దోసిట్లో పుస్తకాలు ఇన్నేనా?

రాసిన వారు: ముక్తవరం పార్థసారథి
(ఈ వ్యాసం వీక్షణం పత్రిక డిసెంబర్ 2010 సంచికలో, ‘చదవాల్సిన పుస్తకాలు’ అన్న శీర్షికలో వచ్చింది. తిరిగి పుస్తకం.నెట్ లో ప్రచురించడానికి అనుమతించిన వీక్షణం పత్రిక వారికి ధన్యవాదాలు.వ్యాసాన్ని యూనీకోడీకరించిన నాగార్జున పవన్ కుమార్ కు ధన్యవాదాలు.)

వ్యాస రచయిత కథకుడు, నవలాకారుడు, అనువాదకుడు.
**************
వ్యక్తి చైతన్యానికి సంస్కృతి, చరిత్రల అవగాహన తప్పనిసరి అంటాడు గోర్కీ (Maxim Gorky). అంటే, వేదవాఙ్మయంతో ప్రారంభించి, రామాయణ భారతాలతో సహా, ప్రాచీన కావ్యాలూ కూడా ఎంతో కొంత తెలిసుండాలి. అయితే, మనం చెప్పుకుంటున్నది ఆధునిక సాహిత్యం గురించి.

మార్క్స్ జీవిత చరిత్ర రాసిన ఫ్రాన్సిస్ వీన్ (Karl Marx, a biography : Francis Wheen) ‘పెట్టుబడి’ని ఒక గోథిక్ (అంటే హారర్, మిస్టరీ, సస్పెన్స్) నవలగా అభివర్ణిస్తాడు. ఇది కొరుకుడు పడని పొలిటికల్ ఎకానమీ అని దూరం పెట్టడం కన్నా కథగా చదివినా మంచిదే. నిజానికి, చాలా మంది సాహితీవేత్తల కన్నా ఎక్కువ సాహిత్యాధ్యయనం చేశాడు మార్క్స్. ఒక నాటకం కూడా రాశాడు. ‘పెట్టుబడి‘లో కొన్ని వందల సాహిత్య గ్రంథాల ప్రస్తావన ఉందంటారు పరిశోధకులు. ఇవి గానీ మార్క్స్ ఎంగెల్స్ ఇతర రచనలు గానీ, ముఖ్యంగా రెండు చిన్న పుస్తకాలు, పారిస్ మాన్యుస్క్రిప్ట్స్ (Paris Manuscripts), ఫ్యూర్‌బా – చదివితే మత్తు వదులుతుంది. కళ్లు తెరుచుకుంటాయి.

ఇక తెలుగు పుస్తకాల గురించి – గురజాడ ‘కన్యాశుల్కం‘ చదవకపోతే తెలుగు సాహిత్యం గురించి ఏమీ తెలియనట్టే (రేడియో నాటకం సాహిత్య అభిమాని బ్లాగులో ఇచ్చిన లంకెలో వినండి. ). వందేళ్లు గడిచినా నిత్యనూతనమైన నాటకం అది. మనలోని ఒక పార్శ్వమే కదా గిరీశం అని తెలుసుకుని సిగ్గుపడతాం. (ఇది కూడా గిరీశం లక్షణమే.) ‘ముత్యాల సరాలు’, ‘దిద్దుబాటు’, ‘మెటిల్డా’, ‘మీ పేరేమిటి?’, ‘పెద్ద మసీదు’ లాంటి కథలు అందరూ చదవక తప్పని గొప్ప రచనలు.

