మనకీ ఉంది సుమా ఒక ఉజ్జ్వల చరిత్ర

చాలా శతాబ్దాల నాటి సంగతి. తురుష్కులూ, ఇంగ్లీషువారూ ప్రవేశించక ముందు చాలా శతాబ్దాల పాటు అవిచ్ఛిన్నంగా, అsocial-and-economic-history-of-the-telugu-people1ప్రతిహతంగా కొనసాగిన సంగతి. తెలుగు మాట్లాడే ఈ భూభాగాన్ని ఒక ప్రత్యేక “దేశం” గా పరిగణించేవారు. ఇది పరిపాలనాపరంగా జిల్లాలుగా కాక “నాడులు” అనే రాష్ట్రాలుగా విభజించిబడి ఉండేది. వేంగినాడు, వెలనాడు, పాకనాడు, ములికినాడు, పొత్తపినాడు, రేనాడు, కమ్మనాడు మొ||వి అన్నమాట. ఈనాటి రాయలసీమలో ఒక పెద్దభాగాన్ని రేనాడు అనేవారు. ఈరోజు ఆ నాడుల విషయం అందఱూ మర్చిపోయారు. (అవి ఈనాటి తెలుగు బ్రాహ్మణ కులంలోని శాఖానామాలుగా మిగిలిపోయాయి. వెలనాటి వైదీకులు, ములికినాటి నియోగులు మొ||న పేర్లు) సదరు తెలుగు “దేశానికి” విజయవాడ రాజధానిగా ఉండేది. ఆ రోజుల్లో దాన్ని ’బెజవాడ’ అనేవారు. ప్రతి ’నాడు’కూ స్థానికంగా ఒక రాజున్నప్పటికీ వారందఱి పైనా బెజవాడలో ఒక తెలుగు చక్రవర్తి కూడా ఉండేవాడు. అలా వివిధ వంశాలకు చెందిన తెలుగు చక్రవర్తులు తెలుగుదేశాన్ని పరిపాలించేవారు. ఇక్ష్వాకులు, ఆనందగోత్రులు, బృహత్ఫలాయనులు, విష్ణుకుండినులు, రాష్ట్రకూటులు, హైహయులు, వైదుంబులు, ప్రాక్-చాళుక్యులు, తెలుగుచోడులు, కాకతీయులు – వీరు ఆనాటి మన తెలుగు రాజవంశాలు. తరువాతి కాలంలో – అంటే నన్నయగారి పోషకుడైన రాజరాజు కాలంలో (క్రీ.శ.1000 అనంతరం) తెలుగువారి రాజధాని బెజవాడ నుంచి రాజమహేంద్రవరానికి తరలిపోయింది. క్రీ.శ. 1250 లో గణపతిదేవ కాకతీయుడు తన కాలానికి ముక్కలైన తెలుగు భూభాగాలన్నిటినీ పునరేకీకృతం చేసి ఆంధ్రసామ్రాజ్యాన్ని స్థాపించాక తెలుగువారి రాజధాని మళ్ళీ రాజమహేంద్రవరం నుంచి వరంగల్లుకు తరలిపోయింది. రాజుల గెలుపోటములతో సంబంధం లేకుండా తెలుగుదేశానికి ఆ రోజుల్లో తెలుగు అధికారభాషగా కొనసాగుతూ ఉండేది. నిజానికి ఆ విధంగా తెలుగుని అధికారభాష చేసినది తెలుగురాజులు కాదనీ, తెలుగుదేశాన్ని జయించిన తమిళరాజులనీ చదివినప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది.

