కవనశర్మ గారి హాస్య(కదంబం)కుటుంబం

రాసిన వారు: సుజాత
***************************
“మా తాత పులిలా బతికాడు, మా నాన్న సింహంలా బతికాడు,…”అంటూ ఒక మొగుడు గారు గొప్పలు చెప్పుకోబోతే “అయితే మీ వంశంలో మనుషుల్లా బతికిన వాళ్లెవరూ లేరన్నమాట”అని విసురు విసిరిందిట భార్యామణి అమాయకంగా మొహం పెట్టి. “మా కుటుంబం” అన్న పేరు చూడగానే ఇలాగే ఎవరిదో వంశ చరిత్రో ఏమిటో అని జంకుతూ జాగ్రత్తగా చూస్తే అది కవన శర్మగారి పుస్తకమైంది. అడపా దడపా ఆయన రచనలు (“రచన”లో)చదువుతూ ఉండటం వల్ల ఇక సంకోచించకుండా కొన్నాను.

తెలుగులో ఇలాంటి పుస్తకం ఇంతవరకూ రాలేదని గట్టిగా చెప్పగలననిపించింది. అసలు ఇలాంటి పుస్తకం ఒకటి రాయొచ్చని కూడా ఇప్పుడే తెల్సింది.

కవనశర్మ గారు,ఆయన తల్లి గారు భాస్కరమ్మ, సతీమణి విజయలక్ష్మి,కుమార్తెలు శారద,లక్ష్మీ నాగపద్మ,వీళ్ళంతా కల్సి వారి కుటుంబం గురించి రాసుకున్న పుస్తకమే ఇది.కాకపోతే ఇందులో ఉన్నది వంశచరిత్ర కాదు.మీ ఇంట్లో, మా ఇంట్లో, మీ పక్కింట్లో, మా వెనకింట్లో జరిగే రోజువారీ కథలే!

చక్కని సెన్సాఫ్ హ్యూమర్ ఉన్న శర్మ గారి కుటుంబసభ్యులు చదువరులకు విసుగు కల్గించకుండా జంధ్యాల మార్కు ఆరోగ్యకరమైన హాస్యాన్ని పుస్తకం చివరి వరకూ పంచుతూ నవ్వులను పూయించడానికి రాసిన కథా కదంబం ఇది!

పద్మేమో “ఇంట్లో చిన్నవాళ్ళుగా పుట్టనే కూడదు”అంటే శారదేమో “నేనింట్లో పెద్ద దాన్ని పాపం”అని తనమీద తనే జాలిపడిపోతుంది. శర్మగారు విజయలక్ష్మి మీదా,ఆవిడ శర్మగారి మీదా విసురుకునే విసుర్లనేకం!కొత్తగా పెళ్ళయినవారికి బోల్డుపనికొచ్చేలా ఉంటాయి!విద్యుత్తును వృధా చేయరాదు అనే నినాదంతో ప్రతి రూములోనూ వెలుగుతున్న లైట్లను ఆర్పుతూ వెళ్ళే శర్మగారికి శ్రీమతి ‘సాక్షాత్తూ దీపాంతకులు ‘అని బిరుదిచ్చేశారు.

విజయలక్ష్మిగారు పింగాణిపెట్టెలో(అంటే ఏమిటో అనుకునేరు…ఫ్రిజ్జు) రోజుల తరబడి దాచి బూజు వచ్చాక పారేసే సీనియర్(వారం నాటి) కూరలు,వాటి స్థానాన్ని ఆక్రమించే జూనియర్ (ఈ రోజు మిగిలిన) దోశపిండి వగైరా కథలు పద్మ చెప్తుంటే చాలామందికి అమ్మ గుర్తొచ్చి తీరాలి.(ప్రతి ఇంట్లో అమ్మలు చేసేపనేగా ఇది)

తూర్పు-పడమర కథ చదివితే అర్జెంటుగా విశాఖ జిల్లా వాళ్ళకీ గోదావరి జిల్లావాళ్ళకీ గొడవలొచ్చేస్తాయి.కథమొత్తం పుర్తయ్యాక నాలుగు దిక్కులా మీకు తూర్పే కనపడకపోతే అడగండి.

వివినమూర్తిగారు శర్మ గారింటికి వెళ్ళినపుడు చాలా లౌక్యంగా నొప్పింపక తానొవ్వక అన్నట్లు ప్రవర్తిస్తారట.శారదతో ఆయన “కాదమ్మా శారదా, మీ నాన్నగారంతటి ప్రజాస్వామ్యవాదిని నేనింతవరకూ చూడలేదు.మీ నాన్నగారిది తార్కిక కాఠిన్యతేకానీ, కాఠిన్యత కాదు”అని శర్మగారు వినేలా అని వంటింట్లోకి వెళ్ళి “విజయక్కగారూ,ఇంత మొండిమనిషితో ఎలా వేగుతున్నారమ్మా మీరు?”అనినాలుగు సానుభూతి మాటలు చెప్పి విజయలక్ష్మి గారిచ్చిన కాఫీ తాగేసి బయటికి వచ్చి “ఎంతైనా అక్కయ్యగారు మహా పట్టుదల మనిషి!మనిషికి పట్టేకానీ విడుపులేదు”అని శర్మగారితో అని ఆయన ఇచ్చిన బీరు తాగేస్తారుట……శారద చెప్తుంది!

