పుస్తక ముఖ పరిచయాల కథ

నాకొక ఆలోచన తట్టింది. మనం చదివిన పుస్తకాల గురించి రాస్తాము… చదవాలి అనుకుంటున్న పుస్తకాల గురించి ఎందుకు రాయకూడదు అని.

మొన్న స్ట్రాండ్ బుక్ ఫెస్ట్ లో తిరుగుతున్నప్పుడు -కొన్ని పుస్తకాలు నా దృష్టిని ఆకర్షించాయి. అయితే, కొన్నాళ్ళ దాకా పుస్తకాలు కొనకూడదు అనుకుంటున్నాను కనుకా, పోయినసారి కొన్నవి ఇంకా పూర్తి చేయలేదు కనుకా, ఈ పుస్తకాల కవర్ పేజీలు ఫొటో తీసుకుని, పక్కన పెట్టుకున్నాను. అలాగే, టైంపాస్ కోసం ఆఫీసు పక్కనున్న క్రాస్వర్డ్ లో తిరిగినపుడూ, మరోరోజు రంగశంకరలోని -‘శంకర్స్, ది బుక్ పీపుల్’ షాపులో తిరిగినపుడూ కూడా కొన్ని పుస్తకాల గురించి అనుకున్నాను. ఇప్పుడు ఈ వ్యాసం అ పుస్తకాల గురించే. జీవితకాలంలో ఎప్పుడో ఒకప్పుడు ఈ పుస్తకాలు దొరకబుచ్చుకోవాలి – అనిపించినవి కొన్ని. ‘ఓహో, ఇలాక్కూడా‌పుస్తకాలు రాస్తారన్నమాట’ అనిపించేలా చేసినవి కొన్ని. ఇప్పుడు వాటిలో మచ్చుకి కొన్ని 😉

Meghnad Desai – The Rediscovery of India : దాదాపు ఐదువందల సంవత్సరాల చరిత్రను గురించిన పరిశీలనాత్మక విశ్లేషణ అట! ఇదివరలో ఈయన గురించీ, ఈ పుస్తకం గురించీ ఎక్కడో‌ఒక సమీక్ష చదివి ఉండటం చేత పుస్తకం గురించి కొంచెం సదభిప్రాయం కలిగింది. రామచంద్ర గుహ – ‘ఇండియా ఆఫ్టర్ గాంధీ‘ లా, హిస్టరీ ఫర్ డమ్మీస్ అన్నట్లు, సులభంగా అర్థమయ్యేట్లు ఉంటుందో లేదో, మరి నాకు తెలియదు.

By the Tungabhadra – Saradindu Bandyopadhyay: బ్యోంకేశ్ బక్షీ కథల రచయితగా, శరదిందు అంటే అభిమానం ఉంది నాకు. కానీ, ఆయన ఇతర రచనల గురించి నాకు తెలియదు. అలాంటిది ఆమధ్య ఒకరోజు – నా దృష్టిలో పరమ బోరింగు స్థలమైన క్రాస్వర్డులో అనుకోకుండా ఈ పుస్తకం తారసపడ్డది. ఇదొక చారిత్రక నవల. ఆయన రాసిన ఐదు చారిత్రక నవలల్లో ఒకటట. కళింగ రాకుమార్తెకి విజయనగర రాజుతో, రాజకీయ ప్రయోజనాల కోసం జరిగిన వివాహం గురించిన కథ. నిజంగా జరిగిన చారిత్రక ఘటనలపైనే ఆధారపడ్డది. శరదిందు రచన కనుక,అందునా, తుంగభద్రతో సంబంధం ఉన్న కథ కనుకా, తప్పకుండా చదవాలి అనుకుంటున్నాను.

The mind of your story: discover what drives your fiction – Lisa Lenard-Cook: టైటిల్ లో చెప్పినట్లే, ఇది ఒక కథ ఎలా రూపొందుతుంది? అన్న ప్రక్రియను అర్థం చేసుకునే ప్రయత్నానికి తోడ్పడే పుస్తకమట. వస్తువు ఆసక్తికరంగా అనిపించింది కానీ, టేకింగ్ ఎలా ఉంటుందో మరి.

