కురియన్ ఆత్మకథకు తెలుగు అనువాదం – నాకూ వుంది ఒక కల
(ఈ పుస్తక ఆవిష్కరణ సందర్భంగా వరప్రసాద్ గారు చేసిన ప్రసంగ వ్యాసాన్ని (12 జనవరి, 2008) కొన్ని మార్పులతో ఇక్కడ పునర్ముద్రిస్తున్నాము.)
ఈ పుస్తకం అందరూ కొని చదవాలని నా ఆకాంక్ష. జీవితచరిత్రలంటే ఒక పట్టాన చదవరని అంటారు. కానీ ఈ పుస్తకం ఏ యండమూరి వీరేంద్రనాథ్ నవలకూ తీసిపోదు. పుస్తకం చదివి చాలా ఉత్తేజాన్ని పొందాను. ఈ పుస్తకంలో అనేక విషయాలున్నాయి కాబట్టి, వాటిని చెప్పాలన్న మహా వుబలాటం ఉంది కాబట్టీ ఈ వ్యాసం పెద్దగా ఉంటుంది. మధ్యమధ్యలో ఒక ఎంటర్‍ప్రెనార్‍గా నా అనుభవాలు కూడా రంగరిస్తాను. కురియన్ ఓ సక్సెస్‍ఫుల్ బిజినెస్‍మన్ మాత్రమే అయితే ఆయన ఆత్మకథ యింత ఉత్సుకతతో చదవకపోదును. ఐయోకాకా ఆత్మకథ యింట్రస్టింగ్‍గానే వుంటుంది. చదివాను. కానీ కురియన్‍లో విశేషమేమిటంటే ఆయన బిజినెస్ సమాజపు తీరుతెన్నులతో ముడిపడినది ఒక సిద్ధాంతానికి కట్టుబడినది.
సమాజంలో అన్ని రుగ్మతలకూ మూలకారణం సంపద పెరగకపోవడం, పెరిగిన సంపద ఫలాలు అందరికీ అందకపోవడం. వీటికోసం సాయుధవిప్లవాలు రావలసిన పని లేదని, సహకారోద్యమం ద్వారా అందర్నీ కూడగలుపుకుని వెళితే చాలునని సామ్యవాదులు అంటారు. ’అందరి కోసం ఒక్కడూ నిలిచి, ఒక్కడి కోసం అందరూ నిలిచి’ సహకారమే మన వైఖరిగా, ఉపకారమే మన వూపిరిగా బతికే రోజు వస్తుందని మహాకవి అన్నా, దేశస్వాతంత్ర్యానంతరం సహకారోద్యమాన్ని భ్రష్టు పట్టించి ’ఉమ్మడి గేదె పుచ్చి చచ్చిందన్న” తెలుగు సామెతను నిజం చేశారు మన పాలకులు. అయినా సహకారోద్యమం మహారాష్ట్ర, గుజరాత్‍లలో విజయవంతమైంది. ముఖ్యంగా “అమూల్” ద్వారా భారతదేశంలో వైట్ రివల్యూషన్ తెచ్చిన కురియన్ సహకారోద్యమానికి, భారతీయ రైతుల అభ్యున్నతికి, గ్రామీణ వికాసానికి మారుపేరుగా నిలిచారు. ఆ మహనీయుడు ఆత్మకథ తెలుగు అనువాదాన్ని ఆవిష్కరించే అవకాశం నాకు లభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
కురియన్ చేసినదేమిటి? కొంతమంది రైతులనుండి పాలు సేకరించి దాన్ని తెలివిగా మార్కెట్ చేయడం మాత్రమే అనుకుంటే పొరబాటు. ఆనంద్ జిల్లాలో పాలసహకారోద్యమం బలపడిన కొద్దీ సాంఘికపరమైన ఎన్నో మార్పులు వచ్చాయి. పాలసేకరణ కేంద్రంలో ఎటువంటి జాతి, కుల, లింగ వివక్షతా లేకుండా అందర్నీ క్యూలో నిలబెట్టడం ద్వారా మనమంతా ఒకటే అనే స్పృహ కలిగింది వారికి. ఆదాయం పెరిగే క్రమంలో పాడియావుల పెంపకం స్త్రీలపరమై ఆమె భర్తతో సమానంగా సంపాదించి ఒకపాటి సమానతను సాధించింది. అమూల్ ఫ్యాక్టరీలో పశువులను సందర్శించిన స్త్రీలకు గర్భధారణ పట్ల, అప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తల పట్ల అవగాహన పెరిగింది. తమ గ్రామంలో వున్న పాలసేకరణ కేంద్రంలోని శుచిశుభ్రతలు వారిని ఆరోగ్యం పట్ల ఆలోచించేట్లా చేశాయి. అమూల్ నియమించిన పశువైద్యుల అంకితభావాన్ని చూసిన గ్రామీణులు తమకు కూడా అటువంటి వైద్యసదుపాయాలు కావాలని డిమాండ్ చేశారు. దాంతో అమూల్ వాళ్లు త్రిభువన్‍దాస్ ఫౌండేషన్ స్థాపించ వలసి వచ్చింది.
