నేను కలిసిన ముఖ్యమంత్రులు, మానవవాదులు

రాసిన వారు: వెనిగెళ్ళ వెంకట రత్నం, సి.బి.రావు
*********************
ఇన్నయ్య గారు ప్రధానంగా పరిశోధకుడు, రచయిత. చిన్న వయసు నుంచే పత్రికలకు రాజకీయ వ్యాసాలు వ్రాశారు. ఆ తరువాత రెండున్నర దశాబ్దాలు పైగా ఆంధ్రజ్యోతికి స్పెషల్ కరెస్పాండెంట్ (Political Reporter) గా పనిచేశారు. ఇన్ని పార్శ్వాలున్న ఇన్నయ్య గారు ఏది వ్రాసినా, కొత్త విషయాలతో చదివించే గుణం కలిగి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర రచన, రాజకీయాలను విశ్లేషించటం లోనూ ఇన్నయ్య గారి కోణం కొత్తగా ఉంటుంది. నిజాన్ని నిర్భీతిగా, నిజాయితీగా చెప్పటం ఆయన నైజం. ఆ తరువాత జరిగే పరిణామాలను సైతం లెక్కచేయరు. దగ్గర స్నెహితులనుకున్నవారిపై సైతం కధనాలను ప్రచురించి, వారిని ఉక్కిరిబిక్కిరి చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి.

1982 లో ఈనాడు లో ప్రకాశం పంతులు గారి మీద వ్రాసిన వ్యాసం లేపిన దుమారం అంతా ఇంతా కాదు. 1927 లో సైమన్ కమీషన్ మద్రాసు వచ్చినప్పుడు ప్రజలనదుపు చేయటానికి పోలీసులు కాల్పులు జరిపారు. అప్పుడు ప్రకాశం గారు పోలీసులకు గుండె చూపెట్టి కాల్చుకోమన్నారని, ఇది ఆయన ధైర్యానికి గీటురాయిగా ప్రచారంలోకి వచ్చింది. ప్రకాశం పంతులుగారు తన స్వీయ చరిత్రలో వ్రాసింది దీనికి భిన్నంగా ఉంది. కాల్పుల్లో చనిపోయిన వ్యక్తిని చూడటానికి వెళ్లినప్పుడు ఒక పోలీస్ ఆపటం, పక్కనున్న వ్యక్తి ఆయన ప్రకాశం పంతులు అనిచెప్పగా పోలీసులు అనుమతించారు. ఇది ప్రకాశం గారు స్వీయచరిత్రలో వ్రాసిన విషయం.

ఇలా ‘ Inside stories’ రాజాజి తో మొదలుకొని, రోశయ్య దాకా 18 మంది ముఖ్య మంత్రులతో తనకున్న సాన్నిహిత్యం తో వారిలో ఉన్న మంచి గుణాలు, మంచివి కాని గుణాలు, వివిధ సందర్భాలలో వారు ప్రవర్తించిన తీరు రచయిత తన ‘ మార్కు ‘ తో చిత్రించారు. ఈ తరహా రచనకు ఆయనకు వారితో ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్యం ఎంతో ఉపయోగపడింది.

‘ కమాండో ‘ పత్రిక సంపాదకుడు వినుకొండ నాగరాజు సంజీవరెడ్డికి సన్నిహితుడని, ఆయన రాష్ట్రపతి అయిన తర్వాత కూడా ఢిల్లి వెళ్లి ఆయన్ని కలిసేవాడని ‘ సంజీవరెడ్డి ‘ వ్యాసంలో పేర్కొన్నారు. బహుశా ఈ విషయం చాలా మంది జర్నలిస్టులకు సైతం తెలియదనుకుంటాను.

