my life in my words – Rabindranath Tagore

If you focus too much on the tree, you’ll lose the view of the forest.

మొన్నీ మధ్య పూర్తి చేసిన ఒక క్రికెట్ పుస్తకంలోనిది పై వాక్యం. టాగోర్ అంటే తొలి పరిచయం బోలెడంత గెడ్డం ఉన్న తాతయ్య. ఇంకొన్ని వివరాలు తెల్సింది ప్రాధమిక తరగతుల్లో “నోబెల్ బహుమతి గెల్చుకున్న తొలి భారతీయుడు – రబీంద్రనాథ్ టాగోర్” అంటూ. నోరు తిరగటం మొదలెట్టిన దగ్గర నుండీ “జనగణమణ” అంటూ ఆలపించిన ప్రతీ సారీ అది టాగోర్ రచన అన్న సంగతి కొత్తగా గుర్తురావటం. పై తరగతులకి వచ్చే సరికి “ఎక్కడ మనస్సు నిర్భయంగావుంటుందో, ఎక్కడమానవుడు సగర్వంగా తల ఎత్తుకుని తిరుగుతాడో.. “ అంటూ వల్లెవేసిన వైనం. “కాబూలీ వాలా” అన్న పాఠ్యాంశంలోనో మరెక్కడో “టాగోర్” అన్న పేరు వినపడగానే బా పరిచయమున్న వ్యక్తిలా తోచడం. “టాగోర్ శాంతినికేతన్ అనే స్కూల్ పెట్టారంట, అక్కడ ఎంత గొప్ప విద్యార్థులైనా చెట్టు కిందే కూర్చుని చదువుకుంటారట” అని హాశ్చర్యంగా చెప్పుకోడం ఎప్పుడో తెలియకుండానే టాగోర్ అంటే భక్తి భావన కలిగిపోయింది. కొన్నాళ్ళకి సాహిత్యంపై మక్కువ పెరిగి, సమయం, తీరికా కలిసొచ్చాక చదివిన ఆయన రచనలు, నవలలైనా, చిట్టి కథలైనా, కవిత్వమైనా టాగోర్‍తో సాన్నిహిత్యాన్ని పెంచుతూనే వచ్చాయి.

“టాగోర్ గురించి నన్ను మాట్లాడమనాలే కానీ, ఆపకుండా మాట్లాడనూ” అనేంత చనువు పెరిగిన తరుణంలో నాకు తారసపడ్డ పుస్తకం “my life in my words”. పుస్తకాన్ని నా సొంతం చేసుకునే ముందే అన్ని ఆరాలూ తీశాను: ఇది టాగోర్ తన జీవితకాలంలో రాసిన ఉత్తరాలూ, ఉపన్యాసాలూ, కవితల సంకలనం అనీ, ఆయన రాసుకోని ఆత్మకథనీ, ఆయన అభిమానులు తప్పని సరిగా చదవాలనీ, వెల ఐదొందలకి ఐదు రూపాయలే తక్కువనీ అన్నీ తెల్సుకునే కొన్నాను.

కానీ అప్పటి దాకా నేను చూస్తున్నది ఓ ఒక్క చెట్టునో లేక కొమ్మనో మాత్రమే అనీ, టాగోర్‍ని టాగోర్ మాటల్లో చదవటం అంటే ఓ అడవిని చుట్టి రావటమంత ప్రయాస, అనుభవం మిగులుతాయని పుస్తకంలోని పేజీలు తిరగేసే కొద్దీ అర్థమవుతూ వచ్చింది. అప్పటి వరకూ తన రచనల్లో దాక్కునున్న టాగోర్ ఇప్పుడు తనకు తానుగా చెప్తున్న మాటల్లో పడ్డం అంటే ఏ మహా సముద్రాన్నో ఈదటం కన్నా తక్కువ కాలేదు.

