The boy who harnessed the wind -స్పూర్తి కలిగించే కథ!
Book: The Boy Who Harnessed the Wind
Written by: William Kamkwamba and Bryan Mealer
ఒక స్నేహితురాలు తొలిసారి ఆఫ్లైన్ కలుసుకున్నందుకు గుర్తుగా ఈ పుస్తకం బహుకరించింది నాకు. అసలా పుస్తకం గురించి తనకీ తెలీదు, నాకూ తెలీదు. పుస్తకంవెనుక అట్టపై విషయం చదివి, నచ్చి, నాకు నచ్చుతుందని చేసిన ఎంపిక అది! ఎంత చక్కని ఎంపికో!!
ఈ పుస్తకం కథ: ఆఫ్రికా ఖండంలోని అతి పేద దేశాల్లో ఒకటైన మలావీలోని ఒక కుగ్రామంలోని పిల్లవాడు (William Kamkwamba) గాలిమర (విండ్ మిల్) తయారు చేసి, తమ ఇంటికి విద్యుత్ సౌకర్యం తీసుకు వచ్చిన -నిజజీవిత గాథ ఈ పుస్తకం కథావస్తువు. గాలి మరలతో విద్యుత్ ఇక్కడ విషయం కాదు. అది విలియం కనిపెట్టినదీ కాదు. ఇక్కడ విషయమల్లా ఏమిటంటే – అతను గాలిమర ఎలా తయారు చేశాడు, ఎలాంటి పరిస్థితుల్లో ఈ ప్రయోగాలు చేశాడు, అతని నేపథ్యం ఏమిటి? అందులోంచి అతను ఎలా జ్ఞానం సంపాదించాడు? అన్నది. సొంత ఇంటి ప్రయోగం అయ్యాక, అతను ఊరుకోసం కూడా ఇలాంటి నిజజీవిత ప్రయోజనం ఉన్న ఉపకరణాలు రూపొందించాడు. ఇంతకీ, ఇతగాడి వయసిప్పుడు ఇరవై మూడు సంవత్సరాలు!!
ముందు విలియం గురించి చెబుతాను: అతను ప్రస్తుతం ఆఫ్రికన్ లీడర్షిప్ అకాడెమీలో విద్యార్థి. మొదటిసారి అతను అంతర్జాతీయంగా వెలుగులోకి వచ్చినది 2007 టెడ్ టాక్స్ లో ఒక వక్త అయినప్పుడు. ఇది టాంజేనియాలో జరిగింది. ఈ పుస్తకంలో జరిగిన అంతా చాలా మటుకు, ఆ టెడ్ టాక్ కి ముందు కథ. ఇంత వరకూ చదివాక, ఆ, ఇందులో పెద్ద ప్రత్యేకత ఏముంది? ఇలాంటి ప్రొఫైల్స్ చాలామందికి ఉంటాయి…అని మీలో కొంతమందైనా అనుకుని ఉంటారు. కానీ, నూటికి రెండుశాతం మందికి మాత్రమే విద్యుత్ దొరికే మలావీలో, కరువు కోరల్లో చిక్కుకుని, హైస్కూల్ దాకా వచ్చాక చదువు మానేసి, తిండితిప్పలకి నానా ఇబ్బందులూ పడ్డ ఒక పిల్లవాడు – పబ్లిక్ లైబ్రరీలో ఫిజిక్స్ పుస్తకాలు చదువుతూ ఇన్ని విషయాలు తెలుసుకుని, ఊరికి ఉపయోగపడేంత పరిజ్ఞానం సంపాదించాడంటే – స్పూర్తివంతంగా లేదూ?
విలియం జీవితంగురించి ఒక పరిచయం అతని వెబ్సైట్ లోనే ఇక్కడ చూడండి.
ఇక పుస్తకం గురించి: ఈ పుస్తకం లో విలియం తన కథను బ్రియాన్ మీలర్ అన్న జర్నలిస్టు సహాయంతో మనందరికీ చెప్పాడు. ఇందులో అతని ఊరు, కుటుంబ నేపథ్యం, కరువు కాలం నాటి పరిస్థితులు, తను స్కూలు మానేశాక చదువుకోవడం, టెడ్ టాక్ కి వెళ్ళడం దాకా కథ ఉంది.
