“మంచి పుస్తకం”తో కాసేపు…

“మంచి పుస్తకం” అన్న పదం చదవగానే మీలో చాలా మంది ఏదైనా మంచి పుస్తకం గురించి చెప్పబోతున్నాను అనుకోగలరు. కానీ, గత ఏడాది చివర్లో హైద్రాబాద్ లో నిర్వహించిన బుక్ ఫేర్ లో చిన్నపిల్లల పుస్తకాలు కొనాలనుకున్న పెద్దోళ్ళందరికీ “మంచి పుస్తకం” అనగానే ఓ ప్రచురణ సంస్థ గుర్తొస్తుంది. ఆకర్షణీయమైన రంగులలో బొమ్మలు, కంటికింపుగా కనబడే అక్షరాలూ, మంచి మంచి కథలూ, సరసమైన ధరలూ – ఇన్ని లక్షణాలతో పిల్లల పుస్తకాన్ని అమ్మే ఆ స్టాల్ ఎక్కువ మంది ఆదరణ పొందటంలో ఆశ్చర్యం లేదు. ఇవ్వాళ తార్నాక, హైదరాబాద్ లో ఉన్న వారి ప్రచురణ సంస్థకి నేనూ, సౌమ్య వెళ్లొచ్చాం. మేం ఊరికే చూసొచ్చే రకాలం కాదు, చూసొచ్చితిమేమి ఊరకుండే వారలమంతకన్నా కాము. `మంచి పుస్తకం’ సంస్థలో కీలక పాత్ర వహిస్తున్న సురేశ్ గారు మాతో దాదాపు రెండు గంటల సేపు ముచ్చటించారు. ఆ ముచ్చట్లను గుర్తున్నంతలో మీతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను. ప్రశ్నలు-జవాబులుగా ఈ అనుభవాన్ని రాయొచ్చును. కానీ అలా రాస్తే, విషయాలు తెలుస్తాయి కానీ, విషయాల కన్నా ముఖ్యమైన అనుభూతి మిస్స్ అవుతుంది. అందుకని దీన్ని నా (మా) అనుభవ పోస్ట్ గా మార్చేస్తున్నాను. అర్థం చేసుకోగలరని ఆశిస్తున్నాను.

తార్నాకలో మంచి పుస్తకం ప్రచురణ సంస్థ అడ్రస్సు కనుక్కోవడం చాలా తేలికయ్యింది, ముందు ఎప్పుడూ వెళ్ళకున్నా. బోర్డు కనిపించగానే కెమెరా క్లిక్ మనిపించి, పైకి వెళ్లాము.

మూడు నాలుగు గదుల పోర్షన్ అది. మేం అసలు దారి వదిలి పక్కదారి గుండా పోయాం. తలుపు కొట్టగానే, ఒక అమ్మాయి మమ్మల్ని పలకరించి లోపలికి తీసుకెళ్లింది.  ముందున్న రెండు గదుల్లో ఒక దాంట్లో ఆఫీసుకి సంబంధించిన వస్తువులు కనిపించాయి. గదిలో ఉన్న ఏకైక అరలో పాత పుస్తకాలెనెన్నో పోగేసి ఉన్నాయి. ముందరే ఉన్న మరో గది, అన్నీ స్టీల్ అరలే. అందులో పుస్తకాలన్నింటినీ బండిల్ చేసి పెట్టారు. మమ్మల్ని వెనకున్న గదిలోకి తీసుకెళ్ళారు. అడుగు పెట్టీ పెట్టగానే ఒక కంప్యూటర్ మానిటర్ మీద మా కళ్ళు పడ్డాయి. ఏదో బొమ్మ గీస్తున్నారందులో. వచ్చిన పని చెప్పకుండా, దాన్ని ఫోటో తీసుకోవచ్చా అని అడిగాం. ఫలితం:

పుస్తకాలంటే నేనూ, సౌమ్యా ఐస్‍క్రీమో, చాక్లెట్లో చూసిన చిన్నపిల్లలం అయిపోతాం. ఇహ, అవి చిన్నపిల్లల పుస్తకాలే అయితే ఇక చెప్పేదేముంది?! ఒక్కో పుస్తకం తిరగేస్తుంటే వాటిల్లోని బొమ్మలూ రంగులూ మమల్ని ఆకర్షించాయి, నవ్వించాయి, అబ్బురపరచాయి. బాల్యపు జ్ఞాపకాలను సెర్చ్ బటన్ కొట్టి మరీ వెతికి పట్టించాయి: ఈ పుస్తకం నేను చిన్నప్పుడు చదివాను. ఈ కథ నీకు తెల్సా? ఫలానా రచయిత పేరు నేను విన్నా! టాల్‍స్టాయ్ కథలు చిన్నప్పుడు చదివి, ఆయనకి అవి తప్ప ఏం రాయడం రాదనుకొనేదాన్ని – ఇలా ఎక్కడెక్కడి స్మృతులనో మోసుకొచ్చాయి. “పిల్లల కోసం తెలుగు సామెతలు” అన్న పుస్తకంలో, విరివిగా వాడే సామెతల్లోని ముఖ్యమైన పదాల స్థానంలో, వాటికి బదులు, బొమ్మలు గీసారు. ఉదా: “కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకి కోపం అన్నది” సామెత అయితే, అందులో “కప్ప”, “పాము” స్థానాల్లో వాటి బొమ్మలుంటాయి. అంటే పిల్లలు బొమ్మలు గుర్తుపడుతుంటే, పెద్దలు సామెతలు చదివి వినిపించి అర్థం వివరించవచ్చు. నేనూ, సౌమ్య దాన్నో ప్రశ్నాపత్రంగా భావించి శాయశక్తులూ ఒడ్డి బొమ్మలు గుర్తుపట్టి సామెతలు పూర్తి చేశాం, పక్కనున్న అమ్మాయిలు స్లిప్పులు అందిస్తుంటే! రష్యన్ అనువాద కథలు, జానపద కథలూ, వి. సుతయేవ్ రచనలు…  చాలానే ఉన్నాయి. మరాఠిలో ఒకావిడ రాసిన చిట్టిచిట్టి పుస్తకాల సెట్ ఒకటి చూపించారు.