Upgrade me – Our amazing journey to Human 2.0 : Brian Clegg : సాంకేతికత ద్వారా మనల్ని మనం మెరుగుపరుచుకుంటూ, ‘హ్యూమన్ 2.0’ అని ఎలా అనిపించుకోగలము? అన్నది ఈ పుస్తకం చర్చించే వస్తువు. ఎలా చర్చించారు అన్నది ఆసక్తికరమైన అంశం. ముందుమాట మాత్రం చదివాను. అది అయితే, కన్విన్సింగ్ గానే అనిపించింది మరి.

Enough – staying human in an engineered age : Bill McKibben: పై పుస్తకం చూసి, వెంటనే ఇది చూడ్డం ఒక గమ్మత్తైన అనుభవం‌:) పైన పుస్తకం లో సాంకేతికత మనల్ని మెరుగుపరచడానికి దోహదం చేస్తోంది అన్న వాదనతో ముందుకొస్తే, ఈ పుస్తకం – ఈ సాంకేతికత ఇక చాలు, మరీ ఎక్కువైపోతోంది దీని జోక్యం – అన్న ధోరణిలో‌ఉండే పుస్తకం ఇది!

You’ve Got to read this book: తమ జీవితాన్ని మార్చేసిన పుస్తకం గురించి యాభై ఐదు మంది వ్యక్తులు రాసిన వ్యాసాలు. ఈ మనుషుల పేర్లలో నేను ఏ ఒకట్రెండో తప్ప గుర్తించలేకపోయాను కానీ, ఇదొక మంచి ప్రయత్నం అనిపిస్తోంది. ఇక్కడ పుస్తకం.నెట్ లో రీడింగ్ లిస్టులు, మస్ట్ రీడ్ లూ, రీడ్ ఇట్ అగైన్ లూ శీర్షికలుగా పెట్టుకున్నాం కదా, అలాగే! 🙂

Don’t know much about Literature– Kenneth C.Davis:
Don’t know much about Anything– Kenneth C.Davis
:
-ఏవన్నా సంభాషణల్లో, మనకి లేని జ్ఞానం ఉన్నట్లు చూపించుకోడానికి పుస్తకాలు అనమాట 🙂 అయితే, ఒకందుకు ఈ పుస్తకాల ఐడియా నాకు నచ్చింది. ఏమిటంటే – ఏదన్నా విషయం గురించి ప్రాథమికంగా, కనీసం పదజాలం తెలుసుకునేందుకు పనికొస్తుంది. అక్కడ్నుంచి మన ఎఫర్ట్ మనం పెట్టుకోవాలి. అంతేకానీ, అది చదివేసి, నాకేదో వచ్చేసిందోచ్, అనుకోడం వల్ల ఒరిగేదేమీ‌ ఉండదని నా అభిప్రాయం. ఇలాంటి పుస్తకాలు ఈ సీరీస్ లో బోలెడు ఉన్నాయట. ఇంకో నాలుగైదు కూడా కనబడ్డాయి స్ట్రాండ్ లో.

Men of Mathematics – E.T.Bell: గణితశాస్త్ర చరిత్రలో గొప్ప గణితజ్ఞులుగా పేరుపడ్డ కొందరి జీవిత చిత్రణలతో కూడిన వ్యాసాలు. ఎన్నోరోజులుగా ఈ పుస్తకాన్ని చూసి, మళ్ళీ మనసులో కాస్త సిగ్గుపడి (అగణితమైన గణితశాస్త్ర పరిధి అందుకొన లేదే వారధి..లేడే‌ నాకు సారథి…), ఆగిపోతూ వస్తున్నాను.

