వెంటాడే, వేటాడే రెండు నవలలు..

గాయమయ్యినప్పుడు కట్టు కట్టుకొని, అది మానే వరకూ జాగ్రత్త వహించాలన్నది, బుద్ధి పని చేస్తున్నవాడికి కొత్తగా చెప్పక్కరలేదు. కానీ, జీవితంలో కొన్ని phases వస్తాయి. వాటిలో, గాయాన్ని డీల్ చేసే విధానం దాన్ని మాన్పటం కాదు, దానితో సహవాసం చేయటం.  బాధిస్తున్న పన్నుని ఇంకా నొక్కి పెట్టడం, బెణికిన చేతిని మరింతగా కదల్చడం, రక్తం ఒడ్డుతున్నా దాన్ని ఆపే ప్రయత్నం చేయకపోవడం కొన్ని సార్లు తప్పనిసరి అవ్వచ్చు. పీడకలల్ని తప్పించుకోడానికి నిద్రను ఆశ్రయించాల్సి రావొచ్చు. Sometimes, the only way to heal is to keep bleeding.

ఇలా మీకెప్పుడూ అనిపించకపోతే, బహుశా, నేనిప్పుడు పరిచయం చేయబోతున్న పుస్తకాలపై ఆసక్తి కలగకపోవచ్చు. ఈ రెండు నవలల్ని పరిచయం చేయ్యాలని చాలా కాలంగా అనుకుంటున్నాను. గత ఏడాది చదివిన పుస్తకాల గురించి రాసేటప్పుడు, వాటి ప్రస్తావన లేకుండానే ముగించాల్సి వచ్చింది. కారణం? అవి నాకెంత ముఖ్యమో, ఎందుకు ముఖ్యమో తేల్చుకోలేకపోవడం వల్ల. ముక్తసరిగా వాటిపై ఓ రెండు ముక్కలు రాయడానికి అప్పుడు మనసొప్పలేదు. ఇప్పుడు ప్రయత్నిస్తున్నాను.

Map of the Invisible World.

కొన్ని పశ్నలు అడుగుతాను, వాటిని చదువుతున్నప్పుడే జవాబులు కూడా చెప్తూ ఉండండి.

౧. మీరు ఏ దేశానికి సంబంధించిన వారు?
౨. మీ తల్లిదండ్రులెవరు?
౩. మీ తోబుట్టువుల పేర్లు?

ఒకట్రెండు తరగతుల్లో ఒకట్రెండు మార్కులకి రాసిన సమాధానాలు. ఇప్పటికీ ఎవరికన్నా పరిచయం చేసుకోవాల్సి వచ్చినప్పుడు మాత్రమే చెప్పే సమాధానాలు. ఈ సమాధానాలు ఎంత తేలిగ్గా ఇవ్వగలిగితే అంత అదృష్టవంతులని నా అభిప్రాయం.

ఫలానా దేశం అని ఎలా చెప్పుకుంటాం? ఆ దేశ సరిహద్దుల్లో ఉన్న భూభాగంలో పుట్టినందుకా? పుట్టడంతో సరిపోతుందా? పుట్టింది ఎక్కడైనా మరో దేశాన్ని మనసా వాచా కర్మణా ఇంటిగా భావించకూడదా? మారుతున్న రాజకీయ పరిస్థితులు పాత సరిహద్దులను చెరుపుతూ, కొత్తవి గీస్తూ ఉంటే, సగటు మనిషి తన దేశాన్ని ఎలా ఎన్నుకుంటాడు? అసలు అతనికి ఎన్నుకునే అవకాశం ఇస్తుందా? అలాంటప్పుడు ఆ సామాన్యడి గతి ఏంటి? అలాంటి మనిషి కథను చెప్పారు ఈ నవలలో.

