కవిత్వానువాదం పై ప్రశ్నోత్తరాలు
తెలుగు కవిత్వాన్ని అసామీస్ భాషలోకి అనువదిస్తున్న గరికపాటి పవన్ కుమార్-సంగీత దంపతులతో జరిపిన ఈమెయిల్ ఇంటర్వ్యూ ఇది. ఈ ప్రయత్నంలో సహకరించిన పవన్-సంగీత గార్లకు, వీరి కృషి గురించి తెలియజేసిన తమ్మినేని యదుకులభూషణ్ గారికి ధన్యవాదాలు. ప్రశ్నలు కూర్చడంలో తోడ్పడిన స్వాతి, మోహన లకు ప్రత్యేక ధన్యవాదాలు – సౌమ్య,పూర్ణిమ
ఇక చదవండి:
మీ ఇద్దరి గురించి ఓ చిన్న పరిచయం…
గరికపాటి సంగీత:
జోర్హాతు, అస్సాంలో జననం. ఫిలాసఫీలో ఉన్నతవిద్య.సంగీతం తన ప్రాణం. హిందుస్తానీ సంగీతంలో పదేళ్ళకు పైగా కృషి, సంగీతంలో పట్టభద్రురాలు.
రెండు బిహూ పాటల కాసెట్లు వెలువడ్డాయి. అస్సామీ బిహూ నృత్యం వచ్చు. తెలుగు చదవడం, రాయడం పిల్లలకోసమని నేర్చుకుంది.
గరికపాటి పవన్ కుమార్:
ఖమ్మంలో బాల్యం.విజయవాడ సిద్ధార్థా ఇంజనీరింగ్ కాలేజిలో విద్యాభ్యాసం (తమ్మినేని యదుకుల భూషణ్ తో సాహచర్యం). రాంచీలో M. Tech. చెన్నయ్ లో మరో P.G., ఉద్యోగ రీత్యా అస్సాంలో నివాసం. తర్వాత బొంబాయి, లండన్ నగరాల్లో పని . గత రెండేళ్ళుగా అమెరికాలో అతి చలి ప్రాంతం మిల్వాకీలో ప్రవాసం. “ఆ సాయంత్రం” – కవితా సంకలనం- 2006 లో వెలువడింది.
మీకు ఇలా తెలుగు కవిత్వాన్ని అస్సామీ లోకి అనువదించాలన్న ఆలోచన ఎలా కలిగింది?
ప్రశ్నలోకి పోయేముందు ఒక చిన్న వివరణ, అస్సామీని ప్రాంతీయులు “అహోమియా” అని అంటారు. మన భాషలో “స”గా పలికితే అస్సామీలో “హ” గా ఉచ్చరిస్తారు, (ఉదాహరణకి “అనసూయ” ని “అనహూయ” అను పలుకుతారు. )
పెళ్ళైన దగ్గరనుండి మా ఇద్దరికీ ఏ పనైనా కలిసి చేయడమే అలవాటు. ఒక్కోసారి ఈ అలవాటు ఎన్నో సమస్యలను సృష్టించినా నవ్వుతూ అధిగమించేవాళ్ళం. ఉదాహరణకి నేను క్షవరానికి వెళ్ళినా తను షాపు బైట నిరీక్షించేది. మా గురించి మేమున్న చోట చాలా మందికి తెలుసు, ఆ మంగలి కూడా మా ఆవిడను లోపలికొచ్చి కూర్చోండని చెప్పేవాడు. సిగ్గుపడి నవ్వుకునే వాళ్ళం. ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే, ప్రతి పనిని కలిసి చేసేవాళ్ళం, అలాగే కవిత్వం చదవడం కూడా. నేను బిగ్గరగా చదువుతూ అర్థాన్ని అస్సామీలో వివరించేవాణ్ణి (ఆ క్రమంలో నా అస్సామీ, తన తెలుగు బాగా మెరుగైనాయి.) మా ఇద్దరికి ఒకరి భావాలు ఒకరికి పూర్తిగా అర్థం కావాలి అనే విషయంలో పట్టుదల ఎక్కువ. ఈ రకమైన చర్చలు మా మధ్య తరచూ చోటు చేసుకునేవి. అప్పట్లో ఈ చర్చలకు మా హృదయానికి హత్తుకున్న భూషణ్ చెల్లెలి గీతాలు కేంద్రంగా ఉండేవి. అలా మొదలైన సంభాషణే అనువాదాలకు నాంది అని చెప్పుకోవచ్చు.
మీరు కలిసి అనువదించిన మొదటి కవిత ఏది?
