భాసకవి కృత ప్రతిమానాటకం!

యస్యాశ్చోరశ్చికురనికురః కర్ణపూరో మయూరః
భాసో హాసః కవికులగురుః కాళిదాసో విలాసః |
హర్షో హర్షః హృదయవసతిః పంచబాణస్తు బాణః
యేషాం తేషాం కథయ కవితాకామినీ కౌతుకాయ ||

కవితాకన్యక మందహాసం భాసుడని – అష్టపదులు వ్రాసిన జయదేవకవి వర్ణన. ఈ భాసమహాకవిని సాక్షాత్తూ కవికులగురువైన కాళిదాసు మాళవికాగ్నిమిత్ర నాటక ప్రారంభంలో గుర్తుచేసుకున్నాడు. అలాగే దండి, బాణ, రాజశేఖరాది కవులకు ఈ కవి వంద్యుడు.

అసలీ కవి ఎవరు? ఈయన గొప్పదనం ఏమిటి? ఈ విషయం ఆధునిక కాలంలో కొన్ని శతాబ్దాలుగా తెలియరాలేదు, క్రీ.శ.1909 లో కేరళలోని మణిలిక్కరమఠంలో మహోపాధ్యాయ గణపతిశాస్త్రి గారు ఆ మహాకవి రచనలను కనుక్కునేంతవరకూ.

గణపతిశాస్త్రి వర్యులకు మొత్తం ౧౦ హస్తలిఖిత ప్రతులు దొరికినవి. సంస్కృతంలో ఉన్నప్పటికీ, అవి మలయాళ లిపిలో లిఖించబడి ఉన్నవి. ఆ తరువాత మరో రెండు నాటకాలు తిరువనంతపురం లైబ్రరీలోనూ, మదరాసు ప్రాచ్య లిఖిత భాండాగారంలోనూ దొరికాయి. దేవనాగరి లిపి ప్రతులు లభించలేదు. ఇలా మొత్తం పదమూడు నాటకాలను శాస్త్రి గారు 1912 లో ప్రచురించారు.

ఈ నాటకాలలో ప్రతిమానాటకం ప్రసిద్ధిపొందింది. రామాయణాధారితమైనప్పటికీ కొన్ని విషయాలలో రామాయణం మూలకథకు విభిన్నంగా కొనసాగి, అద్భుతంగా నాటకీయత పోషించబడిన నాటకమిది. ఇందులో మొత్తం ఏడు అంకాలు. ఈ నాటకం తాలూకు సంస్కృత ప్రతి (ఆంగ్లవ్యాఖ్యానం) ని నేను, తెలుగు అనువాదాలను పూర్ణిమ గారు, ఆయా సాహిత్యాల మీద ఏ మాత్రం అభినివేశం లేకపోయినా, ఆసక్తి తో చదవడం జరిగింది. మేము వేగుల ద్వారా చర్చించుకున్న విషయాలు సంగ్రహంగా ఈ వ్యాసంలో పొందుపరుస్తున్నాము.

*****************************************************************************

రవి:
పూర్ణిమ గారు, ప్రతిమా నాటకం చదవడం పూర్తి చేశారా?

పూర్ణిమ: ప్రతిమా నాటకం చదవడం పూర్తి అయ్యింది. కాకపోతే, మరో సారైనా చదివితే గాని.. అందులోని కొన్ని విషయాలు ఆకళింపు చేసుకోవడం కష్టమనిపిస్తోంది.

రవి: భాసుడి నాటకాలు ఎలా బయటపడ్డాయి? వాటి వెనుక కథకమామీషు అన్న సమాచారం మీకు తెలుసా? అసలుకన్నా కొసరు మేలు అన్నట్టు, ఈ విషయాలు మరింత బావుంటాయి. మీకు అభ్యంతరం లేకపోతే, మనం ఈ నాటకం గురించి చర్చిద్దాం.

పూర్ణిమ: భాసుడు ఒక సంస్కృత కవి అని తప్పించి నాకింకేం వివరాలు తెలీవు. ఈ ఉదయం మీ వేగు చూశాక, మొన్న హైద్ బుక్ ఫేర్ లో సాహిత్య అకాడెమి వారి మోనోగ్రాఫ్ “భాసుడు” – రచయిత: వెంకటాచలం అనే పుస్తకం కొన్నానని గుర్తొచ్చి ఆ పుస్తకం బయటకి తీశాను. ఓ అరగంట చదివాను. భాసుడు వెర్సెస్ కాళిదాసు అన్న టాపిక్ నడుస్తోంది. ఆ పుస్తకం పూర్తి చెయ్యాలంటే మాత్రం నాకు ఖచ్చితంగా ఓ రెండు వారాలు పడుతుంది. అందుకని భాసుడు గురించి మీకు తెల్సున్న విషయాలు మీరు చెప్పండి.. ఈ కొత్త పుస్తకం లో నాకు తెలుస్తున్న విషయాలు మీతో చెప్తూ ఉంటాను. ఈ లోపు ఈ నాటకం గురించి చర్చిద్దాం.

రవి: అనగనగా కేరళ. అక్కడ చాక్యారులనే ఓ వర్గం బ్రాహ్మణులు 2000 యేళ్ళుగా ఓ సంప్రదాయం పాటిస్తున్నారు. అది దేవాలయాలలో “కూడియాట్టం” అనే నాటకం ప్రదర్శించటం. వీరి గురించి వికీపీడియా లో సమాచారం దొరుకుతుంది. వారి ప్రదర్శనలో ముఖ్యమైనవి భాసనాటకాలు.

నవీన యుగంలో భాస మహాకవి గురించి కొన్ని వందల యేళ్ళు ఏ సమాచారం దొరకలేదు. కాళిదాసు ఆయనను మాళవికాగ్ని మిత్రంలో ప్రస్తావించాడు కాబట్టి, ఆయన కాళిదాసుకన్నా ముందు వాడని అనేకుల అనుకోలు. 1909 లో కేరళలో ఒకానొక మఠంలో భాసకవి సంస్కృత నాటకాలు మొత్తం పది “మలయాళ” లిపిలో దొరికాయట. ఆ తర్వాత మరో రెండు చోట్ల మరో మూడు నాటకాలు, వెరసి పదమూడు నాటకాలు. వీటన్నిటినీ మహోపాధ్యాయ గణపతి శాస్త్రి గారు పరిష్కరించి ప్రచురించారు

ప్రతులు మలయాళ లిపిలో దొరికాయట కదా., అక్కడ కొన్ని ఇబ్బందులు మొదలయ్యాయట.
౧. ఈ రచనలు భాసుడివి కావని కొందరు
౨. ఇవి భాసుడివే అని కొందరు
౩. ఇవి భాస మహాకవి వ్రాసిన అసలుకు కొన్ని చేర్పులు జోడించి ఎవరో మలయాళ కవి వ్రాసిన నకళ్ళు అని ఇంకొందరు. ఈ మూడవ వాదన కు ఆధారం చాక్యారులట. ఆ చాక్యారులు భాసకవి నాటకాలను వేల యేళ్ళ నుండీ ప్రదర్శిస్తున్నారు కాబట్టి, వారి ప్రదర్శనకు తగినట్టు అసలు ప్రతులు మార్చబడ్డాయని వాదన(ట).

ఏమైతేనేం అపూర్వమైన సాహిత్య భాండాగారం బయటపడింది.

పూర్ణిమ, ఇక మీ వంతు. మీరు చదువుతున్న పుస్తకాల్లో ఇంకా ఏదైనా చెప్పారా? అన్నట్టు పై విషయాలు సంస్కృత సాహిత్య చరిత్ర అన్న పుస్తకంలో చదివినవి. ముదిగంటి గోపాలరెడ్డి, సుజాతా రెడ్డి గార్ల రచన.

పూర్ణిమ: మీరు చెప్పిన విషయాలే నేను “భాసుడు” అనే పుస్తకం లో చదువుతున్నాను. మన కళాకారులు అప్పట్లో తమని గూర్చి ఏమీ చెప్పుకోకపోవటం వల్ల ఇలాంటి అనిశ్చితి ఏర్పడుతుందని రచయిత అభిప్రాయపడ్డారు. ఇరు పక్షాల వాదోపవాదాల విహంగ వీక్షణం చేసినట్టు చెప్పుకొచ్చారు. భాసుడి రచనల్లో ఉన్న కొన్నింటిని బట్టి, ఆయన ఎక్కడ పుట్టి ఉంటారు? ఏ కులం? ఏ వృత్తి? లాంటివన్నీ నిర్ధారించడానికి ప్రయత్నించారట! వీటినే ఆధారం చేసుకొని అవతలి వర్గం వారూ ప్రతికూలంగా వాదించారట.

ప్రతిమా నాటకంలో రావణుడు, రాముడితో తాను చదివిన శాస్త్రాలను గురించి చెప్తాడు కదా –  ఆ శాస్త్రాల పేర్లు బట్టి కూడా భాసుని కాలం నిర్ణయించడానికి ప్రయత్నించారట. అక్కడ పేరుకొన్న శాస్త్రాలన్నీ క్రీ.పూ. ఆరవ శతాబ్ధి ముందు ప్రాంతానికి చెందినవే కాబట్టి, భాసుడు కూడా అప్పటి వాడే అయ్యుండాలని ఒక వాదనట. ఇది నాకు కాస్త విడ్డూరంగా అనిపిస్తోంది.

