భారతీయ కవితా కల్పకం
రాసిన వారు : మాగంటి వంశీ
****************
“భారతీయ కవితా కల్పకం” – అసలు ఈ మాట ఏమిటో, ఇలాటి పేరున్న రచన ఒకటి ఉందని తెలిసినవారెవరో, అదీ తెలుగులో ఉందనీ తెలిసినవారు ఎంతమందోనని పాతతరం వారినొదిలేసి ఈకాలపు “సాహిత్యాభిలాషుల సెన్సస్” కార్యక్రమం పెట్టుకుంటే తేలిన సంఖ్య రెండు వందల లోపేనట. అది మరి ఆ రచయితకు అవమానమో, ఆ రచనకు అవమానమో, మన సాహిత్యానికి అవమానమో ఆ పరమాత్మునికే ఎఱుక. శ్రీ మీసరగండ విశ్వంగారు నేను అభిమానించే రచయితల్లో ఒకరు. అసలు రచయితల్లో ఈయన పేరే ఎప్పుడూ వినలేదు అన్న కామెంటు వస్తే అంతకన్నా ఖర్మం ఇంకోటి లేదని భవదీయుడి అభిప్రాయం! ఆ కామెంటు రాసిన దుర్మార్గులని “విద్వాన్ విశ్వం” గారన్నా తెలుసా అని అడగాలనిపిస్తుంది. అప్పటికీ తెలియకపోతే, ఇక తెలుగు సాహిత్యం నిజంగానే దుస్థితిలో ఉందని ఖరాఖండిగా చెప్పొచ్చు.
ఒక రచయితగా, అనువాదకుడిగా శ్రీ విశ్వంగారు చేసిన రచనల్లో, ఈ అనువాద రచన (1963) ఒక కలికితురాయిగా నిల్చిపోవాల్సినా, ఈ రచనకు రావల్సిన పేరు రాలేదనిపిస్తుంది. అందుకు నాకు కనపడ్డ కారణం – ఈ రచనలో “TOPICS DISORGANIZATION”. ఆగండి – అక్కడే ఆగిపోండి ..అనువాదమంటున్నారు, చాలా గొప్పగా వుందంటున్నారు, పేరు రాలేదంటున్నారు మరి ఈ అనువాదానికి “మూల” రచన ఏమిటి, ఒకవేళ “మూల” రచన ఏదన్నా ఉంటే “మూల” రచయిత ఎవరు అని గొప్ప ప్రశ్న మీ బుఱ్ఱల్లో ఉదయించకముందే – వివరణ. ఈ అనువాదానికి “మూల” రచనలు , “మూల” రచయితలు బోల్డు. అథర్వవేదంలోని వైదిక సూక్తులు, టాగోర్ రాసిన బెంగాలీ కవితలు, తమిళం లోని పొఘై ఆళ్వర్ కవితలు, కన్నడంలోని సర్వజ్ఞ మూర్తి రచనలు, నన్నెచోడుడి పలుకులు, గుజరాతీలోని కవితలు , హిందీలోని కబీరు కవితలు, సంస్కృతంలోని భోజరాజుని మాణిక్యాలు – ఇలా 376 పేజీల ఈ సుందర వనికి ఎన్నో మూలాలు. ఏరుకుని సాహితీ క్షుద్బాధ తీర్చుకోవాలనుకునేవాడికి ఎన్నో “కంద” మూలాలు.
ఈ రచన / పుస్తకం ఎలా ఉంటుందంటే – ఇంట్లో ఉన్న పుస్తకాల షెల్ఫులో కాలం గడుపుతున్న వివిధ భాషా పుస్తకాల్లోనుంచి ఆయన కళ్ళకు కనపడ్డవి, చేతికి అందినవి తీసుకుని అప్పటికప్పుడు అనువాదం చేసేసినట్టు , అలా రాసినవి అచ్చేసినట్టూ కనపడుతోంది. “ఆంధ్ర ప్రభ”కు ఎడిటర్గా పనిచేసిన వ్యక్తి “భూతాశ్రమంలో (అంటే పూర్వాశ్రమంలో అన్నమాట)” కానీ, “భవిష్యత్ ఆశ్రమంలో” కానీ అలా ORGANIZE చెయ్యకుండా చేసారంటే ఎందుకో నమ్మబుద్ధి కాకపోయినా, దగ్గరున్న పుస్తకం తెరిచాక నమ్మాల్సి వచ్చేటట్టు వుంది.