మీరిద్దరు కలిసి చేస్తున్న తొలి ప్రాజెక్టు ఇదేనా (అనువాదమైనా, మరేదైనా)
తొలి ప్రాజెక్ట్, మంచి ప్రశ్న. కానీ దేనిని ప్రాజెక్ట్ అనుకోవాలి? మా ఇద్దరి పెళ్ళే ఒక పెద్ద ప్రాజెక్టు. అదే మేము చేసిన తొలి ప్రాజెక్టు. తర్వాత జీవితంలో అన్నీ కలిసే చేసే వాళ్ళం. సాహిత్యంలో అయితే “నిశ్శబ్దంలో నీ నవ్వులు” -కవితా సంకలనం) అస్సామీ అనువాదం మొదటిదని చెప్పుకోవచ్చు, తర్వాత స్పానిష్ నించి నెరుడా ని తెలుగులోకి చేస్తున్నాము, ఇంకా కొన్ని అసంపూర్తి ప్రాజెక్టులున్నాయి.
ఈ అనువాదాల కథ – వ్యక్తిగతంగానూ, జంటగానూ – మీ జీవితాలను ఎంతవరకూ ప్రభావితం చేస్తోందంటారు? మీ గురించి ఒక స్నేహితుడికి చెబుతూ ఉంటే అనిపించింది – మీ ఇద్దరి మధ్య ఈ అనువాదం చేసేటప్పటి సందర్భాలు ఎంత అద్భుతంగా ఉంటాయో అని. మీరేమంటారు?
చాలా ప్రభావితం చేసిందనే చెప్పాలి. పెళ్ళైన చాలా సంవత్సరాల వరకూ మాకిద్దరికీ భార్యాభర్తల మధ్య “పవర్ స్ట్రగుల్” అంటే ఏమిటో తెలియదు. ఎందుకంటే తనేమి చెప్పినా నేను సరేనంటాను. నాకేం కావాలో తను ముందుగానే ఆలోచించి అదే “ప్రపోజ్” చేస్తుంది. కానీ అనువాదాలు మొదలు పెట్టాక మా ఇద్దరి మధ్యా మొదటి సారిగా వాదప్రతివాదాలు జరిగాయి. తర్వాత కొంతసేపటికి ఇద్దరం సరదాగా నవ్వుకునేవాళ్ళం, అప్పటిదాకా బిక్కు బిక్కు మంటూ చూసే మా పాపాయి మాతో కలిసి నవ్వేది.
కొన్ని పదాలకు అటువంటి ప్రయోగం అస్సామీలో ఉండేదే కాదు, ఉదాహరణకి భూషణ్ “నిదురపో చిన్నీ…” కవితలోని కింది రెండు పాదాలను అనువదించేటప్పుడు “ఎదురైతే” అనే పదానికి అస్సామీలో ఆ విధమైన వాడకమే లేదు. దానికి బదులు కలిశారు (లోక్ పాయిసు) అనే అర్థం వచ్చే పదమే ఉంది.
“వింత వింత మేళాల సంతాపం ఎదురైతే
వేడుక వెలుగుల సంతోషంగా మారిపొమ్మని చెప్పు చిన్నీ…”
అస్సామీలో అటువంటి వాడకమే లేదు కాబట్టి, తను మొదటగా అర్థం చేసుకునేది కలిశారని, అది ఒక రకంగా అర్థాన్ని స్ఫురించినా మూలంతో దూరాన్ని పెంచుతోంది. ఆ పదం అర్థం అవడానికి నాటకీయంగా ఒక సన్నివేశాన్ని వివరించాలి. మనం బయటికి వెళుతూ ఉంటే ఎవరైనా మనకు ఎదురుగా కనపడితే వాడు నాకు ఎదురయ్యాడని చెపుతాము అని. అలా తర్జన భర్జన ల తర్వాత కొంత దగ్గరగా మేము చేసిన అనువాదం “హణ్ముఖోత్ దేఖీలే” (అంటే ఎదురగా కనపడితే అని) ఇది భావార్ధానికి సరిపోతుంది. దీనికి తనకొక వీర తాడు వెయ్యాల్సిందే ఎందుకంటే ఇటువంటి ప్రయోగం లేదు. తను ప్రతిపాదించే పదం మాకు సరైనదని అనిపించాలి, ఎబ్బెట్టుగా కాకుండా అస్సామీ నుడికారంలో ఇమడాలి. ఇలా “Man hunt” లా పదాల వేట జరిగేది. కొన్ని పదాలకు అర్థాలు నేను వివరించలేక తను అర్థం చేసుకోలేక అనువాదాలు రోజుల తరబడి ఆగేవి.
