అద్భుత చిత్రగ్రీవం
‘బాల సాహిత్యం’ అనగానే కేవలం నీతి సూక్తులూ ఉపదేశాలూ దెయ్యాలూ మాయలమంత్రాలూ గుర్తుకురావడం, అవే అందుబాటులో ఉండటం అనే దురవస్థ ఈనాటిది కాదనుకుంటాను. అంతకుమించిన బహుళమైన ఆసక్తులు పిల్లలకు ఉంటాయని తల్లిదండ్రులతో పాటు రచయితలు ప్రచురణకర్తలు సైతం మరిచిపోవడం దౌర్భాగ్యం కాక మరే మిటి? పేరుకేమో మన దగ్గర పిల్లల కోసం వేల పుస్తకాలు ప్రచురితమవుతున్నాయి. ముందుచెప్పుకొన్న అంశాలుకాక మరేవీ లేకపోవడం వల్లనే పిల్లలను అవి అంతగా ఆకర్షించలేకపోతున్నాయనుకుంటాను.
అన్ని ప్రకృతి వనరుల వలెనే మన దేశంలో వృక్ష సంపద, పక్షి సంపద అపారం. వీటి గురించి విషయాలను ఆసక్తికరంగా చెబుతూ చదివించగల పుస్తకాలు ఎన్ని అందుబాటులో ఉన్నాయి చెప్పండి? ఉన్న కొన్నీ చెట్లవో పిట్టలవో పేర్లు, శాస్త్రీయ నామాలూ, అడవుల విస్తీర్ణమూ వంటి ‘విజ్ఞానదాయక సమాచారం’తో నిండి ఉంటాయి. ఏ చెట్టు ఏదో, ఏ పిట్ట ఎక్కడుంటుందో సమాచారం తెలియడం అవసరమే. కాదనను. పక్షులను గుర్తించడం ఎలాగో తెలుసుకోవడం కన్నా పక్షుల పాటలను విని ఆనందించే శక్తి పిల్లలకు ముఖ్యం. ఇప్పుడు పరిచయం చెయ్యబోతున్న పుస్తకం ‘చిత్రగ్రీవం’ సరిగ్గా ఆ శక్తినే పిల్లలకు అందించగలుగుతోంది. ఈ పుస్తకంలో సాంకేతిక వివరాలు కథాగమనంతోనూ, వాస్తవాలు కల్పనతోనూ ఎంతో చక్కగా మిళితమై ఉన్నాయి. ఇంత మంచి పుస్తకం పునర్ముద్రణకు అరవయ్యేళ్లు పట్టిందన్నమాట భారతదేశంలో బాలసాహిత్యం ఎలాంటి స్థితిలో ఉందో చెప్పకనే చెబుతుంది. ఈ పుస్తకం 1928లో ‘న్యూ బెరీ మెడల్’ను గెలుచుకుంది. బాలసాహిత్యంలో విశిష్ట కృషి చేసిన వారికి అమెరికన్ లైబ్రరీ అసోసియేషన్‌వారు ప్రతి సంవత్సరమూ ఇచ్చే గొప్ప పురస్కారం ఈ న్యూబెరీ మెడల్. ఇంతకీ పుస్తకంలో విషయం ఏమిటి?
