అంటరాని వసంతం

antaraniరాసి పంపిన వారు: మురళి (http://nemalikannu.blogspot.com)

ఇది ఏడుతరాల కథ. ఆత్మాభిమానాన్ని నిలబెట్టుకోడం కోసం ఎన్నెలదిన్నెమాలలు, మాదిగలు జరిపిన పోరాటం కథ. కాయకష్టం నుంచి కళా సంస్కృతుల వరకు తమకి సంబంధిన వాటినన్నీ ‘కులం’ తక్కెడలో మాత్రమే వేసి తూచే సమాజాన్ని అడుగడుగునా ఎదుర్కొంటూ, ఓడిపోతూ, గెలుస్తూ, పడుతూ, లేస్తూ.. అస్తిత్వాన్ని నిలబెట్టుకున్న వీరుల కథ. తొమ్మిదేళ్ళ క్రితం జి. కళ్యాణ రావు రాసిన ఈ పుస్తకం ఇప్పటివరకు నాలుగు ముద్రణలు పొందింది.. ఐదో ముద్రణ కి సిద్ధ పడుతోంది.

ఎన్నెలదిన్నె మాలపల్లికి చెందిన సిన సుబ్బ, అతని కొడుకు ఎర్రెంకడు, మనవడు ఎల్లన్న, ఎల్లన్న కొడుకు శివయ్య (సీమోను), మనవడు రూబేను, రూబేను కొడుకు యిమ్మానుయేలు, మనవడు జెస్సీ… కాలంతో పాటు మారుతున్న సమాజం లో మారుతున్న సమస్యలు. ప్రతిసారీ ఒకటే సమస్య. అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడం, ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడం. వీళ్ళ స్త్రీలదీ అదే సమస్య. పోరాటం వీళ్ళ జీవితం లో ఒక భాగం.

రూబేను భార్య రూతు రచయిత్రి. కథలు, కవితలు రాస్తూ ఉంటుంది. ఆమె గొంతుతోనే ఎన్నెల దిన్నె కథని పాఠకులకి చెబుతుంది. వెన్నెల రాత్రుల్లో రూబేను తనకి చెప్పిన కథలు ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంటూ, వర్తమానంలో ఆగుతూ, మరో కథను గుర్తు చేసుకుంటూ.. ఇలా సాగుతుంది నవల. సిన సుబ్బ, ఎర్రెంకడూ కూలీలుగానే జీవిస్తారు. పెద కరణం కేవలం భోజనం పెట్టి వీళ్ళ చేత కూలి చేయించు కుంటాడు. అతని ఆగడాలను మౌనంగా భరిస్తారు వీళ్ళు.

ఊళ్ళో పెద కరణానిదీ, రెడ్లదే రాజ్యం. వాళ్ళ మాటకి ఎదురు లేదు. వాళ్ళు పంచిందే కూలి, కొలిచినవే గింజలు. పెద కరణానికి తగ్గ వాడే అతని కొడుకు చిన కరణం. తప్పు చేసిన తన చెల్లెల్ని తండ్రి హత్య చేస్తుంటే అడ్డుకోడు సరికదా, ఆస్తి కలిసొచ్చిందని సంబరపడతాడు. పల్లెలో ఎర్రెంకడికి మాత్రం చెల్లెలు భూదేవంటే ప్రాణం. ఉన్న కొంచం నేలా అమ్మి ఆమె పెళ్లి చేస్తాడు. ఆమె చూపించిన లింగాలునే తను పెళ్ళాడతాడు. కొడుక్కి ఆమె చెప్పిన పేరే (తన తండ్రి పేరు) పెడతాడు.

మేనత్త భూదేవి దగ్గర పెరిగిన ఎల్లన్న కళాకారుడిగా మారతాడు. చంద్రప్ప శిష్యుడు నాగన్న దగ్గర ఉరుముల నృత్యం నేర్చుకుంటాడు. సుభద్రని పెళ్ళాడతాడు. అతని కళకి కులం అడ్డు పడుతుంది, ఊరి పెద్దల రూపంలో. ఊరు విడిచి మాల బైరాగి గా మారతాడు ఎల్లన్న. అతని ప్రతి పాటలోనూ ‘చుక్కల ముగ్గు కర్ర’ సుభద్ర ఉంటుంది. దేశాటనలో తన కులం మీదా, కళ మీదా జరుగుతున్నా దాడులు అడుగడుగునా అనుభవం లోకి వస్తాయి ఎల్లన్నకి. జీవితపు చరమాంకంలో సుభద్రనీ, కొడుకు శివయ్యనీ కలుస్తాడు ఎల్లన్న.

