నామిని కొత్త సంకలనం వచ్చిందోచ్

రాసినవారు: కే.బి.ఎల్.శర్మ
**************
“ఆరో తరగతి సిలబస్లో ఏమేమి వుండాది అనే ముందు, సిలబస్ ఎన్నేసి పేజీలు వుండాదనేది చూద్దాం.

ఇంగ్లీషు 150 పేజీలు
ఇంగ్లీషు నాన్ డీటెయిల్డ్ 170 పేజీలు
తెలుగు 140 పేజీలు
తెలుగు నాన్ డీటెయిల్డ్ 60 పేజీలు
హిందీ 70 పేజీలు
లెక్కలు 416 పేజీలు
సైన్సు 296 పేజీలు
సోషల్ 316 పేజీలు

మొత్తం 1618పేజీలు

ఆరోతరగతి సిలబస్ తీస్కోని తమాషాగా లెక్కేస్తే 1618 పేజీలు అయినాయండీ. ఈ పదహారు వందలా పద్దెనిమిది పేజీల్ని పిలకాయలు చదవాల. అర్తం చేసుకోవాల. ఆరోతరగతి పిలకాయలంటే పదేండ్లు పూర్తయి పదకొండో సమ్మచ్చరం నడస్తా వుండే బుజ్జికొండలు. ఈ తిరమల కొండలు 1618 పేజీలను చదివి నేర్చకోవాల. అయ్యే పనేనా?

ఆంధ్రదేశంలో వుండే మేధావులు అనే నా కొడుకులు సమ్మచ్చరంలో కనీసం(నేర్చుకునే కత పక్కన పెడితే) 1618 పేజీలు తిరగేస్తారా? న్యూస్ పేపరొదిలేస్తే మనమందరం సంవత్సరానికి 1618 పేజీలు తమాషాగానైనా చదివి అవతల పారేస్తున్నామా? కనీసం కథలూ నవలలూ అయినా 150 పేజీల పుస్తకాలు సంవత్సరానికి పది చదువుతుండామా?”

– చదివారుగా… అదండీ కత. ఎంసెట్లూ ఇంజినీరింగులూ ర్యాంకుల పేరుతో పిల్లల్ని ఎంత హింసిస్తున్నామో నామిని తనదైన ‘భాష’లో ‘పిల్లల భాషలో ఆల్జీబ్రా’ అనే పుస్తకంలో ఈమాదిర్తో చెండాడేసినాడు.

అదొక్కటి రాసి ఊరుకున్నాడా? ఇట్టా ఇంకా ‘ఇస్కూలు పిలకాయల కత’, ‘చదువులా? చావులా??’ ‘మా అమ్మ చెప్పిన కతలు’, ‘పిల్లల్తో మాట్లాడాల్సిన మాటా’ పేరుతో మరో నాలుగు పుస్తకాలు రాసిపారేసినాడు. నామిని సుబ్రమణ్యం నాయుడు అప్పుడప్పుడూ రాసిన ఈ పుస్తకాలన్నింటినీ కలిపి ‘నామిని ఇస్కూలు పుస్తకం’ పేరుతో సంకలనంగా అచ్చొత్తించేశారు. విశాలాంధ్ర, నవోదయ షాపులన్నింట్లో ఈ పుస్తకం దొరుకుతోంది. వెల రూ.200.

నామిని అంఠే పడిచచ్చేవోళ్లు ఎగబడి కొనేస్కోవచ్చు. నేనయితే పొద్దున మొదులుబెట్టి సాయంత్రానికి చదివిపార్నూకినా!

You Might Also Like

3 Comments

  1. Varaprasad.k

    గత పాతిక ముప్పయ్యేళ్లుగా నామిని బాషా, శైలి బాగోలేదని ఎంతో మంది రక రకాల వేదికల మీద చర్చలు చేస్తూనే వున్నారు, అయినా ఆయన రాస్తూనే వున్నాడు, పాటకులు చదువుతూనే వున్నారు, పోగా ఈ బాషా, శైలి మరీ మారు మూల గ్రామాల్లో చాలా సర్వ సాధారణం. కొత్త వాళ్ళకు కొంచెం ఇబ్బందిగా వుండొచ్చు. ఆయనది భావవ్యక్తీకరణ తప్ప కావాలని ఎవర్నీ నొప్పించే యత్నం అయితే కాదు.

  2. Sarath

    ఈ పుస్తకాలకి ఈ-కాపీలు కూడా దొరికితే బాగుండు….గ్రంథాలయాలు వెంటతీసుకుని తిరగలేకపోతున్నాను.

  3. సుజాత

    ఇదివరకు రాసినవే మళ్ళీ మళ్ళీ వెయ్యకుండా మళ్ళీ కొత్తవి రాయమని నామినికి గాఠ్ఠిగా ఎవరన్నా క్లాసు పీకితే బావుడు!

Leave a Reply