రావూరు వెంకట సత్యనారాయణ గారు – ఒక పరిచయం
రాసిన వారు: జ్ఞాన ప్రసూన
******************
[నాటి తరం రచయిత రావూరి వెంకట సత్యనారాయణ గారి గురించి, వారి కుమార్తె జ్ఞాన ప్రసూన గారు రాసిన వ్యాసం ఇది. రావూరి వారి ‘ఆషామాషీ’ గురించి ఇదివరలో పుస్తకం.నెట్ లో వచ్చిన వ్యాసం ఇక్కడ చూడవచ్చు. రావూరి వారి చిత్రం అందించినందుకు మాగంటి వంశీ గారికి ధన్యవాదాలు. – పుస్తకం.నెట్]
రావూరువారు కీ.శే.రావూరు సుబ్రహ్మణ్యం,రాజ్యలక్ష్మి దంపతులకు మూడవ కుమారునిగా జన్మించారు.పొలాల వెంట తిరుగుతూ,సీతా కోక చిలుకల్ని పట్టుకొంటూ, పలకా బలపం పట్టకుండా రావూరు బాల్యం గడిచిపొయింది. తండ్రి అయిదు వూళ్ళకి కరిణీకం చేసేవారు. సమిష్టి కుటుంబం. పెద్దన్న గారికి పిల్లలు లేరు. ఆయన దానాలు,ధర్మాలు ఎక్కువ చేసే వారు. అన్నగార్ని రామునిలా ఆరాధించి, లక్ష్మ ణునిలా సుబ్రహ్మణ్యం గారు సేవ చేసి ,ఆయన చేసిన అప్పులన్ని తీర్చి రిక్త హస్తాలతో బయట పడ్డారు సుబ్రహ్మణ్యంగారు.అప్పటికి రావూరువారు చదువు కోసం బందరు చేరారు. పెద్దమ్మగారి సహాయంతో బి.ఏ. దాకా వచ్చారు. సాధారణమైన బి. ఏ. చదువు పై మోజులేదు. ఊహా లోకాల్లో విహరిస్తూ వుండేవారు. ఒకసారి పరీక్షలలో కథ వ్రాయమంటే “వచనం లో అందరూ వ్రాస్తారు,పద్యాలతో వ్రాస్తే కొత్తగా వుంటుంది,ప్రత్యేకత సంపాదించ వచ్చు” అని పద్యాలలో వ్రాసారు. ప్రశ్న పత్రాలు పరిశీలించిన వ్యక్తి “వచనంలో వ్రాయమంటే పద్యాలెందుకు వ్రాసావు?”అని సున్న పెట్టారట!
తండ్రి గారికి కూడా రావూరుగారు కవిత్వం వ్రాయడం ఇష్టం లేదు. “కుచేలోపాఖ్యానం” అని చిన్న కావ్యం వ్రాస్తే “ఈకవిత్వాలు అన్నం పెడతాయా?ఆదరిస్తాయా?”అని చించి వేసారట! చిన్న అన్నగారు మాత్రం ప్రొత్సహించేవారట. బందరులో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ రోజూ సాయంత్రాల వేళ కృష్ణా పత్రిక ఆఫీసులో హాజరయేవారట. శ్రీ ముట్నూరి కృష్ణారావుగారు అంటే రావూరు గారికి కొండంత గౌరవం . కృష్ణా పత్రిక అంటే సొంత కూతురిలా అభిమానము. అప్పుడప్పుడు సినిమా రివ్యూ వ్రాస్తూ వుండేవారట. ఎప్పటికైనా కృష్ణా పత్రికలో పనిచేయాలని అరాటం.
