శశాంక విజయము – ఒక పరిచయము – రెండవ భాగము

రాసిన వారు: మల్లిన నరసింహారావు (వేదుల బాలకృష్ణమూర్తి)
*********************
మొదటి భాగం లంకె ఇక్కడ.

సీ. ఇది మనోహర కాంతి నింపైన బింబంబు
బింబంబు గా దిది బెఁడగు కెంపు,
కెంపు గా దిది, తేఁటి యొంపని మంకెన,
మంకెన గా దిది, మంచి చిగురు,
చిగురు గా దిది వింత జిగి హెచ్చు పగడంబు,
పగడంబు గా దిది, పానకంబు,
పానకం బిది గాదు, పలుచని చెఱకు పాల్,
చెఱకు పా లిది గాదు, కురుజు తేనె, (3-42)

గీ. కురుజు తేనెయుఁ గా దిది, కుసుమ రసము,
కుసుమ రసమును గా దిది, గొనబు జున్ను,
జున్ను గా దిది, చవి గొల్కు సుధల దీవి,
సుధల దీవియుఁ గా దిది, సుదతి మోవి. (3-43)

ఎంత అందమైన పద్యం. ఎంత హృద్యంగా వుందీ పద్యం నడక. చంద్రుడు తార సర్వాంగ సౌందర్యాన్ని తిలకించి పులకించి పోయే ఘట్టంలో చెప్పిన పద్యమిది. చిత్రంగా చంద్రుడు తార పెదవిని మొదటగా బింబం ( చంద్ర బింబం ? ) తో మొదలు పెట్టి అది కాదు, కెంపు, కెంపూ కాదు, మంకెన, ఆ మంకెనా కాదు, మరింకోటి , … ఇంకోటి అని చెప్పుకుంటూ వచ్చి చివరాఖరికి అది ఆమె పెదవి మాత్రమే కాని ఇంకోటీ ఇంకోటీ కాదని తేలుస్తాడు. ఇది బహుశః స్మృతి భ్రాంతిమత్ సందేహాలంకారాలు, మరియు అతిశయోక్త్యలంకారాలు అయివుండవచ్చని పెద్దలు శ్రీ రామకృష్ణారావు గారు తెలియజేసారు. వారికి నా ధన్యవాదాలు.

బృహస్పతిని స్వర్గానికి వీడుకొలిపి తిరిగి వచ్చిన చంద్రుడిని మజ్జన భోజనాదులతో సంతుష్ఠిడిని గావించి బాగా అలంకరించి తాను కూడా అందంగా అలంకరించుకొని విలాస భాసురాంగియై తార శృంగార వనికి చేరుతుంది. అప్పుడు చంద్రుడాశృంగార వనిలో తార సర్వాంగ సౌందర్యమును తిలకించి పులకించినవాడై ఈ విధంగా తలపోస్తాడు. ఆ ఘట్టంలోనిదే పై పద్యం. ఇంకా ఆమె అందచందాలను చూచి —

ఔరా! చక్కదనంబు హౌసు ! మురిపెం బయ్యారె ! యొయ్యార
మౌరౌరా ! మైసిరి హైసరే ! సొగసు మే! లాహా విలాసంబు ! ల
జ్ఝారే జవ్వన ! మద్దిరా వగలు ! మజ్ఝారే తనూ విభ్రమం !
బీ రమామణితోడ నీడు గలరా యీ రేడు లోకంబులన్. ? 3-23

గీ. కొమ్మ గా దిది, బంగారు బొమ్మ గాని,
యింతి గా దిది, జాజి పూ బంతి గాని,
కలికి గా దిది, మరుని పూ ములుకు గాని,
భామ గా దిది లావణ్య సీమ గాని. 3-24

అని అనుకుంటుంటాడు. అంతేకాదు ఆమె అందాన్ని తనివి తీరా యింకా యిలా వర్ణించుకుంటూ పోతాడు.

