నోరూరించే పుస్తకం – Indian Food: A historical companion

రాసిన వారు: Halley
****************
ఈ పరిచయం కే.టీ.అచయ (K.T.Achaya) గారు రాసిన “యిండియన్ ఫుడ్ : ఎ హిస్టారికల్ కంపానియన్” గురించి. అచయ గారి గురించి మొదట నేను 2008లో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ లో చదివాను. ఇది చదివినపుడు “నేటి మన ఇడ్లి ఇండోనేసియా నుంచి వచ్చిందా! .. హత విధీ!” అని అనుకున్నా. అప్పటి నుంచి ఈ పుస్తకం చదవాలి చదవాలి అనుకుంటూనే అలా కాలం గడిచిపోయింది . చివరకు మొన్న అమర్త్య సేన్ రాసిన “Development as freedom” పుస్తకం చదువుతూ ఉంటే అందులో ఒకచోట మిరపకాయను పోర్చుగీసు వారు మన దేశానికి తెచ్చిన వైనం గురించి రాసారు ఆయన. అప్పుడు అనిపించింది అచయ గారి పుస్తకం కొని చదవాల్సిందే అని. వెంటనే ఫ్లిప్కార్ట్.కాంకి వెళ్లి కొన్నాను . ఈ పుస్తకం గురించి 2004లో హిందూ లో వచ్చిన పరిచయం లంకె.

పేరుకి తగినట్టుగానే పుస్తకం మనం తినే తిండి యొక్క చరిత్ర గురించి. మన తాత మొత్తాతల కాలంలో వారి పూర్వం వేదాల కాలంలో చివరాఖరుకి ఎపుడో ముప్పైవేల సంవత్సరాల కిందటి భింబెట్క ప్రజల కాలంలోని ఆహారపు అలవాట్ల గురించి వివరంగా రాసారు అచయ గారు. ఈ పుస్తకం చదివాక మిమ్మల్ని ఎవరన్నా ప్రపంచీకరణకు ఒక నమూనా చూపమంటే ఎంచక్కా మీ వంటింటికి తీసుకొని వెళ్ళండి! టొమాటోలు, పచ్చి మిరపకాయ, టెంకాయ, పుచ్చకాయలు, నారింజ, ద్రాక్ష, ఆపిల్, వేరుసెనక్కాయ ఇలా చెప్పుకుంటూ పోతే మనం రోజు తినే ప్రతీ పదార్థము దిగుమతే అన్న యదార్థం తెల్సుకున్న ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోక మానరు. ఇదేదో కామెడీ పుస్తకం అనుకొనేరు .. చాలా దీక్షతో చదవాల్సిన చరిత్ర పుస్తకం ఇది! కొన్ని కొన్ని కురగాయలకు పళ్లకు పంటలకు లక్షల కోట్ల ఏళ్ళ చరిత్ర ఉంది మరి .

మొదటి అధ్యాయాలలో పురాతన తవ్వకాల అధ్యయనం ద్వారా బయట పడిన ఆహారపు అలవాట్ల గురించి చర్చించారు. హరప్పా నాగరికత కాలంలోని ఆహారపు అలవాట్లు వ్యవసాయపు అలవాట్లు గురించి బొమ్మలతో సహా వివరంగా వర్ణించారు. అటు తర్వాత వివిధ వేదాలలో ఆహారపు అలవాట్ల గురించి రాసిన దానిని బట్టి ఆ కాలంలో మనం ఏం తినేవాళ్ళం అన్న వివరాలు తెలుపుతూ ఒక అధ్యాయము ఉన్నది. ఇందులో వేదాలే కాక బుద్ధ జైన సాహిత్యంలోని వివిధ వర్ణనల ఆధారంతో కనుక్కొన్న విషయాలను చెప్పటం జరిగింది. అప్పడాలు వడలు పాయసం మొదలైనవి అప్పట్లోనే తినేవాళ్ళం అంట మరి . దోసకాయ ముల్లంగి అల్లం మామిడి కాకరకాయ వంటి వాటి గురించి వేదాలలో ఉపనిషత్తులలో అటు పిమ్మట చేసిన రచనలలో రాయటం జరిగిందట. 400 బి.సి కాలానికి చెందినా బౌద్ధ జైన రచనలలో మొట్ట మొదటి సారిగా టెంకాయ, పనస, అరటి వంటి వాటి గురించి రాయటం జరిగిందట. మరి దీనిని బట్టి అంతకు పూర్వం ఇవన్ని మన దేశం లో లేవు అని అనుకోవాలేమో.

