అనుభవాలు-జ్ఞాపకాలు

రాసిన వారు: దేవరపల్లి రాజేంద్రకుమార్

********************************

పెరుమాళ్ళు అంటే ఆస్తిక పాఠకులకు తెలుస్తుంది.పెరుమాళ్ళు అంటే ఒక సినిమానటుడని పాతతరం ప్రేక్షకులకు గుర్తుండొచ్చు.మువ్వల పెరుమాళ్ళు అంటే తెలిసినవారు తక్కువేనని చెప్పాలి.కానీ జయంతి పబ్లికేషన్స్ గురించి తెలియనిపాఠకులుండరనే చెప్పాలి.రాశిలో తక్కువైనా వాసిలో ఎక్కువైన అభ్యుదయ,ఉత్తమసాహిత్యాన్ని అందించిన జయంతి పబ్లికేషన్స్ అయిదు దశాబ్దాలుగా పాఠకులకు ఎనలేని సేవలందిస్తుంది.

కమ్యూనిష్టు పార్టీ కార్యకర్తగా,పుస్తకవిక్రేతగా,ప్రచురణకర్తగా ఎందరో సజ్జనుల సాంగత్యంలో తాను గడిపిన జీవితానుభూతులనుఅనుభవాలుజ్ఞాపకాలు’గా మువ్వల పెరుమాళ్ళు పంచుకున్నారు.అప్పటి నెల్లూరు జిల్లా దర్శితాలూకా,వెంకటగిరి సంస్థానం గంగదేవిపల్లె అనేగ్రామంలో (అది ఇప్పడు ప్రకాశం జిల్లాలో ఉంది),1924ఆగస్టు తొమ్మిదిన మువ్వల సుబ్బరామయ్య,సుబ్బమ్మల ప్రధమ సంతానంగా జన్మించారు పెరుమాళ్ళు.

సంపన్న కుటుంబంలో జన్మించినా ఆర్ధికస్థితిగతులు తారుమారవటంతో పెరుమాళ్లు విజయవాడతోపాటు పలుప్రాంతాలు తిరగటం,కమ్యూనిస్టు కార్యకర్తగా రహస్యజీవనం గడపటం,విజయవాడలో పార్టీకొరకు పని చెయ్యటం,మొదటపుస్తకవిక్రేతగా,తరువాత ప్రచురణకర్తగామారటం ఇత్యాది విషయాలన్నీ ఆయన చిన్న పుస్తకంలో వివరించేందుకు చక్కగా ప్రయత్నించారు.

బెల్లంకొండరామదాసు,విరించి అనువదించిన అల్బర్ట్ మొరేవియో నవల ప్రచురణతో అప్పటివరకూ అంటే 1953-1955 వరకూఅభ్యుదయ,కమ్యూనిస్టు సాహిత్యం లభించే పుస్తకాలదుకాణం నుంచి జయంతి పబ్లికేషన్స్ అవతరించింది.రవీంద్రుడు,శరత్,బంకిం చంద్ర చటర్జీ,అడవిబాపిరాజు,ప్రేమ్ చంద్ రచనలన్నీ ప్రచురించారు.దేశభక్తుల చరిత్రలు ఇరవై ఇలా మొత్తం ఈ అయిదున్నర దశాబ్దాలలో మూడువందలకు పైగా ఉత్తమ గ్రంధాలను తెలుగుపాఠకులకు అందించారు పెరుమాళ్ళు.

ఎందరివో రచనలను ప్రచురించి,ప్రచారించిన పెరుమాళ్ళుగారికి బెల్లంకొండ రామదాసు,రెంటాల గోపాలకృష్ణ అభిమానరచయితలు కాగా,ఆయనకు నచ్చిన పుస్తకాలు నవశక్తి పబ్లికేషన్స్ ప్రచురణ-సుందరయ్యగారు రాసిన తెలంగాణా సాయుధపోరాటం-గుణపాఠాలు,దర్శి చెంచయ్య రాసిన నేను-నాదేశం,ఉన్నవ లక్ష్మీనారాయణ మాలపల్లి. మీరట్,లాహోరు,కాకోరి,కాకినాడ,మద్రాసు ఇలా ఎన్నో కుట్రకేసులను ఆనాటి బ్రిటీషు ప్రభుత్వం నడిపిందనీ వాటిని పుస్తకరూపంలో ప్రచురించలేకపొవటం,1948-49-50 సంవత్శరాలలో ఆంధ్రప్రాంతంలో సుమారు 200 మంది కామ్రేడ్లను కాల్చి చంపేసారనీ వారి జీవితచరిత్రలు సేకరించి పుస్తకరూపములో ప్రచురించలేకపొయాననే తీరని కోరికలు ఒక ప్రచురణకర్తగా మిగిలిపోయాయని ఒకచోట పేర్కొన్నారు పెరుమాళ్ళు.