మాటలను గుర్తుపట్టి, వాటిని తిరిగి పలకడానికి ప్రయత్నం చేసే వయస్సున్న పిల్లలకి అనువుగా ఉండే పుస్తకాలివి. “పెద్ద”, “చిన్న”, “ఎక్కాను”, “దిగాను” లాంటి పదాలను వాక్యాలలో ఉపయోగించటం చెప్పారు ఈ పుస్తకాలలో. Rat and pencil story -అని ఒక ఆసక్తికరమైన కథ కూడా చదివాము.  ‘మంచి పుస్తకం’ ప్రచురించిన పుస్తకాలే కాక, సి.బి.టి, హెచ్.బి.టి, ఎన్.బి.టి వారు ప్రచురించిన బాల సాహిత్యం కూడా అందుబాటులో ఉంచారు. మాకిచ్చిన పుస్తకాల్లో నాకు ప్రేంచంద్ రాసిన “ఈద్‍ఘా” పుస్తకం కనిపించగానే, “నేను పోయి చదువుకుంటా” అని అందర్నీ వదిలేసి ఓ మూల కూర్చొని చదవటం మొదలెట్టాను.

ఓ రెండు మూడు పేజీలు చదవగానే, కొనాలని నిర్ణయించుకున్నాను. (మొన్న ఒకరు, చిన్న పిల్లల పుస్తకాలు నీకెందుకు? అని నవ్వారు. పుస్తకం.నెట్ లో బాలసాహిత్యం ఫోకస్ అని చెప్పాను. మిమల్ని ఎవరన్నా అడిగినా అలానే చెప్పండి.) ధర పదమూడు రూపాయలని చూసి, ఎటూ కొంటున్నాక ఇప్పుడే చదవటం దేనికని చుట్టూ ఉన్నవి పుణుక్కోవడం మొదలెట్టాను. ముందు గది గుమ్మం దగ్గర ఒక అమ్మాయి కూర్చొని తల వంచుకొని బొమ్మలు గీసుకోవటంలో పూర్తిగా నిమగ్నమై వుంది. నేను గమ్మున ఉండక, ఏంటి గీస్తున్నారు? ఎందుకు గీస్తున్నారు? ఎలా గీస్తున్నారు? అని కాసేపు విసిగించి చుట్టుపక్కల అన్నీ చూసి, లోపలికెళ్లాను.

అప్పుడే సురేశ్ గారు వచ్చారు. హైద్రాబాద్ బుక్ ఫేర్‍లో నన్ను చూశారు కాబట్టి, పరిచయ కార్యక్రమాలకి బదులుగా పలకరింపులు సాగాయి. “ఎవరో పుస్తకాల కోసం వస్తున్నారనుకున్నాను, పుస్తకం.నెట్ వాళ్లని తెలీలేదు” అన్నారు నవ్వుతూ. “అనుకోకుండానే వచ్చాం, వచ్చాం కాబట్టి మీతో కాసేపు మాట్లాడేసి పోతాం” అని అనగానే ఒప్పుకున్నారు. అలా మొదలయ్యాయి కబుర్లు.

“మొదటి నుంచి మొదలెడదాం. ‘మంచి పుస్తకం’ ఎలా మొదలయ్యింది?” అని నేను అడిగాను. ఆయన గట్టిగా నవ్వుతూ, చెప్పాల్సినవన్నీ గుర్తుచేసుకుంటూ ఉండగానే, “పోనీ, తేలిక ప్రశ్న అడగనా? ఎప్పుడు మొదలయ్యింది? 2004లో అని విన్నాను?” అనడిగా.

“2004లో మేం రెజిస్టర్ చేయించాం. కానీ మొదలు పెట్టింది మాత్రం 2001లోనే. అంతకన్నా ముందు, ‘బాలసాహితి’ అని ఒక ట్రస్ట్ ఉండేది, దాన్ని 1990లో మొదలు పెట్టాం. హెచ్.బి.టి లానే ఇది కూడా, కానీ పిల్లల పుస్తకాల కోసం చేశాం. దాదాపుగా ముప్ఫై పుస్తకాలు ప్రచురించాం ‘బాల సాహితి’ కింద. కానీ దాన్ని నడపలేకపోయాము. కొన్నాళ్ళకి మళ్ళీ ‘మంచి పుస్తకం’ మొదలెట్టాం.” అని చెప్పారు. “ఇది ముందు నుండే పార్ట్ టైంగానే చేసుకొచ్చాం.” అన్నారు.

“ఎందుకు చేస్తున్నారు?” అనడిగాను.

“పిల్లలకు పుస్తకపఠనంపై ఆసక్తి కలిగించాలని. చదవటం అలవాటు చేస్తేనే కదా, అది వాళ్ళకి వంటబట్టేది. వాళ్ళకే కాక, తల్లిదండ్రులకి, టీచర్లకి కూడా ఉపయుక్తంగా ఉండే పుస్తకాలు వేస్తున్నాము. పిల్లలకి పుస్తకాలు ఆకర్షణీయంగా కనిపించాలి. వాటిని చదవాలన్న ఆసక్తి కలిగించేలా ఉండాలి. ఒక్కసారి చదవడంలోని మజా అర్థం అయితే, వాళ్ళే చదువుకుంటూ పోతారు. అందుకని ఎంత చిన్న వయస్సులో పుస్తకాలను పరిచయం చేస్తే, అంత మంచిది.”

“మీరెక్కువగా కథలనే వేస్తారా?”

“అవును. కథలే సింహభాగం ఉంటాయి. పిల్లలకి కథలంటే ఇష్టం కదా.”

“కాల్పనిక సాహిత్యం కాక, మాథ్స్, సైన్స్ వంటివి వేయరా?” అని సౌమ్య అడిగింది.