కలిసి పని చేస్తున్నప్పుడు – ఒకరు అన్న అనువాదం ఒకరికి నచ్చకపోడం వంటివి జరగడం సాధారణంగా కనిపించేదే కదా. మీకలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు ఏం చేసేవారు?
నచ్చడం నచ్చకపోవడం అనేది చర్చకు వచ్చేది కాదు, సరైన అనువాదమా కాదా అన్న వాదమే జరిగేది. ఎవరికైనా సరైనది కాదు అనిపిస్తే ఆపేయడమే, ఆలోచన కొనసాగించడమే. దేనికీ తొందరలేదు. మాకెప్పుడూ ఈ అనువాదాలు ‘కడుపు నిండిన బేరమే’.
మీరు ఇంకా ఏదన్నా అనువదిస్తున్నారా, కవిత్వం కాక? అలాగే,అస్సామీ నుండి తెలుగుకి కూడా అనువదిస్తున్నారా?
ప్రస్తుతానికి లేదు. కానీ అస్సామీలో కొంత మంది ప్రముఖ కవులను (నీలమణి ఫుకాన్, నవకాంత బారువా, దేవకాంత్ బారువా మొ.) తెలుగులోకి అనువదించాలన్న కోరిక ఉంది, రాబోయే రోజుల్లో చేస్తామనుకుంటున్నాము.
అసలు ఇది అనువదించాలి అని మీరు ఎలా నిర్ణయిస్తారు?
హృదయానికి హత్తుకున్న కవితైతే చాలు. అనువదించగలమా లేదా అన్న ఆలోచన మాకు రాదు. ఈ కవితను మేమింతగా ఆస్వాదించామంటే అస్సామీ లో ఉంటే వారెంత ఆనందిస్తారో అన్న ఆలోచనే మా అనువాదాన్ని పేపరు మీద పెట్టే ప్రయత్నానికి ఊపిరి.
మీ అనువాదాలకి అస్సామీ వారి స్పందన ఎలా ఉంది? ఈ అనువాదాలు అక్కడ ఏవన్నా పత్రికల్లో అచ్చయ్యాయా? వీటిని సంకలనంగా తెచ్చే ఆలోచన ఏదన్నా ఉందా?
తెలుగులో నుంచి చేస్తున్న కవితల అనువాదాలు కవి మిత్రులతో పంచుకోవడమే ప్రస్తుతం మేం చేస్తున్న పని. వారి స్పందన బాగుంది. ఇటువంటి పొరుగు భాషా అనువాదాలు ఎక్కువగా రావు కాబట్టి పాఠకులకు కూడా కొంత అలవాటు కావాలి. భూషణ్ చేసిన ‘నీ చేయి నా చేతిలో’ నుంచి ప్రభావితమై అవే కవితలను అస్సామీ లో ‘మోర్ హాత్ తొమార్ హతోత్” గా ప్రచురిస్తున్నాము ఈ సంవత్సరంలో. మేము చేసిన తెలుగు ప్రముఖుల అనువాదాలు కొన్ని సంకలనంగా తీసుకు రావాలని అనుకుంటున్నాము.
ఇలా తెలుగు-అస్సామీ గానీ, అస్సామీ -తెలుగు గానీ మునుపు అనువాదాలేవన్నా జరిగాయా? మీకు తెలిసినంతలో, ఇలా ఎవరన్నా చేసి ఉంటే…. చెప్పగలరు..
నాకు తెలిసీ అస్సామీ కథలు చాలానే తెలుగులోకి అనువదించబడ్డాయి. కానీ కవిత్వం గురించి నాకు తెలియదు.
అస్సామీ సాహిత్యం గురించి కొంచెం చెప్పగలరా? ఎలాంటి సాహిత్యం ఎక్కువగా కనిపిస్తుంది? అస్సామీ కవిత్వం ఎలా ఉంటుంది -వంటివి? ఈ ఇంటర్వ్యూ చదివే వాళ్ళలో అస్సామీ సాహిత్యం గురించి అవగాహన ఉండేవారు ఎక్కువమంది ఉండకపోవచ్చు. అందుకని ఈ ప్రశ్న.
అస్సామీ సాహిత్యానికి కూడా తెలుగు సాహిత్యానికున్నంత చరిత్ర ఉంది. 13 వ శతాబ్ధం నుంచే అస్సామీలో కావ్యాలు వచ్చాయి. మన పోతన (1450-1510) కు సమకాలీనుడైన శ్రీమంత శంకరదేవ (1449-1568) అస్సామీలో భాగవత, రామాయణాలను అనువదించాడు. అస్సామీ కవిత్వం మీద శంకరదేవ రచనలు, బిహూ పాటలు, బ్రహ్మపుత్రా నది తో కూడిన అందమైన ప్రకృతి విశేషమైన ప్రభావాన్ని చూపాయి.