సంజీవయ్య పై వ్రాసిన వ్యాసం మొత్తం ఆసక్తికరంగా సాగుతుంది. ముఖ్యమంత్రిగా విజయవాడ పర్యటన చేస్తున్న సంజీవయ్య పాతబస్తీ లో ఒక అనాధ బాలికల బడిని సందర్శించాల్సి ఉంది. ఆ బడి కొండ మీద ఉన్నందున ‘ అంత పైకి నేనెక్కలేనని ‘ తిరిగి వెళ్లిపోయాడట. ఆ విషయం ఆంధ్రపత్రికలో వార్తగా వచ్చింది. ప్రముఖ హేతువాది ఆవుల గోపాలకృష్ణమూర్తి ఆ వార్త చూసి ‘ముఖ్యమంత్రి పదవికి దేకగలిగిన వాడు ఆ మాత్రం గుట్ట ఎక్కలేక పోయాడా? ‘ అని వ్యాఖ్యానించాడట. ఆ మాటలు యధాతధంగా ఆంధ్ర పత్రిక ప్రముఖంగా ప్రచురించింది. అది చూసిన సంజీవయ్య తక్షణమే స్పందిస్తూ విజయవాడ కార్యక్రమం ఏర్పాటు చేసుకొని అనాధ బాలికల ఆశ్రమాన్ని సందర్శించటమే కాకుండా, తెనాలి వెళ్లి ఆ వ్యాఖ్యలు చేసిన గోపాల కృష్ణమూర్తి ని కలిసి అభినందించాడట.

పి.వి.నరసింహారావు ప్రధాన మంత్రిగా వాషింగ్టన్ కు వెళ్లి పార్లమెంట్ లో (House) ప్రసంగిస్తున్నప్పుడు ఇన్నయ్య ప్రెస్ లాబీ లో ఉండి ఆయన ప్రసంగం విన్నారు. బాగా మాట్లాడారని ఫీల్ అయ్యారు. మర్నాడు మన దేశ ప్రధాని మాట్లాడిన వార్త అమెరికా పత్రికలలో చిన్న వార్త గా నైనా రాలేదట. కొరియా లాంటి చిన్న దేశాల ప్రధానులు మాట్లాడినవి ప్రముఖ వార్తలుగా ప్రచురించటం చూసి, ప్రెస్ క్లబ్ లో కొందర్ని కదిలించి చూసారట. ‘ బాగా మాట్లాడటం కాదు, అందులో కొత్త అంశం కాని, అగ్ర రాజ్యాన్ని ఆకర్షించే ప్రతిపాదనలు లేనందువలన అశ్రద్ధకు గురైందని చెప్పారు.’ మర్నాడు పి.వి. ఒక మ్యూజియం ను సందర్శిస్తే అది ముఖ్యమైన వార్తగా వేశారట.

వెంగళరావు గురించిన వ్యాసంలో 1975లో ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినప్పుడు ‘గుంటూర్ జిల్లా ‘ మీద పరిశోధన గ్రంధం వ్రాసిన (Oxford ప్రచురణ) ఫ్రికెన్ బెర్గ్ ను మండలి కృష్ణారావు , జలగంలకు పరిచయం చేసినట్లు వ్రాశారు.ఫ్రికెన్ బెర్గ్ విస్కాన్సిన్ యూనివర్సిటీ లో రాజకీయ, చరిత్ర ఆచార్యులుగా రిటైర్ అయ్యారు. ‘ గుంటూరు జిల్లా 1788 – 1848’ పుస్తకం, ఆ జిల్లా లో అప్పుడు జరిగిన రాజకీయ, పరిపాలన, జమిందారీ వ్యవస్థ పై గొప్ప ప్రామాణిక గ్రంధం. ఫ్రికెన్ బెర్గ్ స్వీడన్ దేశానికి చెందిన పాస్టర్ కుమారుడు. తండ్రి గుంటూరు లో ఉన్నప్పుడు ఫ్రికెన్ బెర్గ్ బాలుడుగా ఉండటం వలన, గుంటూరు పై అభిమానాన్ని కలిగి, ఈ విషయం పై పరిశోధన చేశారు.

చెన్నారెడ్డి వ్యాసంలో మరో ఆసక్తికరమైన విషయం ఉటంకించారు. ఉత్తర ప్రదేశ్ లో చెట్టుకొమ్మపై కూర్చుండే దేవర్ బాబా, చెన్నారెడ్డి తలపై కాలు పెట్టి దీవిస్తున్న చిత్రం Secularist (English monthly) ముఖ చిత్రంగా వేసింది. చెన్నారెడ్డి ఉత్తర ప్రదేశ్ గవర్నర్ గా పనిచేసినప్పుడు జరిగిన సంఘటన ఇది. ఇది చూసి ఆయన ఆగ్రహంతో ఊగిపోయి, తనదైన ధోరణిలో ఇన్నయ్యను పిలవమన్నారట. ఆ పత్రికను విసిరికొట్టి ‘ నా మీద నీకు ఎంత కోపముంటే మాత్రం ఇలా చేస్తావా? ‘ అని నిలదీశారట. అప్పుడు ఇన్నయ్య చెన్నారెడ్డి షష్టిపూర్తి సంచికలో రంగుల్లో ముద్రించిన ఆ చిత్రం చూపాక చల్లబడ్డారట. షష్టిపూర్తి సంచిక తయారు చేసింది చెన్నారెడ్డి భక్తుడు I.A.S Officer పరమహంస.

