పడమటి దేశంలో ముస్లిం పిల్లవాడి కథ – Imran Ahmad’s The Perfect Gentleman

అమెరికాలో పుట్టి పెరుగుతున్న మన రెండో తరాన్ని ABCDలు (American Born Confused Desis) అని ఎగతాళిగా వర్ణించడం వాడుకలో ఉంది. కొబ్బరికాయలతో, ఓరియో కుకీలతో (brown on the outside, white inside) పోల్చడమూ ఉంది. ఇది అమెరికాలో భారత సంతతికి మాత్రమే పరిమితమైన విషయం కాదు. వలసపోయిన జాతులు, ముఖ్యంగా వేరే సంస్కృతి, జాతి ఉన్న చోట్లకు వెళ్ళినవారందరి అనుభవాలలోనూ ఉన్నదే. భారత ఉపఖండంనుంచి బ్రిటన్‌కు వలస వెళ్ళినవారి అనుభవాలూ ఇలాంటివే. బ్రిటన్‌లో వలస వచ్చిన వారిపై విపరీతమైన వ్యతిరేకత, వర్ణ వివక్ష అనేక రూపాల్లో కనిపించటమూ కద్దు.  ఆ నేపథ్యంలో పెరిగిన ఒక పాకిస్తానీ ముస్లిం తన అనుభవాల గురించి చాలా వినోదాత్మకంగా, ఆలోచనాప్రేరకంగా వ్రాసిన ఆత్మకథ The Perfect Gentleman.

పాకిస్తాన్‌నుంచి ఇంగ్లండుకు చాలామంది వలస వెళ్ళారు. అలాంటి కుటుంభాలలో ఈ పుస్తక రచయిత ఇమ్రాన్ అహ్మద్ కుటుంబం ఒకటి. ఇమ్రాన్ తల్లితండ్రులు పాకిస్తాన్‌లో ఒక మాదిరి సంపన్న నేపథ్యంనుంచి వచ్చినవారే. ఇమ్రాన్‌కు ఒక సంవత్సరం వయసులో (1964లో) వారు ఇంగ్లండుకు వలస వెళ్ళారు. రచయిత వర్గీకరణం ప్రకారం బ్రిటన్‌లో ఏడు సామాజిక వర్గాలు ఉన్నాయి. రాచకుటుంబాలు మొదటివర్గంలో ఉంటే, అట్టడుగు వర్గంలో ఉండేది coloureds – శ్వేతవర్ణేతరులు, ప్రధానంగా ఆసియా, ఆఫ్రికా దేశాలనుంచి వలస వచ్చినవారు. వలస వచ్చిన కొత్తలో వీరికి అద్దెకు నివాసగృహాలు దొరకటం కష్టమే. ఒక పడగ్గదీ, ఒక ముందుగదీ మాత్రమే ఉండే bed-sitలు దొరకటం కూడా కష్టమే. ఇటువంటి ఇబ్బందులు చాలా అనుభవించిన ఇమ్రాన్ తల్లితండ్రులు నెమ్మదిగా ఒక చిన్న ఇల్లు కొనుక్కొని, దాంట్లోంచి కొన్ని గదుల్ని కొత్తగా వచ్చినవారికి తామే అద్దెకు ఇచ్చే స్థాయికి చేరుకొన్నారు.

స్కూల్లో చేరిన ఇమ్రాన్‌కు తనకూ, మిగతా పిల్లవాళ్ళకీ తేడాలు ఉన్నాయని నెమ్మదిగా తెలిసివస్తుంది. ఎందుకో సరిగ్గా తెలియకపోయినా, స్కూల్లో మిగతావారిలా తాను పందిమాంసంతో చేసిన spam తినకూడదు. తాము ముస్లింలు. జీసస్ తమ దేవుడు కాదు. తండ్రి అప్పుడప్పుడూ మసీదుకు తీసుకు వెళ్ళినప్పుడు, అక్కడ మిగతా పిల్లలతో కలసి ఖొరాన్, అరబిక్‌భాష నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తాడు. ఇస్లాం మీద నమ్మకం ఉంచి అల్లాను ప్రార్థిస్తే చనిపోయాక స్వర్గానికి వెళతారని తెలుసుకున్నప్పుడు అతనికి ఒక సందేహం వస్తుంది. ప్రపంచంలో మతాలు చాలా ఉన్నాయి కదా, వాటిలో నా మతమే సరి అయిందని గ్యారంటీ ఏమిటి? ఒకవేళ ఈ విషయంలో తమ నమ్మకం తప్పైతే తను నరకానికి వెళ్ళక తప్పదా? జంతువులకి మతం ఉండదు కదా, అవన్నీ కూడా చనిపోయాక నరకానికి వెళ్తాయా? పాపం వాటికి ఇస్లాం అంటే తెలియదు కదా, అవి నరకానికి వెళ్ళటం అన్యాయం కాదా? ఇలాంటి ప్రశ్నలకు మిగతావారి దగ్గరనుంచి సమాధానాలు లేకపోతే తానే సమాధానాలు ఊహించుకొంటూ ఉంటాడు (పిల్లలు ఎలా పుడతారు అనే ప్రశ్నకు ఈ పిల్లవాడు మొదట చెప్పుకున్న సమాధానం చాలా నవ్విస్తుంది). ఇస్లామ్‌లోనే సూఫీల నమ్మకాలు, పద్ధతులు వేరే విధంగా ఉంటాయని, ముస్లిములలోనూ మత నియమాలు సరిగా పాటించనివారు, మోసగాళ్ళు ఉంటారని తెలుసుకోవడం ఆ పిల్లవాడికి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