“కో-కరికులమ్ మీద దృష్టి పెట్టాలన్న ఉద్దేశ్యం మాకు లేదు. పాఠ్యేతర పుస్తకాలే వస్తాయి ఎక్కువగా”

“అలా కాదు, మాథ్స్ మేడ్ ఈజీ లాంటి పుస్తకాలు, అంటే సరదా సరదాగా మాథ్స్, సైన్స్ కి సంబంధించిన విషయాలు చెప్పే పుస్తకాలు వేస్తారా అని?” అన్న సౌమ్య ప్రశ్న వినగానే, “ఎందుకు వేయమూ?” అంటూ కొన్ని పుస్తకాలను తెప్పించారు. “గాజు గ్లాసుతో ప్రయోగాలు” అన్నది ఒక పుస్తకం. ఇంట్లో సులభంగా దొరికే వస్తువులతో కొన్ని ప్రయోగాలు చేసి, ఫలితాలను గమనించటాన్ని ఆ పుస్తకంలో చక్కగా వివరించారు. ఏవరో ఒక స్కూల్ టీచర్ రాశారట దాన్ని. అలానే అసిమోవ్ “ఎలా తెల్సుకున్నాం?” అన్న శీర్షికతో కొన్ని భాగాలు వెలువరించారు. ఇవి ఆరేడు తరగతుల పైన విద్యార్థులకి పనికి వచ్చే పుస్తకాలనిపించాయి. ఆ మాటే అంటే, “అవును. వారి కోసమే! కాకపోతే, ఇందులో ఉన్న తెలుగు చదవటం కాస్త కష్టం కావచ్చు,” అని బదులిచ్చారు.

“మీరు ముఖ్యంగా ఏ వయసు పిల్లల్ని దృష్టిలో పెట్టుకుంటారు, పుస్తకాలు ప్రచురించేటప్పుడు?” అనడిగాను.

“ఎక్కువగా పదిలోపు వయస్సున్న పిల్లల కోసమే పుస్తకాలు వేస్తుంటాము. కానీ, పదహారు పదిహేడేళ్ళ వయస్సు వరకూ పుస్తకాలు వేయాలని అనుకుంటున్నాము. మీరడిగినట్టు మాథ్స్, సైన్స్ పుస్తకాలు, ఇంకా వేరేవి కూడా చెయ్యాలనుకుంటున్నాము. పి.కె.శ్రీనివాసన్ లెక్కల పుస్తకాల తరహా ఏదైనా చెయ్యగలిగితే బాగుంటుంది.”

“మీరీ ప్రచురణ రంగంలోకి ఎలా వచ్చారు?” అన్న ప్రశ్న చాలా జ్ఞాపకాలను తట్టి లేపింది:

“నేను ముందు నుండి ఈ రంగంలో ఉన్నవాడినే. ముందు ‘ఈనాడు’లో పనిచేసేవాడిని. ఇప్పుడు WASSAN (acronym for ‘Watershed Support Services And Activities Network’) కోసం పనిచేస్తున్నాను. అప్పట్లో ప్రింటింగ్ అవీ వేరుగా ఉండేవి, ఇప్పటిలా కాదు. ఇప్పుడు ఒక్క క్లిక్ తో ఫాంట్ సైజ్ మార్చవచ్చు. ఒక్క క్లిక్ తో కాలమ్స్ మార్చవచ్చు. కానీ అప్పట్లో ఓ చిన్న మార్పు కావాలన్నా చాలా మార్పులు చేయ వలసి వచ్చేది. ఒక్క రోజులో పదహారు పేజీల కన్నా ప్రూఫ్ రీడింగ్ చేయకూడదనే నియమం ఉండేది. టెక్నాలజి వల్ల మనం నాణ్యతపరంగా ఎంతో కొంత నష్టపోతున్నామనిపిస్తోంది ఒక్కోసారి. ప్రూఫ్ రీడింగ్ అనేది ఇప్పుడు దాదాపుగా లేదనే చెప్పాలి. అచ్చు తప్పులని చూడ్డం చాలా బోరింగ్ పని అంటారు కానీ, నాకందులో చాలా ఆనందం కలుగుతుంది. నాకు నచ్చుతుంది. ప్రూఫ్ రీడింగ్ కష్టమైన పని” అంటుండగా,

“మాకు తెల్సు!” అని ముక్తకంఠంతో అన్నాం.

“అది బాగా అలవాటయ్యిపోయాక రచనలు నచ్చటం కాస్త కష్టమవుతుంది, అన్ని చోట్లా తప్పులే వెతకటం మొదలెడతాం…” అనగానే అందరం గట్టిగా నవ్వాం. ఆయన కొనసాగించారు, “అప్పట్లో పుస్తకం ఎలా ఉండాలన్నది మొత్తం మెదడులో స్పష్టమైన చిత్రం వచ్చాకనే, ప్రాసెస్ మొదలయ్యేది. ఇప్పుడలా కాదు, ముందు కంపోసింగ్ మొదలెట్టండి, తర్వాత అటూ, ఇటూ మార్పులు చేసుకోవచ్చును అన్నట్టుంది. టెక్నాలజీ వల్ల ఇదంతా. ఇక్కడ, పుస్తకానికి తగ్గ కథను ఎన్నుకోవడం, తర్వాత ఎడిటింగ్, ఫ్రూఫ్ రీడింగ్ అవీ చేయటం వంటివి నా పనులు. డిజైనింగ్ జోలికి నేనెక్కువగా పోను. అది మా టీమ్‌కే వదిలేస్తాను. అప్పుడప్పుడూ ఏవైనా సలహాలూ, అవీ ఇస్తాననుకోండి.”

“ఇలాంటి పనులు పార్ట్ టైం గా చెయ్యడం ఎంత కష్టమంటారు?” అని అడిగాను.

“నాకు తెల్సి, ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగు పుస్తకాల ప్రచురణను జీవనాధారంగా చేసుకునే వీలు లేనే లేదు. ఆసక్తి, ఓపిక ఉన్న వాళ్ళు పార్ట్ టైంగా చేసుకోవాల్సిందే! కాని నేనిక ఫుల్ టైం ఇటు వచ్చేద్దామనుకుంటున్నాను. వచ్చి కొన్ని పనులు చేయాలి. ఒక బుక్ క్లబ్ మెంబర్‍షిప్ మొదలెడదాం అనుకుంటున్నాం. ముందు ఒక నలభై మందితో అలా మొదలెట్టినా, దాన్ని పెంచుకుంటూ పోయి ఏడాదికి ఐదొందల మంది వరకూ మెంబర్స్ అయితే బాగుంటుందని. కొత్త పుస్తకాలు ముద్రితమైనప్పుడు, ఫలనా పుస్తకం వచ్చిందండి అని చెప్పి ఊరుకోక, వారికి పుస్తకాలు పంపేలా చూడాలి. ఇలాంటి కొన్ని ఆలోచనలు ఉన్నాయి. అవ్వన్నీ చేయాలి.” అని ఆయన మాట పూర్తికాక మునుపే, “అలాంటి ప్రయత్నాలకు ‘పుస్తకం.నెట్’ ఉడత సాయం అందించగలదు. కలసి చేయగల పనులు ఏవైనా ఉంటే తెలియజేయగలరు,” అని చెప్పాం.

ఈ కబుర్లు చెప్పుకుంటూండగానే నాకు ఎదురుగా ఉన్న బల్ల మీద “పుస్తకాలతో స్నేహం” అనే చిన్న పుస్తకం కనిపించింది. ఏమిటని అడిగితే, అది బై-మంత్లీ మాగజైన్ (ద్వైమాసిక పత్రిక) అనీ, ‘మంచి పుస్తకం’ తరఫున తీసుకొని రావాలని ప్రయత్నించారని, కానీ రెండు నెలలకు మించి రాలేదని చెప్పారు. ఇరవై పేజీలుండే ఆ చిట్టి పుస్తకంలో పిల్లల పుస్తకాల సమీక్షలు, పిల్లల పఠనాసక్తిని మెరుగుపరిచే విషయాల గురించి వ్యాసాలు చూసి ముచ్చటేసింది. ముందు చేయలేకపోయినా, ఇప్పుడు దాన్ని పునరుద్ధరించాలని ఆయన అభిప్రాయపడ్డారు. అప్పుడే ఆయన ‘నెమ్లీక’ అనే మరో త్రైమాసిక పిల్లల పత్రిక చూపించారు. ఇది కూడా చక్కని పత్రిక. నల్గొండ జిల్లాలో ఎం.వి. ఫౌండేషన్ నుండి వెలువడుతుందట. దాన్ని చూడగానే మా ఇద్దరికీ ‘కొత్తపల్లి’ పత్రిక గుర్తొచ్చింది. ఆ మాటే పైకి అనేశాం. “అవును, ‘కొత్తపల్లి’ వారు కథల్లో వైవిధ్యం చూపిస్తూ, అనువాద కథలనూ ప్రచురిస్తారనుకోండి. ఇది అలాంటి ప్రయత్నమే,” అని అన్నారు.

పోయిన ఏడాది చివర్లో బుక్ ఫేర్ లో అందరి మన్ననల్ని పొందిన సంస్థ ‘మంచి పుస్తకం’ అని వారికో సారి గుర్తుచేశాను. సంతృప్తిగా నవ్వుకుంటూ, “మేం 2003 సం. నుండి పుస్తక ప్రదర్శనల్లో పాల్గొంటున్నాం. మేం పాల్గొనడానికి చాలా మంది చాలా విధాలుగా సాయపడ్డారు. చాలా ఫండ్స్ వచ్చేవి, కాబట్టే పాల్గొనగలిగాం. కాని ఇప్పుడు ఖర్చులన్నీ మేమే భరించుకోగలిగే స్థాయికి ఎదిగాం. గత కొన్నేళ్ళుగా మా పనికి ఇది తగిన ఫలితం అనుకోవచ్చును. మొదట్లో పుస్తక ప్రదర్శనలో పాల్గోవడం అనేది ప్రయాసతో కూడిన పనిలా ఉండేది. ఓ ఏడాది, నాకు ఓపిక పూర్తిగా నశించిపోయినా, వెళ్ళక తప్పదన్నట్టు స్టాల్ కి వెళ్లి కూర్చోగానే, ఒకాయన వచ్చి, ‘మంచి పుస్తకం ఉంది కదా, హమ్మయ్య! ఈ ఒక్క దాని కోసమే వచ్చాను’ అని అన్నారు. అప్పటి వరకూ ఉన్న నీరసం అంతా పటాపంచలయ్యిపోయింది.”

“మేం అప్పుడప్పుడూ కొన్ని ఎక్స్‌పెరిమెంట్లు కూడా చేస్తుంటాం. అందులో భాగంగానే పోయిన ఏడాది నల్గొండలో, ఎం.వి. ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మొబైల్ పుస్తక ప్రదర్శన జరిపాం. అప్పుడనిపించింది పుస్తకాల ధరల తక్కువగా ఉండాలి, ఐదు రూపాయలకి మనం పుస్తకాలు తీసుకురాగలగాలీ అని. కాని అది కష్టసాధ్యం అనిపిస్తోంది. ఇప్పుడు మా ప్రయత్నంలోనే రచయితలు రాయల్టీలు ఆశించడం దాదాపుగా తగ్గిపోయింది, ఆర్టిస్టులకి ఇస్తున్నది కూడా పెద్దది కాదు, ఇంకా ఆర్థిక సాయం తలో మూల నుండి వస్తుంది, అయినా పుస్తకాలను ప్రస్తుత ధరల కన్నా తక్కువ అమ్మడానికి మాకు వీలుపడ్డం లేదు. కారణం? ఒక రకం ఖర్చులు తగ్గినా, కల్సొచ్చినా; మరెన్నో ఖర్చులు దారుణంగా పెరిగిపోయాయి. కాగితం ఖర్చులు, రవాణా ఖర్చులూ వగైరా. సి.బి.టి వంటి వారు తక్కువకి చేస్తారు, అది వారికెలా సాధ్యపడుతుందో ఏమో మరి. కాని నల్గొండలో చిన్న పిల్లలు చిరిగిపోయిన, నలిగిపోయిన ఐదు రూపాయల కాగితాలను, చిల్లరను పట్టుకొచ్చి, ‘ఐదురూపాయల పుస్తకం కావాలి!’ అంటూ అడగడం మొదలెట్టారు. ‘ఐదు రూపాయలకి వచ్చే పుస్తకాలు మీకు కాదు నాన్నా’ అని చెప్తున్నా వినరే! వాళ్ళని చూస్తుంటే ముచ్చటేసింది. బహుశా, ఒకడు పుస్తకం కొనుక్కున్నానని చెప్తే మిగతా అందరూ కూడా కావాలనుకున్నారేమో, నా దగ్గరా ఉంది పుస్తకం అని చూపించుకోడానికి.”