అసలింతకీ ఈ పుస్తకం నా దగ్గరకొచ్చిన విధంబెట్టిదనిన – మొన్న రెండు నెలల క్రితం ఇండియానుంచి వస్తూ మా నాన్నగారు ఇవ్వగా, మా ఆవిడ తెచ్చిన బోల్డు పుస్తకాల్లో – ఎన్నిసార్లు చదివానో గుర్తుకూడా లేని, అన్నిసార్లు చదివినా చదివిన ప్రతిసారీ రోమాలు నిక్కబొడుచుకునిపోయి, పుస్తకం ఏకబిగిన పూర్తి చేసేదాక వదలనివ్వని శ్రీ తెన్నేటి సూరిగారి “చెంఘిజ్ ఖాన్” ఒరిజినల్ ప్రింటు బుక్కుతో పాటూ, ఈ భారతీయ కవితా కల్పకం (1963) పుస్తకం కూడా ఒకటి…
తెచ్చినవాటిల్లో 50 శాతం శిధిలావస్థలో ఉన్నాయి…అందుకు గబ గబా (ఆచార్య వేమూరి గారు ఇదే మాటను వికి వికి అంటారు!) ఆ పుస్తకాలను రోజూ కొద్ది కొద్దిగా డిజిటైజు చేసుకుంటున్నా….. స్నేహితుడొకాయన ఆర్కైవ్.ఆర్గ్ లో కూడా ఈ పుస్తకముందని నిన్న చెబితే తెలిసింది. లింకు ఇక్కడ. అలానే ఈ పుస్తకంలోని కొన్ని మణిపూసలు, క్రితం నెల మాగంటి.ఆర్గ్ లో కూడా సద్దాను….చూడాలనుకున్నవాళ్ళు, సాహిత్యవేత్తలు సెక్షన్లో చూడొచ్చు..
సీమప్రాంత రచయితలను (పుట్టపర్తి, రాళ్ళపల్లి, మధురాంతకం…ఇలా) చాలా మందిని నిర్లక్ష్యం చేసి, మఱుగు చేసిన పరిస్థితి ఈ “విద్వాన్” మణిపూసకు పట్టకూడదు అని ఘోషిస్తూ – ఈ రచనలోని మెఱిసిపోయే మచ్చు తునకలు నాలుగు :
1) శీర్షిక – ఉషః కన్య
అనారతము రోదసినే
అవలోకించుచు నుదయ
మ్మయి సర్వము వ్యాపించే
అతివ ఈమె ఉషఃకన్య
ఉదయమ్మై మంజుల వ
ర్ణోజ్వలాంబరము ధరించి,
యున్న తురా లీమె వెడలు
చున్న దదో కనుంగొనుము.
బంగారు పూతలతో నా
యంగన అందఱి హృదయము
పొంగించుచు వారిలోన
రంగళించు జీవరసము
2) శీర్షిక – అయ్యో!
కమల శంఖ చక్రాది
రేఖల జెలంగు
లోక కళ్యాణకరమైన
నీ కరమున
కంకణము గట్టెనా మౌని,
కందమూలములను
ద్రవ్వుక, వనులలో
మలయుమంచు?
(కౌసల్య రామునితో….)
3) శీర్షిక – అగపడవేమయ్యా!
యుగములకు యుగములే
తగులబడిపోయినవి
పగలు రాతిరి పిలిచి
అగడు పడితిమి మేము
నగధీర! నీ వేమొ
నగుచు నిలిచున్నావు!
తగని ఖేదమ్ముతో
వగచుచుంటిమి మేము
తెగలేదు సందియము
సొగచుయుంటిమి తండ్రి!
అగపడదు మాకింక
నిగమ నుత నీ రూపు
యుగములకు యుగములే
తగులబడిపోయినవి
4) శీర్షిక -కాలవస్త్రం
కవలలు రాత్రింబవళ్ళు
కాలవస్త్రమును గట్టిగ
కలిసి నేయుచున్నారు
అపార మిది, అనంత మిది
ఆరు గడులతో నున్నది
అటు వేసే పడుగు పొడవు,
ఇటు వేసే పేక పొట్టి
అటు యిటు నేసినదే యీ
అమలము కాలంబరమ్ము
– ఆహా ఎంత అద్భుతమైన వర్ణనలు! – ఇలాగుండాలి కవితలంటేనూ, అనువాదాలంటేనూ! మూలం చదవనఖ్ఖరలేకుండా, మనసుకు పట్టేసేటట్టుండాలి. ఈ పైన వాటిలో ఒక్కటి మీ మనసుకు పట్టలేదు, కనీసం ఆహా అని కూడా అనిపించలేదు అంటే, ఇక ఆ భగవంతుడే మిమ్మల్ని కాపాడుగాక. ఇది అనువాదమంటున్నారు, మరి చరిత్ర పుటల్లోకెక్కేసిన “పెన్నేటిపాట” కొచ్చినంత పేరు ఈ రచనకు ఎందుకు రావాలి అని అడుగుతారా? ఎందుకో ఒకసారి ఈ పుస్తకం అందుకుని, చక్కగా పడక్కుర్చీలో కూర్చుని,పిల్లగాలులు వీస్తున్న ఒక సాయంత్రంపూట పక్కనే టీయో, కాఫీయో పెట్టుకుని నెమ్మదిగా తాగుతూ,ఇందులో ఉన్న ఒక్కో అనువాద కవితా చదివి – బుఱ్ఱలోకెక్కిందనుకున్న తర్వాత, తీరిగ్గా ఇక్కడికొచ్చి చెప్పండి.