ఇటువంటి మల్టిప్లయర్ ఎఫెక్టుతో సర్వతోముఖ అభివృద్ధి జరగడానికి చాలా కథే జరిగింది. ఆ కథలో తానొక్కడే కథానాయకుణ్ని కాదంటారు కురియన్. ఎందరో చేతులేసి రథాన్ని నడిపించారు. ఎంఎన్‍సీలతో, ఆనాటి ప్రజల మైండ్‍సెట్‍తో, సాటి వ్యాపారస్తులతో, బ్యూరాక్రసీతో, నాయకులతో – వేయేల, కనబడిన వారందరితోనూ పోరాడారు. కానీ అప్పటికీ, యిప్పటికీ తేడా ఏమిటంటే భారతస్వాతంత్ర్యం కొత్తగా వచ్చిన వేళ కాబట్టి చిత్తశుద్ధి గల నాయకులెందరో వుండేవారు. వారు కురియన్‍కు అండగా నిలిచారు.
నేను ఎలక్టానిక్స్ యింజనీరింగ్ నుంచి జెనటిక్ యింజినీరింగ్‍కు వచ్చినట్లే కురియన్ మెటలర్జీ యింజినీరింగ్ నుండి డైరీ ఇండస్ట్రీకి వచ్చారు. నేను కావాలని వస్తే ఆయన విషయంలో విధి ఆయన్ను అటు నడిపించింది – తన యిష్టానికి వ్యతిరేకంగా! మద్రాసులోని ఇంజినీరింగ్ కాలేజీలో యింజినీరై టాటా వారి టిస్కోలో చేరారు. దరిమిలా భారతదేశ తొలి ఆర్థికమంత్రి ఐన జాన్ మత్తయ్ యీయనికి మేనమామ. అప్పట్లో టాటా యిండస్ట్రీస్‍కి డైరక్టర్. స్వంత మెరిట్ పై వుద్యోగం తెచ్చుకున్నా మత్తయ్ మేనల్లుడిగా గుర్తింపు వస్తూండడం యీయనికి నచ్చలేదు. రాజీనామా చేసేశాడు. మెటలర్జీ, న్యూక్లియర్ ఫిజిక్స్ ల్లో పై చదువులకు ప్రభుత్వస్కాలర్‍ఫిప్‍కై అప్లయ్ చేశాడు. అయితే డైరీ యింజినీరింగ్‍లో సీటిచ్చారు. కాదంటే పై చదువుల ఛాన్సు పోతుందని యీయన ఒప్పుకున్నాడు. 1946లో అమెరికాలోని మిచిగాన్ యూనివర్శిటీకి వెళ్లి తను అనుకున్నవే చదివాడూ. మాస్టర్స్ డిగ్రీ సంపాదించాడు. డైరీ యింజనీరింగ్‍లో చిన్న చిన్న కోర్సులు మాత్రం చేశాడు. ఇండియాకు తిరిగి వచ్చాక డైరీ డిపార్టుమెంటులో చేరకపోతే యిచ్చిన 30 వేల స్కాలర్‍షిప్ తిరిగి యివ్వాలన్న భయంతో ఆనంద్‍లో చేరాడు. అదే ఆయన కార్యక్షేత్రం అయింది.
