The Man who Knew Infinity – Robert Kanigel
“The trouble with fiction is that it makes too much sense. Reality never makes sense.” – Aldous Huxley
భారతజాతికి గర్వకారణంగా నిలిచిన శ్రీనివాస రామానుజం అనే విశ్వవిఖ్యాత గణితశాస్త్ర పండితుడి జీవిత చరిత్ర ఈ పుస్తకం అని చెప్తే, అది అబద్ధం కాదు. అయినా, పూర్తి నిజమూ కాలేదు. ఒక మనిషి గురించి తెల్సుకోడానికి, అతడి చుట్టూ ఉన్న మనుషులనూ, సంస్కృతీ – సంప్రదాయలనీ, దేశ-ప్రపంచ స్థితిగతులనీ ఎంత క్షుణ్ణంగా తెల్సుకోవాలో, తెల్సుకున్నాక కూడా ఇంకెన్నో తెల్సుకోలేని పార్శ్వాలు ఉన్నాయని గ్రహించాలో మనకి గుర్తు తెచ్చే అరుదైన రచనల్లో ఇదొకటి. ఇదే ఒక కాల్పనిక నవలైతే, భావావేశాలు కలిగించటంతో పాఠకుని ప్రయాణం ముగిసేది. నవలలా చదివించే ఈ పుస్తకం, తట్టిలేపే ప్రశ్నల తుట్టను విస్మరించటం తేలిక కాదు. “బయోగ్రఫీ” విభాగంలో చేర్చబడ్డా, ఇందులోని మరెన్నో కోణాలను పరిచయం చేయాలన్నదే ప్రయత్నం.
రామానుజం జీవితం:
రచనకు ముడి సరకు రామానుజం జీవితం. ఈయన పేరు మనం వినే ఉంటాం. ఆయన చేసిన పని తాలూకూ వివరాలు తెలీకపోయినా, ఆయన కీర్తిప్రతిష్టల గురించి తెల్సినవాళ్ళు చాలానే ఉంటారు. ఇలా, పేరు (పెట్టిన పేరూ, తెచ్చుకున్న పేరూ) మాత్రమే నోట్లో నానే వాళ్ళతో, ఓ మహాచిక్కు వచ్చిపడుతుంది. ఆ మనిషి సంపూర్ణ వ్యక్తిత్వం దాదాపుగా మరుగున పడిపోయి, కేవలం ఒక్క పేరు మాత్రమే గుర్తుండిపోతుంది. ఇక్కడ, రామానుజం అంటే “జీనియస్” అని స్థిరపడిపోయింది. ఆయన జీనియస్ అనటంలో ఏ మాత్రం అనుమానం లేదు. కాని, ఆయన ఆ ఒక్కటే కాదు.. ఇంకెన్నో, అచ్చు మనిషిలా! 🙂
ఓ దంపుతులకి లేక, లేక కలిగిన బిడ్డ. తన నోములు ఫలించి దైవప్రసాదంగా బిడ్డ కలిగాడని అతణ్ణి అపురూపంగా చూసుకునే ఒక తల్లికి కొడుకు. గుమస్తాగా పనిజేస్తూ, చాలీ చాలని జీతంతో ఊరూరూ తిరగాల్సి వచ్చిన ఒక తండ్రికి కొడుకు. గణితపు పాఠాలు చెప్తూ, అతడి సాయం తీసుకునే పంతుల్లకు విద్యార్థి. ఓ లెక్కనైనా ఇట్టే చేసేయగల ఇతడు, లెక్కల్లో సాయం చేయమని వచ్చినవాడికి మొండిచేయి తప్ప ఏం చూపలేని స్నేహితుడు. గణితం తప్ప మరో ప్రపంచం తెలీకుండా, ఇహాన్ని విస్మరించి బతికినవాడు. పెళ్ళితో మళ్ళీ ఇహానికి దిగి వచ్చినా, మళ్ళీ తిరుగు ప్రయాణం కట్టినవాడు. దేశంకాని దేశంలో కూడా సనాతన బ్రాహ్మణ కుటుంబ ఆచారవ్యవహారాలను వదులుకోలేని బ్రాహ్మణుడు. భక్తుడు. కావాలనుకున్నది చేసేవాడు. సాధకుడు. మొండివాడు. పొట్టివాడు. గట్టివాడు.
అయినా, భయపడ్డాడు. బెదిరిపోయాడు. పారిపోయాడు. ప్రాణాలు తీసుకోబోయాడు. నవ్వుతూ, తుళ్ళుతూ మనుషులతో కలియతిరుగుతున్నా, తన అంతంతరాల్లోని ఊసులని మరో చెవికి వినబడనివ్వలేదు.