ఇమ్రాన్‌కు పుస్తకపఠనంపై ఆసక్తి పెరుగుతుంది. దాని ఫలితంగా, అతను   తెలివైన విద్యార్థిగా క్లాసులో గుర్తింపు పొందుతాడు. ఒక ప్రవేశ పరీక్షలో నెగ్గి Hampton Grammar School అనే ప్రతిష్టాత్మకమైన హైస్కూలుకు ఎంపిక అవుతాడు. స్కూలు రోజుల్లోనే ఇమ్రాన్ తన రంగు, జాతి, మతము వేరైనా  తాను అచ్చమైన బ్రిటిష్ జంటిల్మన్‌లా ఉండాలని నిర్ణయించుకొంటాడు. తన వేషధారణలోనూ, మేనర్స్‌లోనూ, వ్యవహారధోరణిలోనూ చాలా శ్రద్ధ చూపించటం మొదలుపెడతాడు.

తల్లితండ్రుల అభీష్టాన్ని అనుసరించి ఇమ్రాన్ డాక్టర్ అవుదామని నిర్ణయించుకుంటాడు. హైస్కూలు ఆఖరు సంవత్సరంలో మెడికల్ కాలేజ్ ఇంటర్వ్యూలో ఎన్నిక ఔతాడు; ఆఖరి పరీక్షలలో మంచి మార్కులు వస్తే చాలు, మెడికల్ కాలేజ్‌లో చేరిపోవచ్చు. కానీ, ఆ సంవత్సరంలో పుస్తకాలు, సినిమాలు గోలలో పడి తన చదువుని నిర్లక్ష్యం చేస్తాడు. భగవంతుణ్ణి రోజూ శ్రద్ధగా ప్రార్థిస్తున్నాడు కాబట్టి పరీక్షల్లో తనకు అవసరమైన మార్కులు వచ్చే సంగతి భగవంతుడే చూసుకొంటాడన్న భరోసా కూడా కొంత ఉంది. ఐనా, పరీక్షల్లో అవసరమైన మార్కులు రాకపోవటంతో మెడికల్ కాలేజ్ ప్రవేశానికి అర్హత కోల్పోతాడు.

