సత్యభామ -ఒక పువ్వు గుర్తు పద్యం
రాసిన వారు: వైదేహి శశిధర్
***************
నా ఆరవ తరగతి లోనో ,ఏడవ తరగతిలోనో చదువుకున్న ఒక పువ్వు గుర్తు పద్యం నాకిప్పటికీ గుర్తున్న ఈ పద్యం .గొప్ప కవిత్వం అనుకున్న పద్యాలు/కవితలకు ఏమన్నా సాదృశ్యాలూ సారూప్యాలూ ఉంటాయా అన్న ఆలోచన నాకు తరచుగా కలుగుతూ ఉంటుంది.నేను గొప్ప కవిత్వం అనుకున్న కవితలలో ఉన్న లక్షణాలకోసం వెతుకుతూ ఉంటే నా అనుభవంలోకి వచ్చిన లక్షణాలు రెండు. ఒకటి కంఠవశమయ్యే లక్షణం,మరొకటి వెంటాడి పదే పదే స్ఫురణకు వచ్చే లక్షణం. నిజానికి ఈ రెండు లక్షణాలు పరస్పరం అనుబంధిత విషయాలు కూడా.ఒకటి లేకుండా మరొకటి సాధ్యం కాదు. కంఠవశం అయితేనే కదా ,పదే పదే గుర్తుకు వచ్చి వెంటాడేది !
నాకు అలా గుర్తుండిపోయిన పోయిన ఈ పద్యం,నందితిమ్మన “పారిజాతాపహరణం” లోని ఒక చంపకమాల పద్యం. చందోబధ్ధమైన పద్యాలకు సహజంగా కొంత కంఠవశం అయ్యే గుణం ఉన్నా ,నేను చదువుకున్న అన్ని పద్యాలూ నాకు గుర్తులేవనటం సత్యం. మరి ఈ పద్యమే ఎందుకు గుర్తుంది ?
ఈపద్యం సందర్భం -శ్రీకృష్ణుడు రుక్మిణీదేవికి పారిజాతపుష్పాన్ని ఇచ్చినవిషయం చెలికత్తె ద్వారా తెలిసినపుడు , సత్యభామ స్పందనను వర్ణించే పద్యం.
అనవిని వ్రేటువడ్డ యురగాంగనయుంబలె నేయి వోయ భ
గ్గన దరికొన్న భీషణ హుతాశన కీల యనంగ లేచి హె
చ్చిన కనుదోయి కెంపు తన చెక్కుల కుంకుమ పత్రభంగ సం
జనిత నవీన కాంతి వెదజల్లగ గద్గద ఖిన్న కంఠియై.
– విషయం క్లుప్తంగా –“చెలికత్తె మాటలు వినగానే ఆమెకు తీవ్రమైన కోపం కలిగింది”.
అలా చెప్పటం సాధారణ వచనం. మరి కవిత్వీకరించటంలో ఈ విషయాన్ని కవి ఎలా చెప్పాడు? ఎలా చెప్పాలి ? ఆ సంఘటనని పాఠకుడి అనుభవం లోకి తీసుకు రావాలి . ఎలా? ఆ అనుభవం లోని అనుభూతిని పాఠకుడిలో కలిగించటం ద్వారా . ఆ అనుభూతి పాఠకుడి అనుభవంలోనికి రావటం అనేది పంచేంద్రియాలద్వారా పొందిన అనుభూతిగా భాసింపజేయటంద్వారానే సాధ్యం. అంటే వర్ణించబడిన విషయాన్ని తన కళ్ళతో చూసినంతగా ఒక స్పష్టమైన ,ప్రత్యక్షమైన అనుభూతికి లోనవటం ద్వారా. ఈ పద్యం మొత్తం మీద కవి “క్రోధం” అనే పదాన్ని కానీ,పర్యాయ పదాలను కానీ వాడకుండానే ,సత్యభామ మానసికస్థితిని తేల్చి చెప్పకుండానే, ఆమె కోపపు తీవ్రతను మన అనుభవం లోనికి తేవటం జరిగింది,గొప్ప ఔచిత్యం,స్ఫురణ వున్న పదచిత్రాలు,రూపకాల ద్వారా . కవితా వస్తువు ఏదైనా అవవచ్చు,సౌందర్యం,సంతోషం, వేదన ,వైఫల్యం దేనికైనా రససిద్ధి కలగాలంటే ఆయా అనుభూతులు పాఠకుడి అనుభవం లోకి రావటం ద్వారానే సాధ్యం. ఈ పద్యంలో ఏ విశేషాలు అందుకు దోహదపడ్డాయో చూద్దాం.