అన్నట్టు చిలకమర్తి వారు రాసిన నాటకంలో ఆ శాస్త్రాల పేర్లు మాత్రమే ఉంటాయి. అసలు నాటకంలో వాటిని వర్ణించి చెప్పినట్టు ఈ భాసుని పుస్తకంలో ఉంది. మీరు చదివిన దాంట్లో?

రవి: రావణుడు ఉటంకించిన శాస్త్రాలివి. (నాటకం పంచమాంకంలో) మానవీయుడి ధర్మశాస్త్రం, మహేశ్వరుడి యోగశాస్త్రం, బృహస్పతి అర్థశాస్త్రం, మేధాతిథి న్యాయశాస్త్రం, ప్రచేతసుడి శ్రాద్ధకల్పం.  మామూలుగా యోగశాస్త్రం అంటే పతంజలి, అర్థశాస్త్రం కౌటిల్యుడు అని ప్రమాణం అనుకుంటాను. (మిగిలిన శాస్త్రాల గురించి నాకు తెలియదు). భాసకవి మహేశ్వరుడి యోగశాస్త్రం అన్నాడు కాబట్టి ఈయన పతంజలి కన్నా ముందువాడని, కౌటిల్యుడి అర్థశాస్త్రం ప్రస్తావించలేదు కాబట్టి కౌటిల్యుడి సమకాలికుడు లేదా, ముందు కాలపు వాడని వాదన అనుకుంటాను. (బృహస్పతి అర్థశాస్త్రం గురించి భారతం శాంతిపర్వంలో ఉందట. అలాగే కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో ప్రస్తావించారట). పాణిని కన్నా ముందువాడు అని మరో వాదం. కారణం – ఈ నాటకంలో అపాణినీయ ప్రయోగాలు ఉన్నాయని ఎం. ఆర్. కాలే గారు అక్కడక్కడా (కాస్త నిర్దాక్షిణ్యంగానే) వివరించారు. (నేను చదివిన పుస్తకం ఎం. ఆర్. కాలే గారు పరిష్కరించి, ప్రకటించిన సంస్కృతనాటకం, తాత్పర్య, వ్యాఖ్యాన సహితం, సంస్కృత టీక)

(నాకూ విచిత్రంగానే ఉంది ఈ వాదన. అయితే చరిత్రను శాస్త్రీయంగా అధ్యయనం చేసి, వాదనలు చేసే వారి పద్ధతులు మనకు తెలీవు.)

భాస కవి గురించి, మీరు చదివింది ఇంకా చెప్పాలి.

పూర్ణిమ: నేను చదువుతున్న “భాసుడు” అనే పుస్తకాన్ని ఇంగ్లీషులో వి. వెంకటాచలం రాయగా, తెలుగులోకి పుల్లెల శ్రీరామ చంద్రుడు అనువదించారు. ముందుమాటలోనే, భాసుడిని సామాన్యులకి పరిచయం చేసే ప్రయత్నమే ఈ పుస్తకం అని వివరించారు.

ఇందులో భాసుని పుట్టు పూర్వోత్తరాలనూ, ఆయన రచనలనూ టూకీగా పరిచయం చేశారు. అంటే, భాసుడొక సంస్కృత కవి అని తప్పించి మరే వివరాలూ తెలీయని  వారికి, అధిక సమాచార భారం లేకుండా, భాసుని చరిత్ర తెల్సుకోడానికి వీలుగా ఉంటుంది. తేట తెలుగు. అక్కడక్కడా శ్లోకాలను ప్రస్తావించినా, వెంటనే భావము కూడా ఇవ్వటం వల్ల చదవటం హాయిగా సాగిపోయింది.

ఇహ పుస్తకంలో ఏమున్నాయని చెప్పటం మొదలెడితే, మీరు చెప్పినవే పునరావృతం చెయ్యవలసి వస్తుంది. భాసుని గురించి వివరాలు కనుక్కోడాన్ని “భాస సమస్య” అంటారట. భాసుని గురించి ప్రస్తుతం అనుకునే విషయాలన్నీ కూడా ఏవీ ఖచ్చితంగా తెలీవు, అన్నీ ఊహాగానాలే. ఇది చదివి నాకు ఏమనిపించిందంటే, గట్టిగా వాదించేవాడు ఒకడుండాలే కానీ, ఇవే ఆధారాల ఆసరాతో అసలు భాసుడనే వాడే పుట్టలేదు, కవిత్వం అటుంచి అని కూడా వాదించవచ్చేమో అనిపించింది. భాసుడనే కవి ఉండేవాడని నమ్మితీరుతున్నా కాబట్టే ఈ పుస్తకం పేరు, “భాసుడ”య్యింది, లేకుంటే “భాసుడని చెప్పబడే కవి” అని పేరుండేది అని ఈ పుస్తక రచయితే పేర్కొన్నారు.

మన చరిత్రను, మన కళలను భద్రపరచుకోవడంలో మనం పెద్దగా ఆసక్తి చూపమనే అనిపించింది. భాస నాటక చక్రాన్ని వెలికి తీసిన మహామనిషికి కృతజ్ఞాతాభివందనాలు చెప్పకతప్పుదు. భాసునిది నేను చదివినది ఒకటే నాటకం, అది కూడా మూల రచనున్న భాషలో చదవలేదు. అనువాదం చాలా వరకూ అందాన్ని పాడుచేస్తుంది, లేదా కనీసం అందాన్ని నిలపలేకపోతుంది అని అనడం విన్నాను. నిజమే, మూల భాషలో ఉన్న అందం,  భాషలోని సొగసు, పటుత్వం అనువాదాల్లోకి రావడం కష్టం. కాకపోతే భాషను పక్కకు పెట్టి భావాన్ని అర్థంచేసుకోవడంలో సాయపడ్డం అనువాదం చేసే రహస్యపు మేలు అని నాకనిపిస్తోంది.

అన్నట్టు, మళయాళీ వాళ్లు ఈ నాటకాలను వేస్తారనుకున్నాం కదా – అవి ఎలా ఉంటాయి? మీకేమన్నా తెల్సునా?

రవి: నాకు కొంత తెలుసు. కథకళిలో రామాట్టం, కృష్ణాట్టం, మోహినియాట్టం ఇలా రకరకాలు. కూడియాట్టం (కూడియాట్టం అంటే, కలిసి ఆడటం అని అర్థం) అనే ప్రక్రియలో ఈ భాస నాటకాలు ప్రదర్శిస్తారు. కథకళి నృత్యరీతులు చూశారా? టీవీలో ప్రతిభానో అదేదో ఛానెల్ ఉంది. అందులో వస్తుంటాయి. నాటకం అంతా గానం రూపంలో ఉంటుంది. నాయికా నాయకులు, ఇతరులు మాట్లాడరు. స్టేజులో ఒకపక్క నుండి పాటలు పాడుతుంటారు. ఆ పాటలకు తగినట్టు వాయిద్యాలు. చండై అన్నది ప్రధాన వాయిద్యం. వికీ లో అనేక వివరాలు దొరకచ్చు. మలయాళ చలచిత్ర నటుడు మోహన్ లాల్ “వానప్రస్థం” అన్న సినిమాలో కథకళి కళాకారుడిగా నటించాడు.

పూర్ణిమ: నృత్యరీతులపై నాకు పెద్దగా అవగాహన లేదు. మీరు చెప్పిన పేర్లు గుర్తించగలను కానీ, అంతకు మించి సమాచారం తెలీదు. కథకళి ప్రదర్శనలు మాత్రం అప్పుడప్పుడూ చూశాను.

ఇప్పుడే తెల్సిన వార్త: “భాసుడీ నాటకానికి “ప్రతిమ” అని కాదు, “ప్రతిమా దర్శనం” అని పేరు పెట్టుంటాడ”ని ధ్రువ (ఈయనెవరో మరి?) అని అభిప్రాయపడ్డారట. ఇది కూడా ఊహే! 🙂

రవి: దొరికిన భాసుడి నాటకాలకు టైటిల్స్ లేవట. వేరే ఎక్కడెక్కడో ఈ టైటిల్స్ ఉటంకింపబడ్డం వల్లేమో,  నాటకాలకు ఆయా పేర్లు అమరాయి. భరతుడి నాట్యశాస్త్రం ప్రకారం, రూపకం పేరు నాయికానాయికలకు సంబంధించినదై ఉండాలిట (ఉదా: స్వప్న వాసవదత్తం, మాలతీ మాధవం వగైరా). ఈ నియమం కొందరు కవులు ఎంచేతో పాటించలేదు.

పూర్ణిమ: “భాసుడు” అనే పుస్తకంలో ఆయన రచనల్నీ టూకీగా పరిచయం చేశారు. రామాయణం ఆధారంగా ఆయన రెండు నాటకాలు రాశారు. “అభిషేక నాటకం” ఇంకోటి – ఇది వాలి సుగ్రీవుల యుద్ధం నుండి మొదలయ్యి, రాముని పట్టాభిషేకంతో ముగుస్తుందని ఉంది. ఇందులో పాత్రలూ, పాత్ర స్వభావాలన్నీ వాల్మీకి రామాయణం కి దగ్గరగా ఉంటాయట! ప్రతిమా నాటకంలో మాత్రం అలా లేదు అని నాకు అనిపించింది.

