ఈస్ట్‌మన్ కలర్ జ్ఞాపకాలు
(మహమ్మద్ ఖదీర్‌బాబు “బాలీవుడ్ క్లాసిక్స్” పుస్తకానికి జంపాల చౌదరి ముందుమాట)
సినిమా అంటే మూడు గంటల వినోదం. సగటు భారతీయుడికి తక్కువ ఖర్చులో చాలాకాలంగా అందుబాటులో ఉన్న ఏకైక వినోదం.
సినిమా అంటే ఒక విశ్వాసం. అంతా మంచే జరుగుతుంది, ఎన్నికష్టాలున్నా అవి చివరికి తీరిపోతాయి, న్యాయమే గెలుస్తుంది, నాయకుడికి నాయిక దక్కితీరుతుంది అన్న నమ్మకం.
సినిమా అంటే ఒక మాయాప్రపంచం. సుదూర సుందర స్వప్నాలను కొన్ని గంటలపాటు నిజం చేసి, అద్భుతాలను కళ్ళముందు నిలబెట్టే రంగుల కనికట్టు.
సినిమా అంటే ఒక అవకాశం, కటికపేదవాడైనా ఖరీదైన జీవితాలని కొన్ని క్షణాలపాటు అనుభవించి అపురూప సౌందర్యాలని ఆస్వాదించగల అవకాశం.
సినిమా అంటే ఒక పిచ్చి. వెండితెరపై అలరించే నాయికానాయకులు తమవారే అన్న భావంతో తమను తాము మరచిపోయేలా చేసే ఒక వ్యక్తిగత, సామూహిక ఉన్మాదం.
సినిమా అంటే ఒక వ్యాపారం. కలల్ని అమ్ముకొని కాసులు కూడగట్టుకొనే ప్రయత్నం.
సినిమా అంటే ఒక ఆవేశం. అనేక కళాకారుల సృజనాత్మక ఆవేగసమాగమం. వెండితెరని వేదికగా చేసుకొని ఏదో చెప్పాలన్న ఆరాటం. తన మనోనేత్రంలో ఉన్న ఒక భావనను భౌతికప్రపంచంలో నిలబెట్టి నలుగురితో పంచుకోవాలన్న ఆర్తి.
సినిమా మన జీవితాల్లో ఒక ముఖ్యభాగం. మన పత్రికలు, టీవీ చానెళ్ళు, రేడియోలు, వెబ్‌సైట్లు, రాజకీయాలు, దైనందిన సంభాషణలు అన్నీ సినిమాల చుట్టూనే నడుస్తుంటాయి. మంచికైనా, చెడ్డకైనా, సినిమా లేని భారతదేశాన్ని ఊహించటం కష్టం.
సినిమా మన నేస్తం. మన మద్యం. మన మాదక ద్రవ్యం. మన దౌర్భాగ్యం. అప్పుడప్పుడూ మన అదృష్టం.
* * *
ప్రతి యేటా కొన్ని వందల సినిమాలు విడుదలౌతాయి. వాటిలో కొన్ని సినిమాలని మాత్రమే ప్రజలు ఆదరిస్తారు. అలా ప్రజలు ఆదరించిన చిత్రాల్లో చాలావాటిని కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ చూస్తే అవి ఇంతకుముందు కలుగచేసిన ఉత్సాహాన్ని, ఉద్వేగాన్ని, ఆనందాన్ని కల్గించవు; పాత వాసన వేస్తాయి; కొత్త తరాలకు అసలే రుచించవు. కొన్ని చిత్రాలు మాత్రం మనసుకు హత్తుకుపోతాయి. కొన్నేళ్ళ తర్వాత కూడా మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. మన మదిలో మెదుల్తూనే ఉంటాయి. కథో, సంఘటనలో, నటనో, ఇతర సాంకేతిక కారణాలో (సాధారణంగా అన్నీ) చాలా బలంగా ఉండి చెరగని ముద్ర వేస్తాయి. స్థల కాల పరిమితుల్ని దాటి, పాత మద్యంలా కొత్తరుచుల్ని నింపుకొని కొత్త ప్రేక్షకుల్ని కూడా ఆకర్షించి అలరిస్తాయి. ఒకోసారి చిత్రరంగ చరిత్రగతినే మార్చేస్తాయి ఈ చిత్రాలు. వాటిని మనం క్లాసిక్స్ (కళాఖండాలు) అనో, లాండ్‌మార్క్స్ (మైలురాళ్ళు) అనో చెప్పుకుంటాం.
