జ్ఞాపకాల్లో వెంకటరత్నం
అంకురం సినిమాలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన పాట “ఎవరో ఒకరు/ ఎపుడో అపుడు/ నడవరా ముందుగా/ అటో ఇటో ఎటోవైపు” నాకు చాలా ఇష్టం. ఆ పాట ఎప్పుడు విన్నా నా ఒంట్లో ఏదో గగుర్పాటు, అలజడి మొదలవుతుంది. నన్ను దాదాపు 40 ఏళ్ళు వెనక్కి లాగి తీసుకువెళ్తుంది — నా ప్రయత్నమేమీ లేకుండానే. 1970-71 లో నేను డిగ్రీ చదువుతున్నా. నాకూ, గమ్యం తెలియని నాలాంటి చాలామందికి, వెంకటరత్నం మాటలు బాగా నచ్చేవి. అప్పుడాయన M.A. English చదివేవారు. మా యూనివర్సిటీ గాంధీజీ ఆయన.
దళసరి కళ్ళజోడు, తెల్లటి ఛాయ, చల్లటి చూపులు, మంచిమాటా ఆయన సొంతం. నిజాయితీ, నిబద్ధతా, ధైర్యం అయన సహజగుణాలు. దేశ, ప్రపంచ విషయాలన్నీ తెలిసిన మనిషి. హక్కుల నేత. మేధావి. ఆయన చుట్టూ ఎప్పుడూ పదిమందైనా వుండేవారు. ఏది చెప్పినా అందరికీ అర్థమయ్యేలా విడమర్చి చెప్పేవారు. నాకు ఆయనతో మాట్లాడేటంత పరిచయం లేదు. దూరంగా కూచుని భక్తిశ్రద్ధలతో ఆయన చెప్పేవన్నీ వినడమే నా భాగ్యం. అదే సంవత్సరం నరసింహప్ప M.A.Economics చదివేవారు. ఆయనా నాయకులే. తర్వాత IRS చేసి, పెద్దపదవిలో retire అయ్యారు. ఇద్దరూ మంచి స్నేహితులు. నరసింహప్పకు debates లో ఎప్పుడూ prizes వచ్చేవి. వెంకటరత్నం ఆ విషయమై నరసింహప్పని కదిపితే ఆయన సమాధానం: “నా ఉపన్యాసం ఎదురుగా వున్న శ్రోతలకి. వెంకటరత్నం ఉపన్యాసం లెక్చరర్లకు, ప్రొఫెసర్లకీ, నాలాంటివాళ్లకు.” Truly.
సుమారు 15 రోజులక్రితం, Prof. C. సుబ్బారావుగారు ఫోనులో మాట్లాడుతూ, “ఈ రోజు ఒక పుస్తకం ఆవిష్కరణకు వెళ్ళాను. రచయిత అనంతపురం SKUలో నా దగ్గిర research చేసేవాడు. పరిపాలనకు సంబంధించిన విషయాలపై మల్లగుల్లాలు పడుతున్న సమయమది. అంచేత సమయంలేక అతన్ని పెద్దగా పట్టించుకోలేదు. Hostel లో సమస్యలొచ్చి అతను పక్కనే వున్న ఇటికెలపల్లిలో రూము తీసుకుని వుండేవాడు” అని ఆయన ఇంకా ఏదో చెప్పబోతున్నారు. “మీరు వెంకటరత్నం గురించేనా మాట్లాడుతోంది” అన్నాను. Prof. సుబ్బారావుగారు ఆశ్చర్యపోయారు. ఎలా తెలుసని అడిగారు. “అయన్ని చూసినవాడు, అయన మాటలు విన్నవాడు అతన్నెప్పటికీ మరచిపోలేడు” అన్నాను — మనసంతా వెంకటరత్నం జ్ఙాపకాలు కమ్ముకురాగా.
తన మాటలతో, తన చేతలతో చుట్టూ వున్నవారిని వెంకటరత్నం ప్రభావితం చేసేవారు. దేశానికి దశా, దిశా నిర్దేశించగల భావుకత్వం, మానవత్వం, integrity, మేధస్సు, సాహసం, ధైర్యం వున్న మనిషి వెంకటరత్నం. హక్కుల నేతగా, మేధావిగా దేశం గర్వించే నాయకుడుగా ఎదిగేవారు. కానీ 1974లో ఇటికెలపల్లిలో వుంటున్నప్పుడు, స్నానానికని బావికి వెళ్ళిన 25 ఏళ్ళ వెంకటరత్నం తిరిగిరాలేదు. వెంకటరత్నం మరణించిన 37 సంవత్సరాల అనంతరం అతను రాసిన కథలని ఆయన మిత్రులు ప్రచురించారు — ఆలస్యానికి క్షమాపణలు చెపుతూ. పుస్తకం పేరు “మసకబారిన ప్రతిబింబాలు”. పుస్తకం అనుబంధంలో ఆయన స్నేహితుల అనుభూతులు అలరిస్తాయి. ఇందులో 16 కథలున్నాయి. అన్నీ స్వీయానుభవాలుగానే తోస్తాయి. నాకు ప్రత్యేకంగా నచ్చిన కొన్ని కథల గురించి ఈ పరిచయం.