పుట్టాడు. గణితంతో బతికాడు. చనిపోయాడు. పోయినా, ఇంకా బతికే ఉన్నాడు.
పుస్తకం ముక్తాయింపులో, రామానుజాన్ని చిత్రించటానికి ప్రయత్నం చేస్తూ, Indianality అనే పదం వద్ద స్థిరపడ్డారు. భారతీయతత్వం అంటే, ఆచారవ్యవహారాల్లో, సంస్కృతి-సంప్రదాయాల్లో, కుటుంబవ్యవస్థ, జీవన విధానాల్లో ప్రత్యేక గౌరవ స్థానాన్ని దక్కించుకుందని జబ్బలు చరచుకోవడం వరకే కాదు. అంతకు మించిన ఇండియానిటీ రామానుజంలో కనిపిస్తుంది. భారతీయతత్వంలో ఉన్న ఆటుపోట్లు, అభ్యంతరాలూ, అభద్రతభావాలు అన్నీ!
హార్డీ స్నేహం..
“భారతదేశంలోని ఓ మారు పల్లెటూరు వాడిని. చదువు పదో తరగతి వరకు. అత్యల్ప జీతానికి ఉద్యోగం చేస్తూ బతుకు వెళ్ళదీస్తున్నాను. నాకున్న గణిత పరిజ్ఞానంతో కొన్ని ప్రయత్నాలు చేశాను. వాటిని చూసి, వాటిలో సరుకుందని చెప్పి, నాకు కొంచెం ఆర్థక సాయం అందేలా చేయగలరు” అని ఖండాలు దాటుకొని ఒక ఉత్తరం వస్తే, విస్మరించకుండా, ఆ ఉత్తరాన్నీ, దానితో పాటు వచ్చిన అర్థం చేసుకోడానికి కష్టతరమైన గణిత సంబంధిత విషయాలను శ్రద్ధగా పరిశీలించి, వాటిలో విలువను కనుగొని, వాటికో ఉత్తమ స్థానాన్ని కలిగించాలని తపన పడి, ప్రయాసలకోర్చి, విశ్వానికి ఓ రామానుజనాన్ని అందించిన మరో గణిత శాస్త్రకారుడు, హార్డీ!
మంచి గంధం తీయాలంటే, రాయి అవసరం పడుతుంది. కాని ఇక్కడ హార్డీ కూడా పేరెన్నిక గన్నవాడు. చిన్న వయస్సులోనే అనేక విజయాలను సాధించినవాడు. అంతటివాడు, గణితంలో శాస్త్రీయ పద్ధతిలో విద్యను అభ్యసించని ఓ భారతీయుడికి అంతగా ఎలా సాయం చేశాడు? అన్న ప్రశ్నకు సమాధానం కావాలంటే, ఏ రంగు కళ్ళద్దాలు పెట్టుకుంటే, ఆ జవాబు కనిపిస్తుంది. “హార్డీ సహృదయుడు.. రామానుజనే కాదు, ఎవ్వరైనా సాయం చేసేవాడు.”, “నో.. సాయం, గీయం లేదు. సొమ్మొకడిది, సోకొకడిది అంటే ఇదే!”, “హార్డీ అసలు సిసలైన ప్రేమ గణితం. దానికోసం ఏమైనా చేస్తాడు. ” లాంటి సమాధానాల్లో మనకి కావాల్సింది ఏరుకోవచ్చు. హార్డీ ఏం చేశాడో చరిత్రలో నిల్చిపోయింది గాని, దాని వెనుక అతడి ఉద్దేశ్యాలు ఎవరికి తెల్సు? తెల్సినా, ఇప్పుడేంటి?
ఈ రచన రామానుజం జీవిత చరిత్ర అన్నది ఎంత నిజమో, హార్డీది కూడా అనటం కూడా అంతే సబబు. చడీచప్పుడు కాకుండా, మెలోడ్రమాటిక్ సీన్లు లేకుండా, అర్భాటాలకు దూరంగా, నిరాడంబరంగా రెండు జీవితాలు తమకే తెలీనంతగా ఎలా పెనవేసుకుపోయాయో తెలుస్తుంది.