కృష్ణా పత్రిక ఆఫీసులో పెరటివేపు చక్కని తోట వుండేది. పూల చెట్లు, క్రోటన్స్ చాలా ఉండేవి. కృష్ణారావుగారు సుందరమైన శిల్పాలు తెప్పించి ఆ చెట్ల మధ్య పెట్టించారు. అప్పుడప్పుడూ ఆయన చెట్ల మధ్య పచార్లు చేస్తూ ఏవో ఆధ్యాత్మిక భావాల లోతులు తరచి చూచుకొంటున్నట్లు మౌనంగా వుండేవారు. రావూరు కూడా అంత మౌనంగానూ ఆయన అడుగులో అడుగు వేసు కొంటూ వెనక తిరిగేవారు. అలా ఒకరోజు నడుస్తుంటే ముట్నూరి వారు తలవెనక్కి తిప్పి “రేపటినుంచి నుంచి రండి.” అన్నారట. అంతే !రావూరు వారికి ఏనుగెక్కినంత సంతోషం కలిగి ఒక్క ఉదుటున ఇంటికి వచ్చి, అందరికీ ‘ రేపు నేను కృష్ణా పత్రిక ఆఫీసులో చేరబోతున్నాను’ అని చెప్పారట! అదే ఆయన జీవితంలో సాహితి వ్యవసాయానికి, శారదాంబ సేవకు మొదటి మెట్టు. కృష్ణా పత్రిక ఆఫీసులోకి వెళ్ళగానే, ఎడమ వేపు మేనేజరు గారిగది. పక్కనే గదిలో ఎదురుగా కుర్చీలో కమలాకర వెంకటరావుగారు కూర్చునేవారు, వారు ఆధ్యాత్మిక పరమైన వ్యాసాలూ రచించేవారు. పక్కనే రావూరు వారూ, వారి ఎదుట ముట్నూరివారు పడకకుర్చిలో కూర్చునేవారు. ధవళ వస్త్ర ధారులై తలపాగాతో గంభీరంగా కూర్చున్న వారిని చూస్తే, హిమాలయ పర్వతాల సొగసు స్ఫురించేది. ప్రతిష్ఠాత్మకమైన పత్రికా సంపాదకుడు ఎలావుండాలి అంటే ఆయనే ఒక ఉదాహరణ. ఆఫీసుకు ఇన్ని గంటలకు రావాలి, ఇన్ని గంటలు పని చెయ్యాలి అని నియమాలు,అధికారాలు లేవు. కంపోజిటరు నుంచి ఉప సంపాదకుల దాకా వారు మౌనం గానే నియంత్రించే వారు. కృష్ణా రావు గారు సంపాదకీయం వ్రాసేవారు. రావూరువారు వారం వారం హాస్యపు జల్లులతో వడగళ్ళు కురిపించేవారు. ముట్నూరి వారి సంపాదకీయపు స్థాయిలో వడగళ్ళు సమాన ఖ్యాతి పొందాయి. ఈ వడగళ్ళకి ఆఫీసులో అకౌంటెంట్ గా పనిచేసే మల్లినాథ సూరిగారు కథా నాయకుడు. ఆయన మాటల్లో చెణుకులు రావూరు కలంలో వడగళ్ళు అయ్యేవి.
అదే సమయంలో “ఆనంద వాణి” పత్రికలో కప్పుకాఫీ అనే శీర్షికతో హాస్యమైన రచనలు వ్రాసేవారు. వినోదినిలో కూడా వ్రాసేవారు. వినువీథిలో తిరిగే విహంగంలా రావూరు రచనా వ్యాసంగం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లింది. రాజకీయాలు కథలు కథలుగా ఉత్సుకతని రేకెత్తిస్తూ వ్రాసేవారు. సినిమా నాటకాల సమీక్షలు, సారస్వత సభల విశేషాలు వ్రాసేవారు. గ్రామీణ జీవితంపై మోజున్న రావూరు, కృష్ణా పత్రికలో ఎన్నో కొత్తకొత్త శీర్షికలు ఆవిష్కరించారు. “మా గ్రామము, గుడిగంటలు, మనకవులు, మరపురాని బాపూజీ, జీవిత చిత్రాలు” లాంటి వ్యాసాలూ వ్రాసారు, వ్రాయించారు, ప్రవచించారు. వీరి మొదటి నవల “నెలవంక”. అనపత్య దోషంతో కుమిలిపోయే ఒక నటుని జీవితం.హఠాత్తుగా ఒక మలుపు తిరిగి ఆధ్యాత్మికపు దారిలో ముక్తి పొందిన ఒక దంపతుల కథ.
బాటసారి, పాలవెల్లి, ప్రత్యూషం, ఇక్కడ పుట్టినవే! ఆయన కలం నుంచి జాలువారిన ప్రతి సిరా బొట్టు పత్రికలో వంద అక్షరాలై చిరంజీవులైనాయి. పేరు ప్రతిష్టా, ధనం, సంపాదించాలనే కండూతి వారికి లేదు. మనసులోని భావాలు వెళ్ళడించడానికి ఒక తావు దొరికిందని, దానిని పరిపూర్ణం గా ఆరాధించి,ఎంత సుందరంగా సింగారించగలిగితే జీవితం అంత ధన్యమవుతుందని ఆశించి,అనుసరించిన జీవి.బందరు లలిత కళలకు పట్టుకొమ్మ.స్వాతంత్ర వీరులకు పుట్టిల్లు. వాతావరణం ఎప్పుడూ ఉద్వేగపూరితంగా, ఉత్తేజకరంగా నవనవోన్మేషణతో విరాజిల్లేది.