కరువుకి తనవాళ్ళందరినీ పోగొట్టుకున్న శివయ్య, భార్య శశిరేఖతో కలిసి ఊరు విడిచిపెడతాడు. కూలి చేయడానికి కూడా కులమే అడ్డు. సరిగ్గా అప్పుడే మత బోధకుడు మార్టిన్ కలుస్తాడు. తనతో తీసుకెళతాడు. శివయ్యను సీమోను ను చేస్తాడు. అంటరానితనం లేని క్రైస్తవం ఎంతో నచ్చుతుంది సీమోనుకి. చిన కరణం అల్లుడు, రెడ్ల బంధువులు కూడా క్రైస్తవంలో కలుస్తారు, దొరలతో సాన్నిహిత్యం కోసం, పెత్తనం కోసం.. సీమోను కి రూబేను పుడతాడు. రూబేను నెలల పిల్లవాడుగా ఉన్నప్పుడే అగ్ర కులాలు జరిపిన మారణ కాండలో తనవాళ్ళందరినీ పోగొట్టుకుంటాడు.

చర్చి ఆస్పత్రిలో బోధకుడిగా చేరిన రూబేను ఎంతో కష్టపడి తన గతాన్ని గురించి తెలుసుకుంటాడు. రూతుని పెళ్ళాడి యిమ్మానుయేలు, రోజీ లకి జన్మనిస్తాడు. అధ్యాపకుడిగా ఉద్యోగం సంపాదించు కున్న యిమ్మానుయేలు మేరి సువార్తని పెళ్ళాడి జెస్సీ కి జన్మనిస్తాడు. జెస్సీ పుట్టాక నక్సల్బరి ఉద్యమం లో చేరిన యిమ్మానుయేలు ప్రాణాలు కోల్పోతాడు. పెరిగి పెద్దైన జెస్సీ ని ‘కారంచేడు’ సంఘటన కదిలిస్తుంది. అత్త కూతురు రూబీ ని పెళ్లి చేసుకుని ఆత్మగౌరవ ఉద్యమంలో పనిచేయడం మొదలుపెడతాడు జెస్సీ.

ఈ ప్రధాన కథకి తోడు ఎన్నో ఉప కథలు.. కళ కోసం, అస్తిత్వం కోసం చంద్రప్ప, నాగన్న, కుమ్మరి పేద కోటేశ్వరుడు వంటి కళాకారులు చేసిన పోరాటాలు. పొలానికి నీళ్ళ కోసం ఎన్నెలదిన్నె మాలల పోరు, సుభద్ర తెగువ, ఊరి చెరువులో నీళ్ళు ముంచుకోవడం కోసం ఆవలపాడు మాలలు చేసిన పోరాటం. మహాత్ముడి శుద్ధి ఉద్యమం, ఆలయ ప్రవేశ నినాదం గ్రామ స్థాయిలో మొక్కుబడిగా మారిన వైనం, క్రైస్తవం లోకి మారిన మాల, మాదిగలపై అగ్రవర్ణాల అణచివేత, శ్రీకాకుళ పోరాటం, నక్సల్ బరి ఉద్యమం వీటన్నింటినీ స్ప్రుశిస్తూనే ప్రధాన కథని చెప్పారు రచయిత.

ఇంత విస్తృతమైన కథని కేవలం 230 పేజీల్లో చెప్పారు. ఒకరకంగా ఇది కొండను అద్దంలో చూపించడం. ఏలెక్స్ హెలీ ‘రూట్స్’ నవల ప్రభావం (తెలుగు అనువాదం ‘ఏడు తరాలు,’ రచన: సహవాసి) ఈ నవలపై చాలానే ఉంది. ఐతే ‘రూట్స్’ మనకి కొన్ని వేల మైళ్ళ దూరంలో జరిగిన కథ, ‘అంటరాని వసంతం’ మన మధ్య జరిగిన కథ. మనుస్మృతి నుంచి నండూరి ఎంకిపాటల వరకు ప్రతి రచననూ ఆగ్రహంతో ప్రశ్నిస్తారు రచయిత. పోతన భాగవతమూ ఇందుకు మినహాయింపు కాదు. “అంటరాని వాళ్ళ కళలు, సంస్కృతీ కూడా అంటరానివైపోయాయి” అన్నారు చాలా చోట్ల. భూదేవి, ఎల్లన్న, సుభద్ర పాత్రలు వెంటాడతాయి. విప్లవ రచయితల సంఘం ప్రచురించిన ఈ పుస్తకం వెల రూ. 70. విశాలాంధ్ర, ప్రజాశక్తి, నవోదయ, దిశ, ఇంకా అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ లభిస్తుంది.