మా తరం వాళ్లకు కొత్తగా ఆలోచించడం నేర్పింది చలంగారు. ఆయన పుస్తకాలేవీ చదవక ముందే ‘యోగ్యతా పత్రం’ కంఠస్థం చేసిన వాళ్లు నాకు తెలుసు. స్వేచ్ఛాప్రియత్వం, అధికార ధిక్కరణ ఆయన రచనల్లోని ప్రధాన లక్షణాలు. (‘పవర్ ఆఫ్ ది వర్డ్’ ఏమిటో తెలుసుకోవాలంటే చలాన్ని చదవక తప్పదు). మన ఫెమినిస్ట్ రచయితల కంటే చాలా ముందే ఫెమినిస్ట్ రచనలు చేశారాయన. ఈ ధోరణిని ఆవిష్కరించింది ఆయన మొదటి నవల ‘శశిరేఖ‘. అయినా అందరికీ తెలిసింది ‘మైదానం‘. ఆ తర్వాత ‘అరుణ‘, ‘అమీనా‘లలో ఆయన శైలీ వైభవం చదివి తెలుసుకోవాల్సిందే. అయితే చలం కథలు మాత్రం వాటికవే సాటి. ఏ ఒక్కదాన్నీ ప్రత్యేకంగా ప్రస్తావించనవసరం లేదు. చదవడం ప్రారంభిస్తే వదిలిపెట్టలేరు. ఆధ్యాత్మికంలో కూరుకుపోయిన దశలో కూడా శిష్యోపశిష్యుల్ని తయారు చేసుకోకపోవడం ఆయన నిజాయితీకి నిదర్శనం.

మాలపల్లి‘ చదివారా? గాంధేయవాదమైతే కావచ్చు గానీ, అంత సమగ్రంగా సమాజ చిత్రణ చేసిన నవల మరొకటి లేదు. పెద్ద నవల. అయితేనేం ఎక్కడా పట్టు సడలదు. ముగించాక గ్రేట్ అంటారు మీరు. ఉన్నవగారి కీర్తి పతాక ‘మాలపల్లి’ (మాలపల్లి పై పుస్తకం.నెట్ లో గతంలో వచ్చిన వ్యాసం ఇక్కడ).

కథలు చదివే వారెవరికీ కొడవంటిగంటి కుటుంబరావు గార్ని పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. అన్ని వందల రచనలు చేసిన రచయిత తెలుగులో మరొకరు లేరు. మార్క్సిజం వెలుగులో తెలుగు మధ్యతరగతి కుటుంబ జీవితాన్ని విశ్లేషించిన కొ.కు. కథలు/నవలలు ‘ఎవరైనా రాయొచ్చిలా’ అనుకునేంత సులభంగా, సరళంగా ఉంటాయి. అలాగని వాటిని అనుసరించే ప్రయత్నం మాత్రం చెయ్యకూడదు. ఆ ఆలోచనల వెనక, వాక్య నిర్మాణం వెనక గొప్ప సాధన ఉంది. ‘బకాసుర‘, ‘చదువు‘, ‘తిమింగలం వేట‘ అంటూ కొన్నిటిని ప్రత్యేకించనవసరం లేదు. అన్నీ అరుణకాంతిలో విరిసిన పుష్పాలే.

తెలుగులో రాజకీయ రచనలు చాలా తక్కువ. పుప్పల లక్ష్మణరావు గారి ‘అతడు – ఆమె‘ అలాంటి అరుదైన నవల. ఇరవయ్యవ శతాబ్ది ప్రథమార్థంలోని సంక్షుభిత రాజకీయ, సామాజిక జీవితాన్ని చిత్రించిన నవల. ఆయన ఆత్మకథ ‘బతుకు పుస్తకం‘ కూడా చదవండి. విలక్షణ రచయిత లక్ష్మణరావు గార్ని మిస్ కావద్దు.

రష్యన్ రచయిత చెహోవ్ కథలు చదివారా? చదవకపోతే, రావి శాస్త్రి గారి తొలి కథలు తప్పక చదవండి. చెహోవ్ తెలుగులో రాశాడా అన్నట్టుంటాయవి. అయితే రావిశాస్త్రిగార్ని పేదల రచయితగా నిలబెట్టింది ‘ఆరు సారా కథలు‘, ‘రుక్కులు‘, ‘రాజు-మహిషి‘, ‘ రత్తాలు-రాంబాబు‘ వగైరా. శాస్త్రిగారి కథల్లో తెలుగు కథ శిఖరారోహణ చేసింది.