ఈ పుస్తకాన్ని “My Life”, “My Thoughts” అని రెండు భాగాలుగా విభజించారు. “My Life”లో టాగోర్ జీవితంలో జరిగిన సంఘటనల క్రమంలో ఆయన ఉత్తరాలూ, వ్యాసాలు, స్పీచులను తేదీల వారీగా పొందుపరిచారు. టాగోర్ కుటుంబ నేపధ్యంతో మొదలయ్యే ఈ అంకంలో టాగోర్ జీవితకాలం జరిగిన అనేక విశేషాలు వాటిపై టాగోర్ ఆలోచనలూ ఉంటాయి. అప్పటి కలకత్తా నగరం, తన కుటుంబ సభ్యులతో అనుబంధం, చదువు, వాళ్ళ అమ్మగారితో దగ్గరితనం, ఎప్పుడూ దూరాభారాల మధ్య నుండే నాన్న – ఈ కబుర్లన్నీ కులాసాగా సాగుతాయి. సున్నితంగా సాగే  వీటి మధ్య టాగోర్ జీవితాన్ని ఎక్కువ సార్లు విచ్చేసిన అతిధి “మృత్యువు” గురించి ప్రస్తావించినప్పుడల్లా ఏదో లోయ అంచున నుంచుని దాని లోతు తెల్సుకోవాలనే ప్రయత్నంలో కలిగే భయాన్ని పుట్టించింది. మృత్యువుకీ నిద్రకీ తేడా లేనంత దగ్గరగా ఉన్న చావు నుండీ చావుని జీవితఖైదు నుండి విముక్తి చేయగలిగేది గా వర్ణించే తీరు వరకూ, టాగోర్ జీవితం ఎన్నో ఒడిదుడుకులతో పాటు, ఎందరో ఆత్మీయులకు దూరం అయ్యింది. నిరాశా నిస్పృహల మధ్య కలిగిన ఆశాకిరణం ఈ ఆలోచన:

“That life was not a stable permanent fixture was itself the sorrowful tidings which helped to lighten my mind. That we are not prisoners forever within a solid stone wall of life was the thought which unconsciously kept coming uppermost in rushes of gladness.”

అయన జీవితంలో పెనవేసుకుపోయిన అనుబంధాల గురించి చదువుతున్నప్పుడల్లా, ఆయన మీద ప్రస్ఫుటమైన వారి ప్రభావం తెల్సొస్తుంది. మరో ఇంటి నుండి తమ ఇంటిలోకి కొత్తగా పెళ్ళికూతురై వచ్చిన వదిన తమ ఇంటిని సొంతం చేసుకుని వారిలో ఒకరిగా కలిసిపోయిన తీరు పై ఆశ్చర్యం. “నీకు ఖర్చు పెట్టడ్డం తప్ప ఏమీ తెలీదు” అని భార్యని ఉడికించడంలోనూ, “పొరపాటునైనా ఉత్తరం రాస్తావేమో” అని ఆమెని దెప్పిపొడవడంలోనూ జలపాతల నీటి తుంపర మీద పడుతుంటే కలిగే హాయినిస్తాయి. పిల్లల పెంపకంలోనూ, వారి వ్యక్తిత్వ వికాసాలకి, ఒక తండ్రిగా, ఒక తాతగారిగా ఆయన ఆలోచనలు ఆదర్శనీయాలు. శాంతినికేతన్, శ్రీనికేతన్ వ్యవస్థాపనకి ఆయన త్యాగాలూ,  వాటిని నడిపిన తీరు తెన్నులూ తెలుస్తాయి.

తనను తాను వర్ణించుకోడానికి “కవి” అనే పదాన్నే ఎంచుకునే టాగోర్, కవిత్వం గురించిన అభిప్రాయాలు, “బాబోయ్.. కవిత్వమా” అని బెదిరిపోయేవారిని ఉద్దేశించిన మాటలూ ఇదో:

“But does one write poetry to explain something? Something felt within the heart tries to find outside shape as a poem. So, when after listening to a poem, anyone says he has not understood, I am  nonplussed. If someone smells a flower and says he doesn’t understand, the reply to him is: there is nothing to understand, it is only a scent. If he persists, saying: ‘that I know but what does it all mean?” Then one either has to change the subject, or make it more abstruse by telling him that the scent  is the shape which the universal joy takes in the flower… Like a tear or a smile a poem is but a picture of what is taking place within.”

