Goodbye Uncle Pai!

“అంకుల్ పాయ్ నిన్న చనిపోయారు. తెలుసా?” అన్న మెసేజ్ తో తెల్లారింది నాకు నిన్న. ముళ్ళపూడి గారు పోయిన రోజే అంకుల్ పాయ్ కూడా మరణించడం – పెద్ద షాక్. ఇద్దరు దగ్గరి స్నేహితురాళ్ళ పుట్టినరోజులూ, మరో ప్రాణ స్నేహితురాలి పెళ్ళి రోజూ ఆవేళే కావడం – ఐరనీ! మనుషుల్నీ, మనసుల్నీ కాక రోజుల్ని సెలబ్రేట్ చేసుకోవడంలో ఉన్న ఫూలిష్నెస్ అప్పుడే తట్టింది నాకు!

ఆ మధ్యోరోజు పుస్తకాలు సర్దుతూండగా – ’టింకిల్ విజ్ఞాన నిధి-1′ అన్న బౌండ్ పుస్తకం కనబడ్డది. మనసు చిన్నప్పటి రోజుల్లోకెళ్ళింది. బహుశా, నేను చదివిన తెలుగు టింకిల్ అదొక్కటే అనుకుంటాను. పుస్తకం మొదటి పేజీలో – నాదీ, తమ్ముడిదీ పేర్లు – బహుశా నా చేతివ్రాతే అనుకుంటాను. నేను రెండో తరగతీ, వాడు యూకేజీ! అంటే దాదాపు ఇరవై ఏళ్ళ నాటి పుస్తకమది. అక్షరాలు నేర్చుకున్నాక చదివిన తొలి పుస్తకాల్లో ఈ పుస్తకం ఒకటి. చాలా ఏళ్ళుగా దాన్ని తిప్పి చూడలేదు – లోపలున్న కథలన్నీ గుర్తే కనుక. ఇప్పుడు పేజీలు తిప్పుతూ ఉంటే, అన్నీ చిరిగిపోయినవే. ఒక్కటీ సరిగాలేదు. ఎందుకిలా ఉందీ పుస్తకమని అమ్మని అడిగితే – ’బహుశా, మీరు ఇద్దరు చిన్నప్పుడు తెగ చదివి దాన్ని చించేసి ఉంటారు’ అన్నది. నవ్వొచ్చింది కానీ, నిజం ఐనా కావొచ్చు.

ఇందులోనే మొదటి సారి కాళియా కాకి పరిచయమైంది. రామూ, పాయ్ మామ కూడానూ! ఆపై, దాదాపు స్కూలు చదువులు సాగినన్నాళ్ళూ వివిధ ఆంగ్ల టింకిల్స్ చదువుతూనే ఉన్నాము. అంకుల్ పాయ్ మాటల్ని కూడా తరుచుగా చదువుతూనే వచ్చాము. ఇక, అప్పుడప్పుడూ – ’అమర్ చిత్ర కథ’ ను కూడా చదివేవాళ్ళం. పెద్దై, పాతికేళ్ళ వయసు దాటినా కూడా, ఇప్పటికీ పిల్లలు గల ఇళ్ళలో – టింకిల్ చదివే పిల్లలు గల ఇళ్ళకు వెళ్ళినప్పుడల్లా – టింకిల్ చదువుతూనే ఉంటాను. నేను వాళ్ళింటికి వెళ్ళగానే – ’అక్కా, ఇదిగో లేటెస్ట్ టింకిల్’ అని ఇచ్చే చెల్లి కూడా ఉంది నాకు 🙂 ’అమర్ చిత్ర కథ’లకు ఇప్పుడు లేటెస్టుగా అభిమానినయ్యాను. వీటన్నింటికీ శ్రీకారం చుట్టిన వ్యక్తి – అనంత్ పాయ్. తెలుగులో చదివిన వారికి పాయ్ మామగానూ, మిగితా వారికి అంకుల్ పాయ్ గానూ పరిచితుడు.