శాస్త్రి గారి మిత్రులు, మరో గొప్ప రచయిత కాళీపట్నం రామారావుగారి కథలు కూడా తప్పక చదవాలి. ముఖ్యంగా ‘యజ్ఞం’, ‘కుట్ర’, ‘వీరుడు – మహావీరుడు’ లాంటివి.
ప్రతి కథా ఓ మాస్టర్ పీస్ అన్నట్టుగా రాసిన కథకుడు చాగంటి సోమయాజులు. కథా రచనకు ఆయన పెట్టుకున్న ప్రమాణాలు చాలా కఠినమైనవి. ఉన్నతమైనవి. రాశి కాదు, వాసి ముఖ్యం అనుకున్నాడు. చిత్రిక పట్టించని సహజ కళాకృతులు ఈ కథలు. ‘ఎంపు’, ‘కుంకుడాకు’, ‘ఏలూరెళ్లాలి’, ‘వాయులీనం’, ‘పోనీను’ ఒకటేమిటి, ప్రతి కథా – దేనికదే సానపట్టిన వజ్రం.

ఇక, కె.ఎన్.వై. పతంజలిని చదవకపోతే మన పఠనా కార్యక్రమం అసమగ్రంగా ముగిసినట్టే. అద్భుతమైన వ్యంగ్య రచయిత పతంజలి. ఈయన నవలికల్లో నాకు బాగా నచ్చినవి ‘గోపాత్రుడు‘, ‘పిలక తిరుగుడు పువ్వు‘. ముఖ్యంగా ‘ఓ దెయ్యం ఆత్మ కథ‘. పతంజలి ఊహాశక్తికి ఆకాశమే హద్దు అని నిరూపిస్తాయి. నా మట్టుకు నాకు పతంజలి ఆంధ్రా (జొనాథన్) స్విఫ్ట్.

చివరగా, నేటి రచయిత నామిని అంటే నాకు మహా ఇష్టం. రెండు మూడు వాక్యాల్లో మన కళ్లు చెమర్చేలా చేయగల కథా మాంత్రికుడు ఈ సుబ్రహ్మణ్యం నాయుడు. ‘పచ్చనాకు సాక్షిగా‘ తో సహా, మరికొన్ని రచనలు కలిపి ‘మిట్టూరోడి పుస్తకం‘గా వచ్చింది. వెంటనే చదవండి. (నామిని కతల పై పుస్తకం.నెట్లో వచ్చిన వ్యాసం ఇక్కడ)

వీళ్లేనా మనం చదవాల్సిన రచయితలు? ఇంకెవరూ లేరా?

పానుగంటి వారి ‘సాక్షి‘ వ్యాసాలు, హేతువాది, రాయిస్టు, అరవిందిస్టు గోపీచంద్ రచనలు, కరుణకుమార కథలు, బుచ్చిబాబు, ప్రజాకవి కాళోజీ ‘నా గొడవ’, వట్టికోట ఆళ్వారుస్వామిప్రజల మనిషి‘, ‘గంగు‘ ప్రస్తావించలేదేం? మరో వంద, రెండు వందల పుస్తకాలతో జాబితా తయారు చెయ్యొచ్చు. చురుకైన పాఠకులు తెలుగు సాహిత్యాన్నంతా ఆర్నెల్లలో, మహా అయితే ఏడాది లో ఆపోసన పట్టగలరని తెలుసు. ఆ తర్వాత, వార పత్రికల్లో వస్తున్న సీరియల్స్ చదివి మీ సాహిత్యాభిలాషను తృప్తి పరుచుకోవచ్చు. కానీ, ఇంగ్లీష్ చదవగలిగితే, అది మరోలోకం. ప్రపంచ సాహిత్యానికి ముఖద్వారం ఇంగ్లీష్. అన్ని విదేశీ భాషల పుస్తకాలూ ఇంగ్లీష్ లోకి అనువాదమవుతాయి. అంటే మీరు పెరటి బావి నుండి సముద్రం దాకా వచ్చారన్నమాట.