అలాంటి యాభై సినిమాలని ఈ పుస్తకంలో ఖదీర్‌బాబు మనకు పరిచయం చేస్తున్నాడు. నిజానికి ఖదీర్‌బాబు ఈ సినిమాల్లో చాలావాటిని మొదటిసారి రిలీజయినప్పుడు చూడలేదు. వీటిలో చాలా సినిమాలు అతడికి ఊహ తెలీక పూర్వమే – కొన్నైతే అతడింకా పుట్టకముందే – వచ్చాయి. అయినా ఈ సినిమాలు ఇంకా అభిమానుల గుండెల్లో చెరక్కుండా ఉన్నాయి; సినిమాగురించి ఆపేక్షగా, ఉద్వేగంగా మాటలాడుకొనే వారి చర్చల్లో ఈ సినిమాల ప్రస్థావన తరచుగా వస్తూనే ఉంటుంది. అందుకే ఇన్నేళ్ళ తర్వాత చూసిన ఖదీర్‌బాబు కూడా వీటి ఆకర్షణనుంచి తప్పించుకోలేకపోయాడు. నేనో, మీరో యాభై క్లాసిక్స్ ఎంపిక చేస్తే, కొన్ని వేరే సినిమాలుండొచ్చు. కానీ ఖదీర్‌బాబు ఎన్నుకొన్న ఈ యాభై సినిమాలు మాత్రం తప్పకుండా కలకాలం నిలిచే చిత్రాలే.
ఈ క్లాసిక్స్ ఎన్నుకోవటానికి ఖదీర్‌బాబు కొన్ని పరిమితుల్ని విధించుకొన్నాడు; “లేట్ సిక్స్టీస్‌నుంచి, ఎర్లీ ఐటీస్” దాక వచ్చిన హిందీ సినిమాల్నుంచి మాత్రమే అతను ఈ యాభై సినిమాల్నీ ఎంపిక చేశాడు. ఈ పరిమితుల్ని అతను మరీ స్ట్రిక్ట్‌గా పాటించలేదన్నది వేరే విషయం – లేకపోతే సంగం, నయాదౌర్, మొఘల్ ఏ ఆజం చిత్రాలు ఈ లిస్ట్‌లో ఉండేవి కావు..
ఖదీర్‌బాబు ఎంచుకొన్న కాలం, ముఖ్యంగా 1970 దశకం, హిందీ చలనచిత్ర చరిత్రలో ఒక ప్రత్యేక శకం. కొంతమంది దర్శకులు, రచయితలు నిర్మాతలు పనిగట్టుకొని చలనచిత్రాల దిశని మార్చిన కాలం. అప్పటి వరకూ ప్రేమ, సెంటిమెంటు కలబోసి ప్రధానంగా జమీందారీ లేదా గ్రామీణ కుటుంబాల చుట్టూ తిరిగే మెలోడ్రామా నిండిన సాంఘిక చిత్రాలు, కత్తియుద్ధాల, మాయమంత్రాల ఆర్భాటాల జానపదాలు, పౌరాణికాలతో నిండిన సినిమా ప్రపంచంలో పెనుమార్పులు వచ్చిన కాలం. పట్టణప్రాంతాల్లో ఉన్న మధ్యతరగతి జీవితాలు ప్రధాన రంగస్థలం మీదకి వచ్చిన కాలం. యాంగ్రీ యంగ్‌మన్ కథానాయకుడయ్యింది ఈ కాలంలోనే. భారత చిత్ర రంగంలో న్యూవేవ్ అని పిలుచుకొన్న పారలెల్ (సమాంతర) సినిమా రంగం బంగారురోజులు కూడా ఈ దశకంలోనే. వెస్టర్న్ సినిమాల ప్రభావంతో కౌబాయ్-బందిపోట్ల చిత్రాలు ఈ కాలంలోనే మొదలవటమూ, (బహుశా షోలే ఏర్పరిచిన ప్రమాణాలను అందుకోలేక) మాయమవటమూ జరిగింది. ఎనభయ్యో దశకం వచ్చేసరికి గ్రామీణ, జానపద, పౌరాణిక చిత్రాలు కూడా దాదాపు అంతరించిపోయాయి. రివెంజ్ సినిమాలూ, లాస్ట్ అండ్ ఫౌండ్ ఫార్ములాలూ బలంగా వేళ్ళూనాయి.