దీని తర్వాత మన వేదాలలో పురాణాలలో ఇతిహాసాలలో మాంసాహారపు అలవాట్ల గురించి ఏం చెప్పారో వివరించారు. నాకైతే ఈ అధ్యాయం భలే నచ్చేసింది. ఎందుకంటే నాకు ఎప్పటి నుంచో యజ్ఞాలలో యాగాలలో బలి ఇచ్చే జంతువులని ఏం చేసేవారు అని ఒక సందేహం ఉండేది. ఇది చదివాక ఆ సందేహ నివృత్తి అయ్యింది మరి. పూజ పూర్తయ్యాక నైవేద్యం మనమే తినేసినట్టు ఎంచక్కా ఆవురావురు మంటూ ఆ బలి ఇచిన జంతువులని వండుకు తినేవాళ్ళం అంట . ఋగ్వేదం లో ఒకానొక చోట గుర్రపు మాంసము వండు విధానము చాల వివరంగా రాసారట. నేను ఈ విషయమే ఒక మిత్రునితో అంటే అతను నవ్వేసి “అశ్వమేధ యాగం”లో చంపిన గుర్రాలతో ఇంకేం చేసేవాళ్ళు అనుకున్నావు అని అన్నాడు. నిజమే కదా! అచయ గారి ప్రకారం అప్పటి బ్రాహ్మణులు కూడా గుర్రపు మాంసం రుచినెరిగిన వారే అట.

రామాయణంలో వనవాస కాలంలో సీతాదేవికి ప్రియాతి ప్రియమైన వంటకం పేరు “మాంసభుతదన” అని రాసారు. అంటే ఏంటో అనుకొనేరు అన్నం + లేడి మాంసం + కూరగాయలు + మసాల = మాంసభుతదన అంట. అలాగే దశరథ మహారాజు చేసిన యజ్ఞంలో నెమలి మాంసం వగైరా వంటకాలు ఉండేవట. ఇది చాలదు అనట్టు ముళ్ళపంది, కుందేలు, తాబేలు, ఉడుము మాంసాల గురించి కూడా రాసారు. ఇది కాక మహాభారతంలో ధర్మరాజు పదివేల మంది బ్రాహ్మణులకు పంది మాంసం మరియు లేడి మాంసం వడ్డించిన విషయమూ మరియు ఆ మహాకావ్యంలో మరొక చోట ఒంటె, గాడిద మాంసం వండు విధానం గురించి చేసిన వర్ణనల గురించి చెప్పారు. ఖడ్గ మృగ మాంసం మరియు కోతి, ఏనుగు మాంసం గురించి కూడా బౌధయన ధర్మసుత్రాలలో రాసి ఉంది అట. వరాహమిహిరుని “బ్రిహత్సంహిత”లో బర్రె మరియు బల్లి ని తినటం గురించి కూడా రాసారట. “చరక సంహిత” లోనేమో మొసలి మరియు నక్కలను తినదగిన జంతువుల చిట్టాలో చేర్చారట.

