తెలుగులో శతకాలు – శంకర శతకం గురించిన పరిచయ వ్యాసంలోని భాగం

’శంకర శతకం’ – రచన కవి రామయోగి : ఈ పుస్తకం తారసపడ్డ క్షణంలోనే నేను తొలిసారి ఈపేరు విన్నాను. దానితో, కుతూహలం కొద్దీ తెరిస్తే, అరవై-డెబ్భై పేజీలు మించని ఈపుస్తకంలో, శతకం ఉన్నది ఒక ఇరవై ఐదు పేజీలేమో. అంతే. మిగితా పేజీలన్నీ, శతకసాహిత్యం గురించీ, శంకర శతకం గురించీ, రామయోగి గురించి -రాసిన వ్యాసం, ముందుమాటలే. అయితే, ఆ వ్యాసాల్లో, శతక సాహిత్యం తొలినాళ్ళ గురించి రాసిన భాగాలు – నాకు ఆసక్తి కరంగా అనిపించి, ఆ భాగాలు మాత్రం ఇక్కడ టైపు చేస్తున్నాను. నా అనుమానం ఇది బయట ప్రపంచానికి అంత పరిచయమున్న పుస్తకం కాదని (కర్నూలులో ప్రచురించారని ఉంది కనుక, లోకల్ గా సేల్స్ అయి ఉంటాయి అని ఊహిస్తున్నానన్నమాట).

ఇలా టైపు చేయడం ఒక విధంగా కాపీరైట్ల ఉల్లంఘన అవుతుందేమో. కానీ, ఇది లాభాపేక్ష లేకుండా, కేవలం ఆసక్తి కొద్దీ చేస్తున్న పని కనుక – ఇలా రాసి పెడుతున్నాను. ఇలా రాయడం వల్ల ఈ పుస్తకం కాపీరైట్లు గలవారికేమన్నా సమస్యలున్న పక్షంలో, వాళ్ళు సంప్రదిస్తే, వ్యాసం తొలగించేందుకు నాకేం అభ్యంతరం లేదు.

వ్యాసం రాసినది – ఎన్.వి.కృష్ణమూర్తి

ఇక వ్యాసంలో నుండి ఎంపిక చేసిన భాగాలు:

క్రీ.శ. 13,14 శతాబ్దాలలో అనగా ఇంచుమించు కాకతీయులు పరిపాలించు కాలంలో శైవమతానుయాయులైన కవులు శివతత్వాన్ని ప్రచారం చేసే నిమిత్తం శతక రచన సాగించినారు. ఈ శతకపద్యాలన్నింటికిని ’మకుటము’ చాలా ముఖ్యమయింది. ఆ మాటకు వస్తే – ఆదికవి నన్నపార్యుడు ’మాకు ప్రసన్నుడయ్యెడున్’ అనే మకుటంతో నాలుగు పద్యాలు వ్రాయడం శతక సాహిత్యానికి శ్రీకారమేమో.

సంస్కృత వాఙ్మయంలో శతకాలు చాలా అరుదు. మూక పంచశతి, భర్తృహరిత్రిశతి, అమరుకశతకం, సూర్యశతకం, మహిషశతకం – వంటివి కొన్నే కన్పిస్తాయి. కాని, తెలుగులో 12వ శతాబ్ది నుండి ఇప్పటిదాకా శతకాల సంఖ్య సహస్రాధికము. శతకరచనా ప్రాచుర్యం క్రీ.శ.1800 తర్వాత బాగా పుంజుకున్నది. కారణం ఏమంటే అప్పటికి కొద్దికొద్దిగా ప్రబంధ కవితా ప్రభావం సన్నగిల్లింది కనుక.