ఇప్పుడు పారలెల్ సినిమా తగ్గిపోయి, మధ్యతరగతి సినిమా దాదాపు అదృశ్యమైనా, ఆ కాలంలో మొదలైన ధోరణుల్లో చాలా ఈరోజుకూ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పరిమాణాలకి కారణాలైన చాలా చిత్రాలు ఈ క్లాసిక్స్‌లో ఉన్నాయి. ఉదాహరణకు, అన్నతమ్ములు చిన్నప్పుడే తప్పిపోయి ఆ తర్వాత విచిత్రపరిస్థితుల్లో కలుసుకోవటం అన్న ఫార్ములాకు మూలం వక్త్, యాదోంకీ బరాత్, అమర్ అక్బర్ ఆంథోనీల విజయం. జంజీర్, దీవార్ సినిమాల విజయం అమితాభ్ బచ్చన్ యాంగ్రీ యంగ్‌మాన్ ఫార్ములాకు ఆరంభం. యాదోంకీ బారాత్, జంజీర్ రివెంజ్ సినిమాలకు ప్రాణం పోసి, అజిత్ బ్రాండ్ కూల్, క్రూయెల్ విలనీని తెరపైకి తెచ్చాయి. ఆరాధన విజయం కిషోర్‌కుమార్/బర్మన్ బ్రాండ్ సంగీతాన్ని ప్రచారం చేస్తే, ఖుర్బానీ డిస్కో పాటకీ, భారీ విధ్వంసాల క్లైమాక్స్‌కీ శ్రీకారం చుట్టింది. బాబీ మార్కు కుర్రప్రేమలూ, సలీం జావేద్ బ్రాండ్ స్క్రీన్‌ప్లేలు, గుల్జార్ టైపు సంభాషణలూ ఈ కాలానివే.
మధ్యతరగతి జీవితాల్ని సున్నితంగా స్పృశించి, వ్యాపారపరంగా విజయం సాధించిన సినిమాలు ఈ దశకంలో వచ్చినట్లుగా ఇంకే దశకంలోనూ రాలేదనుకొంటాను. 70వ దశాబ్దమంటే మన దేశంలో ఒక కొత్తతరం మధ్యతరగతి తన అస్తిత్వాన్ని వెతుక్కొటున్న కాలం కావటం ముఖ్యకారణం కావచ్చు. ఆ జీవితాన్ని ఒడుపుగా పట్టుకొన్న హృషికేశ్ ముఖర్జీ, బాసూ ఛటర్జీ, గుల్జార్ ఈ దశకంలో గొప్ప విజయాలను సాధించారు. ఇప్పుడు ఖదీర్‌బాబు ఎంచిన ఈ యాభై చిత్రాల్లో 7 హృషీకేశ్ ముఖర్జీవి, 6 బాసు ఛటర్జీవి, 3 గుల్జార్‌వి ఉన్నాయంటే ఈ దశాబ్దంపై వారి ప్రభావం తెలుస్తుంది. తారాబలం కన్నా కథాబలంపైనా, స్క్రీన్‌ప్లే, సంభాషణలు, సంగీతాలపై శ్రద్ధ పెట్టి తీసిన వీరి చిత్రాలు కొత్త ఒరవడిని సృష్టించాయి. అదే సమయంలో బాపు, బాలచందర్, విశ్వనాథ్‌ల చిత్రాలు తెలుగు సినిమాని ఒక ఊపు ఊపటం యాదృచ్చికం కాదు.
