దగాపడిన తమ్ముడు
వ్యాసకర్త: బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్
మంచి పుస్తకాల కోసం తెలుపు.కాం వెదుకుతూండగా మొదటిసారి ఈ పుస్తకం గురుంచి చదవటం జరిగింది. అప్పటికి బలివాడ కాంతారావుగారెవరో, ఆయనేమేం పుస్తకాలు వ్రాశారో నాకు తెలియదు. టైటిల్ ఆకర్షణీయంగా ఉండటంతో ఆర్డర్ చేశాను. నా నమ్మకం వమ్ము కాలేదు. ఈ పుస్తకం ఒక గొప్ప రచయితని, చిరకాలం మనస్సుపొరల్లో నిక్షిప్తమైపోయే ఒక చక్కటి కథను పరిచయం చేసింది.దగాపడిన తమ్ముడు ఒక ఆర్ద్రపూరిత విషాదాంత నవల. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఆంధ్రదేశంలో రైతులు ఎదుర్కొంటున్న కడగండ్ల నేపథ్యంలో కథ సాగుతుంది. చెప్పుకోవడానికి ఆనాటిదే అయినా ఇందులోని కొన్ని సన్నివేశాలు ఈనాటీకీ వర్తిస్తాయి. మన కళ్ళ ముందే మెదులుతూ మనస్సుని వికలం చేస్తాయి. ఇందులో పాత్రలు కనబడవు, మట్టిని నమ్ముకున్న అమాయకమైన మనుషులే కనిపిస్తారు. జీవం ఉట్టిపడుతున్న రక్తమాంసాలతో వాళ్ళు ఆహ్వానిస్తే, పాఠకుడు వాళ్ళతో కలిసిపోయి వారి సాధక బాధలు పంచుకుంటూ వాళ్ళు నవ్వితే తనూ నవ్వుతాడు, రగిలిపోతే తనూ పిడికిళ్ళు బిగిస్తాడు, గుండెలు బాదుకుంటే తనూ మౌనంగా ఆ శోకాన్ని అనుభవిస్తాడు.
కథ
——-
ఆంధ్రదేశంలో ఉత్తరాన వంశధార నదీతీరాన గల నవిరి అనే కుగ్రామంలో దాసుడికి గ్రామదేవత పూని ఊళ్ళో ఉత్సవాలు చెయ్యాలని శివాలెత్తటంతో కథ
ప్రారంభమవుతుంది.గౌరిపున్నమికి ఉత్సవాలు చేస్తారు ప్రజలందరూ. అక్కడ డప్పువాద్యాలకు ఉత్సాహంగా పాదాలు కదుపుతూ పరిచయమవుతాడు కథానాయకుడు పుల్లయ్య. పుల్లయ్య సాముగరడిలో ఘటికుడు.ఉక్కులాంటి శరీరం,నల్లటి శరీరంపై నిగనిగలాడే కండలు,గిరజాల జుత్తు,మెలితిరిగిన మీసాలతో పోతపోసిన విగ్రహంలా ఉంటాడు. అతనికున్న ఆస్తల్లా అతని తండ్రి గడించిన యాభై సెంట్ల భూమి మాత్రమే. అది కాకుండా పట్నం దొరకున్న రెండకరాల పొలం కూడా కౌలుకు దున్నుతూ ఏ చీకూ చింతా లేకుండా కులాసాగా బ్రతికేస్తూంటాడు. నవిరి గ్రామంలోనే కాక ఆ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా అంతటి అందగాడు, డప్పు శబ్దానికి లయబద్ధంగా నృత్యం చేసేవాడు లేడని ప్రతీతి.
