సిరివెన్నెల తరంగాలు
“సిరివెన్నెల తరంగాలు” గురించి నాకొక పాత కథ ఉంది. ౨౦౦౦ హైదరాబాదు బుక్ ఫెస్ట్ లో తిరుగుతున్నప్పుడు ఒక స్టాల్ లో నాకు “సిరివెన్నెల తరంగాలు” అన్న పుస్తకం కనిపించింది. ఏమిటా అని తీసి చూస్తే, సీతారామశాస్త్రి గారు తాను రాసిన పాటల గురించి రాసారందులో. అప్పటికి నాకు తెలిసిన మొదటి గొప్ప సినీకవి సిరివెన్నెలే. అదోరకం వెర్రి అభిమానం ఉండేది ఆయనంటే. ఆ పుస్తకం ఖరీదు తొంభై ఐదు రూపాయలు. నేను అప్పటికి ఇంటర్లో ఉండి, ఎంసెట్ కి చదువుతున్నా. ఆ ఖరీదు, ఈ ఎంసెట్ లంకే కలిపి, మా అమ్మని ఆ పుస్తకం కొనిమ్మని అడిగేందుకు భయపడ్డాను (ముందు ఆ చదువు చదువు. తర్వాత ఇవి చదువుదువులే…అంటే అవమానం కాదూ!!). ఆ తరువాత, ఎన్నిసార్లు బుక్ ఫెస్ట్ లో వెదికినా కనబళ్ళేదు. ఆశలు వదిలేశాను. అనుకోకుండా ఈ వారాంతంలో నా స్నేహితురాలిని కలిస్తే, వాళ్ళింట్లో కనబడ్డది. అలా, చూసిన పదకొండేళ్ళకి ఈ పుస్తకం చదవగలిగాను!!
ఈపుస్తకం తన పాటల గురించి సీతారామశాస్త్రి గారే చెప్పుకున్న ఆలోచనల సమాహారం. ఈ ప్రస్థానంలో కొన్ని పాటలు రాసే సందర్భంలో కలిగిన అనుభవాల గురించి కూడా రాశారు. వివిధ రకాల పాటలున్నాయి. కొన్ని పాటలు – ఆయా సినిమాలు ఫ్లాపైనందుకేమో గానీ, నేనిదివరలో విననివి. కొన్ని విన్నా సరిగా గమనించనివి. కొన్ని నా ఆల్టైం ఫేవరెట్స్. వీటన్నింటి గురించీ మధ్య మధ్యన సిరివెన్నెల గారి వ్యాఖ్యానం. నేను హద్దుల్లేని ఆనందంతో చదివినందుకో ఏమో, గబగబా ముగించేశాను. ఆయన రాసిన వాటిని విమర్శించేంత దృశ్యంలేదు కానీ, నాకు ఉన్న కొన్ని చాడీలు:
౧) వ్యాసాలు మరీ తక్కువగా ఉన్నాయి. నేనింకా చాలా ఉంటాయి అనుకున్నాను. నిజానికి కొన్నేళ్ళ క్రితం మనసిరివెన్నెల.కాం అని ఒక వెబ్సైటు ఉండేది. అందులో శాస్త్రి గారి వ్యాసాలు కొన్ని ఉండేవి. అద్భుతంగా ఉండేవి. ముఖ్యంగా స్వర్ణకమలంలో పాటల గురించి రాసిన వ్యాసాలు. ఇవన్నీ అప్పట్లో ఇంటి కంప్యూటర్లో హెచ్.టీ.ఎం.ఎల్. పేజీలు భద్రపరుచుకున్నాను కూడా. ఆ స్థాయిలో నచ్చిన వ్యాసాలు ఈ పుస్తకంలో ఆట్టే లేవు.
౨)ఈపదేళ్ళలో ఆయన ఎన్నో గొప్ప పాటలు రాశారు. కనుక, ఈపుస్తకానికి కొనసాగింపు రాకపోవడం, ఈ పుస్తకానికి మరో ముద్రణైనా లేకపోవడం (ఉందా??) దారుణాలు.