శ్రీవారి ఊస్లే కారు గురించి,వాళ్ళింట్లో శనివారాల గురించి,”నువ్వంటేనే అమ్మకీ నాన్నకీ ఎక్కువిష్టం”అని కొట్టుకునే(అబ్బ,ఇదీ ప్రతింట్లోనూ ఉండే గోలే) పిల్ల రాక్షసుల గురించి,రాసి విజయలక్ష్మిగారు నవ్విస్తే తను “అడ్డంకులు”(అడ్డ+అంకులు)గా పడ్డ ఇబ్బందుల గురించి,తన గాంధేయవాదం గురించి,చిన్నప్పటినుంచీ కలలు గనే”తన సొంత గది”గురించి చెప్పి కవన శర్మ ఆమెతో పోటీపడతారు.

శర్మగారి తల్లి భాస్కరమ్మగారు రంగప్రవేశం చేసి తానూ తక్కువ తినలేదంటారు.చిన్నప్పుడు శర్మగారు తప్పిపోయినపుడు పోలీసులకు తన పేరు “నాచెమ్మ చెమ్మ”(నరసింహ శర్మ)గా చెప్పారని గుర్తు చేసుకుంటారు.అది ఏ భాషవాళ్లు పెట్టుకునే పేరో తెలీక పాపం పోలీసులు తికమకపడిపోయార్ట.

అణువణువునా హాస్యం చిందించే ఈ కథల్లో ఒక కామన్ పాత్ర ఉంటుంది.కథ శారద చెప్పినా,పద్మ చెప్పినా,శర్మ గారు చెప్పినా ఆయన శ్రీమతి చెప్పినా, తల్లిగారు చెప్పినా శర్మ గారి బామ్మగారు(ఆమె95 ఏళ్ళు జీవించారట) ప్రతి కథలోనూ కనిపిస్తారు.ప్రతి ఒక్కరూ హాస్యంగా మాట్లాడుతూనే ఆమెతోపెనవేసుకుపోయిన అనుబంధాన్ని ఆర్దృంగా తల్చుకుంటారు.

కవనశర్మగారింట్లో అటూ ఇటూ అంతా ఉన్నత విద్యావంతులే! కథల్లో అక్కడక్కడా ఆ ప్రస్తావన వస్తున్నా భేషజమన్నమాట ఎక్కడా కనపడదు,వినపడదు.పూలమాలలోదారంలా చదువు సంగతులకూ హాస్యాలద్దారు ఈ కందుల వాళ్ళు.

ప్రతి కథా పదును తగ్గని హాస్యంతో ఒకే శృతిలో నల్లేరు మీది నడకలా,సరదా పెళ్ళిపాటలా సాగిపోయిన రహస్యమేమిటో కవన శర్మగారు రాసిన “నడుమమాట”(ముందుమాట రాస్తే పుస్తకం చివరికి వచ్చేసరికి ముందుమాటలో ఏం చెప్పారో మనం మర్చిపోతామని ..)చదివి తీరాలి.

ఈ మధ్య వచ్చిన మంచి హాస్య రచనల్లో చెప్పుకోదగ్గదిగా ఈ పుస్తకం నిలబడుతుందని అనడంలో సందేహం లేదు. చదివిన ప్రతి ఒక్కరినీ ఈ కుటుంబం నవ్విస్తుందనడంలో అంతకంటే సందేహం లేదు. వాహినీ బుక్ ట్రస్ట్ విద్యానగర్ వారు ప్రచురించిన ఈ “మా కుటుంబం” పుస్తకం అన్ని ప్రధాన పుస్తక కేంద్రాల్లో లభ్యం!
225 పేజీలు
వెల 150 రూపాయలు.

You Might Also Like

13 Comments

  1. పుస్తకం » Blog Archive » 2010లో నా పుస్తకాలు

    […] 90. నాన్న నేను – బుజ్జాయి 91. మా కుటుంబం – కవన శర్మ 92. అనుభవాలు, జ్ఞాపకాలు – […]

  2. Sarala Chalasani

    I am so glad I came across your site. I wish I can write in telugu but do not have access to telugu font. I always liked the humour of Sarma garu. The first story I read and liked was a supplementary novel i think to one of the telugu magazines BANGARU ROJULU (Golden days). I still remember some of the lines. Your website is like a oasis for people like me who are living away from India.

  3. సుజాత

    కవన శర్మ గారూ,నమస్కారం!
    స్వయంగా రచయితే వ్యాఖ్య రాయడం ఆశ్చర్యమూ ఆనందకరమూ!

