జనవరిలో పుస్తకం.నెట్

పుస్తకం.నెట్ ప్రారంభమై నెలరోజులైంది. ఓసారి వెనక్కి తిరిగి చూసుకుంటూ ఉంటే మళ్ళీ ఇటు తిరిగే సరికి అది ఓ టపా అయింది. కార్పోరేట్ పదజాలం లో cumulative status report అనాలేమో దీన్నే. ఈ సైటు ప్రస్థానం అంకెల్లో చెప్పాలంటే.. ముప్ఫై రోజులూ, పాతిక పోస్టులూ, రెండొందల కమ్మెంట్లు, ఎనిమిదన్నర వేల పైగా హిట్లు, పది మందికి పైగా కాంట్రిబ్యూటర్లు. ప్రస్తుతం Achilles, అసూర్యంపస్య, ఒరెమునా, తాడేపల్లి లలితా బాలసుబ్రమణ్యం, పూర్ణిమ, రవి, సౌమ్య లతో పాటు అతిథులుగా – మాలతి గారు, పప్పు అరుణ గారు, సిరిసిరిమువ్వ గారు, మేధ గారు, సి.బి.రావు గారు, విష్ణుబొట్ల లక్ష్మన్న గారూ – రాసారు, రాస్తున్నారు.

పుస్తకాల గురించిన సమాచారం, పరిచయాలూ, పుస్తకాలతో మనకున్న అనుబంధం, రచయితలు – ఇలా పుస్తక ప్రపంచంలో పౌరసత్వం ఉన్న ప్రతి విషయం గురించీ సమాచారం పంచుకోవడం కోసం పుస్తకం.నెట్ పుట్టింది. ఇలాంటి సైట్ మరోటి లేదని కాదు కానీ, ప్రపంచ సాహిత్యం గురించి తెలుగులో పరిచయం చేయాలన్న అభిలాష ఈ సైటు ఏర్పాటు వెనుకున్న కారణం. నవతరంగం ఈ సైటుకి స్పూర్తి 🙂

విషయానికొస్తే, గత నెలరోజుల్లో 25 టపాలొచ్చాయి పుస్తకం సైటులో. ఇందులో నాలుగు మాత్రం ఆంగ్ల పుస్తకాల పరిచయాలు (The God Delusion, The Davinci Code, Books Vs Cigarettes, Leaving Microsoft to change the world, Letters of Swami Vivekananda). UK లోని ఓ పుస్తకాల దుకాణం గురించీ, ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ఓ పుస్తకావిష్కరణ గురించిన సమాచార టపాలు తీసేస్తే, తక్కిన టపాలన్నీ తెలుగు పుస్తకాలు-రచయితల పైనే. ఇందులో మాలతి గారు పరిచయం చేసిన ఆ తరం రచయిత్రి “కనుపర్తి వర్లక్ష్మమ్మ” గారి నుండి విశ్వనాథ సత్యనారాయణ, తిరుమల రామచంద్ర, గుంటూరు శేషేంద్ర శర్మ, స.వెం.రమేశ్, ఎంబీయస్ ప్రసాద్ – ఇలా ఎందరో రచయిత(త్రు)ల రచనలను పరిచయం చేశారు వివిధ పాఠకులు ఈ సైటు ద్వారా. ఒక విధంగా చూస్తే, రాసి పరంగా ఒక నెలకి 25 అన్నది మరీ గొప్ప సంఖ్య కాకపోయినా కూడా వాసి పరంగా ఈ సైటు మొదలుపెట్టిన ఆశయానికి తగ్గ ప్రతిఫలం ఈ నెలలో దక్కిందనే అనుకుంటున్నాము. అటు వైపుండి సైటుని చూస్తున్నవారందరూ చెప్పాలిక మా ఆలోచన సరైనదో కాదో.

సైటు తెలుగులో ఉండటం, తెలుగు వారి చేతుల మీదుగా నడపబడటం, ఆదరింపబడటం వల్ల తెలుగు పుస్తకాల గురించి ఎక్కువ వ్యాసాలు రావడం లో ఆశ్చర్యం లేదు కానీ, పుస్తకం లో ఏ భాషా పుస్తకం గురించైనా, ఎటువంటి పుస్తకం గురించైనా రాయవచ్చునని మరో సారి ఆహ్వానిస్తున్నాము. మీ అందరి ఆదరాభిమానాలతో పుస్తకం.నెట్ మొదటి నెల విజయవంతంగా ముగించుకుని రెండో నెలలోకి అడుగుపెడుతోంది. ఈ సైటు కి మీ సలహాలూ, సూచనలతో పాటు మీకు తెలిసిన పుస్తక ప్రపంచం పౌరుల గురించి (అదే లెండి పౌరులంటే – పుస్తకాలు, రచయితలు, పుస్తక వార్తలు, బుక్ ఫైర్లు, లైబ్రరీలు – వీటితో మీ అనుభవాలు వగైరా అనమాట) మీ వ్యాసాలు కూడా ఎంతో అవసరం.

ఇప్పటి తరానికి అంతగా పరిచయం లేని రచయితలు-రచనలు, సాహితీ లోకం లో చిరస్థాయిగా నిలిచిపోదగ్గవి గా పేరొందిన రచనలు, వివిధ విషయాలపై పరిశోధనాత్మకంగా రాయబడ్డ వ్యాసాలూ, ఇతర రచనలూ – తెలుగు పుస్తకాలైనా, ఇతర భాషా పుస్తకాలైనా – ఏవైనా సరే, ఇటువంటి విషయాల మీద రాయడం ఆసక్తి ఉన్నవారు editor@pustakam.net అన్న ఈమెయిల్ ఐడీ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు. రాబోయే ఫిబ్రవరి నెలలో మహాకవి శ్రీశ్రీ రచనల పై ఫోకస్ చేయాలని అనుకుంటున్నాము. సమయం, సరుకూ ఉండి, ఆసక్తి చూపే రాతకులు (అదే లెండి, పరిచయ వ్యాసాలు రాసే ఆసక్తి ఉన్న పాఠకులు) ఉంటే ఇలా ప్రతి నెలలోనూ ఓ ఫోకస్ పెట్టాలన్న ఆలోచన ఉంది. ఇంకా ఇంకా ఎన్నెన్నో చేయాలన్న ఆలోచనలు అయితే ఉన్నాయి కానీ, అందుకు కావాల్సింది మీఅందరి సహకారం. పుస్తకం.నెట్ లో చేరడం లో ఆసక్తి ఉన్నవారు పైన చెప్పిన మెయిల్ ఐడీ ని సంప్రదించగలరు.

You Might Also Like

3 Comments

  1. మేధ

    దిగ్విజయంగా మొదటి నెల పూర్తి చేసినందుకు అభినందనలు… మరింతగా ముందుకు దూసుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం అధ్యక్షా..! 🙂

  2. రవి

    పుస్తకం కు మరిన్ని వ్యాఖ్యలు, సూచనలు, పాఠకుల ప్రతిస్పందనలు రావాలి. దీనికి పుస్తకాభిమానులు పూనుకోవాలి. అలాగే తెలుగు భాష అభివృద్ధికి ప్రధాన మార్గం తెలుగు పుస్తకాలు చదవడం, చదివించడం, కాబట్టి భాషాభిమానులు తప్పక contribute చేయాల్సిన అవసరం ఉన్నది.

  3. మాలతి ని.

    తొలినెల ముగించి మలినెలలోకి అడుగుపెడుతున్న శుభసందర్భంలో పుస్తకం సైటు నిర్వాహకులకు అభినందనలు.:)

Leave a Reply