చాలా మంది అనుకునేట్టు ఆనంద్‍లో పాల సహకార సంఘాన్ని కురియన్ ప్రారంభించలేదు. దానిలో ఆయన చేరేందుకు ముందే చాలా చరిత్ర వుంది. బొంబాయిలో వున్న యింగ్లీషువారికోసం నాణ్యత గల పాల గురించి బ్రిటిషు ప్రభుత్వం అన్వేషించింది. అక్కడికి 350 కి.మీ, దూరంలో బరోడాకు దగ్గర్లో వున్న ఆనంద్‍పై వారి కన్ను పడింది. ఐ కైరా జిల్లాలో వుంది. ఓ పార్సీ ఆయన అక్కడ పాలను సేకరించి వెన్న తయారుచేసి పోల్సన్ పేరుతో అమ్మేవాడు. అతన్ని తమకై పాలు సప్లయి చేయమని పభిత్వం అడిగింది. చుట్టుపట్ల గ్రామాలలో పాల సేకరణపై తనకు గుత్తాధిపత్యం యిస్తే చేస్తానన్నాడతను. ఇచ్చారు. దానివల్ల కాంట్రాక్టర్లు బాగుపడి కైరా రైతులు నష్టపోయారు. వారు తమ జిల్లా వాడే అయిన సర్దార్ పటేల్ వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. ఆయన వాళ్లని సహకార డైరీ పెట్టుకోమని సలహా ఇచ్చాడు. వాళ్లను సంఘటితం చేసే పనిని మొరార్జీ దేశాయ్‍కు అప్పగించాడు. ఆయన ఓ నిస్వార్థ నాయకుడు త్రిభువన్‍దాస్ పటేల్‍కు యీ పని అప్పగించాడు. ఆయన కైరా సహకార డైరీ ప్రారంభించి అధ్యక్షుడిగా వ్యవహరించాడు. మొరార్జీ దేశాయ్ నాయకత్వాన కైరా రైతులు సమ్మె చేసి పోల్సన్ గుత్తాధిపత్యానికి గండి కొట్టారు.
అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం బాంబే మిల్క్ కమిషనర్ ఖురోడిని సలహా అడిగింది. పాలవ్యవహారం సాంకేతికమైన వ్యవహారం. ఈ ఇంగ్లీషు రాని గాంధీటోపీ గాళ్లకు ఏం తెలుస్తుంది? వాళ్లను స్వయంగా వ్యాపారం నడిపి చూడమనండి. ఎలాగూ ఫెయిలవుతారు అని సలహాయిచ్చాడు ఖురోడి. అప్పుడు త్రిభువన్‍దాస్ ఊరూరా తిరిగి గ్రామ సహకార సంస్థలు అయిదింటిని ప్రారంభించగలిగాడు. ప్రభుత్వాన్ని అడిగి పాత డైరీని కొని దానితో అవస్థలు పడుతున్నాడు. 1949లో కురియన్ పాలపొడి తయారు చేసే ప్రభుత్వ క్రీమరీలో పనిచేయడానికి ఆనంద్ వచ్చేసరికి మూడేళ్లగా ఆయన ఆ డైరీతో కుస్తీ పడుతున్నాడు.
