అందమైన ఆల్బమ్
ఏదో వివరం కావల్సి వచ్చి గడచిన డైరీలను తిరగేస్తుంటే కనిపించాయి పిన్నుపెట్టి కుట్టిన మూడు కాయితాలు… వాటిలో ముత్యాల్లాంటి అక్షరాలు.. ‘నేనంటే ఇంకో నువ్వు’‘ఆ పట్టీల ఆర్కెస్ర్టా ఎద లోయల్లో’‘ఆ పెదాలపై చిర్నవ్వు నాలో చిగుళ్ల పండగ’ ‘తను వస్తోంది ఎవరు నేర్పారు గుండెకు గజళ్లు’ వంటి మధురమైన భావాలు. నా ఊహ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆగండాగండి… మీ ఊహను మరీ ఎటో పోనివ్వకండి. మీకు రెండు క్లూలిస్తాను. ఒకటి. అవి నాకోసం రాసినవి కాదు. రెండు. పోనీ నేను ఇంకోరికివ్వడానికి రాసుకున్నవీ కాదు. మనకంత చిత్రము లేదుగానీ, మరి అవి నా డైరీలో ఎందుకున్నాయి? సరే, చెప్పేస్తా. రచయితగా చాలామంది అభిమానించే గోపరాజు రాధాకృష్ణ ఈనాడులో మా సహోద్యోగిగా ఉన్నప్పుడు ప్రచురణకోసం రాసిచ్చినవవి.
వాటిని చూసి మళ్లీ దాచేసిన కొద్దిరోజుల్లోనే ‘ఆల్బమ్’ పుస్తకావిష్కరణకు ఆహ్వానమంటూ ఒక చిట్టి సందేశం. రచయిత పేరు గోపరాజు రాధాకృష్ణ. చూసి సంతోషపడ్డాను. మొత్తానికి కథల పుస్తకం వస్తోందన్నమాట. నావలెనే టీనేజీలో ఆయన కథలను చదివి, పంకాలయిపోయి, పుస్తకం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్న స్వాతికుమారి, పూర్ణిమ వంటి మరో ఇద్దరుముగ్గురికి ఆ సందేశాన్ని చేర్చేసి హమ్మయ్య అనుకున్నా.
‘ఆల్బమ్’ అందమైన పుస్తకం. మూసకు భిన్నంగా అచ్చయిన పుస్తకం. చూడగానే ముచ్చటేస్తుంది. అయితే లోపలున్నవి కతలుగావు. చిన్నచిన్న కవితలు. చదవగానే ముచ్చటేసేవి. కొన్ని మనసును హత్తుకునేవి. కొన్ని ఆలోచనలో పడేసేవి. మరికొన్ని కాలేజీ రోజుల్లోకి తీసుకుపోయి పెదవులపై చిన్న చిరునవ్వును పూయించేవి. సహజంగానే ఇంకొన్ని ప్రకృతి చిత్రాలను మినియేచర్ పెయింటింగుల్లా కళ్లకు కట్టేవి.
‘ఆల్బమ్’కు పచ్చతోరణం కడుతూ తనికెళ్ల భరణి రాసిన నాలుగు వాక్యాల్లోంచి చెప్పాలంటే-
‘‘గోరా హైకు సదృశ కవితలు అచ్చ తెలుగులో చెప్పాలంటే వేడివేడి గారెల్లా ఉన్నాయ్! కొన్ని అద్భుతంగా ఉన్నాయ్! అందులో నాకు బాగా నచ్చింది..
తీగపై పక్షుల్లా
గీతమీద అక్షరాలు
ఒక్కోటీ వాల్తున్నాయ్..
బొమ్మ కట్టేశాడు గోరా. అదే ఆల్బమ్ అయింది.’’
కథల్లో గోపరాజు బొమ్మ కట్టెయ్యగలరు, లక్ష నిర్వచనాలున్న ప్రేమను అనిర్వచనీయం చేసి అనుభవానికి తీసుకురాగలరు, మనుషుల మధ్య అల్లుకున్న బంధాలను గోదావరి కాలవ గట్ల మీద కొబ్బరాకు నీడల్లోంచి వచ్చే చిరుగాలిలా నులివెచ్చని ఎండలా చేసి నిల్చోబెట్టి చూపించగలరు. ఇంత చిన్న కవితల్లో కూడా ఆ పని అలవాటులో పొరపాటుగా చేసేయడమే ఆయన ప్రతిభకు తార్కాణం. భరణిగారు ‘ఇలాంటి బొమ్మలు నాకు గదినిండా కావాలి..’ అన్నారంటే అనరూ మరి? అలాంటి బొమ్మల్లో కొన్ని చూడండి…
గుండెలు బాదుకుంటూ
వెళ్తోంది అంబులెన్స్
రోగి బంధువులాకడుపు
ఉడికిపోతోంది
కుక్కర్ కి.వరదల్లో
మునిగిన ఆ వూరు
పేపర్లో తేలిందిఅరిటాకు
మొహం మాడ్చుకుంది
వేడన్నం పడితనంటే
నాకు చాలా ఇష్టం
చాలా టు ది పవరాఫ్ చాలావిత్తనంలో
మునగదీసుకుని పడుకుంది
ఆకుపచ్చని ఆశ
చాలు. ఆపేద్దాం. బాగున్నాయి కదాని వేడి గారెలయినా నేతి బూరెలయినా ఒకేసారి ఎక్కువ లాగించెయ్యకూడదు. ఆరారా లాగించాలంటే ‘ఆల్బమ్’ మీ దగ్గర ఉండాల్సిందే.