మీ వీలును బట్టి, దొరికినప్పుడు చదవటానికి నాకు నచ్చిన కొన్ని పుస్తకాల గురించి:
అప్పటికి మన దగ్గర ప్రబంధ యుగమో, అంతకు ముందో తెలియదు గానీ, 1505లో అచ్చయింది తొలి ఆధునిక నవల ‘డాన్ కిహోటి (Don Quixote)‘. రచయిత మిగ్వెల్ సెర్వాంటెస్ (Miguel de Cervantes). సిడ్నీ షెల్డన్ లాంటి వాళ్ల బెస్ట్ సెల్లర్స్ నేనూ అప్పుడప్పుడు చదువుతూనే ఉంటాను. ఏ పేజ్-టర్నర్ తీసిపోనంత ఉత్కంఠతో నన్ను చదివించిన నవల డాన్ కిహొటి. భ్రమ-వాస్తవానికి గీత చెరిగినప్పుడు వ్యక్తులు చేసే పనులు ఎంత వింతగా ఉంటాయో చెప్పడమే ఇందులో కథా వస్తువు. అవును మన హీరో రాక్షసులని భ్రమపడి గాలిమరలతో యుద్ధం చేస్తాడు. ఇది హాస్యప్రధానమైన నవలే అయినప్పటికీ, వ్యక్తి అస్తిత్వ మూలాలను ప్రశ్నించింది. పెద్ద నవల. ఇప్పటికి కొన్ని డజన్ల అనువాదాలు వచ్చాయి. ఇటీవలే సరికొత్తగా, సరళమైన ఇంగ్లీష్‌లో ఎడిత్ గ్రాస్మాన్ (Edith Grossman) కొత్త అనువాదం వచ్చింది. దీన్ని బైబిల్ ఆఫ్ హ్యుమానిటీ అన్నారు. ఆ పొగడ్తలన్నీ అనవసరం. మీరు ప్రారంభిస్తే వదిలిపెట్టలేని పుస్తకం డాన్ కిహోటి.

మృతజీవులు‘ గురించి మీకు తెలుసా? చాలాకాలం క్రితం విశాలాంధ్ర వాళ్లు కొ.కు అనువాదం ప్రచురించారు (ఈ అనువాదాన్ని పొద్దు ఈ-పత్రికలో తిరిగి ప్రచురించారు. దాన్ని ఇక్కడ చదవొచ్చు). ఇటీవలే పీకాక్ క్లాసిక్స్ వాళ్ల సంక్షిప్తానువాదం కూడా వచ్చింది. మూలరచన పేరు ‘డెడ్ సోల్స్‘. రచయిత గొగోల్(హోహోల్). రష్యన్ నవల. చిచికోవ్ అనబడే లోభి దేశమంతా తిరిగి మరణించిన అర్థ బానిసల (సెర్ఫ్)ను సేకరిస్తాడు. దానికొక కారణముంది. ఆ రోజుల్లో భూస్వాముల హోదా నిర్ణయించేది వాళ్ల దగ్గరున్న అర్థ బానిసల సంఖ్యే. దాని ఆధారంగానే బ్యాంకులు అప్పులు కూడా ఇస్తాయి. సమాజ వ్యవస్థ వికృత రూపాన్ని ఇంత ప్రతిభావంతంగా చిత్రించిన నవల నాకు తెలిసి మరొకటి లేదు. (Dead Souls- Nikolai Gogol)