అసందర్భం కాకపోతేనూ , అసంబద్ధంగా ఆలోచిస్తూండకపోతేనూ, రాస్తూండకపోతేనూ – మదబ్భిప్పరాయం ఒకటి చెప్పాలె… దేని గురించి ? – రచనల గురించి. ఈనాటి / సమకాలీన రచనల గురించి.
ఏ కాలంలోనైనా, ఆ కాలానికి సంబంధించి రచన ఆధునికంగా వుండొచ్చు, ఐతే రచయితకు తొలిగా మన పాతసాహిత్యం మీద పట్టు వుండాలి. పోనీ పట్టు కాకపోయినా శ్రద్ధగా చదివి, ఆ చదివినదానిలో కొద్ది శాతమన్నా బుఱ్ఱలోకెక్కించుకుని / ఆకళింపు చేసుకుని వుండాలి. బలమైన పునాది అక్కడే పడుతుంది. “ఆధునిక” రచనలు నిలబడాలంటేనో, రచనల్లో ప్రయోగాలు చెయ్యాలంటేనో ఆ పునాది అవసరం. విశ్వంగారి రచనల్లోనూ, మన పాత సాహిత్యంలోనూ, అన్నిటికీ మించి ఆనాటి (అంటే పూర్వ) రచయితల్లో 80-90 శాతమ్మంది పునాదులు ఎంతో బలమైనవి అని చెప్పటానికి మనకు అందుబాటులో వున్న, చదివిన, చదువుతున్న పుస్తకరాజాలే సాక్ష్యం. అదే ఈనాటి ఆధునిక రచనల విషయంలో చెప్పొచ్చా అంటే కాలమే నిర్ణయిస్తుంది. నన్నడిగితే – పైపైన బంగ్లాలు కట్టిన ఈనాటి రచనల్లో ఎన్ని బలంగా పునాదుల మీద నిలబడ్డాయో పాఠకులకే (ఒకవేళ నిజమైన పాఠకులన్నవారెవరైనా ఉంటే!) తెలుసు. పాఠకుల్లో రకాలు బోల్డు, అందుకు పై బ్రాకెట్లో మాట చెప్పవలసి వచ్చింది.. వారి గురించి తీరిగ్గా తర్వాత…:)
ముందుగా రచయితకి “శబ్ద”, “శిల్ప” రహస్యం తెలిస్తే రచనా శిల్పాన్ని చెక్కడం ప్రారంభించొచ్చు. అసలు రాతి శిల్పమంటే రాయి అవసరం ఉందా అని అడిగేవారు ఈనాటి రచయితల్లో కోకొల్లలు. అందుకే “నిజంగా” నిలబడ్డ ఈనాటి రచనలు వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు. చెప్పొచ్చేదేంటంటే ఈనాటి రచయిత పాతసాహిత్యంలో పండితుడు కానఖ్ఖరలా, పాతసాహిత్యంతో పరిచయం మటుకు చాలా అవసరం.
రచనల్లో కూడా బోల్డు రకాలు. రచయిత మతిలోని గతుల సంగతులు స్వయంసంయమనాన్ని బట్టి తాళం వేస్తూ “రంజుగా” చెప్పేవి కొన్ని, “పసందుగా” చెప్పేవి కొన్ని, “విశిష్టంగా” చెప్పేవి కొన్ని, “విలక్షణంగా” చెప్పేవి కొన్ని, “సరళంగా’ చెప్పేవి కొన్ని, “ఉద్రేకంగా” చెప్పేవి కొన్ని, “ఉల్లాసంగా” చెప్పేవి కొన్ని, “మనోహరంగా” చెప్పేవి కొన్ని, “మక్కువగా” చెప్పేవి కొన్ని, “తూతూ మంత్రంగా” చెప్పేవి కొన్ని. ఐతే మంచి రచయిత లక్షణమేమిటంటే రంజు విషయాల్ని ఎంత మమేకంగా చెబుతాడో, పసందు విషయాలను కూడా అంతే మమేకంగా చెబుతాడు. అవే నిలబడతాయి. శక్తి వున్నా ఆపని చెయ్యలేని రచయితలనుండి వచ్చే ఈనాటి “ఆధునిక” రచనలు నిజమైన పాఠకులకు “తలబరువుగా” మారేవి, మారుతున్న వనటంలో అతిశయోక్తి వుందనుకోను. ఇక శక్తి లేక చెయ్యలేకపోయిన రచయితల నుండి వచ్చే రచనల గురించి ఎంత తక్కువ మాట్టాడుకుంటే అంత మంచిది. లేని పాండిత్యప్రకర్ష చూపించాలనుకుంటే ఇతర మార్గాలు బోలెడు. దానికి తగ్గ పాఠకులు వేరు, భజనపరులు వేరు. రచనకు సౌందర్యం అద్దేదేముందిలే అని మంగలాయన చేతుల్లో పెట్టాల్సిన తల తీసుకెళ్ళి చాకలాయన చేతిలో పెడితే “రాణీపాల్” రంగులో బయటకు వస్తుంది.
