అభినయ దర్పణము – తెలుగుసేత -లింగముగుంట మాతృభూతయ్య
2010వ సంవత్సరం డిశెంబరు నెల 24 -26 తేదీల మధ్య భాగ్యనగరంలోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో సిలికానాంధ్రవారు ఇంటర్నేషనల్ కూచిపూడి డాన్స్ కన్వెన్షన్ ను నిర్వహించారు. దానిలో ప్రేక్షకునిగా పాల్గొనే అదృష్టం నాకు కలిగింది. ఆ నిర్వహకులు వచ్చిన వారికందరికీ సిలికానాంధ్ర వారు ప్రచురించిన ”సుజన రంజని – నాట్యమంజరి” అనే పేరుతో ఆ సందర్భంగా విడుదల చేసిన సావనీరును బహుమతిగా పంచిపెట్టారు. ఆ సావనీరులో చివర అనుబంధంగా “అభినయదర్పణము” అనే పేరుకల – లింగముగుంట మాతృభూతయ్య కవి విరచితమైన – ఓ చిరుపొత్తాన్నిచేర్చటం జరిగింది. ఈ అభినయ దర్పణము బహు సుందరమైనది. నాట్యాభ్యాసకులకు, నాట్యంలోని అభినయ ముద్రలను గుఱించి తెలుసుకోవాలన్న కుతూహలం ఉన్నవారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అనిపించింది. దీనిని మన పుస్తకం.నెట్ చదువరులకు పరిచయం చేస్తే బాగుంటుందని అనిపించి ఇక్కడ దానిని పొందు పరుస్తున్నాను. ఇది 3 ఆశ్వాసాలతో కూడి ఉన్నది. పద్యాలు చాలా సరళంగానూ మంచి ధారాశుద్ధి కలిగిన్నీ ఉన్నాయి. ఓ 6-7 భాగాలుగా దీనిని పరిచయం చేద్దామని ప్రయత్నం. మొదటి భాగాన్ని క్రింద ఇస్తున్నాను.
అభినయదర్పణము – 1
— వ్రాసిన కవి లింగముగుంట మాతృభూతయ్య
శ్రీకరమై చెలంగు సరసీరుహమిత్రుని పాదపద్మముల్
సేకొని వందనంబులను జేసి ముదంబున యాజ్ఞవల్క్యులం
బ్రాకట మొందఁగాను మఱి ప్రార్థనచేసి ముదంబు మీఱఁగా
నైకవిధాల నామహుని నారసి యేఁ ప్రణమిల్లి గొల్చెదన్. 1
శ్రీ విలసిల్లుపార్వతికిఁ జెన్నుగఁ బుత్రుఁడుగా జనించి యా
భావజుభావ మై దనరి భక్తులపాలిటి పారిజాతమై
యీవగ నెల్లలోకముల నేలెడి యా గణనాథు కెప్పుడున్
సేవ యొనర్చెదన్ మిగులఁ జిత్తములో నను బాయ కుండఁగన్. 2
సరసిజనాభ ! దేవమునిసన్నుత ! మాధవ ! భక్తపోషణా !
పరమదయానిధీ ! పతితపావన ! పన్నగతల్ప ! కేశవా !