అంకుర్ చిత్రంతో మొదలుబెట్టి శ్యాం బెనెగళ్ హిందీలో పారలెల్ సినిమాకి ఒక కొత్త పునాదిని బలంగా నిర్మించాడు. భువన్‌షోం, గరం హవా, మృగయా లాంటి చిత్రాలు ఈ దశకానివే. ఒక రెండు దశాబ్దాలు బాగా వెలిగిన ఈ దీపం ఇప్పుడు కొండెక్కినట్టే ఉంది.
* * *
ఈ సినిమాలన్నీ ఇంతకు ముందే చూసినవే, తెలిసినవే, ఇప్పుడు మళ్ళీ వాటి గురించి ఈ పుస్తకంలో చదవాలా అనుకొంటే మీరు ఒక గొప్ప అనుభవాన్ని మిస్సైపోతారు. ఈ సినిమాలు పరిచితమైనవే అయినా, ఖదీర్ వీటిని చూసిన కోణం కొత్తది. రాసిన విధానం బహు పసందైనది.
ఖదీర్‌బాబు కథలు చెప్పటంలో నేర్పున్నవాడు; సినిమాకథల్ని అతడు బాగా చెప్పటంలో వింతేముంది అంటారా? విశేషమంతా ఈ సినిమాల్ని అతను అర్థం చేసుకొన్న తీరులో ఉంది. సినిమాలోనూ, సినిమా కథలోనూ ఉన్న కీలకమైన పాయింట్లను పట్టుకోవడంలో అతనిది ఎక్స్-రే చూపు. కావాలంటే, సంగం సినిమా పరిచయాన్ని మొదలు బెట్టిన తీరు, ఆ సినిమాలో కీలకమైన రాజ్‌కపూర్ పాత్రని పరిచయం చేసిన విధానం చూడండి. లేదూ, మొఘల్ ఏ ఆజంలో తండ్రీ కొడుకుల సంఘర్షణకు మూలాన్ని విశ్లేషించిన తీరు చూడండి. అదీ కాదంటే, భూమిక చిత్రం అంతస్సూత్రాన్ని వివరించిన విధానం చూడండి. నాలుగు జీవద్రవాలను జూలీ కథకు ముడిబెట్టిన చమత్కారం చూడండి. ఇలా చెప్పుకొంటూ పోతే చాలా ఉదాహరణలు ఇవ్వచ్చు. ఈ పుస్తకం చదివాక ఈ చిత్రాల్ని మీరు మళ్ళీ చూస్తే ఖదీర్‌బాబు కళ్ళతో చూడక తప్పదు.
ఖదీర్‌బాబు ఈ పరిచయాలని ఒక పత్రికలో కాలంగా రాశాడు కాబట్టి కొన్ని పరిమితులు తప్పలేదు. మొదటి వ్యాసాల్లో వివరాలు ఎక్కువా, వివరణలు తక్కువా ఉన్నా, పోనుపోనూ విశ్లేషణలో పదును పెరగడంతో ఈ పరిచయాలు అతని స్వంతముద్ర వేసుకొన్నాయి. ఈ సినిమాల్ని అతను ఎంతో ఇష్టంగా చూసినట్టున్నాడు, ఇంకా ప్రేమగా, ఆర్తిగా, సరదాగా రాశాడు. కెవ్వు అని కేక పెట్టటం (బాంబే టు గోవా) దగ్గరనుంచి, ఇస్లాంలో వివాహ సంబంధాల వరకు (నిఖా), తొలిప్రేమల తీపిజ్ఞాపకాల (రజనీగంధ) నుంచి భార్యభర్తల బంధాల (అభిమాన్) వరకు, నర్గీస్ నుంచి షబానా వరకు, రాజ్‌కపూర్‌నుంచి సయీ పరంజ్‌పే వరకు సాఫీగా, సరళంగా, సరదాగా రాశాడు. ఈ సినిమాల నేపధ్యం గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు మనకి చెప్పాడు. ఇంకా చెప్పవలసిన విషయాలు చాలానే ఉన్నా, అక్కడక్కడా కొన్ని తప్పులు దొర్లినా, అవి పెద్దగా పట్టించుకోవాల్సిన విషయాలు కావు.