పలువురు రాజకీయ,సాహిత్యప్రముఖులతో తన అనుభవాలు,కమ్యూనిస్టుపార్టీతో తనకున్న ప్రగాఢానుబందమొక్కటే కాక తన జన్మభూమిలో అనాడు ప్రాచుర్యంలో ఉన్న ఆచారాలు,అనాచారాలు,భోజనభాజనాదులు,తూనికలు-కొలతలు..ఇలా అనేకసంగతులను రేఖామాత్రం గా ప్రస్తావించారు పెరుమాళ్ళు.ఉదాహరణకు,తూనికలు:మూడు తులములు ఒకఫలం,ఎనిమిది ఫలములు ఒకసేరు,ఐదుసేర్లు ఒకవీసె,ఎనిమిది వీసెలు ఒక మణుగు,ఇరవైమణుగులు ఒక పుట్టి. కొలతలు;గిద్ద,రెండు గిద్దలు ఒక అరసోల,రెండు అరసోలలు ఒకసోల,రెండు సోలలు ఒక తవ్వ,రెండు తవ్వలు ఒకమానిక,రెండు మానికలు ఒక అడ్డ,54మానికలు ఒక బస్తా,పదిబస్తాలు ఒక పుట్టి. నాణాలు:దమ్మిడీ,మూడు దమ్మిడీలు ఇక కాణి,నాలుగు దమ్మిడీలు ఒక డబ్బు,రెండు కాణీలు ఒక అర్ధణా,రెండుఅర్ధణాలు ఇక అణా,రెండు అణాలు ఒక బేడ,రెందు బేడలు ఒక పావల,రెండు పావలాలు అర్ధరూపాయి రెండు అర్ధరూపాయలు ఒక రూపాయి.పావలా,అర్ధరూపాయి,రూపాయి అన్నీ వెండితో చేసిన నాణాలే,డబ్బు చలామణిలో ఉండేది కాదు,పన్నులతరుణంలో తప్ప.స్కూలులో నాణాలు ఇలా ఉండేవని తోలు నాణాలు చూయించేవారు.అవిఒక బాక్సులో ఉండేవని అంటారు. అదే విధంగా భోజనాదులు వగైరాల గురించి రాస్తూ.వేరుశెనగ,గోధుమలు మినహాయించి ఆహారధాన్యాలు,పప్పు ధాన్యాలు,నూనెగింజలన్నీ పండించేవారని(వారి ప్రాంతంలో),కూరల్లోకి తాలింపుగా నేతిని ధనికులు,పేదలు ఆముదాన్ని వాడేవారని చెప్తారు.

ఈ తొంభయ్ రెండు పేజీల పుస్తకంలో పెరుమాళ్లుగారి కుటుంబసభ్యులతో పాటు అంతగా ప్రచారాన్ని కోరుకోని మరికొందరు లబ్దప్రతిష్టులైన వారి ఛాయాచిత్రాలూ ఉన్నాయి,వారిలో సంజీవ దేవ్,ఆవుల సాంబశివరావు,మండవ శ్రీరామ్మూర్తి,నవోదయ రామ్మోహనరావు తదితరులున్నారు.