కరివరదాప్రమేయ ! భవఖండన ! యో జగదీశ ! కావవే
మురహరి ! వాసుదేవ ! యఘమోచన ! కస్తురిరంగనాయకా! 3
శారద ! నిన్ను గొల్చెదను సారెకు, నా మనవాలకింపవే
నారదుఁ గన్నతల్లి ! కృప నాయెడ నుంచి వరంబు లియ్యవే
నీరజనేత్రి ! విద్యలకు నీవె గదా మఱి వేల్పు ధాత్రిలోఁ
గూరిమి మీఱఁ గొల్చెదను, గోర్కెలొసంగు మదంబ ! వేఁడెదన్. 4
ధరలోన రామచంద్రుని
చరితము గావ్యంబుగాను సల్పి జగంబుల్
వెరగందఁ జేయు మౌనిని
నిరవుగ భజియింతు నేను నింపుగ ధాత్రిన్. 5
సకలపురాణంబులు నిలఁ
బ్రకటంబుగఁ జేసి, మిగుల భారత కథయున్,
రకముగఁ దెల్పిన మౌనికి
నిఁక నే వందన మొనర్తు నింపలరంగన్. 6
పరఁగ నల కాళిదాసుని బాణు నెలమి
దండి భవభూతి మాఘుల మెండుగాను
ధరను సజ్జనులగు వారి కరుణఁ గోరి
సరస సత్కవులను నేను సన్నుతింతు. 7
అవని భాగవతోత్తముఁ డనఁగఁ బరఁగు
పొంకముగఁ జాల బమ్మెర పోతరాజు
సొరిది శ్రీనాథుఁ దిక్కన సోమయాజి
భాస్కరుని సన్నుతింతును బాగు మీఱ. 8
ఎలమి నిరక్షరకుక్షులఁ
బలుమఱు నే ధిక్కరించి ప్రభవ మొప్పం
జెలు వొందఁ గృతియుఁ జెప్పెద
సలలితసత్కవులు సూచి సన్నుతి సలుపన్. 9
సరవి లింగమగుంట శంకరనారనా
ర్యునకుఁ బౌత్రుండ నయి దనరు వాఁడ
ననువుగా మృత్యుంజయార్యుపుత్రుండ నై
నిరతంబుఁ గీర్తిచే నెగడువాఁడఁ
బరమపావనుఁ డైన కరిరాజవరదుని
వరముచే జనియించి పరఁగువాఁడ
ననువుగఁ జెలు వొందు యాజ్ఞవల్కాచార్యు
కరుణకుఁ బాత్రమై మెఱయువాఁడ.
నమరఁ గాశ్యపగోత్రజుఁ డైనవాఁడఁ
జేరి హరిదాసులకు సేవ చేయువాఁడ
నవనిఁ గవి మాతృభూత నామాన్వితుఁడుగఁ
జెలగువాఁడను శ్రీహరి గొలుచువాఁడ. 10
వ. అని యిట్లు కమలమిత్రుఁ డైన మార్తాండునికి వందనంబు గావించి, మదీయ కులాచార్యులైన యాజ్ఞవల్కులకు బ్రణమిల్లి, గణనాధునిం బూజించి, యిష్ట దేవతా ప్రార్థనంబు సేసి, భారతిని బ్రణుతించి, యాదికవీంద్రులైన వాల్మీకి వ్యాసాది మునీంద్రులం బ్రస్తుతించి, వరకవి కాళిదాసాదులన్ సన్నుతించి, యాంధ్రకవి పితామహులైన బమ్మెరపోతరాజు, శ్రీనాథులం గొనియాడి, కుకవి తిరస్కారంబునుం జేసి, మదీయ వంశావలంబులన్ సన్నుతించి, యొకానొక ప్రబంధంబు రచియింపంబూని యున్న యవసరంబున, నొక్కనాడు మదీయ స్వప్నంబున, 11
నీలమేఘము వంటి నెమ్మేను గలవాఁడుఁ
డంబైన పీతాంబరంబువాఁడు
నీరజారిని గేరునెమ్మోము గలవాఁడుఁ
గరమున శంఖచక్రములవాఁడుఁ
గస్తూరితిలకంబు సిస్తు మీఱినవాఁడుఁ
గమలంబులను గెల్చు కనులవాఁడుఁ
శ్రీవత్సకౌస్తుభాంచిత వక్షుఁడగువాఁడుఁ
బక్షివాహనుఁ డయి పరఁగువాఁడుఁ
చెలఁగి యొకనాఁడు స్వప్నమం దెలమి వచ్చి
యెనసి యభినయదర్పణం బనఁగ నిలను
ఘనప్రబంధము నొక్కటి గరిమ మీఱఁ
బూని రచియింపు మనుచును నానతిచ్చె. 12
శ్రీకరగుణహార ! శ్రితజనమందార !
హరి ! వాసుదేవ ! మహానుభావ !
చారుమోహనగాత్ర ! సన్మునిస్తుతిపాత్ర !
యినకోటిసంకాశ ! యిందిరేశ !
