Leaving Microsoft to Change The World

leaving-microsoftమనందరికీ గెలవడం చాలా ఇష్టం. గెలిచిన వారంటే ఆరాధన. ఏమీ లేని స్థాయి నుంచి ఒక్కొక్క మెట్టు పైకెక్కుతూ, ఒక్కొక్క సవాలునీ అధిగమిస్తూ చివరికి విజయాన్ని చేరుకునే కథలు ఏవో కిక్కునిస్తాయి. అందుకే నవలల్లోను, కథల్లోను, సినిమాలలోను underdog winning ఇంకా ఒక హిట్ ఫార్ములా.

ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకోబోయే వ్యక్తి ఆయన రాసిన పుస్తకం వీరితో అనుసంధానితమైన కథ సరిగ్గా ఈ ఫార్ములా కు ఒక రకం గా చూస్తే వ్యతిరేకం. ఆ వ్యక్తి పేరు జాన్ వుడ్. పుస్తకం పేరు Leaving Microsoft to Change the World. అనుసంధానితమైన కథే Room to Read. వివరంగా చెబుతాను:

35 సంవత్సరాల వయసులో ఒక వ్యక్తి తనకు ఏమేం కావాలని కలలు కంటాడో అవన్నీ జాన్ వుడ్ దగ్గర ఉన్నాయి. Kellog School of Management (Northwestern University) లాంటి పేరు మోసిన యూనివర్సిటీ నుంచి MBA డిగ్రీ, మైక్రోసాఫ్ట్ లాంటి ప్రశస్థ మైన కంపెనీ లో Director of Business Development గా ఉద్యోగం. విలాసాలను సులభం గా అందివ్వగల జీతం, బిల్ గేట్స్(మాజీ CEO) , స్టీవ్ బామర్ (ప్రస్తుత CEO ) లతో చనువు. కార్పొరేట్ ప్రపంచం లో గుర్తింపు. ఇలాంటి జీవితాన్ని త్యజించాలని ఎవరికీ కలలో అయినా అనిపించదు. జాన్ వుడ్ సరిగ్గా ఇదే చేసాడు.

1998 లో పని ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం, కార్పొరేట్ అడవినుంచి సాధ్యమైనంత దూరంగా వెళ్ళాలని జాన్ వుడ్ ఒక సారి నేపాల్ విహార యాత్రకు వెళ్లాడు. తను బస చేసిన హోటల్ దగ్గర ఒకరోజు యాదృచ్ఛికంగా ఒక ప్రాంతీయ పాఠశాలల ఇన్స్పెక్టర్ ను కలుస్తాడు. మాటా మాటా కలిసి స్నేహితులవుతారు. ఇన్స్పెక్టర్ మాటల్లో నేపాల్ ప్రాధమిక విద్యా వ్యవస్థ యొక్క దయనీయమైన స్థితి గూర్చి వింటాడు జాన్ వుడ్. టూరిస్టులకు సహజంగా ఉండే ఉత్సుకతతో మరుసటి రోజు ఆ ఇన్స్పెక్టర్ తో కలిసి ఒక మారుమూల పాఠశాలను సందర్శించాలని అనుకుంటాడు.

అక్కడ తెలుసుకున్న విషయాలు ఆ సంఘటనా జాన్ వుడ్ జీవితాన్ని సమూలం గా మార్చేసాయి. ఆ పాఠశాలలో కూర్చోవడానికి డెస్కులు లేవు. వర్షం పడితే పైభాగం నుంచి నీళ్ళు కారతాయి. రాసుకోవడానికి బోర్డులు లేవు. చదువుకోవడానికి పుస్తకాలు లేవు. ఉన్నదల్లా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్న అమాయకమైన పిల్లలు. ఇలాంటి దయనీయమైన పరిస్థితులు చూసిన జాన్ నేపాల్ లో 70% మంది ఇంకా ప్రాధమిక విద్య కు దూరం గా ఉన్నారని తెలుసుకుని సహజం గానే షాక్ తిన్నాడు. అదే విషయాన్ని అక్కడి ప్రధానోపాద్యాయుడితో మాట్లాడినప్పుడు, ఇక్కడ చదువుకోవడానికి పుస్తకాలు కూడా లేవా అని ప్రశ్నించినప్పుడూ వచ్చిన సమాధానం అతని జీవితం లో అసలైన మలుపు – ప్రధానోపాద్యాయుడు నవ్వుతూ -“మీరు ఈ సారి వచ్చినప్పుడు పుస్తకాలు ఇద్దురు గాని” అన్నాడు.