వ్రేటువడ్డ యురగాంగన వలె– దెబ్బతిన్న పాము తాలూకు ప్రతిచర్య ఎంత వేగంగా ,ఒడుపుగా ,అందంగా ఉంటుందో మనకు తెలుసు. చివాలున ఆమె లేచిన దృశ్యాన్ని కళ్ళముందు నిలబెట్టే పోలిక. కేవలం వేగమే కాకుండా ,”పాము” క్రోధాన్ని సూచిస్తుంది. అందులో దెబ్బతిన్న పాము అవమానించబడిన అభిజాత్యానికి ప్రతీక.
నేయి నేయి వోయ భగ్గన దరికొన్న భీషణ హుతాశన కీల – ఈ మంట ” నెయ్యి వేస్తే దరికొన్న” మంట.అంటే అక్కడ మొదటే మంట ఉంది.(సూచితార్ధం సపత్నుల మధ్య ఉన్న స్పర్ధ) దాంట్లో నెయ్యి (అవమానం) వేస్తే భగ్గున మండిన భీషణమైన అగ్నిజ్వాలలా ఆమె లేచింది. ఈ పోలిక లో మళ్ళీ ఆమె కదలికలలోని వేగం, ప్రకృతిలోని తీవ్రత,ప్రకాశమే కాక గొప్ప సౌందర్యం కూడా స్ఫురిస్తుంది. వువ్వెత్తున ఎగసిన అగ్నికీలలో వున్న ఓ ఉజ్జ్వలమైన అందం మనందరి హృదయాలను ఎప్పుడో ఒకప్పుడు పట్టి ఉంచిన సందర్భాలు లేకపోలేదు. భోగిమంటల సౌందర్యం ఒక ఉదాహరణ గా చెప్పుకోవచ్చు.
హెచ్చిన కనుదోయి కెంపు– ఆమె కళ్ళల్లోని అరుణిమ చెక్కిలి పైన కుంకుమపత్రాలపై బడి వింతకాంతిని వెదజల్లింది – సౌందర్యాన్ని సూచించటం.
ఒక చిన్న సంఘటనని తన అందమైన కవిత్వీకరణ ద్వారా కళ్ళకు కట్టినట్లు కవి చూపించారు. పారిజాతాపహరణం లో సత్యభామ పాత్ర చిత్రణకు పునాది ఈ పద్యం. ఆమె వ్యక్తిత్వంలోని తీవ్రతను, గాఢతను కధలో ప్రవేశపెట్టిన మొదటి పద్యం ఈ పద్యం .
