ఎప్పుడూ వీచే కమ్మతెమ్మెర- కథాన్యాయం!

వారణాసి నాగలక్ష్మి గారి కథా సంపుటి “ఆసరా”కి ముందుమాటగా ప్రముఖ సాహితి విమర్శకులు విహారి గారు ఇలా రాసారు.

* * *

శ్రీమతి నాగలక్ష్మిగారు లబ్ధప్రతిష్ఠురాలైన కవయిత్రి, రచయిత్రి, చిత్రకారిణి. మంచికథలూ, పాటలూ, గేయాలూ రాసి ప్రముఖుల ప్రశంసల్నీ, సన్మాన సత్కారాల్నీ పొందారు. మూడుసార్లు యూనివర్శిటీ ఫస్ట్ రాంక్ సాధించిన ఉత్తమ విద్యార్థిని. కథారచయిత్రిగా చాలా కథలకి బహుమతులు పొందిన విదుషీమణి.

ఈ సంపుటి నాగలక్ష్మిగారి రెండవ కథా సంపుటి.

తన కథల ద్వారా నాగలక్ష్మిగారు ఏం చెప్తున్నారు అని విచారించినప్పుడు నాకు గురునానక్ సూక్తి గుర్తుకొచ్చింది.

‘కూప్ నీరు బినా, ధేను క్షీర్ బినా,
ధరతీ మేఘ్ బినా, జైసే తరువరు ఫలబిన హీనా
తైసే ప్రాణి ప్రేమ్ అనురాగ్ బినా!’
అంటాడాయన. అవును నీరులేని బావిలా, పాలివ్వని గోవులా, వర్షమెరుగని భూమిలా, ఫలాలివ్వని చెట్టులా, ప్రేమానురాగాలులేని మనిషి జీవితం కూడా వృధామాత్రమే. అది విస్సారమైనది అవుతుంది.

నాగలక్ష్మిగారి కథాంతర్దర్శనం చేస్తే, పూసల్లోని దారంలా ఈ సందేశం అందుతుంది, కనిపిస్తుంది. పచ్చదనం, పర్యావరణం, భావస్పందనలు, మానవీయ భవనలు, మంచితనం పట్ల మనిషితనం పట్ల ఆరాధనాభావం- ఇవన్నీ ఉన్న బుద్ధిజీవిగా – ఆమె వ్యక్తిత్వం ఆమె రచనల్లో ద్యోతకమవుతోంది.

‘కథలు సందేశాత్మకంగా ఉంటే మంచిదే. సందేశం లేకపోయినా సామాజిక బాధ్యతని విస్మరించేలా ఉంటే మాత్రం అవి ఎంత వాస్తవికంగా ఉన్నా మంచి కథలు కాలేవని నా అభిప్రాయం’ అని తమ నిబద్ధతని చెప్పుకున్నారు నాగలక్ష్మిగారు. నిజానికి, సామాజిక ‘బాధ్యతాయుత’మైన రచన వాస్తవంగానూ ఉంటుంది, సందేశాత్మకంగానూ ఉంటుంది కదా! రచయిత్రిగా తన నిబద్ధతకి అనుగుణమైన కథల్నే రాశారు నాగలక్ష్మిగారు.

సంపుటిలోని కొన్ని కథల్ని మాత్రం పరామర్శిస్తాను.