ఇదంతా చెప్పాక అసలు గోవధ నిషేధం ఎలా మొదలైందీ, బ్రాహ్మణులకు తీవ్ర మాంసాహార నిషేధం ఎపుడు ఎలా అమలు లోకి వచ్చిందీ మరియు జైన బౌద్ధ సంప్రదాయాల వలన శాకాహారపు అలవాట్లకు కూరగాయల వాడకానికి అధిక ప్రాధాన్యత ఇవ్వటం ఎలా మొదలైందీ వంటి విషయాలు వివరించారు. నేటి భారతంలో శాకాహారులు ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నారు దానికిగల చారిత్రక కారణాలు ఏమిటి వగైరా విషయాలను కూడా వర్ణించారు. రకరకాల మద్యపానీయములు తయారు చేసే విధానముల గురించి సంస్కృత సాహిత్యంలో చేసిన వర్ణనలు, రామాయణంలో సీత రాములు వైను సేవించిన విషయమూ, సాంచి స్తూపము, పట్టడక్కళ్ శిల్పాలలో ప్రజలు కుటుంబ సభ్యులందరితో కలిసి మద్యం సేవిస్తునట్టుగా చూపిస్తూ చెక్కిన శిల్పాల గురించి చెప్తూ ఈ అధ్యాయం ముగించారు.

ఇలా చెప్పుకుంటూ పోతే మన ఆహారపు పద్దతులు, దక్షిణ భారతంలోని ఆహారపు అలవాట్లు, వైద్యానికి మనం తినే తిండికి అప్పట్లో ఉన్న లంకె, రాజుల భోగభాగ్యాలు, ఎందఱో యాత్రికుల వర్ణనలు, ముస్లిం రాచరికపు ప్రభావం, యూరోపు యాత్రికులు మరియు వలసపాలకుల ప్రభావము ఇలా ఎన్నో విషయాల గురించి చెప్పారు ఈ పుస్తకంలో.

చివరగా ఈ పుస్తకంలో రాసిన కొన్ని పిట్టకథల గురించి చెప్పి ఈ పరిచయం ముగిస్తాను.

పైనాపిలు/అనాసపండు దక్షిణ అమెరికా నుండి మన దేశమునకు వచ్చిందట. జలేబి పెర్షియా మరియు అరబ్బు దేశాల దిగుమతి అట. టెంకాయ “పపువా న్యు గిని (Papua New Guinea)” నుంచి సముద్రపు అలల పుణ్యమా అని హిందూ మహా సముద్రం లో పడి ఎపుడో మన దేశానికీ వచ్చినదట. చిలగడ దుంప “పెరు” నుంచి వచ్చినదట. రాజ్మ దక్షిణ అమెరికా నుంచి వస్తే రాగి ఉగాండా నుంచి వచ్చింది అంట. బియ్యం తూర్పు భారతం, చైనా, వియత్నాం నుంచి దక్షిణ భారతం అంతటా వ్యాపించిందట. జోన్నలేమో ఇథియోపియా నుంచి వచ్చాయట. నువ్వులు ఆవాలు మాత్రం అచ్చంగా మనవేనట. వంకాయ కూడా మనదేనట అందుకనే “వంకాయ వంటి కూరయు” అన్నారేమో బహుశా. బెండకాయ ఆఫ్రికా నుంచి వచ్చినట్టే మన గోంగూర కూడా అంగోలా లేదా సూడాన్ నుంచి వచిందట. దోసకాయ మాత్రం కచ్చితంగా మన దేశంలో పుట్టినదేనట. అలాగే మోసంబి నిమ్మ నారింజ మామిడి పండు మరియు పనస పండు కూడా మనవేనట. పసుపు,మిరియాలు,యాలకులు మన దేశానివే. అప్పట్లో వీటి కోసమే యూరోపు రాజులూ మన దేశానికి వచ్చారు అన్నది మనకి చరిత్ర చెప్పే సత్యం. గుమ్మడిపండు మెక్సికో నుంచి వచ్చిందట. అలాగే దానిమ్మేమో ఇరాన్ నుంచి వచ్చిందట. వీటిలో కొన్ని మనిషి పుట్టుకకి మునుపే సముద్రాలలో తేలుతూ ప్రపంచమంతా వ్యాపించాయట.