ఈ కధ కల్పిత కధనీ, ఈ కధ పుట్టుకకు కారణం కొన్ని రాజకీయ అవసరాలు,అంతః పుర ప్రయోజనాలు అని ప్రచారంలో వున్నదన్న విషయం మనకు తెలుసు. నాకు తెలిసి భాగవతం లో కానీ,భారతంలో కానీ ఈ కధ లేదు. ఇది కల్పిత కధ అయినపుడు తిమ్మన ఈ కధను మరో విధంగా కూడా రాసివుండే అవకాశం ఉంది.ఉదాహరణకు పువ్వు సత్యకు ఇస్తే రుక్మిణి అలిగిందనో,లేదా జాంబవతికి ఇస్తే సత్య కు కోపం వచ్చిందనో వ్రాసి ఉండవచ్చు. కానీ అలా రాయకపోవటం లోనే ఔచిత్యం ఉంది. ఎందుకంటే రుక్మిణి ,సత్యభామ పాత్రల ప్రస్తావన భాగవతం లో,భారతం లో ఉంది. వారి వారి పాత్రలకు ఒక విలక్షణమైన వ్యక్తిత్వం ఈ కావ్యాల్లో కల్పించబడింది. ఇలాంటి పాత్రలతో ( అప్పటికే ఎస్టాబ్లిష్ అయిన పాత్రలతో ) ఒక కొత్త కధ రాసేటప్పుడు ఆయా పాత్రలకు అప్పటికే నిర్దేశించబడిన వ్యక్తిత్వానికి అనుగుణంగానే కవి చిత్రించాలి,అది రచయితల/కవుల నైతిక బాధ్యత. ఒక రకంగా చెప్పాలంటే మూల రచయితల కాపీరైట్ ను ఉల్లంఘించకపోవటం. అంతేకాక కధాకాలానికి సంబంధించిన ప్రమాణాలకు అనుగుణంగానే కధనం ఉండాలి.
ఈ కధలో తిమ్మన పాటించిన ఔచిత్యం ,రుక్మిణి అలిగినట్లు రాయక పోవటం. భాగవతం లో చిత్రీకరింపబడిన రుక్మిణి వ్యక్తిత్వం శాంతరస ప్రధానం.అపారమైన సౌందర్యం, సంపద,సచ్చీలత ఉన్న రాకుమారినన్న అభిజాత్యం ఏ మాత్రం చూపకుండా “ఘనుడా భూసురుడేగెనో….విని కృష్ణుండది తప్పుగా తలచెనో..” అని సందేహ పడే వినయలక్షణం కల స్త్రీ రుక్మిణీ దేవి. అలగటం ఆవిడ ప్రకృతిలో లేదు. అలాగే ఏ జాంబవతికో కృష్ణుడు పూవు ఇస్తే సత్య అలిగింది అని రాయకపోవటం మరొక ఔచిత్యం. ఎందుకంటే అక్కడ సమస్య పారిజాత పుష్పం కాదు.సపత్నుల మధ్య స్పర్ధ. స్పర్ధ ఎప్పుడూ సమవుజ్జీల మధ్యనే ఉంటుంది. ఆవిడ వైదర్భి అయితే ఈవిడ సాత్రాజిత! స్పర్ధ ఉండతగిన మహారాణులు వీళ్ళిద్దరే . పువ్వు కేవలం ఆ స్పర్ధని పెంచిన/బయల్పరచిన ఒక ఉత్ప్రేరకం మాత్రమే!
అమితమైన కోపం,అలక, మాత్సర్యం వంటి లక్షణాలు ఏ ప్రమాణాలతో చూసినా గొప్ప లక్షణాలుగా చెప్పలేము.ఇంకా చెప్పాలంటే ఎవరి వ్యక్తిత్వానికైనా కొంచెం వన్నె తగ్గించే “రఫ్ ఎడ్జెస్” గా చెప్పవచ్చు . సత్యభామ పాత్రలోని ఆ లక్షణాలను తన సృజనాత్మకతతో పూర్తిగా “రొమాంటిసైజ్ “ చేసిన ఘనత , చాకచక్యం నందితిమ్మనదే నేమో. శ్రీకృష్ణుడిపై ఆమెకున్న గాఢమైన అనురక్తి, ప్రేమౌద్ధత్యం నేపధ్యం గా తీసుకుని ఈ లక్షణాలకి ఓ అందమైన ఠీవి,రాజసం,ఆకర్షణీయమైన కొనసాగింపు తిమ్మన ఇవ్వటం జరిగింది.ఆ రకంగా తిమ్మన గారి సత్యభామ కు సాహిత్యంలో ఓ ప్రత్యేక స్థానం ఉంది. అంతః పుర ప్రయోజనాల కోసం రాసిన కల్పిత కధే అయినా సాహిత్య విలువలు,ఉన్నత ప్రమాణాలు,కావ్యౌచిత్యం తో నంది తిమ్మన ఏ మాత్రం రాజీ పడలేదు.