    మీరు గమనించారా, ఇక్కడి వ్యాఖ్యలు కేవలం పొగడ్తలు కావు. చాలామంది పుస్తకం చదవాల్సిందే అని రాశారు. అంతకంటే పుస్తక పరిచయానికి సార్థకత ఏముంటుంది?

    ధన్యవాదాలు

  4. vamsi

    పరిచయం ఆసక్తికరంగా పుస్తకం హాస్యo చక్కగా పండింది
    తాజా సమాచారం కోసం ప్రతీ రోజు చదవండి
    http://www.apreporter.com

  5. kavana sarma

    Thanks sujatha gaaru
    saapaatu yelaago ledu paataina paadaali
    pusthakaala meeda pettina sommelaago raadu naalugu poghadthalu vasthe ade 3 times ten thousands
    deeni gurinchi phone chesi cheppina raadhika ts gaariki runapadiunnaanu kavana sarma

  6. peeveeyes

    కవనశర్మగారు senior most రచయిత. వ్య౦గ్య హాస్య రచయితగా ముళ్ళపూడివారి తరువాత అ౦తటి పేరు స౦పాది౦చుకున్నారు. 1970 దశక౦లో ఆ౦ధ్రపత్రికలో విరివిగా రాస్తూ౦డేవారు. KVN శర్మగా మొదలు పెట్టి, తన పూర్తి పేరుని కూడా ఓ శ్రీ.శ్రీ., ఓ పా.ప., ఓ చాసో లాగా అ౦దమైన acronymగా మార్చుకోవచ్చని తెలిసి కవనశర్మగా మారారు. ఆ౦ధ్రపత్రికలో ప్రచురితమైన వీరి కథలన్నీ తరువాత “BRAIN DRAIN అనే అమెరికా మజిలీలు” కథాస౦పుటిగాఎమెస్కో పాకెట్ బుక్స్ సిరీస్ లో వచ్చాయి. షడ్రుచులసాహిత్య వ౦టకాలు వడ్డి౦చినా వీరికి ప్రముఖ౦గా హాస్య రచయితగానే మ౦చి పేరు. ఐతే, పిటీ ఏమిట౦టే, నేడు వీరి పుస్తకాలు ఏవీ మార్కెట్ లో లేవు. వీరి రచనలు ’రచన’ వ౦టి ఒకటి రె౦డు పత్రికలకే పరిమిత౦ అయిపోయాయి. ఇటువ౦టి పరిస్థితిలో వీరి జీవిత చరిత్రలా౦టి “మాకుటు౦బ౦” వచ్చి౦దని తెలిసి౦ది ఆదివార౦ అనుబ౦ధాల పుస్తక సమీక్షలలో. ఇప్పుడు సుజాతగారు ఈ ’కుటు౦బ౦’ గురి౦చి మరి౦త వివర౦గా ’పుస్తక’ ప్రియులకు పరిచయ౦ చేసిన౦దులకు నెనర్లు.

  7. నారాయణ

    పరిచయం చాలా చక్కగా ఉంది. ముఖచిత్రాన్ని చూసి పుస్తకాన్ని బేరీజు వెయ్యకూడదని తెల్సింది. త్వరలో దీన్ని కొని చదవాలనిపిస్తున్నది.

  8. Gireesh K.

    చక్కటి పరిచయం….చదవాల్సిందే!

  9. cbrao

    పరిచయం ఆసక్తికరంగా పుస్తకం లోని హాస్య చతురతను చక్కగా వివరించింది. ఇంత చక్కటి హాస్య ప్రధానమైన పుస్తకానికి ముఖచిత్ర రూపకల్పనలో సృజనాత్మకత కొరవడింది. రచయిత ఛాయాచిత్రాన్ని చివరి అట్టపేజీలో వేస్తే బాగుండేది.

  10. నీరజ

    ఈ పుస్తకం నేను బుక్ ఫేర్ లో చూసాను. పరిచయం బావుంది.
    చదవాల్సిందే!

  11. kvrn

    nice review for Sri Kavana Sarma’s Book

  12. సౌమ్య

    :)) చూడబోతే బాగున్నట్లే ఉంది. చదవబోతే ఏమౌతుందో చూడాలి.

  13. వేణు

    ఒకే కుటుంబంలో ఇన్ని తరాలవాళ్ళకు ఇంత హాస్యచతురత ఉందంటే అరుదైన విషయమే! ‘అడ్డంకులు’ అనే మాటను అడ్డ+అంకులుగా విడదీయటం, ఇంకా ‘నడుమ మాట’ అనే ప్రయోగం నవ్వు తెప్పించాయి. మీ పరిచయం చదివాక ఈ పుస్తకం తప్పకుండా చదవాలనిపిస్తోంది. కవర్ పేజీ మీద పుస్తకసారం వ్యక్తమయ్యేలా హాస్యస్ఫోరక రేఖాచిత్రమేదైనా వేసివుంటే ఇంకా బావుండేది!

Leave a Reply