కురియన్‍కు ఆనంద్ ఏమాత్రం నచ్చలేదు. అమెరికా నుండి తిరిగి వచ్చిన యింజినీరింగ్ పోస్ట్ గ్రాడ్యువేట్‍కి పదివేల జనాభావున్న పల్లెటూరు ఎలా నచ్చుతుంది? పైగా ఈయన బ్రహ్మచారి, మాంసాహారి కావడం వలన ఎవరూ యిల్లు యివ్వలేదు. ఓ కారు షెడ్‍లో కాపురం వుండేవాడు. ప్రభుత్వం ఫ్యాక్టరీలో అందరూ సోమరులుగా కూచోడం ఆయనకు నచ్చక తను ఉద్యోగం మానేస్తానని ప్రతీ నెలా ఉత్తరాలు రాసేవాడు. చివరకు ఇతని గోల భరించలేక 8 నెలలు తర్వాత రిలీవ్ చేసేసారు. ఇక ఆనంద్‍నుండి పెట్టే బేడా సర్దుకుని వెళ్లిపోదామనుకుంటూండగా ఆయన్ని ఆపేసిన వ్యక్తి – కైరా కోపరేటివ్ డైరీ అధ్యక్షుడు త్రిభువన్‍దాస్.
కోపరేటివ్ డైరీ తరఫున అతను ప్రభుత్వంనుండి తీసుకున్న డైరీని ఎలా నడపాలో తెలియక ఆ యంత్రాలతో కుస్తీ పడుతున్నాడాయన. ఓ సారి వచ్చి కురియన్‍ను సలహా అడిగితే ఆయన ఫలానావి కొనండి అని సలహా చెప్పి కొనిపించాడు. అవి యివాళో రేపో వచ్చేట్టున్నాయి. ’నీకింకా వుద్యోగం ఏదీ రాలేదు కదా, రెండునెలలుండి ఆ మెషీన్లను యిన్‍స్టాల్ చేయించి వెళ్లు. రెండునెలల జీతం యిస్తాను.’ అన్నాడాయన. ఆయన మీద గౌరవంతో కురియన్ ఒప్పుకున్నాడు.
నిజానికి భారతీయ ప్రజలకి ఎంతో శక్తియుక్తులున్నాయి. యూరోపంత మార్కెట్ వుంది. కానీ మనకు కావలసినది మనల్ని నడిపించే వృత్తి నిపుణులు. ఈ ప్రజను, ఆ నిపుణులను కలిపే దార్శనికత ఆరోజు త్రిభువన్‍దాస్ అనే ప్రజానాయకుడు కనబరిచారు కాబట్టే మనకు కురియన్ దక్కారు. రెండు నెలలకోసం అక్కడ నిలిచిపోయిన కురియన్ తన జీవితమంతా అక్కడే గడిపేశారు. తన స్నేహితులను తీసుకుని వచ్చారు. రకరకాల ప్రయోగాలు చేశారు. తమ ఉత్పాదనను ఎలా కమ్మర్షియలైజ్ చేయాలో రైతులకు నేర్పారు. తనకోసం పనిచేసినప్పుడు కలిగే ఆనందం తాత్కాలికమని, యితరులకోసం చేస్తే కలిగే ఆనందం శాశ్వతమనీ స్వయంగా తెలుసుకుని అందరికీ నేర్పారు. అనేక అవార్డులు గెల్చుకున్నారు. ఇదీ స్థూలంగా కురియన్ విజయగాథ. దీన్ని ఆయన క్రానలాజికల్ ఆర్డర్‍లో రాసుకుంటూ పోయారు. నేను అలా కాకుండా సబ్జెక్టువారీగా కొన్ని విషయాలు చెబుతాను.
మొదటిది – ఆయన వృత్తిపరంగా ఎదుర్కొన్న కొన్ని ఛాలెంజ్‍లు
మన గేదెలు చలికాలంలో రెట్టింపు పాలిస్తాయి. అదనంగా వచ్చిన పాలను ఎలా అమ్మాలి అన్నది ప్రశ్న. బొంబాయి పాల కమీషనర్‍ను అడిగితే నాకు ఏడాది పొడుగునా డిమాండ్ ఒకేలా వుంటుంది, నాకు చలికాలంలో ఎక్‍స్ట్రా అక్కరలేదు అన్నాడు. నిజానికి అతను తక్కిన కాలాల్లో న్యూజిలాండ్ నుండి పాలపొడిని దిగుమతి చేసుకుని పాలగా మార్చి డిమాండ్ తట్టుకుంటున్నాడు. కనీసం చలికాలంలోనైనా దిగుమతి మానేసి, రైతుల నుండి పాలు తీసుకోవచ్చు కదా అంటే అతను వినలేదు.