మదబ్భిప్పరాయం సశేషం….
ఒక రచయిత రచన చేసాడంటే ఆ రచనకు తగిన సౌందర్యాన్ని అద్దగలగాలి, ఆపైన ఆ సౌందర్యానికి తగిన విలువ కట్టగలిగిన నైపుణ్యం కావాలి. అలా సౌందర్యాన్ని అద్దగలిగినప్పుడే, విలువ కట్టగలిగినప్పుడే ఆ రచనా సౌందర్యం కలకాలం నిలబడుతుంది. రచయిత మనఃస్ఫూర్తిగా రాస్తున్నకొద్దీనూ, ఇతర సాహిత్యం, పాతసాహిత్యం “మనసు” పెట్టి చదువుతున్నకొద్దీనూ జ్ఞానం పెరుగుతుంది, రచనా శైలి పదునెక్కుతుంది. ఆ శైలి పదునెక్కితే ఏళ్ళు గడిచినా రచన నిలబడుతుంది. ఎంచుకున్న రచనాశిల్పానికి తగ్గ భాషను ఎంచుకోవటంలోనే రచయిత నైపుణ్యం తెలిసిపోతుంది. అలా చూసుకుంటే, ఈ రచనలో విశ్వంగారి పాండితీ ప్రకర్ష, నైపుణ్యం, వివిధ భాషల మీద ఆయనకున్న పట్టు అచ్చంగా అలా కళ్ళ ముందు, చేతుల్లోనూ మిగిలిపోయి, గుండెలో నిద్రపోతుంది.
ఐతే రచనల్లో నిలబడ్డవన్నీ కళ్ళకు కనపడాలని లేదుగా, అందునా గుడ్డి కళ్ళకు మరీను. అలా కనపడకుండా పోయిన ఆణిముత్యాల్లో ఈ రచన ఒకటి అని నా అభిప్రాయం. ఈ రచనకు పేరు రాకపోడానికి ఇతర కారణాలున్నవేమో తెలియదు కానీ, హ్యూస్టన్ నివాసి, నాసా నుండి రిటైరు అయిన జియో, కాస్మో కెమిస్టు, కవి – డాక్టర్ ఎ.వి.మురళి గారన్నట్టు – “In my opinion this humongous book and Sri Viswam gaaru deserves a national award – if there was/is one such – for translations.”
చివరిగా ఒకమాట చెప్పాలి – మారేపల్లి రామచంద్రశాస్త్రిగారు, తాను విద్యార్థిగా వున్నప్పుడు (1915 – 20) ప్రాంతాల్లో, ఉపాధ్యాయుణ్ణి ఒక తెలుగు పదానికి వ్యుత్పత్తి పదం అడిగితే – “అది తెలుగు పదంరా, దానికి వ్యుత్పత్తి ఎమిటి?” అని ఎకసెక్కంగా గద్దిస్తే, ఆయన ఆ బాధను జీవితాంతం మర్చిపోకుండా “నుడికడలి” నిఘంటువును తయారు చేసారని తెలిసిన పెద్దాయన ఒకరు చెప్పారు. అంతటి బ్రహ్మాండమైన నిఘంటువు అచ్చుకూడా అవలేదనుకోండి మన “వీర తెలుగు భాషాభిమానుల” చేతుల్లో పడి , అది వేరే సంగతి. అసలు ఈ సంగతి ఎందుకు చెప్పానో ఊహించండి !!
Book Details
Year Of Publication – 1963
Number of pages – 376
Publishers – Annapoorna Publishers, Eluru Rd, Vijayawada
Printers: Venkata Ramana, Museum Rd, Vijayawada
సూరంపూడి పవన్ సంతోష్
@వివేక్:
మర్యాద వహించండి చెత్తపోయకండి చూసి మీరు నిర్ఘాంతపోయారంటే బ్లాగులకి కొత్త కావచ్చు. ఐనా అది మీలాంటి మర్యాదస్తుల గురించి కాదు. కొందరుంటారు… వారి గురించి. మీరేమీ బాధపడకండి.
వివేక్
నాకు సాహిత్యం అంటే ఇష్టమూ, అభిమానమూనూ..అయితే ఎక్కువగా చదివిన పాపానపోలేదు..పై పుస్తకం గురించి ఇప్పుడే తెలుసుకున్నా . ఆసక్తి కలిగింది.ఇంత వరకే అయితే మాగంటి వారి ఉద్దేశం నెరవేరింది…మాగంటి గారి గురించి నాకు ఎక్కువ తెలియదు.పేరు విన్నట్టే ఉంది. ఇది నాకున్న అవలక్షణమయితే అవనివ్వండి.