మనిషి తన చుట్టూ కట్టుకొన్న గోడల్ని దాటుకొని మాత్రం అతణ్ణి అతడుగా చూడలేం. కొందరికి మనం చాలా దగ్గరయ్యాం అని అనుకుంటాం గాని, నిజంగా ఆ గోడల్ని బద్దలుకొట్టుకొని వెళ్ళలేదు. గోడులకున్న ద్వారాల క్షణికంగా తెరుచుకున్న సమయంలో మనం అటుగా లోపలికి వెళ్ళిపోతాం. చాలా సందర్భాల్లో, ఈ గోడలకున్న కిటికీలు తెరుచుకొని, అందులో నుండి ఒకరినొకరం చూసుకొనటాన్నే అనుబంధాలుగా అభివర్ణించేసుకుంటాం. ఓ మనిషి అంతరాల్లో ఏముందో, మరో మనిషికి తెల్సే అవకాశం శూన్యం.
హార్డీ, రామానుజం అనుబంధం అందుకని చక్కని ఉదాహరణ. ఇద్దరికీ గణితం తప్ప మరో లోకం అక్కర్లేదు. అదే వాళ్ళ బంధానికి ఊపిరి. రామానుజం గణితంలో అనితర సాధ్య ఫలితాలు అందిస్తున్నా, లోలోపల మానసికంగా కృంగిపోతున్నాడు, తన చావు తనే కొని తెచ్చుకుంటున్నాడు అని హార్డీ గమినించేసేరికి చేయిదాటిపోయింది. ఏదైతే జీవితమనిపించుకుంటుందో, అది మరణ హేతువు కూడా కావచ్చు. సమన్వయంతో దానిని అదుపులో పెట్టుకోలేకపోతే, ఎంతటి లోకకళ్యాణకారక కార్యమైనా, వ్యసనంగా మారి మృత్యుకారకమూ అవ్వగలదు. ఈ విషయాన్ని, హార్డీ, రామానుజం పట్టించుకునే స్థితిలో ఎప్పుడూ లేరు.
రామానుజం విషయంలో హార్డీ ఎంత గెలిచాడో (రామనుజం నమ్మకాన్ని గెల్చుకొని, అతడిని లండన్‍కు రప్పించుకొని, అన్ని వసతులూ సమకూర్చడమే కాక, దగ్గర నుండి అతడి మేధను ప్రపంచం అర్థంచేసుకోగల విధానంగా రాయించటంలో, తప్పులు దిద్దటంలోనూ కనబరచిన ఓర్పూ, నేర్పూ అసమానం.) అంతలా ఓడిపోయాడు కూడా. (రామానుజం మనోగతాన్ని తెల్సుకోడానికి కనీస ప్రయత్నం చేయకపోవటం, భిన్న సంస్కృతులూ, నేపధ్యాల వారధిని దాటగలిగినా, మనసులను అర్థం చేసుకోకపోవటం.)
Ramanajunality syndrome?
పైన చెప్పినట్టు, రామానుజాన్ని ఒక్క మాటలో అభివర్ణించాలంటే, “ఇండియనాలిటీ” అన్న పదం సరిపోతుందని అభిప్రాయపడ్డారు. రామానుజంలో భారతీయతత్వం ఎంతో, భారతంలో రామానుజత్వం కూడా అంతే అని నాకనిపిస్తోంది. (ఇది పూర్తిగా నా అభిప్రాయం. పుస్తకంతో ఏ సంబంధం లేదు.)
రామానుజం జీవితంలో కలచివేసే విషయాలు చాలా ఉన్నాయి. అందులో ఒకటి మాత్రం నన్ను తీవ్ర నిరాశకు గురిచేసింది. పాఠశాల దశ వరకూ ఉత్తమ విద్యార్థిగా మెలిగిన రామానుజం, కాలేజీ దశలో దారుణంగా బోల్తా పడతాడు. అతడికి అప్పటికే తనకు నచ్చినదీ, తాను చేయగలిగినదీ గణితం అని నమ్మకం కుదురుకుంది. దానితో, మిగితా వాటిపై శ్రద్ధ పెట్టలేకపోతాడు. మూడు గంటల క్లిష్ట పరీక్షను, అరగంటలో పూర్తి చేసే సామర్థ్యం ఉన్నా, చచ్చిన కుందేలు చర్మం వలచి అందులో ప్రతీ భాగాన్నీ గుర్తించలేకపోతే, పరీక్షలు తప్పినట్టే. డిగ్రీలు రావు. డిగ్రీ లేనిదే ఉద్యోగాలు రావు. ఉద్యోగం లేనిదే పూట గడవదు. (ఇప్పటికీ పరిస్థితి మారలేదు.)