మరో ముగ్గురు రష్యన్ల గురించి కూడా ఇక్కడే మాట్లాడుకొందాం. తొల్‌స్తోయ్ పేరు మీకు తెలుసు. ఈ ఏడాది ఆయన శతవర్ధంతి. ఆయన రాసిన ‘మనిషికెంత నేల కావాలి?’ కథ ఒకప్పుడు స్కూల్లో పాఠ్యాంశంగా కూడా ఉండేది. 1805లో రష్యా మీద నెపోలియన్ చేసిన యుద్ధం గురించిన నవల ‘యుద్ధం – శాంతి‘ (War and Peace – బెల్లంకొండ రామదాసు అనువాదం), ‘అన్నా కరెనీనా‘ (Anna Karenina-తాపీ ధర్మారావు అనువాదం) మార్కెట్లో ఉండొచ్చు. నాకైతే ‘యుద్ధం – శాంతి’ కన్నా ‘అన్నా కరెనీనా’ ఇష్టం. సాహిత్యంలో వివాహేతర సంబంధాలను చిత్రించిన కథలకు కొదవ లేదు. ఈ నవల కన్నా కొన్ని సంవత్సరాల ముందే మరో గొప్ప నవల ఫ్రెంచ్ రచయిత గుస్తావ్ ఫ్లొబేర్ రాసిన ‘మదాం బావరి‘ (Madame Bovary-Gustave Flaubert) సంచలనం సృష్టించింది. (అందులో కూడా కథా వస్తువు వివాహేతర సంబంధమే.) కాని గొప్ప నవలలకు కథా వస్తువు ఒక ఆలంబన మాత్రమే. ఈ మహావృక్షాలు ఎందరు తరువాతి తరాల రచయితలకు నీడనిచ్చాయో! ఏడు వారాల నవలలూ, వంద పేజీల నవలలూ చదవడం అలవాటైన మనకు, నిజమైన నవలాస్వరూపమేమిటో తెలుసుకోవాలంటే పై రెంటిలో ఒక్కటైనా చదవక తప్పదు.

దొస్తొయేవ్‌స్కీని పశిచిమ దేశాల వాళ్లు, తొల్‌స్తోయ్ అంత ప్రతిభావంతుడనీ, మరికొందరు అంతకన్నా గొప్పవాడనీ అంటారు. వ్యక్తి అంతర్లోక సంఘర్షణ, నిష్కృతి ఆయన కథా వస్తువులు. ‘క్రైం అండ్ పనిష్మెంట్‘ (Crime and Punishment-Fyodor Dostoyevsky) నిజంగా క్రైం నవలే. ఒకరకంగా దొస్తొయేవ్‌స్కీ నవలలన్నీ క్రైం నవలలే. ఈయన మాస్టర్‌పీస్ ‘బ్రదర్స్ కరమజోవ్‘. గ్రేటెస్ట్ నావెల్ ఇన్ ది వరల్డ్ ఏది అని పోటీ పెడితే, ‘యుద్ధం – శాంతి’ కీ, ‘బ్రదర్స్ కరమజోవ్‘కీ ఓట్లు సమానంగా వస్తాయంటారు. ‘నా సాపేక్ష సిద్ధాంతం కన్న జటిలమైనది బ్రదర్స్ కరమజోవ్‌లోని పాత్రల మనస్తత్వం’ అంటూ దొస్తొయేవ్‌స్కీకి జోహారులర్పించారు ఐన్‌స్టీన్.

చిన్న కథకు ప్రపంచ సాహిత్యంలో అగ్రస్థానం కల్పించింది చెహోవ్, ఫ్రెంచ్ రచయిత మపాసా. చెహోవ్ ఏడెనిమిది వందల కథలూ, మపాసా నాలుగైదు వందల కథలూ రాశారు. ఏవి దొరికితే అవి చదవండి. ఇంతవరకూ, వాళ్ల కథల్లో ఏ ఒక్కటీ బాగులేదన్న పాఠకుడు పుట్టలేదు.

ఇక గోర్కీ ‘అమ్మ’ గురించి కొత్తగా చెప్పటానికేముంది? అది అందరికీ అవశ్య పఠనీయ గ్రంథం. ఒక నిషేధిత విప్లవ పార్టీ ప్రచారం కోసం ఒక నిరుపేద స్త్రీ చేసిన ప్రయత్నమే కథా వస్తువు అయినప్పటికీ, అందులోని ప్రతి పాత్రా మనల్ని నిత్యం పలకరిస్తూనే ఉంటుంది. గోర్కీ కథలు, నాటకం ‘లోయర్ డెప్త్స్(Lower Depths)’ కూడా తప్పక చదవాల్సినవే.