ఆయనతో నాకున్న పరిచయానికి నిజానికి నేనిక్కడ ఈ పుస్తక పరిచయాన్ని ఆపెయ్యాలి. కానీ పరిచయమే ఎక్కువ ప్రశ్నలేసే చనువునూ ఇస్తుంది. హైకూలు రాసే ఎక్కువమంది చేసే పనే ఆయన కూడా చేశారు. అదేమంటే నిర్వచనాలను కవితలనో హైకూలనో అనుకోవడం. అనుకోకుండానైనా రాసెయ్యడం. రెంటికీ ఉమ్మడి సూత్రం ‘క్లుప్తత’ అవడంలో వచ్చే కంఫ్యూజన్ కారణమేమో మరి.
‘నిద్రకి
పీఠిక
ఆవులింత’‘రెండో బాల్యానికి
బారసాల
షష్టిపూర్తి’‘నీళ్లు
నడిచే దారి
నది’‘నురుగుతో
పళ్లకి ఒళ్లు రుద్దుతోంది
టూత్ బ్రష్’
మరొక సందేహం కూడా. రాధాకృష్ణగారు ఆల్బమ్ కు ‘హైకు సదృశ కవితలు’ అని ట్యాగ్ లైన్ ఎందుకు పెట్టారు? హైకూలు, వాటి లక్ష్యలక్షణాల మీద జోరుగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో దీన్ని గోడ మీది పిల్లి వాటం అనుకోవచ్చునా? అదృష్టవశాత్తూ గోపరాజు రాధాకృష్ణగారు ఈమధ్యనే బ్లాగ్ లోకంలోకి ‘కొబ్బరాకు’లు కట్టి గృహప్రవేశం చేశారు. ఈ వ్యాసం ద్వారా హృదయపూర్వక అభినందనలను అందుకోవడమూ సందేహాలకు సమాధానం చెప్పడమూ ఆయనే స్వయంగా చెయ్యొచ్చు.
తాజాకలం ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం (20 జూన్ 2010)లో ఆచార్య కొలకలూరి ఇనాక్ ‘గాథ’ శీర్షికన కొన్ని కవితలు రాశారు. ‘జీవిత శకలమో దృశ్యమో సందర్భమో విషయమో ధ్వనో అలంకారమో రసమో వక్రోక్తో స్ఫురింపజేసే గాథకు 36 మాత్రలు మించవు’ అంటూ నిర్వచించి
కవీ
రవీ
ప్రేమిస్తారు,
కన్న
కృతిని
ప్రకృతిని
వంటివి పంతొమ్మిదింటిని రాశారు. ‘గాథ’ ఏ సాహిత్యంలోనైనా ఇదివరకే ఉందా, ఇంకెవరయినా రాశారా, ఇదే మొదలా.. అన్న సందేహం కలిగింది. విజ్ఞులయిన పాఠకులకు తెలిస్తే చెప్ప మనవి.
ఆల్బమ్ వివరాలు
46 పేజీలు, 25 రూపాయలు.
పుస్తకాల కోసం
గోపరాజు రాధాకృష్ణ కేరాఫ్ గోపరాజు జవహర్ లాల్
మోరి పిన్ కోడ్ 533 250 తూర్పు గోదావరి జిల్లా, ఆం.ప్ర. ఫోన్ 99488 23500
సౌమ్య
హైకూలు చాలా బావున్నాయి
goparaju radhakrishna
Aruna garu…
Thanq so much.
Pl read my answer in my blog.
http://kobbaraku.blogspot.com/
– goparaju radhakrishna
armily
‘గాథ’ గురించి విజ్ఞులయిన ఆచార్య కొలకలూరి ఇనాక్ గారే రాయాలి. నానీలు, రెక్కలు, గాథలు వొస్తున్నా, గోరాగారి ఆల్బం హైకూ సదృశ కవితలుగా రావటం బాగానే ఉంది కానీ, మరీ మీలా స్పందించే తీరుగా లేవని నా అభిప్రాయం. చదివాను కాబట్టి. హైకూకి తక్కువ, గాథకి, రెక్కలికి ఎక్కువగా కూడా లేవవి.