దుక్కి – పరిచయం

రాసినవారు: గంటేడ గౌరునాయుడు
********************

శ్రీకాకుళం జిల్లా కవి ‘చింతా అప్పలనాయుడు’ కవిత్వ సంపుటి ‘దుక్కి‘కి ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు లభించింది (వార్త ఇక్కడ). ఈ 31నే బహుమతి ప్రదానం. ఈ సందర్భంగా, ఆ సంపుటికి మరొక రచయిత గంటేడ గౌరునాయుడు రాసిన ముందుమాట మీకు అందిస్తున్నాము.

(వ్యాసం పుస్తకం.నెట్లో వచ్చేందుకు కారణమైన అరుణ పప్పు గారికి ధన్యవాదాలు – పుస్తకం.నెట్)

పుట్టిననేల మీద ప్రేమతో మట్టి రుణం తీర్చుకోవడానికి కలాన్ని హలం చేసి కవిత్వపు చాళ్లు పోస్తున్నాడు సోదరుడు చింతా అప్పలనాయుడు. రైతు మడిచెక్కను నమ్ముకొని చేను గురించే మాటాడినట్టు తానెప్పుడు కలిసినా యేదో వొక కొత్త వాక్యంతో పలకరస్తాడు. చింతా అంటాడొక కవితలో ‘మా అయ్యకు వ్యవసాయం వ్యసనం’ అని. అప్పల్నాయుడికి సాహిత్యం వ్యసనం మరి. అందుకే అనిపిస్తుంది నాకు, చింతా అప్పల్నాయుడు అచ్చమైన రైతుకవి అని. రైతుబాధ తప్ప మరొకటి పట్టదు తనకి. మట్టి మనుషుల యాతన తప్ప మరొకటి అతని తలపులోకి రాదనిపిస్తుంది. పాండితీప్రకర్ష బాధ లేదు. వాదాల వివాదాల సిద్ధాంత రాద్ధాంతాల గోల తెలీదు. తనకు తెలిసిందల్లా తన చుట్టూ ఉన్న మట్టిమనుషుల జీవితాలు, వారితో సన్నిహితసంబంధాలూను. అప్పలనాయుడిని చూస్తే నాకు మా ‘ఉత్తరాంధ్ర రైతుమాట’కు రూపం వొచ్చిందనిపిస్తుంది. అందుకే అప్పలనాయుడు రాసిన ప్రతివాక్యమూ నాకు కవిత్వంలా కాక జీవితంలా సాక్షాత్కరిస్తుంది.

‘‘ఆవుకి కుడితెట్టినట్టు..
పొలానికి గత్తమేసినట్టు..
గడ్డిపరకలకి గాలించినట్టు…
బతకడం నీకు బాగా పట్టుబడిపోయింది
బతుకే నీయనకాల బేపికూనై తిరిగేది’’

యిలా ఎవరనగలరు చింతా అప్పలనాయుడు కాక. అందుకే నేనంటాను చింతా అచ్చమైన పల్లెటూరి రైతుకవి అని. ఎంతో సాదాసీదాగా కనిపించే వాక్యాల్లో ఎంత గొప్పగా జీవితాన్ని చిత్రించాడో కదా అనిపిస్తుంది. ‘వీళ్లకి ఆకలీ, దరిద్రమూ తప్ప ప్రపంచంలో మరొకటేదీ కనబడదు కాబోలు’ అన్నాడట ఒక పెద్దమనిషి హైదరాబాద్ నుంచొచ్చి. అవును. ఆకలంటే ప్రేమ. దరిద్రంతోనే మా స్నేహం. అవే మాకు కనిపిస్తాయి. నిత్యమూ అవే మాచేత రాయిస్తున్నాయి. కథయినా… కవితయినా.. పాటయినా.. రాత మా ప్రాంతీయ అవసరం!