సాబటేజ్ ప్రయత్నాలు కూడా జరిగాయి. ఈ బొంబాయి మిల్క్ కమీషనర్ ఉద్యోగస్తులు వీళ్లు సప్లయి చేసిన పాలల్లో చచ్చిన యీగలు పడేసి యాగీ చేసేవారు. ’ఆ యీగ యిలా ఇవ్వండి, దాని ఊపిరితిత్తుల్లో పాలు వెళ్లాయో లేదో చూస్తాను’ అనేవాడీయన. వాళ్లు సమాధానం చెప్పకుండా తప్పించుకునేవారు. ఇంకోసారి వాళ్ల కెమిస్టులు ఎంత దారుణంగా చేశారంటే – ఫార్మాలిన్ అనే విషపదార్థాన్ని అమాయకులైన రైతుల కిచ్చి రహస్యంగా పాలల్లో కలిపించి, మళ్లీ వాళ్లే ఆ పాల గురించి ఫిర్యాదు చేసి దానిపై అల్లరి చేశారు.
ఇంకోసారి యునిసెఫ్‍వాళ్లు ఆనంద్ వచ్చి గేదెపాలనుండి పాలపొడి తయారుచేసేందుకు కావల్సిన పరికరాల్ని ఉచితంగా యిస్తామన్నారు. ఈ బొంబాయి పాల కమీషనర్ అడ్డుపడి అలా గేదెపాలనుండి తయారుచేయడం అసాధ్యమని విదేశీ నిపుణులు రాసిచ్చారని ఉత్తరాలు చూపించి ఆ ఆఫర్‍ను చెడగొట్టాడు. అప్పుడు కురియన్ సహచరుడు, స్నేహితుడు, యీ యజ్ఞంలో భాగస్వామి అయిన హరిదాస్ దాలయ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు.
ఆనంద్ తరహా ప్రాజెక్టులు దేశమంతా పెట్టాలని ప్రభుత్వం కోరినప్పుడు యీయన అనేక రాష్ట్రాలకు వెళ్లాడూ. మీ కోపరేటివ్ వస్తే మా మిల్క్ కమిషన్ మూసేయాల్సి వస్తుంది. మాకు బదిలీలు అవుతాయి. అలాటప్పుడు మేము మీకెందుకు మద్దతిస్తాం? అని అధికారులు నేరుగా అడిగేసేవారు. ఇలా అడ్డుకొట్టే అధికారులు, వాళ్లకు వత్తాసు యిచ్చే రాజకీయ నాయకులు ఎప్పుడూ వుంటారు. వాళ్లు అధికారాన్ని తమ చేతిలోంచి జారిపోనివ్వరు. ఆయన బ్యూరాక్రసీని ఘాటుగా విమర్శించాడు. డెమోక్రసీ అంటే ఫర్ ది బ్యూరాక్రసీ, బై ది బ్యూరాక్రసీ ఆండ్ ఆఫ్ ది బ్యూరాక్రసీ అన్నాడు. ఏ సంస్థయినా సమర్థవంతంగా పనిచేయాలంటే ప్రభుత్వం కలగజేసుకోకూడదన్నాడు. ఆయన ప్రభుత్వోద్యోగిగా వుండడానికి ఇష్టపడలేదు. తను రైతుల ఉద్యోగిననే చెప్పుకున్నాడు.
అమూల్ ప్రయోగం వంటనూనె విషయంలో కూడా జరిగింది. హెచ్.ఎం.పటేల్ అభ్యర్థనపై కురియన్ దానిపై కూడా దృష్టి సారించి ’ధారా’ బ్రాండ్ సృష్టించారు. కానీ అది అమూల్ అంత సక్సెస్ కాకపోవడానికి కారణం దళారీల చాకచక్యమే అంటారు. కావాలంటే వాళ్లు సరుకుని ఎన్నాళ్లయినా దాచి వుంచగలరు. కానీ పాల విషయంలో అలా దాచితే పాలు పాడయిపోతాయి. అందువల్ల అమూల్ విషయంలో వాళ్లు ఆటలు సాగలేదు, ’ధారా’ విషయంలో సాగాయి.