ఇక మొత్తం మీద చెప్పాలంటే, నా బోటి ఏమీ తెలియని వాడికి ఇది చదవగానే రెండు భావనలు వస్తాయి..ఒకటి, ఇక్కడ చెప్పిన పుస్తకం పైన గౌరవము ,
రెండు వంశీ గారిపైన ఒకానొక విధమైన నిర్లిప్త భావం. నిర్లిప్త భావం అని ఎందుకన్నానంటే , ఖచ్చితంగా ఎక్కువ భావం కలగదు కాబట్టి. ఇది ఆయన బ్లాగు కాబట్టి ఆయన ఇష్టం వచ్చింది , ఇష్టం వచ్చినట్టు రాసుకోవచ్చు…. అనుకుంటే అది సమంజసం కాదు. ఎందుకంటే, ఆయనే చెప్పినట్టు, రాసే క్షణం వరకే ఇది ఆయనది.. రాశాక అందరిదీ. ఆ అందరు దీన్ని ఆస్వాదించే విధంగా ఉండాలి. అలా లేదు. ముందు ఎవరో చెప్పినట్టు , ఇందులో ఆయనకు ఇతరులపైన ఉన్న ఏదో ఛీత్కారం వంటిది ప్రస్ఫుటం గా కనిపిస్తుంది.
ఉదాహరణకి , ‘ మర్యాద వహించండి.. చెత్త పోయకండి…’ ఈ మాటలు కొత్తగా ఇక్కడికి వచ్చిన నాలాంటి వాణ్ణి అవాక్కు చేసేలా ఉన్నాయి… ఆయనకు చేదు అనుభవమేదైనా ఉండి ఉండ వచ్చు గాక , అందరినీ ఒకే గాటన కట్టడం ఇందులోని విశేషం…
మల్లెపూలను కోసి ఉంచుకోడానికి మురికి బట్టను వాడితే ఎలా ఉంటుందో , ఒక మంచి పుస్తకం గురించి చెప్పేటప్పుడు ఇలాంటి ధోరణి అలాగే అనిపిస్తుంది. ‘ నేనింతే ‘ అంటే అనుకోవచ్చు…అలా అనుకున్నాక ‘ ” What else would have made my day ? “” అనుకునే సందర్భాలు రానురాను మృగ్యమవుతాయి.
ఈ వయసులో ఇలాంటిది చదివి ఎవరైనా మారుతారని నేననుకోను.. కానీ రేపు ఎప్పుడైనా ‘ ఎందుకు నాకు రావలసినంత మంచి గుర్తింపు , పేరు రాలేదు ? ” అనిపిస్తే, దానికి సమాధానం గా ఇది తోచి కాస్త ఉపశమనం కలుగుతుందేమో..
ఇదంతా ‘ చెత్త ‘ లా ఆయనకి కనిపించినా నేనాశ్చర్యపోను.
మాగంటి వంశీ
Lyla gaaru
What else could have made my day ? – I am blessed and a BIG thank you for reading.
Vamsi
lyla yerneni
If I may, I am commenting about your article, Vamsi. Not about the comments at this time.
Your article is charming. Thank you for making your writing available at this site. Your humor, your sense of what is good poetry – I jibe with both. I don’t care who you are laughing at. I laugh when you are laughing. I like the poetry you like.
It looks like you have introduced some previous author/s in your article. but the truth is I don’t know them from Adam and Eve. And I could not care less. The truth is, I am entertained by you. I simply wanted to read you, whatever you got to say.
Thanks for the flare, flair and joy of your writing.
lyla
lyla
cbrao
తెలుగు సాహిత్యం అపారమైనది. ఎందరో మహానుభావుల సృష్టి ఇది. అందరికి అన్నీ తెలియటం సాధ్యమయ్యే పనేనా? నాకు ఒక రచయిత/పుస్తకం తెలియదంటే వంశీ గారు బెంచీ ఎక్కమంటారా?
అయినా మంచి పుస్తక పరిచయం చేశారు కాబట్టి బెంచీ ఎక్కమన్నదాన్ని వదిలేస్తున్నా.
కొత్తపాళీ
తన బ్లాగులో ప్రచురించే టపాల్లోనూ, ఇతర బ్లాగుల్లో రాసే వ్యాఖ్యల్లోనూ వంశీ గారి శైలి బ్లాగ్లోకవాసులకి చిరపరిచితమే. “ఇది కూడ తెలీదా? ఐతే నీ ఖర్మ” అని తిట్టే ఒకానొకటైపు హైస్కూలు మేష్టారు గుర్తొస్తారు నాకెప్పుడూ. చెప్పిన విషయాన్ని పట్టించుకుని ఆ ఎద్దేవాని గమనించకుండ ఉండేందుకు ప్రయత్నం చేస్తుంటాను, అప్పుడూ, ఇప్పుడూ.
