గొల్లపూడిమారుతీరావు ఆత్మకథ “అమ్మ కడుపు చల్లగా”
రాసినవారు: కాదంబరి
************
నిడదవోలు వేంకటరావు గొప్ప పరిశోధకుడు, పరిష్కర్తగా సాహితీ లోకములో గౌరవాన్ని పొందారు. గొల్లపూడి మారుతీరావు చెప్పినట్లుగా- నిడదవోలు వేంకటరావుకు అస్మదీయులందరికీ ఎంతో భక్తిప్రపత్తులు ఉన్నాయి. గొల్లపూడి మద్రాసు రేడియో స్టేషన్ లో ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తూన్నారు. ఆయన నిడదవోలు వేంకటరావును- ఒక ప్రసంగమును రికార్డు చేసారు. ఆకాశవాణి బిల్డింగులో నిడదవోలు వేంకటరావు వ్యాసాన్ని చదువగా, రికార్డు చేయడం పూర్తి ఐనది. ఆనక అక్కడ కబుర్లూ, సంభాషణలూ సాగాయి. నిడదవోలు వేంకటరావుగారికి మాటిమాటికీ- “అసలు”అనడము అలవాటు. అదో మేనరిజమ్. “జయసుధ ఎవరో అసలు తెలుసా మీకు?”అంటూ, “ఆమె మా మనుమరాలు” అని పదే పదే గర్వంతో చెప్పసాగారు. పదే పదే అదే మాట చెప్తూంటే, ఉండబట్టలేక అన్నారు మారుతీరావు- “అయ్యా! మీలాంటి వారు- ఫలానా జయసుధ మీ మనుమరాలు- అని చెప్పుకుంటే అది గర్వకారణం కాదు. మీలాంటి పండితులు, తన తాతగారు- అని జయసుధ చెప్పుకుంటే- అది ఆమెకి గర్వకారణం” గొలపూడి మారుతీరావు పలుకులకు నవ్వేసారు నిడదవోలు వేంకటరావు. నిడదవోలు వేంకటరావుది చాలా సున్నితమైన మనస్తత్వం. అంతటి మహోన్నతమైన ప్రతిభకు అంత సరళమైన, సూటి ఐన మానసిక స్థితి ఉండదేమో, చాలా నెలల తర్వాత ఉత్తరం రాస్తూ “మిమ్మల్నందరినీ కలవడం బంధువుల్ని కలిసినట్టున్నది” అన్నారు. ఆ letterని చదువుతూంటే మారుతీరావు మనస్సు ఆర్ద్రమై పోయింది.
[గొల్లపూడిమారుతీరావు ఆత్మకథ “అమ్మ కడుపు చల్లగా” లో ఇలాటి వాస్తవ సంఘటనల పరిమళాలను పాఠకులకు అందించారు. ఈ పై ఘటన పేజీ 210 లో ఉన్నది.]
నిజ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను face చేసి, సినీ నటునిగా అత్యున్నత శృంగాలను అందుకున్న ఒక మహా మనీషి గొల్లపూడి మారుతీరావు. ఆయన కలం నుండి చిప్పిలినాయి తనకు తటస్థ పడిన అనేక నిజ జీవిత సంఘటనలు. ముద్రణ నయనపర్వంగా, రెఫరెన్సుగా దాచిపెట్టుకోదగిన అమూల్యమైనది ఈ పుస్తకం. రూ.400/- వెల, 500 పేజీలకు పైన ఉన్న బృహత్ గ్రంథం ఇది, అందువలన ఈ ధర సమంజసమే! ఈ పుస్తక ప్రచురణ ఎంతోమంది కృషికి ప్రతిఫలము, వారందరికీ పాఠకుల అభినందనాపూర్వక ధన్యవాదాలు.
ప్రతులకు;
కళాతపస్వి క్రియేషన్స్,
లలితామహల్, 10/7 ఎ, అన్నై సత్యనగర్,
మైన్ రోడ్, రామాపురం, చెన్నై-600089
ఫోన్: 044-22491939క్రియేటివ్ లింక్స్,
1-8-725/ఎ/1,103 సి,
బాలాజి భాగ్యనగర్ అపార్ట్ మెంట్స్,
నల్లకుంట, హైదరాబాద్-500044
E-mail:creativelinkspublications@yahoo.com
*******************
ఈ పుస్తకం పై ఇదివరలో పుస్తకం.నెట్లో వచ్చిన విష్ణుభొట్ల లక్ష్మన్న గారి సమీక్ష ఇక్కడ చదవొచ్చు.
Leave a Reply