మొదటి కథ ‘నీడలు’. రచయిత చిన్నప్పటి విషయం. దమయంతీ స్వయంవరంలో నలుడి రూపంలో వున్న దేవతలను దమయంతి కనిపెట్టింది. ఎలా అంటే, వాళ్ళకు నీడలుండవు అని అమ్మ సమాధానం. ‘మనుషులందరికీ పెద్ద పెద్ద నీడలుంటాయా?’ అని ప్రశ్న. ఔనంటుంది అమ్మ, నిట్టూరుస్తూ. పెద్దయిన తర్వాత రచయితని నీడలు వెంటాడుతాయి. సంధ్య అంటే తనకిష్టం. ఆమెక్కూడా ఇతనంటే ఇష్టమే. కానీ ఇద్దరి ఇష్టాలు ఒక్కటి కావు. ‘నేను చేరుకోవాలనే నీడ తానైతే, తాను వదిలించుకోవాలనే నీడ నేను’ అంటాడు రచయిత. అప్పుడు అమ్మ నిట్టూర్పు అర్థమైందనుకుంటాను అని రచయిత కథను ముగిస్తాడు. ఈ కథలో వస్తువు నిర్దుష్టంగా వున్నట్లు తోచదు. అందుకే శైలి ఎంతో బాగున్నా రచయిత ఏం చెప్పాలనుకున్నాడో సులువుగా అర్థం కాదు. అయినా ఏకబిగిన చదివిస్తుంది. ఇందులో అర్థంకానిదేదో వుంది అనిపిస్తుంది.
‘మసకబారిన ప్రతిబింబాలు’ రెండవ కథ. దీని వస్తువు ఒక నవలకు సరిపోయేటంత విస్తృతం. నలుగురి జీవితాలలో జరిగిన మార్పులు గురించి కథ. తనజీవితం గురించి చెపుతూ, రచయిత ఇలా అంటాడు: ‘ఆ రాత్రి బడిలో ప్రకాశం చెప్తూ వెళ్ళిపోయిన విషయాలు — వర్గచైతన్యమూ, శ్రామికశక్తీ అంటూ చెప్పుకుంటూ పోతూంటే గొంతు పూడిపోయి గద్గదమైపోయింది. ఎందుకో భోరున ఏడ్వాలనిపించింది. అవగాహనలేని వ్యాపకాలలో నన్ను ఉంచేసి, వాటిలో తనకు నమ్మకముందన్న మనిషి పారిపోయాడు…కానీ నాకు కళ్ళు తెరిపించింది అతనే…’ స్నేహం అంటే ఏమిటో, దానర్థం ఎలా మారుతుందో, స్నేహితులకి రాయాలనుకున్న వుత్తరంతో ముగుస్తుంది కథ. ఇది జైల్లో వుండగా వచ్చిన అలోచన. అదే ఈకథకు కొసమెరుపు. ఎందుకు జైలు పాలయ్యాడు అన్నది పాఠకుల వూహకే వదిలిపెట్టాడు రచయిత.