అంజయ్య వ్యాసంలో ఆయనకు ఆపాదించి ప్రచారంలో ఉన్న అనేక జోక్స్ ఉదహరించారు. అంజయ్య మాట్లాడేదే అచ్చమైన తెలుగని కవి దాశరధి వ్యాఖ్యానించగా, పత్రికలు ఎన్నో జోక్స్ ప్రచురించాయి. ‘ సముద్రంలో తేల్ పడిందట. మనకింకా ఆయిల్ కు కరవు లేదు’ అలాంటిదే.

ఎన్నికలలో బాహాటంగా డబ్బులు పంచే విధానం స్వయంగా 1982 ఎన్నికలలో చూసేదాకా ఇన్నయ్య నమ్మలేదట. భవనం విద్యామంత్రిగా ఉండగా U.G.C., Chairman మాధురి దీక్షిత్ శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికొచ్చింది. భవనం తో పాటు ఇన్నయ్య కూడా వెళ్లారు. ఆమె సాయిబాబా భక్తురాలు. Puttaparti Deemed University కి వెళ్లాలని ఆమె నిర్ణయించుకుంది. అది అవమానకరమని, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయానికి ప్రాధాన్యత ఇవ్వాలి కాని, వ్యక్తిగత భక్తి ముఖ్యం కాదని భవనంకు చెప్పగా ఆయన దానికి అంగీకరించి సాయిబాబా విద్య సంస్థకు వెళ్లలేదట.

ఎన్.టి. రామా రావు గురించిన వ్యాసంలో రామారావు స్వతంత్ర నిర్ణయాలు తెలిపే ఘటన ఒకటుంది. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పని తీరుపై ఒక సెమినార్లో దాని వ్యవస్థాపకుడైన ప్రొఫెసర్ రామిరెడ్డి, వందిమాగధులు దాని ప్రమాణాలు దిగజార్చారని విమర్శించారు. అది జీర్ణించుకోలేని వారు ఇన్నయ్య కు వ్యతిరేకంగా ప్రచారం చేయటమే కాకుండా ఎన్.టి. రామారావు కు చెప్పి ఇన్నయ్య పై చర్య తీసుకొమ్మన్నారు. అందుకు ఎన్.టి. ఆర్ పెద్దగా నవ్వి ‘ మాకేమి సంబంధం ఈ విషయం. విమర్శలొస్తే మీరు దానికి సమాధానం చెప్పుకోండి ‘ అన్నారట.

నారా చంద్రబాబు నాయుడు, డాక్టర్ రాజశేఖర్ రెడ్డి మీద వ్రాసిన వ్యాసాలలో కూడా ఆసక్తికరమైన విషయాలున్నాయి. చంద్రబాబు ఏదైనా విషయం చెప్తే అసెంబ్లీ పరంగా గాని, బయట కాని బాగా గ్రహించే వాడట. అప్రజాస్వామికంగా ఎం.ఎల్.ఏ లను వైస్రాయ్ హోటలో పెట్టి విద్రోహ చర్యకు పూనుకోవటం బాధాకరమనిపించిందట. ఇక రాజశేఖరరెడ్డి తో 1978 నుంచి పరిచయముంది. రామారావు తెలుగుదేశం ఉప్పెనవలే ఎంత తీవ్రమైనదో, తన జిల్లాలో పులివెందలలో సైతం అతి కష్టం మీద తట్టుకున్నామని చెప్పారట. చంద్రబాబుకి రాజశేఖరరెడ్డికి పడదని మనం అనుకుంటాము. భవనం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖరరెడ్డి ఎక్సైజ్ శాఖా మంత్రిగా క్యాబినెట్ రాంక్ . చంద్ర బాబు మైనర్ ఇర్రిగెషన్ మంత్రిగా స్టేట్ మంత్రి. చంద్రబాబుకి క్యాబినెట్ ఇప్పించాలని ఇన్నయ్యను భవనం కు చెప్పమన్నారట.