తిరిగి అమెరికాకు వెళ్ళిన తర్వాత కూడా జాన్ వుడ్ ను ఈ సంఘటన, ఆ సమాధానం వెంటాడుతునే ఉంది. తన బాల్యాన్ని, అభాగ్యులైన అక్కడి పిల్లల బాల్యంతో పోల్చి చూసుకున్నాడు. తన ప్రస్థుత పరిస్థితిని గూర్చి ఆలోచించాడు. గొప్ప కంపెనీలో ఉద్యోగం, ఖరీదయిన ఫ్లాట్, డిజైనర్ గర్ల్ ఫ్రెండ్…ఒక్కసారి గణాంకాల వేపు దృష్టి సారించాడు. అధికారిక లెక్కల ప్రకారం ప్రపంచంలో ఇంకా 85 కోట్ల మందికి ప్రాధమిక విద్య లేదు. పూర్తిగా నిరక్షరాస్యులు. 10 కోట్లమంది పాఠశాలలకు వెళ్ళాల్సిన పిల్లలు వెళ్ళలేరు. అలా కొంతకాలం తర్జన భర్జనలు పడినతర్వాత జాన్ వుడ్ నిర్ణయం తీసుకుంటాడు. ఉద్యోగానికి, గర్ల్ ఫ్రెండు కు, కార్పొరేట్ ప్రపంచానికీ, ఖరీదయిన జీవన విధానానికీ స్వస్తి చెప్పి, తనను ఇంతగా కదిలించిన ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకురావాలనే లక్ష్యం తో Room to Read అనే non profit organization  ను మొదలుపెట్టాడు. ఇక ఆతర్వాత జరిగిందంతా చరిత్ర. నేపాల్ లో తమ కార్యాచరణ మొదలుపెట్టిన ఈ సంస్థ ఈ రోజు వియత్నాం, కంబోడియా, ఇండియా, లావోస్, శ్రీలంక, సౌత్ ఆఫ్రికాల కు విస్తరించింది. ఉత్తేజితుడైన ఒక్క వ్యక్తి ప్రారంభించిన ఈ ఆర్గనైజేషన్ ఈరోజు ప్రపంచవ్యాప్తం గా ఒక మిలియను కంటే ఎక్కువ పుస్తకాలతో 3000 లైబ్రరీలను నెలకొల్పింది. సవివరం గా మీరు దాని గూర్చి ఇక్కడ చదవచ్చు.

ఏదో పుస్తకం పరిచయం చేయబోయి ఇదంతా ఎందుకు చెబుతున్నాను అని మీరు ఆలోచిస్తున్నట్లయితే – నేను పైన చెప్పిన విషయాలే మీకు నేను పరిచయం చేయాలనుకున్న పుస్తకం. ఈ పుస్తకం వీటి గురించే మాట్లాడుతుంది. పైన చెప్పిందంతా నా మాటల్లో అయితే, పుస్తకంలో జాన్ వుడ్ మాటలు. అమెరికా నుంచి నేపాల్ పేద పిల్లల వరకు, Corporate Warrior నుంచి Philanthropist వరకు రెండు పరస్పర విరుద్ధమైన ప్రపంచాలను తన అనుభవాల ద్వారా, ఆసక్తి రేకెత్తించే, నిజాయితీ తో కూడుకున్న కథనం ద్వారా జాన్ వుడ్ పరిచయం చేస్తాడు. నేను ఇటీవలి కాలంలో మొదటి పేజీ నుంచి, చివరి పేజీ వరకు ఆపకుండా చదివిన్ అతి కొన్ని పుస్తకాల్లో ఇది ఒకటి. సమాజం పట్ల తన బాధ్యతను గుర్తెరిగిన వాళ్ళు, సమాజం నుంచి తీసుకోవడం మాత్రమే కాకుండా తిరిగి ఏదయినా ఇవ్వాలి అన్న స్పృహ ఉన్నవాళ్ళు, ఎన్నో చెయ్యాలని ఉద్దేశాలున్నా ధైర్యం చాలక మిన్నకున్నవాళ్ళూ తప్పకుండా చదవాల్సిన పుస్తకం ఇది. ఇవేమీ లేకుండా మంచి పుస్తకాన్ని చదివితే వచ్చే అనుభవాన్ని ప్రేమించే వాళ్ళూ ఇది చదివి దీన్ని ఇష్టపడతారు. మార్క్ ట్వెయిన్ చెప్పినట్లు: Truth is stranger than fiction because fiction is obliged to stick to possibilities; Truth isn’t!

నా(మన) దేశానికి ఇలాంటి జాన్ వుడ్ లు వేలల్లో కావాలి …. అన్న ఆలోచనతో ఈ వ్యాసాన్ని ముగిస్తున్నాను.