కథాకాలం 1920లు. అప్పట్లో కలకత్తా జనాభా పదిలక్షలయితే ఇరవై లక్షల పావురాలుంటాయని రచయిత అంచనా. ‘ప్రతీ మూడో కుర్రాడి దగ్గర కనీసం ఒక డజను వార్తలు మోసే పావురాలు, గిరిక్‌ల పావురాలు, పిగిలిపిట్టలూ, బంతి పావురాలూ ఉండటం కద్దు…’ అన్న వాక్యంతో మొదలవుతుందీ పుస్తకం. అలాంటి నగరంలో పదహారేళ్ల కుర్రాడి పెంపుడు పావురం చిత్రగ్రీవం. దాని తల్లిదండ్రులెవరు, అదీ లోకంలోకి ఎలా వచ్చింది, దాని చదువెలా సాగింది, దిశాజ్ఞానంలో శిక్షణ ఎలా పొందింది, దాని ఆకతాయితనం, అది తప్పిపోయినప్పుడు ఈ కుర్రాడు వెతుక్కున్న వైనం ఇవన్నీ మొదటి భాగం. రెండో భాగంలో చిత్రగ్రీవానికి ఇచ్చిన యుద్ధ శిక్షణ, అది చేసిన సాహసాలు, శతృస్థావరాలను కనిపెట్టిన తీరు ఉంటాయి. స్థూలంగా కథ ఇంతే. ఏదైనా మిఠాయి తిన్నప్పుడు మనకెలా అనిపించిందో మాటల్లో ఎంత చెప్పినా చదివే వాళ్లకు ఆ రుచి అందదు. అలాగే పుస్తకాల గురించి ముఖ్యంగా చిత్రగ్రీవం, వనవాసి వంటి పుస్తకాలు చదివితే తప్ప పాఠకులకు వాటి రుచి అందదు. అయితే ఒక్కమాట చెప్పుకోవాలి. ‘చిత్రగ్రీవం’ కేవలం ఓ పావురానికి శిక్షణనివ్వడం, అది అనేకరకాల సాహసాలు చెయ్యడం వీటి గురించిన కథే కాదు. ధైర్యం, విశ్వప్రేమ అన్న విశిష్ట సందేశాలను అందరికీ చేరవేసే వాహిక కూడాను. యుద్ధంలో గాయపడిన చిత్రగ్రీవానికి భయాన్ని తగ్గించి స్వస్థత కలిగించే బౌద్ధాచార్యుల మాట చూడండి…
“ప్రపంచంలోని సకల ప్రజానీకపు శాంతిసౌఖ్యాల కోసం రోజుకు రెండుసార్లు అనంతశక్తిని మేము ప్రార్థిస్తూ ఉంటాం. అయినా యుద్ధాలూ దారుణాలూ కొనసాగుతూనే ఉన్నాయి. మనుషుల్లోనే గాకుండా పక్షులూ జంతువులలో సైతం భయద్వేషాలు నెలకొంటూనే ఉన్నాయి. శారీరక రుగ్మతల కన్నా మానసిక రుగ్మతలు మరింత వేగంగా వ్యాపిస్తాయి. ఈనాటి మానవజాతిలో భయం, ద్వేషం, అనుమానం, వైమనస్యం ఇలాంటి వైరుధ్య భావాలు ఎంత బలంగా వేరూని ఉన్నాయంటే – వాటిని సమూలంగా నిర్మూలించడానికి కనీసం ఒక తరమైనా మారాలి. ఈ తరంలో మొదలెడితే కొత్తతరం వచ్చేసరికయినా మానవజాతి ఈ భావాల నుంచి విముక్తి పొందగలుగుతుందేమో!’
చిత్రగ్రీవం ముఖ్యంగా పిల్లలకోసం రాసిన పుస్తకమే అయినా పెద్దలను కూడా అలరించే శక్తి ఉంది. ముఖ్యంగా ప్రకృతి పట్ల ఆసక్తి, ఆరాధన ఉన్న వాళ్లకయితే పరమాన్నం పెట్టినట్టే. పావురాల జీవనానికి సంబంధించిన అతి సూక్ష్మ వివరాలు, హిమాలయాల అడవుల్లోని వృక్షసంతతి గురించిన వివరాలూ పుష్కలంగా ఉన్నాయి. నావరకూ నేను ఈ పుస్తకం చదివిన తర్వాత ఇంటి బాల్కనీలోకి దూసుకొచ్చే పావురాలను విసుక్కోవడం మానేసి శ్రద్ధగా పరిశీలించడం మొదలెట్టాను! పదేళ్ల వయసులో చదివి ఉంటే ఈ సరికి పక్షుల గురించి చాలా తెలుసుకునేదాన్నేమో. దాసరి అమరేంద్ర అనువాద శైలి గురించి ఎంత చెప్పినా తక్కువే. (ప్రచురణ నేషనల్ బుక్ ట్రస్ట్, పేజీలు 160, ధర 30 రూపాయలు. బొమ్మలు బోరిస్ ఆర్టిజీబషెఫ్)
‘చిత్రగ్రీవం’ రచయిత గురించి : విశిష్ట రచయిత ధనగోపాల్ ముఖర్జీ (1890 – 1936) పేరు అతి కొద్దిమంది భారతీయులే విని ఉంటారు. కలకత్తా దగ్గర పూజారుల కుటుంబంలో పుట్టిన ఆయన పంతొమ్మిదేళ్ల వయసులో అమెరికా వెళ్లి కాలిఫోర్నియా, స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నారు. చిత్రగ్రీవంలాగానే జంతువులు, పక్షులు ముఖ్యపాత్రలు పోషించే మరి తొమ్మిది పిల్లల పుస్తకాలు రాశారాయన. ‘కరి ది ఎలిఫెంట్ ‘ (1922), హరి ది జంగిల్ లాడ్ (1929) ఘోండ్ ది హంటర్ (1928) అన్నవి ఆయన రాసిన పుస్తకాల్లో కొన్ని. మరిన్ని వివరాల కోసం వికీ పేజీని చూడండి.