‘నా’ అనే వాళ్ళు లేని పుల్లయ్య, పేదింటి పిల్లైన నీలిని ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. ఆమె చేతికి ఎముక ఉండదు. అపకారికి ఉపకారం చేసే రకం.చిన్నప్పుడు
చెడు సావాసాలు చేసి ప్రస్తుతం గుడ్డివాడైన ముసలి వెంకన్నకే కాకుండా, తన ఇంటి గడప తొక్కిన లేనివాళ్ళందరికీ కలోగంజో పోసి కడుపు నింపి పంపుతూంటుంది .ఆమె కడుపు పండి కొడుకు పుడతాడు.’అయ్యే పుట్టాడ ‘ని సంబరపడిపోయిన పుల్లయ్య అ పిల్లవాడికి తన అయ్య పేరే పెడతాడు ‘మల్లునాయుడ ‘ని. వాడితోనే అతని లోకం. వాడు పెరిగి పెద్దయ్యి తనలాగే డప్పు వాద్యాలకు అద్భుతంగా చిందులెయ్యాలని, న్యాయం ధర్మం నిలిపే మారాజు కావాలని, అయ్య పేరు, తన పేరు నిలబెట్టాలని కలలు కంటూ సంతోషపడిపోతూంటాడు.
కాలం గడుస్తుంది. ఎప్పటిలాగా పంటలు పండటం లేదు. అయినా కౌలు ధాన్యం కొలిచి ఇవ్వాల్సిందే కాబట్టి మిగిలిన దాంతోనే సరిపెట్టుకుంటారు పుల్లయ్య,నీలి. రేషన్ కోసం గవర్నమెంటు ధాన్యం సేకరణ ప్రారంభిస్తుంది. ధరలు మండిపోతాయి. ఊళ్ళో పెద్దలు, పేదల కోసం పైసా విదిలించకపోయినా కోపరేటివ్ స్టోర్సు సరుకుల్ని రాత్రికి రాత్రే పట్నం తరలించి రెట్టింపు ధరలకు అమ్ముకుంటూంటారు. ఆ పెద్దమనుషుల్లో రాజిగాడు ఒకడు. ఈ అన్యాయం గురుంచి ప్రశ్నించిన గ్రామదేవత దాసుణ్ణి, రాజిగాడు కొట్టబోతే పుల్లయ్య అడ్డుకొని అవతలకి విసిరేస్తాడు .రాజిగాడు అదను చూసి రేషన్ ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్లని వెంటబెట్టుకొని వస్తాడు. తనకు మిగిలింది తనకే సరిపోదు. అలాంటప్పుడు ఏ మాత్రం గిట్టుబాటు కాని ధరలకి ధాన్యం ఎలా ఇవ్వాలని ఎదురు తిరుగుతాడు పుల్లయ్య. పోలీసులు కల్పించుకుంటే పుల్లయ్య తన బాణకర్రతో వాళ్ళ వొళ్ళు హూనం చేస్తాడు. అంతలోనే ‘ కండ లేని వాళ్ళను కొట్టానే ‘ అని బాధపడిపోతే పోలీసులు అతనికి సంకెళ్ళు తగిలిస్తారు. అతన్ని బెయిలు మీద విడిపించటానికి, వకీలు ఖర్చులకు, కోర్టు విధించిన 100 రూపాయిల జరిమానా చెల్లించటానికి రాజిగాడి పెళ్ళాం దగ్గర పుల్లయ్య పొలం తాకట్టు పెడుతుంది నీలి.
ఊళ్ళో పరిస్థితులు దిగజారిపోతాయి. చిన్నా చితకా రైతుల పరిస్థితి అధ్వానమైపోతుంది. దొంగతనాలు పెరిగిపోతాయి. ఒకప్పుడు బాగా బ్రతికిన పీస లాంటి వాళ్ళు ఊళ్ళో దొంగతనాలకు తెగబడతారు. పోషించే దిక్కులేక దాసుడు మరణిస్తాడు. దైన్యం కమ్ముకొంటూంటే జరుగుబాటు కోసం ధాన్యం వర్తకం ప్రారంభిస్తాడు పుల్లయ్య. అతనికి ఇష్టం లేకపోయినా నీలి కూడా కూలికి వెళ్ళటం