దువ్వూరు శతకాన్ని నిషేధించిన ఆంగ్లేయులు
[ఈ చిన్న వ్యాసం నెల్లూరు చారిత్రక విశేషాలను తెలుపుతూ రాసిన ’పెన్నాతీరం’ అన్న పుస్తకం నుండి స్వీకరించబడ్డది. రచన: ఈతకోట సుబ్బారావు. ఇందులో ప్రస్తావించిన విషయాలు పుస్తకాభిమానులకు ఆసక్తి కలిగించవచ్చు అన్న ఆలోచనతో ఇక్కడ తిరిగి ప్రచురిస్తున్నాము. అనుమతి ఇచ్చిన ఈతకోట సుబ్బారావు గారికి కృతజ్ఞతలు. – పుస్తకం.నెట్]
నేను గృహ విద్యాలయ శిక్షితుడను… అని వినయ మనస్కుడై చెప్పుకున్నవారు కవికోకిల దువ్వూరి రామిరెడ్డి. స్వాతంత్ర్య సమర కవితాయోధుడిగా, కృషీవలుడిగా, మానవతామూర్తిగా, జాతీయవాదిగా, విజ్ఞాన సారస్వతమూర్తిగా, బహుముఖ ప్రజ్ఞాపాటవాలను ప్రదర్శించిన వ్యక్తి దువ్వూరి.
1911లో బ్రిటీషు ప్రభుత్వం కొన్ని గ్రంథాలను నిషేధించింది. కానీ, దీనికి ముందుగానే దువ్వూరి మాతృశతకాన్ని నిషేధించారు. ఈసంఘటన తెలుగు సాహితీలోకానికి ఆగ్రహం తెప్పించింది. బ్రిటీషు ప్రభుత్వం గ్రంథాలను నిషేధించడమే కాక కొత్త చట్టం తీసుకువచ్చింది. ఇందులో ఎక్కువ శృంగార గ్రంథాలు నిషేధానికి చోటుచేసుకున్నాయి. కానీ, దువ్వూరి మాతృశతకం నిషేధించడం పట్లనే ఎక్కువ వ్యతిరేకత వెల్లడైంది. దీనికితోడు వావిళ్ళ వెంకటేశ్వర శాస్త్రిగారు వీథి నాటకాన్ని ప్రచురిస్తే ఇది మంచిపుస్తకం కాదని, దొరతనంవారి తెలుగు అనువాదకుడు గోటేటి కనకరాజు ప్రభుత్వానికి నివేదిక పంపితే ఆపిడుగు శాస్త్రిగారిపై పడింది. తెలుగు సాహిత్య, భాషాభిమానులైన పిఠాపురం రాజావారు, బయ్యా నరసింహేశ్వర శర్మ, జయంతి రామయ్య, పేరి నారాయణమూర్తి మొదలైన పెద్దలు నిరసన సభ జరిపారు. శృంగార కావ్యాలపై నిషేధం వలన అనేక కావ్యాలు లిఖితాలుగానే నిలిచిపోయాయి. దువ్వూరి మాతృశతకాన్ని, వావిళ్ల వెంకటేశ్వరశాస్త్రి శ్రీనాథుని వీథినాటకాన్ని తొలగించడంపైనే ఎక్కువ నిరసన ప్రతిధ్వనించింది. రాజాజీ మద్రాసు ముఖ్యమంత్రి అయినప్పటికీ నిషేధం వీడకపోవడం భాషాభిమానులలో మరింత ఆగ్రహానికి కారణమైంది. 1947లో ప్రకాశం పంతులు ముఖ్యమంత్రి అయిన తరువాతనే వీటికి చెరవదిలింది.
Leave a Reply