***
ఖదీర్‌బాబు ఎన్నుకొన్న కాలం నేను హైస్కూల్ పూర్తి చేసుకొనే రోజుల్నుంచి మెడికల్ డిగ్రీ పుచ్చుకొని అమెరికా వచ్చేవరకు. నా తొలి యవ్వన కాలం. హిందీ సినిమాలు నాకు పరిచయమై అలవాటుగా మారిన కాలం. ఈ సినిమాలన్నిటితోనూ నాకు చాలా అనుబంధం ఉంది. ప్రతి చిత్రంతోనూ అనేక జ్ఞాపకాలు ముడిబడి ఉన్నాయి.
స్కూల్‌ఫైనల్ రోజుల్లో, ఒక కజిన్‌తో కలసి ఏలూరు వెళ్ళి బ్రహ్మచారి మాట్నీ చూసినప్పుడు మొదటిసారిగా ఇంట్లో చెప్పకుండా సినిమాకు వెళ్ళినందుకు మా పెద్దమ్మతో చివాట్లు తిన్న జ్ఞాపకం;
కాలేజీ ఎగ్గొట్టి తెనాల్లో సినిమా హల్లో కోరా కాగజ్ కా మన్ మేరా అంటూ క్లోజప్‌లో కనిపించిన ఆరాధన రాజేష్‌ఖన్నాను చూసి డంగైపోయిన జ్ఞాపకం; తెనాల్లో ఒక సాయంత్రం నా రూమ్మేట్ మున్నంగి రామకృష్ణారెడ్డితో కలసి బోస్‌రోడ్ సెంటర్లో అప్పుడప్పుడే వెలుస్తున్న టీస్టాల్లో దమ్మారోదం పాట మొదటిసారి విని అదిరిపోయి మళ్ళీ మళ్ళీ ఆ పాట వినిపించుకొన్న జ్ఞాపకం; బాబీ సినిమా మొదటిరోజు మూడాటలకూ టిక్కెట్లు దొరక్క (అప్పటికీ మా జూనియర్ ఉషారాణితో లేడీస్‌కౌంటర్లోంచి టికెట్లు తెప్పించటానికి ప్రయత్నించినా), రెండోరోజు మార్నింగ్‌షో చూశాక హీరోహీరోయిన్లెంత ఫ్రెష్‌గా ఉన్నారో మళ్ళీ మళ్ళీ చెప్తుంటే మా సీనియర్ విశ్వేశ్వర్రావు విసుక్కొన్న జ్ఞాపకం, నా వార్డ్‌మేట్లు సాయికుమార్, విజయలక్ష్ములతో కలసి గుంటూరు లీలామహల్లో షోలే మళ్ళీ మళ్ళీ (కాలేజ్ ఎగ్గొట్టే) చూసిన జ్ఞాపకం; నాజ్అప్సరలో అంకుర్ సినిమా చూసి, సరస్వతీ టాకీస్ ముందు టీస్టాల్లో కూర్చుని, కృష్ణమూర్తి, శోభ, ఉమ, శర్మలతో గంటలపాటు మా(పో)ట్లాడుకొన్న జ్ఞాపకం…
మేరా నాం జోకర్ సినిమా చూస్తుండగా గుంటూరు లిటిల్‌కృష్ణాలో కరెంటు పోతే (జనరేటర్లు లేని రోజులు) గంటల తరబడి ఓపిగ్గా వెయిట్ చేసి నాలుగ్గంటల సినిమాని ఆరు గంటలపాటు చూసిన జ్ఞాపకం; గుంటూరు ఫిల్మ్ క్లబ్ నడుపుతున్న రోజుల్లో, గరంహవా చూస్తున్నప్పుడు, జలాల్ఆఘాతో దూస్రీకో ఉడ్నే నదూంగీ అన్న గీతా సిద్ధార్థ్ కొంతసేపటికే ఆత్మహత్య చేసుకొన్నప్పుడు గుండె పట్టేసిన జ్ఞాపకం; రజనీగంధ సినిమా తర్వాత దినేష్ ఠాకూర్లా గడ్డాలు పెంచేసుకొన్న స్నేహితుల జ్ఞాపకం, ఇప్పుడు పెద్ద ప్రొడ్యూసరైన చిన్ననాటి మిత్రుడు కిషోరూ నేనూ మద్రాసులో పనిగట్టుకొని వెళ్ళి ఛోటీసీ బాత్ చూసిన జ్ఞాపకం; నాకు హిందీ సినిమాల గురించి చాలా చెప్పిన, ఇప్పుడు లేని, మా మురళన్నయ్యతో కలసి ఆనంద్, డాన్ సినిమాలు చూసిన జ్ఞాపకం, విజయవాడ ఊర్వశిలో అరుణతో కలసి మొదటి సారి శ్యాం బెనెగళ్ సినిమా (భూమిక) చూసి స్మితా పాటిల్ పాత్ర గురించి మాట్లాడుకొన్న జ్ఞాపకం…
జనార్దన రావు, జేపి (అవును, ఆ జయప్రకాష్ నారాయణే), రామ్మోహన్, మల్లి, కేవీకేవీ, రాజశేఖర్, జగదీష్, సుధాకర్, పీరమేష్, యార్లగడ్డ రమేష్, రామారావు, కార్తికేయ, టోనీ, సురేంద్ర, నరేంద్ర, సాంబు, రఫీ అహ్మద్, రుద్ర, రుషీమణి, శారద, సత్యవతి, అమ్మాజక్కలతో చూసిన ఆదివారం మార్నింగ్‌షోలూ, స్పెషల్ మ్యాట్నీలు, సినిమాబస్సు సెకండ్‌షోల జ్ఞాపకాలు, ఇంకా ఎన్నో, ఎన్నెన్నో…చుట్టుముట్టిన ఇన్ని జ్ఞాపకాల మధ్య, అలనాటి ఇన్ని మంచి సినిమాల మధ్య, ఆ పాత్రలు, పాటల మధ్య… నాకు బాబీలోని ఒక పాట గుర్తుకొస్తోంది.
నా చాహూ సోనా చాందీ… నా చాహూ హీరా మోతీ… యే మేరా కిస్ కాం కే…
వెండి బంగారపు సంపదను కాసేపు పక్కన పెట్టి ఈ జ్ఞాపకాల సంపదను మూటగట్టుకోండి.
ఖదీర్‌బాబు చేతుల్లోంచి అందుకొని ఒకసారి మనసారా హత్తుకోండి.
ఈస్ట్‌మన్ కలర్ తొలియవ్వనపు రోజుల్లో మరొక్కసారి మునిగి తేలండి.
********************
చికాగో మెడికల్ స్కూల్‌లో సైకియాట్రీ ప్రొఫెసర్ డా. జంపాల చౌదరికి తెలుగు, సాహిత్యం, కళలు, సినిమాలు అంటే అభిమానం. తానా పత్రిక, తెలుగు నాడి పత్రికలకు, మూడు తానా సమావేశపు సావెనీర్లకు, రెండు దశాబ్దాలు కథాసంపుటానికి సంపాదకత్వం వహించారు. తానా, ఫౌండేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారంస్ ఇన్ ఇండియా (ఎఫ్.డి.ఆర్.ఐ.), మరికొన్ని సంస్థలలోనూ, కొన్ని తెలుగు ఇంటర్నెట్ వేదికలలోనూ ఉత్సాహంగా పాల్గొంటుంటారు; చాలాకాలంగా తానా ప్రచురణల కమిటీ అధ్యక్షులు. పుస్తకంలో జంపాల గారి ఇతర రచనలు ఇక్కడ చదవవచ్చు.
