ఆముక్తమాల్యద పరిచయం – మల్లాది హనుమంతరావు
సి.పి.బ్రౌన్ అకాడెమీ వెబ్సైటులో పుస్తకాల జాబితా చూస్తున్నప్పుడు – ఇది చూసి, కొనాలా వద్దా..అని తటపటాయించిన మాట నిజం. ’పరిచయం’ అయినా మనకర్థమౌతుందా? అన్న నా అనుమానం అందుక్కారణం. అయితే, ఆ సమయంలో నేను ఈపుస్తకం కొనాలని తీసుకున్న నిర్ణయం – పుస్తకాల ఎంపు పరంగా – నాకు బాగా లాభించిన నిర్ణయమని నా అభిప్రాయం. ఇదివరలో ఎప్పుడూ ఏ పుస్తకమూ – ’వీలైనంత ప్రయత్నించి, పద్యాలను అర్థం చేస్కునే ప్రయత్నం చేద్దాం’ అని నాకనిపించేలా చేసి, అక్కడితో వదిలేయక, వెంటనే మొదటి మెట్టుగా వివిధ శతకాలను చదివేలా చేయలేకపోయింది కనుక. ఈపుస్తక రచయిత: మల్లాది హనుమంతరావు గారు. ఎమ్మెస్సీ చదివి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అధికారిగా ఉండి, రిటైరయ్యారట. విషయానికొస్తే, ఈపుస్తకాన్ని సమీక్షించడమో, నా అభిప్రాయాలు వ్యక్తీకరించడమో నా ఉద్దేశ్యం కాదు. ఈ పుస్తకంలో ఏముందో కొంచెం వివరంగా పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నానంతే.
ముందుగా: ప్రబంధసాహిత్యం గురించి ఒక చిన్న పరిచయాన్ని అందించాక, రాయల వారి గురించీ, వారి జీవితం-పరిపాలన-పుర్వీకుల గురించీ, వారి శైలి గురించీ సులభంగా అర్థమయ్యేలా పరిచయం చేశారు. తరువాత- ఆముక్తమాల్యద రచయిత ఎవరు? అన్న విషయంపై ఉన్న వివాదాస్పద అభిప్రాయాల గురించి ప్రస్తావించారు. ఆపై, ఆముక్తమాల్యద కు వచ్చిన వివిధ వ్యాఖ్యానాల గురించి చెప్పి, ఆముక్తమాల్యద కథను, పద్యాలను, వర్ణనలనూ -కొంచెం పరిచయం చేసి, కథకు గల ప్రేరణ ఏమిటో తెలిపి – పరిచయం భాగాన్ని ముగించారు. మధ్యనుండి చదివితే, బోరు కొట్టి రెండ్రోజులు పక్కన పెట్టాను. వ్యాసం మొదట్నుంచీ మొదలుపెడితే, రాత్రి పూర్తి చేసి కానీ పడుకోలేకపోయాను. 🙂
ఇక, తరువాతి ఛాప్టర్ లో కథని వివరంగా పరిచయం చేశారు. ఇక్కడే చాలా చోట్ల పద్యాలు అవీ ఉదహరిస్తూ, వాటికి చాలా సులభంగా అర్థమయ్యేరీతిలో వ్యాఖ్యానం కూడా రాసారు. ఈ భాగం పూర్తి చేస్తే, ఆముక్తమాల్యద కథ గురించి మంచి అవగాహన కలుగుతుంది.
ఇక మూడో చాప్టర్ లో ఆముక్తమాల్యద ప్రేమలో పడ్డాన్నేను. ఆముక్తమాల్యదలోని ఉత్పేక్షాలంకారము, ఋతువర్ణనలు పద్యచిత్రాలు, భిన్న రసాల ప్రదర్శన, నారికేళ పాకం వంటి పద్యాలే కాక నిరాడంబరమైనవి కొన్ని – ఇలా రకరకాల పద్యాలను ఏరి, క్లాసిఫై చేసి, చక్కగా పరిచయం చేశారు. చివరగా, ఈకావ్య గుణగణాల గురించి చాలామంది అభిప్రాయాలను పొందుపరిచారు. పుస్తకం చివర్లో ఇది రాసేందుకు దోహదపడ్డ పుస్తకాల వివరాలిచ్చారు. (ఈపుస్తకం దాటి ముందుకెళ్ళాలనుకున్న వారి కోసం).
మొత్తానికి, తెలుగును ఇంగ్లీషులోనూ, ఇంగ్లీషును తెలుగులోనూ కలగాపులగంగా చదువుకుంటూ పెద్దవారైన ప్రతి ఒక్కరికీ తప్పక చదువవలసిన పుస్తకం. పాతకాలంలో మూకీ సినిమాలకి పక్కన వ్యాఖ్యానం చెప్పేవారు ఉండేవారట థియేటర్లలో. అలాగ, రచయిత, పక్కనే ఉండి, అన్నీ వివరంగా చెబుతూ, ఆముక్తమాల్యద వీథుల గుండా ప్రయాణం చేయిస్తారు ఈ పుస్తకంలో. బే ఫికర్, వెళ్ళి రావొచ్చు. దారి తప్పి, దిక్కూ మొక్కూ లేక అల్లాడే సమస్యే లేదు. రాయల వారి కలం-విందు భోజనం ఫ్రీ ఫ్రీ ఫ్రీ. మల్లాది హనుమంతరావు గారు ఇలా మరిన్ని గ్రంథాలను సులభ భాషలో పరిచయం చేస్తే, మాబోటి వారికి ఎంతో మేలు చేసిన వారౌతారు. మంచి పుస్తకాన్ని వేసినందుకు సిపిబ్రౌన్ అకాడెమీ వారికి ధన్యవాదాలు.
పుస్తకం వెల తొంభై రూపాయలు.
మనుచరిత్రకనుకుంటా – ఇలాంటిదే ఒక పరిచయ గ్రంథం మార్చిలో వేశారు వీళ్ళే. హిందూ పత్రికలో సమీక్ష చూశాను.
మనుచరిత్రలో మణిపూసలు | పుస్తకం
[…] “మనుచరిత్రలో మణిపూసలు” నవతరం కోసం, మనుచరిత్రను పరిచయం చేస్తూ, సి.పి.బ్రౌన్ అకాడెమీ వారు “మల్లాది హనుమంతరావు” గారి వ్యాఖ్యానంతో వెలువరించిన పుస్తకం. ఇలా ప్రబంధ కావ్యాలను వాడుక తెలుగులో పరిచయం చేస్తున్న సి.పి.బ్రౌన్ అకాడెమీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మల్లాది వారి పరిచయానికి నా పరిచయం. (హనుమంతరావు గారే “ఆముక్తమాల్యద” గురించి కూడా పరిచయం చేసారు. దాని గురించి కొన్నాళ్ళ క్రితం పుస్తకం.నెట్ లో వచ్చిన వ్యాసం ఇదిగో) […]
హెచ్చార్కె
వెంటనే వెళ్లి పుస్తకం కొనుక్కోవాలనిపించేంత బాగా రాశారు. ఆముక్త మాల్యద చదవాలనుకుంటూ, సౌమ్య గారికున్న భయం ఒక పాలు ఎక్కువగా ఉండి, అలా ఉండిపోయాను. మల్లాది గారి పుస్తకం గురించి చదివాక ధైర్యం వచ్చింది. థాంక్సండీ.