రచనల గురించి ఆయన మాటల్లో ఎక్కువ చెప్పకపోయినా ఆ రచనల వెనుక ఆలోచనల్ని అర్థం చేసుకోవడానికి మాత్రం ఈ పుస్తకం ఉపయోగడుతుందని నాకు అనిపిస్తుంది. స్వదేశీ మూవ్‍మెంట్ గురించి ఆయన ఉత్తరాల్లో రాసిన చాలా విషయాలకూ, “ఘరే భైరే” అనే నవలలో చిత్రీకరించిన పరిస్థితులూ, వ్యక్తిత్వాలకూ చాలా దగ్గర సంబంధం ఉందనిపించింది.  గాంధీజీతో కొన్ని విషయాలపై విభేదాలను చదువుతుంటే, ఓ మనిషిని మనస్పూర్తిగా గౌరవిస్తూనే, ఆ గౌరవానికి ఎటువంటి భంగం కలిగిచకుండా విభేదించటం, నేటి కాలంలో అలాంటి సమన్వయం పాటిస్తే ఎంత బాగుణ్ణు అనిపిస్తుందో! “My thoughts” లో తన గురించి, మతం, ప్రకృతి, భారతదేశం వగైరాల గురించి ఆయన ఆలోచనలుంటాయి. కొన్ని సందర్భాల్లో ఆయన్ని దేశ వ్యతిరేకిగా కొందరు భావించినప్పుడు ఆయన మాటలు:

“I love my India. But my India is an Idea and not a geographical expression.”

నేను చదివిన మరో పుస్తకం లైఫ్ ఆఫ్ పై లో ఒకచోట ఇలా చెప్పుకొస్తాడు రచయిత: “అడవి లోలోపల భాగాల్లోనైనా ఏ జీపులోనో సంచరిస్తే అది అడవిలో తిరిగినట్టు కాదు. నట్టడవిలోనైనా కాలి నడక ప్రయాణం చేస్తేనే అడవిలో నిజంగా ప్రయాణించినట్టు. అలానే పసిఫిక్ సముద్రం మీద కూడా ఓ పేద్ద పడవలో వెళ్తే చాలా వరకూ కోల్పోతాం. పసిఫిక్ అసలైన జీవ జంతు సంపదను చూడాలనుకుంటూ ఇలా తెప్ప మీద మెల్లిగా వెళ్తేనే సాధ్యం” అనీ. టాగోర్ మాటల్లో టాగోర్ గురించి చదువుతుంటే కూడా నాకా భావనే కలుగుతూ ఉంది.  ఈ ఆత్మకథ ప్రత్యేకతలేమిటంటే, టాగోర్ ఓ చోట కూర్చుని తన గతాన్నంతా సింహావలోకనం చేసుకుని, జ్ఞాపకాల దొంతరని మన ముందు పెట్టినది కాదు. ఉత్తరాల్లో తన ఆత్మీయులతో, స్నేహాలతో ముచ్చటించిన బోలెడన్ని కబుర్లు. అంటే ఆ క్షణంలో ఆయన మనఃస్థితిని పదిలపరచుకున్న అక్షరాలన్నీ ఇప్పుడు మన ముందు దర్శనమిస్తాయి. ఇక ఉత్తరాల్లో ఉండే సహజమైన గమ్మత్తు, మత్తూ ఉండనే ఉంటాయి. ఈ పుస్తకంలో అండర్‍లైన్ చేసుకుని దాచుకోవాల్సిన లైన్లకైతే లెక్కుండదు. అవన్నీ ఓ పుస్తకంలో ఎక్కించే ప్రయత్నం పెట్టుకుంటే అంతే సంగతులు.