దత్తత తీసుకున్నవాడు కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటున్నా, కన్నవాళ్ళనీ, తోబుట్టువునీ కల్సుకోవాలని మధనపడుతూ ఉండే టీనేజర్ కి తన దత్త తండ్రీ దూరమయ్యిపోతే? ఆ పసివాడు ఏం చెయ్యగలడు? తండ్రి కోసం అతని అన్వేషణే ఈ నవల మూలం.

క్షణ కాలం కళ్ళు మూసి, మాయ చేసి తనకన్నా చిన్నవాడైన తోబుట్టువుకి కలకాలం దూరం చేసిన కుటుంబాన్ని తన కుటుంబంగా భావించాల్సి వచ్చి, వాళ్ళతో జీవిస్తూ, తోబుట్టువు జ్ఞాపకాలు పీడకలలా వేటాడుతుంటే పరాయి దేశం, తనని దత్తత తీసుకొన్న తల్లిదండ్రుల కలల కోసం పాటుపడలేక, వారిని నిరాశపర్చలేక చస్తూ బతికే ఓ యువకుని కథ, ఈ నవల.

ఇంతటి సున్నితమైన కథాంశాలను ఒక్క నవలగా మల్చటంలో రచయిత అద్భుతమైన ప్రజ్ఞ కనబరిచారు. పెనవేసుకుపోయిన జీవితాలను, కాలగర్భంలో కల్సిపోతున్న బంధాలను, దేశ రాజకీయ పెను మార్పుల మధ్య చూపించిన తీరు అమోఘం. పట్టుకుంటే జారిపోయే, ముట్టుకుంటే ముడిపడిపోయే దారాలతో  అత్యద్భుత అల్లికను సృష్టించడం లాంటిదీ రచన. (నవల మధ్యలో మాత్రం ఇంతటి కళాకారుడు చరిత్ర పాఠం చెప్పే టీచరవ్వడం నాకు నచ్చలేదు.) ఇండోనేషియాలో జరిగిన రాజకీయ మార్పులను దృష్టిలో ఉంచుకొని, అప్పటి సామాన్య జీవుల వ్యధకు అద్దం పట్టడానికి చేసిన ప్రయత్నం. ఆద్యంతం ఆసక్తికరంగా చదివిస్తుంది. అంతకన్నా ఎక్కువ ఆలోచింపజేస్తుంది.

చర్మపు రంగును చూపించో, మాట్లాడే భాష కోసమనో, ప్రాంతీయతనో – ఇలాంటి వాటిని ఆధారం చేసుకొన అల్లకల్లోలాను సృష్టిస్తున్నవారితో తలబొప్పి కట్టుంటే, దాని మీదే ఈ రచన మరో రాయి గట్టిగా విసురుతుంది. చుట్టూ జరిగేవాటిని గురించి మనది కాదన్నట్టు దులుపుకుపోయి, తలుపు మూసుకొని పుస్తకం పట్టుకుంటే, కొన్ని వేల ప్రశ్నలను గుమ్మరించి పోతుంది. రక్తం కారుతున్న గాయాన్ని దాచుకుంటుంటే, ఇదొచ్చి గాయాన్ని మరి కాస్త పెంచి పోతుంది.

నవల పేరు చదవగానే, ప్రపంచానికి తెలీని ద్వీపాలని పరిచయం చేస్తారు కాబోలనని అనుకున్నాను. మనకు తెలీని ప్రపంచాన్ని కాదు, మనం విస్మరించే ప్రపంచాన్ని కళ్ళముందు నిలుపుతుంది. వెంటాడే, వేటాడే పుస్తకాల్లో ఇదొకటని ఖచ్చితంగా చెప్పగలను.

ఈ పుస్తకంపై మరి కొన్ని అభిప్రాయాలు:

Neel Mukherjee’s take

Guardian’s Take

The Solitude of the Prime Numbers.