“నేనో పరిశోధన చేసి, కొత్తగా కొన్నింటిని నిరూపించాను” అని చెప్తే, “డిగ్రీ ఉందా?” అని అడగడం పరిపాటి. రామనుజం పంపిన ఫలితాలను చూసిన హార్డీ, అతడికి డిగ్రీలేదేనని ఆలోచించలేదు. F.R.S ఇచ్చినవాళ్ళూ వెనుకాడలేదు. ప్రజ్ఞ ఎక్కుడుందో వెతికిపట్టుకొని, దాన్ని సానబెట్టి ఫలితాలు రప్పించుకోవటంపైనే వారి ధ్యాస. అర్థంలేని నియమనిబంధనలు పెట్టుకొని, వాటి కోసం ఎంతటి జీనియస్లైనా జీరోగా పరిగణించే విద్యావిధానం మనది.
రామానుజం, ఈ కాలానికి చెందినవాడైనా, అతడి వద్ద డిగ్రీ లేకపోతే.. ఇండియాలో అతడో జీరోనే! ఇలాంటి అసమాన ప్రతిభావంతులను వెలికితీసి, అన్ని నియమాలకూ వారికి అతీతుల్ని చేసి, వారిని ప్రోత్స హించిన దాఖలాలు ఈ దేశంలో ఉన్నాయా? ఎంట్రన్స్ పరీక్ష తప్పి, ఒక అద్భుతమైన మినీ ప్రాజెక్ట్ చేసి చూపిస్తే, ఐఐటి వాళ్ళు సీటు ఇస్తారా? ప్రచురణకర్త ఇచ్చే అడ్వాన్సును బట్టి కాక, రచయిత పదవిన్యాసం చూసి, ప్రోత్సహిస్తారా? పదో తరగతి దాటగానే, ఎంట్రన్స్ వేటలో యువత, తమ ప్రతిభ ఎక్కడుందో తెల్సుకోకుండానే పరిగెడుతోంది. దీనికి కారకులు ఎవరు? ఎవరో ఒకరు. దీన్ని ఇప్పటికైనా మార్చకపోవటమేమిటి? మార్చకపోగా, మార్చాలన్న ఆలోచనరాక, ఇదేదో ఇప్పుడే కొత్తగా ఏర్పడ్డ పరిణామనీ, ముక్కు చీదే వాళ్ళు మాత్రం తయారు.
ఓ అద్భుతాన్ని ఆవిష్కరించిన ఎవ్వరికైనా చేతులెత్తి నమస్కరిస్తే సరిపోతుంది. తామే ఒక అద్భుతంగా మిగిలిన వారికి శిరస్సు వంచి నమస్కరిస్తే సరిపోదు.
జీవితం ఒక ఓపెన్ బుక్ పరీక్షనుకుంటే, ఇలాంటి వ్యక్తుల జీవితాల్లో ఘట్టాలు వెలకట్టలేనంత మెటీరియల్. వాటిని బయటే వదిలేసి, వీరి పేరును వీధులకీ, భవంతులకీ పెట్టేసి, ఒక పోస్ట్ స్టాంప్ వేసేసి, పాతికేళ్ళొకసారి గానాభజాన ఏర్పాటు చేసేసి.. రామానుజం గాని పై లోకాలనుండి చూస్తూ ఉంటే, “దేవుడా.. నా దేశాన్ని కాపాడు తండ్రి!” అని వేడుకుంటుంటాడు.
రచనా విధానం గురించి..
రచయిత గురించి నాకు పెద్దగా తెలీదు. ఆయన వైబ్‍సైటు ఇక్కడుంది. అందులో కొన్ని వివరాలున్నాయి.
రామానుజం కథే అద్భుతమనుకుంటే, ఈయన రచనతో దాన్ని ఇంకో స్థాయికి తీసుకెళ్ళిపోయారు. ఆత్మకథలూ, జీవిత చరిత్రలూ చదివే ఆసక్తి ఉన్న నాకు, ఇంత వరకూ ఇంత అందమైన రచన తారసపడలేదు. నాన్-ఫిక్షన్ అంటే చప్పడి కూడులా ఉంటుందని భ్రమించేవారికి, ఇంతకు మించిన రుచికరమైన భోజనం దొరకదు. వందేళ్ళ క్రితం తమిళనాడును కన్నుల ముందు నిలబెట్టిగలిగిన తీరు అమోఘం. చదువుతూ ఉంటే, రైల్లో వెళ్తున్నప్పుడు కిటికిలో నుండి చూస్తున్న అనుభవం కలుగుతుంది. పాశ్చాత్యులను దృష్టిలో పెట్టుకొని చేసిన రచన కాబట్టి, ఇక్కడి ప్రతీ విషయాన్ని పూసగుచ్చినట్టు చెప్పుకొచ్చారు. వరి పంట నాట్లు వేయడాన్ని, మండుటెండలో నల్లరాతితో కట్టిన గుళ్ళోకి వెళ్ళగానే వచ్చే చల్లదనాన్ని వర్ణించిన తీరు చదవాల్సిందే!