ఇక అనువాదాల గురించి: అనువాదాల ప్రధాన లక్ష్యం ఏమిటంటారు? ఒక అనువాదం అత్యుత్తమంగా ఏం చేయగలదు చదువరులకీ?
మూలాన్ని చదవలేని వారికి లక్ష్య భాషలో అదే మూలాన్ని చదివించగలగడం అనువాద లక్ష్యం. “ఒకే విషయాన్ని” రెండు భాషలలో రాయడానికి ఇంతకన్నా పెద్ద కారణం కనిపించదు – అన్న వాల్తేర్ బెంజమిన్ మాటలను అక్షర సత్యంగా భావిస్తాము.
అనువాదాలు ఎప్పుడూ:
1. మూలవిధేయంగా ఉండాలి: మూలాన్ని అర్థం చేసుకోకుండా వాటి అనువాదాలను చదివి అనువాదాలనకు ఉద్యమించడం అంత శ్రేయస్కరం కాదు. అలా ఉద్యమించిన అనువాదాలను చదివినప్పుడల్లా పోతన భాగవతం లోని పద్యం గుర్తుకు వస్తుంది. “కానని వానినూత గొని కానని వాడు విశిష్ట వస్తువుల్ కానని భంగి…” అని. ఒక చూడలేని వానిని ఆసరాగా తీసుకొని ఇంకొక చూడలేని వాడు విశిష్ట వస్తువులను ఏ రకంగా చూడలేడో…మూలాన్ని అర్థం చేసుకోలేనివాడిని ఆసరాగా చేసుకొని మనం మూలాన్ని దర్శించడనికి ప్రయత్నించలేము అని సారాంశం.
2. భావావేశం ఉండి తీరాలి: పాండిత్య ప్రదర్శన అనువాదం కాదు. అనువాదాన్ని జరిపే యంత్రం హృదయం గానీ బుద్ధి కాకూడదు, అందుకనే కవి పొందిన అనుభూతిని అనువాదకుడు పొంది ఆ స్థితిని సాధించిన పిమ్మట అనువాదాన్ని పూర్తయినట్టుగా ప్రకటించాలి, అంతవరకూ అర్థం చేసుకునేందుకు పడే శ్రమే అనువాదం అని నెల తక్కువ బిడ్డలను కన కూడదు. ఈ భావావేశం సాధించడానికి వివిధ అనువాదకులు వివిధ రకాలైన పద్దతులను పాటించారు. జాన్ ఫెలిస్టనర్ (John Felstiner) చిలీ కవి నెరుడా “The heights of Macchu picchu” ని అనువదించడానికి మచ్చూ పిచ్చూ ని దర్శించాడు.
3. రూప శ్రద్ధ: రూప శ్రద్ధ లేని అనువాదాలకు వ్యాఖ్యానాలకు పెద్ద తేడా ఏమీ లేదు. ప్రతీ కవీ ఆధునికుడైనా, ప్రాచీనుడైనా తనదంటూ ఒక శైలి సాధిస్తాడు. చ్చందో బందో బస్తులను చట్ ఫట్ మని త్రెంచుకున్నా- శ్రీ. శ్రీ. “నేనొక దుర్గం, అనర్గళం అనితర సాధ్యం నా మార్గం” అని తనదైన శైలి ని విడువలేదు, ఆ శైలే లేకపోతే శ్రీ శ్రీ కవిత్వమే లేదు. అందుకే శైలి ని పట్టుకోవడం చాలా అవసరం. నెరూడా ని అభిమానంగా అనువదించే అలస్టైర్ రీడ్ (Alastair Reid) నెరుడా కవితలలోని Tone ని పట్టుకోవడం కోసం నెరుడా తన సొంత గోంతుకతో చదివే కవితలను రోజుల తరబడి వినేవాడు.
తెలుగు ను అనువదించడంలో మీరు ఎదుర్కున్న ప్రధాన సమస్యలేమిటి?
తెలుగునే కాదు ఏ భాషనైనా అనువదించడంలో కలిగే ప్రధాన సమస్య “నుడికారం” తెలుగు అస్సామీ విషయంలో మాకున్న ప్రధాన బలం :మేము చెరొక భాషలో మా బాల్యాన్ని సంపూర్ణంగా అనుభవించాము.