ప్రారంభిస్తుంది . తన కొడుకు పెరుగుతూంటే రోజులిలా తయారయ్యాయేమిటని విసుక్కుంటాడు పుల్లయ్య. పిల్లవాడైన మల్లు క్షణం కూడా తండ్రిని వదలకుండా తిరుగుతూ అజమాయిషీ చేస్తూంటాడు. నీలి ఈ మారు ఆడపిల్లకు జన్మనిస్తుంది. పుల్లయ్య కౌలుకి సాగు చేసుకుంటున్న భూమిని, పట్నం దొర రాజిగాడికి అమ్మేస్తాడు. పుల్లయ్య బ్రతిమాలుకున్నా లాభం లేకపోతుంది. తాతల కాలం నుంచి సాగుచేసుకుంటూ వస్తున్న భూమి పరులపాలైపోతూంటే మూడేళ్ళ మల్లుని కావలించుకొని కళ్ళనీళ్ళు పెట్టుకుంటాడు పుల్లయ్య. యవ్వనంలో తన చెడు తిరుగుళ్ళకు ఫలితంగా పుట్టిన రాజిగాడు, పుల్లయ్యకు అన్యాయం చేశాడని తెలిసి కోపంతో అతన్ని శిక్షించటానికి వెళ్ళి అందరికీ దొరికిపోతాడు గుడ్డివెంకన్న.పుల్లయ్యే అతన్నీ పనికి పురమాయించాడని ఊరంతా అనుమానిస్తుంది. నీలి నచ్చజెబితే పుల్లయ్య గుండె దిటవు చేసుకొని కూలికి వెళ్తాడు. కట్టెల వ్యాపారం చేస్తాడు. ఏదీ కలసిరాదు. తాకట్టు పెట్టడానికి ఏమీ లేకపోవటంతో ఊళ్ళో అప్పు పుట్టదు. ఇక ఆ ఊళ్ళో ఉండటానికి మనసొప్పక పట్నం వెళ్ళి బాగుపడదామని నిశ్చయించుకుంటాడు. భార్య పిల్లలతో కలిసి వాల్తేరు వెళ్తాడు.
వాల్తేరులో మురుగుకాల్వ పక్కన ఒక పాక అద్దెకు తీసుకొని కాపురముంటారు నీలి, పుల్లయ్య. పొట్టకూటి కోసం పుల్లయ్య నానా అగచాట్లు పడతాడు. మార్కెట్లో కూలిపనికి వెళ్తాడు. చదువు రాకపోయినా ఉద్యోగం ఇప్పిస్తారేమోనన్న ఆశతో ఎంప్లాయిమెంటు ఎక్స్‌ఛేంజ్ ఆఫీసరు కాళ్ళు పట్టుకుంటాడు. కడుపు నిండా తిండి పెట్టి నాలుగు డబ్బులిప్పిస్తారంటే ఎన్నికల ప్రచారానికి వెళ్తాడు. ఎన్ని చేసినా నలుగురు మనుషుల నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్ళటం అంతంతమాత్రంగానే ఉంటుంది. దాంతో అభిమానం చంపుకొని పిల్లల ఆకలి తీర్చటంకోసం దొంగగా మారతాడు. ఆ డబ్బుతో కొన్నాళ్ళు కుటుంబానికే లోటు లేకుండా చూసుకుంటాడు. పేకాట,బ్రాకెట్టు మరిగి డబ్బులు నాశనం చేసుకుంటాడు. ఎలాగైనా పెద్దమొత్తం దొంగతనం చేసి మళ్ళీ తన స్వగ్రామం వెళ్ళి పాత పుల్లయ్యలా దర్జాగా బ్రతకాలని అనుకుంటాడు. ప్రయత్నం వికటించి, కొడుకు మల్లునాయుడు కారణంగా పోలీసులకు పట్టుబడిపోతాడు. నిజం తెలిసి నీలి కొయ్యబారిపోయినా ధర్మానికి కట్టుబడి కోర్టులో నిజమే చెబుతుంది. బరువెక్కిన హృదయంతో పుల్లయ్య కూడా నేరం అంగీకరిస్తాడు. మూడు-నాలుగేళ్ళు ఖైదు తప్పదని ఇన్‌స్పెక్టర్ చెబుతాడు. పిల్లలిద్దరితో కలిసి నిండు చూలాలైన నీలి రోడ్డున పడటంతో కథ సమాప్తమవుతుంది.