కటి యొకటే ధరిత్రి నవఖండము లేలఁగఁ జాలు, నందుపైఁ
బటు జఘనంబె చక్రములఁ బుంపు లిడున్, గుచముల్ మహోన్నతం
బిటు సృజియించి, దీని కొకయించుక కౌను సృజింపఁడాయె నే
మిటికొ విరించి ? యింతి మెయి మించు కనుంగొని మోహమందెనో ?
(3-33)

-ఆమె మొలప్రదేశ మొక్కటే ఈ భూమిమీది నవఖండాల్నీ ఏలటానికి సరిపోయేట్టుగానూ, ఆపై దిట్టమైన ఆమె మడికట్టు చక్రముల నాజ్ఞాపిస్తున్నట్టుండేవిగానూ, చన్నులను ఎంతో ఉన్నతమైనవిగానూ సృష్టి చేసిన బ్రహ్మ దేవుడు నడుము భాగం దగ్గఱ కొచ్చేసరికి దాన్ని సృష్టి చేయడం మఱచిపోయినట్టున్నాడు. ఎందుకో ? ఆమె మేని సింగారాన్ని చూచి మోహంలో పడిపోయాడో ఏమిటో ? —యేమి ఊహ?

ఈ లేమ చక్కఁదనాల వెల్లియొ ! కాక
తళుకు క న్బేడిస బెళుక నేల ?
యీ రామ రతి దేవి యారామమో ! కాక
పొక్కిలి పొన్నపూ పుట్టనేల ?
యీ కల్కి మదనుని చే కటారియొ ! కాక
కౌను పేరిటి పిడి గాంచ నేల ?
యీ రాజముఖి పంచదార రాశియొ ! కాక
యారు చీమల బారు చేర నేల ?
మేటి యీ బోఁటి పన్నీటి చెర్వు
కానిచో , వళి వీచిక ల్కలుగ నేల ?
యీ వనిత నాదు పుణ్యంపుఁ దీవె యరయఁ,,
గానిచో చన్ను గుత్తులు పూన నేల ?
(3-34 )

– మళ్ళీ అదే భ్రాంతిమత్ సందేహాలంకారము !

గీ. అంఘ్రులకుఁ బద్మ సారూప్య, మక్షులకును
గమల వర గర్వ సంపద, కర్ణములకు
శ్రీ విలాసంబు గలిగియుఁ, జెలియ కౌను
కేలనో లేమి ? దాని యదృష్ట రేఖ !
(3-35 )

కాళ్ళకు పద్మాలతో సారూప్యము, కనులకు కమలముల సంపద, చెవులకు శ్రీకారవిలాసమూ కలిగినా చెలియ నడుము భాగానికి లేమి ఎందు వల్లనో ? అది ఆమె అదృష్ట రేఖే నేమో !

ఆమె నుదుటి భాగాన్ని ఎంత సుందరంగా వర్ణిస్తున్నాడో చూడండి !

కం. నుదు రా జిగి క్రొన్నెల చె
న్ను దురాగత మనును, దేంట్లను దురా నెట్టు
న్న దురా యని ముంగురు, లె
న్న దురా నెఱి వేణి జీవనదు రాజసమున్. 3-48

సవరంబుఁ దనకుఁ దాన వరంబుగా నెంచు ,
మలయు మబ్బును మబ్బు మాను మనును,
బర్హంబు కని కరం బర్హంబు గా దను,
నళి ఱెక్క కప్పుల కప్పు లొసఁగు,
నీలంబు జిగి గాంచి నీ లంబు వల దను,
నలరారు నాచుఁ ము న్నాచు దరుము,
చీఁకటిమా నోర్చు చీఁకటి మ్రాన్పడ,
తమము గై కొన దనుత్తమము గాఁగ,
మంపు సాంబ్రాణి ధూపంబు పెంపు పెంపు,
వంపు మరువంపు టిందీవరంపు రంపు,
గుంపు మృగమద వాసన ల్గుంపు రనఁగ
సాటి లే కొప్పు , నీ యింతి జాఱు కొప్పు. 3-49

ఈ పద్యాలలో ఉపయోగించిన అలంకారము ఛేకాను ప్రాస మనుకుంటాను.