‘గొంగళీలు’ అన్నది అమర అనే అమ్మాయి, శ్రీను అనే అబ్బాయి గురించి. వాళ్లు కాలేజీలో వున్నప్పుడు ఎట్లా వుంటారు. తర్వాత బతుకుబాటలో వాళ్ల మనస్తత్వాలలో ఎలాటి మార్పులు వచ్చాయి, కొంతమంది ఎలా మానసికంగా, నైతికంగా దిగజారిపోతారో అన్నది వస్తువు. ఇందులో రచయితది పరిమితమైన పాత్ర – ప్రేక్షకుడూ, వ్యాఖ్యాతా మాత్రమే. శ్రీను వ్యక్తిత్వం గురించి రచయిత ఇలా అంటాడు: ‘ప్రకృతిలో గొంగళీపురుగు సీతాకోకచిలుకగా వయసుతో మారుతూంటే, మానవప్రకృతిలో సీతాకోకచిలుకలే బ్రతుకులో పడి గొంగళీలుగా మారుతున్నాయి.’ అమ్మాయిలో మార్పులేదు. ‘అమర జెడలో మల్లెలచుట్టూ మాత్రం రంగురంగుల సీతాకోకచిలుక ఇంకా అందమైన నృత్యంలా గిరిగిరా పరిభ్రమిస్తూనే ఉంది…’
‘భవాని’ అన్నది తన చెల్లెలి స్నేహితురాలు గురించి. ఆమెది బాగా కలివిడి మనస్తత్వం. ఒక accident లో తలకు దెబ్బతగిలిన తర్వాత కొన్ని జరగబోయే విషయాలు ముందే చెపుతూవుంటుంది (clairvoyance). ఈ విషయం చుట్టుపక్కల అందరికీ తెలిసి, ఆమె భజన మొదలెడతారు. ఆమె అస్తిత్వమే మారిపోతుంది. clairvoyance ఆమెకు శాపం. అమెకూడా ఒక మనిషని, ఆమెకూ కోరికలుంటాయని అందరూ మరచిపోతారు. పదిహేడేళ్ళ పిల్లని సమాజం ఎలా నాశనంచేసిందో అని రచయిత అసహ్యించుకుంటాడు. ఈ కథ రాయాలంటే చాలా పరిశీలన కావాలి. ఒక అమ్మాయి మనసులోకి పరకాయ ప్రవేశం చేస్తేగానీ ఇలా రాయడం కుదరదు. రచయిత పరిణితికి అద్దం పడుతుంది ఈ కథ.
‘తెరపి’ అనే కథ ఒకటిన్నర పేజీ మించిలేదు. వీరయ్యకి చావులుంటేనే భుక్తి. ఎందుకంటే శవాలు మోయడం అతని వృత్తి. వూళ్ళో జబ్బులు తగ్గి మనుషులు చావడంలేదు. ముఠా కొట్లాటలూ తగ్గి ఎవడూ ఎవణ్నీ చంపడంలేదు. ఆకలి చెడ్డది. చావులు లేవే అని దిగులు. ఆకలితో అలమటిస్తున్న కొడుకు ఎదైనా పెట్టమని అడిగితే, వీరయ్య కసురుకుని బయటికివెళ్ళి ఆడుకోమంటాడు. వాడు ఏడుస్తూ వెళ్తాడు. కాసేపటికి పక్కవీధిలో కలకలం. అదివిని వీరయ్య మొహం ఆశతో వెలిగిపోతుంది — ఎవరో చచ్చేవుంటారని, తనకి పని దొరుకుతోంది అని. ఎవరూ పోయింది అని అట్నుంచి వస్తున్న అతన్ని అడిగితే — ఎవడో పిల్లవాడు, వడదెబ్బకి చచ్చిపోయాడు అని చెప్తాడు. కథలో ఒక్క అక్షరంకూడా మార్చడానికి వీల్లేనంత పొందికగా అల్లిక. ఈ కథని చదివినవెంటనే చాసో గారు గుర్తుకువచ్చారు.
‘నిప్పు’ అన్న కథ విశిష్టమైంది. రచయిత అప్పుడే వుద్యోగంలో చేరుతాడు. స్వయంపాకం. రెండురాళ్ళ పొయ్యి. ఓ ముసలి బిచ్చగత్తె వంటకోసం నిప్పు కావాలని వస్తుంది — ప్రతి రోజూ. రచయిత ఇస్తాడు. తనకు మొదటినెల జీతం రాగానే రచయిత కిరోసిన్ స్టొవ్ కొంటాడు. పొయ్యి రాళ్ళు తీసేస్తాడు. ముసల్ది రోజూ మాదిరే నిప్పుకోసం వస్తుంది. నిప్పు లేదు. ఎలా? ముసలామె డబ్బాలో నిప్పు కణికలు బదులు కిరోసిన్ పోస్తాడు. ముసల్ది నిరాశగా ‘నాక్కాస్తంత నిప్పెట్టలేవా బాబూ?’ అంటుంది. ముసలామె వెళ్ళిపోతుంది. గుడిసె తగలబడి పోయింది. అంటే ఆమెకు కిరోసిన్ తో వండుకోవడం తెలీదు. ముసలామె చచ్చిపోతుంది. ఆమె శవానికి రచయిత నిప్పెట్టుతాడు. పాఠకుల మనసు కకావికలం అవుతుంది. ఏదో తెలియని నిస్పృహ ఆవహిస్తుంది. కథ చదివిన తర్వాత చాలా సమయం ముసలామె ‘నాక్కాస్తంత నిప్పెట్టలేవా బాబూ?’ మాటలు మనల్ని వెంటాడుతాయి.