ఇవి కాక వలస వచ్చిన వారు తెచ్చినవి మరి కొన్ని. వేరుసేనక్కాయ యూరోపు వారు తీసుకొని వస్తే సోయాబీను చైనా నుంచి వచిందట . ఇక సన్ ఫ్లవర్ అయితే 1940-70 వరకు అసలు మన దేశంలో లేనే లేదట. అటు తర్వాత రష్యా నుంచి వచ్చిందట. జీడి పప్పు పోర్చుగీసు వారు తెచ్చారట. టొమాటో మెక్సికో లో పుట్టి 1550 లో ఇంగ్లండు వచ్చి 18 వ శతాబ్దంలో ఇండియా వచిందట. ఆలూ/ఉర్లగడ్డ బొలివియా నుంచి 1570 లో యూరోపు చేరి 1830 లో ఇండియా వచిందట.

ఇది కాక అయన జంతువుల గురించి కూడా చెప్పటం మొదలెట్టారు చివరాఖరున. ఇంకా ఈ చరిత్రను భరించటం నా వల్ల కాదు బాబోయి అని నేను పుస్తకం ముసేద్దాం అని అనుకొనే లోగా చివరి పేజి కి వచేసాను. దాదాపు ఇరవై పేజీలు ఆయనకు పుస్తకం రాయటానికి ఉపయోగ పడిన రచనల చిట్టా మరో ఇరవై పేజీలు అయన పుస్తకంలో వాడిన ఇతర భాషల పదాల పట్టిక! ఈ నలభై పేజీలు చాలు అయన ఈ పుస్తకం రాయటం కోసం ఎంత కష్టపడ్డారో తెల్సుకోటానికి! చాలా మంచి పుస్తకం . మీకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను .

You Might Also Like

12 Comments

  1. R.Srimannarayana

    మీరు ఉంచిన లింక్ ను కేలికను, అందులో సీతా మాంసం తిన్నారు అని రాయలేదు,ప్రియాతి ప్రియమైన వంట అన్నారు గాని తిన్నట్టుగా లేదు, అన్నిటికన్నా “ట” అనే పదం ఎక్కువగా ఉంది, ఉండేవట, రాసి ఉంది అట, రాసారట,చేర్చారట లాంటివి, సీతా ఏమి తిన్నదో గాని, ఎవరు చూడలేదు,…………..ఇక నేను చూడలేదు, ఆవేశ పడే వారికన్నా,ఆమె తిన్నట్టు, చూసినట్టుగా, చంకలు గుద్దుకొని అ మూల నుంచి ఈ మూల వరకు దోర్లేవారు ఎక్కువే. సౌమ్య గారు.

  2. sridhar

    ఇవన్ని నిజమేనా …మనం దేవుళ్ళ కాలమని నమ్మిన దంతా ఇలా మాంసం తో బ్రతికార ….ఇవన్ని నమ్మమంటార ….

  3. Jampala Chowdary

    ఈ మధ్యే కొనుక్కొని ఇంకా చదవని పుస్తకం: శ్రీనాధుని కావ్యాలలో భోజన వర్ణన — డా.ఎన్. అనంతలక్ష్మి; సి.పి. బ్రౌన్ అకాడమి; హైదరాబాదు; 2010

  4. రవి

    బావుంది. ఇంగిలీసు రాని నా బోంట్లకు తెలుగు అనువాదం కూడా సూచించి పుణ్యం కట్టుకున్నారు. మన ప్రాచీన కావ్యాలు చూసేప్పుడు ఆహార అలవాట్లు, దొరికిన కాయగూరలు, పళ్ళ గురించి తెలుసుకోవడం నా ఆసక్తి.

    సిగరెట్టు గురించి ఏమైనా రాశారా? తిరుమల రామచంద్ర గారు బౌద్ధం వినయపిటకం లో ధూమపాన ప్రస్తావన గురించి ఒక వ్యాసం రాశారు.