ప్రాస వంటి అంశాలను అనువదించడంలో మీ అనుభవం ఎలా ఉంది? గతంలో – వివిధ భారతీయ భాషల్లోని నాన్సెన్స్ పొయెట్రీ ని ఆంగ్లంలోకి అనువదించారు. అప్పట్నుంచే ఈ సందేహం – అసలు నాన్సెన్స్ లో ప్రధానంగా కనబడేదే ఆ ప్రాస – దాన్ని ఎలా అంత తెలివిగా అనువదించారు అని. మీ అనుభవం, అభిప్రాయం చెప్పండి.
ప్రాస, రూప శ్రద్ధ లో ఒక భాగం. రూప శ్రద్ధ గురించి ముందుగా చర్చించాము. కవితకు భావం ప్రాణం అయితే రూపం శరీరం. అనువాదంలో రెంటికీ చాలా ప్రాముఖ్యం ఉంది. సింహగంభీరంగా మాట్లాడే అమ్మాయిని ఊహించుకుంటే నేనేం చెపుతున్నానో అర్థం అవుతుంది. అయితే ప్రాస, యతి, ఛందస్సు, గణాలు మొదలైనవన్ని యధాతధంగా దిగబడలేవు కాబట్టి, వీలైనంతవరకు మూలాన్నించి గ్రహించడానికి ప్రయత్నించాలి. ఉదాహరణకు ఒక కవిత గురుబాహుళ్యం అవడం వలన గంభీరమైన పోకడ అనిపించవచ్చు, అది అనువాదంలో కూడా గంభీరమైన పోకడతో ఉండాలి.
నాట్యం నేర్చుకోవాలంటే చేతి ముద్రలు, కాళ్ళ అడుగులు నేర్చుకున్న తర్వాత నాట్యాన్ని అభ్యసిస్తాము. సంగీతం స్వరాల సాధనతో మొదలెడతాము. కానీ లలిత కళలో పరమోత్కృష్టమైన కవిత్వాన్ని రాయడనికి మాత్రం పట్టుమని పది కవితా రూపాలనైనా ఆకళింపు చేసుకోరు, అదేమంటే ఛందోబందోబస్తులను ఛట్ ఫట్ మని త్రెంచుతున్నాం అంటారు, అంతేగానీ ఆ ఛందో బందో బస్తులను తెంచడానికి ముందు శ్రీ శ్రీ లో ఎంత ఛందోసంపత్తి ఉందో గుర్తించరు.
సరే కవితారూపం అనువాదాలలో ఎంత ముఖ్యమో తెలియాలని ఈ ఉపోద్ఘాతం, ఇకపోతే మేము అనువాదాలు చేసినప్పుడు కవితా రూపాన్ని సంగ్రంగా అర్థం చేసుకొని అస్సామీ భాషకు అనువుగా మలచే వాళ్ళం. తెలుగులో ప్రాస అస్సామీ లో అంత్య ప్రాసగ మారేది, యతి వంటి ప్రత్యేకతలు పట్టుకు రావడానికి ప్రయత్నించాము.
ఒక్కో ప్రాంతంలోనూ కొన్ని ప్రత్యేక సంప్రదాయాల వంటివి ఉంటాయి కదా. ఆ భాషా సాహిత్యంలో అవి కనిపిస్తాయి. ఇలాంటి వాటిని ఆ సంప్రదాయాలతో పరిచయం లేని వారికి – అనువాదం చేస్తున్నప్పుడు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ప్రత్యేక సంప్రదాయాలని అనువాదకులు వివిధ రకాలుగా అనువదించారు
1. లక్ష్య భాషా సంప్రదాయాలలో సమానమైన సంప్రదాయాన్ని వాడడం
2. మూల భాషా సంప్రదాయాలను/పదాలను ఉన్నవి ఉన్నట్టుగా ఉటంకించి వాటి గురించి పాద సూచికలను ఇవ్వడం.
ఈ విషయం అనువాదకుడి తీసుకున్న స్వేచ్చ పై ఆధారపడి ఉన్నా, మేము రెండవ విధానానికే మొగ్గు చూపుతాము. కానీ ఎన్నో సంప్రదాయాలు తెలుగు వారిలో అస్సామీయులలో కలుస్తాయి కాబట్టి అంత సమస్య లేదు, ఉదాహరణకి, భూషణ్ చెల్లెలి గీతాలులో “కొంగా కొంగా పూలెయ్” అనే ఆటని అస్సామీ లో చిన్న పిల్లలు “బొగోలీయే బొగా ఫుట్ దీజా” అని ఆడుకుంటారు, అవే పదాలను ఉన్నదున్నట్టుగా వాడేశాము.
మన సంస్కృతులు చాలా వరకు కలవడం వలన ఈ ఇబ్బందులు ఎక్కువగా ఎదుర్కోలేదు.