రవి: అభిషేకం నాటకంలో మూడు అభిషేకాలు – సుగ్రీవుడు, విభీషణుడు, రామచంద్రుడు వీరివి- వీటికి సంబంధించిన కథాకథనాలు అని చదివాను.

(అన్నట్టు ఈయన దాదాపు అన్ని నాటకాలు, 1960 చందమామలో ఒకటి తర్వాత ఒకటిగా కథలుగా వచ్చాయి. ప్రతిమానాటకం కూడా ఉంది. ఫిబ్రవరి సంచికలో)

పూర్ణిమ: మాయాలేడిని సీత అడగలేదని అర్థమయ్యింది నాకు! అంతేనా? రావణుడే, రాముడిని ఆ జింకను తెచ్చుకోమ్మంటాడు, వాళ్ళ నాన్న ఆత్మశాంతి కోసమని. లక్ష్మణుడుకి సీత బాధ్యతను అప్పగించటం, రాముని బాధాపూరిత కేక విని లక్ష్మణుని దూషించి సీత అతడిని పంపడం, పోతూ పోతూ ఆయన లక్ష్మణ గీత గీయటం అనేవి ఏవీ లేవు.

రవి: మాయాలేడి వృత్తాంతం ఇది.

దశరథుడు మరణించి ఒక యేడాది కావొస్తుంటుంది. రాముడు వనవాస దీక్షలో ఉంటూ, తండ్రికి శ్రాద్ధ కర్మలు చేయాలని తలుస్తాడు. ఆ సమయంలో రావణుడు పరివ్రాజకవేషంలో ఆశ్రమానికి వస్తాడు. అప్పుడు రావణుడికి సీతారాములు అతిథి సత్కారాలవీ చేస్తారు. రావణుడు తనకు రకరకాల శాస్త్రాలు, శ్రాధ్ధకల్పం గురించి తెలుసంటాడు. రాముడి కోరిక మేరకు శ్రాద్ధ కర్మ గురించి చెబుతాడు. శ్రాద్ధానికి పనికి వచ్చే వస్తువుల గురించి చెబుతూ,

విరూఢేషు దర్భాః, ఓషధీషు తిలాః, కలాయం శాకేషు, మత్స్యేషు మహాశఫరః, పక్షిషు వార్ఘ్రాణసః, పశుషు గౌః, … (గడ్డిమొక్కలలో దర్భలు, ఓషదులలో నువ్వులు, కూరగాయలలో కలాయం (ఇదేదో కొంకణ ప్రాంతంలోనే దొరుకుతుందట), చేపలలో తిమింగలము లేక సొరచేప (అనుకుంటాను), ….ఇలా) అర్థం ఇలా చెప్పి, హిమాలయ సానువుల్లో కాంచన పార్శ్వమనే జింక ఉందనీ శ్రాద్ధకర్మకది శ్రేష్టమనీ చెబుతాడు. అలా చెబుతూ ఆ ఆశ్రమం దాపులనే ఈ జింక పరిగెత్తుతున్న సూచన కనిపిస్తుందని, రాముడిని తొందరపెడతాడు. లక్ష్మణుడా సమయంలో బయటకు పని మీద వెళ్ళాడు. ఇక రాముడే ఆ మృగం కోసం వెళతాడు, సీతను అతిథి సేవకు వినియోగించి.

పూర్ణిమ: ఇందులో కైక పాత్రను ఉన్నతంగా చూపించారట! నాకు విభిన్నంగా అనిపించింది.

రవి: కైక పాత్ర ఉదాత్తం. అయితే ద్రౌపది లెవెల్లో ఆమె గురించి రాయడానికి లేదనుకుంటాను :-). కైక వరాల వెనుక ఆమె కుట్ర ఉండదు, ఉదాత్తత తప్ప. ఇది చివర్లో తెలుస్తుంది.

పూర్ణిమ: ప్రతిమా నాటకం – చిలకమర్తి వారిది చదివుతున్నప్పుడు, నాకందులోని తెలుగే అర్థం కాలేదు. కానీ నాటికలో కొన్ని నన్ను అమితంగా ఆకర్షించాయి. అందులో ముఖ్యంగా రాముని పట్టాభిషేకం జరుగబోతుండగా, అంతఃపురంలో సీత నారచీరలు కట్టుకోవడం. యాధృచ్చికమే అనిపిస్తూ ఉంటుంది, అయినా ఏదో బలీయమైన కారణం లేకపోలేదనీ అనిపిస్తుంది. జీవితాలన్నీ కొంత వరకూ “డ్రమాటిక్” గా మల్చబడ్డాయనిపిస్తుంది. “మతి ఎలా ఉంటే, గతలా ఉంటుంది” అంటారే – సీత నారచీరల మక్కువ కాస్త కైక రూపంలో తీరింది అనిపిస్తుంది.

కైక కోరిక, సీత కోరిక వల్లే రామాయణం అంటారుగా! అది భాసుడు నాటికకి అతకదు. ఆయన ఇందులో స్త్రీ మూర్తులను ఏ రకమైన నెగటివ్ అంశం లేకుండా తీర్చిదిద్దారు. కైక వరాలడిగినా, అది రాముని శ్రేయస్సు కోరి, దశరధుడు శాపాన్ని అనుభవించేలా చేసినట్టు చూపించి, అందాకా అందరి కోపానికి కేంద్రమైన ఆమెను ఒక్క సారిగా ఆకాశానికి ఎత్తేశాడు. అలానే లక్ష్మణున్ని మరో పని మీద బయటకు పంపి, సీత అతణ్ణి దూషించే అవకాశం తప్పించారని ఈ పుస్తకంలో రాశారు. స్త్రీలను ఏ దోషం లేకుండా చిత్రీకరించారు. అలా “ఐడియల్” గా చిత్రీకరించటం పై నాకు కొన్ని అభ్యంతరాలున్నా, భాసుని నాటకంలో మాత్రం హాయిగానే అనిపించింది.

అలానే భరతునికి అతడి తండ్రి మరణాన్ని గురించి తెలిపే ఘట్టం కూడా నాకు నచ్చింది. ముఖ్యంగా ఒక్కో దశలో ఒక్కో అమంగళాన్ని అతని చెవిన పడేసిన తీరు. ప్రతిమా నాటకం చదువుతుంటే, మరో రామాయణం ఘట్టం చూస్తున్నామన్న ఆనందంతో పాటు, భాసుడు కల్పించిన కొన్ని అంశాలూ ఆసక్తిని రేకెత్తించాయి.

రవి: కైక ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆమె గురించి. ఆమె పాత్ర ఉదాత్తమైనది. వృద్ధ దంపతుల శాపం నెరవేరడం కోసం ఆమె వరాలు అడుగుతుంది. ఇక్కడ కాలే గారి విశ్లేషణ చూడండి.

శాపం ఇది. “పుత్రశోకాత్ విపత్స్యసే”. (పుత్రశోకంతో మరణించును) ఈ శాపం ఎలానూ నెరవేరుతుంది. పనిగట్టుకుని కైక దశరథుడిని వరాలడిగి, రాముడిని అడవులకు పంపి, వియోగం కలిగించాల్సిన అవసరం ఏమిటి? ఇది ప్రశ్న.

కాలే గారేం చెబుతారంటే, ఒకవేళ రాముడు అడవులకు వెళ్ళకపోతే, ఆయనకు పట్టాభిషేకం చేసేసి, దశరథుడు వానప్రస్థాశ్రమం వెళతాడు.
(శైశవేభ్యస్థ విద్యానాం
యౌవనే విషయైషిణాం
వార్ధక్యే మునివృత్తీనాం
యోగేనాంతే తనుత్యజామ్
అని ,కాళిదాసు రఘువంశంలో. అంటే పుత్రుడికి పట్టాభిషేకం చేశాక, దశరథమహారాజు వానప్రస్థాశ్రమానికి వెళ్ళడం వంశాచారం.) అప్పుడు దశరథుడికి పుత్రశోకం కలుగాలంటే, రాముడు మరణించే సంభావ్యత నిజమవాలి. (ఈ రెండో case లో రాముడు మరణిస్తేనే దశరథుడికి పుత్రశోకం కలుగుతుంది.) అలా కాకూడదని, కాస్త తక్కువ ప్రమాదంతో గట్టెక్కాలని కైక వరాలడుగుతుందట!

పూర్ణిమ:
కాకపోతే కైక “నోరుజారి” ఫద్నాలుగు సంవత్సరాల వనవాసం అంది అన్నది మాత్రం కాస్త అసమంజసం గా లేదూ?

రవి: :-). ఇలాంటి నోరుజారే సన్నివేశాల్లో కొన్ని కొన్ని కావ్యాల్లో సరస్వతి అమ్మవారు రంగప్రవేశం చేస్తుంటారు. ఉదాః కుంభకర్ణుడు వరమడిగేప్పుడు. ఇక్కడ నాకు ఔచిత్య రహితంగా అనిపించలేదు. నాటక సాహిత్యంలో ఆ మాత్రం నాటకీయత అవసరమేమో.