1960లో యూరప్‍లో పాల ఉత్పత్తులు – పాలపొడి, బటర్ ఆయిలూ – పెరిగిపోయి మేట వేసుకుపోయాయి. వాటిని వదుల్చుకోవాలని మనలాటి దేశాల ప్రజలకు ఊరికే యిద్దామనుకున్నారు వాళ్లు. అలా ఊరికే యిస్తే దేశీయంగా వుండే పరిశ్రమలు దెబ్బ తింటాయనీ, తర్వాత ఆ యూరోపియన్ కంపెనీలు ఎక్కువ ధరకు తన సరుకు అమ్ముకుని యిదంతా రాబట్టుకుంటాయని కురియన్ వాదించాడు. దానికి బదులు వాళ్లు వుచితందా యిచ్చినది ఎన్‍డిడిబి తీసుకుని, దాన్ని మార్కెట్‍లో అమ్మి, ఆ డబ్బులో ఆపరేషన్ ఫ్లడ్ నిర్వహించాలని ప్రతిపాదన తెచ్చాడు. ఆ విధంగా ఆ ఆఫర్‍ను దేశ స్వయం సమృద్ధిని నాశనం చేసేదానిగా కాకుండా, దానికి దోహడపడేదానిగా మలచుకోవాలని ఆయన ఊహ. అదే ఆయన ఆపరేషన్ ఫ్లడ్.
అయితే ఆపరేషన్ ఫ్లడ్ మొదటి దశ ఐదేళ్లనుకుంటే పదేళ్లు పట్టి 1970లో పూర్తయింది. ఇంతకాలం పట్టడానికి కారణం ఆటోమెటిక్ మిల్క్ వెండింగ్ మెషిన్లపై బ్యూరాక్రసీ విముఖత. కాయిన్ వేసే పబ్లిక్ టెలిఫోన్ బూత్‍లు పనిచేయటం లేదు కదా, యివి మాత్రం ఎందుకు పనిచేస్తాయి? అని వారి వాదన. పాలసీసాల బెడద తప్పిస్తే తప్ప ముందుకు సాగలేమని కురియన్ పట్టు. 200 మెషిన్లను దిగుమతి చేసుకుంటానంటే వీళ్లు పడనివ్వలేదు. చివరకు అవి లోకల్‍గా తయారు చేయించాడాయన. దానికి నాలుగేళ్లు పట్టింది. చివరకు స్కీము సక్సెసయింది. పాల రేషన్ తొలగిపోయింది.
varaprasaad.k
dr కురియన్ గురించి ఎంత చెప్పినా తక్కువే,జీవిత కాలమంతా ఒక నిబద్దతతో,ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెరవక తానూ నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడి సాధించి చూపిన ఆయన నేటి తరానికి,ముఖ్యంగా డైరీ పరిశ్రమకు మార్గదర్శి.
శ్వేత విప్లవ పితామహుడు డా.వర్గీస్ కురియన్ ఆత్మకథ “నాకూ ఉంది ఒక కల” | పుస్తకం
[…] (ఈ పుస్తక ఆవిష్కరణ సందర్భంగా వరప్రసాద్ గారు చేసిన ప్రసంగ వ్యాసాన్ని (12 జనవరి, 2008) కొన్ని మార్పులతో ఇదివరలో పుస్తకం.నెట్ లో ప్రచురించాము. ఆ వ్యాసం లంకె ఇక్కడ). […]
Chandra Sekhar Nanduri
ఏంతో హృద్యంగా రాసారు, పరిచయం, ఇది చదివాక అసలు పుస్తకం ఎప్పడు చదవగాలనో అని బెంగ పట్టుకుంది, నేను వున్న దేశం లో దొరికే పరిస్తితి లేదు.
చంద్ర.