ఆధునిక భేతాళ కథలు
పెట్టుబడి, సామ్రాజ్యవాదం చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఈ ప్రపంచం వ్యాపార ప్రధానమైనది. మార్కెట్ శక్తుల గుప్పిట్లో మానవతా విలువలు విలవిలలాడుతున్నాయి. సమూహం నుంచి వ్యక్తి వేరు పడుతున్నాడు, ఆ వ్యక్తి కూడా తనకు తాను పరాయివాడవుతున్నాడు. ‘నేను సుఖంగా ఉంటే చాలు… ఎప్పుడేమైనా పరవాలేద’ని ప్రతి ఒక్కరు అనుకోవాలనేది ఇప్పటి సూత్రీకరణ. ఎడాపెడా హోరెత్తుతున్న ఈ ప్రచారపు మాయలో పడి, బతుకు పోటీలో ఎలాగొలా నెగ్గాలనే తాపత్రయంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు తమ సొంత అస్థిత్వాన్ని మరచిపోతున్నారు. తమ కాళ్ళ కింద కరిగిపోతున్న నేల గురించి కూడా పట్టించుకోలేని స్థితికి చేరుకున్నారు.
సమకాలీన సమాజంలో ప్రబలంగా ఉన్న ఈ ధోరణి వలన ఒక ఉదాసీన వాతావరణం నెలకొన్నది. నిజానికి ఒకప్పటి కన్నా, నేడు సమస్యలు ఎక్కువగా ఉన్నా, ప్రజా స్పందన మాత్రం అంతం మాత్రంగానే ఉంది. ప్రజానీకాన్ని మేల్కొలిపే లక్ష్యంతో కృష్ణారావు గారు ఎంచుకున్న ఆయుధం-అక్షరం. విశాలాంధ్ర దినపత్రికలో 26 డిసెంబరు 2004 నుంచి 3 డిసెంబరు 2006 వరకు ఆదివారం అనుబంధంలో కృష్ణారావుగారు నిర్వహించిన శీర్షిక ‘ఆధునిక భేతాళ కథలు’ దానికి నిదర్శనం.
సామ్రాజ్యవాద ప్రపంచీకరణ దుష్ఫలితాలు, మార్కెట్ ఎకానమీ నిజస్వరూపం, తీవ్రతరమవుతున్న ఆర్ధిక దోపిడి, పాశ్చాత్య నాగరికత మోజులో వెర్రితలలు వేస్తున్న యువత, నైతిక విలువలు పాతరేసి మానవత్వాన్ని మంటగలిపి అడ్డుగోలుగా సంపాదనే ధ్యేయంగా ఉరకలేస్తున సమాజంపై సంధించిన ప్రశ్నాస్త్రాలే ఆధునిక భేతాళ కథలు.
ఈ నాటి సమాజంలో పరస్పర విరుద్ధమైన విషయాలెన్నో చోటు చేసుకుంటున్నాయి. కనుకనే ఆధునిక భేతాళుడికి అనేక ప్రశ్నలు వేసే అవకాశం లభించింది. ఈ కథలలో విక్రమార్కుడు రాచరికపు ప్రతినిధి కాదు, మార్క్సిజం వంటపంటిచ్చుకున్న ప్రజాస్వామ్య వాది. అందుకే ఆయా ప్రశ్నలకి తగిన సమాధానం చెబుతాడు. సమకాలీన సంఘటనలని ఇతివృత్తంగా తీసుకుని కృష్ణారావుగారు మొత్తం 100 కథలు రాసారు. ఈ కథలోని వ్యాఖ్యలన్నీ నేటి వ్యవస్థమీదే.
కారా మాస్టారు అన్నట్లు శిల్పరీత్యా ఇవి కథలు కానప్పటికీ వీటి ప్రయోజనం వీటికి ఉంది. రంగనాయకమ్మ గారు అన్నట్లు ప్రతీ కథలోను ఈ ప్రశ్నకి మనం జవాబు చెప్పగలమా….అని పాఠకులు ఆలోచిస్తారు. ఇలాంటి ఆలోచనలను పాఠకులకి ఈ పుస్తకం అందిస్తుంది.
వీటిని మూడు భాగాల పుస్తకంగా పంచవటి ఎడ్యుకేషనల్ సొసైటీ వారు ప్రచురించారు. Adhunika Bhetala Kathalu మొదటి భాగం ఏప్రిల్ 2006లో, రెండో భాగం సెప్టెంబరు 2006లో మరియు మూడో భాగం నవంబరు 2007లో ముద్రితమయ్యాయి. 90 పేజీల మొదటి పుస్తకం వెల 20/- రూపాయలు, 102 పేజీల రెండో భాగం వెల 20/- రూపాయలు, 92 పేజీల మూడో భాగం వెల కూడా 20 రూపాయలే. ఈ పుస్తకాలు విశాలాంధ్ర ప్రచురణలు, ప్రజాశక్తి ప్రచురణల అన్ని శాఖలలోను లభ్యమవుతాయి.
సాహిత్యం సమాజ హితం కోరేది అంటారు. కేవలం సమకాలీన సామాజిక స్థితిగతులను ప్రతిబింబించడం మాత్రమే కాకుండా, వాటిపై స్పష్టమైన వ్యాఖ్యానంతో సమాజ హితానికి మార్గం చూపించే మహత్తర ప్రయోజనం సాధించేదే ఉత్తమ సాహిత్యం. ఇజంలో ఇంప్రిజన్ కాకుండా చదవగలిగితే, ఇవి మంచి పుస్తకాలని నమ్మవచ్చు.
ఈగ హనుమాన్
పుస్తకాలను పరిచయం చేయడమనే గొప్ప క్రతువు చేస్తున్నందుకు మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా.
ఈగ హనుమాన్ (nanolu.blogspot.com)