చివరిగా….. మనం మిస్సయిపోతున్నది కేవలం ఫేంటసీ బస్సునే కాదు, ప్రకృతి ఒడిలో మెలికలు తిరుగుతూ పయనించే రైళ్లనీ, జంతువుల సహజ స్వభావాలను గమనిస్తూ వాటితో కలిసి ప్రయాణించడం నేర్పే విమానాల్నీ కూడా!
**************************************
amarendra dasari
happy to see the review.hope it will make a few more to befriend our chitragreevam
కొత్తపాళీ
@ pustakaM..
“పుస్తకం.నెట్ కి విచ్చేసిన వారి సూచనలూ- సలహాలు మాకు ముఖ్యం. కాకపోతే ఆ సూచనలూ, సలహాలూ పుస్తకం.నెట్ ఉద్దేశ్యాలకు అనుగుణంగా ఉంటేనే మేం ఆలోచించగలం.”
fair enough.
పుస్తకం.నెట్
ఇందులో బుజాలు తడుముకోవడం ఏమీ లేదండి. వాక్యనిర్మాణంలో కాస్త గందరగోళం అయితే ఉంది.
“పాఠకుని స్పందన” అన్నది, “పుస్తకాల పై పాఠకుల స్పందన”. “మా గురించి”లోనే,
“చదివిన పుస్తకాన్ని ఆమూలాగ్రం అవపోసన పట్టేసి, ఇక్కడ ఆ పాండిత్యాన్ని పంచుకునే వారికీ సుస్వాగతం. చదివి, చదవాక అర్థం కాక సందేహాలున్నా, చదివింది నచ్చకపోయినా, పుస్తకంతో అనుభవాలూ, జ్ఞాపకాలనూ ఇక్కడ పొందుపరచవచ్చును. “సమీక్ష”నే చట్రంలో ఇరుక్కోనవసరం లేకుండానే మీ భావాలను పంచుకోవచ్చు.
ఈ సైట్ ముఖ్యోద్దేశ్యాన్ని విఖ్యాత రచయిత జార్జ్ ఆర్వెల్ మాటల్లో చెప్పాలంటే..
Nearly every book is capable of arousing passionate feeling, if it is only a passionate dislike in some or the other reader, whose ideas about it would surely be worth more than those of a bored professional.”
అని రాసి ఉన్నాము. ఒక ఖచ్చితమైన పద్ధతిలో, ఒక ప్రణాళికను అనుసరిస్తూ పుస్తక పరిచయాలు కానీ, సమీక్షలు కానీ చెయ్యనవసరం లేదని ఇది వరకే చెప్పి ఉన్నాము. కథ, కథనం, శైలి, శిల్పం, పాత్రల చిత్రీకరణ, రచయిత పరిచయం, రచనలోని గొప్పదనం, పుస్తకం వివరాలు – ఇవ్వన్నీ కల్సున్న సమగ్రమైన వ్యాసాలనే మేం ప్రచురిస్తాం అని ఎక్కడా ప్రకటించలేదు. ప్రతీ వ్యాసం ఒక స్థాయిని అందుకోవాలనీ మేం ఆశించలేదు.
“పుస్తకం.నెట్” అనేది పుస్తక పరిచయాల, సమీక్షల సైటు కాదు. పుస్తకం.నెట్ లో ఎక్కువగా కనిపించేవి అవే అయినా, పుస్తకం.నెట్ ముఖ్యోద్దేశ్యం ఎక్కువ మందిని పుస్తకపఠనం వైపు, అంతకన్నా ముఖ్యంగా తాము చదివిన పుస్తకాలపై మాట్లాడే (వ్రాసే) అలవాటును పెంపొందించాలని. అందుకే “పాఠకుని స్పందన” అని చెప్పాం. ఏ భాషలోనైనా సరే పుస్తకం చదివి, ఆ ఆనందాన్నో, నిరాశనో ఇక్కడ పంచుకోవాలన్నది ముఖ్యోద్దేశ్యం.
