Books v. Cigarettes – George Orwell

కబుర్లు, ముచ్చట్లు, ఊసులు, మాటలు – రోజుకెన్నో! “ఇదో.. ఒక్క మాట” అంటూ మొదలయ్యే కబుర్లు ఎప్పుడెక్కడెలా ఆగుతాయో చెప్పలేం. ఒక్కోసారి మాటలు మొదలెట్టడానికి కారణాలు వెతుక్కుంటాం. మొదలంటూ అయ్యాక మధ్యలో వదిలెళ్ళలేము. అసలు.. చుట్టూ ఉన్న ప్రతీదాన్నీ మర్చిపోయి ఆ కబుర్లలో మునకలేస్తాం. ఎప్పుడో “ఓహ్.. ఇంత టైం అయ్యిందా?” అని ఉలిక్కిపడి చూసుకుంటాం. ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఎన్నో ఏళ్ళుగా అత్మీయానుబంధం ఉన్న వారే కాదు, ఒక్కోసారి పూర్తిగా అపరిచతులతో కూడా ఇలా మాటలు కలిసి బోలెడన్ని విషయాలు పంచుకోవడం జరుగుతుంది. జార్జ్ ఆర్వెల్ రాసిన “Books v. Cigarettes” పుస్తకం నాలో అలాంటి అనుభూతినే మిగిల్చింది.

జార్జ్ ఆర్వెల్ రాసిన అనేక వ్యాసాల సంకలనం ఇది. మొదటి వ్యాసం 1946 సం. లో రాసిన “Books v. Cigarettes”. ఇందులో ఆయన జీవిత కాలంలో పుస్తకాలకీ, సిగరెట్లకి వెచ్చించిన డబ్బును బేరీజు వేసుకునే ప్రయత్నం చేస్తారు. పుస్తక పఠనాన్ని ఖరీదైన అభిరుచిగా వర్ణిస్తూనే మన తక్కిన అలవాట్లు, వ్యసనాలతో పోల్చుకుంటే “ఎంత చవక బేరమో” అంటూ ఆలోచింపజేస్తారు. నూరుశాతం అక్షరాస్యత ఉన్న ఇంగ్లాండులోనే పుస్తక పఠనాభిలాష సామాన్యుల్లో చాలా తక్కువగా ఉందని ఆవేదన పడతారు. ఇక మన దేశ పరిస్థితి ఏమిటో అన్నది ఊహకి కూడా అందకుండా పోయింది నాకైతే. పుస్తకానుభావాన్ని డబ్బుల్లో లెక్కించే ఒక వినూత్న ప్రయోగం ఈ వ్యాసంలో చేయబడింది.

“Bookshop memories”లో తాను ఒక పుస్తక కొట్టులో సేల్స్ బాయ్‍గా ఉన్నప్పటి అనుభవాలను నెమరు వేసుకుంటారు. పుస్తకాల మీద ప్రేమ ఉన్న ప్రతీ ఒక్కరికీ పుస్తకాలు అమ్మే/ అద్దెకిచ్చే కొట్లల్లో పనిచేయటం ఎంత ఆనందంగా ఉంటుందో అనుకునేదాన్ని. అసలూ, అది పనే కాదు, రోజంతా ఇష్టమైన వ్యాపకంతోనే కాలాన్ని గడపడం సువర్ణావకాశం అనుకోవడం, “దూరపు కొండలు నునపు” చందాన ఉంటందని తెలిసొచ్చింది. సెకండ్ హాండ్ పుస్తకాలను అమ్మే కొట్టులో తాను పనిచేసినప్పుడు చూసిన మనుషల్నీ – వారి ఇష్టాయిష్టాల్నీ చక్కగా చెప్పారు. ఎంత ఇష్టమున్నా కొన్నింటికి మరీ దగ్గరైతే వాటి మీద ఆసక్తి పోవచ్చు అనేలా ఈ వ్యాసం ముగుస్తుంది.

