స్వఽస్తితేఽస్తు అను సంస్కృతపఠనము
రాసిన వారు: రాకేశ్వరరావు
***************************
ఈ మధ్యన సంస్కృతపఠనములో నిమఘ్నమైయున్నాను। సంస్కృతము నేర్చుకోవడము మొదటిలో చాలా కష్టతరమని అనిపించినా, అప్పుడప్పుడూ సంస్కృతం వింతగా దోచినా (ఉదా- నాకు మంచిఁజేయి, నీవు ప్రసన్నుడవుకమ్ము అంటే వింతగా లేదూ) అలవాటయిన కొద్దీ తేలికగాననిపిస్తుంది। వింతగా కూడా అనిపించడం మానేసి, అప్పటి జనుల సంభాషణాతీరును అభినందించడం మొదలవుతుంది। ఏదేమైనా ఈ వ్యాకరణ దురితకాననములఁ బడి హయ్యో అని నడుస్తూంటే అప్పుడప్పుడూ ఇటువంటి మంచి పాఠములు తగిలి, ఇందుకుగా మనము నేర్చఁబూనినది అని గుర్తుకువచ్చి సంతోషము కలుగుచుండును। సంతోషము పట్టక ఆదర్శములు ప్రక్కనఁబెట్టి మీతో పంచుకొన టపాచేయడము జరిగినది।
మా కాలిఫోర్నియ దేశములో మా ఇంటిదగ్గరలోనే తోటి యోగసాధకులు భైరవీభక్తులు వున్నారు భైరవీకృపచేఁ। వారి దూర్వాణిసంఖ్య గ్రహించుచూ నేను ఇంటి పేరు అని అడుగగా సాత్వలేకర్ అన్నారు। నేను పండిత శ్రీపాద దామోదర సాత్వలేకర్ మీకు తెలుసునా అని అడిగాను। ఆయన వేంటనే ఆయన మా ప్రపితామహులు అని చెప్పారు। నాకు ఏమి మాయ అనిపించింది। నేను ఎంతో కాలముగా ఆంధ్రలిపిలో సంస్కృతము నేర్చబూనుకొని తగు పుస్తకముల కొఱకు వెదుకుచుండనా, ఇక లాభము లేదనిపించిన తరుణమున, కోఠిలోని సంస్కృతప్రచారసభ వారి అంగడి యందు సాత్వలేకరువారి సంస్కృత పాఠమాలా పుస్తకములు దక్కినవి। సంస్కృతమనగా అనేకము బట్టీయము వేయాలని విద్యార్థలు జడుచుట గలదు। కానీ సాత్వలేకరులు మెల్లగ మెల్లగా పరిచయము చేసి, వేగమును బెంచుకుంటు వచ్చి, చాలా సార్థకమగు పద్ధతిలో స్వబోధనాగ్రంథాలను రచించినారని చెప్పకతప్పదు। పద్మభూషణమ్ అందుకున్న పండితులు। ఆయని ఈ పాఠమాలను ఇరువది నాలుగు భాగములుగా రచించిరి। ఆ ఇరువది నాలుగు భాగములను ఎనిమిది పుస్తకములుగా అచ్చువేసిరి। పుస్తకమునకు రెండు లేదా మూఁడు లేదా నాలుగు భాగముల చప్పున। పూర్తితతిని ఎవరోగాని కొనరుగా, అయిన ఆ కొన్న నేను, ప్రతి పౌర్ణమికి వారి వంశీకుని ఇంటికే పూజకు వెళ్ళడం ఎంత ఆశ్చర్యకరము!
