వచ్చే నెల ఫోకస్: తెలుగు కథల కబుర్లు
సరిగ్గానే చదివారు! వచ్చే నెల ఫోకసే! “ఇప్పుడే ఎందుకూ?” అంటే.. “మరి మీకు సమయం సరిపోవద్దూ!” పక్షం రోజులు ముందుగానే చెప్పేస్తున్నాం, వచ్చే నెల ఫోకస్: మీకు నచ్చిన తెలుగు కథ(లు)!
ఒకసారి అలా వెనక్కి వాలి, కళ్ళు మూసుకొని మీకు తెల్సిన కథలన్నీ నిక్షిప్తమై ఉన్న మెదడులోని భాగాన్నీ కదిలించండి. అమ్మ గోరుముద్దలు పెడుతూ చెప్పిన కథో, మన అల్లరి మానిపించటానికి అన్నో / అక్కో చెప్పిన కథో, ఆరు బయట వెన్నెల్లో హాయిగా చెప్పుకొంటున్న కబుర్లలో జొరబడిన కథో, పుస్తకాలను పట్టుకుని చదువుకునే నేర్పరితనం వచ్చాక చదివిన కథో, ఏం చదువుతున్నామో అనుమానం రాకుండా చదివేంత ఆకతాయితనంతో చదివిన కథో, ఓ అమ్మడి మీద మనసు పారేసుకుని – అది పుస్తకంలో దొరుకుతుందన్న మాయలో చదివిన కథో, నిరాశా నిస్పృహలో కూరుకుపోయిన వేళ దారి చూపించిన కథో, అలసొచ్చి కూలబడ్డప్పుడు కొత్త చైతన్యాన్ని ఇచ్చిన కథో… మీ మనసులో తిష్ట వేసిన ఏ కథ గురించైనా మనం వచ్చే నెలలో మాట్లాడుకుందాం. కాకపోతే వచ్చే నెల తెలుగు కథలు మాత్రమే! (ఆ పైన ఎప్పుడైనా వేరే కథలు గురించీ మాట్లాడుకుందాం.)
ఒకే కథపై మీ మ్యూసింగ్స్ రాయచ్చు. “నాకు నచ్చిన మొదటి కథ..రెండోది..” అని కూడా రాయచ్చు. కథలను పరిచయం చేయొచ్చు, సమీక్షించవచ్చు.
“అబ్బే.. ఆ రచయితవి నేనేం చదవలేదూ!” అన్న వంక పెట్టటానికీ లేదు. సమయమా, పదిహేను రోజులు ఎగస్ట్రా! “రాయాలా? తప్పదా?” అంటే తప్పదు మరి! కథలేమైనా వ్యధలా మనసు గదుల్లో తాళాలేసుకుని మరీ దాచుకోడానికి? కథల గురించి కబుర్లు ఎంత కమ్మగా ఉంటాయో! మరి, మీ వంతు కబుర్లతో సిద్ధంగా ఉంటారు కదూ!
అన్నట్టు.. మళ్లీ చెప్పలేదనేరు! కథలు తెల్సీ చెప్పకపోతే, చాలా పాపం వస్తుంది. (దానంతట అది రాకపోతే, మేం పంపిస్తాం అన్నది మేం మీకు ఇప్పుడే చెప్పం!) మీ ఇష్టం ఇహ! “ఎవరికి తెలియని కథలివిలే!” అని పాట సాకూ చూపించలేరు.. ఎందుకనగా.. ఇప్పటికే రాయబడ్డ కథలు కదా మన టాపిక్!
మాలతి
చాలా మంచి ఆలోచన. పుస్తకం గబగబ విస్తరించిపోతోంది. 🙂