ఇంకో మంచి కథ ‘జాలికళ్ళ స్వార్థం’. ఒకతను గుడ్డివాణ్ణి అని చదువుకు సాయం అడుగుతుంటాడు. కానీ అతను గుడ్డివాడు కాదు. అది పసికట్టి, రచయితా అతని మిత్రులు అతన్ని corner చేస్తే అతను తన అవస్థను చెప్తాడు. కంట్లో పువ్వు వచ్చి స్కూల్ ఫైనల్ లో చూపు పోతే అందరూ అతనికి సాయం చేస్తారు. B.A. అవుతాడు. అందరూ సాయంచేస్తే వైద్యం చేయించుకుంటాడు. చూపు వస్తుంది. సాయం ఆగిపోతుంది. ఉద్యోగం దొరకదు. కిం కర్తవ్యం? బతుకుతెరువుకోసం గుడ్డివాడుగా మసలుతాడు. కూడూ గుడ్డా సమకూరుతుంది. అందరూ గుడ్డివాడికి ఎందుకు సాయం చేస్తారో ఆ కళ్ళున్న అతను చెప్పేఈటెల్లాంటి మాటల్ని వినండి: ‘కళ్ళులేని వాడిపట్ల చూపించే జాలి తమకు కళ్ళు వున్నాయన్న స్థైర్యం ఇస్తుంది. అహం ఇస్తుంది. జాలి ఒకరకమైన స్వార్థం బాబూ.’ అతను చెప్పింది కట్టుకథా? కావచ్చు. నిజమూ కావచ్చు. ఇందులో నాకు చాసో గారి కథ ‘ఎంపు’ ఛాయలు కనిపించాయి.
రచయిత కొన్నాళ్ళు అప్పటి NEFA (ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్) లో లెక్చరర్ గా పనిచేశాడు. ఆ అనుభవాలు రెండు కథలయ్యాయి. ఒకటి ‘ఆడటిమి’. రెండోది ‘కాక్ టైల్ పార్టీ’. ‘ఆడటిమి’ కథ అరుణాచల్ ప్రదేశ్ జనజీవనానికి, వారి సాంప్రదాయాలకి, వారి free spirit కి అద్దం పడుతుంది. ఈ కథల సంపుటిలో ఉన్న వైవిధ్యం అబ్బురపర్చుతుంది. మూడు కథల్ని తప్పిస్తే మిగతావన్నీ దేనికవే. కథల్లో అప్పుడప్పుడూ రచయిత వ్యాఖ్యానాలు చేస్తారు. కథకు మూలం స్వానుభవమయితే ఇది తప్పదు. ఈ కథలు నలభై ఏళ్ళ నాటివి. కాలదోషం అంటలేదా అన్న ప్రశ్న చాలా సహజం. మళ్ళీ కథలు చదివాను. నాకైతే సమకాలీనం అనే అనిపించాయి. పుస్తకంలో వెంకటరత్నం గేయాలను కథలో అంతర్భాగంగా తప్పితే ప్రచురించలేదు. గేయాలను విరివిగా రాసేవుంటారు. ఇది కథల సంపుటే అయినా గేయాలకోసం ఇంకో పుస్తకం కష్టం. కాబట్టి ఇందులోనే వెంకటరత్నం గేయాలను ప్రచురిస్తే బాగుండేదేమో. ‘జాలికళ్ళ స్వార్థం’ కథలో రచయిత గేయం ఇది:
గడ్డి పువ్వును త్రుంచాను
ముక్కు దగ్గర పెట్టుకున్నాను
వాసన లేదు.
అందులో వుండదని తెలుసు
మళ్ళీ మొక్కమీదే పెట్టేశాను
అక్కడ వుండదని తెలుసు.
పుస్తకం చక్కగా, అచ్చుతప్పుల్లేకుండా ముద్రించారు. లేటుగా అయితేనేం వెంకటరత్నం స్నేహితులు చాలా మంచిపని చేశారు. వారికి అభినందనలు.
పుస్తకం వివరాలు:
మసకబారిన ప్రతిబింబాలు – కథా సంకలనం
రచయిత: టి. ఎస్. వెంకటరత్నం
ముద్రణ: మార్చి 2011
ప్రచురణ: ఎమెస్కో
ధర: Rs. 30
Leave a Reply