పోష్టు చేయని ఉత్తరాలు – గోపీచంద్
ఆ మధ్యోరోజు ఒడిస్సీలో షికార్లు చేస్తూ ఉంటే ఓ “రీజినల్ లాంగ్వేజ్ సెక్షన్” కనబడ్డది. తెలుగు పుస్తకాలు కనిపించాయి. ఆశ్చర్యంతో చూస్తూ, ఆశ్చర్యంలోనే ఈ పుస్తకం కూడా కొన్నాను. గోపీచంద్ పై ఉన్న ఒక విధమైన అభిమానం వల్లనూ, ఈ పుస్తకానికి రాసిన కాప్షన్ – “భౌతికవాద ఆధ్యాత్మిక వాద సమన్వయము” అన్న స్థితిలో ఒక ప్రాథమిక దశలో నేనూ కొట్టుమిట్టాడుతూ ఉండటమూ – అదీ ఈ పుస్తకం చదవడం మొదలుపెట్టడానికి వెనుక కథ. విషయానికొస్తే, ఈ పుస్తకం ఓ ఐదారు ఉత్తరాల సంకలనం. అక్కడ చెప్పినట్లే అవి పోష్టు చేయనివి కాబోలు. కానీ, తరువాతి ఉత్తరంలో ముందు ఉత్తరంలో చెప్పిన విషయాలకి ఎవరో జవాబు చెబితే వారిని ప్రశ్నించిన దాఖలాలున్నాయి. మరి ఆ రెండో మనిషి ఎవరో, ఏమిటో అన్న ప్రస్తావన ఎక్కడా లేదు. ఆ పరంగా ఇది ఈ పుస్తకంలోని లోపం అనే చెప్పొచ్చు.
అయితే, అది తప్పిస్తే, ఈ పుస్తకం చదవడం నాకో మంచి అనుభూతిని మిగిల్చింది. పెద్ద లోతుగా ఏదీ చర్చించకపోయినా కూడా, ఈ సంఘర్షణ గురించిన ప్రాథమిక అవగాహన కలిగేలా రాసారు. పుస్తకం సైజును బట్టి కూడా అలాంటి లోతైన చర్చలు వగైరా ఆశించలేము. గోపీచంద్ తండ్రి త్రిపురనేని రామస్వామి గారు ప్రముఖ నాస్తికుడు, హేతువాది. అలాంటి మనిషికి కూడా పరమ ఆస్తికులైన ఉన్నవ లక్ష్మీనారాయణ గారితో ఉన్న గాడ స్నేహం, వారి ఇంట్లో తరుచు జరిగే చర్చలు – ఇవన్నీ గోపీచంద్ వ్యక్తిత్వం పై చూపిన ప్రభావం కొంతవరకు ఈ ఉత్తరాల్లో అర్థమౌతుంది. గోపీచంద్ పై కొంత అరొబిందో ప్రభావం ఉంది. ఈ పుస్తకం చదువుతున్న సమయంలోనే నేను అరొబిందో ఆశ్రమానికి వెళ్ళడం నాకు భలే థ్రిల్లింగ్ గా అనిపించింది. గోపీచంద్ భావాల్లో పూర్తి నాస్తికత్వం, కమ్యూనిజం వంటి దారుల నుండి ఆస్తికత్వానికి, నాస్తికత్వానికి సమన్వయం కుదర్చాలన్న టెంపోలో ఉన్నప్పటి ఉత్తరాలివి. అందుకే ప్రత్యక్షరంలోనూ ఆ కలయిక గురించిన గోపీచంద్ తపన స్పష్టంగా కనిపిస్తుంది.
పూర్తిగా ఏ వాదమూ అన్ని సమస్యల్నీ పరిష్కరించదు. ప్రతి వాదంలోనూ కొంతమంచి, కొంతచెడు ఉంటూనే ఉంటాయి. అయితే, అన్ని విభిన్న వాదాల్నీ చదివి, ఆకళింపు చేసుకుని అన్ని వాదాలనూ సమన్వయపరుస్తూ మనిషి జీవితాన్ని నడిపించగల ఓ కొత్త వాదం formulate చేసే ప్రయత్నం ఏదో చేయాలన్న ఆలోచన కనిపిస్తుంది ఈ ఉత్తరాలలో. ఈ దిశలో ఆయనెంత చదివాడో, వివిధ తత్వశాస్త్రాలని ఎంత క్షుణ్ణంగా అభ్యసించాడో ఈ పుస్తకం చూస్తే తెలుస్తుంది. ఆ విధంగా గోపీచంద్ ఆలోచనలనే కాదు, అతన్ని తెలుసుకోడానికి కూడా ఈ పుస్తకం ఉపకరిస్తుంది.