“ప్రభుత్వ గ్రంథాలయాలు, ప్రభుత్వ పాఠశాలలూ ఒకప్పుడు నడిచాయి. అవి నడవడం వల్లే మాలాంటి వాళ్ళు పైకొచ్చారు. కాని ఇప్పుడు నా పిల్లలకి వాటితో పని లేదు. మా ఇంట్లోనే ఓ లైబ్రరీ ఉంది. కాబట్టి వాళ్లు బయటకెళ్లరు. కాని వాటి అవసరం మన దేశంలో ఇప్పటికీ చాలామందికి ఉందని మనం గుర్తించాలి. అందుకు అనుగుణంగా పనులు చేపట్టి, వాటిని పునరుద్ధరిస్తే చాలా మందికి మేలు చేసినట్టు అవుతుంది,” అని అభిప్రాయపడ్డారు. దీని గురించి కాసేపు మాట్లాడుకున్నాక, నేనడిగా:

“ఇక్కడ ఎక్కువగా అనువాద పుస్తకాలే కనిపిస్తున్నాయి. అచ్చ తెలుగు పిల్లల సాహిత్యం ఏమైనట్టు?” అని.

“అనువాదాలే ఎక్కువ ఉన్నాయని ఒప్పుకుంటాను. మన జానపద కథలూ అవీ లేకపోలేవు. కాని ఇప్పటికయితే అనువాదాలే ఎక్కువ. ఇప్పటికిప్పుడు కొత్తగా పిల్లల కోసం ఓ కథ రాయించుకొని దాన్ని పుస్తక రూపేణా తీసుకురావటమనేది చాలా కష్టమైన పని. అసలు ఫలానా కథ, ఫలానా అంశంతో పుస్తకం వేద్దాం అని నిర్ణయించుకోవడమే చాలా కష్టమైన పని. కొన్ని కథలు మొదట చదవగానే నేను చిన్నపిల్లాడిలానే ఎంజాయ్ చేస్తాను. కాని ఒక ఎడిటర్ గా మళ్లీ మళ్లీ చదివినప్పుడు మాత్రం చాలా అనుమానాలు వస్తాయ్. ఉదాహరణకి ఒక రాజుకి ఇద్దరు భార్యలు అని చెప్తుంటే, ఇద్దరు భార్యలు ఉండడం కరక్టా కాదా అన్న అనుమానాలు పిల్లలకి వస్తాయా అని. మన కథల్లో ఎక్కువగా బ్లాక్ ఆండ్ వైట్ కారెక్టర్లు ఉంటాయి. రాజుగారి మొదటి భార్య మంచిది – ఆమెకు మంచే జరుగుతుంది. రెండో ఆవిడ చెడ్డది, ఆవిడకి చెడే జరుగుతుంది. ఇలాంటివి పిల్లలెలా అర్థం చేసుకుంటారో అని నా అనుమానం. ఇంకో విషయం కథల్లోని నీతులు. “మోరల్ ఆఫ్ ది స్టోరీ” అన్నది ఉండకుండా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. నీతి కోసం కథ రాయకూడదు. కథలోనే అన్నీ అంతర్భాగంగా ఉండాలి. కథకే పెద్ద పీట ఉండాలి. అప్పుడు కథలో ఏం జరుగుతున్నాయని వాళ్ళు గమనించుకుంటారు. నీతో, మరోటో వాళ్ళే నిర్ణయించుకుంటారు. అలానే నిర్ణయించుకోనివ్వాలి. ‘ఇలా అర్థం చేసుకోవాలీ’ అని మనం చెప్పకూడదు. ఎలా అన్నది వాళ్ళకే వదిలేయాలి.” అని చెప్పుకొచ్చారు. ఈ అంశం పై చాలానే మాట్లాడుకున్నాం. మన కథల్లో రాక్షసులను, కథలోని సెక్స్ నూ, హింసనూ పిల్లలెలా అర్థం చేసుకుంటారో అని ఆలోచించాము. రాక్షసులంటూ ఎవరూ ఉండరని నమ్మినా, ఫాంటసీ అనేది పిల్లలకి చాలా అవసరం అని ఆయన అభిప్రాయపడ్డారు. ఎదిగే వయస్సులో పిల్లలు స్కూలు ద్వారా కన్నా, ఇంట్లో చుట్టూ ఉన్న వాతావరణం ద్వారానే ఎక్కువ నేర్చుకుంటారని ముగ్గురం మూకుమ్మడిగా ఒప్పుకున్నాం. పిల్లల జ్ఞాపకశక్తిని పెంపొందించే విధంగా రిపిటీటివ్ కథలు ఉండాలని అనుకున్నాం. వాళ్ళు అచ్చేసిన “పాలవాడి ఆవు” అని ఒక పుస్తకాన్ని చూపించారు. ఆ కథలో ఒక ఆవు కూర్చుండిపోయి, లేవడానికి నిరాకరిస్తుంది. దాన్ని ఎంత మంది బతిమాలినా, బామాలినా అది లేవదు. ఆ పుస్తకంలో బొమ్మలు చాలా బాగనిపించి, వాళ్ళ ఆర్టిస్టుల గురించి అడిగాం.

(పిల్లలు కథలెలా అర్థం చేసుకుంటారన్న అంశం పైన తల్లిదండ్రులు భైరవభట్ల కామేశ్వరరావు గారు స్వీయానునుభవంతో రాసిన  పోస్టు తరహాలో రాస్తే బాగుంటుందని నా అభిప్రాయం.)