రావూరువారు ‘నవ్యసాహిత్యపరిషత్’ సభ్యులు. “ప్రతిభ” లో వ్యాసాలు వ్రాసారు. ఆంధ్ర నాటక కళాపరిషత్ కు పది సంవత్సరాలు కార్యదర్శిగా పని చేసారు. నాటకాలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. వారి నాటకాలకు కళా పరిషత్ లో బహుమతులు కూడా అందాయి. “ఎండమావులు, పరితాపం, తలంబ్రాలు, ఏరువాక, కీర్తి” పేరొందిన నాటకాలు. బందరులో సాహిత్య మండలి స్థాపక వర్గంలో వుండి కార్యదర్శిగా కూడా పని చేసారు. వడగళ్ళు శీర్షికను మెచ్చుకొని జయపూర్ మహారాజ్ విక్రమదేవ వర్మ వీరికి సన్మానం చేసారు. ఆలిండియా రేడియోవారికి నక్షత్రాలు-నాగలి, కనిపించటంలేదు, రిహార్సల్స్,షాజహాన్, బిలహణీయం, నెలవంక వంటి నాటక, నాటికలు వ్రాసారు. ఎన్నో ప్రసంగాలు చేసారు. గంట నాటకమైన నెలవంకను ఆలిండియా రేడియో పదునాలుగు భాషలలోకి అనువదించి ప్రసారంచేసారు.
ప్రఖ్యాత నటులైన డి.వి.సుబ్బారావుగారు, నాదస్వర విద్వాన్ దాలిపర్తి పిచ్చిహరుల గజారోహణ మహోత్సవానికి బందరులో కమిటీ కార్యదర్శిగా పనిచేసారు. భాషా కుటీరం అనే సాహితీ సంస్థ స్థాపించి, కొత్త రచయితలని ప్రోత్సహించి, రచనలు వ్రాయించి, అచ్చొత్తించి,వారిని అభివృద్ధిలోనికి తెచ్చారు. ఎందరో కళాకారులకి,రచయితలకి, ప్రముఖ రాజకీయ వేత్తలకు సన్మానాలు చేసారు. ఈ సాహితీ సభలు నిరాడంబరంగా కొద్ది సభ్యులతో జరిగేవి. కానీ ఆ సభలోని సభ్యులందరు మహా మహులే వుండేవారు. బందారులో చుక్కాని అనే పత్రిక స్థాపించి, కొనాళ్ళు నడిపి వేరొకరికి అప్పగించారు.
బందరు నుండి మద్రాస్ వెళ్ళి, పదిహేనుకు పైగా తెలుగుసినిమాలకు పాటలు, మాటలు, కధ వ్రాసారు. చక్రపాణి హాస్య రసభరిత చిత్రం. వరుడు కావాలి మరో హాస్యప్రధానమైన చిత్రం. సొంత ఊరు చిత్రంలో గ్రామీణాభివృద్ధి ఇతివృత్తం. సతీసక్కుబాయి, కృష్ణమాయ, కృష్నతులాభారం, సతీసావిత్రి, నాగపంచమి, చింతామణి మొదలైన చిత్రాలకు వ్రాసారు. ఆంధ్రప్రభ వీక్లీ ఇంఛార్జి ఎడిటర్ గా, డైలీ కి సబ్ ఎడితర్గా చిత్తూరు, విజయవాడలలో పనిచేసారు. ఆంధ్రప్రభకి హైదరాబాద్ స్పెషల్ కరస్పోండెంట్ గా పనిచేసారు. తరువాత బయటకు వచ్చి, ఆంధ్రప్రభలో నడిపిన ఆషామాషిని మాత్రం కంటిన్యు చేసారు. ఆషామాషి అనే శీర్షిక హాస్య ప్రధానమైనది. అది మూడువేలకుపైగా వ్యాసాలు వ్రాసారు.
స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలకి సాంస్కృతిక విభాగంలో కార్యదర్శిగా పనిచేసారు. ప్రపంచ తెలుగు సమ్మేళనంలో సన్మానం అందుకున్నారు. 1978 లో ఆంధ్ర విస్వవిద్యాలయంవారు శ్రీ రావూరుకు ‘కళాప్రపూర్ణా బిరుదునిచ్చి సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన పానుగంటి లక్ష్మీ నరసింహం మరియు సాంఖ్యాయనశర్మ శతజయంతి ఉత్సవాలకు సభ్యునిగా ఎన్నికైనారు. వెయ్యికిపైగా వ్యాసాలు వివిధ పత్రికలలో ప్రచురించపడ్డాయి.