ఇక, నా అభిప్రాయంలో ఈ పుస్తకం అందరూ తప్పక చదువవలసిన పుస్తకం. అందులోనూ, మన గ్రామాల్లోనూ, చిన్న పట్టణాల్లోనూ, టీనేజీ స్కూలు-జూనియర్ కాలేజీ పిల్లలకి ఈ పుస్తకం చదవడం తప్పనిసరి చేయాలి అని నా అభిప్రాయం. అలాగే, ఈ దేశంలో వనరుల్లేవు… ఏం చేయాలన్నా ప్రోత్సాహం ఉండదు అని ఏడ్చే వాళ్ళకీ ఇది తప్పనిసరి పాఠ్యాంశం కావాలి.ఎందుకంటే –
* మలావీ పరిస్థితులతో పోలిస్తే, వనరుల్లేవు అని సిగ్గున్నవారెవరూ కంప్లైంట్ చేయకూడదు కనుక. ఇక్కడ వనరులున్నాయి అని కాదు నేనంటున్నది. ఇంతకంటే లేమిలో కూడా విలియం చేయగలిగినపుడు, మనకి ఉన్న పరిమితుల్లో మనవారు చేయలేరా? అని.
* స్కూలులో బోధనకి దూరమైన విలియం లైబ్రరీ నుండి పుస్తకం తెచ్చుకుని చదువుకుని, ఇంత చక్కగా తాను అనుకున్నది సాధించాడు అంటే – ఆ పాఠ్యపుస్తకాలు ఎంత అద్భుతంగా రాసారో కదా..అని ఒక పక్క అనిపిస్తుంది కానీ, మరో పక్క – ఆ లెక్కన, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇలాంటి కథకి రావాల్సినంత ప్రచారం వస్తే, ఆ స్పూర్తితో మరికొందరు ప్రయత్నిస్తే – ఆయా దేశాలకి మంచే జరుగుతుంది కదా! అన్న ఆశ (ఇప్పుడందరూ స్కూళ్ళు మానేయాలని అంటున్నా అనుకోకండి! ఘనత వహించిన మన స్కూళ్ళలో పాఠాలు మనకి జీవితంలో ఎంత బాగా పనికొస్తున్నాయో అందరికీ తెలుస్తూనే ఉంది కదా! కనుక, పాపంశమించుగాక.)
* ఈ పుస్తకంలో విలియం సైకిల్ డైనమో, విద్యుత్ పనితీరు, రేడియో పని తీరు – ఇలాంటివన్నీ తాను ఎలా అర్థంచేస్కున్నానో – వివరంగా, ఒక్కోచోట బొమ్మలతో సహా, చెబుతాడు. ఆ భాగాలన్నీ డైరెక్టుగా చిన్న క్లాసుల పిల్లలకి పాఠ్యాంశాలుగా పెట్టేయొచ్చు అసలు. పెట్టకపోతే పోయారు కానీ, ఇది చదువుతున్న వాళ్ళు మాత్రంమీ పిల్లల చేత ఆ భాగాలు చదివించండి (అదే లెండి, మీకు పిల్లలుండి, వాళ్ళు హైస్కూలుకు వస్తూంటే!!)
* పెద్దలైనా, ఈ పుస్తకం చదివితే, ఉద్వేగాశ్చర్యానందాలకు లోనవడం ఖాయం. ఇంకా, నాబోటి వారైతే – ‘చీ! నేను ఉన్నానెందుకూ! అన్ని సౌకర్యాలూ సరిగానే ఉన్నా ఇప్పటిదాకా సైన్సు ను సైన్సు లాగా అర్థం చేస్కోలేకపోయా’ అని ఏడ్చినా ఏడుస్తారు.