ఈ విశేషాలన్నీ డాక్టర్ అల్లాడి వైదేహిగారు రచించిన ’ఆంధ్రుల సాంఘిక ఆర్థిక చరిత్ర’ అనే పరిశోధనా గ్రంథంలోనివి. ఆవిడ ఈ గ్రంథం రచించి చాలాకాలమైంది. కానీ ఇటీవలే తాజాగా పునర్ముద్రణ పొందింది. శ్రీమతి వైదేహిగారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చాలా సంవత్సరాల పాటు ప్రొఫెసర్ గా, చరిత్ర శాఖాధిపతిగా పని చేసి పదవీవిరమణ చేశారు. నేను నిజామ్ కళాశాలలో డిగ్రీ విద్యార్థిగా ఉన్న రోజుల్లో (1986) మా పూజ్యగురువులైన డా|| కప్పగంతుల కమలమ్మ (మాజీ సంస్కృత శాఖాధిపతి, ఉస్మానియా) గారి ద్వారా నాకు ఆవిడతో పరిచయం ఏర్పడింది. ఆ రోజుల్లో వారి మనుమలకి సనాతన హిందూ సంప్రదాయంలో ట్యూషన్ చెప్పడానికి నన్ను నియమించారు. వారి ఆనతి చొప్పున వారి అల్లుడిగారింటికి ప్రతిరోజూ వెళ్ళి ఆ పిల్లలకి దేవీ-దేవ స్తోత్రాలూ ఇత్యాది నేర్పి వస్తూండేవాణ్ణి.

శ్రీమతి వైదేహిగారు బహుగ్రంథకర్త్రి. ఇది గాక Freedom Movement in India, భారతదేశ చరిత్ర, సంస్కృతి (ఆధునిక యుగము), భారతదేశచరిత్ర-సంస్కృతి (ప్రాచీనయుగము), ఆంధ్రదేశము-స్త్రీలు మొదలైన అనేక ఉద్గ్రంథాలే కాక పలు పత్రికలలో పరిశోధనావ్యాసాలు సైతం ప్రకటించారు.

ప్రస్తుత గ్రంథాన్ని కూర్చేముందు రచయిత్రి కొన్ని వందల ప్రాచీన శాసనాల్ని, రాగిఱేకుల్నీ, అదే విధంగా పెక్కు సాహిత్య ఆకరాల (literary sources) నీ కూలంకషంగా పరిశీలించారు. అయితే ఈ పరిశోధక కృతి గత ఒకటిన్నఱ సహస్రాబ్దికి చెందిన తెలుగువారి సాంఘిక చరిత్రని కాక, క్రీ.శ.1000-1250 సం||ల మధ్య ఉన్న రెండున్నఱ శతాబ్దాల కాలఖండాన్ని మాత్రమే అధ్యయన విషయంగా స్వీకరిస్తోంది. ఇది పన్నెండధ్యాయాలుగా విభజించబడింది. వచన రచన సరళ గ్రాంథికంలో సాగింది. ఇదే పుస్తకం Social and Economic Conditions in Eastern Deccan 1000-1250 AD అనే పేరుతో ఆంగ్లంలో కూడా లభ్యమవుతోంది.

౧. (ఆనాటి) రాజకీయ పరిస్థితులు
౨. వర్ణవ్యవస్థ
౩. స్త్రీలు
౪. వ్యవసాయము
౫. వర్తక వ్యాపారములు
౬. పన్నులు
౭. నాణెముల చెలామణి
౮. విద్య-సాహిత్యము – సంగీతము – నాట్యము
౯. మతము(లు)
౧౦.దేవాలయములు
౧౧.వస్త్రములు – ఆభరణములు
౧౨.ఆటలు – వినోదములు