ఈ పుస్తకం మీద కొంత అసంతృప్తి కూడా కలగవచ్చు. టాగోర్ జీవితాన్ని పూర్తిగా ఈ రచనలో దొరకపుచ్చుకోవడం అంటే కష్టం. విక్టోరియా ఒకాంపోతో ఆయన అనుబంధం గురించి నేననుకున్నంతగా ఈ పుస్తకం ద్వారా తెలీలేదు. ఆవిడకి రాసిన కొన్ని ఉత్తరాలున్నా వారి బంధాన్ని పూర్తి స్థాయిలో ఆవిష్కరించలేకపోయాననిపించింది. అయినా ఇది తప్పక చదవాల్సిన పుస్తకాల్లో ఒకటి అని నేనంటాను.

రవీంద్రనాథ్ టాగోర్ మైనస్ నోబెల్ ప్రైజ్ మైనస్ నైట్‍హుడ్ మైనస్ గీతాంజాలి మైనస్ శాంతినికేతన్ మైనస్ జనగణమణ మైనస్ అనేక కళల్లో నైపుణ్యం మైనస్ వగైరాలు చేస్తే మిగిలే రవీంద్రనాథ్ టాగోర్ గురించి తెలుసుకోవాలంటే మాత్రం ఈ పుస్తకాన్ని తప్పక చదవాలి.  టాగోర్ విశ్వకవిగా కన్నా ఓ మహాత్మునిగానే నాకిక పై గుర్తుంటారు. ఆయన్ని అనుకరించాలనే ప్రయత్నాలేవీ లేవు కానీ, కొన్ని జీవిత సూక్ష్మాలను మాత్రం అలవర్చుకునే ప్రయత్నాలు తప్పవు.

I was telling you my tale
I was telling you so many stories of my life
You put them to flames
You drowned them in your tears
That is how you rebuilt me
As and image after Your heart.
– Tagore

********************************************************************************************

పుస్తక వివరాలు:
my life in my words – Rabindranath Tagore
selected and edited by: Uma Das Gupta
Publication: Penguin (http://www.penguinbooksindia.com/Bookdetail.aspx?bookId=2389)
Cost: Rs 495 / –

You Might Also Like

4 Comments

  1. kvrn

    పూర్నిమ గారు, విశ్వకవి టాగోరు ఆత్మకథ ను మీరు పరిచయం చేసిన వ్యాసం అద్భుతముగా వుంది

  2. నిశాంత్

    ఆయన్ని అనుకరించాలనే ప్రయత్నాలేవీ లేవు కానీ, కొన్ని జీవిత సూక్ష్మాలను మాత్రం అలవర్చుకునే ప్రయత్నాలు తప్పవు.
    🙂

    (పూర్ణిమ గారు, మీ బ్లాగుని చదవలేకపోతున్నందుకు ఎదో వెల్తిగా ఉంది,pudi.nishanth@gmail.com
    ఇది నా మెయిల్ ఐడి. మీకు అభ్యంతరం లేకపొతె నన్ను కూడా ఇన్వైట్ చేస్తారా బ్లాగ్ చదవడానికి..!!?)

  3. మాలతి

    ఏ జీపులోనో సంచరిస్తే అది అడవిలో తిరిగినట్టు కాదు. నట్టడవిలోనైనా కాలి నడక ప్రయాణం చేస్తేనే అడవిలో నిజంగా ప్రయాణించినట్టు – నాక్కూడా అదే అనిపిస్తుంది. పూర్ణిమగారూ, జీవితచరిత్రలు నేను సాధారణంగా చదవను కానీ, ఈపుస్తకం చదవాలనిపిస్తోంది. నాక్కావలసిందేదో ఇక్కడ దొరికేట్టుంది అనిపిస్తోంది. ధన్యవాదాలు.

  4. రవి

    సరిగ్గా ఇలాంటి పుస్తకం కోసమే వెతుకుతున్నాను. ఈ సారి పుస్తకాల షాపుకు పోయినప్పుడు గుర్తుంచుకుని తీసుకోవాలి.

Leave a Reply