( ఛేకాను ప్రాసం బనఁ, నాకర్ణిత మగుచునొప్పు నర్థము వేఱై
చేకొన్నవ్రాల యొప్పుగ చేకొనఁబడునేనిఁ గృతుల సిరులకు నెలవై. ) – కావ్యాలంకార చూడామణి. ఇక్కడ ఉపయోగించిన పదాలు రెండూ వేర్వేరు అర్థాలు కలిగి ఉన్నాయి.


ఆకృతిని హేమ రూపి యౌ, నైన ముక్కు
చాయఁ జూడఁ దిలోత్తమ సరణిదోఁచె,
మోముఁ జూచిన శశిరేఖ మోడి యమరె,
మాట పోడిమిఁ జూచిన మంజు ఘోష.
(3-50 )

ఆమె చంద్రుడి కంటికి తిలోత్తమగానూ, శశిరేఖ గానూ, మంజుఘోష లానూ కనిపిస్తోందట. అంతే కాదు, ఎందఱెందరో భామలను చూచాను గానీ ఈ అందం ఇంకెక్కడా కనిపించ లేదంటున్నాడు, చూడండి .

పన్నగ కన్యలన్, మనుజ భామల, యక్ష సరోరు హాక్షులన్,
గిన్నర సన్ను తాంగులను, ఖేచర బాలల సిద్ధ కాంతలన్,
జన్నపు విందు సుందరులఁ, జారణ వారణరాజ యానలన్,
గన్నది కాదె ? దీని మెయి కైపులు, వైపులు చూడ మెచ్చటన్. 3-51

చూడ కుండంగఁ గూడ దీ సుదతి సొబగు,
చూచినంతనె మదిలోనఁ జొచ్చె జాలి,
యేమిటికి వచ్చె నిచటికి నిందువదన ?
యెట్టు లున్నదొ యింక రతీశ్వ రాజ్ఞ ! 3-52

– అని చింతిస్తూ ఉండగా తార చంద్రుని ప్రక్కకు వచ్చి కూర్చుంటుందట. అది చూచి చంద్రుడు నేనెందుకు ఇక్కడ కొచ్చాను? నేను వచ్చాను పో, ఆమె కూడా వచ్చిందే ! ఇప్పుడేం జరగనుందో కదా భగవంతుడా ? ఆడవారిని కల్లోకూడా నమ్మకూడ దంటారు పెద్దలు, ఐనా కాని నా చేతనైనంతమటుకు ఈమెను వారించటానికి ప్రయత్నించి చూస్తాను అని అనుకుని ఇలా అంటాడు.

You Might Also Like

5 Comments

  1. B Subrahmanyam

    మీ విశ్లేషణ చాలా బావుంది. నేను కూడా పెద్దాపురం లో ఉంటున్నాను.subymn@yahoo.com

  2. jawaharlal

    I would like to know the address and phone number of Narasimarao garu

    1. narasimharao mallina

      నా ఫోను నంబరు 9866061790, address: 19-1-317,S.B.I. Colony, Peddapuram, E.G.Dt, A.P.

  3. సౌమ్య

    Hmm – చాలా ఓపిగ్గా ’శశాంక విజయము’ గురించి పరిచయం చేస్తున్నందుకు ధన్యవాదాలు.
    మూడో భాగం కోసం చూస్తున్నా! 🙂

    1. jawahar

      it is very good.i enjoyed it.
      can you please tell me where this book (in detail with taatparyam) is available.
      Also i am interested in Manicharitra book.
      please mail me
      thank you

Leave a Reply