“వాసన్ కి పనిచేసే శ్రీకాంత్ అనే ఆయనే మాకూ బొమ్మలు గీసి పెడుతూ ఉంటారు. ఆయన కాక, పావని కూడా గీస్తూ ఉంటుంది. ఈ అమ్మాయి ఫైన్ ఆర్ట్స్ లో డిగ్రీ చేశాక, మా దగ్గరకొచ్చింది,” అని, మొదట్లో బొమ్మలు గీసుకుంటున్న ఒక అమ్మాయిని నేను డిస్టర్బ్ చేశానే, ఆ అమ్మాయిని పరిచయం చేశారు. ఆ అమ్మాయి తను వేసిన బొమ్మలు చూపించింది. “ఆర్టిస్టులతో పని చేయించుకోవడం కష్టంగానే ఉంది. బొమ్మలు గీయడం ఒక్కటే వస్తే సరిపోదు, డీటేల్స్ ని గమనించి వాటిని బొమ్మలో చూపెట్టగలగాలి. అలాంటి వాళ్ళు దొరకడం కష్టమే” అని సురేశ్ అన్నారు. కాసేపు మేం బొమ్మలు గీయటం గురించి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత, ముందు గది అరలో పాత పుస్తకాలున్నాయని చెప్పానే, వాటి గురించి వివరించారు. ఒక ఆంగ్ల పుస్తకంలో కథను, బొమ్మలు అలానే ఉంచి, కథను అనువదించి, ఫాంట్ ని సరిగ్గా ఉంచడంలో వారు తీసుకునే శ్రద్ధను వివరించారు. సర్వ శిక్ష అభియాన్ లో భాగంగా కార్డుల తయారి గురించీ చెప్పుకొచ్చారు.

ఓ రెండు గంటల సేపు, పైన చెప్పినవే కాక, మన విద్యాసంస్థల పని తీరు, పిల్లలు ఎలా నేర్చుకుంటారు, స్కూల్ డ్రాపవుట్స్ ను తగ్గించటం ఎలా లాంటి ఎన్నో అంశాలపై మాట్లాడుకున్నాం. వాళ్ళు చేస్తున్న, చేయబోతున్న పనుల గురించి తెల్సుకున్నాక, మేం చాలా సంతోషించాం. మంచి పని చేయటం అనే దాని కన్నా, ఉన్న పరిమితుల్లో తమ సర్వశక్తులనీ ఒడ్డి చేయడం మాకు ముచ్చటకలిగించింది. It was inspiring! ఓ నలుగురైదుగురు కల్సి ఒక పనిని తలా కొంచెం పంచుకొని ఆడుతూ, పాడుతూ చేసే పనులు ‘మంచి పుస్తకం’ లా ఉంటాయని తెల్సి ఆనందం కలిగింది. మాకూ ఉత్సాహం పెరిగింది. పెద్ద పనులు చేయడానికి చిన్న చిన్నగా ప్రయత్నిస్తే చాలని అనిపించింది. “అబ్బా! ప్రస్తుతం ఉన్న ఖర్చులతో, ఇలాంటి పనులు పెట్టుకోవటం దేనికి? అయినా, మనం పుస్తకాలేసినా చదివేవాళ్ళు ఏరి?” అని నిరుత్సాహంగా ఉండక, ఒక మంచి పని చేస్తే దాన్ని నిలబెట్టడానికి చుట్టూ ఉన్న వాళ్ళు కూడా తలా ఓ చేయి వేస్తారని తెల్సింది. “మనం చదవం. మనం చదివించం. మనమింతే!” లాంటి నెగిటివ్ అలల్ని ఇలాంటి బృహత్ కార్యక్రమాలు కొట్టిపారేస్తాయి. వీళ్ళు పని చేసే తీరులో నాకు నచ్చిన మరో విషయం టీం వర్క్. ‘కొత్తపల్లి’ వారితోనూ ఈ మధ్యకాలంలో మాట్లాడ్డం జరిగింది. (ఆ విశేషాలు త్వరలో ప్రచురిస్తాం) వాళ్ళల్లో కూడా టీం వర్క్ సూపర్బ్! ‘మంచి పుస్తకం’ సంస్థలో ఉన్న రెండు గంటల సేపూ ఆ టీం వర్క్ ప్రత్యక్షంగా చూసే భాగ్యం కలిగింది.

మా కోసం తమ సమయాన్ని కేటాయించి, ఇన్ని విషయాలు చెప్పిన సురేశ్ గారికి, వారి టీం కి ధన్యవాదాలు, అభినందనలు! వారి తదుపరి ప్రయత్నాల్లో మరిన్ని విజయాలను పొందగలరని మనసారా ఆశిస్తున్నాం.

(గుర్తున్నంతలో పై విషయాలు రాశాను. ఎక్కడైన పొరబడి ఉంటే సవరించగలను. ముందస్తు క్షమాపణలు!)

You Might Also Like

17 Comments

  1. Interview > Pustakam.net - Manchi Pustakam

    […] One of our very first print interviews with Pustakam.net. Thank you to Purnima and Sowmya! Read it here. […]

  2. Interview > Pustakam.net - Manchi Pustakam

    […] One of our very first print interviews with Pustakam.net. This was published way back in March 2010. Thank you to Purnima and Sowmya! Read it here. […]

  3. patnala eswararao

    pillala ppustakaalanu mundugaa teachers chadavali.appudea primary education baagupaduthundi.

  4. bharathi.jonnalagadda

    aaro taragathi chaduvutunna ma abbayiki pustakam ante ishtam erpadataniki manchi pustakam vaari pustakalu kooda oka karanam.vaarini parichayam chesinanduku dhanyavadalu.

  5. పుస్తకం » Blog Archive » గడచిన సంవత్సరం, చదివిన పుస్తకాలు, పెరిగిన పరిచయాలు

    […] ప్రయత్నాలని కళ్ళముందు ఉంచారు. అవి, మంచిపుస్తకం, కొత్తపల్లి పిల్లల పత్రిక . “ఔరా! ఏమి […]

  6. మాగంటి వంశీ

    పిల్లల కోసం ఆడియో కథలు – ఈ పాఠ్యం మీద ఆసక్తి వున్నవారికి, తెలుగులో ఎలా చెయ్యొచ్చో అయిడియా కావాలనుకునేవారికి ఉపయోగపడుతుందేమో అని ఈ లింకు ఇవ్వటం జరుగుతోంది.

    http://storynory.com/archives/stories-for-younger-children/

    ఒకప్పుడు అనగా, సరిగ్గా 11 నెలల క్రితం – కొంతమంది ఔత్సాహికులనుకున్నవాళ్ళతో ఈ పిల్లల ఆడియో కథలు మొదలెట్టి, వారి ధాటికి తట్టుకోలేక మానేసిన మనిషిగా చెబుతున్నా -ఆగండి “ఉపమా” చెప్పండి బాబూ, మీరు ఇలాగ చెబుతే అలాగర్థం కాదు అంటే – సగం వెన్నెల రాత్రుల్లో చేలో మంచె మీద కూర్చుని చుక్కల్ని చూస్తూ మైమరిచిపోతున్న మనిషికి, మంచె కింద పడుకున్న గార్ధభం ఒక్కసారిగా లేచి ఓండ్ర పెడితే కలిగే భయం, చిరాకు అన్నీ కలగలుపుగా మారి ఏదో చేసిన విధంగా అన్నమాట…అదండీ…

