The world according to Groucho Marx

ఇది ఒకప్పటి అమెరికన్ హాస్య చక్రవర్తి గ్రూచో మార్క్స్ జీవితకథ. మా ఇంట్లో చిన్నప్పుడు మల్లాది వెంకటకృష్ణమూర్తి పుస్తకాలు నాలుగుండేవి. ఒకదాని పేరు చిన్నపిల్లల కథల పుస్తకం, ఒక దాని పేరు హాలీవుడ్ విచిత్రాలు..మిగితా రెంటి పేర్లు గుర్తులేవు. ఆ హాలీవుడ్ విచిత్రాలు పుస్తకంలో హాలీవుడ్ ప్రముఖుల గురించి చిన్న చిన్న పిట్టకథలలాంటివి ఉండేవి. వాటి ద్వారానే నాకు గ్రూచో మార్క్స్ అన్న వ్యక్తి పరిచయమయ్యాడు. అక్కడ చదివిన రెండు మూడు జోకుల్లో మనిషి గుర్తుండిపోయాడు కానీ, అతని సినిమాలు ఇక్కడ దొరక్క, క్రమంగా మనసు మరుగున పడిపోయాడు. మళ్ళీ కోతికొమ్మచ్చి చదువుతున్నప్పుడు అతని ప్రస్తావన వచ్చింది. ఈసరికి ఏ సినిమాలు ఎలా దొరకబుచ్చుకోవాలో తెలుసు కనుక, కొంచెం ప్రయత్నించాను కానీ, ‘ఆ…ఇప్పుడు టైం ఎక్కడుంది లెద్దూ!’ అనుకుని వదిలేశా. కానీ, ఆపై మన పూర్ణిమ గ్రూచో మార్క్సు ని చదవడం మొదలుపెట్టాక ఇతగాడిని చదవాలన్న తాపత్రేయం పెరిగి.. ఆమధ్య బ్లాసమ్స్ లో ఈ పుస్తకం కనబడగానే, తీసేస్కునేలా చేసింది.

పుస్తకం పేరు: The world, according to Groucho Marx.
రచన: డేవిడ్ బ్రౌన్
పేజీలు: నూటాఅరవై

ఒక చిన్న పరిచయంతో మొదలై, గ్రూచో తల్లిదండ్రుల గురించి, ఆపై మార్క్స్ సోదరుల పుట్టుక గురించీ చెప్పాక, అసలు కథ మొదలౌతుంది. ఈ సోదరులు స్టేజీ నాటకాల నుండీ‌మొదలుపెట్టి ఎలా పేరు సంపాదించారో, సినిమాల్లోకి ఎలా ప్రవేశించారో, ఒక్కొక్కరి ప్రత్యేకత ఏమిటి? అసలు వీళ్ళకి ఆ పేర్లు ఎలా వచ్చాయి?‌(చికో, హార్పో, గ్రూచో, గుమో, జెపో అన్నవి వీళ్ళ అసలు పేర్లు కావు), వీరి ఎదుగుదల లో వీళ్ళ అమ్మ మిన్నీ పాత్ర ఎంత? – ఇదంతా క్లుప్తంగా వివరించారు (క్లుప్త వివరణ – భలే ఉంది కదూ పదం!). ఆపై, పుస్తకంలో మిగితా భాగం గ్రూచో చుట్టూనే తిరుగుతుంది. అతని జీవితం, నటనలో ప్రతిభ, రేడియో షో, లెక్కలేనన్ని పేరు ప్రఖ్యాతులు, కుటుంబ బాధ్యతలు, పెళ్ళిళ్ళు, పిల్లలు, అతని జీవితంలోని ఆడవారు, అతని చివరి రోజులు : ఇలా మొత్తంగా మనకి అతని జీవిత చిత్రం చూపిస్తుంది ఈ పుస్తకం.

చివర్లో, గ్రూచో మార్కు వన్ లైనర్ల సంకలనం పెట్టారు. దానితో పాటు అతను నటించిన చిత్రాలు, ఈ పుస్తకం రాసేందుకు ఉపయోగపడిన పుస్తకాల గురించి వివరాలు కూడా పొందుపరిచారు. నా అభిప్రాయంలో ఈ పుస్తకం పరిమాణానికి ఉన్న పరిమితుల్లో, బాగా రాయబడ్డట్లు లెక్క.

గ్రూచో మార్క్సు నటనతో నా పరిచయం అతి స్వల్పం. యూట్యూబులో ఒకటీ అరా వీడియోలు చూడ్డమే. అయితే, అతని వన్ లైనర్లతో మాత్రం పరిచయం ఉంది. ఈ పుస్తకం చదువుతూ ఉంటే, అతని వన్ లైనర్లలో ఉండే ‘పంచ్’ లాగానే, అతని జీవితంలోనూ ‘పంచ్’ ఇచ్చే ఆశ్చర్యకరమైన మలుపులు బానే ఉన్నాయి అనిపించింది (ఆశ్చర్యం నాకు, ఆయనక్కాదు!). గ్రూచో వన్ లైనర్లు నచ్చితే, ఆయన వ్యక్తిగా నచ్చాలన్న నియమం ఏదీ లేదనుకొండి, అది వేరే విషయం.

ఏమైనా, గ్రూచో గురించి కొంచెం తెలుసుకోవడానికి ఈ పుస్తకం‌బాగా ఉపకరిస్తుంది. అలాగే, ఇది చదివితే, ఆయన సినిమాలు చూడాలనీ, ఆయన రచనలు చదవాలనీ తప్పక అనిపిస్తుంది.

నాకు నచ్చిన కొన్ని వన్ లైనర్లు:
“Man is the only rat who’s always looking for cheesecake instead of cheese”

“If you keep having birthdays, you’ll eventually die”

“There’s always one thing I wanted to do before I quit…retire!”

“Will you marry me? Do you have any money? answer the second question first”

“Behind every successful man is a woman, behind her is his wife”

“marriage is a wonderful institution. But who wants to live in an institution?”

“military intelligence is a contradiction in terms”

“from the moment I picked your book up until I laid it down, I was convulsed with laughter. Someday, I intend reading it”

“you’ve got the brain of a four year old boy and i’ll bet he was glad to get rid of it”

“I could dance with you till the cows come home, on second thought, I’ll dance with the cows till you come home”

You Might Also Like

2 Comments

  1. మాలతి

    వన్ లైనర్లు బాగున్నాయి. **గ్రూచో వన్ లైనర్లు నచ్చితే, ఆయన వ్యక్తిగా నచ్చాలన్న నియమం ఏదీ లేదనుకొండి** – అంటే ఆయన వ్యక్తిగా నీకు నచ్చలేదనా. ఈపుస్తకం చదివినతరవాత నీకు ఆయనవ్యక్తిత్వంమీద ఏర్పడిన అభిప్రాయమా అది. ఈవిషయం స్పష్టం కాలేదిక్కడ :). అన్నట్టు నేను ఏదో silent film చూశానన్నాను. ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. నేను చూసింది చార్లీ చాప్లిన్, మార్క్స్ కాదు.

  2. raana

    My introduction to Marx brothers (esp.Groucho)
    is through a collected work
    – ” The Groucho Letters” –

    [You can find more one liners /punch lines
    at one place than in any other book.]

Leave a Reply