నా మటుకైతే, ఎవరో నేను పుట్టకముందే రాసేసిన నా డైరీని ఇప్పుడు నేను పుట్టిన పాతికేళ్లకు నేను దొరకబుచ్చుకుని చదువుతున్నట్లనిపించింది. ప్రధానంగా మొదటి పేజీల్లో అయితే, ఈ భావన ఇంకా బలంగా ఉండింది. “ఏమిటిది? నేను పుట్టేముందే నా మనసు చదివేయగలగడం ఎలా సాధ్యమైంది?” అన్న ప్రశ్న నన్ను ఈ పుస్తకం చదివేశాక కూడా వెంటాడింది. అయితే, ఈ పుస్తకం అన్ని వర్గాలనూ ఆకర్షించలేకపోవచ్చు. వయసులో పెద్దవారిని ఈ పుస్తకం ఆకట్టుకోవడం కొంచెం కష్టమేమో అనిపించింది. ఎందుకంటే, ఇలాంటి డైలెమాలను వారు ఈపాటికే దాటేసి ఉండే అవకాశం ఎక్కువ కనుక.
Anil అనిల్ అట్లూరి
ఆయన పేరు
‘కవిరాజు’ త్రిపురనేని రామస్వామి మాత్రమే.
త్రిపురనేని రామస్వామి చౌదరి, కాదు, కాదు, కాదు.
సౌమ్య
అనిల్ గారికి: ఇప్పుడు మార్చాము. పొరబాటుకు మన్నించ గలరు.
మెహెర్
ఇంతకీ ఈ డైలమా దాటి మీరే తీరాన్ని చేరారు? భౌతిక వాదమా, ఆధ్యాత్మిక వాదమా, ఈ ద్వందాల్లేని అద్వైతమా? జస్ట్ క్యూరియస్. 🙂
>> మరి ఆ రెండో మనిషి ఎవరో, ఏమిటో అన్న ప్రస్తావన ఎక్కడా లేదు. ఆ పరంగా ఇది ఈ పుస్తకంలోని లోపం అనే చెప్పొచ్చు.
నాకైతే ఆ రెండో మనిషి కల్పితం అనిపించింది. గోపీచంద్ తన మునుపటి కమ్యూనిస్టు భావజాలపు భౌతిక వాదాన్ని అధిగమించి ఆధ్యాత్మికత (భావవాదం) వైపు పయనిస్తూ, తన పాత వ్యక్తిత్వమైన కమ్యూనిస్టు/ భౌతికవాదిని రెండో వైపుకు పెట్టి తనకు తనే రాసుకున్న ఉత్తరాల్లా అనిపించాయి.
పుస్తకం » Blog Archive » పోస్టు చెయ్యని ఉత్తరాలు (ఆధ్యాత్మిక వాద,భౌతిక వాదాల సమన్వయం) -సమీక్ష
[…] మునుపు పుస్తకం.నెట్ లో వచ్చిన వ్యాసం ఇక్కడ చదవొచ్చు. (No Ratings Yet) Loading […]
పుస్తకం » Blog Archive » బెంగళూరులో గోపీచంద్ శతజయంతి ఉత్సవాలు
[…] పై పుస్తకం.నెట్ లో వచ్చిన వ్యాసం ఇక్కడ […]
పుస్తకం » Blog Archive » తెలుగు సాహిత్యంలో మళ్ళీ మునకలేయాలనుకుంటున్నారా?
[…] ఉత్తరాలు” చదివాను. దాని పై రివ్యూ ఇక్కడ. శతజన్మదిన వార్షికోత్సవం సందర్భంగా […]
Swathy
భౌతికవాదం ఆధ్యాత్మిక వాదం సమన్వయము గురించి లోతుగా చర్చించ లేదు.
నేను ఈ మధ్యే ఈ ఉత్తరాలు చదవటం జరిగింది 🙂 . Thanks to Sowmya 🙂
Bhaavana
మంచి పరిచయం. కొనవలసిన కనీసం ఒక సారి చూడవలసిన పుస్తకాల లిస్ట్ లో వేసుకున్నాను. ధన్య వాదాలు.