    అలాగే పిల్లలకోసం చెయ్యాలనుకున్నవారికి ఇంకో మంచి లింకు

    http://boowakwala.uptoten.com/

    వంశీ

  7. Mamatha

    very nice artcle and pictures – absolutely wonderful effort. I am not at all surprised to hear that Suresh uncle and Bhagya aunti are doing such a great job. I have first hand experience of their love for kids and books. I can never forget the 7th class summer holidays I spent with them, our trip to Vishaalandhra and the way Bhagya aunti let me buy all the books I wanted.. I still have a few of them with me here in the US.

    The other day my lil Ananya(21 months old) opened ‘Veekhsnam’ magazine and started saying ‘a aa e ee u oo’ .. gosh, I was amazed at the way she recognized the difference between English and Telugu, until then she was looking into some english book and saying gibberish. Since then I was researching to buy Telugu books for kids.. and never knew that I was searching with closed eyes.. Poornima and Soumya, can’t thank you enough for your great effort and sending this light my way.. I am going order books from manchi pustakam.

  8. పుస్తకం.నెట్ ఖాతాలో కలిగిన అనుభవాలు… « sowmyawrites ….

    […] గురించి పుస్తకంలో రాసిన వ్యాసం ఇక్కడ చదవొచ్చు. వీళ్ళిద్దరూ చాలా చిన్న […]

  9. telugu4kids

    “తరవాత్తరవాత” ఎప్పుడో కాదు, ఇప్పుడే 🙂

    చేసే వారినే అడుగుతాం కదా.
    అందుకే మంచి పుస్తకం వారికి విజ్ఞప్తి.
    అందులో నేను చెయ్యగలిగేది ఏమైనా ఉంటే నాకూ సంతోషమే!

    అనువాదాలతో పెరిగిన తరం వారు, వారి తర్వాతి తరం వారి కోసం చేసే ఆలోచన, ప్రయత్నం ఇది.

  10. telugu4kids

    కామేశ్వర రావు గారూ,
    నీతి కథలు వద్దనటం లేదు. “ఈ కథకు ఇదే నీతి” అని చెప్పినట్లు కాకుండా, పిల్లలు చదివాక వారికే బోధపడేటట్లు ఉంటే బావుంటుంది అని చెప్పినట్లనిపించింది సురేశ్ గారు.
    ఇక మన దగ్గర నీతి పద్యాలు, కథలు, చాలా ఉన్నాయి. అవి మనకు గర్వ కారణం కూడా.
    అవే కాకుండా ఇంకే కథలైనా కావాలనుకుంటే వేరే భాషలనుంచి అరువు తెచ్చుకున్నవి కాక నేరుగా తెలుగులో వచ్చినవి కంపించవే అని బాధ.
    రష్యా కథల అనువాదాలు పిల్లలు చాలా ఇష్టపడతారు, అందులో చెప్పకుండానే అర్థమయ్యే విలువలు, నీతులు కూడా ఉంటాయి.
    ఇది రష్యను కథే అనుకుంటా. మంచిపుస్తకం వారి కేటలాగులో కనిపించింది.
    నేను చిన్నప్పుడు చదివింది. కోడి పిల్ల బాతు పిల్ల చేసిన ప్రతి పనినీ “Me too” అంటూ చేస్తుంది. మరి బాతు పిల్ల ఈదగలదు. కోడి పిల్లో?
    వీలైతే ఇంకో టపా రాస్తాను నా ఆలోచనలతో.
    తెలుగు4కిడ్స్ పనులు చాలా ఉన్నాయి.
    చెప్పాలనీ ఉంటుంది, చేసి చూపించాలనీ ఉంటుంది.
    సమయానుకూలంగా ఆలోచనలు పంచుకుంటాను.

    ఈ లోగా మాలతి గారి సహాయంతో ఒక సామెత కథ తయారు చేశాను.
    మా పిల్లలు పాల్గొన్నారు. చూసి అభిప్రాయాలు తెలిపితే తెలుగుకీ పిల్లలకీ ఉపయోగపడుతుంది.
    నేను రాయబోయే వ్యాసాలకీ ఉపయోగకరంగా ఉంటుంది.

    http://telugu4kids.com
    త్వరలో సామెత కథల శీర్షిక చేరబోతోంది, మాలతి గారు అందించిన ఇంకొన్ని కథల సాయంతో.
    నా మాటలలో చెప్పిన పాత కథలు ఇక్కడ:
    http://telugu4kids.com/stories.aspx
    నా అనుభవాలూ, ఆలోచనలూ తార అనే అమ్మాయి ద్వారా చెప్పించిన కథలు ఇక్కడ.
    http://telugu4kids.com/Taara.aspx

  11. Ruth

    చాలా మంచి పోస్ట్ ! అనువాదాలో, అచ్చతెలుగో ఏదో ఒకటి, తెలుగులో పిల్లలకు పుస్తకాలంటూ ఉంటె తరవాత్తరవాత మిగతా అన్నీ వస్తాయి. ముందు ప్రయత్నం ముఖ్యం కదా… నాకు సంబంధించి, అనువాదాలైనా పరవాలేదు అసలంటూ తెలుగులో పుస్తకం ఉంటే చాలు.
    మీకు, ఇంత మంచి పని చేస్తున్న మంచి పుస్తకం వాళ్ళకూ నా అభినందనలు.

  12. కామేశ్వర రావు

    చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది.

    ప్రింటు పుస్తకాలతో పోలిస్తే, డిజిటల్ పుస్తకాల ప్రచురణ ఖర్చు తక్కువ కాబట్టి, వాటిని పిల్లలకి అందుబాటులోకి తే గలిగితే బాగుంటుంది. కొన్ని కంప్యూటర్లతో Digital Library లాంటివి పెట్టగలిస్తే పిల్లలు వచ్చి కొంచెం సేపు కూర్చుని చదువుకోడానికి వీలవుతుంది.