ఇలాగే అనువాదాల్లో ఆసక్తి ఉన్న, కొత్తవారు మిమ్మల్ని సలహా కోసం సంప్రదిస్తే మీరు ఏం చెప్తారు?
అనువాదాలు అభ్యాసం చెయ్యడమే, మంచిగా వచ్చాయా లేదా అనేందుకు “ప్రమాణమంతః కరణ ప్రవృత్తయః”. కానీ గోథే (Goethe), వాల్తేర్ బెంజమిన్(Walter Benjamin), జాక్స్ డెర్రిడా(Jacques Derrida) వంటి ప్రముఖుల అభిప్రాయాలు అలస్టయిర్ రీడ్, జాన్ ఫెలిస్టనర్ వంటి అనువాదకుల అనుభవాలు చదవవచ్చు. తెలుగులో హాయిగా భూషణ్ రాసిన నేటి కాలపు కవిత్వం తీరుతెన్నులు లోని వ్యాసాలు “అనువాదం లో మెలకువలు” మొదలైనవి ప్రపంచ ప్రముఖుల ప్రమాణాలతో సరితూగుతాయి. అంతేకాక అనువాదాలు చేసేటప్పుడు జరిగే తప్పుల చిట్టా కోసం అదే పుస్తకంలోని “Hibiscus on the lake”(వేల్చేరు నారాయణ రావు అనువాదాల మీద విమర్శ) అన్న వ్యాసం బాగా పనికొస్తుంది.
ప్రత్యేకంగా కవితానువాదం కతానువాదం కంటే క్లిష్టమైన ప్రక్రియ అనిపిస్తుంది నాకు (నాకేమీ అనుభవం లేదు అనుకోండి… అలా అనిపించింది..అంతే!). మీరేమంటారు?
అవును, కవిత్వానువాదం కష్టమైన ప్రక్రియే.
అలాగే, హైకు వంటి కవిత్వాన్ని – అనువాదం చేసేటప్పుడు – ఒక రకంగా ఆలోచిస్తే, పదాలు తక్కువుంటాయి కనుక, తడుముకోనక్కర్లేదేమో పై కేస్ లో లాగా.. అనిపిస్తుంది. కానీ, నాబోటి వారికీ రెండు మూడు సార్లు చదివితే కానీ అర్థం కావు హైకులు…అలాంటప్పుడు….అనువాదం చేసేటప్పుడు ఎలా ఉంటుందో? అనిపిస్తుంది. మీరు అనువాదం చేసిన కవితల్లో… ఈ తరహా కవితలు ఉన్నాయా?
(నవ్వుతూ) పదాల సంఖ్య అనువాద క్లిష్టతకు కొలబద్ద కాదు. కవితను నువ్వు సంపూర్ణంగా అనుభవించావా పదాలు వాటంతటవే వచ్చి పడతాయి, ఎంత పెద్ద కవితైనా…
సుకుమార్ రాయ్ తరహా Nonsense Verse ను అనువదించడం మహా కష్టం అని నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక చదువరిగా అలంటి కవిత్వం చదువుతూ అనువాదం గురించి తలచుకున్నప్పుడు నాకు కలిగే భావన. అనువాదకులుగా మీ అభిప్రాయం ఏమిటి ?
ఏ కవితైనా(అది కవితైతే)అనుభవిస్తే అనువాదం చెయ్యడం తేలిక. ఇంకొక ముఖ్యమైన విషయం అనువాదాలెప్పుడూ మన మాతృభాషలోనే సాధ్యం. మన మాతృభాషలోనుంచి వేరే భాషలోకి అనువాదం చెయ్యడమంటే నీరు మెరకనెరగడమే. “Nonsense Verse” నేను చదవలేదు.
చివరగా: మీ అభిమాన రచయితలు/కవులు ఎవరు?
పవన్ కు:
ప్రాచీనుల్లో: పోతన, శ్రీనాధుడు, ధూర్జటి
ఆధునిక పద్యకవుల్లో: జాషువా (ముఖ్యంగా ఫిరదౌసి కావ్యం)
ఆధునికుల్లో: శ్రీశ్రీ (ముఖ్యంగా నడక), ఇస్మాయిల్ , భూషణ్
ప్రపంచ సాహిత్యంలో: నెరుడా
సంగీతకు:
అస్సామీ:నవకాంత బారువా,దేవకాంత బారువా
తెలుగులో: భూషణ్
ప్రపంచ సాహిత్యంలో: మొంటాలే, పాల్ సెలాన్
Rama
anna,
Interview is engaging , cool ..
proud of you bro..