అసంఖ్యాకమైన అంకెల్లో, Prime Numbers కి తమదైన ప్రత్యేకత ఉంది. అవి అఖండమైనవి. మరి వేటి చేతా విభజింపబడపు – other than by one and itself. ఇందులో మళ్ళీ ట్విన్ ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి – ఒక అంకె దూరంలో రెండు ప్రైం నెంబర్స్, ఉదా: 11, 13.

ఇప్పుడు వీటిని ఆధారంగా తీసుకొని ప్రేమకథ చెప్తే? అంటే, పదకొండెళ్ళి పదమూడిని ప్రపోజ్ చేసిందనే ఫాంటసీ కథ కాదు.

ప్లాటో థియరీ ఏదో ఉంటుందే.. సృష్టి ఆదిలో ఆడ మగా కల్సిన మనిషి ఉండేవాడని, ఆతని బలాన్ని తట్టుకోలేక దేవుళ్ళు అతడిని ఆడ-మగగా విభజించి, విడిదీసిన మరో భాగాన్ని వెతుక్కోడమే జీవన పరమావధిగా పెట్టారని. అదే “ప్రేమ” రూపంలో మనిషిని ఆక్రమించుకున్నదనీ. ఇందులో ఎంత నిజమున్నదన్నది అప్రస్తుతం. తాము అసంపూర్ణమనీ, ఆ మిగితా సగాన్ని వెతికి పట్టుకునే వరకూ శాంతించని వారిలా కొందరుంటారు. బహుశా, ప్రపంచంలో ప్రేమికుల్లో వీళ్ళదే అత్యధిక భాగం వీళ్ళదే అనుకుంటాను. “ప్రేమ” పేరుతో మార్కెట్ అయ్యే పుస్తకాలూ, సినిమాలూ అన్నీ వీరి గాథలే!

తమను తాము పరిపూర్ణంగా భావించి మరో ప్రాణికి తమలో చోటు కల్పించడానికి, తమని తాము చీల్చుకొని వారికి ఆతిధ్యం ఇవ్వాల్సిన వాళ్ళూ ప్రపంచంలో ఉంటారని గుర్తుచేసే అరుదైన, అపురూపమైన రచనల్లో ఈ నవల ఒకటి.

ఒక టీనేజ్ జంట. జనజీవన స్రవంతిలో కలవలేని వాళ్ళు. దుష్టులూ, దుర్మార్గులూ అని కాదు. ప్రపంచ రీతుల్ని పాటించకపోతే వెలివేయబడతామనే స్ఫృహ లేని వాళ్ళు. కలుసుకుంటారు. ఒకరి పై ఒకరికి అమితమైన ప్రేమ ఉన్నా, దాన్ని లోకపు తీరులో ప్రకటించలేక, తమలోనే దిగమింగుకొని, పక్కనే ఉంటున్నా, ఎప్పటికీ ఒక్కటి కాలేని వారి కథ!  ఈ కథని రెండు ముక్కల్లో చెప్పాలంటే..

ఫాస్లే భీ ఐసే హోంగే యే కభీ సోచా న థా! (దూరాలు ఇలా కూడా ఉంటాయని ఎప్పుడూ అనుకోలేదు)
సామనే బైఠా థా మెరాతో నా థ! (నా యెదుటే కూర్చొని ఉంది కాని నాది మాత్రం కాదు)