ఈనాడు మనందరి మనస్సులలో వున్న సత్యభామ ,కూచిపూడి వారి నాట్యంలో అద్భుతంగా మలచబడ్డ సత్యభామ ,తిమ్మనగారి సత్యభామే.భాగవతంలో,భారతంలో మలచబడ్డ సత్యభామ పాత్రౌచిత్యానికి భంగం కలిగించకపోవటమే కాకుండా ఒక గొప్ప విలక్షణత,సౌందర్యం,అతిశయం,అభిజాత్యం,భర్త పైన గాఢమైన అనురాగం,సౌశీల్యం కలబోసుకున్న ఓ ఆకర్షణీయమైన పాత్రగా సత్యభామని తిమ్మన తీర్చిదిద్దారు. అందుకే ఆమె “జలజాతాసన వాసవాది సురపూజా భాజనంబై తనర్చు లతాంతాయుధు కన్నతండ్రి శిరమచ్చో వామపాదంబునన్ తొలగంద్రోచినా “ మనకు రసస్ఫోరకంగానే ఉంటుంది. నాకు తెలిసి తిమ్మన గారి సత్యభామ చిత్రణ వల్ల కలిగిన ఇబ్బంది ఒకటి మాత్రమే.అదేమిటంటే తమకు కొద్దో గొప్పో సౌందర్యం ఉందనుకునే అమ్మాయిలందరూ ఆమె స్ఫూర్తితో చీటికీ మాటికీ అవసరం /కారణం ఉన్నా లేకపోయినా అలిగి అందరికీ శిరోవేదన కలిగించటం!:-)
Padmaa Sreeram
పతి ప్రాణసదృశ బంధువు పతి
దైవంబేడగడయు పతి సతులకును అ
ప్పతియె కడుమేర దప్పిన గతి
కులకాంతలకు వేరు కలదే చెపుమా….
ఇది చిట్ట చివర నిరాశా నిస్పృహలతో చెలికత్తెతో వాపోయిన చందం…అంతటి అహంకార జాణకు సైతం కలత కలిగించిన కృష్ణుని చిలిపి వైనం…
Vaidehi Sasidhar
నా సత్యభామ వ్యాసం పై సహృదయతతో అభిప్రాయాలు తెలిపిన సాహితీమిత్రులందరికీ నా కృతజ్ఞతలు.
వేణుగోపాల్
నాకు కూడా ఇప్పటికీ గుర్తున్న పద్యం ఇదే (పూర్తి పద్యం కాదు ప్రధమపాదం మాత్రమే). 10వ తరగతిలో 30 సంవత్సరాల క్రితం చదివి వుంటాను. మీకు మా నెనరులు.
నరసింహారావు మల్లిన
చిన్నప్పుడు స్కూల్లో చదూకున్న కంఠస్థ పద్యాలను ఇలా తిరిగి బ్లాగ్ముఖంగా చదువుకుంటుంటే ఎంత ఆనందంగా ఉందో, మాటలతో వర్ణించి చెప్పడం సాధ్యం కావటం లేదు. వైదేహి గారికి, కామెంటిన పెద్దలకూ, పిన్నలకూ అందఱికీ నా హృదయపూర్వక అభినందనలు.పై రెండు పద్యాలూ కూడా చుక్క గుర్తు పద్యాలే అని జ్ఞాపకం.
kvrn
very nice vaidehi garu. you have explained the poetic imagery very well.
Rakesh
Thanks… KothapaLee garoo:
If you too are like me / vaidehi / bolloju (who learnt this as part of telugu lesson) then YOUR memory indeed sharper than us!!
