మధురాంతకం రాజారాం కథలు 1

రాసిపంపినవారు: అవినేని

కొత్తగా నేర్చుకున్న భాషలోని సాహిత్యపు లోతుల్ని తెలుసుకుని మన అభిరుచికి తగిన/నచ్చిన రచయితలనూ, రచననలనూ గుర్తించటం సులువుకాదు. చిన్నప్పటినుంచి చదువుకున్న భాషైతే అంత కష్టం కాదేమో. ప్రతిభావంతులైన రచయితలు ఎంతమంది ఉన్నా మనకు కొందరి రచనలే నచ్చుతాయి. ఆ కొందరిని కనుక్కోవాలంటే అందరినీ చదవాలి మరి. ఈ మధ్యనే తెలుగు నేర్చుకున్న నా బోంట్లవారికి ఇది తప్పలేదు.

స్నేహితులూ సిఫారిసు చేసిన పుస్తకాలూ, అంగళ్ళలో అమ్మేవాళ్ళ సలహా మేరకు కొన్ని పుస్తకాలూ చదువుతున్టాను. అందులో కొన్ని అభిరుచికి తగినవి, కొన్ని తగనవి. ఒక్కోసారి నా అంతట నేనే కొన్ని క్షణాలలో పరిశీలించి కొనుక్కున్న పుస్తకాలూ ఉన్నాయి. అలా కొనుకొని నాకు ఎన్తగానో నచ్చిన పుస్తకాన్ని ఇక్కడ పరిచయం చేస్తున్నాను.

“1994లో కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డు పొందిన”
“మధురాంతకం రాజారాం కథలు 1”

ఈ పుస్తకంలో 40 కథలు ఉన్నాయి. 1950 నుంచి 1990 వరకు వేరువేరు సందర్భాల్లో రాసిన కథలివి. దాదాపు అన్ని కథలూ రాయలసీమ గ్రామీణ మధ్యతరగతి జీవితంలోనుంచి పుట్టినవే. అన్ని కథలూ జీవితములోనుంచే పుట్టాయన్నట్టు యథార్థముగా ఉన్నాయి. ఎక్కువగా రాయలసీమ జీవన విధానము కనపడుతుంది కథల్లో. రాయలసీమ భాష, పదాలు విరివిగా వాడారు. బీగాలు, ఈసిళ్ళు, యిర్లవాడు, తబిళ్ళు, బిన్నే, దేవళ్ం, బుడబుడకలోడు, పులుసన్నం లాంటి చిత్తుఉరు ప్రాంతపు పదాలు ఎక్కువగా చదవచ్చు ఈ కథల్లో.

తెలుగు ఉపాధ్యాయుడైనప్పటికీ కథల్లో అక్కడక్కా అవసరమైన చిన్న చిన్న విజ్ఞాన శాస్త్ర విషయాలను సాధారణ పాఠకుడికి అర్థమయ్యేలా చెప్పారు. ఉదాహరణకి “మెరుపూ, ఉరుమూ ఒకేసారి ఉద్భవించినప్పటికీ శబ్దవేగం కన్నా కాంతివేగం ఎక్కువ గనుక మెరుపు మున్దుగా కనిపిస్తుందని చెబుతుంది, విజ్ఞాన శాస్త్రం”

నాకు చాల నచ్చిన ముఖ్యమైన విషయాలేమిటంటే ఏ కథలోనూ సందేశం చెప్పే ధోరణి లేదు, సమాజాన్ని తిట్టిపోసే కోపం లేదు. పాత్రల సృష్టిలో ఎక్కడా అతితెలివిని ప్రదర్శించకుండా సమాజంలో మన చుట్టూరా ఉన్డే వాళ్ళనే పాత్రలుగా తీర్చారు. తెలుగుకథలను అభినందించే ప్రతివారూ చదవతగిన పుస్తకం ఇది.

వెల: రూ 150/-
తృతియ ముద్రణ: డిసెంబర్
ప్రచురణ: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
ప్రతులకోసం:
+91 40 24744580 / 24735905

రచయిత గురించి:

రచయిత: మధురాంతకం రాజారాం
పుట్టినది: మొగరాల, చిత్తూరు జిల్లా

విద్యాభ్యాసం: చిత్తూరు, ఉపాధ్యాయ వృత్తి. 1950 నుంచి తుదిశ్వాసవరకు సాహిత్య వ్యాసంగం. 300లకు పైదా కథలు, రెండు నవలలు, కొన్ని నవలికలు, నాటకాలు, గేయాలు, ఎన్నో సాహితి వ్యాసాలు రాసారు.

వెలువడిన కథాసంపుటాలు: వర్షించిన మేఘం, ప్రాణదాత, తాను వెలిగించిన దీపాలు, పురర్నవం, కళ్యాణకింకిని, కమ్మ తెమ్మర, వక్రగతులు – ఇతర కథలు, వగపేటికి, వినోదప్రదర్శనం, రేవతి ప్రపంచం, మధురాంతకం రాజారాం కథలు – నాలుగు సంపుటాలు…

పొందిన అవార్డులు – అందుకున్న సత్కారాలు :

* 1968 లో కథా రచనకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డు
* అనువాద రచనకు తంజావూరు తమిళ విశ్వవిద్యాలయం వారి అవార్డు
* 1990 లో గుంటూరు అరసం వారిచే కొండేపూడి శ్రీనివాసరావు సాహితీ సత్కారం
* 1991 లో గోపిచంద్ సాహితీ సత్కారం (హైదరాబాద్)
* 1993 లో “మధురాంతకం రాజారాం కథలు” పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడెమీ బహుమతి
* 1994 లో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు ప్రదానం
* 1996 లో అప్పాజోస్యుల-విష్ణుభోట్ల ఫౌండేషన్ (అమెరికా) వారి ప్రతిభామూర్తి పురస్కారం

You Might Also Like

One Comment

  1. Sandeep

    మంచి పుస్తకం గురించి చెప్పారు అవినేని గారు. మీ విమర్శ చూశాక నాకు కూడా ఈ పుస్తకం చదవాలని అనిపిస్తోంది. ముఖ్యంగా మీరు వ్రాసిన:

    “నాకు చాల నచ్చిన ముఖ్యమైన విషయాలేమిటంటే ఏ కథలోనూ సందేశం చెప్పే ధోరణి లేదు, సమాజాన్ని తిట్టిపోసే కోపం లేదు. పాత్రల సృష్టిలో ఎక్కడా అతితెలివిని ప్రదర్శించకుండా సమాజంలో మన చుట్టూరా ఉన్డే వాళ్ళనే పాత్రలుగా తీర్చారు. తెలుగుకథలను అభినందించే ప్రతివారూ చదవతగిన పుస్తకం ఇది.”

    — ఈ వాక్యాలు నాకు నచ్చాయి. ఇలాంటి పుస్తకాలను మనము తప్పకుండా ప్రోత్సహించాలి.

Leave a Reply