నాకు మాత్రం ఈ పుస్తకం చదవడం – ఒక గొప్ప అనుభవం. రాసిన శైలి వల్ల కాదు – అది చాలా సాధారణంగా ఉంది. రాసిన వ్యక్తి చిన్నవాడైనా రగిలించిన గొప్ప స్ఫూర్తి వల్ల… రచనలో చాలావరకూ ఉన్న నిజాయితీ వల్ల. చాలావరకూ అని ఎందుకంటున్నా అంటే – ఒక్కోచోట, మరీ ఎక్కువగా చెప్పినందుకో ఏమో కానీ, కాస్త అతిశయం అనిపించింది. కానీ, బహుశా, అలా అనిపించడం నా నైజంలోని లోపం వల్ల కావొచ్చు. తరువాత్తరువాత ఈ ఉత్సాహం చప్పబడిపోతుందిలేవో! అంటారా – నిజమే..నాకు ఆల్రెడీచప్పబడిపోయింది. కానీ, మనం కాకుంటే, మన ద్వారా ఇది పరిచయమైన మరొకరు..పది మందిలో ఒకరిని ఈ పుస్తకం నిజంగా ఏదో చేసేందుకు పురికొల్పినా చాలదూ? అందునా, మనలాంటి దేశంలో! అతనికి కాలం కలిసొచ్చింది…లేదంటే, సరిగ్గా సమయానికి వాళ్ళెవరో వచ్చి అతని గురించి తెలుసుకోవడం ఏమిటి, అదే సమయానికి టెడ్ కు వెళ్ళగలిగే అవకాశం రావడం ఏమిటి? అంటారా – కాలం కలిసి రావొచ్చు, రాకపోవచ్చు – మన ప్రయత్నం మనం చేస్తే, ఫలితాల సంగతి ఫలితాలే చూసుకుంటాయి – అని ఏనాడో కృష్ణ పరమాత్మ చెప్పలేదూ? 🙂 మనం పనే చేయకపోతే, కాలం కలిసొచ్చీ ఏం లాభం చెప్పండి?
ఇంకా నేను మిమ్మల్ని నమ్మించలేకపోతే, ఈ అబ్బాయి వెబ్సైటులో (ఇక్కడ) పుస్తకం గురించి, తన గురించి, తను ప్రస్తుతం చేస్తున్న పనుల గురించీ వివరంగా రాసారు. చదివి, స్పూర్తి పొందాక – ఫ్లిప్కార్టుకి వెళ్ళి ఈ పుస్తకం కొని చదవండి!
Swathy
మంచి పుస్తకాన్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు ! 🙂
C.S.Rao
I very much appreciate the suggestion that a book like this ,’The Boy Who Harnessed The Wind” must be prescribed for study for our high school and junior college students in our country.The book will have its impact on them and remain in their minds imperceptibly. They may not be able to do anything worthwhile right now,but it will stimulate their intellect and innovative skills,atleast in a few of them.
Not content with generating power just for his home the boy did for the whole village.It is noble of him to have done this.Let us hail the boy who is innovative and service-minded .
Congratulations to Sowmya.
Indian Minerva
“ఫ్లిప్కార్టుకి వెళ్ళి ఈ పుస్తకం కొని చదవండి!”
Done!!
raamudu
కడుపు నిండని వాడికే జీవితపు పాఠాలు త్వరగా పట్టుబడ్తాయి
శ్రీనిక
Its nice Sowmya. I heard about this. Thanks for providing the source.
asha
you can watch him speak here
http://www.ted.com/speakers/william_kamkwamba.html
Pranav
Interesting and inspiring book!
లలిత (తెలుగు4కిడ్స్)
Wow! Sowmya, I read an article about this boy. I didn’t know there was a book. I have been trying to get hold of that article. Thanks.
Oh, there are such wonderful stories, I mean real life stories about kids from poorest (and also rich) backgrounds driven by thirst of knowledge and pursuing their interest through books and realising their dreams. That just makes my belief stronger that more and more kids should be brought closer to books and vice versa. Ofcourse it nothing can replace that natural and ingherent drive. But may be we can lend a hleping hand to encourage that.