ఈ నాటకంలో భరతుడు అచ్చు వాళ్ళ నాన్న గారి పోలికలతో ఉంటాడట. ప్రతిమా మందిరంలో దశరథుడి విగ్రహం అచ్చు భరతుడిలానే ఉంటుందట. దృశ్య రూపంలో ఈ నాటకం ప్రదర్శించేప్పుడు ఈ విషయం కాస్త రక్తి కట్టించే అవకాశం ఉంది. అలానే రాముణ్ణి కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు, రాముడు “ఎవరబ్బా ఈయన, అచ్చు మా నాన్న లా మాట్లాడుతున్నాడ”ని అనుకుంటాడట. ఇవి పైకి చిన్న విషయాలలాగ ఉన్నా, ఈ నాటకం చదివేప్పుడు దృశ్యాలను మన కళ్ళ ముందు ఊహించుకుంటే, గొప్ప రసానుభూతి కలుగుతుందని నా నమ్మిక.

కాకపోతే నాకిక్కడో భయంకరమైన డవుటు వస్తోంది. రామాయణ మహాభారతాలు, అప్పటి కాలంలో జనాలకి ఎలా చేరువయ్యాయి? –  మహాకావ్యాలుగానా? పురాణాలుగానా? చరిత్రగానా? జానపద కథల్లానా?

రవి: నా వరకూ ఈ ప్రశ్న irrelevant  అనిపిస్తుంది. ఎలా (how) అనేది ముఖ్యం కాదు. రామాయణ మహాభారతాల వల్ల ప్రజలకు చేరవలసిన సందేశం ఉందన్న విషయం సమాజపు hierarchy లో ఉన్న పెద్దలందరూ ఆమోదించిన విషయం. అందువల్ల ఇవి రకరకాల forms లో వేళ్ళూనుకోవడానికి ఆస్కారం ఏర్పడి ఉండి ఉండవచ్చు.

భాస మహాకవి ప్రతిమా నాటకం కూడా మౌఖికంగానే వ్యాప్తి చెందిందేమో. కాళిదాసు కాలంలో కూడా ఈ నాటకం స్టేజి మీదా, ఆలయాల్లో ప్రదర్శించబడిందేమో. ఒకవేళ అలా జరిగి ఉంటే, ఆ నాటకం ప్రతులు ఎవరికి అనుకూలమైన లిపులలో వారు (నాటకాలాడే  communities) తమ సౌలభ్యం కోసం వ్రాసుకుని ఉండే అవకాశమూ త్రోసిపుచ్చదగింది కాదు. (దీనికి ఉదాహరణ చాక్యారులు.)

పూర్ణిమ: వాల్మీకి రామాయణం నుండి ఇంత విభిన్నమైన కథనాన్ని నాటకంగా జనాల వద్దకు తీసుకెళ్లడం నిజాలను వక్రీకరించనట్టు కాదు అనుకుంటే, అప్పుడు రామయణభారతాలు మన చరిత్ర కానట్టేగా? అవి కేవలం కావ్యాలే?!

రవి: ఇది కూడా irrelevant. అప్పుడెప్పుడో బ్లాగు చర్చల్లో పప్పు నాగరాజు గారు multidimensionality  అన్న పదం వాడారు.ఒకే కావ్యం ద్వారా అనేక విషయాలను చెప్పడానికి, ముఖ్యంగా ఏవైతే సమాజానికి పనికొస్తాయనుకున్నారో ఆ విలువలు బోధించడానికి ఈ కావ్యాలు ఉద్భవించి ఉండవచ్చు. history ని record  చేసే మనస్తత్వం మన పూర్వీకులకు లేదు. రాముడు, రావణుడూ, లంకా ఇవి (nouns) ముఖ్యం కాదేమో. ఏం జరిగింది? ఏ ఆదర్శాలు పాటించదగ్గవి? ఇవి ముఖ్యం.

పూర్ణిమ: మన చర్చకి అవి బహుసా.. అసంబద్ధమైన ప్రశ్నలేమో. కాని పుస్తకం చదివాక, నాకు కలిగిన ఆలోచనలు, వాటి నుండి పుట్టిన ప్రశ్నలు.
చిలకమర్తి వారు రాసిన పద్యాలు అధ్యయనం చేద్దామని మొదటి పద్యం దగ్గరే చతికిలపడ్డాను.

అప్రతిముడు రావణవైరి యావిభీష
ణాత్మసీతా ధవుడు లక్ష్మణాన్వితుడు.
భరతుడు సుమంత్రుష్టుడు పడతి గూడి
పాచు సుగ్రీవ రాముండు ప్రతియుగంబు.

బజ్ పుణ్యామా అని కొన్ని వివరాలు తెల్సాయి: అప్రతిముడు అంటే అలాంటి వాళ్ళు ఇక ఎవరూ లేరని, విభీషణాత్మ అంటే విభూషణుని ఆత్మ అని ఒక అర్థం, భీషణమైన ఆత్మ కలవాడని మరో అర్థం. ఇక్కడ  రావణునితో శత్రుత్వం వల్ల ఈ విభీషణత్వం (అంటే శత్రు భయంకరుడని) వచ్చిందని అన్వయించుకోవాలి. భరతుడు అంటే భరించేవాడు (రక్షణ భారాన్ని నిర్వహించేవాడు) అనే అర్థం ఇక్కడ తీసుకోవచ్చు. పాచు అంటే రక్షించు,అభయమిచ్చు అని. “ప్రతిమ” అని నాటకం పేరుని శ్లోకంలో వచ్చేట్టుగా చెయ్యడాన్ని ముద్రాలంకారం అంటారు. సుమంత్రుష్టుడు అంటే మంచి సలహాలను పాటించేవాడు, సుగ్రీవ అంటే అందమైన కంఠం కలవాడని. లక్ష్మణాన్వితుడు అంటే శుభశకునాలను తోడుగా ఉన్నవాడని. “ప్రతిమ” అని నాటకం పేరుని శ్లోకంలో వచ్చేట్టుగా చెయ్యడాన్ని ముద్రాలంకారం అంటారు.

ఇది అంత మంచి అనువాదం కాదన్న అభిప్రాయం కూడా వినపడ్డది. దీని సంస్కృత మూలం ఏంటి?

రవి: మూలం.

సీతాభవః పాతు సుమన్త్రతుష్టః సుగ్రీవరామః సహలక్ష్మణశ్చ |
యో రావణార్యప్రతిమశ్చ దేవ్యా విభీషణాత్మా భరతో2నుసర్గమ్ ||

విభీషణాత్మ – (సంస్కృతంలో ధవుడు లేదు) – వి – ఉపసర్గ (prefix) విశేష సూచన సంస్కృతంలో. విభీషణాత్మా – విశేషంగా భీషణమైన ఆత్మ గలవాడు. ఇప్పుడు “రామ” కొద్దాం – రమయతీతి రామః – ప్రజల మనసులను రంజింపజేయువాడు రాముడు. రాముడు – విభీషణాత్మా – ఒకదానికొకటి సరిపోవట్లేదు! రంజింపజేసేవాడు భీషణుడేట్లా అవుతాడు?

కాలే గారి మాట ఇది.

Rama became Ravana’s enemy because his wife is kidnapped by him. Rama as his name signifies was not విభీషణాత్మా but the account of the insult offered to him by Ravana and slew the RakShasas mercilessly.

పూర్ణిమ:– అదే శ్లోకానికి ప్రాతఃస్మరణీయులు వేటూరి ప్రభాకరశాస్త్రిపాదుల వారి తెనిగింపు.

సీతచెలికాఁడు లక్ష్మణాశ్రితుడు భరత
హితుఁడు సుగ్రీవరాముఁడ ప్రతిమమతి సు
మంత్రనుతుఁడు విభీషణాత్మకుఁడు రావ
ణారి యగుశౌరి మీకు శ్రేయములొసంగు

– ఈ శ్లోకానికే మరొక అనువాదం. యడవల్లి ఆదినారాయణగారిది.

భావిత ధీసుమంత్ర పరివర్ధిటుడున్ భరతుండు జానకీ
భావుకసంవిధాతృడు ప్రసన్న విభీషణ మానసుండు సు
గ్రీవనుతాభిరాము డురు కీర్తియు నప్రతిమ ప్రభావుడున్
రావణ విద్విషుండు సహలక్ష్మణుడోముత సర్గసర్గమున్

రవి: నాటకంలో ఇప్పటికీ సమాజంలో ఉన్న సంప్రదాయాలు ఏవైనా గమనించారా?

పూర్ణిమ: సంప్రదాయాల పై మీ ప్రశ్న నాకో బౌన్సర్ అయ్యి కూర్చుంది. కాని ప్రశ్నాపత్రం ఎంత భయంకరంగా ఉన్నా, అడిషనల్స్ తో నెట్టుకురాగల జె.ఎన్.టి.యులో చదివినందుకు, ఇదో నా ప్రయత్నం:

ఖచ్చితంగా చెప్పాలంటే, తల్లిదండ్రుల మరణానంతరం కొడుకులు చేసే  / చెయ్యాల్సిన కొన్ని తతంగాలను తప్పించి నాకిందులో ప్రస్తుత సమాజంలోని సంప్రదాయాలేవీ కనిపించలేదు / అనిపించలేదు. కనీసం, నేను చదివినప్పుడు ఆ విధంగా ఆలోచించలేదు.