గణిత శాస్త్రంతో ఏ మాత్రం సంబంధంలేని వారు కూడా చక్కగా చదువుకునే వీలుండేలా, చెప్పుకొచ్చారు. రామానుజం జీవితంలో గణితాన్ని ఒక X గా భావించి, కథ చెప్పుకొని పోయినా, ఉన్న మలుపులతో బాగానే ఉండేది. కాని, ఆయన గణితంలో ఎందుకంత గొప్పపేరు తెచ్చుకోగలిగారో అందరికీ అర్థమయ్యేలా చెప్పాలన్న తపన స్పష్టంగా కనిపించింది. రామానుజంకు సంబంధించిన ప్రతి విషయాన్ని, ఆయన కాలంలో జరిగి, ఆయన జీవితంపై ప్రభావం చూపిన ప్రతీ సంఘటనూ కూలంకషంగా చర్చించారు. రచయిత తోచినది చెప్పకుండా, స్వ-అభిప్రాయాలతో ముంచెత్తకుండా, సందర్భానుసారం రామానుజం జీవితకాలంలో మనుషుల మాటలను పరిచయం చేశారు.
తప్పక చదవాల్సిన పుస్తకం.
జీవిత చరిత్రలు చదవడానికి మరో కారణం: ఒక విజయం ముసుగులో ఊరేగిస్తున్న మనిషి తాలూకూ అసలు ఛాయలు కనిపించవు. రామానుజం ఏం చేయడం వల్ల, శతాబ్ధం పూర్తి అయినా ఆయన్ని మనం తల్చుకుంటున్నామో, అది ఒక వంక మాత్రమే. ఆ వంకను పట్టుకొని, అసలు డొంకంతా కదల్చినప్పుడు బయటకు వచ్చే నిజాలూ, నిష్టూరాలు, విజయాలూ, ఓటములూ, అపహాస్యాలు, వ్యక్తిత్వాలు – ఇవీ ఒక జాతికి కావాల్సినవి.
_____________________________________________________
Details of the book:
The Man who Knew Infinity: Life of the Genius Ramanujan
Author: Robert Kanigel
Cost on Flipkart: Rs. 277
Budugoy
Read this book 4-5 years ago.. All the while wondering how did author gather so many details..it’s very difficult to remain objective when u talk abt genius. Author somehow achieved it. Great book and a lovable introduction. feel like reading again.
Ramesh
చాలా చాలా బాగా వ్రాసారండి.
శారద
చాలా మంచి విశ్లేషణ.
రామానుజన్ జీవిత చరిత్ర చదివితే ఇలాటి ప్రశ్నలు పుట్టుకురావటం సహజం. (ఏది మేధ? ఏది విద్య? డిగ్రీలు కొలిచేది మేధస్సునా?విద్యనా?విఙ్ఞానాన్నా?)
రాబోయే మేథమేటీషియన్సందరికీ చేతినిండా పని కల్పించాడని పేరు పొందిన రామానుజన్ గురించి మనందరం చదవాల్సిన అవసరం ఎంతైనా వుంది.
శారద
Rao Lakkaraju
ఇవాలే Amazon లో పుస్తకం ఆర్డరు చేసాను. థాంక్స్ ఫర్ యువర్ రివ్యు.
లలిత (తెలుగు4కిడ్స్)
పూర్ణిమ, ఇది కూడా చాలా బాగా రాశావు.
Thanks, ఇంకో మంచి పుస్తకం గురించి చదివి తీరాలనిపించేలా చేస్తున్నావు.
Indian Minerva
“డిగ్రీలు రావు. డిగ్రీ లేనిదే ఉద్యోగాలు రావు. ఉద్యోగం లేనిదే పూట గడవదు. (ఇప్పటికీ పరిస్థితి మారలేదు.)”
“రామానుజం, ఈ కాలానికి చెందినవాడైనా, అతడి వద్ద డిగ్రీ లేకపోతే.. ఇండియాలో అతడో జీరోనే!”
అక్షరసత్యాలు.
నిజం చెప్పాలంటే నాకు జీవిత చరిత్రలమీద అంతగా ఆసక్తిలేదండి. కానీ ఈ పుస్తకాన్ని చదవకతప్పేలా లేదు. మీ శైలి బాగుంది.
Rao Lakkaraju
పుస్తక పరిచయం చాలా బాగా చేశారు. థాంక్స్.