Assame ardham kaadani nenanukonke
Ardhangi ardham baga cheppavee..
రవి
@తమ్మినేని యదుకుల భూషణ్:
ఈ కార్యం వెనుక మా సివిల్ కవి ఉండడం నా కెంతొ సంతొషంగా ఉంది.
నీ రచనలు ఎక్కడ ప్రచురిస్తారు? నీ గూడు స్దల విలాసం చెబితె
నీ రచనలును చదివి మెము అనందిస్తాము.
-రవి.
రవి
@గరికపాటి పవన్ కుమార్:
నీకు మంచి తరుణం తీరిక ఎప్పుడొ చెబితె అప్పుడు మాట్ట్లాడుతాను.
-రవి
గరికపాటి పవన్ కుమార్
సాహిత్యాభిమానులతో అభిప్రాయాలను పంచుకుందామని మొదలెట్టిన ఈ పనివల్ల స్నేహితుల అభిమానం ఇంతగా కురుస్తుందని అనుకోలేదు. ఇది నాకు, సంగీతకు ఎంతో అనందాన్ని, ప్రేరణను కలిగించాయి. ఈ వేదికను అందచేసిన సౌమ్య, ఫూర్ణిమలకు కృతజ్ఞతలు.
చాలా మంది పాత స్నేహితుల కోసం నా కొత్త నంబర్లు : 908 635 2638 (సెల్లు), 414 763 4345 (ఇల్లు)
తమ్మినేని యదుకుల భూషణ్
ఎవరైనా సరే ,పవన్ నుండి నేర్చుకోవలసినది కవిత్వం చదివే పధ్ధతి.
ఎంతటి దుష్కరకవితనైనా ఓపికతో వెంబడించి అర్థాన్ని సంగ్రహించగలడు.
ఒక జీవితంలో సాధించవలసినవెన్నో :నీవు కవివైతే ఒక
నిర్దుష్టమైన కవితను రాయాలి.పాఠకునివైతే అటువంటి కవితను
అర్థం చేసుకోగలగాలి ;విమర్శకుడవైతే ఆ కవితను గుర్తించి ,దాని
కర్తకు సాహిత్యంలో తగు స్థానమిచ్చి యథారీతిన గౌరవించాలి.
అట్టి కవితను అనువాదకుడు తా నేర్చిన రీతిని అనువదించాలి.
ఇదీ క్రమం. కవి, పాఠకుడు,విమర్శకుడు ,అనువాదకుడు ఈ
నలుగురే కవితా లతను నాటేది,పెంచేది,పైకెత్తేది,పాకించేది.
తెలుగునాట ఈ క్రమం అపక్రమంగా మారిపోయింది.
ఉత్తమ పాఠకుడు కానివాడు విమర్శకుడు/అనువాదకుడు
కాలేడు.ఒక కవితను అర్థం చేసుకొన్న తర్వాతే విమర్శా
అనువాదం.చాలా మంది అనువాదకులు విమర్శకులకు
ఇటువంటి శిక్షణ లేదు. వారికి మూలంలో కవిహృదయం
తెలుసుకొనే ఓపిక తీరిక లేవు.కాబట్టి అనువాదాల్లో
దోషాలకు అంతు లేదు. పవన్ నెరుడా అనువాదాలను
స్పానిష్ మూలంతో సరిచూస్తున్నప్పుడు అతనికి
మూలంలోని నడకను తెలుగు లోకి పట్టుకు రావడం
మీద అపారమైన శ్రద్ధను గమనించి ఎంతో ఆనందించాను.
అస్సామీ మహాకవి నీలమణి ఫుకాన్ కవితల సంకలనం
నేను తెచ్చిపెట్టడమే తరువాయి,ఆయనతో మాట్లాడి
అనువాదాలు మొదలు పెట్టేశాడు.పవన్ లాంటి
అనువాదకులు భారతీయ భాషల్లో ఒక పది మంది
(అలాగే ఐరోపియ ,స్లావిక్ ,నోర్డిక్ భాషల్లోను ) బయల్దేరితే
మన భాష సుసంపన్న మైపోదు?? ఇప్పటికీ మన భాష
ఎక్కువ మందికి తెలియదు.Telegu అని spelling
mistake తోనే ఉటంకిస్తారు పలుచోట్ల ( ఉదా: చూడుడు
కొత్త economist సంక్షిప్త వార్తల్లో )
పవన్ ,సంగీతలకు నా విన్నపం: అనువాదాలు చేసేప్పుడు
మీ చర్చలను ఒక run book లో రాసుకొని ,పుస్తకం
వేస్తున్నప్పుడు దాన్ని notes గా ఇస్తే భావి తరాలకు
మంచి మార్గదర్సకత్వం నెరపిన వారవవుతారు.