ప్రతిమా గృహంలో పనివారి తీరు, మన ప్రభుత్వరంగ పనితీరులా ఉందని అనుకోవచ్చని, కానీ దాన్ని “సంప్రదాయం” అనే పదం కిందకు తీసుకురాలేము కద? 🙂

రవి: ప్రతిమామందిరం గోడమీద చందనంతో అరచేతి ముద్ర వేసి ఉండడం (దత్త చందన పంచాంగుళీ భిత్తయః) చూసి, ఈ భవనం కొత్తగా కట్టబడి ఉంటుందని భరతుడు ఊహిస్తాడు. కొత్త ఇంటికి ఎర్రమన్నుతో అరచేతి ముద్రలు కొట్టే సంప్రదాయం ఇప్పటికీ ఉంది. (అన్నట్టు నేనూ జే ఎన్ టీ యూ నే లెండి :))

మీరు పంపిన వేటూరి ప్రభాకరశాస్త్రి గారి అనువాదం కాస్త చదివాను నిన్న. ఓ ఆసక్తికరమైన అంశం చెప్పారా మహానుభావులు.ఈ నాటకంలో భరతుడు లక్ష్మణుడికన్నా చిన్నవాడు. రామాయణంలో అలా లేదు. సీత లక్ష్మణున్ని “వత్స” అని ఆశీర్వదిస్తుంది. వదిన అమ్మ తర్వాత అమ్మ లాంటిదని మన ఇళ్ళల్లో ఒక అనుకోలు. ఇది ఆయన కాలం నాటికే ఉన్నట్లు తోస్తుంది.

ఇంకో ఆసక్తికరమైన విషయం.

రామాయణం అరణ్యకాండ మొన్నామధ్య కొన్ని పేజీలు తిరగేశాను. అందులో వాలి రాముణ్ణి, “నన్నెందుకు చెట్టుచాటు నుండి కొట్టావు? నీకిది న్యాయమా? ఐదు గోళ్ళ జంతువులలో, శాఖామృగం (కోతి) మాంసం తినడానికి పనికి రాదు కదా.రావణుడి విషయం అయితే, కేవలం రెండు రోజుల్లో అతణ్ణి నేను తీసుకువచ్చి నిలబెట్టగలను నేను,సుగ్రీవుడితోకన్నా నాతో మైత్రి నీకు లాభదాయకం కదా” ఇలా రకరకాలుగా ప్రశ్నిస్తాడు. అప్పుడు రాముడు, “నీవు నీ తమ్ముడి భార్యను చెరబట్టావు. తమ్ముడు కొడుకువంటి వాడు. అతడి భార్యను చెరబట్టటం ధర్మవిరుద్ధం. ధర్మాచరణ విషయంలో మాకు స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అధికారం లేదు.అందుకే కొట్టాను” అంటాడు.

రామాయణంలో తమ్ముడంటే కొడుకు అన్నారు. ప్రతిమలో వదిన అంటే అమ్మ అనే భావన చూపించాడు కవి.

కాలే గారి పుస్తకంలో ప్రతిమానాటకంలోని జాతీయాలు (RC) మొత్తం ఒకచోట ఇచ్చారు. అందులో ఓ నాలుగు.

రావణవధ తర్వాత తిరిగి వస్తూ సీత పెంచిన మొక్కలను చూస్తారు, సీతారాములు. అవి పెద్దవయి, తమకంటే ఎత్తుగా ఉంటాయి. కాలం చిన్నవాటిని కూడా పెద్దది చేస్తుందంటాడు. (ఓడలు బండ్లవుతాయన్న పోలిక కాబోలు)

అలమిదానీం వ్రణే ప్రహర్తుమ్ (పుండు మీద కొట్టటమిక చాలు)
అనుచరతి శశాంకం రాహుదోషోపి తారా (రాహుదోషోపహతుడైన చంద్రుణ్ణి కూడా తార అనుసరిస్తుంది)
బహువృత్తాన్తాని రాజకులాని నామ (రాజుల ఇళ్ళల్లో ఎన్నెన్నో వృత్తాంతాలు!)
హస్తస్పర్శో హి మాతృణామజలస్య జలాంజలిః (అమ్మ చేతి స్పర్శ గొంతెండిన వాడికి నీటిధారలాగ)

పూర్ణిమ: బాగున్నాయి.

రవి: రామాయణంలో కాస్త విచిత్రంగానూ (నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం), ప్రతిమా నాటకంలో కాస్త ఆసక్తి రేకెత్తించేదిగానూ ఉన్న పాత్ర భరతుడు.

విచిత్రం ఎందుకంటే – 14 యేళ్ళు మేనమామ ఇంట గడపడానికి వెళతాడీయన. అన్ని యేళ్ళు తల్లి, తండ్రి, అన్నలను వదిలి వెళ్ళడం ఒక విచిత్రం. తిరిగి రాగానే ఆయనకు రామ వనవాసం, తన పట్టాభిషేకం అని తెలుస్తుంది. దానికి కారణం అమ్మ కైకేయి అని తెలిసి ఆవేశపడతాడు. తన వల్ల అధర్మం జరుగుతోందన్న భయమో, తన తల్లి అపరాధం చేసిందన్న అపరాధ భావనో సరిగ్గా తెలియదు. (రామాయణం కూలంకషంగా చదవకపోవడం నా తప్పనుకోండి). నిజానిజాలు తెలుసుకోవడానికి ప్రయత్నించడు. ఏదేమైనా భరతుడి పాత్ర గురించి కాస్త తెలుసుకోదగ్గది.

పూర్ణిమ: రామాయణం కూలంకషంగా చదవకపోవడమేమో గాని.. మనకి ముక్కలు ముక్కలుగా తెల్సిన రామాయణాన్ని (టి.వి. సీరియల్స్, సినిమాలు, లాంటి వాటి ద్వారా) నిజమనుకోవడం మాత్రం ప్రమాదకరమనుకుంటా.

ప్రతిమా నాటికమూ, దాని పై మన చర్చ వల్ల నాకో బ్రహ్మాండమైన ఉపయోగం కలిగింది. చిన్నప్పటి నుండి రామాయణాలు చూడ్డం తప్ప, చదవలేదు మొన్నమొన్నటి వరకూ. శ్రీపాద వారి రామాయణం కూడా, పెద్ద రామాయణం కూలంకషంగా తెల్సినంత పొగరుతో మధ్య నుండి మొదలెట్టా. అది ఎటూ తేవాలక ముందే, ఉషశ్రీ గారు రాసిన రామాయణం చదివాను.

ఉషశ్రీ గారి పుస్తకంలో ఉపోద్ఘాతం నుండి “వాల్మికి గొప్పతనం”, “వాల్మీకి కవిత్వం” అంటూ వాల్మీకి జపం చేస్తున్నట్టు అనిపించింది. వాల్మీకి రచన లో విశిష్టతను పొగడడానికే ఆ పుస్తకం రాసారనిపించి, అదీ పూర్తి చెయ్యకుండా పక్కకు పెట్టాను. శ్రీపాద కూడా ప్రతీ కాండం ముందు “ఇందులో ఈ మెలికను గమనించండి, అక్కడ వాల్మీకి గొప్పదనం దాగుంది” అంటుంటే నాకేమో అయోమయంగా తోచింది.

రామాయణం అంటే “రామ”, అతని కథ తప్ప మరేమీ లేదనుకున్నాను. వాల్మీకిని – I assumed him to be the one who “transcribed” Rama’s story.  I was certainly not bothered about him as an author. ఇప్పుడు భాసుని నాటిక చదువుతుంటే, వాల్మీకి మీద ఆసక్తి పుడుతుంది. రాముని కోసం కాక, వాల్మీకి కోసం రామాయణం చదవాలనిపిస్తుంది.

భాసుని నాటిక లో నాకు నచ్చింది ఏంటంటే, రామాయణం కథ పరిణామాల్లో ఎలాంటి మార్పు చెయ్యకుండానే, కథలోని పాత్రల మీద మచ్చ తీసుకొని రాలేదు. అంటే కైక అడగడం వల్లే, రాముడి వనవాసం చేస్తాడు – కాని కైక దుష్టురాలు కాదు. రాముడు జింక కోసం వేటకి వెళ్ళినప్పుడే రావణుడు సీతను ఎత్తుకుపోతాడు – కాని అది సీత గొంతెమ్మ కోరిక కాదు.  ఏ పాత్ర మీద ఎలాంటి నిందా పడకుండా జాగ్రత్తగా మల్చుకొచ్చారు.