    కథల విషయంలో, ఆహ్లాదం ప్రధానమని నేను ఒప్పుకుంటాను. కాకపోతే కొన్ని ప్రాథమిక విలువలని మనసులో పెంపొందించడం చిన్న పిల్లలప్పుడే (పదేళ్ళలోపే) సాధ్యమవుతుందని అనుకుంటాను. అది అవసరం అని కూడా నా అభిప్రాయం. ఏ విలువల పునాదీ లేకపోతే జీవితాల్లో గందరగోళం, డొల్లతనం ఏర్పడతాయి. ఇవందరికీ పాత కాలం ఆలోచనల్లా అనిపిస్తాయేమో కాని నాకవి సమంజసం అనిపిస్తున్నాయి.

  13. కొత్తపాళీ

    చాలా మంచి పని, బాగా రాశారు కూడా. ప్రూఫ్ రీడింగు ఎంత కష్టమో తెల్సుకదా మీ యిద్దరికీ, అందుకనే కాబోలు ఈ వ్యాసంలో అప్పుతచ్చు లెక్కువయ్యాయి.
    అన్నట్టు ఈ సురేశ్ గారిని నేను వాసన్ లో కలిశాను 2001 ప్రాంతాల్లో ననుకుంటా.

  14. గరికపాటి పవన్ కుమార్

    మంచి పుస్తకం వెబ్ సైట్ చూసి, ఆమెరికా నుండి ఫోన్ చేసి దాదాపు 30 పుస్తకాలు తెప్పించుకొని చదివి ఆనందిస్తున్నాను. భాగ్యలక్ష్మి గారూ, సురేష్ గారు చాలా తొందరగా స్పందించి, అమెరికాకు పుస్తకాలు పోస్ట్ చేసారు. ఈ పుస్తకాలు చాలా బాగున్నాయి, ధర కూడా అందుబాటులో ఉంది. బళ్ళో గ్రంధాలయలలో పెట్టే మార్గమేమన్నా ఉంటే బాగుంటుంది.

    భాగ్యలక్ష్మి గారూ, సురేష్ గార్లకు ఇంత గొప్ప పనికి శ్రీకారం చుట్టినందుకు అభినందనలు.

    సౌమ్య, పూర్ణిమ ఎక్కడెక్కడి కృషిని వెలుగులోకి పట్టుకొస్తున్నారు, అభినందనలు.

    ఇట్లు
    గరికపాటి పవన్ కుమార్

  15. మెహెర్

    మంచి ప్రయత్నం. మంచి ప్రెజెంటేషన్ కూడా. ఇంటర్వ్యూలాగ కన్నా ఈ పద్ధతే బాగుంది. ఫోటోలు ఇంకా ఆకర్షణ తెచ్చాయి.

    >>> కాని నల్గొండలో చిన్న పిల్లలు చిరిగిపోయిన, నలిగిపోయిన ఐదు రూపాయల కాగితాలను, చిల్లరను పట్టుకొచ్చి, “ఐదురూపాయల పుస్తకం కావాలి!” అంటూ అడగడం మొదలెట్టారు. ఐదు రూపాయాలకి వచ్చే పుస్తకాలు మీకు కాదు నాన్నా! అని చెప్తున్నా వినరే! వాళ్ళని చూస్తుంటే ముచ్చటేసింది. బహుశా, ఒకడు పుస్తకం కొనుక్కున్నానని చెప్తే మిగితా అందరూ కూడా కావాలనుకున్నారేమో, నా దగ్గరా ఉంది పుస్తకం అని చూపించుకోడానికి.”

    బాగుంది. 🙂 ప్రభుత్వ లైబ్రరీల విషయంలో చెప్పింది నిజం. అలాగే పిల్లల కథల్లో నీతుల గురించి చెప్పింది కూడా. నీతుల కన్నా ఆహ్లాదం ముఖ్యం. వాళ్ళని మున్ముందు చుట్టుముట్టబోయే ప్రపంచంలోకి enchant చేసేవిగా వుండాలి.

    btw…

    >>> పుణుక్కోవడం మొదలెట్టాను

    ఈ “పుణుక్కోవడం” పదం విని నవ్వొచ్చింది. ఇది సాధారణంగా “అమ్మ”లు విసుక్కునే సందర్భాల్లో ఎక్కువ వాడే పదం, చేతులూరకుండక అస్తమానం ఏదో ఒకటి కెలికే పిల్లల్నుద్దేశించి. ఇక్కడికి కూడా అక్కణ్ణించే దిగుమతయ్యిందేమోనని ఎందుకో నా బలమైన అనుమానం. 😛

    >>> పెద్ద పనులు చేయడానికి చిన్న చిన్నగా ప్రయత్నిస్తే చాలని అనిపించింది.

    నిజం.

    (కామేశ్వర్రావు గారి పోస్టుకి లింకు ఇస్తే బాగుంటుంది.)

  16. telugu4kids

    పుస్తకం వారికి అభినందనలు.
    ఇలాంటి పని మీరే చెయ్యగలరు.

    కొత్తపల్లి వారి గురించి కూడా పరిచయం చేస్తామంటున్నారు. ఎదురు చూస్తున్నాను.

    మంచి పుస్తకం వారితో కలిసి పిల్లల కోసం మంచి కథలు, వారి పుస్తకాలకు తగిన వస్తువులూ, నేరుగా తెలుగులోనే తేవడానికి brainstorming చెయ్యాలని ఉంది.

    అనువాదానికి సిద్ధమని భాగ్యలక్ష్మి గారిని సంప్రదించాను చంద్రలత గారి పోస్టు చూసి.
    పిల్లల పుస్తకాలకు సంబంధించి కూడా ఆలోచనలు ఉన్నాయి అని తెలిపాను. బహుశా నా ఉద్దేశం సరిగా తెలపలేక పోయానేమో. పిల్లల పుస్తకాలు, ముఖ్యంగా కథల గురించి నా ఆలోచనలు సురేశ్ గారి ఆలోచనలకు దగ్గరగా ఉన్నాయనిపిస్తోంది. ప్రస్తుతానికి నేను ఆశించే ప్రయోజనం brainstorming మాత్రమే. పరవాలేదనుకుంటే సంప్రదిచంచగలరు.

Leave a Reply