నా ఉద్ధేశమున స్వయముగా సంస్కృతము నేర్చదలచిన వారికి, ప్రత్యక్షగురువు కొఱవడిన ప్రవాసులకు ఇవి సరస్వతీప్రసాదములు। మా కాలిపోర్నియా దేశమున మాకు ప్రత్యక్షసంస్కృతయోగాదిగురువుల కొఱత లేకున్ననూ ఈ పుస్తకములు ఎంతో ఉపయోగపడినవి। కానీ, ఇంతటి గొప్ప పుస్తకములు లభించుట ఇంత కష్టమగుట, ఆంధ్రదేశమున కేవలము ఒక అంగడిలోనే అవి యుండట, పుటపుటకునూ అక్షరదోషములుండుట నేటి సంస్కృతాంధ్రసాహిత్యాదరణా యొక్క హీనస్థితికి అద్దము పట్టుచున్నది। ప్రచురణకర్తలు కనీసమామాత్రము సరిఁజేతురని ఆశించగలము। పాఠమాల అమరిక ఈ ప్రకారముగా గలదు।
౧,౨,౩ భాగములందు సాధారణపరిచయము
౪ సంధివిచారణ
౫,౬ విశేషపరిచయము
౭,౮,౯,౧౦ పుంలింగ స్త్రీలింగ నపుంసకలింగ శబ్దపరిచయము
౧౧ సర్వనామరూపములు
౧౨ సమాసవిచారణ
౧౩, ౧౪, ౧౫, ౧౬, ౧౭, ౧౮ ధాతువిచారణ
౧౯, ౨౦, ౨౧, ౨౨, ౨౩, ౨౪ వేదపరిచయము
మచ్చుకకు ఈ క్రింది శ్లోకములు ఆ పాఠమాలనందునవి। ఆ పుస్తకముల తెలుఁగు సేత చేసినవారు గడ్డమణుగు మోహనరావు గారు। వారి తెలుఁగు భావమును ఒకటీ అరా చిన్న మార్పులు మినహాయించి యథాతథము ఇచ్చితిని। సంస్కృత అన్వయమునకు తెలుఁగు భావము ప్రతిపదార్థము తెలుపురీతిన ఈయబడినది।
॥మహాభారతము వనపర్వము(౩) ౧౫౧ అధ్యాయము॥
భీమసేనస్తు తద్వాక్యం శ్రుత్వా తస్య మహాత్మనః ।
ప్రత్యువాచ హనుమన్తం ప్రహృష్టేనాన్తరాత్మనా ॥ ౧౨
అన్వయము – భీమసేనః తు తస్య మహాత్మనః తత్ వాక్యం శ్రుత్వా, ప్రహృష్టేన అన్తరాత్మనా హనుమన్తం ప్రతి ఉవాచ॥
భావము – భీమసేనుఁడు ఆ మహాత్ముని ఆ వాక్యము విని, సంతోషించిన హృదయముతో హనుమంతుని ఉద్ధేశించి పలికెను॥
కృతమేవ త్వయా సర్వం మమ వానరపుఙ్గవ।
స్వఽసి తేఽస్తు మహాబాహో కామయే త్వాం ప్రసీద మే॥ ౧౩
అన్వయము: (హే) వానరపుఙ్గవ। మమ (కార్యం) సర్వం త్వయా కృతం ఏవ । (హే) మహాబాహో। తే స్వఽస్తి అస్తు। త్వాం కామయే । మే ప్రసీద। ప్రసన్నః భవ॥
భావము:ఓ వానరపుఙ్గవ। నా కార్యమంతయు నీచే చేయఁబడినదే। ఓ మహాబాహు। నీకు మేలు కలుగుగాక। నిన్ను కోరుచున్నాను। నాకు మేలుసలుపు। ప్రసన్నుడవు కమ్ము॥
*వానర-పుం-గవ = కోతి-మగ-గొడ్డు = కపి-శ్రేష్టము
సనాథాః పాణ్డవాః సర్వే త్వయా నాథేన వీర్యవాన్।
తవైవ తేజసా సర్వాన్విజేష్యామో వయం పరాన్॥౧౪
అన్వయము: (హే) వీర్యవాన్। త్వయా నాథేన సర్వే పాణ్డవాః సనాథాః। వయం సర్వాన్ పరాన్ తవ ఏవ తేజసా విజేష్యామః॥