ఆనాటి వర్తకవ్యాపారాలు

ఆరోజుల్లో ఒక ఊరినుంచి ఇంకో ఊరికి వెళ్ళడానికి మంచి మంచి బాటలు ఉండేవని తెలుస్తోంది. కంచి నుంచి గంగానది దాకా ఒక రోడ్డుందని ఒక గ్రంథం తెలియజేస్తోంది. ఆంధ్రదేశంలో ఏ కారణం చేతనో గుఱ్ఱాల్ని సైన్యంలో మాత్రమే వాడేవారు. ప్రజల రవాణా అవసరాలకి ఎడ్లబళ్ళూ, ఎనుపోతుల బళ్ళూ వాడేవారు. సరుకుల రవాణాకి కూడా అవే. రహదార్లు ఉండడం చేత వర్తకవ్యాపారాలు ఆ రోజుల్లో బాగానే అభివృద్ధి చెంది ఉన్నాయి. కానీ గ్రామస్థాయిలో నాణేల వాడకం అంతగా లేదనీ, వాటి స్థానే వస్తువులు ఇచ్చిపుచ్చుకోవడం జఱిగేదనీ రచయిత్రి వ్రాశారు. ప్రభుత్వానికి చెల్లించే పన్నులు మాత్రం నాణేల్లోనే చెల్లించాలట. ఈనాడు విశాఖపట్నంలా ఆనాడు మన విదేశీ వాణిజ్యానికి ఆయువుపట్టు మోటుపల్లి రేవు. ఒకసారి పెద్ద తుఫానొచ్చి మోటుపల్లిలోని ఓడలన్నీ పగిలిపోయి, వచ్చిన సరుకంతా సముద్రం పాలై వ్యాపారస్థులకి అపారనష్టం వాటిల్లిందట. ఈ వార్త వరంగల్లుకు చేఱిన వెంటనే ఆనాటి తెలుగుచక్రవర్తి గణపతిదేవ కాకతీయుడు ఒక ప్రకటన చేస్తూ “నా ప్రజల సంరక్షణ నా జీవితము కన్నా ముఖ్యమైనది. కాబట్టి ఒక్క కూపశుల్కము తప్ప తక్కిన రేవుసంబంధమైన సుంకములన్నింటిని రద్దు చేసితిని. సముద్ర వ్యాపారము చేయు వర్తకులు వ్యాపారము సాగించి స్థిరమైన ప్రభుత్వమునకు ధర్మపాలనకు తోడ్పడుదురు గాక !” అని కోరాడు.

గ్రామాల్లో రెండు రకాల వర్తకులుండేవారు. ఒకరు వైశ్యులు. రెండవవారు వీరబలంజలు. వీరిని ఇప్పుడు బలిజకాపులనీ, సెట్టిబలిజలనీ వ్యవహరిస్తున్నారు. ఆనాటి స్థానిక దుకాణాలన్నీ సాధారణంగా వైశ్యులకి చెందినవి. వాటిల్లో చాలా పెద్దపెద్ద కిరాణా, బట్టల దుకాణాలుండేవని తెలుస్తోంది. వీరబలంజలు ఎక్కువగా ఓడల మీద విదేశ వ్యాపారం చేసేవారు. ఆనాటి ప్రభుత్వాలు వ్యవసాయంతో సహా ప్రతిదాని మీదా పన్నులు విధించేవి. వ్యవసాయ శిస్తు, స్థలాల, ఇళ్ళ రిజిస్ట్రేషన్లు, అమ్మకం పన్ను, పెళ్ళిపన్ను, సరుకుల రవాణా పన్ను – ఇవి ఆనాడు ప్రభుత్వానికి ఉన్న ముఖ్యమైన ఆదాయవనరులు. చిత్రమేంటంటే ఆ పన్నుల వసూళ్ళన్నీ పూర్తిగా రాజోద్యోగులకి కాక ప్రైవేట్ వ్యక్తులకి సైతం అప్పగించడం. సాధారణంగా వైశ్యులు ఈ బాధ్యత స్వీకరించేవారు. “ఎంతైనా వసూలు చెయ్యి. నాకు మాత్రం ప్రతిసంవత్సరం ఖచ్చితంగా ఇంత పంపించితీఱాలి” అని ప్రభుత్వం నిబంధన విధించేది. అలా మిగల్చుకున్న డబ్బుతో ఆనాటి పన్నువసూళ్ళ కాంట్రాక్టర్లు గుళ్ళూ, గోపురాలూ, సత్రాలూ, వంతెనలూ, ఆనకట్టలూ కట్టించినట్లు శాసనాలు తెలియజేస్తున్నాయి.