ఈ పుస్తకాన్ని ఇక్కడ కొనవచ్చు
సంబంధిత లింకులు:   పుస్తకం అధికారిక సైటు బ్లూంబర్గ్ తో ఇంటర్వ్యూ

ఈ కోవకు చెందినదే ఇంకో పుస్తకం:Three Cups of Tea

Buy on Flipkart:

You Might Also Like

7 Comments

  1. Ravindranth Nalam

    @FengBlao:

    Feng Blao spandana chaduvuthe,

    Bhatruhari Subhashita la loni.
    Aaarabincharu neecha manavul ane padyam gurthu vastunnadi.

    manchi alochana lanu rekethinche pustakam parichayam chesi na

    Yogi gaariki abhinandanalu

  2. YOGI » Leaving Microsoft To Change The World

    […] Originally Published on pustakam.net […]

  3. Yogi

    @FengBlao – Would be nice to join them and laugh at myself- అర్థం అయ్యిందా? 🙂

    @Ravi, Aruna – Thankie!
    @స్నేహ – మీరు చెప్పింది అక్షరాలా నిజం. ఎదురుచూస్తూ కుర్చుంటే మార్పు రాదు. “నా(మన) దేశానికి ఇలాంటి జాన్ వుడ్ లు వేలల్లో కావాలి….” ఈ వ్యాఖ్యకు నేను వ్యాసంలో రాయని కొనసాగింపు, “… అందులో నేనూ ఒకడిని కావాలి” 🙂

    టింబక్టు వారి గురించి రెండు సంవత్సరాల క్రిందట నేను బాగా అధ్యయనం చేసాను. వీళ్ళే కాదు.. రాజేందర్ సింగ్ (మెగసెసే అవార్డు గ్రహీత, తరుణ్ భగత్ సంఘ్), మైక్రో ఫైనాన్స్ విక్రం ఆకుల, అన్నా హజారె… ఇంకా వివిధ రంగాలలో మార్పు కోసం తమ వంతుగా కృషి చేస్తున్న వారినందరినీ దగ్గరగా అధ్యయనం చేసాను. ఇక్కడ సమస్య ఏమిటంటే మన సమస్యలు హిమాలయాలంత పెద్దవి, సంక్లిష్టమైనవి… మార్పుకోసం పాటుపడే కొందరు, వారి ప్రయత్నాలన్నీ వివిధ దిశలలో ఒకదానికొకటి సంబంధలేకుండా ఉన్నాయి. వీటన్నిటినీ ఒక వేదికమీదకు తీసుకు రాగలిగితే వీటి మధ్య పరస్పర సహకారం ఉంటే ఫలితాలు ఇంకా బాగుంటాయి. సరిగ్గా అలాంటి ప్రయత్నమే ఓ రెండు సంవత్సరాల క్రిందట చేయబోయి నేనూ నా స్నేహితులూ దారుణంగా విఫలమయ్యం.

    కానీ ప్రయత్నం ఇంకా మానలేదు 🙂

    పుస్తకం వారికి – ఈ వ్యాఖ్య అప్రస్తుతం అయితే నిస్సందేహం గా తొలగించగలరు.

  4. స్నేహ

    జాన్ ఉడ్ వంటి వారు దేశానికి చాలా అవసరం. కాని జాన్ ఉడ్ లాంటి వారికోసం ఎదురుచూస్తూ కూర్చుంటే మార్పు రాదు. ప్రతి ఒక్కరు ఒక్క జాన్ ఉడ్ లాగా మారాలి, తమ పరిధిలో మార్పు కోసం ప్రయత్నించాలి అప్పుడే మార్పు సాధ్యం. అలాంటి వాళ్ళు మనదేశం లో కూడా ఉన్నారు. మా అనంతపురం జిల్లాలో మార్పు కోసం పని చేస్తున్న టింబక్టు కలెక్టివ్. వీరి వెబ్ సైట్ http://www.timbaktu.org/. వీళ్ళు పిల్లల కోసం నిర్వహించే పత్రిక కొత్తపల్లి ని kottapalli.in లో చూడవచ్చు.

  5. Aruna

    I will try to read it.

  6. అసూర్యంపస్య

    చాలా బాగా రాసారండీ పరిచయం. జాన్ వుడ్ వంటి వారు మన దేశానికి కూడా అవసరం. సుధామూర్తి గారు కూడా గ్రంథాలయాల కోసం ఇంఫోసిస్ ఫౌండేషన్ ద్వారా ప్రయత్నిస్తూ ఉంటారు. మన జనాభాకి ఇంకా ఇలాంటివారెండరో రావాలి. ప్రతి ఒక్కరూ తమ పరిధుల్లో ఏమన్నా చేయగలిగినా కూడా మొత్తంగా అది కొంత తేడాను తీసుకురావొచ్చు.

  7. FengBlao

    హ్మ్ ఎందుకో ఒక మాట గుర్తొస్తోంది…
    “do not set high standards for yourself.when you occasionally fail people will laugh”

    అర్థం అయ్యింద? 🙂

Leave a Reply