‘అమృతాన్ని సాధించు’ కథకి ఉగాది కథల పోటీలో ప్రథమ బహుమతి లభించింది. ఒక అగ్రవర్ణ యువతిని ప్రేమించి పెళ్ళిచేసుకున్నాడు ఒక అథోజగత్ సహోదరుడు. ఏ కులవ్యవస్థవల్ల అతను తిరస్కారానికి గురయ్యాడో ఆ కులాన్నే పట్టుకు వేళ్ళాడుతూ, ఆ యువతి జీవితాన్నీ, తన జీవితాన్ని దుఃఖభాజనం చేశాడు. ఇదీ ప్రధాన ఇతివృత్తం. ఈ ఇతివృత్తానికి బలం చేకూరుస్తాయనుకున్న ఇతర ఉపాఖ్యాన స్పర్శతో- కథాపరిధిని గీసుకున్నారు రచయిత్రి. ఈ కారణాన కథలో కొంత కన్‌ఫ్యూజన్‌ని చూశారు కొందరు చదువరులు. నెట్‌లో చర్చ జరిగింది. కథకు తన దృక్పథాన్ని ప్రోది చేయటానికి చేసిన ప్రయత్నంలో భాగంగా రచయిత్రి ఈ ‘అదనపు తునకల్ని’ కూడా కథలో సమ్మేళనం చేశారు. అయితే, ఈ కథౌన్నత్యం- దాంపత్య జీవన సాఫల్యానికి సామరస్యం వినా గత్యంతరం లేదనే ధ్వనిని సూచించటంలో వుంది. కనుక, దీన్ని మనం వాంఛితార్థంగా స్వీకరించాలి. అందుకని నేనీ కథని లక్ష్యశుద్ధికల కథగా భావిస్తున్నాను.

Female infanticide ప్రధానాంశంగా కలిగిన కథ ‘రేపటి ప్రశ్న.’ ’70మంది పురుషులకు తొమ్మిదిమంది ఆడవారు’ అనే వార్త వాస్తవంగా దేశం ముందుకు రావటానికి ముందే నాగలక్ష్మిగారీ కథని రాశారు. ‘సమాజమే రోగగ్రస్తమైతే ట్రీట్ మెంట్ ఎవరివ్వగలరు?’ అనే ప్రశ్నతో ముగుస్తుంది కథ! ఆలోచనీయమైన శేషప్రశ్న. ఈ కథాంశానికి మరో అనుబంధ పార్శ్వంగా ‘చిన్నబోదా చిన్నప్రాణం’ అన్న కథ వచ్చింది.

‘ఆసరా’ కథ. ఇంటర్నెట్ నిర్వాహకులు అమాయక యువతీ యువకుల్ని ఎలా ట్రాప్ చేసి, బ్లాక్ మెయిల్ చేసి, వారి మానప్రాణాలతో చెలగాటమాడుతున్నారో చిత్రించారీ కథలో. అలాంటి దారుణాలకు ఆత్మహత్యలే శరణ్యంగా భావించేవారికి ‘ఆసరా’ ఆవశ్యకతని సందేశాత్మకంగా కథాగతం చేశారు రచయిత్రి.

ఇక ఈ సంపుటి మొత్తంలో ఒక అతిగొప్ప కథ వుంది. అది ‘సంధ్యారాగం.’ హాస్టల్‌లో వుండి చదువుకుంటున్న కాలేజ్ స్టూడెంట్ సావేరి. ఒక దుర్మార్గుడి దౌష్ట్యానికి బలి అయింది. ఆత్మహత్యకి పాల్పడింది. ఆ ప్రయత్నంనుంచీ ఆ యువతిని కాపాడి ఆమెలో అనన్య సామాన్యమైన రీతిలో- తనదైన వాక్ చాతుర్యంతో, నిఖార్సయిన ‘కన్‌సర్న్’ తో స్నేహితురాలిలో ఆత్మస్థైర్యాన్నీ, ఆశాశ్వాసనీ ఊదుతుంది- సుమేధ. సావేరి రూంమేట్ ఈమె. ఈ సుమేధ పాత్ర పోషణ కథకులకు ఒక ‘పెద్దబాలశిక్ష’ అంటాన్నేను! అలాగే, రచయిత్రి గడుసుదనం, కథనచాతుర్యం, సావేరికి జరిగిన అసలు దౌష్ట్యం ఏమిటో చెప్పకపోవటంలో వుంది! గొప్ప కథాశిల్ప పరిణతి. అలాగే, సావేరిని సమీర్‌కి దగ్గర చేయటం కథావసరంగా రాణించింది (ఆ దౌష్ట్యానికి పాల్పడింది ఈ సమీర్ కాదు. జాగ్రత్త!). ఈ కథలో మరో ఆకర్షణ సాధారణ పాఠకుడికి అందగా తెలియని ‘హాట్ ఎయిర్ బెలూనింగ్’ ప్రయాణం చూపటం! అమెరికాలోని ఇతర సాహస క్రీడల్ని ఉటంకించటం కూడా సందర్భోచితంగా ఇమిడిపోయింది.