“Confessions of a Book Reviewer” అనే వ్యాసంలో ఒక సమీక్షకుని దినచర్యను ఆసక్తికరంగా పరిచయం చేస్తారు. పత్రికలకు సమీక్షలు రాసి పంపే వారి దినచర్యను ఈ వ్యాసంలో పరిచయం చేసిన విధానం ఎలా ఉంటుందంటే, ఒక ఇరుకైన గదిలో చిందర వందరగా పడున్న పుస్తకాల, కాగితాల మధ్య కూర్చుని కళ్ళాద్దాలెట్టుకున్న ఆసామీ రోజు మొదలయ్యిందగ్గర నుండీ ఏమేం చేస్తున్నాడో మనమో టెలిస్కోప్ నుండి చూసినట్టుంటుంది. సహజసిద్ధంగా రావాల్సిన కొన్ని స్పందనల్నీ, కేవలం కొన్ని నియమాలకు కట్టుబడి “తయారు” చేసే ప్రక్రియ ఇదని వాపోతారు. “…but the prolonged, indiscriminate reviewing of books is quite exceptionally thankless, irritating and thankless job” ఈ వాక్యం ఒక సమీక్షకుని మనఃపరిస్థితికి అద్దం పడతుంది.

ఇక రచయితకుండాల్సిన స్వేచ్ఛా స్వాతంత్ర్యాల గరించి “The Prevention of Literature” వ్యాసంలో రచనా వ్యాసంగం పై పొలిటకల్ ప్రభావం ఎలా ఉంటుందో, అది రచయిత సామర్థ్యాన్ని ఎలా దెబ్బతీస్తుందో అన్న విషయాలపై తన అభిప్రాయాలను తెలియజేశారు. ఇది రెండో ప్రపంచ యుద్ధానంతర కాలంలో రాయబడింది. అప్పటి రాజకీయ, సామాజిక స్థితిగతులు తెలిసుంటే, దీన్ని అర్థం చేసుకోవటం సులువయ్యేదనిపించింది. అయినప్పటికీ.. “To write in plain, vigorous language one has to think fearlessly, and one has to think fearlessly  one can’t be politically orthodox” లాంటి వాక్యాలు వ్యాస సారాంశాన్ని చెప్పకనే చెప్పుకొస్తాయి. అయినా ఇందులో చాలా విషయాలు నాకర్థం కాలేదని ఒప్పేసుకుంటాను. ఎవరో పెద్దాయన తనకి తెలుసున్న విషయాలన్నీ చెప్తుంటే అర్థం కాకపోయినా ఆ వాగ్ఝరిని ఆపలేక తలాడిచినట్టు ఉండింది నా పరిస్థితి.

“My country Right or Left” – 1940లో రచించిన ఈ వ్యాసంలో ఓర్వెల్ తన చిన్నతనంలో జరిగిన మొదటి ప్రపంచ యుద్ధ సంబంధిత జ్ఞాపకాలను నెమరువేసుకుంటారు, రెండో ప్రపంచ యుద్ధం రాబోతున్న నేపధ్యంలో! ప్రస్తుతం కన్నా గతం చాలా  “eventful” అని మనం భ్రమించడానికి కారణం వెనక్కి తిరిగిచూసినప్పుడల్లా ఏ ఒక్క సంఘటనో కాక, అనేకానేకమన్ని గుర్తొస్తాయి కాబట్టి అన్న మాటలు నాకు చాలా బాగా నచ్చాయి.