You Might Also Like

11 Comments

  1. అంటరాని వసంతం | పుస్తకం

    […] ****** (ఈ పుస్తకం పై గతంలో ఏప్రిల్ 2009లో పుస్తకం.నెట్లో వచ్చిన మరో వ్యాసం ఇక్కడ). […]

  2. manoj

    naku ila books chadavatam okappudu alavatu ledhu…ma pedhananna gari daggara ee book techukoni chadiva.chaduvutunnantha sepu gundelni melipettindi..enno sarlu kallallo neellu tirigai…roots kanna chala manchi book…ippatiki oka 5 sarlu chadivanu…mathayya sahasam,ellanna paata,ila nannu marchesinayi chala unnai…nijamga appatnunchi edo teliyani aavesam,thirugubatu ochindi……….naku indulo baga guchukunna lines ‘MANAM ANTARANITANANNI VADILINCHUKODANIKI KREESTU NI NAMMUKUNNAM KAANI IKKADA KREESTU NI ANTARANIVADNI CHESARU’

  3. lavanya

    murali garu chala manchi kathalu ni parichayam chesttunnaru.

  4. raghu

    antaranivasantam gurunchi chala rojula kinda vinna..adi mukyaga aa rachyita ma guruvu garu kavadam ento anandani ichinci kaniaa puskannai chaduvaledu..okkasari konadaniki velte appatike aa mudranalo pustakalni ayipoyav..

    aa rahciyata tho naku 2 years anubhdnam undi..ayana ma guruvu garu

  5. కొత్తపాళీ

    చాలా చక్కటి నవలకి చక్కటి పరిచయం రాశారు.
    నా వుద్దేశంలో ఇది తెలుగులో గత పదేళ్ళల్లో వచ్చిన గొప్ప నవలల్లో ఒకటి. నవల పేరులో ఉన్న కవితాత్మనే, గుండే చెరువయ్యే బాధా భరితమైన కథ చెబుతూ కూడా, పుస్తకం నిండా నింపేసిన రచయితకి జోహార్లు. ఈ పుస్తకం ఇటీవల పునర్మిద్రిత మైందని విన్నాను. తప్పకుండా కొని చదవాల్సిన పుస్తకం.
    ఈ నవల గురించి ఎప్పుడో 2001 లో రాసిన నా సమీక్ష ఇక్కడ చదవొచ్చు.
    http://www.eemaata.com/em/issues/200107/675.html

  6. chinni

    మురళి
    చాల మంచి పుస్తకం పరిచయం చేసారు …..పుస్తకం ఎనిమిది చాప్టేర్స్ చదివాను …..గుండె మండిపోయింది ……అలెక్స్ రూట్స్ చదివి ఎంత దుఖపడ్డానో అంతకు మించిన వ్యధను అనుభవించాను ….నాకు తెలీని నిజాలెన్నో …..మీరు చెప్పే విధానం చదివించేలా వుంటాది …థన్క్యౌ

  7. rishi

    మురళీ గారు…
    వందల సంవత్సరాలు ,వేలపోరాటాలు ,జరిగినా పోని అంతరాలు
    ఎన్ని పెజీలు వ్రాసినా “అద్దంలో కొండే” . ఇక పాత్రలు వెంటాడటం కాదు
    గ్రామీణ నేపద్యం లో పెరిగితే ఎక్కడో అక్కడ సజీవ దృశ్యాలే….
    mee పరిచయం ,విశ్లేషణ బావుంది..

  8. దుప్పల రవికుమార్

    నేను సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో పనిచేస్తున్నప్పుడు పరీక్షలముందు పిల్లలను చదివిస్తూ, అంటరానివసంతాన్ని పూర్తిచేశాను. నేను ఆ పుస్తకాన్ని చదువుతున్నంతసేపూ కన్నీళ్లు ధారగా వస్తూంటే పిల్లలంతా చుట్టూమూగి వివరం అడిగారు. ఒకరోజు రాత్రంతా ఆ పుస్తకం గురించి నేను చెప్తున్నపుడు ఆ చిన్నారులు తమ పల్లెల్లో తమ కులపు ప్రజలను ఎంత నిర్దయగా చూసేదీ, ప్రజల మనసుల్లో ఒకనాటి అగ్రవర్ణ చాందసులు “అంటబడనితనం” అనే మకిలితనాన్నీ ఎలా నరనరానా నింపుకుని ప్రజల జీవితాలతో చెలగాటమాడుకున్నారో ఒక్కో కథా చెప్పింది. ఈ నవల ప్రభావం నుంచి బయటపడడానికి కొన్ని నెలలు పట్టింది. నిజానికి ఎలెక్స్ హేలీ రాసిన “రూట్స్” (తెలుగులో “ఏడు తరాలు”) కంటే ఎన్నో రెట్లు గొప్ప నవల ఇది. మీ పరిచయం చదివాక మనసు తడి అయింది.

  9. parimalam

    ఒకప్పుడు గతిలేక మనవాళ్ళూ పరాయిమతాలకెగ బడుతుంటే …..ప్చ్ …ఇప్పుడు స్వప్రయోజనాల కోసం స్వార్ధం తో ….
    మీ పరిచయం బావుందండీ ! అభినందనలు మురళి గారు !

Leave a Reply