గోవర్ధనోద్ధార ! గోబృందపరివార !
భావనాసంచార ! భవవిదూర !
యరవిందలోచన ! యఘభయమోచన !
పంకజాసననుత ! భవ్యచరిత !
వరద ! యచ్యుత ! గోవింద ! హరి ! ముకుంద !
భక్తజనపోష ! మృదుభాష ! పరమపురుష !
సరసగుణహార ! శ్రీరంగపురవిహార !
రాక్షసవిరామ !కస్తూరిరంగధామ ! 13
షష్ట్యంతములు
కమలాప్తతేజునకు నా
కమలాసనవందితునకు గమలాపతికిం
గమలారివదనునకు మఱి
కమలజదళ నేత్రునకుఁ గరివరదునకున్. 14
కువలయదళనిభనేత్రుకుఁ
గువలయదళగాత్రునకును గుణశీలునకుం
గువలయపరిపాలునకును
గువలయనాథునకు మదనగోపాలునకున్. 15
హరిసుత పరిపాలునకును
హరివైరితురంగునకును హరివదనునకున్
హరిధరునిమిత్రునకు నా
హరిరూపముఁ దాల్చినట్టి హరిరంగనికిన్. 16
వ.
అభ్యుదయ పరంపరాభివృద్ధిగ నా యొనర్పఁబూనిన యభినయదర్పణంబను మహాప్రబంధమునకు లక్ష్యలక్షణంబు లెట్టి వనిన. 17
(సశేషం)
మల్లిన నరసింహారావు
కంది శంకరయ్య గారూ,
సవరించాను . నా టైపాటేనండి. క్షమించగలరు.
నాగులపల్లి శ్రీనివాసు గారికి, మాతృభూతయ్య 17, 18 శతాబ్దులలోని వాడని గ్రంథం ఉపోద్ఘాతంలో వ్రాసారు.
సంస్కృత అభినయ దర్పణం నుంచి కూడా అక్కడక్కడా అదాహరణలు ఇద్దామని అనుకుంటున్నాను. సంస్కృత అభినయ దర్పణం నందికేశ్వరునిది డిజిటల్ లైబ్రరీలో దొరుకుతున్నది. లింకు ఇచ్చాను.కావలసినవారు దింపుకొని దీనితోపాటుగా చదువుకొని ఆనందిచవచ్చు.
Srinivas Nagulapalli
చాలా మంచి మధురమైన పద్యాలు అందిస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు.
“కమలాప్తతేజునకు” అన్న అందమైన కంద పద్యం,
“కమలాసతీ ముఖకమల కమలహిత కమలప్రియా కమలేక్షణా,
కమలాసనహిత గరుడగమన శ్రీ కమలనాభ నీ పదకమలమే శరణు” అన్న అన్నమయ్య పదం, కాదు,సుబ్బలక్ష్మి గళం గుర్తుకు తెచ్చింది.అన్నమయ్య పదప్రభావమో,కవి కాలం అన్నమయ్యకు పూర్వమో కాదో తెలియదు.చివరి పాదంలో ఇంకొక అక్షరంతో “కమలజదళ నేత్రునకును గరివరదునకున్” అని ఉందేమో.
కమలములవంటి కన్నులున్నవాడు అనడం చూస్తుంటాం. కాని “కమలంబులను గెల్చు కనులవాడు” అనడం మరింత సరసంగా సొగసుగా ఉంది.
==========
విధేయుడు
_శ్రీనివాస్
nagaraju
thank you sir for introducing this.
Ananda Coomaraswamy translated this ‘abhinaya darpaNamu’ into English with the title “Mirror of Gesture”.
I read it and but was looking for the Telugu Original.
I keenly look forward to the rest of the series from you.
Regards,
Nagaraju
కంది శంకరయ్య
మంచి గ్రంథాన్ని పరిచయం చేస్తున్నారు. ధన్యవాదాలు.
9వ పద్యం చివరి పాదంలో ‘సలలితము’ అన్నారు. గణదోషం! అది ‘సలలిత’ కావచ్చు. టైపాటేమో? ఒకసారి చూడండి.