The Best of Tagore

వ్యాసం రాసి పంపిన వారు: క్రాంతి గాయం

ఎలాగు పుస్తకం.నెట్ వారు ఈనెల ఫోకస్ విశ్వకవి టాగోర్ అని ప్రకటించారు కాబట్టి, ఈ పుస్తకాన్ని పరిచయం చెయ్యడానికి ఇంతకన్నా మంచి సమయం ఉండదనిపించింది.”The Best of Tagore” అనే ఈ పుస్తకం పన్నెండు కథల సమాహారం.జర్నా బసు గారిచే బెంగాలీ నుండి ఆంగ్లంలోకి తర్జుమా చేయబడింది.
టాగోర్ కథలు అనగానే ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది “కాబూలీవాలా” నే కదా! ఈ పుస్తకం కూడా కాబూలీవాలా కథతోనే ప్రారంభమవుతుంది.కలకత్తా వీధుల్లో బాదం,ఇతర సుగంధ ద్రవ్యాలు అమ్ముకునే కాబూలీవాలా,అయిదేళ్ళ పాప మినీకి మధ్య పరిచయం,వారి స్నేహం మినీ తండ్రిని ఆశ్చర్యపరుస్తుంది.మినీ తల్లికి మాత్రం ఈ స్నేహం ససేమిరా ఇష్టముండదు.పైగా ఆ కాబూలీవాలా ఎక్కడ తన కూతురిని ఎత్తుకుపోతాడో అని భయపడుతుంది.కొన్నాళ్ళకి కాబూలీవాలా హత్యానేరంపై అరెస్టు చేయబడి జైలుకి వెళ్తాడు.కాలగమనంలో మినీతోపాటు అందరు కాబూలీవాలా ని మర్చిపోతారు.పెళ్ళీడుకొచ్చిన మినీ అత్తవారింటికి వెళ్ళేరోజు అనుకోకుండా కాబూలీవాలా మినీ ఇంటికి వస్తాడు.ఎక్కడో దూరాన ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న తన చిన్నారిని మినీలో చూసుకుంటున్నాడన్న విషయం మినీ తండ్రిని కదిలించివేస్తుంది.
“The Parrot’s Training” అనే కథలో రాజమందిరంలో ఉన్న చిలకకి మనుషులకి వలె తెలివితేటలు,మంచిమర్యాదలు నేర్పించాలనుకొంటాడు రాజు.ఇందుకోసం ప్రత్యేకంగా ఒక శిక్షణాలయన్ని కట్టించి గురువులని నియమిస్తాడు.తనది కాని ఆ అయోమయ ప్రపంచంలో చిలక చిక్కి శల్యమై మరణిస్తుంది.
“Wish Fulfilment” కథ చాలా సరదాగా,గమ్మత్తుగా ఉంటుంది.త్వరత్వరగా పెద్దవాళ్ళయిపోవాలనుకునే ఒక పిల్లవాడికి,తిరిగి బాల్యం రోజుల్లోకి వెళ్ళిపోవాలనుకునే ఒక తండ్రికి ఒకరోజు రాత్రి దేవత వారి కల నెరవేరేటట్లు వరమిస్తుంది.ఆతరవాత పెద్దవాడయిన పిల్లాడు,బాలుడిగా మారిన ఆ తండ్రి పడే ఇక్కట్లు నవ్వు తెప్పిస్తాయి.
“A ‘Good’ Man” కథలో మంచితనానికి,మొహమాటానికి తేడాని వివరించే తీరు చాలా బాగుంటుంది.
అలాగే మిగతా కథలునూ! ప్రతికథలోను అంతర్గతంగా ఒక నీతి ఉంది.పిల్లలకి టాగోర్ రచనలు పరిచయం చేయాలనుకుంటే,ఈ పుస్తకంతో మొదలుపెడితే బాగుంటుంది.ఎనభై పేజీలున్న ఈ పుస్తకం మళ్ళీ మళ్ళీ చదివిస్తుంది.ఖరీదు కూడా తక్కువే! 75 రూపాయలు మాత్రమే!

******************************
పుస్తకం వివరాలు:
Best Of Tagore: 12 Short Stories
Translated by: Jharna Basu
Publisher: Scholastic India Private Limited
ఏ ఆన్లైన్ సైటులో చూసినా అవుటాఫ్ స్టాక్ అని కనిపిస్తోంది. Flipkart పేజీ ఇక్కడ.

You Might Also Like

2 Comments

  1. త్రివిక్రమ్

    మీరు “Wish Fulfilment” గురించి రాసింది చదువుతుంటే చందమామలో చదివిన “తండ్రి కొడుకులు” అనే సీరియల్ గుర్తొస్తోంది. telugu.chandamama.com లో ఆర్కైవ్స్ లో (అక్టోబర్ 1947 నుంచి ఫిబ్రవరి 1948 వరకు) ఈ కథను చదవొచ్చు. టాగోర్ కథ “తండ్రి కొడుకులు” కథకు మూలమో ప్రేరణో అయి ఉంటుంది.

  2. కె.మహేష్ కుమార్

    కాబూలీవాలా సినిమాగా కూడా వచ్చింది. బల్రాజ్ సహానీ అపురూపనటన మరువలేనిది.

Leave a Reply