అంతే కానీ, “నేనో పాఠకుణ్ణి, నాకు మీ పనులేం నచ్చటం లేదు. మానేయ్యండి. నేను చెప్పినట్టు చెయ్యండీ” అనే ధోరణిలో మాట్లాడితే మేం చేసేది ఏమీ లేదు. తెలుగు అభిమానిగారి కొన్ని పాయింట్లు ఒప్పుకుంటున్నాం. ఆచరించడానికి ప్రయత్నిస్తున్నాం. సమీక్షలో పుస్తకం వివరాలు మొదట్లోనే ఉండాలి – లాంటివి మాత్రం మేం ఒప్పుకోలేం.
పుస్తకం.నెట్ కి విచ్చేసిన వారి సూచనలూ- సలహాలు మాకు ముఖ్యం. కాకపోతే ఆ సూచనలూ, సలహాలూ పుస్తకం.నెట్ ఉద్దేశ్యాలకు అనుగుణంగా ఉంటేనే మేం ఆలోచించగలం.
కొత్తపాళీ
“ఒక సమీక్ష కన్నా, ఒక పాఠకుని స్పందనే మాకు ముఖ్యం. అర్థం చేసుకోగలరని ఆశిస్తున్నాం. ”
దీనిభావమేమి పుస్తకేశ?
ఆ లెక్కన తెలుగుఅభిమాని గారు కూడా ఒక పాఠకుడే కద?
మీ సమాధానం అనవసరపు బుజాలు తడుముకోవడంగా కనిపిస్తోంది నాకు.
నేను ఆయన దురుసుతనాన్ని సమర్ధించడం లేదు. ఆ దురుసుతనాన్ని పక్కన పెడితే ఆయన లేవనెత్తివి సందర్భోచితమైన విమర్శలే. మీ సైటుకొచ్చి ఇక్కడి వ్యాసాలు చదివి వ్యాఖ్య రాసేంత శ్రమ సమయము వెచ్చిస్తున్నారంటే ఆ పాఠకుడికి మీ సైటులో వేల్యూ దొరకబట్టే కదా.
ఒక బహిరంగ చర్చా వేదిక నిర్వాహకులుగా మీకు పాఠకుల స్పందన ముఖ్యమైనప్పుడు, ఆ స్పందనలోని విలువైన విషయాల్ని గుర్తించమని కోరుతున్నాను, సదరు పాఠకులకి నీతులు చెప్పడమూ, మీ లిమిటేషన్లని లెక్కపెట్టుకోవడమూ కాకుండా.
నా వ్యాఖ్య కూడా దురుసుగా అనిపిస్తే మన్నించండి.
అద్భుత చిత్రగ్రీవం « అరుణిమ
[…] ఒక పావురం. ఈ పుస్తకం గురించి నా పరిచయం ఇక్కడ చదవొచ్చు. ఆ పుస్తకం చివర్లో నాకు నచ్చిన కొన్ని […]
Achilles
@మెహెర్:
+1
Where is the “like” button when I need it?
హెచ్చార్కె
@చౌదరి జంపాల: ఔను, ‘బుజ్జిగాడు’ చాల బాగుంటుంది. ఓ మంచి కతను గుర్తు చేశారు.
మెహెర్
@తెలుగు అభిమాని:
>>> మంచి పుస్తకం చదివితే దాన్ని అందరితో పంచుకోవాలనే తహతహ గురించి నాకు తెలీక కాదు, సొంత బ్లాగుల్లో అయితే ఏది ఎలా రాసినా పరవాలేదు, కానీ magazine మాదిరిగా రన్ చేసే వెబ్ సైటులో అయినా కాస్త నాణ్యత ఉంటుందేమో అనుకుంటున్నా నేను. (అసలు ఈ వెబ్ సైటుకీ సొంత బ్లాగుకీ ఏమిటో తేడా నాలాంటి వాళ్ళకి అర్థం కాదు!)