ఇమ్రాన్ 18 ఏళ్ళ వయసులో స్కాట్లాండ్‌లో స్టిర్లింగ్ యూనివర్సిటీలో కెమిస్ట్రీలో డిగ్రీ కోర్సు చదవటానికి చేరుతాడు. అక్కడ కెమిస్ట్రీ లాబ్‌లో జానిస్ అన్న అమ్మాయి పరిచయమౌతుంది. ఇమ్రాన్ జానిస్‌ను ప్రేమించటం మొదలుబెడతాడు. వర్ణభేదం, మతభేదం ఉన్నాయనీ, తన తల్లితండ్రులు ఇలాంటి వివాహానికి ఒప్పుకోరనీ అతనికి తెలుసు. ఐనా జానిస్‌ను పెళ్ళి చేసుకోవాలనే అతని ఉద్దేశం. ఐతే, జానిస్ ఇమ్రాన్‌ని ఒక స్నేహితుడిలా చూస్తుందేకాని, ప్రియుడిగా కాదు. ఆ విషయం ఇమ్రాన్‌కు స్పష్టంగా చెబుతుంది. ఆమెకు ఒక బాయ్‌ఫ్రెండ్ కూడా ఉంటాడు. ఐనా ఇమ్రాన్ ఆశ వదులుకోకుండా ఆమెను ప్రేమిస్తూనే ఉంటాడు, ఆమెకు అవసరమైన పనులు చేసిపెడుతూ ఆమె ప్రేమను ఎలాగైనా పొందాలని ప్రయత్నిస్తుంటాడు. యూనివర్సిటీలో చేరిన మొదట్లో ఇమ్రాన్‌కు అన్ని క్లాసుల్లో పెద్దగా కష్టపడకుండానే మంచి మార్కులు వస్తాయి. దానితో అతనికి చదువుపట్ల నిర్లక్ష్యం పెరుగుతుంది, ఇతర వ్యాపకాలు ఎక్కువ అవుతాయి. మూడవ సంవత్సరం పరీక్షల్లో  సాధారణ మార్కులు రావటంతో అతనికి కెమిస్ట్రీ ఆనర్స్ చదివే అవకాశం ఉండదు. స్టిర్లింగ్‌నుంచి వెళ్ళిపోవలసి వస్తుంది. సేల్స్‌మన్ ఉద్యోగంలో చేరుతాడు; ఆ ఉద్యోగం నచ్చలేదు. అప్పటికి చదువు విలువ, చదువులో క్రమశిక్షణ విలువ తెలిసిన ఇమ్రాన్, ఒక ప్రొఫెసర్ సలహాపై వేరే కాలేజ్‌లో చేరి   యూనివర్సిటీ ఫస్టు వచ్చి రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ బహుమతి కూడా పొందుతాడు.

మళ్ళీ స్టిర్లింగ్ యూనివర్సిటీకి వచ్చి కెమిస్ట్రీలో పి.హెచ్.డి మొదలు పెడతాడు. మతపరమైన విషయాలపట్ల, కంప్యూటర్ల పట్ల ఆసక్తి పెరుగుతంది. కెమిస్ట్రీ బోర్ కొడుతుంది. యూనిలివర్ కంపెనీ వారి ప్రకటన చూసి మేనేజ్‌మెంట్ ట్రైనీ ప్రొగ్రాముకు ప్రయత్నించి, ఎన్నిక ఔతాడు. కార్పొరేట్ ప్రపంచంలో జీవనం మొదలుపెడతాడు. జానిస్ ఉద్యోగం కోసం ఆస్ట్రేలియా వెళ్తుంది. అక్కడే ఎవర్నో ప్రేమించి పెళ్ళి చేసుకుంటున్నట్లు ఉత్తరం వ్రాస్తుంది. ఇనాళ్ళూ తల్లితండ్రులు కుదిర్చే పెళ్ళిళ్ళకు వ్యతిరేకంగా ఉన్న ఇమ్రాన్ తన మనసు మార్చుకుంటాడు. మధ్యవర్తుల సహాయంతో వచ్చిన సంబంధాలు చూసి, సబ్రినా అనే పాకిస్తానీ అమ్మాయిని వివాహమాడుతాడు. కొన్నాళ్ళకి వారు విడాకులు తీసుకుంటారు.  ఇమ్రాన్ యూనిలివర్ వదిలేసి జి.యి.కంపెనీలో పనిచేస్తూ ఐదేళ్ళు అమెరికాలో ఉండి మళ్ళీ ఇంగ్లాండు తిరిగివెళ్తాడు. ఒంటరిగానే జీవిస్తుంటాడు.

హైస్కూల్లోనూ, యూనివర్సిటీలోనూ, ఇమ్రాన్‌ను ఇస్లాంనుంచి క్రైస్తవ మతంలోకి మార్చటానికి కొంతమంది సహవిద్యార్థులు చాలా ప్రయత్నాలు చేస్తారు. ఈ ఇవాంజెలికల్ ప్రచారకులు ఇమ్రాన్ మనస్సులో రకరకాల అనుమానాలనూ, భయాలనూ ప్రవేశపెడతారు. ఇస్లాం పట్ల అతను తీవ్రమైన అంతర్మథనానికి గురి ఔతాడు. చివరకు ఇస్లాం గురించి, ఇతర మతాల గురించి తనదైన దృక్పథాన్ని ఏర్పరచుకొంటాడు.  మనం సత్యాలు అని గట్టిగా నమ్మే చాలా విషయాలు నిజాలు కావు అన్న అవగాహన కలుగుతుంది.  మానవులందరిలోనూ చాలా సామ్యాలు ఉన్నాయని గమనిస్తాడు. When we look at another human being, we instantly focus on their separation from ourselves, rather than their oneness with us అని గుర్తిస్తాడు. 2009లో అమెరికాలో 39 నగరాలలో యూనిటేరియన్ యూనివరలిస్ట్ చర్చిలలో అతను అమెరికాకు ముస్లిములకు మధ్య ఉండవలసిన సంబంధాల గురించి ఉపన్యాసాలు ఇచ్చాడు.