Can’t remember what I forgot – Sue Halpern: జ్ఞాపకశక్తి, మెదడు పనితీరు గురించిన పరిశోధనల గురించిన వ్యాస సంకలనం. నాకు మామూలుగా ఈ విషయం పట్ల ఉన్న ఆసక్తి నన్ను దీనివైపుకి లాగినా, ఇప్పటికే వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న పుస్తకాలు వెనక్కి నెట్టేశాయి.

Einstein’s 1912 Manuscript on the special theory of relativity: మ్యానుస్క్రిప్ట్ అనగానే వావ్ అనుకుని…కాసేపు అలాగే చూస్తూండిపోయా!

Six Easy Pieces – Richard P.Feynmann: ఇవి ఆయన లెక్చర్ల రికార్డింగులు. ఇవెంత ప్రసిద్ధి చెందిన లెక్చర్లో మళ్ళీ నేను చెప్పనక్కర్లేదనుకుంటాను.

Inspirability – Pash: నలభై మంది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన డిజైనర్లు తమకి ‘ఇన్స్పిరేషన్’ ఎలా వస్తుందో చెప్పిన పుస్తకం‌ఇది!

One life to ride -Ajith Harisinghani: హిమాలయ పర్వత శ్రేణుల్లో చేసిన మోటార్ సైకిల్ ప్రయాణాల అనుభవాల కథ. ఈ పర్యటనకు గల నేపథ్యాన్ని వివరిస్తూ రాసిన ముందుమాట చదివాక, పుస్తకం చదవాలి అనిపించింది. అలాగే, మామూలుగా, ఇలాంటి పర్యటనల్లో కనబడే రియల్ లైఫ్ కథల గురించిన ఆసక్తీ ఒక కారణం అనుకుంటాను ఈ పుస్తకం గురించి సదభిప్రాయం కలిగేందుకు.

The Royal Rajputs – Manoshi Bhattacharya: చాలా పెద్ద సైజు పుస్తకం. రాజ్పుట్ వంశాలన్నింటి గురించిన చరిత్ర, కథలతో కూడిన పుస్తకమిది. కాసేపు తిరగేసాను – అది నాకు బోలెడంత కుతూహలం కలిగించింది 🙂

– గత నాలుగైదు రోజుల్లో కనబడ్డ పుస్తకాల కథ ఇది.నా‌అభిప్రాయం ఏమిటంటే – మీరంతా కూడా, పుస్తకాలు చదవట్లేదు, అందుకే రాయట్లేదు అన్న కారణం చెప్పక – ఇలా మీకు తారసపడ్డ పుస్తకాల గురించి ఒక ముక్క అప్పుడప్పుడూ చెప్పి పోతూ ఉండవచ్చని.
[ఇలాంటివి కూడా రాయొచ్చా పుస్తకం.నెట్ లో…అనకండి. రాసేస్తున్నాగా!]

You Might Also Like

2 Comments

  1. pavan santhosh surampudi

    అగణితమైన గణితశాస్త్ర పరిధి అందుకొన లేదే వారధి..లేడే‌ నాకు సారథి

  2. Samoohamu

    నమస్కారం.
    మెదటగా టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.
    http://samoohamu.com సమూహము గురించి చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను.
    తెలుగు బ్లాగులు విస్తృతంగా వాడుకలో ఉన్న ఈ ఎలక్ట్రానిక్ యుగములో అన్ని తెలుగు బ్లాగులను ఒక గూటిలోనికి తేవాలనే మా ప్రయత్నం .
    మీకు నచ్చిన ,మీరు మెచ్చిన బ్లాగులను ఈ బ్లాగులో చేర్చవచ్చును(add@samoohamu.com).
    సమూహము ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. సమూహము మీ బ్లాగునుంచి టపాలను మరియు ఫోటోలను సేకరించి చూపిస్తుంది.
    మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి.

    దయచేసి మీ సలహను / సూచలను అభిప్రాయాలను దయచేసి info@samoohamu.com తెలుపండి .
    మీ వ్యాఖ్యలు మాకు అమూల్యమైనవి .

    ధన్యవాదముతో
    మీ సమూహము
    http://samoohamu.com

Leave a Reply