ఆనాటి కులాలు

ఈ పుస్తకం చదివితే “ఈనాటివారు అనుకుంటున్నంత కులపట్టుదలలు ఆనాటివారికి నిజంగా ఉన్నాయా ?” అని అనుమానం కలుగుతుంది. రచయిత్రి వీరశైవం గురించి వ్రాసిన సందర్భాల్లో బసవన్న, పండితారాధ్యుడు, పాల్కురికి సోమనాథుడు మొదలైన అనేకమంది వీరశైవ బ్రాహ్మణులు కులవిచక్షణ నిర్మూలన కోసం కృషి చేసిన వైనాన్ని వివరించారు. పలనాటి వీరుడైన బ్రహ్మనాయుడు వీరశైవం వల్ల ప్రభావితుడై మాలస్త్రీని వివాహం చేసుకున్నాడనీ, పైగా శివభక్తులైన మాలమాదిగలతో కలిసి బహిరంగంగా భోజనం కూడా చేసేవాడనీ తెలియజేశారు. ఆనాటి మాలల్ని రాత్రిపూట గ్రామానికి ఆధికారికంగా కాపలాదార్లుగా నియమించేవారనీ విశదీకరించారు. దీన్నిబట్టి మాలలు ఊరి బయట నివసించినప్పటికీ తమ ఉద్యోగ ఉపాధుల నిమిత్తం ఊరివారితో సత్ సంబంధాలే కలిగి ఉండేవారని తోస్తున్నది. అదేవిధంగా క్షత్త్రియ రాజుల సైన్యాల్లో భాగంగా ఉంటూ వచ్చిన శూద్ర సైన్యాధిపతులు చాలామంది క్రీ.శ. 1250 తరువాత స్వాతంత్ర్యం ప్రకటించుకోవడం వల్ల ఆంధ్రదేశంలో క్షత్త్రియుల పాలన చాలావఱకు అంతరించి శూద్రరాజుల ఏల్బడి మొదలయింది. కాకతీయులు, వెలమరాజులు, రెడ్డిరాజులు మొదలైనవారు ఈ కోవకి చెందినవారు. అయితే ఇందువల్ల సాంఘికంగా కొంత మంచే జఱిగింది. రాజ్యాధికారమూ, దానితో వచ్చిపడే బరువు-బాధ్యతలూ వారి శూద్రత్వాన్ని హరించి వారిని అగ్రకులాలుగా స్థిరపఱిచాయి. “బ్రాహ్మణుల్ని పొందిన (పెళ్ళిచేసుకున్న) అబ్రాహ్మణులు కూడా బ్రాహ్మణుల వలెనె పూజ్యులు” అంటారు సదరు కాలఖండానికే చెందిన నన్నయభట్టు భారతంలో ఒకచోట. ఆ ప్రకారంగా ఆ రోజుల్లో చాలామంది కులాంతర వివాహాలు చేసుకున్నారని రచయిత్రి సోదాహరణంగా విపులీకరించారు. ఉదాహరణకి శూద్రురాలైన రాణీ రుద్రమదేవికి క్షత్రియుడితో వివాహం జరిగింది.

రాజులు బ్రాహ్మణులకే కాక వైశ్యులక్కూడా అగ్రహారాలిచ్చినట్లు రచయిత్రి శాసనాల్లోని ఉదాహరణలు ఉటంకించారు. వైశ్యుల్లో కూడా వేదవేత్తలుండేవారని ఇంకోచోట శాసనప్రమాణం చూపించారు. నన్నయగారి కాలంనాటికే విశ్వబ్రాహ్మణుల్లో సైతం కవిపండితులున్నారనడానికి శాసనప్రమాణం ప్రదర్శించారు. సాంప్రదాయికంగా చూస్తే – వారి గురువులు మాత్రం బ్రాహ్మణులే అయ్యుండొచ్చు. అయితే ఆ రోజుల్లో విద్య అంటే మతవిద్యే. ఇంకేమీ పెద్దగా ఉండేది కాదు. విద్యావ్యవస్థ రెండు రకాలుగా ఉండేదట. ఒకటి ఘటికలు. రెండోది శైవమఠాలు. సింహాచలం వంటిచోట్ల వైష్ణవ మఠాలు కూడా ఉండేవి కానీ శైవమఠాలంత విస్తారంగా ఉన్నట్లు ఆధారాల్లేవు. ఘటికలు దేవాలయాలకి అనుబంధంగా, వాటిల్లో ఒక భాగంగా నడిచేవి. వాటిల్లో ఉపాధ్యాయులూ, విద్యార్థులూ కూడా అగ్రకులాలవారే. అక్కడ తొమ్మిదో యేట చేఱితే ముప్ఫయ్యేళ్ళ వయసు వచ్చేవఱకు ఉండి చదువుకోవాల్సి వచ్చేది. ఇంకొక చిత్రం కూడా ఉంది. ఎవరైనా పండితుడు వాదంలో ఓడిపోతే మళ్ళీ వచ్చి విద్యాలయంలో విద్యార్థిగా చేఱి ఆ ఓడిపోయిన శాస్త్రభాగాన్ని గురువుల పర్యవేక్షణలో పునశ్చరణ చేసేవాడట.