శ్రీ.రావూరుకు సాహితీ స్వర్ణ జయంతి జరిగింది. ఇచటవీచినగాలి, రాయల కాలం, హంసలదీవి రావూరివారి చిన్న నవలలు. రావూరుకు పరిచయం వున్న ప్రముఖుల గురించి వంద చందమామలు అనే పుస్తకాలు 10 భాగాలు ప్రచురించారు. కౌసల్యా సుప్రజా రామా అనే పేరుతో సంక్షిప్తంగా రామాయణం వ్రాసారు. చివరి క్షణందాకా ఎడమచేత సిగరెట్టు, కుడిచేతిలో కలం క్రిందపెట్టకుండా జీవితం గడిపిన కృషీవలుడు శ్రీ రావూరు. సాదా సీదా భోజనం, ఆరారగా కాఫీ, డ్రైవాష్ చేసిన పొందూరు ఖద్దరు బట్టలు వుంటే చాలు. సిగరెట్టు, అమృతాంజనం,హార్లిక్స్ చాలా ఇష్టమైనవి. ఎక్కడో వూహలలో విహరిస్తూ కిందికి దిగి వాస్తవంలో జీవించటానికి గిల గిల లాడే మనస్తత్వం. రేపటిచింతలేదు, ఈరోజుగురుంచి అసంతృప్తిలేదు. కుచేలుడిలావున్నా (ఆయనకు ఒక్కర్తేకుమార్తె) కుబేరునిలా గౌరవించగలిగే భార్య. దైవంగా ఆరాధించే కుమార్తె వారి రచనా వ్యాసంగానికి అహరహం జేజేలు పలికేవారు.
[ఫొటోలు అందించినందుకు మాగంటి వంశీ గారికి ధన్యవాదాలు – పుస్తకం.నెట్]
మధుపర్కాలు, రావూరు వెంకట సత్యనారాయణరావుగారి రచన – తెలుగు తూలిక
[…] జ్ఞానప్రసూనగారివ్యాసం ఇక్కడ […]
దుర్గ
ధన్యవాదాలు సౌమ్య గారు. ఇప్పుడే చూసాను. నా వీలుని బట్టి చదువుతానండి!
పిఆర్ తమిరి
చాలా కాలం క్రిందట యువభారతి వారు ఏర్చికూర్చి వడగళ్లు ప్రచురించారు. అది చదివిన తర్వాత రావూరి వారు నా అభిమాన రచయితల జాబితాలో చేరిపోయారు…ఇపుడు రావూరి గారి గురించి చదువుతుంటే ఎంతో ఆనందం కలిగింది…మంచి వ్యాసం అందించిన ఙ్ఞానప్రసూనగారికి అభినందనలు…
-పిఆర్ తమిరి
సౌమ్య
@Durga garu:
http://maganti.org/newgen/vyasavali.html
-ఈ లంకెలో కిందకి వెళ్ళి చూస్తే, కొన్ని ‘వడగళ్ళూ వ్యాసాలున్నాయి.
లలిత
అదృష్టవంతులండీ జ్ఞానప్రసూన గారు . సాహిత్యాన్ని మించిన సంపద ఏం వుంటుంది . మీ నాన్నగారు మీకు గొప్ప ఆస్తిని ఇచ్చారు
దుర్గ
రావురి గారి గురించి మాకు తెలియని విషయాలు తెలియజేసినందుకు చాలా సంతోషమండి, ఙ్ఞానప్రసూనగారు.
ఆయన రచనలు లభించే వెబ్ సైట్ కానీ, ఇండియా లో ఎక్కడ దొరుకుతాయో తెలియజేస్తే తెప్పించుకుని
చదవాలని వుంది. మీ తండ్రి గారి పేరు మీరు నిలబెడుతున్నారు, సంతోషం!
సౌమ్య
చక్కటి పరిచయం రాసారండీ.
కుదిరితే, వారి రచనల గురించి మరింత వివరంగా రాయగలరేమో చూడండి. దొరుకుతున్నట్లు లేవు ప్రస్తుతం.
Srilalita
చక్రపాణి సినిమా గుర్తొచ్చినప్పుడల్లా మనకి తెలీకుండానే మన పెదవులపై చిరునవ్వులు చోటుచేసుకుంటాయి. శ్రీరావూరువారు ఎప్పటికీ కుచేలురు కారు, కాలేరు. ఆయన రసహృదయులందరికీ సాహితీకుబేరులు. వారి గురించి తెలియని విషయాలు మీద్వారా తెలుసుకున్నందుకు సంతోషంగా వుంది.
psmlakshmi
ఎందరో మహానుభావులు. అందులో ఒకరి గురించి మీ ద్వారా తెలుసుకున్నాము. ధన్యవాదాలు. అలాంటివారి పుత్రికలవటం మీరు చేసుకున్న అదృష్టం.
psmlakshmi