ఈ కథకి దాదాపు సాటిగా, దీటుగా నిలిచే మరో గొప్పకథ-‘గోడమీది బొమ్మ.’ పసిపాపలూ, చిన్నపిల్లలూ పాత్రలుగా తయారయ్యే సినిమాలకు ఆ పిల్లల్ని అందజేసే తల్లిదండ్రుల స్వభావాల్లోని, మానసిక స్థితిలోని- బొమ్మా బొరుసుల్ని అద్భుతంగా ఆవిష్కరించిన కథ ఇది. ఒక తల్లి ఆవేదన, ఒక తండ్రి ఆలోచన- ఈ రెంటి నడుమ జనించే సంఘర్షణకి రూపకల్పన చేశారు రచయిత్రి. తల్లి పేగు క్షోభని ఆర్ధ్రంగా, సంభావ్యతతో అక్షరీకరించారు. సంఘటనాత్మక శిల్పంతో భాసించిన మంచి కథ ఇది. తండ్రి insensitivity కి మూలాన్ని (డబ్బు) విశ్లేషించి, ధ్వన్యాత్మకంగా వ్యాఖ్యానించారు రచయిత్రి.

మానవ సంబంధాల్లోని వైరుధ్యాల్నీ, తరాల అంతరాల్నీ చిత్రికపడుతూ రాసిన ‘మేఘన’, ‘ఒక ప్రేమలేఖ’ వంటి మంచి కథలూ వున్నాయి. ‘సెంటిమెంట్’ అధిక్షేపకథ అయితే, ‘శ్యామాగోపాళం’ బాపూరమణల టైపు సరదా సరదా కథ!

కథలన్నిలా వైవిధ్యంతోపాటు, సామాజిక బాధ్యతా స్పృహా ద్యోతకమవుతున్నాయి (అన్నిటి గురించీ చెప్పటం భావ్యం కాదు).

నాగలక్ష్మిగారి కథలకి ఒక అంతర్గతబలం వుంది. అది అపూర్వమైనది, అపురూపమైనది. నాకెంతో ఎంతో మక్కువైనది. అదేమంటే, ఆమె ఎన్నుకున్న కథాంశాలన్నీ most upto date social issues. అలాగే అన్నీ Current burning topics! ఇతరులు ఇంతకు ముందు ఇంత గాఢంగా స్పృశించినవి. ఇదీ విశేషం! నాగలక్ష్మి గారికి ప్రత్యేక అభినందనలు!

ఈ విశేషానికీ, ప్రత్యేకతకీ మెరుపునిస్తున్నది- రచయిత్రి సాధించుకున్న అభివ్యక్తి, సారళ్యత. కథ ద్వారా తాను చెప్పదలుచుకున్న అంశం మీదే ఆమె శ్రద్ధ. సరళంగా కథ చెప్పటమన్న సంవిధాన ఫణితిని కైవశం చేసుకున్నారామె. అందువలన నాగలక్ష్మిగారి కథలు చక్కటి చదివించే గుణంతో భాసిస్తున్నాయి.

తాను రాసిన వాటిలో ఎక్కువ కథలకి బహుమతుల్ని పొందటం కన్నా రచయితకి ఆనందం ఏముంటుంది? ఈ ఆనందాన్ని నాగలక్ష్మిగారు ఇంకా ఇంకా పొందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ఆమె కథా రచనా కృషి మరింత వేగవంతమై, చైతన్యవంతంగా పురోగమించాలని కోరుకుంటున్నాను!

పూర్వ పరిచయం లేకున్నా నన్నీ నాలుగు మాటలు చెప్పమని కోరిన నాగలక్ష్మి గారి సౌజన్యానికి నమోనమః!

విహారి

* * *

ఈ పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మీ కాపీని నేడే సొంతం చేసుకోండి.