మాగంటి వంశీ
@చౌదరి జంపాల: జంపాల గారూ
మీ సమాధానానికి, అభిమానానికి కృతజ్ఞతలు. నా ప్రశ్నకు మీ వద్దనుండి “పాఠకునిగానే” అని సమాధానం రావాలనే నేను కోరుకున్నది. మొదటగా మీ సమాధానంలోని, ప్రశ్నల్లోని మూడవ పేరాలోని వాటికి నా సమాధానం –
నేను మీరన్న దృష్టితో రాయకపోయినా, మీకు “ఆశీర్వాదం, అన్యాపదేశం, ఎద్దేవా” కనపడటానికి కారణం అర్థమయ్యింది. ఈ వ్యాసం ప్రథమ ఉద్దేశం – సమంజసం కాకపోయినా గుర్తింపు వచ్చినవే గొప్పవి అని చెప్పే పాఠకులకు, ఆ రచయిత కలం నుండి వెలువడిన ఉత్తమమైన ఇతర రచనలు, కనపడకుండా పోయినవీ వున్నాయని తెలియచెప్పటం. అసలు దీన్ని వ్యాసం అనటంకన్నా నా ఘోష అనొచ్చు. 🙂 ఐతే నాకు దేనికైనా సరే, వన్నెలు అద్దటం రాకపోవటం వల్ల ఈ నా ఘోష మీలోని, మీలాగ ఆలోచించే ఇతర పాఠకులకి “అదో” రకంగా కనపడితే అది నా తప్పుకాదని మనవి. ఎందుకంటే మీరు పాఠకులు. దీని మీది అభిప్రాయాలు మీకు వదిలెయ్యటం వరకే నేను చెయ్యగలిగింది. అది వ్యాసమైనా, ఘోషైనా రాసిన క్షణాల వరకే రాసినవాడిది. తర్వాత లోకానిదే, లోకులదే.
అందుకే పాఠకుల మీద ఒక లైను రాసాను నా ఘోషలో. ఉదాహరణకు ఇక్కడి కామెంట్లే చూడండి. నా మటుకు ఒక వ్యాసకర్తగా కాక, పాఠకుడిగా చూస్తే వచ్చిన ఇతర రెండు కామెంట్లలో – ఒకరికి ఆ పుస్తకం మీద ఆసక్తి కలిగిస్తే, ఇంకొకరికి ఆ పుస్తకంతో పరిచయం ఉండటం మూలాన జ్ఞాపకాలు లేచికూర్చున్నాయి. మీకు మరో రకంగా కనపడింది. వారికి కూడా మీలా అనిపించి ఉంటే అదే మాట రాసేవారేమో. అనిపించినా అది ఎందుకు, అసలైన సారం తీసుకుందాం అనిపించో, నా మీద దయ తలిచో దాన్ని కప్పిపెట్టుండొచ్చు.. 🙂
ఇహ ఘోషకు వన్నెలు సంగతికొస్తే, మీరన్న “ఆశీర్వాదం, అన్యాపదేశం, ఎద్దేవా” లైన్ల పక్కన ఒక స్మైలీనో, ఇంకేదోనో పెట్టాననుకోండి, పరిస్థితి మొత్తం మారి ఉండేదేమో! లేకుంటే ఆ లైన్లకు ఘోషా కలిపిస్తే పోతుంది ఇహ నుండి. ఐతే నా స్వభావం మూలాన ఆ పని చెయ్యలేననిపిస్తుంది. కాబట్టి మీరు నేను మళ్ళీ ముందే చెప్పలేదనకుండా, నా నుండి ఇటువంటి ఘోషలే చూడగలరని తెలియచేసుకుంటున్నాను. ఇక నా ధోరణి, ఇతరుల పట్ల నా వైఖరి సంగతుల సంగతి కూడా ఈ పై రెండువాక్యాల్లో మీరు తెలుసుకోవచ్చు.
వ్యాసం ఉపయోగం సంగతికొస్తే, చూసిన వందమందిలో కొంతమందికి వినోదం , కొంతమందికి ఆగ్రహం, కొంతమందికి ఇంకా వేరే ఏవన్నా పంచినా, నా ఉద్దేశంలో ఒక్కళ్ళకు ఈ పుస్తకం గురించి తెలిసి, అది చదివి, ఆ రచనలో నేననుకున్న గొప్పదనం తెలుసుకోగలిగితే చాలన్న భావనతో రాసింది కాబట్టి ఇతర ఉపయోగాల గురించి ఆలోచించే తీరిక లేదు, ఉండదు. ఇక ఇప్పుడు పైన నేను చెప్పినదానితో, ఆ వైపుగా ఆలోచించి మీరన్న శాఖాచంక్రమణానికి, పుస్తకానికి లంకె కుదుర్చుకోగలరని ఆశిస్తున్నాను.