********************
బాలీవుడ్ క్లాసిక్స్
మహమ్మద్ ఖదీర్‌బాబు
జూన్ 2010
కావలి ప్రచురణలు
1-13-6, ఓల్డ్ టౌన్
కావలి, 524201
నెల్లూరు జిల్లా
అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ దొరుకుతూంది
172 పేజీలు, బోల్దన్ని ఫొటోలు, 150 రూ..
రాజేంద్ర కుమార్ దేవరపల్లి
సాక్షి తెలుగుదినపత్రికలో ధారావాహికగా వస్తున్నప్పుడే అన్ని వ్యాసాలు బీరుపొకుండా చదివాను.అమితాబ్ డాన్ సినిమా దర్శకుడికి ఆ సినిమా సంచలనవికయం తర్వాత అసంఖ్యాకంగా ఆఫర్లు వచ్చిమీదపడ్డా ఒక్క సినిమాకూడా తెరకెక్కలేదన్న సంగతి ఈ వ్యాసాలు చదివాకేతెలిసింది.అయితే ఇన్న సెంటిమీటర్ల పరిధిలో బొమ్మ శీర్షికతో కలిపి వ్యాసం రావాలి అన్న పరిమితి ఉండటంవల్ల కాబోలు విశదీకరించాల్సిన చోట కూడా క్లుప్తంగా ముగించటం సహజమనుకున్నా,పుస్తకరూపంలో నైనా అదనపు సమాచారం చేరుస్తారనుకున్న నాలాంటి వాళ్ళను బాగా నిరాశకు గురిచేసిన సంగతటుంచితే మంచి ప్రయత్నం అని మాత్రంప ప్రతిఒక్కరూ ఒప్పుకోవాలి.
Gks Raja
Jampala Garu! Thank you for the correction. Yes it’s ‘Poleramma Banda kadhalu’.
Raja
Jampala Chowdary
@gks raja:
Thank you.
మన్ చాహే గీత్ నాకు కూడా ఇష్టమైన పుస్తకమే.
మిట్టూరోడి కథలు రచయిత నామిని. మీరు బహుశా పోలేరమ్మ బండ కథల గురించి చెప్పబోయారేమో!
gks raja
బాలీవుడ్ క్లాసిక్స్ గురించి మొహమ్మద్ ఖదీర్ బాబు దృష్టి కోణం నుండి చూసి జంపాల చౌదరిగారు విశ్లేషించిన తీరు బావుంది. పనిలో పనిగా వారి పాత జ్ఞాపకాలను కూడా అక్షరబద్ధం చేసుకొనే అవకాశాన్ని సరిఅయిన సందర్భంగానే దొరకబుచ్చుకున్నారు. నిన్నటి జ్ఞాపకాలు, అందునా కళలు సినిమాలు సంగీతం స్నేహితులు వగైరా జ్ఞాపకాలు ఎవరినయినా ఆనందపారవశ్యంలో ముంచేత్తేవే! ఇక ఖదీర్ బాబు విషయానికొస్తే – క్లుప్తంగా మనసుకి హత్తుకోనేట్టు చెప్పడం అవి కూడా కాల్పనికం కానివాటి గురించి చారిత్రాత్మకంగా తీర్చి దిద్దడం గొప్ప విషయమే! జంపాల వారు మళ్ళి నన్ను పుస్తకాల షాపుకి పరుగెత్తించడం సంతోషకరమయిన ట్రాఫిక్ బాధ. ఖదీర్ బాబువి ‘మన్ చాహే గీత్’ , ‘మిట్టూరోడి కధలు’ ‘పప్పూ జాన్ కధలు’ వగైరా నా దగ్గర ఉన్నాయిగాని,ఈ బాలీవుడ్ క్లాసిక్స్ లేకపొవడం వెలితిని జంపాల గారు వెతికి చెప్పారు. వారికి కృతజ్ఞతలు. రేపో మర్నాడో, నాకు బాగా ఇష్టమయిన ‘మన్ చాహే గీత్’ గురించి నా అభిప్రాయాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తాను.
రాజా.
gksraja.blogspot.com