This lesson was in the text books of OLD SYLLABUS and therefore definitely “our” memory is more than 30 yrs old!!!
Anyways – we should thank our telugu teachers, who made learning poetry a wonderful experience (with their great voice & commanding tone!!)
కొత్తపాళీ
@Rakesh: ఏమేమీ కలహాశనుండచటికై యేతెంచి యిట్లాడెనా,
యామాటల్ చెవియొగ్గి తా వినియెనా యా గోపికా వల్లభుం
డేమేమాడెను రుక్మిణీ సతియు, నీ వింకేటికిం దాచెదే నీ
మోమోటలు మాని నీరజముఖీ నిక్కం బెరిగింపవే
కొత్తపాళీ
చాలా బావుందండీ. చిట్ట చివరి వాక్యం మంచి కొసమెరుపు – మీరు డాట్రుగారే ననుకున్నాను, సైకోథెరపిస్టు కూడానా?
Rakesh
ఆహా(…….. ఎంత మంచి పద్యమండీ!
ఈ పద్యం continuation లోనే… (అంటే, గద్గద ఖిన్న కంఠియై..)
ఏమేమీ కలహాసనుండచటికై యేతెంచి ఇట్లాడెనా
ఆమాటల్ చెవియొగ్గి తా వినియెనా
ఏమేమాడెను రుక్మిణీ సతియు నీవింకేటికిందాచెదే నీర
జముఖీ, నిక్కంబెరింగింపవే.
పుక్కిళ్లు హాయిమనిపించే పద్యాలివి!!
కామేశ్వర రావు
మంచి పద్యాన్ని గురించి చక్కగా వివరించారు. అసలీ ఘట్టమంతా సరస రమ్యంగా సాగేదే!
మీరన్నట్టు ఈ కథ భారత భాగవతాల్లో లేదు కాని సంస్కృత హరివంశంలో ఉంది. అది కూడా వ్యాస విరచితమే. శ్రీకృష్ణుని గురించి భారత భాగవతాల్లో లేని అనేక కథలు హరివంశంలో ఉన్నాయి. నారదుడు పారిజాత పుష్పాన్ని తెచ్చి కృష్ణుడికివ్వడం, అది అతను రుక్మిణికివ్వడం, సత్యభామ అలక, ఆమెని కృష్ణుడు అనునయించి పారిజాతవృక్షాన్ని తేవడం – ఈ కథంతా హరివంశంలో ఉన్నదే. తిమ్మన అదనంగా చేర్చింది సత్యభామ కృష్ణుడిని కాలితో తన్నడం. ఇది మన తెలుగు సత్యభామకే సొంతం
మరో తమాషా ఏమిటంటే, హరివంశాన్ని తెనిగించిన ఎఱ్ఱన ఈ కథని మార్చేసాడు. తెలుగు హరివంశంలో, కృష్ణుడూ సత్యభామా నరకాసుర వధ అనంతరం నరకుడు కాజేసిన అదితి కుండలాలను తిరిగి ఇచ్చెయ్యడానికి స్వర్గానికి వెళతారు. అక్కడ పారిజాత వృక్షాన్ని చూచి సత్యభామ దాన్ని ఇష్టపడితే, దేవతలతో యుద్ధం చేసి కృష్ణుడు దాన్ని సంపాదిస్తాడు. ఉత్తరహరివంశాన్ని రచించిన నాచన సోమన అసలీ ఘట్టాన్నే వదిలిపెట్టేసాడు. తిమ్మన మాత్రం దీనిని యథాతథంగా తీసుకొని కొద్ది మార్పులతో, తన ముద్దు ముద్దు పలుకులతో రమణీయమైన కావ్యంగా తీర్చిదిద్దాడు.
bollojubaba
i too remember this poem (ofcourse very weakly)
wonderful explanation.
bollojubaba
సౌమ్య
మంచి వ్యాసం అందించినందుకు వైదేహి గారికి ధన్యవాదాలు!!