మీరు తెలియక అన్నారని అనుకోను గానీ – పుట్టపర్తి, రాళ్ళపల్లి, మధురాంతకం..ఇంకా అలాటి ఆణిముత్యాలకు నిర్లజ్జగా నిర్లక్ష్యం అనే గుర్తింపులేని చెట్టునీడ చూపించి రావలసిన పేరు రాకుండా చేసింది మనవారేనన్నమాట నిక్కచ్చిగా, నిఖార్సుగా గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పొచ్చు. దృష్టాంతాల గురించి వివరంగా మనం మనం ఆఫ్లైను మాట్లాడుకోవచ్చు, పుస్తకం వాళ్ళ స్థలం వాడుకునేకన్నా! ఎందుకు? ఇక్కడే రాస్తే వేరేవాళ్ళకు కూడా జ్ఞానం పంచొచ్చు అంటే చెప్పండి. తీరిగ్గా మళ్ళీ రాస్తాను.
నా ధోరణి, ఇతరుల పట్ల నా వైఖరి సంగతులతో మీరడిగిన ప్రశ్నలకు సమంజసంగా కాకపోయినా, నాకున్న సామర్థ్యంతో చెప్పగలిగానని అనుకుంటున్నాను. లేదూ నాకు అలా కనపడలేదు, నేను అనుకున్న సమాధానాలు రాలేదు అంటే ఇహ నేను చెయ్యగలిగేదేమీ లేదు.
పెన్నేటిపాట గురించి మీరన్న మాటలే నావీను. ఐతే ఈ రచనలో కూడా మీరు చెప్పినవాటిలో నాకు – పాట, నిరాడంబరత, గాఢత కనపడ్డాయి – ప్రాంతపు హృదయఘోషనొదిలేసి. ఇక స్వంతానికొస్తే అన్నీ ఆయనవే, అనువాదమని ఆణిముత్యాన్ని పక్కన పడెయ్యాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం.
ఇంతే సంగతులు చిత్తగించవలెను. ఈ పైన రాసినదానిలో ఎక్కడైనా శ్లేష కానీ కనపడితే ఆ ఉద్దేశం లేదని తెలియచేసుకుంటున్నాను.
చౌదరి జంపాల
@మాగంటి వంశీ:
వంశీ గారూ:
1) పుస్తకం.నెట్‌లో వచ్చే వ్యాసాల గురించి సైకియాట్రిస్టుగా నేను వ్యాఖ్యానం చేయటం అనుచితం.
మీ వ్యాసంపై నా వ్యాఖ్యలు పాఠకునిగానే. నిజానికి మీ వ్యాసం చదువుతున్నప్పుడు నాకు condescending, disdainలతో పాటు చాలా ఇతరపదాలు కూడా వెంటనే బుర్రలోకి వచ్చాయిగానీ, మీ మీదున్న అభిమానం వల్ల, మీరింతకు ముందెప్పుడూ ఇలా రాసిన గుర్తు లేనందువల్ల, వాటిని పక్కకి తొసేశాను.
వాదన పొడిగించటం నా ఉద్దేశం కాదు కానీ, మీరు బహిరంగంగా అడిగారు కాబట్టి కొద్దిగా వివరంగా చెబుతాను. గట్టిగా ఒక గంటసేపు ప్రయత్నం చేస్తే – మీసరగండ విశ్వం అంటే ఎవరో తెలియని తెలుగు బాగా చదువుకొన్నవారిని (విశ్వంగారితో పనిచేసిన వాళ్ళనీ, ఆయనతో ప్రత్యక్షంగా పరిచయం ఉన్నవాళ్ళనీ కూడా కలుపుకొని) కనీసం ఒక వందమందిని చూపించగలనని నా నమ్మకం. పుస్తకం పాఠకులలో కనీసం 90 శాతం ఈ మీసరగండ విశ్వం అన్న పేరు విని ఉండరని కూడా నా నమ్మకం. వారందరినీ మీరు దుర్మార్గులుగానూ, ఈ వాస్తవాన్ని ” అంతకన్నా ఖర్మం ఇంకోటి లేదని” వర్ణించడం ఎంత సమంజసం?