రామూ-శ్యామూ, సుపాండి, కపీశ్-చమత్క-డుబ్ డుబ్, లిటిల్ రాజీ, కాళియా, షికారీ శాంబూ, మూషిక్ : ఎన్నని చెప్పేది? ఈ పాత్రలన్నీ నా ఆలోచనల్లో భాగం అయిపోయాయి. ఒక్కొక్కరి కథా కొన్నిసార్లు మా అమ్మ కూడా గుర్తు పడుతుందంటే, మా చిన్నప్పుడు మేము వీటిని ఎలా చదివామో -ఊహించుకోవచ్చు. వయసు పెరిగే కొద్దీ, వేరే పుస్తకాలపై ధ్యాస మళ్ళి, టింకిల్ ప్రోగ్రెస్ ను చూడలేదు(చందమామకు మల్లేనే!) . దాదాపు రెండేళ్ళ క్రితం ఒకసారి టింకిల్ వెబ్సైటులో గేమ్స్ ఆడుతున్న పిల్లను చూశాక, మళ్ళీ టింకిల్ పై కుతూహలం కలిగి వెబ్సైటు చూశాను. అప్పుడే అంకుల్ పాయ్ ని ఆన్లైన్ లో సంప్రదించడానికి చాలా ప్రయత్నించాను, అక్కడ ఇచ్చిన మెయిల్ ఐడీలతో. లాభం లేదు. అయితే, నా దృష్టిలో పాయ్ అంకుల్ వయసు యాభై ఏళ్ళ దగ్గరే ఆగిపోయింది. మొదట్నుంచీ నాకు పాయ్ అంకుల్ ఒక యాభై ఏళ్ళ వాడై ఉంటాడని ఊహ. ఇరవై ఏళ్ళుగా ఆ ఊహ అలాగే ఉండిపోయింది.

జాతస్య మరణం ధృవం – అనుకోవడం తప్పిస్తే చేయగలిగిందేముంది? అనిపించింది. పిల్లల సాహిత్యం కోసం అంకుల్ పాయ్ చేసిన కృషిని గుర్తుంచుకుని, మన వంతుగా ఏమి చేయగలమో? కొంత ఆలోచించి – అక్కడితో ఆగక, ఆచరించి చూపడమే బహూశా పాయ్ అంకుల్ కి ఆయన ’వర్చువల్’ పిల్లలైన వారందరూ అర్పించగల నివాళేమో!

You Might Also Like

3 Comments

  1. వేణు

    ఆంధ్రప్రభ వారపత్రికలో చాలాఏళ్ళ క్రితం రాము-శ్యాము కార్టూన్ స్ట్రిప్ వచ్చేది. నాకది చదవటం బాగా ఇష్టంగా ఉండేది. పకర్తలు అనంతపాయ్- మోహన్ దాస్ ల పేర్లు అప్పటినుంచీ బాగా గుర్తు. ముఖ్యంగా రాముకూ, శ్యాముకూ తలకట్టు లో, చొక్కాలో చిన్న మార్పుతో తేడా చూపించటం భలే నచ్చేది. అమరచిత్ర కథల సంగతి చెప్పేదేముంది? అదో చరిత్ర!

  2. తృష్ణ

    “నా దృష్టిలో పాయ్ అంకుల్ వయసు యాభై ఏళ్ళ దగ్గరే ఆగిపోయింది. మొదట్నుంచీ నాకు పాయ్ అంకుల్ ఒక యాభై ఏళ్ళ వాడై ఉంటాడని ఊహ. ఇరవై ఏళ్ళుగా ఆ ఊహ అలాగే ఉండిపోయింది. ”
    నాకు అంతేనండి…! పాయ్ మామ కబుర్లు భలే ఉండేవి..!! ఇంగ్లీష్, తెలుగు ఏది ముందు దొరికితే ఆ “టింకిల్” కొనేవాళ్ళం బాలజ్యోతి,చందమామలతో పాటూ. నా దగ్గర ఇంకా అమ్మ బైండ్ చేయించిన తెలుగు టింకిల్స్ ఉన్న బుక్ ఉంది. మా పాపకు అన్నం తినేప్పుడు రోజూ అవే కథలు. మళ్ళి మళ్ళీ అవే చదువు అంటుంది. కాళీయా, డుబ్-డుబ్,చమత్కా, సుపాండి(సపండి అని తప్పు పడినట్లుంది పోస్ట్ లో), డుబుక డుబుక కథ,గిజిగాడి గూడు, నీటి గుర్రం కథ..ఇలా ఇన్నో. ఏదీ మర్చిపోలేదు. కొన్ని కథలకు ముగింపు మీరు రాయండి అని వేసేవారు…

    death is cruel…but surprisingly unavoidable !!

  3. లలిత (తెలుగు4కిడ్స్)

    “మనుషుల్నీ, మనసుల్నీ కాక రోజుల్ని సెలబ్రేట్ చేసుకోవడంలో ఉన్న ఫూలిష్నెస్ అప్పుడే తట్టింది నాకు!” అవును కదా.
    “పిల్లల సాహిత్యం కోసం అంకుల్ పాయ్ చేసిన కృషిని గుర్తుంచుకుని, మన వంతుగా ఏమి చేయగలమో? కొంత ఆలోచించి – అక్కడితో ఆగక, ఆచరించి చూపడమే బహూశా పాయ్ అంకుల్ కి ఆయన ’వర్చువల్’ పిల్లలైన వారందరూ అర్పించగల నివాళేమో!” అవును కదా 🙂

Leave a Reply