ఈ పుస్తకంలో మొత్తం ఇరవై ఐదు ప్రకరణాలు ఉన్నాయి. ప్రతి ప్రకరణమూ ఇమ్రాన్ జీవితంలోని ఒక స్కూలు సంవత్సరం గురించి ఉంటుంది. కథనం అంతా ఉత్తమ పురుషలో సాగుతూ, ఒక వ్యక్తి చిన్నప్పటినుంచి వ్రాసుకున్న డయరీలు  చదువుతున్నట్టు ఉంటుంది. చిన్నతనం నుంచి పాతికేళ్ల వయసు వరకూ ఇమ్రాన్‌ అనుభవాలు,అతనిలో వచ్చిన పరిణామాలు తెలుస్తాయి. మొదటి ప్రకరణాల్లో ఇమ్రాన్ చిన్నతనపు ఆలోచనలు, కొత్త విషయాలు ఎదురుపడినప్పుడు వాటిగురించి ఏర్పరచుకొనే అభిప్రాయాలు, స్కూల్లో ఇతర విద్యార్థులతో, ఉపాధ్యాయులతో అతని అనుభవాలు చాలా అమాయకంగా, సరదాగా ఉంటాయి. ఒక పాకిస్తానీ ముస్లింగా తనకూ, తన కుటుంబానికీ కలిగిన చేదు అనుభవాలనూ ఇమ్రాన్ వర్ణిస్తాడు. మతం గురించి అతని సంఘర్షణ, సందేహాలు మనల్నీ చాలా ఆలోచింపచేస్తాయి.

ఇమ్రాన్‌ చిన్నతనంనుంచే వివక్షను గుర్తిస్తూ, గర్హిస్తూ ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆడవారిపట్ల సంఘంలో, ముఖ్యంగా ఇస్లాంలో, కనిపించే వివక్షను అతను సహించలేడు. ఆరేళ్ళ వయసులో Life పత్రికలో ఫొటోలు చూస్తూ, వియత్నాం యుద్ధంలో చచ్చిపోయిన అమెరికన్లలో చాలామంది నల్లవారున్నారు కానీ, చంద్రమండలానికి మానవుణ్ణి పంపటానికి ప్రయత్నిస్తున్న నాసా సంస్థ ఉద్యోగులంతా తెల్లవారేనని అతను గుర్తించటం ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ వయసులోనే, తాము వివక్షకు గురి అవుతున్నా, తన తండ్రి ఐరిష్‌వారి పట్ల వివక్షత ప్రదర్శించటమూ అతను గుర్తిస్తాడు. అలాగే వివక్షతా చర్యలుగా తాము అనుమానించినవన్నీ వివక్షత కాకపోవన్న సత్యాన్నీ అతను తర్వాత తెలుసుకుంటాడు.

ఈ పుస్తకం చదవటానికి చాలా సరదాగా అనిపించింది. Wonder Years అని కొన్నాళ్ళ క్రితం స్కూలు వయసు పిల్లల దృక్పథంతో పాతరోజుల్ని చూపిస్తూ ఉండే ఒక టివి ప్రొగ్రాము గుర్తుకువచ్చింది. పుస్తకం వేగంగా చదివించింది.

ఇమ్రాన్ అనుభవాలు అతని ఒక్కడి సొంతమే కావు; ఇంగ్లండులో పాకిస్తానీ ముస్లిం పిల్లలకు మాత్రమే సంబంధించినవీ కావు. అమెరికాలో మా పిల్లల అనుభవాలకూ ఇమ్రాన్ అనుభవాలకూ చాలా సామ్యాలు ఉండి ఉంటాయని నాకు అనిపిస్తుంది. అమెరికాలో భారత సంతతి అనుభవాలపై ఆసక్తి ఉన్నవాళ్లందరూ తప్పక చదవవలసిన పుస్తకం. నేను మా అబ్బాయిలకు ఈ పుస్తకం చదవమని రికమెండ్ చేశాను.

* * * * * * * * * * *

The Perfect Gentleman 

(Originally Published in UK and Australia as Unimagined)

Imran Ahmad
2012
www.perfect-gent.com

337 pages

You Might Also Like

One Comment

  1. BSR

    Dear JV, that is a very nice review. I am looking forward to reading Imran’s book.

Leave a Reply