ఇక ఈ రచన నచ్చనివాళ్ళను భగవంతుడే రక్షించాలన్న ఆశీర్వాదం; ఈ రచన కనబడనివాళ్ళవి గుడ్డికళ్ళు అన్న అన్యాపదేశం, ” నిజమైన పాఠకు లన్నవా రెవరైనా ఉంటే ” అన్న ఎద్దేవా, ఇవన్నీ జమిలిగా కలుపుకుంటే ఈ వ్యాసానికి ఏ రకమైన వన్నె వస్తుంది? ఈ వాక్యాల్లో మీకు తెలిసిన విషయాలు తెలియనివారి పట్ల, మీకు నచ్చిన విషయాలు నచ్చనివారి పట్ల, మీరు ప్రదర్శించిన వైఖరిని ఎలా వర్ణించవచ్చు? ఈ పదాలు, ఈ వాక్యాలు, వాటి ద్వారా వ్యక్తమౌతున్న ధోరణి మీరు పరిచయం చేయదలచుకొన్న పుస్తకానికి, ఈ వ్యాసానికి ఏం ప్రయోజనం కలిగించాయనుకొంటున్నారు?
పుట్టపర్తి, రాళ్ళపల్లి, మధురాంతకంలను మరుగు చేయటమేమిటి?
ఇక వ్యాసం ఉత్తరార్థంలో మీరు చేసిన శాఖా చంక్రమణానికి, ఈ పుస్తకానికీ ఉన్న లంకె ఏమిటి?
ఈ ప్రశ్నలకు మీరేమీ సమాధానమివ్వక్కర్లేదు. ఆలోచించుకొంటే చాలు.
2) పెన్నేటి పాట గురించి వీలయినప్పుడు వివరంగా వ్రాయాలనే ఉంది కానీ ప్రస్తుతానికి ఐదు వాక్యాలు. ఈ ఖండకావ్యం పేరుకు తగ్గట్టు పాటలానే నడుస్తుంది. భాష నిరాడంబరంగా ఉంటుంది. భావం గాఢంగా ఉంటుంది. ఒక ప్రాంతపు హృదయఘోష స్పష్టంగా వినిపిస్తుంది, కనిపిస్తుంది. పాఠకుణ్ణి (శ్రోతను) కట్టిపడేస్తుంది. పైగా ఈ రచన విద్వాన్ విశ్వంగారి స్వంతం.
మాగంటి వంశీ
@జంపాల చౌదరి: Dear Jampala gaaru – Out of the huge respect I have for you and just out of curiosity with no intention of being rude – just one question – Is it a)the psychiatrist OR b)the reader in you who did not like the tone of this article and wanted to pen down those words “condescending” and “disdain”. If I hear “both” then I would be very confused on how to reply to your comment.
On a different note, the reader in me would be very happy if you can share your thoughts on “pennETi pATa”. Thanks in advance.
తమ్మినేని యదుకుల భూషణ్.
విశ్వం గారి ఈ పుస్తకం చాలా మందికి తెలియదు.నాకు ఈనాటికి ఇందులోని మంచి కవితలు గుర్తున్నాయి..
” కాలహరణ గావలెనా కలికి రమ్ము ..” అన్న ఒక కవిత బావుందనిపించేది. అణులచ్చి అన్న కవి పేర ప్రాకృత (?)రచన ,చిలుకలు వాలిన చెట్టు మీద ఒక కవిత కూడా ఉండాలనుకుంటా. “మరుత్తులారా” కూడా నన్ను చాలా రోజులు వెంటాడింది. నేను ఇంటర్ లో ఉండగా ఈ పుస్తకం లైబ్రరీ నుండి తెచ్చుకొని కొన్ని కవితలు రాసుకోవటం నిన్న మొన్నటి సంఘటనలా ఉంది.ఏది ఏమైనా ఒక అరుదైన పుస్తకాన్ని పరిచయం చేసినందుకు అభినందనలు.
తమ్మినేని యదుకుల భూషణ్.
జంపాల చౌదరి
I am very disturbed by the condescending tone of this article
If others do not know or do not appreciate what the author knows or likes, it does not mean that they need to be treated with disdain. I would have expected much better restraint from Sree maagaMTi.
I am glad to see that Sri Maganti appreciates this book, but I can clearly see why pennETi paaTa brought more fame to Sri viSvam.
మెహెర్
పుస్తకం గురించి తక్కువే రాసినా, ఆసక్తి కలిగేలా బాగా రాసారు.
మీసరగండ విశ్వంగా ఈయన పేరు విన్లేదు. విద్వాన్ విశ్వంగా విన్నాను. అది కూడా మాకు ఏదో తరగతిలో ఈయన “పెన్నేటి పాట”లోని ఓ భాగం పాఠ్యాంశంగా వుండటం వల్ల. కానీ ఇది మరీ అంత దుస్థితేం కాదేమో, మీలా తెలిసినవాళ్ళు బద్దకించక ఇలా చెప్తూంటే. 🙂
“రచనకు సౌందర్యం అద్దేదేముందిలే అని మంగలాయన చేతుల్లో పెట్టాల్సిన తల తీసుకెళ్ళి చాకలాయన చేతిలో పెడితే `రాణీపాల్’ రంగులో బయటకు వస్తుంది.”… ఇదెలా అన్వయించుకోవాలో అర్థం కాలా గానీ, బాగుంది. 🙂