చెప్పాలనుకున్న కథే విభిన్నం అనుకుంటే, కథను నడిపించిన తీరు – ప్రైం నెంబర్స్ తో తీసుకొన్న పోలికను నిలబెడుతూ కథనం సాగించిన తీరు, మెచ్చుకోదగ్గది. పుస్తకం చదివేటప్పుడు ఏవో కొన్ని నచ్చిన వాక్యాలని అండర్‍లైన్ చేసుకొని, పుస్తకం అయ్యాక “బాగుంది” అనుకుంటూ మూసేశాను. పుస్తకాన్ని అయితే మూయగలిగాను కానీ, ఇప్పటికీ దీని తాలుకూ జ్ఞాపకాల నుండీ, ఆలోచనల నుండీ తప్పించుకోలేకపోతున్నాను. చదివేటప్పుడే నరనరాన్ని ఉత్తేజితం చేసే వచనం లేకపోవచ్చు. మెల్లిగా చేరి, సున్నితంగా ఇంకుతూ, మొత్తానికి నాలో నిల్చిపోయింది.  అదీ కాక, కథలో ఎమోషనల్ కంటెంట్ ఎక్కువైనా రచయిత పాత్రల మనోభావాలన్నీ పాఠకుని మీద కుమ్మరించడు. అవ్వన్నీ పాఠకుని ఊహకే వదిలేస్తాడు. మీరు కానీ, ఆ సన్నివేశం పాత్రల మనోసంఘర్షణని గుర్తించలేకపోతే, బహుశా, ఇది మీకు ఒక పేలవమైన రచనగా అనిపించచ్చు.

“The Solitude of Prime Numbers asks, can we ever be whole when we’re in love with another? And how much of ourselves do we give away?”

ఈ ప్రశ్న సమాధానానికి ఉన్న ప్రాముఖ్యత తెల్సినవాళ్ళకి ఈ రచన నచ్చుతుందనే నమ్మకం.

దూరమయ్యే కొద్దీ దగ్గరవుతూ, దగ్గరయ్యే కొద్దీ దూరంగా జరిగిపోతు, వెరసి ఇద్దరి మధ్యా దూరం ఎప్పుడూ ఒకేంత ఉండడం అనుభవానికి రావాలంటే ఈ నవల చదవటం తప్పనిసరి. గతమంతా సునామి అలై కళ్ళెదుట నిల్చి, మన మీద విరుచకపడక చుట్టూ గోడగా మారి, అందులో మనల్ని నిల్పే రచన ఇది.

ఈ పుస్తకంపై మరి కొన్ని అభిప్రాయాలు:

Guardian’s Take

Amazon link

You Might Also Like

4 Comments

  1. Independent

    “కానీ, జీవితంలో కొన్ని phases వస్తాయి. వాటిలో, గాయాన్ని డీల్ చేసే విధానం దాన్ని మాన్పటం కాదు, దానితో సహవాసం చేయటం. బాధిస్తున్న పన్నుని ఇంకా నొక్కి పెట్టడం, బెణికిన చేతిని మరింతగా కదల్చడం, రక్తం ఒడ్డుతున్నా దాన్ని ఆపే ప్రయత్నం చేయకపోవడం కొన్ని సార్లు తప్పనిసరి అవ్వచ్చు. పీడకలల్ని తప్పించుకోడానికి నిద్రను ఆశ్రయించాల్సి రావొచ్చు. Sometimes, the only way to heal is to keep bleeding”

    🙂

    పెదాల మీదకి తోసుకొచ్చిన చిరునవ్వు, ప్రతి సారీ కళ్ళ మీదకి వెళ్ళదు. చిరునవ్వుని carry చేసున్నట్లుగా కనపడే పెదాలు, నిజానికి ఇంకేదో మోస్తూంటాయక్కడ. జీవితం పెదాల మీద ఫ్లాష్ అయ్యి వెళ్ళిపోయే క్షణాలకి Smiley Icons లేవా?!

  2. Rahul

    mee experience baagundi… ipude book mottam chadveyalanundi… english books anukunta…chala practice cheyali.. eeroje e website choosanu…chala baagundi…

    Thank you for ur post…

    -Rahul

  3. మెహెర్

    చాలా బాగుంది.

  4. శ్రీనిక

    మంచి నవలలని పరిచయం చేసారనేకంటే మంచి పరిచయం చేసారనడం సబబు. కధను చదవడం, అనుభవించడం ఒక ఎత్తయితే..ఆ అనుభూతిని మరొకరికి పంచడం మరో ఎత్తు..excellent. Thankyou.

Leave a Reply