాసం. స్నేహ గారు అన్నట్లు, వెంటనే ఈ పుస్తకం చదివాలి అనిపించేలా ఉంది. వివేకానందుడు పరిచయం అక్ఖర్లేని వ్యక్తే కానీ, ఎంతమంది నిజంగా ఆయన రచనలను చదివి ఉన్నారు అన్న విషయంలో నాకు సందేహాలున్నాయి. కనుక ఆయన రచనల గురించి మరిన్ని పరిచయ వ్యాసాలు అవసరమనే అనుకుంటున్నాను.

  17. స్నేహ

    @yogi, మీ సమీక్ష చాలా బాగుంది. పుస్తకం వెంటనే కొని చదవాలనిపించేంత బాగుంది.

Leave a Reply