రవి: నిజం. రామాయణం గురించి ఆసక్తి ఉంటే, వాల్మీకి రామాయణం చదవడమే ఉత్తమపద్ధతి, కష్టమైనప్పటికీ. ఏ రకమైన రామాయణమో చదివి, లేదా చూసి, అది నిజమనుకుంటే, ప్రమాదమే. మనకు ఇప్పుడు తెలుస్తూందీ విషయం. 🙂 వెనకటికి బ్లాగుల్లో ఒకాయన అరిచి ఘీ పెట్టి చెప్పారా విషయం!!! :-). (అలాంటప్పుడు ప్రతిమానాటకం ఎందుకు చదివావు? అని ప్రశ్నిస్తే, రూపకసాహిత్యం మీద ఆసక్తితో అని నా సమాధానం.)

పూర్ణిమ: మొత్తానికి అనుకోకుండా ఇద్దరం ఒకే సారి, ఒకే రచన యొక్క వివిధ అనువాదాలు చదవడం వల్ల ఇంత చర్చించుకునే అవకాశం కలిగింది. మీ పుణ్యమా అని చాన్నాళ్ళ తర్వాత పుస్తకాన్ని శ్రద్ధగా “స్టడీ” చేశాను. అందులో “భాసుడు” అనే పుస్తకం నేను చదవలేనూ, కానీ అరలో ఉంటే పోయిందేముందీ అన్న ఉద్దేశ్యంతో కొన్నాను. ఇప్పుడు మాత్రం, అనవసర inhibitions పెట్టుకోకుండా, భాష కాస్త కష్టపెట్టినా, పుస్తకాలు చదవడంలో ఉండే ఆనందం అర్థమయ్యింది. సరళ వచనం చదివేటప్పుడు ప్రాణం సుఖంగా ఉంటుంది కానీ, ఇలాంటి కష్టతర రచనలు పఠించినప్పుడు అర్థమవుతున్న కొద్దీ తెరలు ఒక్కోటీ తొలిగి, మహానందం కలుగుతుంది. ఓపిగ్గా ఈ చర్చను కొనసాగించినందుకు, నా ప్రశ్నలకు జవాబులు చెప్పినందుకు ధన్యవాదాలు. “మీరేం చదువుతున్నారు?” శీర్షిక మొదలెట్టడంలోని సదుద్దేశ్యం ఇలాంటి చర్చలే! 🙂

రవి: ఈ రచనకు తెలుగు అనువాదాలు, అందునా చిలకమర్తి, వేటూరి ప్రభాకరశాస్త్రి గారు వంటి ఉద్ధండుల రచనలు ఉన్నాయని, మీరు చెప్పేవరకూ నాకు తెలియదు. (తెలిసేది కూడా కాదేమో) నిజానికి సంస్కృతంతో, ఆ మాటకొస్తే భారతీయ సారస్వతంతో అణుమాత్ర పరిచయం ఉన్న మనవంటి వారు ఇలాంటి కావ్యాల గురించి మాట్లాడ్డం కాస్త సాహసం. 🙂 అయితే ప్రారంభం ఎక్కడో జరిగితీరాలి. ఈ చిన్ని ప్రయత్నం భవిష్యత్తులో కొన్ని చర్చాగోష్టులకు ఊతం ఇస్తుందని నా ఆశ.

*****************************************************************************

ఈ చర్చలో ప్రస్తావించబడ్డ పుస్తకాలు:

ప్రతిమా నాటకము
రచయిత: చిలకమర్తి లక్ష్మీనరసింహం
వెల:  రూ 35 /-
ప్రచురణకర్తలు: తిరుమల తిరుపతి దేవస్థానం ప్రెస్

భాసుడు
రచయిత: వెంకటాచలం
తెలుగు అనువాదం: పుల్లెల శ్రీరామ చంద్రుడు
వెల: రూ 35 /-
ప్రచురణకర్తలు: సాహిత్య అకాడెమీ ప్రెస్

సంస్కృత సాహిత్య చరిత్ర
రచయితలు: ముదిగంటి గోపాలరెడ్డి, సుజాతా రెడ్డి గార్ల రచన
వెల: 160 /-
ప్రచురణకర్తలు: పొట్టిశ్రీరాములు తెలుగువిశ్వవిద్యాలయం

భాస కృత ప్రతిమానాటకం – ఎం.ఆర్.కాలే (సంస్కృత టీక, ఆంగ్ల తాత్పర్యం)
వెల – 95 /-
మోతిలాల్ బనార్సిదాస్ వారి ప్రచురణ.

You Might Also Like

16 Comments

  1. నాగమురళి

    @telugu4kids:

    ఈ శ్లోకం ఎక్కడిదో! అనువాద పద్యం అర్థాన్ని సరిగ్గానే చెప్తోంది కదా!! సంస్కృత శ్లోకాన్ని చూస్తే కొద్దిగా కన్ఫ్యూజన్ కలగడం సహజమే. నాకు తెలిసిన అతికొద్దిలో చెప్పాలంటే –

    ఇందులో పదాలు పైపైన చూస్తే విరుద్ధమైన అర్థాల్లాగా అనిపిస్తాయి. (విరోధాభాసాలంకారం అంటారా?). దీనికి అగజానన పద్మార్కం శ్లోకం మంచి ఉదాహరణ. అగజాననం – గజాననం : ఒకదానికొకటి విరుద్ధం. అలాగే, అనేకదంతం – ఏకదంతం కూడా. వీటిల్ని సరిగ్గా విడగొట్టుకుని అర్థాలు చెప్పుకుంటే ఆ వైరుధ్యం తొలగిపోతుంది. (’అగజా ఆనన పద్మార్క” అనీ, ’అనేకదం తం’ అనీ చెప్పుకోవాలి.)

    ఇక్కడ కూడా సీతాభవుడు అంటే సీతకి పుట్టినవాడు అని పైపైన చూస్తే వచ్చే అర్థం. కానీ భవుడంటే చెలికాడు అని అర్థం చెప్పుకోవాలి అనుకుంటా.
    అలాగే సుగ్రీవరాముడు అంటే మంచి కంఠం కలిగిన రాముడని అర్థం చెప్పుకోవాలి.
    విభీషణాత్ముడంటే శత్రు భయంకరుడని అర్థం.

    సంస్కృతంలో ఇలా పదాలతో ఆడుకోవడం చాలా సహజమే!!

  2. telugu4kids

    సీతాభవః పాతు సుమన్త్రతుష్టః సుగ్రీవరామః సహలక్ష్మణశ్చ |
    యో రావణార్యప్రతిమశ్చ దేవ్యా విభీషణాత్మా భరతో2నుసర్గమ్ ||

    ఈ శ్లోకానికి ఈ అర్థమే సరిపోయిందేమో?

    సీతచెలికాఁడు లక్ష్మణాశ్రితుడు భరత
    హితుఁడు సుగ్రీవరాముఁడ ప్రతిమమతి సు
    మంత్రనుతుఁడు విభీషణాత్మకుఁడు రావ
    ణారి యగుశౌరి మీకు శ్రేయములొసంగు

    విభీషణుడి గురించి చెప్తున్నట్లనిపిస్తోంది, రాముడి విభీషణ ఆత్మను వర్ణించినట్లు కాదు కదూ?
    అలాగే భరత, లక్ష్మణుల, సుమంత్రి గురించిన ప్రస్తావన కూడా.
    సుగ్రీవుడి విషయమే, అది రాముడిని వర్ణిస్తూ ఆ పేరూ కలిసి వచ్చేలా చెప్పడామా, లేక అతనితో రాముడి స్నేహసంబంధమా అన్నది అర్థం కావట్లేదు.

    మీకు ఎంత ఓపికో, ఇలా చర్చించుకోవడానికి, ఆ చర్చను ఇలా అందించడానికీ.
    చాలా ఆసక్తికరంగా ఉంది ప్రతిమానాటక పరిచయం.
    పేరు వినడమే తప్ప ఎక్కువ తెలియదు నాకు ఇప్పటివరకూ.

    Thanks.

  3. రవి

    శేషతల్ప సాయి గారు: మాధవశర్మ గారి అనువాదం సరళసుందరం. నా వద్ద ప్రతిమానాటకం లేదు కానీ మరొక అనువాద గ్రంథం ఉన్నది. ప్రతిమానాటకం DLI లో దొరుకుతుందేమో వెతకాలి.

    ఆశ్చర్యార్థకానికి ప్రత్యేక కారణం లేదండి.

  4. Vadapalli SeshatalpaSayee

    ఈ నాటకముపై రెండు పుస్తకాల వివరాలు

    పాటిబండ మాధవశర్మగారు యీ నాటకానికి తెలుగు అనువాద వ్యాఖ్యాసహితముగా “కరదీపికా”ను 1975లో ప్రచురించారు. శ్లోకములకు అన్వయ ప్రతిపదార్థములు యిచ్చారు. గ్రంథాలయాల్లో దొరుకవచ్చు.

    ఈ నాటకము “మదరాసు యూనివర్సిటీ యింటర్మీడియేటు పరీక్ష (1954) పఠనీయ గ్రంథము.” తిమ్మావజ్ఝల కోదండరామయ్యగారు విద్యార్థులకోసం “సమీక్ష” (గైడు) వ్రాశారు. ఇంతకుమునుపు DLIలో లభ్యమయ్యేది.

    శేషతల్పశాయి.