చింతా తన కవితలో చెప్పినట్టు –
‘‘లోతుకుపోయిన కళ్లతో మా అమ్మల ముఖాలు..
మసిబారిపోయిన దివ్వగూళ్లులా ఉంటాయి’’
అలా తప్ప మరెలా రాయగలడు ఈ ప్రాంతపు కవి? అలాగని చింతా అప్పలనాయుడు మరే సమస్యా పట్టించుకోని, ప్రపంచం పోకడల గాలి సోకని, కేవలం ప్రాంతీయ కవి అనుకుంటే అది సరికాదు. జరుగుతున్న విధ్వంసాన్నీ, ప్రపంచీకరణ ప్రభావాన్నీ ప్రాంతీయ నేపథ్యంలో వినిపిస్తాడు. అందుకు ఉదాహరణలుగా అనేక కవితలు ఈ సంపుటిలోనే మనల్ని చింతాక్రాంతుల్ని చేస్తాయి.

‘‘యంత్రాలు ఎనుబోతులై నిన్ను కాళ్లకింద కుమ్మేసి
కంపెనీలు నీ కాటిలో కంపలు పేర్చాయా
పండుగంటిపూట
సీసం నీ నోటికి పాయసమైపోయిందా’’

– అని ‘తొలిపొద్దువై..’ అనే కవితలో స్వర్ణకారుని జీవితంలో కొత్తమార్పులు నింపే విషాదాన్ని వినిపిస్తాడు.

‘‘గడ్డిపరకల్ని కలగంటున్న పశువుల్ని
ఇనపగెద్దలు సాల ముందట వాలి
కబేళాకు రమ్మని కవుర్లుపెడుతున్నాయి’’

– అంటాడు ‘గోస’ కవితలో!

‘‘అమ్మకానికి అందాలు ముందుకొస్తున్న నేల మీద
హైటెక్ సీజన్లో
కంప్యూటర్ హింసేదో కమ్ముకురాదని గ్యారంటీ ఏముంది
’’ అంటాడు (ఒక్క ఆమెకే చెల్లింది)

“హైటెక్ రికార్డింగ్ థియేటర్లో
రైతుల ఆకలి కేకలు
పాప్ సంగీతమై వినిపిస్తాయి”
(ముఖచిత్రం)
-ఇలా అనేకమైన వాక్యాలు కనిపిస్తాయి.

‘‘గావంచాకట్టుతో ఆకలిని అదిమిపట్టినప్పుడు
అప్పులోళ్లు గురిచూసి కొట్టిన బాణం దెబ్బలకు
భూమిలో ఉండ దిగి కదల్లేకపోయిన కర్ణుడిలా..”

– కనిపిస్తాడు కవి కళ్లకి రైతు. అవును మరి ప్రతి రైతూ అనేక విధాలుగా వంచించబడ్డ కర్ణుడే. ఈమాట ఎక్కడో, ఏ గ్రంథాల్లోనో చదివిన జ్ఞానంతోకాక జీవిత పరిశీలనానుభవంలోంచి మాత్రమే రాయగలిగేది.

‘‘మా మొగోలు కండలు తిరిగిన వస్తాదులా!
ఆల సేతుల్ల గదలున్నాయా, గాండీవాలున్నాయా!
ఎదురుబద్దల్లాంటి ఎవికలమీద
సేరుసితకలతోటి సేమాకు రాసినట్టు..’’

– నిరుపేద కూలీల కూలీల భార్యల మట్టివాసనల మాటలే ఈ కవితల నిండా. అందుకే ఈ కవి అచ్చమైన పల్లెటూరి రైతు కవి.