అచ్చుపత్రికల్లోని చచ్చు ఆబ్లిగేటరీ వ్యాసాల్తో పోలిస్తే ఎన్నో రెట్లు మెరుగైన వ్యాసాల్ని నేనిక్కడ చూసాను. జనాలకి “ద్రౌపది”లోని రంకూ, “మునెమ్మ”లోని బీస్టియాలిటీ ఇత్యాది గంభీరమైన అంశాలపై పండిత వ్యాఖ్యానాలూ, చర్చలూ కావాలంటే ఆ పుచ్చు పత్రికలు ఎలానూ ఉన్నాయి. వివిధ పాఠకుల వైయక్తిక అనుభవ వైవిధ్యంతో అలరారే ఈ సైట్ (లేదా బ్లాగు) ఇలా నడిస్తేనే బాగుంటుంది. తెలుగు అభిమానీ! — తెలుగువాడికిది స్వాభావిక గుణమే అయినా — గునిసే బదులు ఓ చెయ్యేస్తే ఇంకా బాగుంటుంది.
~ Thus spake another journalist.
చౌదరి జంపాల
కాల్పనికం కాకపోయినా, తెలుగులో మంచి పిట్ట పుస్తకం: బుజ్జిగాడు (చలం). ఇప్పుడూ పిల్లలకూ పరిచయం చేయదగ్గ పుస్తకమే.
ఆనంద్
ధనగోపాల్ ముఖర్జీ గారి కొన్ని పుస్తకాలు ఇంటర్నట్ ఆర్కైవ్ లో లభ్యమవుతున్నాయి.
“Kari, the elephant” at the Internet Archive
telugu4kids
Thanks for introducing another interesting book and generating curiosity about the author and his other books.
There is a wide variety in children’s books in English.
I’m glad an author of Indian origin is one of the contributors.
As for childrens’ literature for Telugu, we need to really start taking ourselves seriously. Dust the old literature and look carefully for those with lasting value. Get inspired to make lasting contributions. There is so much of the world to explore and so much we can express in our mothetongue. Let our explorations enrich our literature and let our literature enrich our experiences.
cbrao
పుస్తక సమీక్షలు ఎలా రాయాలి? చూడండి
http://poddu.net/?p=219
Aruna Pappu
నమస్కారం తెలుగు అభిమాని గారు,
మీ సూచనలతో ఇక ముందు బాగా రాసే ప్రయత్నం చెస్తాను. చిత్ర గ్రీవం ఇంగ్లిష్ లో “గే నెక్”. పాత్ర పేరు మాత్రం చిత్రగ్రీవమే. పుస్తకం వివరాల కోసం మీరు వ్యక్తం చేసిన అసహనం ఎవరయినా అర్ధం చేసుకోతగినదే. దయచేసి ఈ విషయాలను గమనించండి.
1. ఇక్కడ ఉండేవి చాలా వరకూ పరిచయాలు, పాఠకుల అనుభవాలు అభిప్రాయాలు. నిపుణులు రాస్తున్న సమీక్షలు కావు. (at least, I think so!) కనీసం నేను రాసేవి పరిచయాలే. మీరన్నట్టు సమీక్షలు కాదు.
2. పుస్తకం దొరికే చోటు, పేజీలు…. ఇతర వివరాలు ముందస్తుగానే ఇవ్వాలనేమీ లేదు.
3. పుస్తకాల విషయంలొ ఎవరి రుచి వారిదే అని ఇందులోనే రాశేను.
4. “సమగ్రమయిన” పరిచయం లేదా సమీక్ష కు ఉదాహరణ చెబితే లేదా చూపిస్తే అందరికీ మేలే.
5.జర్నలిస్టులో, దాక్టర్లో, ఉపాధ్యాయులో అయినంత మాత్రాన సర్వ సమగ్రంగా మనుషులూ ఉండరు, రాతలూ ఉండవని నా అనుభవం.
పుస్తకం.నెట్
తెలుగు అభిమాని గారు: మీ సూచనలకు, సలహాలకు ధన్యవాదాలు! వాటిని అమలుపరచడానికి ప్రయత్నిస్తాము.
కాకపోతే, “మంచి సమీక్ష”కు మీరిచ్చే నిర్వచనం బట్టి “పుస్తకం.నెట్” నిర్వహణ జరగదని గమనించగలరు. ఒక సమీక్ష కన్నా, ఒక పాఠకుని స్పందనే మాకు ముఖ్యం. అర్థం చేసుకోగలరని ఆశిస్తున్నాం.