ఒక సత్కార్యాన్ని తల పెట్టిన సౌమ్య,పూర్ణిమలకు అభినందనలు.
తమ్మినేని యదుకుల భూషణ్.
raghu
The interview is showing the knowledge/information they have in poetry/literature, the effort behind that and the coordination between them…
GoodWork done should be appreciated… In Career, Pavan is doing good, got some prestigious awards too… With the cooperation/coordination from spouse, In poetry/literature field and in some other fields of his interest ,I wish ,he will deliver things appreciated by professionals/intellectuals/public…
keepUp the goodWork…
*RaghuDVR
రవి
పవన్ చాల చక్కటి కార్యాన్ని బుజాన వెసుకున్నవు, మంచి కవితలు, రచనలు వెరె బాష వారికి, వారి బాష లొనివి రచనలు మనకి అందిచడం, మీ ఇద్దరికి నా హ్రుదయ పుర్వక అభినందనలు.
నువ్వు నా ఒకప్పటి మిత్రుడవడం నాకు కొంచెం గర్వంగా ఉంది.
మళ్ళి నీతొ చదరంగం అదలని ఉంది, న్వ్వు బొస్టన్ వచ్హినప్పుదు తప్పక కలుద్దాము, ఇది నా అహ్వనముగ తీసుకొ.
-రవి
Rajasekhar kodali
Pavan,
Mee Idhari (Pavan & Sangeeta) interview chaduvu tunte chala bagundhi, Adi Naku telsina Pavan(VRSEC)interview ante inka bagundhi. You keep it and if possible translate Vemana Sathakam, In my openion it is also a good one.
Nee RAJ.
Munikumar Puvvula
Maa HUSH-BHALL ( memu kalisi chaduvukonetappati maata )ki aadi nundi ilaanti aasakthule. Praasa thanaki praanam. Mari Yathi gurinchi antha pattimpu ledanukondi.
Kaani annitini minchina Kavithvam pai Athanikunna Jijnaasa enthainaa koniyaadadaginadi. Mana rojuvaari aavarthanalo intuvanti naanyamaina aasakthulaku manam emaathram samayaanni ketaayisthunnaamo okkasaari simhaavalokanam chesukonte arthamauthundi.
PAVANAM(wind) GARIKA PAATIDE AYINAA, ADI ICCHE SANGEETHA SUGANDHAM SRAVANAANANDAM ( in Flute ).
All the best Pavan (Chalam).
Muni
Chundi
Maa Siddhartha Engg. college candidate and my best friend Pavan interview chadavadam entho anandanubhutini migilchindi..!! Good luck babai.!!
Chandra Sekhar
Pavan,
This is engaging and interesting. I liked the whole interview.
All i can say is i am longing to read your translations.
srinivas
చావా కిరణ్ గారు నెట్ లో మీ పేరు చాలా రోజుల నుంచి వింటున్న. హెచ్.ఆర్కే. గారి గురించి ఇంకాస్త తెలుసు. ఖమ్మం గాలి పీల్చి, నీళ్ళు తాగి వచ్చిన హు అండ్ హు ఆఫ్ నెట్ కలుసుకుంటే బాగుంటుంది. ప్రాంతీయ అభిమానం కాదు. బెటర్ అండర్ స్టాండింగ్ ఆఫ్ ఎమోషన్స్ కోసమే. ముఖ్యంగాఒక ప్రాజెక్ట్ గురించి మీతో చర్చించాలి.
ఒక్క సంక్షిప్త సందేశం కొట్టారంటే నేను కాల్ చేస్తా. 9949610330
హెచ్చార్కె
@chavakiran: హా తెలిసెన్ మీదియు ఖమ్మమే…
ఇంటర్వ్యూ really cool.
జ్యోతి
నమస్తే సౌమ్య గారు, నాపేరు జ్యోతి, మీ ఆర్టికల్ చాల బాగుంది. నేను కూడా ఈమద్య ఒక తెలుగు వార్తల వెబ్ సైట్ ను ప్రారంబించారు. దయచేసి http://www.apreporter.com చూసి, మీకు నచ్చితే మీ కామెంట్స్ ఇవ్వండి.
దన్యవాదములు
జ్యోతి
bollojubaba
informative and inspiring
bollojubaba
Independent
Wow..very engaging until the end. Pretty impressive!
Learnt couple of things.
chavakiran
Cool. ఎంతయినా మా ఖమ్మం వాళ్లు గట్టి వాళ్లు:)