౩) ఆయన రాసిన ఇతర సినీరంగ సంబంధిత వ్యాసాల్ని కూడా ఇందులో ఉంచి ఉండాల్సింది. గత పదేళ్ళలో ఆయన అప్పుడప్పుడూ రాస్తూనే ఉన్నారు కదా. అవైనా ఒక పుస్తకంగా వస్తాయేమో చూద్దాం.
బట్ ఐ స్టిల్ లవ్ ఇట్. ఆయన తన పాటల గురించి రాసారు…నేను చదివాను. ఆ తృప్తి చాలు నాకు!! నా స్నేహితురాలికి ఎన్ని థాంక్సులు చెప్పుకున్నా చాలదనుకుంటాను!
శాస్త్రి గారు స్వర్ణకమలంలో “శివపూజకు…” పాట గురించి రాసిన వ్యాసం, నా పాత హార్డ్ డిస్క్ లో ఇప్పుడే కనబడ్డది. ౨౦౦౪-౦౫ ప్రాంతంలో మనసిరివెన్నెల.కాం సైటు నుండి భద్రపరచిన పేజీలు ఇవి. ఇక్కడ జతచేస్తున్నాను. నాలుగు పేజీలు, ఆయన స్వదస్తూరీలో –
మొదటి పేజీ
రెండవ పేజీ
మూడవ పేజీ
నాలుగవ పేజీ
గూగుల్ లో వెదికితే, ఈ పుస్తకం కొనుగోలుకి ఇక్కడ సంప్రదించవచ్చని తెలిసింది.
వేణు
‘మన సిరివెన్నెల డాట్ కామ్’ నేనూ గతంలో చూశాను. కొన్ని పేజీలు నచ్చి ప్రింటవుట్ కూడా తీసుకున్నాను కానీ అవి పోయాయి.
‘శివపూజకు చివురించిన’ పాట వెనక గాధ గురించి మీరు ఇక్కడ నాలుగు jpg పేజీలు ఇవ్వటం బాగుంది. ఇవి అసంపూర్తిగా ఉన్నాయి. మధ్యలో ఒక పేజీ మిస్సయింది కూడా.
అందుకని.. మీరు భద్రపరుచుకున్న html పేజీలను (కనీసం ఈ పాటవరకయినా) పబ్లిష్ చేయమని నా సూచన. (సినీ) సాహితీ అభిమానులు చాలామంది సంతోషిస్తారు!
pradeep
mee daggara unna migatha html pages attach cheyadam kaani mail kaani cheyagalara?
NNMuralidhar
“శివ పూజకి” పాట రాసే సందర్భం ఒక సినిమాలో కుదరటం మన అదృష్టం. అందులోనూ ఆ సందర్భం శాస్త్రిగారిలాంటి మహర్షికి దొరకటం ఇంకా అదృష్టం.
రామ
నేను కూడా ఇది వచ్చిన కొత్తల్లో చదివాను. ఆ తరువాత మరో పుస్తకం రాయలేదేమా అని చాలా అనుకున్నాము. వారు వ్రాయాలనుకుంటే ఆ పుస్తకంలో చేర్చదగిన మరిన్ని పాటలు ఉన్నాయి కూడా. ఆ రోజు వస్తుందని ఎదురు చూడాలి.
lalitha
సిరివెన్నెల గారి దస్తూరీ చూస్తున్నాను. థేంక్యూ సౌమ్యా
శారద
చాలా విచిత్రం! ఎందుకంటే నేను కూడా “శివ పూజకి” రాసిన తర్వాత ఆయన ఇంకే కవిత్వమైనా ఎలా రాయగలుగుతున్నారు అని చాలా సార్లనుకున్నాను. అంత గొప్ప కవితా ఇమేజరీ నాకు ప్రజలెకెవరికైనా అర్ధమైందో లేదో నని బాధ కూడా పడ్డాననుకోండి! “రుద్ర వీణ” “స్వర్ణ కమలం” సిరి వెన్నెల గారి పోయిట్రీలో ఎవరూ ఎక్కలేనంతటి ఎవరెస్టులు! (IMHO!)
శారద