ఒక పుస్తకం గురించి “ఎన్‍సైక్లోపిడియా” స్థాయిలో పరిచయం చేయటంలో, మాకున్న పరిమితులు మాకున్నాయి. అందుకని వీలైనంత మంది తలో చేయి వేస్తే సమాచారాన్ని పోగు చేయవచ్చు. విరాట్ ఆంగ్లమూలం ఏదని చాలా మందే వెతికారు. మీకు తెల్సిన సమాచారాన్ని అక్కడ పంచుకొనుంటే మరికొంత మందిని మీలా అసహనానికి గురవ్వకుండా కాపాడేవారు కదా! 🙂
ధన్యవాదాలు,
పుస్తకం.నెట్
తెలుగు అభిమాని
అరుణ గారూ,
మీరు జర్నలిస్టు (అనుకుంటున్నాను) అయి ఉండి ఇలాంటి అసమగ్రమైన ఆర్టికిల్ ఎలా రాయగలిగారు?? ఇక్కడ పబ్లిష్ చేసే ఆర్టికిల్స్ ని రాసినవాళ్లు తప్ప ప్రింట్ చేసేముందు వేరే ఎవ్వరూ చదవరా? కొన్ని ఆర్టికిల్స్ మీద వచ్చే కామెంట్స్ (“చాలా బాగా రాసావు [రచయిత పేరు]!”, “మంచి పరిచయం”, “మంచి సమీక్ష” గట్రా లాంటివి)చూస్తే, “ఆ ఆర్టికిల్స్ ని వాళ్ళ ఫ్రెండ్స్ తప్ప ఎవ్వరూ చదవరా, చదివిన వాళ్ళకి ఆ రచయితకి వేరే ఏదైనా ఫీడ్‌బ్యాక్ ఇద్దామని అనిపించదా?” అనిపిస్తుంది.
మంచి పుస్తకం చదివితే దాన్ని అందరితో పంచుకోవాలనే తహతహ గురించి నాకు తెలీక కాదు, సొంత బ్లాగుల్లో అయితే ఏది ఎలా రాసినా పరవాలేదు, కానీ magazine మాదిరిగా రన్ చేసే వెబ్ సైటులో అయినా కాస్త నాణ్యత ఉంటుందేమో అనుకుంటున్నా నేను. (అసలు ఈ వెబ్ సైటుకీ సొంత బ్లాగుకీ ఏమిటో తేడా నాలాంటి వాళ్ళకి అర్థం కాదు!)
మీర్రాసిన ఈ ఆర్టికిల్ చూడండి, పుస్తక సమీక్ష అన్నారు కదా, ముందస్తుగా పుస్తకం దొరికే చోటు, ఖరీదు ఇవ్వక్కరలేదా? చివర్లో ఎక్కడో ఇచ్చారు. ఈ పుస్తకం ఇంగ్లీష్ నించి అనువదించారని మీరు ఎక్కడా రాయలేదు. న్యూబరీ అవార్డు వచ్చింది గాబట్టి ఇంగ్లీష్ అనుకోవాలా? ధన్ గోపాల్ ముఖర్జీ కి లంకె ఇచ్చారు కానీ పుస్తకం ఇంగ్లీష్ పేరు ఇస్తే కనీసం యూనివర్సిటీ లైబ్రరీలో ఇంగ్లీష్ ఒరిజినల్ కోసం అయినా వెతుక్కునేవాళ్లం కదా?
ఇంతకు ముందు ఇలాగే మరెవరో “విరాట్” అన్న పుస్తకం గురించి ఈ బ్లాగులోనే తెగ పొగిడితే అదేమిటో వెతకబోయాను, ఎంతకీ దొరకలేదు, తరవాత తెలిసింది, దాని ఇంగ్లీష్ పేరు “విరాట” అని.
పది కాలాలు నిలిచే ఆర్టికిల్స్ రావాలంటే, ప్రింట్ చేసే ముందు మూడో కంటితో కాస్త చదివించండి, కనీసం అచ్చుతప్పులైనా పట్టుకుంటారు! (ఆర్టికిల్స్ ని ప్రింట్ చేసే ముందు చదవకపోయిన వాళ్ళు, కనీసం ఈ కామెంట్ ని ప్రింట్ చేస్తారని ఆశిస్తాను.)
— తెలుగు అభిమాని.
cbrao
మంచి పుస్తక పరిచయం. సమీక్ష ఏకబిగిన చదివించింది. పుస్తక ముఖ చిత్రం కూడా ఇచ్చి ఉండవలసినది. 46 సంవత్సరాలకే ఈ సృజనాత్మక రచయిత ఆత్మహత్య చేసుకొని మరణించటం విచారకరం.