    ఫి.యస్.: శీర్షికలో “ఆశ్చర్యార్థకము” వాడటానికి యేమైనా ప్రత్యేక కారణమున్నదా?

  5. రవి

    @మురళిగారు : రామాయణం గురించి ఆరుద్ర గారు, తెన్నేటి హేమలత గారు, మీరు చెప్పిన అభిప్రాయమే వెలిబుచ్చారు. నిజమే కావచ్చు.

    @నరసింహారావు గారు: సంస్కృతం నేనూ నేర్చుకుంటున్నానండి. (ఎప్పుడో చిన్నతనంలో తెలియక, ఓ మోస్తరుగా నేర్చుకున్న సంస్కృతాన్ని, వదిలివేసి పెద్ద తప్పుచేశాననిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు) పాఠమాల వారి సౌకర్యంతో. అయితే నాకు ఒక్కో పాఠం ఒక వారం పడుతోంది! వాల్మీకిరామాయణం చదవాలని నాకూ ఉంది. ఎప్పుడు మొదలెడతానో ఏమో!

    కొడవంటిగారి ఒక రచన వివరాలు ఈ వ్యాఖ్యల రూపంలో తెలుసుకోవటం ఆనందంగా ఉంది. ధన్యవాదాలు.

  6. నాగమురళి

    రవి గారూ, నా ఊహకి ఒక కారణం ఏమిటంటే, మధ్యమ వ్యాయోగంలోని భీమ, ఘటోత్కచుల కథ చాలా ప్రసిద్ధి చెందిన కథ. అది ఎంత ప్రసిద్ధమైనదంటే, టీవీ మహాభారత్ లో కూడా దాన్ని చొప్పించారు. జానపదుల నోళ్ళలో మనకి తెలియని ఇతిహాస కథలెన్నో అనేకరూపాల్లో వినిపిస్తుంటాయి. (ఇప్పటికే చాలా అంతరించిపోయి ఉంటాయి, కొన్నేళ్ళు పోతే అసలే మిగలవు.) కొన్నిప్రాంతాల్లో వాటికి మూలకథకి ఉన్నంత ప్రాధాన్యతా (కొండొకచో ఇంకా ఎక్కువ ప్రాధాన్యత) ఉంటుంది.

    నరసింహారావు గారూ, మీరు చేస్తున్న కృషికి చాలా ఆశ్చర్యం కలిగింది. మీవంటివారి నుంచి స్ఫూర్తి పొందవలసిన అవసరం మాకెంతైనా ఉంది.

    హనుమంతరావు గారూ, “గాలి బాలసుందరరావు” గారి పేరు కొన్ని జ్ఞాపకాలు రేకెత్తించింది. ఆయన ఒకానొక యోగపద్ధతిలో సాధకులుగా పేరున్నవారా? ఈ ప్రశ్న బొత్తిగా అసందర్భంగా అనిపిస్తే వదిలెయ్యండి. ఒకవేళ నేను విన్న వ్యక్తీ, ఈయనా ఒకరే అయితే కొత్తపాళీగారి అభిప్రాయమే నాదీను. వివరాలు మాత్రం బహిరంగంగా చెప్పలేను.

  7. కొడవళ్ళ హనుమంతరావు

    మంచి పరిచయం. శ్రీశ్రీ, కొడవటిగంటి, గోపీచంద్ శత దినోత్సవాల సందర్భంగా పోయినేడు డెట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ ఆధ్వర్యాన జరిగిన సభలో నేను కుటుంబరావు నవల ఐశ్వర్యం మీద మాట్లాడాను. దాని సారంశం ఈమాట లో చూడొచ్చు: http://www.eemaata.com/em/issues/200911/1508.html?allinonepage=1

    అప్పుడు భాసుడి రచనలు – ముఖ్యంగా చారుదత్తం – తెలుగులో దొరుకుతాయేమోనని ప్రయత్నించాను. జి. వి. కృష్ణారావు [1] గారి ప్రతిమ మాత్రం దొరికింది. వ్యాఖ్యానం లేకుండా భాసుడి గొప్పదనం నాలాంటి వాళ్ళకి (ఐశ్వర్యం లో సూర్యానికి లాగే) సాధ్యం కాదనిపించింది. చందమామలో భాసుడి కథలు బాగున్నాయి. భాసుడంటే కుటుంబరావుకి చాలా అభిమానం: “భాసుడి నాటకాలు చదివి కాళిదాసువి చదివితే చక్కెర తిని దంటు నమిలినట్లుంటుంది.”

    కొత్తపాళీ గారు డాక్టరుని తిక్క మనిషిగా అభివర్ణించారు. ఆదర్శభావాలని ఆచరణలో పెట్టిన ఉన్నత వ్యక్తిత్వం గల పాత్ర డాక్టరని నా అభిప్రాయం.

    డెట్రాయిట్ లో కొడవటిగంటి రోహిణీప్రసాద్ ఓ ఆసక్తికరమైన విషయం చెప్పారు. వాళ్ళ ఫామిలీ డాక్టరైన గాలి బాలసుందరరావు (సినీ నటుడు చంద్రమోహన్ భార్య, రచయిత్రి జలంధర, నాన్న) గారిలోని అంశాలు కొన్ని ఐశ్వర్యంలోని డాక్టర్ కనకసుందరం లో ఉన్నాయి. గాలి గారికి నాటకాలంటే చాలా ఇష్టం.

    కొడవళ్ళ హనుమంతరావు

    [1] “జి. వి. కృష్ణారావు రచనలు, ఐదో సంపుటం – నాటికలు, నాటకాలు,” లో భాసుని ప్రతిమ కి తెలుగు అనువాదం. ప్రభాస పబ్లికేషన్స్, తెనాలి, 1999.

  8. నరసింహారావు మల్లిన

    చాలా మంచి విషయాలు తెలియజేసారు. భాసుడి ప్రతిమా నాటకం ఎప్పటికోప్పటికి సంపాదించి చదవాలని నిర్ణయించుకున్నాను. ఈలోగా ఓ చిన్న పిడకల వేట.నా స్వవిషయం.
    ప్రస్తుతం నేను చదువుతున్న పుస్తకాల్నిగుఱించి ప్రస్తావించాలన్పించి వ్రాస్తున్నాను. అవి వాసుదాసుగారి మందరం పుస్తకాలు. వావిలికొలను సుబ్బారావుగారు( వాసుదాసు గారు )ఆంధ్రవాల్హీకి రామాయణాన్ని యథాతథంగా అంటే యథావాల్మీకంగా సుమారు 24000 పద్యాలలోనే నిర్వచనోత్తరంగా 1908 ప్రాంతాలలో శ్రీమదాంధ్రవాల్మీకి రామాయణం పేరుతో తెనిగించారనిన్నీ , వారు తెనిగించిన ఆంధ్ర వాల్మీకి రామాయణానికి “మందరం” అనే పేరుతో టీకా తాత్పర్యసహితంగా విపులమైన వాఖ్యానాల్నికూడా వ్రాసారనిన్నీ తెలిసింది. ఆ పుస్తకాలనన్నింటినీ “అంగలకుదురు” లోని ఆశ్రమానికి వ్రాసి చెప్పించుకుని చదవటం మొదలుపెట్టాను. ఈ నిర్వచన రామాయణాన్కి ప్రక్కప్రక్కనే విశ్వనాథ వారి రామాయణ కల్పవృక్షాన్నికూడా చదువుతున్నాను. ఈ కార్యక్రమం సుమారొక ఏడాదిలో పూర్తిచెయ్యాలనేది నా సంకల్పం. మొన్నటి భీష్మఏకాదశి మర్నాడు చదవటం మొదలుపెట్టాను. ప్రస్తుతం అయోధ్యకాండప్రథమ భాగం చదువుతున్నాను. నాకు సంస్కృతం తెలియదు అందుచేత యథావాల్మీకంగా ఉన్న ఈ రామాయణం చదవాలన్పించింది. సంస్కృత రామాయణాన్ని కూడా సంస్కృతం నేర్చుకుని చదవాలన్నది నా సంకల్పం. అందుచేత ఖాళీ సమయాల్లో సంస్కృత భాషాధ్యయనం కూడా కొనసాగిస్తున్నాను.సంస్కృత పాఠమాల పుస్తకాలు నాకు సహాయకారిగా ఉంటున్నాయి.(24 పుస్తకాలు – వాటిలో 10 పుస్తకాలు చదివాను. మిగిలినవి పూర్తిచెయ్యాలి.)ఎప్పటికైనా భారత భాగవత రామాయణాల్ని సంస్కృతమూలం చదివి ఆనందించాలనేది నా అభిమతం. అలాగే భాసుని ప్రతిమా నాటకం కూడా చదవాల్సిన పుస్తకాల లిస్టులో చేర్చుకున్నానిప్పుడు.ఇదంతా వ్రాస్తుంటే చదివేవారికి స్వోత్కర్షగా కనిపిస్తుందేమోననే భయం ఓ ప్రక్కన పీడిస్తున్నాగానీ వ్రాయకుండా ఉండలేకపోతున్నాను. నా ఈ బలహీనతకి పెద్దలందరూ నన్ను క్షమించాలి. మందరం పుస్తకాల వివరాల్ని ఎవరికైనా కావాలన్పిస్తే తెలియజేయగలరు.మందరం రామాయణాన్ని , విశ్వనాథవారి రామాయణాన్ని చదువుతుంటే విశ్వనాథ వారు వారి రామాయణాన్కి మందరం లాంటి వ్యాఖ్యను కూడా వ్రాసి ఉంటే ఎంత బాగుండునో కదా అనిపిస్తుంది నా మటుకు నాకు.ఆ పనిని విశ్వనాథవారి శిష్యులెవరైనా గానీ ఎప్పటికోప్పటికి రాయకపోరనిపిస్తుంది.ఆ రోజుకోసం ఎదురుచూస్తున్నాను.పూర్ణిమ గారికి రవిగారికి ఇందుమూలంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

  9. కొత్తపాళీ

    మధ్యమ వ్యాయోగం .. అదే అదే, నేను పైన చెప్పిన కుటుంబరావుగారి డాక్టరు పాత్ర విశ్లేషించిన భాసుని రచన.