‘పనమువ్వల సవ్వడితో నెమరువేత సంగీతం
వినిపించని పశువుల సాల శవం పోయిన ఇల్లు’
లా ఉందంటాడు. మరోచోట అక్షరాలతో చెరుకుల ముసిల్దాని బొమ్మగీస్తూ

“అంబల్లేలకి ఆకలి డొక్క
ఖాళీ దాకై వెన్నుకు చేరబడుతుంది…
….
సాయంకాలానికి పొయ్యిమీద
చేరడు నూకగింజలౌతుంది’’

అంటూ ఏదో ఒక పనిచేస్తూ పొట్ట నింపుకునే ముసలమ్మ ఏయే వేళల్లో ఎలా ఉంటుందో దృశ్యమానం చేస్తాడు. ఇలా ప్రతి కవితలోనూ శ్రమజీవుల కష్టాలనీకన్నీళ్లనీ సహజాతి సహజంగా చిత్రిస్తాడు.కవిత్వ పాదాలు ఎంత ఎత్తుకు ఎదిగినా తన నేల మీద పాదాలు ఆనించి విశాలవిశ్వంలోకి చూపులు సారించి కవితాగానం చేస్తున్నాడు, ఉద్వేగభరితమైన ఉత్తరాంధ్ర గొంతును వినిపిస్తున్నాడు చింతా అప్పలనాయుడు. తన కథల్లో కవితల్లో చింతలు నింపుకొస్తాడు, కవితో కథో రాస్సేక ‘చింత’ తీరి తేలికపడతాడు.

అప్పుడు చెప్తాడు కడుపుబ్బ నవ్వించే ఊసులు. తన బాల్యపు ముచ్చట్లు. హాస్టల్లో కుక్కచెపాతీల కబుర్లు. జంగమయ్య కుట్టిన మాసికల నిక్కర్ల సంగతులు. ఫాదర్లు కొట్టిన బెత్తందెబ్బల సన్నివేశాలు. అంతేనా.. ఎన్నెన్ని వాలకాలు కడతాడో. కవి, కథారచయితే కాదు, చింతా మంచి నటుడు కూడా. అప్పలనాయుడి కత, కవిత మనల్ని దు:ఖంలో ముంచి కన్నీరు తెప్పిస్తే, చెప్పే కబుర్లు, కట్టే వాలకాలు నవ్వించినవ్వించి కళ్లలో నీళ్లు నింపుతాయి. మా సాహిత్య ప్రయాణాల్లో చింతా లేకపోతే మాకు చింతే. అప్పుడెప్పుడో పదహారేళ్ల కిందట తొలిసారి కలిసినప్పుడు కవితో పాటో రాసి కింద ‘చింతాశ్రీ’ అని సంతకం చేసి చూపించేడు. ‘చింత’ తప్ప మనకు ‘శ్రీ’ ఎక్కడిదిరా నాయినా… అన్నాను సరదాగా. ‘ఔన్నిజవే కదా’ అన్నాడు. అప్పటినుంచీ అప్పలనాయుడి చింత కవిత్వమే అయ్యింది. కతయ్యింది. పాటయ్యింది. నాటికైంది. కడుపుబ్బ నవ్వించే వాలకమైంది. తానేది రాసినా అక్షరం తడి ఆరకముందే నాకు చూపిస్తాడు. మళ్లీ మళ్లీ రాస్తాడు. లోపాల్ని ఆనందంగా అంగీకరిస్తాడు. విమర్శల్ని సహృదయంతో స్వీకరిస్తాడు.

పుస్తకం వివరాలు:
దుక్కి – చింతా అప్పలనాయుడు (Dukki – Chinta Appalanaidu)
ప్రచురణ: స్నేహకళా సాహితి, కురుపాం
ప్రతులు విశాలాంధ్ర, ప్రజాశక్తి బ్రాంచీలలో లభ్యమవుతాయి.
(వెల, ఇతర వివరాలు – మాకు లభించలేదు. తెలిసిన వారు ఇక్కడ వ్యాఖ్య విడువగలరు. – పుస్తకం.నెట్. ఉంటే, మంచి ముఖచిత్రం కూడా పంపగలరు.)

ఈపుస్తకం పై బ్లాగ్లోకంలో వచ్చిన వ్యాసం ఇక్కడ.

You Might Also Like

Leave a Reply