భావము: ఓ వీర్యవంతుడా। నీ నాథత్వముచే పాణ్డవులందరు సనాథులు। మేము సకలశత్రువులను కేవలము నీ తేజస్సుచే జయించగలము॥
ఏవముక్తస్తు హనుమాన్భీమసేనమభాషత।
అన్వయము:ఏవం ఉక్తః తు హనుమాన్ భీమసేనం అభాషత।
భావము:ఇట్లు చెప్పబడిన హనుమంతుఁడు భీమసేనునకు చెప్పెను।
భ్రాతృత్వాత్సౌహృదాచ్చైవ కరిష్యామి ప్రియం తవ॥౧౫
చమూం విగాహ్య శత్రూణాం పరశక్తి సమాకులామ్।
యదా సింహరవం వీర కరిష్యసి మహాబల॥౧౬
తదాఽహం బృంహయిష్యామి స్వరవేణ రవం తవ।
విజయస్య ధ్వజస్థశ్చ నాదాన్మోక్ష్యామి దారుణాన్॥౧౭
శత్రూణాం యే ప్రాణహరాః సుఖం యేన హనిష్యథ।
అన్వయము:భ్రాతృత్వాత్ సౌహృదాత్ చ ఏవ తవ ప్రియం కరిష్యామి।
భావము:భ్రాతృత్వము స్నేహము వలననే నీకు ప్రియమైనది చేయుదును।
అన్వయము:(హే) మహాబల। (హే) వీర। పరశక్తిసమాకులామ్ శత్రూణాం చమూం విగాహ్య
భావము:ఓ మహాబలవీరుడా। పరులశక్తితో నిండిన శత్రువుల సైన్యమున జొచ్చి
అన్వయము:యదా సింహరవం కరిష్యసి, తదా అహం స్వరవేణ తవ రవం బృంహయిష్యామి।
భావము:ఎపుడు సింహరవము చేయుచున్నావో, అప్పడు నేను నా రవముచే నీ రవమును బిగ్గఱఁజేయుచున్నాను।
విజయస్య ధ్వజస్థః చ దారుణాన్ నాదాన్ మోక్ష్యామి, యే శత్రూణాం ప్రాణహరాః॥
భావము:అర్జునుని టెక్కెముపైనిల్చు నేను దారుణమైన నాదములు విడువగలను, అవి శత్రువుల ప్రాణహరములు॥
అన్వయము:యేన సుఖం హనిష్యథ॥
భావము:దానిచే సుఖముగా (శత్రువులను) హతమార్చుచున్నావు॥
*ఆపటే నిఘంటువున సమాకులమ్ అని వుంది, నాకు సమాకులామ్ సరియని తోచుచున్నది।
ఏవమాభాష్య హనుమాంస్తదా పాణ్డవనందనమ్। ౧౮
మార్గమాఖ్యాయ భీమాయ తత్రైవాన్తరధీయత॥౧౯
అన్వయము:హనుమాన్ తదా పాణ్డవనందనం ఏవం ఆభాష్య, భీమాయ మార్గం ఆఖ్యాయ, తత్ర ఏవ అన్తరధీయత॥
భావము:హనుమంతుడు అపుడు పాణ్డవనందనునకు ఇటులఁ జెప్పి, భీమునకై మార్గముఁ దెలిపి, అచటనే అంతర్థానమయ్యను॥
-=-
ఎంత అద్భుతముగా అన్నయ్య మఱియు నెయ్యడునగు భగవంతుఁడు, నీవే నాథుఁడవని పలికిన భక్తునకు తమ్మునకు, అభయమిచ్చుచున్నాడో కదా। నీవు నాదము చేయుము, దానికి నేను నా దారుణమైన నాదమును జోడించగలను అని మానవకృషికి దైవానుగ్రహము జతఁ బంపుచున్నాడు। భీమసేనుఁడు సైతము అఖండమైన భక్తి చూపుచున్నాడు। ఓ వానరశ్రేష్టా, నీవే నాకు అన్నియునూ చేసితివి, నీ నాథత్వమున మేము అనాథలు కానేరము, కేవలము నీ తేజముతోడనే మేము శత్రువులను జయించుచున్నాము అని పూర్తిగా నిరహంకారియై భగవచ్ఛక్తిని స్తుతించుచున్నాడే। అంతటి భక్తికిని, నీవు చేసే సింహనాదమునకు నేను నా దారుణమైన గోలను జేర్చిన దానికే శత్రువు ౘత్తురని నిక్కచ్చిగాఁ దెల్పుచున్నాడు హనుమయ్య।