బలివాడ కాంతారావు గారి రచనా శైలి ఆకట్టుకుంటుంది. ఆణిముత్యాల్లాంటి అచ్చమైన తెలుగు సామెతలను విరివిగా వాడుకొని, వాస్తవికతకు దగ్గరగా రకరకాల మనస్తత్వాలని ఆవిష్కరించిన తీరు అద్భుతంగా ఉంది.చినుకు రాలినప్పుడు చిగురించే మట్టివాసన లాంటి పరిమళం, సంభాషణల్లో గుభాళిస్తుంది . చిన్నప్పుడు దొంగతనాలు చేశాడని గుడ్డి వెంకన్నను ఈసడించుకున్న పుల్లయ్య, కొడుకు ఆకలి తీర్చటం కోసం ఒక బిచ్చగత్తె దగ్గర తనూ అదే పని చెయ్యాల్సి వచ్చినప్పుడు పడే అంతర్మథనాన్ని, దొంగలించిన సొమ్ము వడ్డీతో సహా తిరిగి ఇచ్చేసి అతను పొందే ఆనందాన్ని చక్కగా వర్ణిస్తారు రచయిత. అలాగే పుల్లయ్య అతని కొడుకు మల్లునాయుడుల మధ్య ఉన్న బంధాన్ని కూడా హృద్యంగా మలచారు. చెడులో కూడా మంచిని చూడమని చెప్పే నీలి, ఆమె ముసలితల్లి మూర్తీభవించిన మానవత్వానికి ప్రతీకలుగా నిలిచిపోతే, విలువలకు కట్టుబడి, మారుతున్న కాలంతో రాజీపడలేక నిత్యం అంతః సంఘర్షణకు లోనయ్యి తుదకి పతనమైపోయే సగటు మానవుడిగా పుల్లయ్య మిగిలిపోతాడు.’ నరజాతి చరిత్ర మొత్తం పరపీడన పరాయణత్వం’ అన్నాడు మహాకవి శ్రీశ్రీ. ఆ పీడిత వర్గపు ప్రతినిధుల గుండెచప్పుళ్ళే ఇందులో ప్రతిఫలిస్తాయి.ప్రతి పాఠకుడి పర్సనల్ గ్రంథాలయంలో పదిలంగా ఉండాల్సిన పుస్తకం ఇది. ప్రజాదరణ పొందిన ఈ నవలని నేషనల్ బుక్ ట్రస్టు వారు అన్ని భారతీయ భాషల్లోకి అనువదించారు.
ప్రతులకి విశాలాంధ్ర బూక్‌హవుస్‌ని సంప్రదించండి.
వెల :75 రూపాయిలు
Vikram
sir
dini ending intena…………leka inka inda….?
బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్
కొత్తపాళీ గారు నెనెర్లు.
కొత్తపాళీ
మంచి సమీక్ష, శ్రీకాంత్ గారు.
మాలతి
లోకేష్ శ్రీకాంత్ గారూ, బాగా గుర్తు లేదు కానీ ఆంధ్రపత్రిక అనుకుంటానండీ. దగాపడిన తమ్ముడు 1957లో వచ్చింది. మీకు ఆసక్తి ఉంటే నా తూలిక.నెట్ లో, http://thulika.net/2010December/kantharaothewriter.html నేను ఆయనమీద రాసినవ్యాసం, ఒక కథకి అనువాదం ఉన్నాయి. చూడగలరు.
బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్
మాలతి గారు,
కృతజ్ఞతలు.అయితే ఈ నవల సీరియల్‌గా వచ్చిందన్నమాట. ఎందులో ?
కథ మొత్తం చెప్పకుండా సమీక్ష వ్రాయాలని మొదట అనుకున్నా కానీ కొన్ని సమీక్షలలో మొత్తం కథ వివరంగా ఉండేసరికి నేను కూడా ఆ పద్ధతిని ఫాలో అయిపోయాను.
మాలతి
మంచి నవల. ఇది సీరియల్ గా వస్తున్న రోజుల్లో ఎంతో ఉత్సాహంగా చదివేను, మీరన్నట్టు కాంతారావుగారి శైలిమూలంగానే. కథ అంతా అంత వివరంగా చెప్పకుండా ఉంటే బాగుండేదేమో. చివర రచయితశైలిగురించి చెప్పిన వాక్యాలు బాగున్నాయి. మంచిపుస్తకం పరిచయం చేసినందుకు అభినందనలు.
GnanaPrakash B
pullayah lanti enta mandi unnaro ee prapanchamlo.varandariki manchi rojulu ravali korukuntunnanu….