  10. రవి

    మురళి గారు, మీ ఊహ బానే ఉంది. అయితే నాకు మాత్రం, ఇవి భాసకవి కల్పితాలని అనిపిస్తుంది. (నా దగ్గరా రుజువులవీ లేవనుకోండి. :-)). కారణం ప్రతిమ కాకుండా, మధ్యముడు అనే నాటకం ఒకటుంది ఆయనది, భారతంలో ఘటోత్కచుడు, భీముని పాత్రల ఆధారంగా. అది చదవగానే మీకు తెలిసిపోతుంది, కల్పితమని. రామాయణ, భారతాలను కల్పన చేసి, నాటకాలుగా ప్రదర్శింపజేసి, వాటి విస్తృతికి పాటుపడాలని ఆయన ఆలోచించినట్టు సందేహం. రెండువేల యేళ్ళ కేరళ చాక్యారుల సంప్రదాయం కూడా ఈ అనుమానాన్ని బలపరుస్తున్నది.

  11. నాగమురళి

    అద్భుతమైన చర్చ. భాసుడి “మధ్యమ వ్యాయోగం” మాకు పాఠంగా ఉండేది. భాసుడి గురించి మీరు చదివిన సంస్కృత సాహిత్య చరిత్రలోనే నేనూ చదివాను. నాకున్న ఒక అభిప్రాయం : భాసుడి కాలంలో, అతని ప్రాంతంలో ప్రాచుర్యంలో ఉన్న జానపదులు చెప్పుకునే రామాయణ/భారత కథల్ని అతను నాటకాలుగా రాసి ఉండవచ్చు అని. అయితే ఈ ఊహకి బలమివ్వడానికి కావలసిన రిఫరెన్సులు కానీ, ఆధారాలు కానే ఏమీ నా దగ్గర లేవు. (బహుశా వచ్చే జన్మలో ప్రయత్నిస్తా. :-D)

    ఇల్లాంటి విషయాలకి మాటల్లోనే గంటలు గంటలు గడిచిపోతాయి. మీరు చాటింగులో మాట్లాడుకున్నారంటే చాలా గొప్ప విషయం.

  12. రవి

    కామేశ్వర్రావు గారు: ఈ నాటకానికి ఈ పేరే ఉండవలసిన అవసరం లేదని కాలే గారు చేంతాడంత వ్రాశారు. ఏ పేరు ఔచిత్యమో ఆయన సూచించలేదనుకోండి.

    ఇక నా విశ్లేషణ ఇది.

    ప్రశ్నను mathematical induction పద్ధతిలో సాధిద్దాం.. ఈ నాటకానికి ఈ పేరు కాకపోతే మరి ఏయే పేర్లు సరిపోతాయో ఆలోచిద్దాం.

    ౧. నాయికానాయకుల పేర్లతో (మాళవికాగ్నిమిత్రం, మాలతీమాధవం, విక్రమోర్వశీయం ఇలా) చెప్పాలంటే, నాయికానాయకులు ఉన్న నాటకం కాదాయె. (రాముడు, సీత ఇందులో పాత్రలు తప్ప నాయికా నాయకులు కారు)

    ౨. పూర్తి నాటకం (ముఖ్యంగా చివరికి ఏం జరుగుతుంది) ఏమి చెబుతుందో దాన్ని నాటకం పేరుగా పెట్టాలంటే (వేణీ సంహారం, అభిషేకం ఇలా) చివరికి అందరూ కలుసుకోవడం తప్ప “ముఖ్యమైన” ఘట్టం లేకపోయె.

    ౩. భరతుడు ముఖ్యపాత్ర కాబట్టి, ఆయన పేరుతో వచ్చేట్టు, భరత విలాపం అనో, భరతాఖ్యానం అనో పేరు పెట్టాలంటే, – భరత విలాపం నప్పదు. ఎందుకంటే, భరతుణ్ణి అడవి నుంచి పంపేసిన తర్వాత రావణుడి గొడవ మొదలవుతుంది. భరతాఖ్యానం కూడా కాదు. ఎందుకంటే, ఈ కథ భరతుడిది కాదు. (ఆఖ్యానం, ఆఖ్యాయిక/కథ అన్నది ఒక controversial matter. దీని గురించి నా తదుపరి ప్రాజెక్టులో వీలయితే. :-))

    ౪. ఇక మిగిలింది, నాటకానికి ఆయువుపట్టు, భరతుడి మనసు విరక్తి చెంది, అయోధ్యకు వెళ్ళకుండా అడవులు పట్టేట్టు చేసిన దృశ్యం ప్రతిమాదర్శనం. దానికి ఆధారభూతమైనది “ప్రతిమ”. అందువల్ల ఈ నాటకానికి ఈ పేరొచ్చిందని నా సమాధానం.

    @తమ్మినేని గారు: బావుందండి. అనేక అనువాదాలున్నట్టున్నాయి, ప్రతిమానాటకానికి.
    నిన్నే మీరు ఉటంకించిన లంకెలో ఏదో వెతికాను. దొరకలేదు. గణపతిశాస్త్రి గారి వివరాలకు కృతజ్ఞతలు.

  13. కామేశ్వర రావు

    చర్చ ద్వారా పరిచయం బాగుంది. ఇంతకీ ఈ నాటకానికి “ప్రతిమా” అన్న పేరెందుకు వచ్చినట్టు?

  14. తమ్మినేని యదుకుల భూషణ్

    ప్రతిమా నాటకం ( తెలుగులో తిరగ రాసింది మల్లంపల్లి శరభయ్య గారనుకుంటాను )
    చిన నాడు మా పెద్దక్క వారికి ఉపవాచకం ,నేను అలా చదివాను ఆ పుస్తకం.

    ఇప్పుడు సంస్కృత పుస్తకాలను (భారత రామాయణాల తో సహా) clay sanskrit library వారు ప్రచురించారు. అన్ని అంతర్జాతీయ పత్రికల్లో మంచి సమీక్షలు వచ్చాయి.

    http://www.claysanskritlibrary.org/excerpts/ShatteredThighs_bibl.php
    పై లింకులో మీకు భాసుడు గణపతి శాస్త్రి గారి మీద కొంచెం భోగట్టా దొరుకుతుంది.

    రామాయణం ప్రపంచ వ్యాప్తం. ఈ రోజుకు థాయిలాండ్ రాజు భూమిబల అతుల్యతేజ పట్టపు నామము రామా ( తొమ్మిది అనుకొంటాను ).అక్కడి కొన్ని జాతీయ రహదారుల పేర్లు రామా (ఏడు ) అలా ఉన్నాయి. అయోధ్యా ( అయుత్తయ అని పలుకుతారు) నగరం ఉంది అక్కడ .

    రామాయణంలో పిడకల వేట సామెత లోని పిడకలు బౌద్ధ పిటకాలు ;రామాయణం కథ మధ్య మధ్యలో పిటకాలు చదివే వారట.ఇలా బౌద్ధ యుగంలో కూడా రామాయణం ఆకర్షణ పోలేదు.

  15. కొత్తపాళీ

    బాగు, బహు బాగు.
    చాలా తీరిగ్గా ఓపిగ్గా చదవాలి, చదువుతా.
    ఈ లోపల గబగబా ఒక్ఖ మాట చెప్పి పోదామని. కొకు నవలిక ఒక దానిలో (ఐశ్వర్యం అనుకుంటా) తెనాలిలో ఒక తిక్క డాక్టరుగారుంటారు. ఆయనకి సంస్కృత సాహిత్యమంటే పిచ్చ ఇష్టం. ఆయన కథ నయకుణ్ణి కూర్చోబెట్టి భాసుడి నాటకాల్ని గురించీ, రూపకాలు (వీటిని వ్యాయోగం అనో ఇంకేదో అంటారు) గురించీ లెక్చర్లిస్తాడు. ఆ పాత్రతో అంత కూలంకషమైన సంస్కృత సాహిత్య చర్చ జరిపించడానికి కుటుంబరావు గారికి కూడా భాసుడి రచనలతో చెప్పుకోదగిన పరిచయమే కాక, ఒక మాదిరి అభిమానం కూడా ఉండి ఉండాలి.

Leave a Reply