  5. gksraja

    పుస్తకం గురించి ఏమోగాని, మీ వ్యాఖ్య చాలా బావుంది. పుస్తకం కొని చదవాల్సిందే! ముఖ్యంగా పురాణ, ఇతిహాసాలలో మాంసాహార, మద్యపానాల విషయాలు ఎంతవరకు చారిత్రిక నిరూపణకు దగ్గరగా ఉన్నాయో తెలుసుకోవాలనే (చిలిపి)కోరిక పుట్టింది. ధన్యవాదాలు.
    @శ్రీనివాస్ పరుచూరి గారికి — దీని తెలుగు అనువాదం ఉన్న సంగతి, మరో హిందూ లింకు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు.
    gksraja.blogspot.com

  6. Sreenivas Paruchuri

    Thats a good review and more I am happy that at last someone talked about thisbook here. (సొంతడబ్బా: I’d have referred to late Dr. Achaya and this book umpteen number of times in the past 20 years.) By the way, there is (an abridged) version of this book in Telugu published by NBT, which is still available in-print.
    Here is a glowing tribute to the great scientist Achaya by Dr. Balasubramanian of LVP Eye institute.
    http://www.hindu.com/thehindu/seta/2002/09/26/stories/2002092600010200.htm
    In fact, it is this note of Balu that introduced me to Achaya’s larger work.
    Thanks again for mentioning this book, — Sreenivas

    1. Sreenivas Paruchuri

      The “Telugu version” I was earlier referring to deals more with dietary and anthropolgical aspects of Indian food. Sorry for the misleading sentence before!
      This is the book I had in mind:
      http://www.flipkart.com/books/812371033x?_l=HiqxyqBebY_wW5BsN4e2sg–&_r=r8LXTqJcncq7EMv7G8U3RQ–&ref=a94c6172-6f8e-47f7-860e-50bc6a9ea023

      I always hoped that Achaya’s work would motivate someone with good command
      on classical Telugu to write a kind of Historic food reader in Telugu context. We know that in ఆముక్తమాల్యద there are fascinating details about food and so do in శ్రీనాథ’s works, in చాటువులు and other kaavyas.

      If anyone is interested in reading more on ‘food’ stuff 🙂 here are two books I recently enjoyed reading: Jack Turner; Spice-The history of a temptation, Random House, 2004 and Lizzie Collingham; Curry: A Tale of Cooks and Conquerors, OUP, 2006.

      If you still have appetite for such historical stuff, here is the web page of Dorian Fuller, one of the world’s leading Archaeobotanists, writing extensively on south India. http://www.ucl.ac.uk/archaeology/people/staff/fuller/#tabs-3
      DF’s work somewhat supercedes Achaya’s arch.bot. data but no way diminishes his large work.
      Regards, — Sreenivas

    2. ఆ.సౌమ్య

      Thanks for the whole info…very interesting….i will try to read all!

  7. Halley

    “We respect people and adore gods not for what they eat but what they stand for and teach us. To think and act otherwise is immature and infantile”

    The other article in “Hindu” on this book
    http://www.hindu.com/seta/2004/10/21/stories/2004102100111600.htm

  8. Purnima

    భళా! నోరూరించే పుస్తకం.

  9. సౌమ్య

    “ఈ పుస్తకం చదివాక మిమ్మల్ని ఎవరన్నా ప్రపంచీకరణకు ఒక నమూనా చూపమంటే ఎంచక్కా మీ వంటింటికి తీసుకొని వెళ్ళండి! ”
    – 🙂 Good one!

  10. ఆ.సౌమ్య

    wow…pretty interesting!
    పుస్తకం గురించి మీ సమీక్ష చాలా బావుంది. తప్పకుండా కొని చదవాల్సిన పుస్తకం అనిపిస్తోంది. చదువుతాను! ఇంతటి ఆసక్తికరమైన పుస్తకాన్ని పరిచయం చేసునందుకు మీకు ధన్యవాదములు!

Leave a Reply