ఇరవయ్యవ శతాబ్ది తొలి దశకంలో మరో గొప్ప నవల అమెరికన్ రచయిత జాక్ లండన్ ‘ఐరన్ హీల్‘(Jack London-Iron Heel). ఇప్పటికి దీనికి చాలా అనువాదాలు వచ్చాయి. ‘ఉక్కుపాదం‘ పేరుతో తెలుగులో లభ్యం. (ఉడతాభక్తిగా నేను కూడా దీన్ని అనువాదం చేశాను.) పెట్టుబడిదారీ వ్యవస్థ ఎందుకు పతనం కాక తప్పదో, కార్మికవర్గ విప్లవ యుద్ధం ఎందుకు అనివార్యమో హేతుబద్ధంగా, గణాంకాలతో, వాదోపవాదాలతో నిరూపిస్తాడు రచయిత.

అనతోల్ ఫ్రాన్స్ రాసిన ‘పెంగ్విన్ ఐలండ్‘ మరో గొప్ప నవల. ప్రైవేట్ ఆస్తి ఆవిర్భావంతోనే సామాజిక వ్యవస్థ కుళ్లిపోయిందంటాడు పెంగ్విన్ పక్షులను పాత్రలుగా చేసి రాసిన ఈ సోషియో ఫాంటసీలో రచయిత (Penguin Island-Anatole France).

ఇగ్నేషియో సైలోన్ ఇటాలియన్ రచయిత. ఫాసిస్టు వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నాడు. ముస్సోలినీ నాటి దమనకాండ నరమేధాన్ని చిత్రించిన నవల ‘ఫాంటమారా(Ignazio Silone-Fontamara). ప్రతిఘటనను చిత్రించింది ‘బ్రెడ్ అండ్ వైన్‘. నిరక్షరాస్యులైన రైతులను హీరోలుగా చేసి రాసిన చిన్న నవల ‘ఫాంటమారా’ అయినా తప్పక చదవాలి.

ఇక, ఆధునిక లాటిన్ అమెరికన్ రచయిత ఎడువార్డో గెలీయనో (Eduardo Galeano) అంటే నాకిష్టం. అక్కడి పోరాటాలలో ప్రత్యక్షంగా పాల్గొని, స్వానుభవాలే డాక్యుఫిక్షన్‌గా రాసిన ‘డేస్ అండ్ నైట్స్ ఆఫ్ లవ్ అండ్ వార్‘ గొప్ప రచన. ‘బుక్ ఆఫ్ ఇమేజస్‘, ‘వాకింగ్ వర్డ్శ్, ‘అప్‌సైడ్ డౌన్’ ముఖ్యంగా ‘ఓపెన్ వెయిన్స్ ఆఫ్ లాటిన్ అమెరికా‘ చదివితే పెట్టుబడిదారీ వ్యవస్థ అమానుషత్వమూ, ప్రజాపోరాటాల అనివార్యతా తెలుస్తాయి.

కాని, ఇలా ఎన్ని చెప్పుకుంటాం? దోసిట్లో నీళ్లు పట్టుకుని ఇంతేనా అన్నట్టుగా ఉంటుంది. ఇంగ్లీష్‌లో ‘లైఫ్‌టైం రీడింగ్ ప్లాన్‘ లాంటి పుస్తకాల జాబితాలున్నాయి. తెలుగులో కూడా, అలాంటి ప్రయత్నమేదో చేస్తే తప్ప, ఏం చదవాలి? అన్న ప్రశ్నకు పరిష్కారం దొరకదు.

You Might Also Like

4 Comments

  1. pavan santhosh surampudi

    శ్రీపాద కథలు, ఆత్మకథ, తిరుమల రామచంద్ర “హంపీ నుండి హరప్పా దాక”, తెన్నేటి సూరి “ఛంఘిజ్ ఖాన్” కూడా పై లిస్టులో చేర్చదగ్గవి.
    ఐతే ఇదేదో ఈ పోస్టుకు లోటన్నట్టు చెప్పట్లేదు. వ్యాసం చాలా బావుంది. ఆ వ్యాసం చదివేవారికి కింది కామెంట్లో ఇవి కూడా ఉంటే పనికి రావొచ్చని పెడ్తున్నాను.

  2. rajeshwari

    నమస్కారములు
    చాలా మంచి విషయాలను అందించారు. ధన్య వాదములు

Leave a Reply