ముగింపుగా చివరిపేరాగ్రాపులో తన షష్ఠి పూర్తినాడు మిత్రులు,బంధువులు,కుటుంబసభ్యులందరూ వారిస్వగ్రామంలో కలుసుకున్న సందర్భంలో..అజ్ఞాతకాలంలో సంవత్శరంపాటు నాకు సేవలందించిన మా చాకలి కోటయ్య,అతని భార్య లచ్చిలకు మా యింటిముందు పీటలు వేసి,కూర్చోబెట్టి,బట్టలుపెట్టి,భోజనం పెట్టి,సమ్మానించాను.ఊరి జనం అంతా ఆశ్చర్యపోయారు,అంటూ ముగిస్తారు.

తెలుగు రచనాప్రపంచంలో తనకున్న పరిచయాలను ఉపయోగించుకుని పెరుమాళ్లు గారి ఎవరితోనైనా మరింత విస్తరించి రాయించిఉంటే ఈ ‘అనుభవాలు-జ్ఞాపకాలు’మరొక మంచి జీవిత చరిత్ర గా మనకు మిగిలి ఉండేది.కాకుంటే ఈ పుస్తకం చదవటం వల్ల కలిగే మరొక ఫలితం యేమంటే ఒక కురువృద్ధుడు తన అనుభవాలను ఎలా వివరించి చెప్పారో,వాటిని పొల్లుపోకుండా ఆయన కుటుంబసభ్యులు అక్షర రూపములోకి తీసుకురావటం,ఎలాంటి ఎడిటింగ్ లేకుండా మనం ఆయన మాటల్లోనే చదవగలగటం పఠనఫలం మనకు.

కాకుంటే ఇక్కడో చిన్న చిక్కు ఉంది,అదేమనగా… ఈ ‘అనుభవాలు-జ్ఞాపకాలు’బయట ఎక్కడా పుస్తకాల కొట్లలో లభించదు,కారణం పెరుమాళ్లు గారు కొందరు ఎంపికచేసిన మిత్రులకు మాత్రమే ఈ పుస్తకాన్ని ఉచితంగా అందించారు.అలాగే కొన్ని గ్రంధాలయాల్లో కూడా లభించే అవకాశం ఉంది.పెరుమాళ్లు గారు తనకు పంపిన పుస్తకాన్ని నాకు చదివే అవకాశం కల్పించిన విశాఖపట్నం బుక్ సెంటర్ యజమాని మట్టా వరహాలు చెట్టిగారికి నా ధన్యవాదాలు.

అనుభవాలు-జ్ఞాపకాలు

మువ్వల పెరుమాళ్ళు,

నవశక్తి ప్రచురణలు,

కారల్ మార్క్స్ రోడ్డు,

విజయవాడ-520 002

తొలిముద్రణ:జనవరి 2010

You Might Also Like

2 Comments

  1. nagamani

    మువ్వల పెరుమాళ్ళు గారితో నాకు చిన్నపాటి పరిచయం ఉంది. అది ఆయన కుమార్తె సుధగారి ద్వారా. పెరుమాళ్ళు గారి పుస్తకం ముద్రితం కాకముందే నేను దాన్ని చదివాను. అక్షర దోషాలు ఉన్నమాట నిజమే కావచ్చు. వాటిని పట్టించుకోకుంటే వారి అనుభవాలను జ్నాపకాలను చూస్తే స్వతంత్రంగా కష్టపడి ఒకస్థాయికి వచ్చిన వ్యక్తి పెరుమాళ్ళు గారు. వారి అనుభవాలను గతంలో కలిసిపోకుండా అంటే ఎందరో చరిత్రలు కాలగర్భంలో కలిసిపోయాయి. అలా కాకుండా వారి కుటుంబ సభ్యులు వాస్తం చెప్పాలంటే వారి కుమార్తె సుధ మనుమరాలు సమత చేసిన కృషి అభినందనీయం.

  2. వాడపల్లి శేషతల్పశాయి

    ఈ వ్యాసంలో –
    తూనికలలో చెప్పినది లమా లేక లమా?
    చాలా ముద్రారాక్షసాలున్నాయి.
    ముద్రారాక్షసాలు అనాలో లేదో తెలియనివి కొన్ని – ప్రధమ, గ్రంధ, షష్ఠి.
    కొన్నిసార్లు పెరుమాళ్ళు – కొన్నిసార్లు పెరుమాళ్లు.

Leave a Reply