సామాన్యంగా శతకాల్లో మూడు ముఖ్యాంశాలుంటాయి. మకుటము, పద్యాల సంఖ్య, ఏకోన్ముఖ భావము. కానీ, ఈ అంశాలు తెలుగు శతకాల్లో కన్పించినంతగా సంస్కృత శతకాల్లో కన్పడవు. మల్లికార్జున పండితారాధ్యుడు మొదటి ఆంధ్రశతక కర్త అనవొచ్చును. క్రీ.శ. 1242 ప్రాంతంలో కర్నూలు జిల్లా శ్రీశైల పరిసరాలలో సంచరించి దేవదేవుని కీర్తించి తరించిన యధావాక్కుల అన్నమయ్య రచించిన సర్వేశ్వర శతకము తర్వాతిది. ఈవిధంగా ప్రారంభమైన శతక సంప్రదాయంలో రానురాను శతక పద్యాలు హెచ్చుగా తేటగీతిని ఆశ్రయించడంతో శతకాల మీద పండితులకంత గురికుదిరింది కాదు. అయినా, ’సురభిమల్లా నీతి వాచస్పతి’ అన్న మకుటంగల మత్తేభ శార్దూల విక్రీడితాలతో భర్తృహరి సుభాషితాలను ఆంధ్రీకరించిన బాలసరస్వతి వంటి శతకకవులు లేకపోలేదు. చెప్పుకోదగిన ప్రాజ్ఞత లేని కవులు కందపద్యములను, సీస పద్యములను విరచించినారని కొందరి భావన. కానీ, ఇట్లనుటకుకూడ అపవాదమేమో అని చెప్పదగిన కాసుల పురుషోత్తమ కవి రచించిన ’ఆంధ్రనాయక శతకము’, అందులో నిండారిన సున్నితమైన హాస్యంతో పాటు అతి చమత్కారవంతంగా భాసిస్తుంది నిందాస్తుతి.
………………..
తెలుగు శతకాలలో జ్ఞానమూ, భతి, వైరాగ్యము, శృంగారము మొదలైనవే కాకుండా సాంఘిక, ఆర్థిక, రాజకీయ విషయాలెన్నో చోటుచేసుకున్నాయి. కృష్ణశతకము, సుమతి శతకము, నరసింహ శతకము, దాశరథి శతకము వంటివి ఆబాలగోపాలానికి చిరపరిచితాలు. కవి చౌడప్ప శతకం, గువ్వల చెన్నుని శతకం వంటిది కూడా సుప్రసిద్ధములు. అన్నింటికన్నా అత్యంత ప్రచురమై మకుటాయ మైనది వేమన శతకము…..
………

ఏకవియైనా తన చుట్టూ ఉండే ప్రజాసామాన్యం మాట్లాడే వాడుక భాషలోని నుడికారాలను, ఉపమలను, కొన్ని ప్రత్యేక మాండలిక పదాలను గ్రహించడం సహజం. చంద్రశేఖర శతకంలో జనబాహుళ్యం వాడే గ్రామ్యభాష ప్రయుక్తం కావడం చేత ఒక విధమైన హాస్యం పోషింపబడింది.
…..
దాసు శ్రీరామకవి కేవలం అచ్చతెనుగు మాటలతోనే తన ’చక్కట్ల దండ శతక’ రచన గావించినాడు. మచ్చుకు సీస పద్య పాదాలు కొన్ని –
“లచ్చి రచ్చలకెక్కు బుచ్చిని బెండ్లాడ
బుచ్చి మిండల వెంట బోవమరగు
కోడూరు బురదని మేడూరు పోయిన
మేడూరిలో జాస్తి మెట్ట శిస్తు…”

…..
చెళ్లపిళ్ళ వెంకట శాస్త్రి గారి రచనగా పేరొందిన ’కామేశ్వరీ శతకం’ లో నాటి(నేటి?) ఆచారాలను వెక్కిరించడం, ప్రశ్నించడం జరిగింది. చూడుడు –
“సకలమ్ముం గొరిగించు కొందరకటా! సన్యాసులా? కాదు;
బొట్టొకయింతేని మొగంబునందిడరేమో! ముండలా? కాదు;
విప్రకులోత్తంసుల కిట్టిపాటు గలిగెన్ బైవారి మాటేల? యెం
దుకు లోకం బిటుమారె? నీకెరకరాదో దేవి! కామేశ్వరీ!”

శతక వాఙ్మయ చరిత్ర అతివిస్తారమైనది. స్వానుభవ విశేషాలను, హృద్యత విషయాలను ప్రస్ఫుటంగా నివేదించు కొనడానికి గానూ కవులు శతకపద్ధతి నవలంబించిరనవచ్చును. తిక్కన, ధూర్జటి, తిమ్మన మొదలగు ప్రాచీన కవులు, వాసుదాసు, వడ్డాది వెంకటశాస్త్రి వంటి అర్వాచీనులు శతకములు వ్రాయడం చేత శతకరచన కవితా ప్రౌఢిని ప్రకటించడానికి అనువైనదని భావించవచ్చు. అయితే, శతకాలలో పెక్కింటిలో – ’ఇల, ధరుణీ, ధారణి, క్షితి, ధాత్రి,పుడమి, ఉర్వి, అరయ, ఎలమి, ఎన్నగ, – మొదలైన ఊతపదాలు పలు తావుల కనిపిస్తాయి.

(ఇక ఇక్కడ నుండి శంకర శతకం గురించిన ప్రస్తావన మొదలైంది)

ఈపుస్తకం ఎక్కడ దొరుకుతుందో, అసలు దొరుకుతుందో లేదో – నాకు తెలియదు. దీని వివరాలు:

శ్రీ శంకర శతకము
కర్త: కవి రామయోగి
సంపాదకుడు: వైద్యం వేంకటేశ్వరాచార్యులు
ప్రచురణ: గాయత్రి ప్రచురణలు, కర్నూలు, 1992.
వెల: తొమ్మిది రూపాయలు.

You Might Also Like

2 Comments

  1. మెహెర్

    విలువైన వివరాలు. థాంక్స్!

Leave a Reply