ఆసరా On Kinige

(నాగలక్ష్మి గారిపై ఇదివరలో పుస్తకం.నెట్లో వచ్చిన సి.బి.రావు గారి వ్యాసం ఇక్కడ చదవండి)

You Might Also Like

6 Comments

  1. నాగలక్ష్మి

    ఇందిర గారు
    మీ స్పందన ఇప్పుడే చూసాను.Thank you! జవాబివ్వడంలో చేసిన ఆలస్యానికి Sorry.నా పుస్తకాలు విశాలాంధ్ర,నవోదయలో దొరకడం లేదని ఈ మధ్యే తెలిసింది.మళ్ళీ స్టాక్ ఇచ్చి వచ్చాను.పుస్తక ప్రదర్శనల్లో కూడా ఒక్కొక్కసారి రచయితలు ప్రత్యేకించి చెపితే గాని పుస్తకాలు ప్రదర్శనకు పెట్టడం లేదు.
    ఇప్పుడు kinige.org లో డిజిటల్ గానూ,విశాలాంధ్ర,నవోదయ,హిమాలయ పుస్తక కేంద్రాల్లో print version గానూ దొరుకుతుంది.రెడీ గా లేకుంటే అడిగి తెప్పించుకోవచ్చు.రచయితలకు ,చదువరులకూ మధ్య బుక్ distributors చేసే సమన్వయం సరిగా లేకపోతె రచయిత శ్రమ వృధా అవుతుంది!

  2. bhasker.koorapati

    viharari gari review is very good. nagalakshmi garu is essentially a powerful story writer n she has no retreat. she is metear star that penetrates into d sky of literature. i read all stories in aasara n her mundumata about kaaraa maastaaru is touchy. her stories in it r fine master pieces. as a photograper n literary student i am proud of having been in touch with such literary giants.
    hats off to nagalakshmi garu n she will have many such red letter days in her literary career.
    bhasker.k

  3. DR RAVINDRA KUMAR

    ANTAMANCHI VISLESHANA ICHCHARU VIHARIGARU. NENU ANUKUNNAVI, NAKU TOCHINAVI KANIVI CHALA VISHAYALU VIHARIGARU CHEPPARU.IT IS A COMPLETE ASSESSMENT. DR RAVI

  4. శారద

    ఆవిడ నా అభిమాన రచయితల్లో ఒకరు! తప్పక పుస్తకాన్ని కినిగెలో అరువు తెచ్చుకునో, కొనుక్కునో చదువుతాను. మంచి పరిచయానికి ధన్యవాదాలు.
    శారద

    1. Varanasi Nagalakshmi

      శారద గారికి,రవీంద్ర కుమార్ గారికి,భాస్కర్ గారికి హృదయ పూర్వక ధన్య వాదాలు!ఆలస్యంగా మీ అభిప్రాయాలు చదవడంతో వెంటనే స్పందించలేకపోయాను. మన్నించాలి.సహృదయులై విజ్ఞులైన పాఠకుల స్పందన రచయితకెంతో ప్రోత్సాహాన్నిస్తుందన్నది అందరికీ తెలిసిన విషయమే. సమయాన్ని వెచ్చించి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు అనేక కృతజ్ఞతలు!

    2. indira

      నాగలక్ష్మి గారు,నమస్తె.మీ ఆసరా కధల సంపుటిని మిత్రులొకరు ఇవ్వగా చదివాను.ఇంతకు ముందు ప్రేమతో పెద్దత్త అనే కధ ద్వారా మీరచనలంటే నాకెంతో అభిమానం.అది అచ్చు మా ఇంటి కధే అని అనిపించింది.ముఖ్యంగా ఈ ఆసరా అనే కధ నన్ను చాలా రోజులు వెంటాడింది.కౌమారదశ లో పిల్లలు ఈకాలంలో రకరకాలైన ప్రలోభాలకు లోనై తప్పులుచేసి అవి దిద్దుకోవడానికి మార్గం తోచక పసిమొగ్గల్లాగా రాలిపోతున్నారు.వీరికి సరైన ఆసరా ఎంత ఆవశ్యకమో మీరు చాలా బాగా వ్రాశారు.మీకు నాహృదయపూర్వక అభినందనలు.ఈ పుస్తకం విశాలాంధ్ర లో గానీ బుక్ ఫేర్ లో గానీ దొరకలేదు.దొరకగలచోటు మీరేమైనా చెప్పగలరా?

Leave a Reply