“How the poor die” అనే వ్యాసంలో లాటిన్ అమెరికా ఆస్పత్రుల్లో ఉండే దుర్భర అవస్థను కళ్ళకి కట్టినట్లు చూపిస్తారు. రోగుల పట్ల అక్కడి యంత్రాంగం నిర్లక్ష్య ధోరణి, మెడికోలతో రోగులపై ప్రయోగాలు, వసతులు సరిగ్గా లేకపోవటం వంటి స్వానుభవ విషయాలన్నింటిన్నీ కూలంకషంగా వివరిస్తారు. పనిలో పని ఈ వ్యాసం రాసే సమయానికి యాభై యేళ్ళ పూర్వం వైద్య సౌకర్యాలు ఎలా ఉండేవి, గడిచిన యాభై సంవత్సరాల్లో “ఆసుపత్రుల” జనాల్లో ఎలా చొచ్చుకుపోయాయి, సాహిత్యంలో వాటి ప్రస్తావన ఏ విధంగా మారింది అన్న విషయాలనూ ప్రస్తావించారు.  లాటిన్ అమెరికాను చూస్తేనే ఆయన అంత విలవిల్లాడిపోయారే, ఈ సహస్రాబ్దిలోనూ మనం ఇలానే ఉన్నాం.. “How poor men of my country die” అన్న వ్యాసం సాహసించిన వారికే వేయచ్చు వీరతాడ్లు!

పుస్తకం చివర్లో తన బాల్య స్మృతులను మన ముందు ఆవిష్కరిస్తారు. “Such, such were the joys” అన్న పేరులో ఆరు భాగాల్లో తన విద్యాభ్యాసంలో అనుభవాలను చెప్తారు. ఈ పుస్తకంలో నాకు అత్యధికంగా నచ్చిన వ్యాసాలివే! ఒక పేరొందిన రచయిత ఏ మాత్రం కనిపించరిందులో! చిన్నతనంలో ఉండే భయాందోళనలూ, అపనమ్మకాలు, ఇంటి నుండి దూరంగా ఉండాల్సిన పరిస్థితుల్లో బాధ, చుట్టూ ఉన్న మనుషలతో ఇమడలేకపోవటం, వెనకబడిపోవటం, వాటిన్నంటినీ అధిగమించే ప్రయత్నం, వైఫల్యాలూ  ఓ బాలుడి మనోస్థితిని విశిదీకరిస్తాయి. అర్థంలేని ప్రమాణాల వల్ల విద్యార్థుల్లో వత్తిడి ఎలా సృష్టిస్తారో, వాటిని తెలిసీ తెలియని వయస్సులో సాధించలేకపోతే ఎంత చిన్నచూపుగా చూస్తారో చెప్పుకొస్తారు.

ఇలా ఒక అంశం నుండి ఇంకో అంశాన్నికి  సాఫీగా మారుతూ బోలెడన్ని కబుర్లు చెప్పేసుకున్నాం. వాటిలో కొన్ని ఇక్కడ పొందుపర్చే ప్రయత్నంలో ఈ వ్యాసాలు అంతర్జాలంలో ఉన్నాయని తెలిసింది. పుస్తకంలో ఉన్నవే కాక, మరికొన్ని వ్యాసాలు కూడా ఉన్నాయిక్కడ! ఒక లుక్కేసుకోండి మరి. అయినా ఓ  రాత్రి పూట సుబ్బరంగా భోంచేసి, ఈ పుస్తకాన్ని చేతిలో పట్టుకుని ఏ పడకకుర్చిలోనో అలా వాలితే.. ఆహా! All set for an intense, heartful conversation.

****************************************************************************************************

Book Details:

Name: Books v. Cigarettes (Green Pad,Paper Back)

Author: George Orwell

Publishers: Penguin

Price: Rs 195 /-

Buy on Flipkart:

You Might Also Like

4 Comments

  1. పుస్తకం » Blog Archive » జనవరిలో పుస్తకం.నెట్

    […] పుస్తకాల పరిచయాలు (The God Delusion, The Davinci Code, Books Vs Cigarettes, Leaving Microsoft to change the world, Letters of Swami Vivekananda). UK లోని ఓ […]

  2. పూర్ణిమ

    @Yogi.. that’s queued, but can’t promise exactly when! 🙂

  3. Yogi

    Purnima, If you have read Idle thoughts of an Idle fellow… could you please write about it?

Leave a Reply