పుస్తకంలోని రెండో భాగం హేతువాదుల గురించి. ఏ.బి.షా తో మొదలయి సుశీల్ ముఖర్జీదాకా 14 మంది పై వ్యాసాలున్నాయి. ఎం.ఎన్.రాయ్ అనుచరుడిగా ఏ.బి.షా ప్రముఖుడు. 1964 లో వీరిద్దరి తొలి పరిచయం జరిగింది. అవనిగడ్డ లో 1966లో 5 రోజుల పాటు జరిగిన మానవవాద శిక్షణా శిబిరానికి షా హాజరై చర్చల్లో పాల్గొన్నారు. ఈ శిబిరానికి ఆవుల గోపాల కృష్ణమూర్తి, మల్లాది రామమూర్తి, రావిపూడి వెంకటాద్రి, G.V. కృష్ణారావు లాంటి మేధావులనేక మంది హాజరయ్యారు. షా ను భవనం, నార్ల, రషీదుద్దిన్ ఖాన్, రామిరెడ్డి, శేషాద్రి లాంటి వారికి పరిచయం చేశాడు. షా రచనలు ‘Scientific Method, Tradition and Modernity, Challenge to Secularism’ లను ఇన్నయ్య తెలుగులో అనువదించారు.

మానవవాద ఉద్యమంలో ఇన్నయ్యకు పరిచయమైన మరో గొప్ప వ్యక్తి శిబ్ నారాయన్ రే. Radical Humanist పత్రిక సంపాదక వర్గంలో రే ఉండేవారు. శిబ్ రే వ్రాసిన M.N.Roy జీవిత చరిత్రను ఇన్నయ్య తెలుగులో అనువదించారు. శిబ్ రే రాయ్ రచలన్నీ సేకరించగా ఇప్పటిదాకా నాలుగు సంపుటాలుగా ఆక్స్ఫర్డ్ వారు ప్రచురించారు. సిబ్ రే ను కల్‌కత్తా, ఢిల్లి, హైదరాబాదులలో అనేక సారులు కలిశారు. ఆయన్ని నార్లకు, ఆలపాటి రవీంద్రనాథ్ కు పరిచయం చేశారు.

మానవవాద ప్రచారకుడు గా వి.ఎం.తార్కుండే ప్రముఖుడు. పౌరులందరికీ పాస్‌పోర్ట్ పొందే హక్కు ఉందని ముంబాయి హైకోర్ట్ జడ్జీ గా చారిత్రాత్మక తీర్పునిచ్చి సంచలనం సృష్టించారు. తార్కొండే భారత మానవవాద సంఘ అధ్యక్షుడిగా, పునర్వికాస ఉద్యమ నాయకుడిగా దేశమంతా పర్యటించి, ఇతర సంఘాలను కలుపుకొని శిక్షణ తరగతులు నిర్వహించారు. తార్కుండేను పలుమార్లు ఆంధ్ర ప్రదేశ్ రప్పించి ఉపన్యాసాలు ఏర్పాటు చేయటం లో ఇన్నయ్య చొరవ చూపారు.

ఎం.ఎన్.రాయ్ భుజం మీద చెయ్యివేసే చనువు, స్నేహం కల మానవాద కార్మిక నాయకుడు వి.బి.కార్నిక్. 1975 డెహ్రాడూన్ స్టడీ కాంప్ లో కార్నిక్ ను కలిశారు. కార్నిక్ వ్రాసిన ఎం.ఎన్.రాయ్ జీవిత చరిత్రను తెలుగులో అనువదింగా తెలుగు అకాడెమి ప్రచురించింది. కార్మికోద్యమ చరిత్ర, Trade Union చరిత్ర గ్రంధాలను ఇన్నయ్య అనువదించగా,
తెలుగు అకాడెమి ప్రచురించింది. గాంధి శిష్యుడిగా రాజకీయాలలో ప్రవేసించి ఎం.ఎన్.రాయ్ ప్రభావం వలన రాడికల్ హ్యుమనిస్ట్ గా మారాడు.