సంస్కృతము రాని వారు సైతము బృంహయిష్యామి స్వరవేణ రవం తవ అటులనే నాదాన్మోక్ష్యామి దారుణాన్ అని వినగానే ఈ ఈదరచూలులు ఏదో భీభత్సము చేయబోచున్నారే అని తలంపక తప్పదు। కేవలము వారు చేసెడి ౘప్పిటిచేతనే శత్రువులు ౘచ్చుచున్నారే। అందునా భగవంతుఁడు సుఖముగా శత్రుసంహారము గావింపగలవని ధీమా యిచ్చుచున్నారే। పాండవుల రాజ్యార్హతలు నాకు ప్రస్ఫుటముగా గోచరము గావు గాని, భగవంతుడు ధ్వజముపై వట్టిగా కూర్చున్న పక్షాన, భగవంతుడు ఆయుధము విడచి కేవలము పగ్గము పట్టిన పక్షాన గెలుపు చేరకతీఱునా। గెలిచిన గెలుపు పాండవబీడే అయిన నేమి, భగవద్భక్తిని మించు సిరిగలదే, ఆయన సల్పు అభయము మించు రక్షణ గలదే॥
Srinivas Vuruputuri
ప్రతి జనవరీ ఒకటో తేదీ నాడు నా సంస్కృతం చదువుని అటకనుంచి కిందికి దించి, ఒకట్రెండు నెలల తరువాత మళ్ళీ పైకెక్కించటం నేను నిష్ఠగా పాటిస్తున్న ఆచారం! 🙂
గడ్డమణుగు మోహనరావు గారి పుస్తకాల సెట్టు నా దగ్గర ఉంది. అచ్చు తప్పులను, గ్రాంథిక భాషనూ దాటుకొని ఓ పది భాగాలైనా చదివి ఉంటాను. శబ్దాలను, సంధులను, సమాసాలను దాటుకొని, ధాతు పాఠాల దాకా వచ్చే సరికి నా ఓపిక హరించుకుపోయింది. చిక్కెక్కడా అంటే, వల్లె వేయటం పట్ల నాకున్న అయిష్టతలో… సంస్కృతం నేర్చుకోవాలన్న పట్టుదల కన్నా భట్టీయం లేకుండా సంస్కృతం నేర్చుకోవాలన్న మొండి తనం ఎక్కువయ్యింది నాకు. 🙂
ఈ పుస్తకాల కన్నా భండార్కర్ గారి ఫస్ట్ బుక్ ఆఫ్ సాన్‌స్క్రిట్ నుంచి ఎక్కువ నేర్చుకున్నానేమో…(రెండో పుస్తకం దాకా వచ్చేసరికి విఘ్నాయాస సంత్రస్తుడినై చతికిల పడిపోయాను). ప్రస్తుతానికి, కర్మణి ప్రయోగాల మీద పడుతూ లేస్తూ చందమామ కథలు చదివేంత నేర్చుకున్నాను, అంతే.
ఈ స్వాధ్యయన పాఠ మాల మాటకొస్తే….
1. భాష గ్రాంథికం కావటం వల్ల నన్ను అట్టే ఆకట్టుకోలేకపోయాయీ పాఠాలు.
2. ఓ నలభయ్యేళ్ళ నాడు రాసిన పాఠాలివి. ఆ తరువాత కాలంలో భాషా బోధనా పద్ధతులు మారి ఉంటాయేమో అన్న అనుమానం ఇంకా ఉంది నాలో.
సురేశ్
రాకేశ్వర: “సంస్కృతపఠనములో నిమఘ్నమైయున్నాను” అనుట నీవు ఎంత గాఢముగా సంస్కృత పఠనమున నిమగ్నుడవైనావో చెప్పుటకొరకు కాబోలు. ఈ పొత్తమును మా యట్లాంటా నగరమునకు దెప్పించుకొనుట ఎట్లో?