మఠాల్లో కూడా ఉపాధ్యాయులు బ్రాహ్మణులే అయినప్పటికీ అక్కడ అన్ని కులాలవారికీ చదువు చెప్పేవారు. ఘటికలకీ, మఠాలకీ కూడా విద్యాసత్రాలనే పేరుతో హాస్టళ్ళు ఉండేవని చెబుతూ అలాంటి ఒక విద్యాసత్రం నిమిత్తం ఎఱుకలసాని అనే ఆమె చేసిన దానాన్ని వర్ణించే శాసనాన్ని రచయిత్రి ఉటంకించారు. చదువు చెప్పే అయ్యవార్ల వసతి కోసం కూడా గదులుండేవట. వారికి నెలజీతాలుండేవి. విద్యార్థులకి భోజనవసతి ఉచితం. చాలా సందర్భాల్లో ప్రభుత్వమే ఆ ఖర్చులన్నీ భరించేది.

పుస్తకం పూర్తిగా ఓపిగ్గా చదవాలే గానీ ఇంకా ఎన్నో ఎన్నెన్నో తెలుస్తాయి.

(ఆంధ్రుల సాంఘిక ఆర్థిక చరిత్ర (మధ్యయుగము) ; రచన – ప్రొఫెసర్ అల్లాడి వైదేహి ; 28+302 పుటలు ; వెల – రు. 150 ; ప్రచురణ – నీల్ కమల్ పబ్లికేషన్స్, సుల్తాన్ బజార్, హైదరాబాద్-95)

You Might Also Like

8 Comments

  1. sumanguduru

    మంచి పుస్తకాన్ని పరిచయం చెసినందుకు ధన్యవాదాలు

  2. nagamurali

    చాలా ఆసక్తికరంగా ఉంది. చాలా బాగా సమీక్షించారు.

  3. కొత్తపాళీ

    విశ్వనాథ సత్యనారాయణగారి చారిత్రక నవలలు కొన్నిట్లో ఈ కాలపు విశేషాల్ని చిత్రించారు. బద్దన్న సేనాని ఒక ఉదాహరణ.

  4. తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

    మీరు సరిగానే ఊహించారు. పొత్తపి ఉన్న జిల్లానే పొత్తపినాడు.

  5. Yogi

    మీరు పేర్కొన్న నాడుల్లో ఒక్కటైన పొత్తపినాడు, ఇప్పటి కడప జిల్లాలో నందలూరు దగ్గర ఉన్న పొత్తపీ ఒక్కటేనా? ఒక్కటే అయితే, అది మా అక్కయ్య వాళ్ళ ఊరు అక్కడి గుళ్ళూ గోపురాలూ చోళులు కట్టించినవి. చాలా సుందరంగా ఉంటాయి

  6. కన్నగాడు

    మంచి పుస్తకం పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. వ్యాసం చదవగానే పుస్తకం చదవాలనిపించింది, ప్రస్తుతానికి వీలుపడదు (నేనుండేది యు.కె. లో) కనుక హిట్ లిస్ట్ లో వేసుకోవాలి.

  7. Sri

    మంచి పుస్తకం ను బయటకు తెచ్చారు. ఒక పి.డి.యఫ్. పుస్తకం చేస్తె విదేశాలలో ఉన్న వాళ్ళకి కూడా ఉపయొగ పడుతుంది. మరి మీరొక కాపీ ని పంచా గొర్రెలయ్యకు పంపేది.

  8. కొత్తపాళీ

    చాలా సంతోషం. మంచి పుస్తకాన్ని పరిచయం చెయ్యడమే గాకుండా అందులోని ముఖ్య విషయాలని క్లుప్తంగా చక్కగా పరామర్శించారు.

Leave a Reply