తెనాలి ప్రాంతపు మరో ప్రముఖ మానవాది ఏ.జి.కె (ఆవుల గోపాల కృష్ణమూర్తి) తో అనేక సంవత్సరాల పరిచయం స్నేహం ఇన్నయ్య కలిగి ఉన్నారు. ఏ.జి.కె తెనాలి దగ్గర మూల్పూరులో జన్మించారు. వృత్తిరీత్యా ప్లీడరైనా, సాహిత్యం, కళలు ఆయన అభిమాన విషయాలు. తెనాలి మునిసిపాలిటీ కి చైర్మన్ గా చేశారు. రాయ్ ని 1940 లో తెనాలి కి రప్పించారు. త్రిపురనేని రామస్వామికి, చలం కి రాయ్ ని పరిచయం చేశారు. వీరి ఉపన్యాసాలు జనాకర్షణం గా ఉంటాయి. 1940 నుంచి అనేక చిన్న పత్రికలకు వ్యాఖ్యాన సహిత వ్యాసాలు వ్రాసారు. 1963 లో అమెరికాదేశ ఆహ్వానం పై ఆదేశం సందర్శించి తన మేధస్సుతో వారిని ఆకట్టుకున్నారు. కాలిఫోర్నియా రాష్ట్రం లోని ఫ్రెస్నో మునిసిపాలిటీ వారు ఆయన్ని ఒక రోజు ఫ్రెస్నో పట్టణానికి గౌరవాధ్యుక్షుడిగా చేసారు.

ఇంకా హ్యూమనిస్ట్ హీరొయిన్ మణిబెన్ కారా, బసవ ప్రేమానంద్, మల్లాది రామమూర్తి, జి.డి. పరేఖ్ దంపతుల గురించి తన అనుబంధాన్ని తెలిపే వ్యాసాలున్నాయి. జీవితాంతం మూఢ నమ్మకాలను ఎదుర్కుంటూ శాస్త్రీయతను చాటుతూ నయాగరా జలపాతాన్ని అదృశ్య పరచిన జేంస్ రాండీని అమెరికాలో కలిసారు. రాండీ, శ్రీలంక లో నిప్పులపై నడిచి అందరినీ ఆశ్చర్య పరిచారు.ఇంకా సమరేన్ రాయ్, సుశీల్ ముఖర్జీ ల తో ఇన్నయ్య కు గల పరిచయాలు తెలిపే వ్యాసాలున్నాయి. హ్యుమనిస్ట్ స్టంట్ చిత్రాల నిర్మాత జె.బి.హ్. వాడియా, ఆయన భార్య నాడియా లను ఇన్నయ్య కలిసారు. వాడియాను హైదరాబాదు కు ఆహ్వానించి అబీడ్స్ లోని సెంట్రల్ యూనివర్శిటీ లో సభనేర్పాటు చేసారు. రాయ్ దంపతులు ఎప్పుడు ముంబాయి వచ్చినా వాడియా ఆతిధ్యం ఇచ్చేవారు.

140 పేజీలు (డెమి) గల ఈ పుస్తకం మొదటి నుంచి తుది దాకా పాఠకుడిని పట్టి చదివిస్తుంది. ఈ విషయాలన్నీ రచయిత స్వీయ అనుభవాలు అవటం వలన మరింత ఆసక్తికరంగా ఉన్నాయి.

తొలి ప్రచురణ: January 2011
ధర: రూ 75/-
ప్రాప్తిస్థానం: Navodya Book House, Opposite to Aryasamaj Mandir, Kachiguda X Roads, Hyderabad.

“నేను కలిసిన ముఖ్య మంత్రులు, మానవ వాదులు” ఈ పుస్తకాన్ని ఇక్కడ చదవవొచ్చు లేక దిగుమతి చేసుకోవచ్చు.

You Might Also Like

3 Comments

  1. BHARATH

    I have come across one small incident how Mr.Anjaiah as CM reacted:

    One common man met him. CM could not listen to him but also showed some anger on him. That common man left the place. After some time when CM become free, Mr.Anjaiah CM came out of Green lands Guest House, the then CM camp office and enquired the police and public about that common man wearing some color shirt and some gandhi hat etc description and felt sorry for not listening him and not justifying him.

  2. innaiah pothacamury

    Thank you for sending me this note Dr.Innaiah.

  3. bollojubaba

    i read these articles in sirs blog some time back.

    really wonderful narration.

    some of them are juicy too.

    recording the history from close encounters is awesome

    in telugu such these books are rare.

    did any one see his guntur district history ebook. wonderful historical account.

    bollojubaba

Leave a Reply