Remembering J. D. Salinger

“I swear to God, if I were a piano player or an actor or something and all those dopes thought I was terrific, I’d hate it. I wouldn’t even want them to clap for me. People always clap for the wrong things. If I were a piano player, I’d play it in a goddam closet.”

— Holden Caulfield, The Catcher in the Rye

జె.డి. శాలింజర్ చనిపోయాడని తెలియగానే నాకేమీ అనిపించలేదు. “ఏమన్నా అనిపించాలేమో కదూ” “నన్ను కదిలించాలేమో కదూ” అనుకుంటూనే — నా అంతరంగంలో ఇసుమంతైనా భావోద్వేగపు ఆనవాలు పసిగట్టడానికి మనస్సాక్షి దుర్భిణి వేసి వెతుకుతూండగానే — ఆయన మరణానికి సంబంధించిన వార్తలన్నీ తిరగేసాను, నివాళిగా వచ్చిన వ్యాసాలన్నీ చదివాను. అది నాకు సంబంధించిన వార్తే అనిపించింది గానీ, నన్ను రవంతయినా కదిలించగలిగే వార్త అని మాత్రం అనిపించలేదు; ఇందుకు నా మనస్సాక్షి “నువ్వు రాతి హృదయుడివి సుమీ!” అని ఎంత దెప్పిపొడిచినా సరే!  శాలింజర్ అనే కాదు, తమ పుస్తకాల ద్వారా నాతో సంభాషించిన ఏ రచయిత చనిపోయినా నా స్పందన ఇంతేనేమో. ఆయన ప్రముఖ నవల “ద కేచర్ ఇన్ ద రై“లో ముఖ్యపాత్ర హోల్డెన్ ఓ చోట అంటాడు: “నాకు నచ్చే పుస్తకం ఏమిటంటే, దాన్నొకసారి చదవడం పూర్తి చేయగానే, ఆ రచయిత దగ్గరి నేస్తంగా తోచాలి, ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు అతనికి ఫోన్ చేసి మాట్లాడవచ్చనిపించాలి”. ఈ నిర్వచనం నాకు పూర్తిగా వర్తించదు. నాకలా ఎప్పుడూ ఏ రచయితతోనూ ఫోన్ చేసి మాట్లాడాలనిపించలేదు. ఎందుకంటే, నా వరకూ రచయిత అంటే అతని పుస్తకాలే. ఒక రచయిత పుస్తకం నాతో ఎంత ఆత్మీయంగా మాట్లాడినా సరే, ఆ పుస్తకానికి వెలుపలగా అతనికి ఓ లౌకికమైన ఉనికి ఉంటుందన్న స్ఫురణ ఎందుకో కలగదు; కలిగినా నిలవదు. నచ్చితే ఆ పుస్తకాన్ని మాత్రం ప్రాణంగా ప్రేమిస్తాను. ఇప్పుడిలా శాలింజర్‌ని దేవుడు భూమ్మీంచి తీసుకుపోయినా నాకేం పెద్ద ఫిర్యాదు లేదు; కానీ ఎవరన్నా నా అల్మరాలోంచి శాలింజర్ నాలుగు పుస్తకాల్నీ ఎత్తుకుపోతే మాత్రం పెద్ద దిగులే అనిపిస్తుంది. అవి ఇంకెక్కడా దొరకనివే అయితే, కొంప మునిగినట్టే కుదేలైపోతాను. అందుకే, నా వరకూ శాలింజర్ అంటే నా పుస్తకాల అల్మరాలో ఓ మూల ఒద్దికగా నిలబడ్డ ఆయన నాలుగు పుస్తకాలే; శాలింజర్‌ని గుర్తు చేసుకోవడమంటే ఆ పుస్తకాల్ని గుర్తు చేసుకోవటమే. ఆయన చనిపోయాడని తెలిసిన రోజు ఆఫీసు నుండి గదికి వెళ్ళాకా, అరచేతిలో ఇమిడిపోయే ఆ నాలుగు పుస్తకాల బొత్తినీ అరలోంచి బయటకు లాగి, టేబిల్ మీద పెట్టి యథాలాపంగా తిరగేయడం మొదలుపెట్టాను. మామూలుగా నేను పుస్తకాలు చదివేటపుడు నచ్చిన వాక్యమో, నెమరు వేసుకోదగ్గ పేరానో తారసిల్లితే — అక్కడే గీతలు గీసి పేజీ ఖరాబు చేయకుండా — పక్కనో చిన్న టిక్ పెట్టి, వెనక అట్ట లోపలి భాగంలో ఆ పేజీ తాలూకు అంకె వేసుకుంటాను; ఆ అంకె పక్కన విషయాన్ని క్లుప్తంగా రాసుకుంటాను. ఇపుడు “కేచర్ ఇన్ ద రై” నవల తిరగేస్తుంటే వెనక అట్ట మీద “84” అన్న అంకె, దాని పక్కన “clue” అన్న పొడిమాటా కనిపించాయి. అలా ఎందుకు రాసివుంటానో మాత్రం గుర్తు రాలేదు. ఎనభైనాలుగో పేజీకి వెళ్ళి చూస్తే, అక్కడ, పైన ఇచ్చిన వాక్యాల దగ్గర టిక్ మార్కు కనిపించింది. ఇంతకీ ఆ నాలుగు వాక్యాలు దేనికి “క్లూ” అని నేననుకున్నట్టూ?

j-d-salinger1951లో అచ్చైన జె.డి. శాలింజర్ తొలి పుస్తకమే (“కేచర్ ఇన్ ద రై”) అమెరికన్ నవలా సాహిత్యంలో పెనుసంచలనమైంది. ఇందులో ముఖ్యపాత్రయిన హోల్డెన్ పదిహేడేళ్ళ కుర్రవాడు. పసితనానికీ పెద్దరికానికీ మధ్య వారధైన ఆ కౌమారప్రాయంలో, అటు దూరమైపోతున్న పసితనపు స్వచ్ఛతను వీడలేక, ఇటు మీద పడుతోన్న పెద్దరికపు కుత్సితత్వంలో ఇమడలేక తల్లడిల్లుతాడు. చివరికి ముగింపు దగ్గర, తన చిట్టి చెల్లెలి సాంగత్యంలో కాసేపు గడిపిన తర్వాత, తప్పనిసరైన పెద్దరికంతో తాత్కాలికంగానైనా రాజీకొస్తాడు. కౌమారప్రాయంలో అయోమయాన్నీ, ఇమడలేనితనాన్నీ, తిరుగుబాటు ధోరణినీ చాలా సహజంగా చూపించగల్గిన ఈ నవల అప్పటి అమెరికన్ యువతరానికి పవిత్ర మత గ్రంథమైంది; దీని కథానాయకుడు హోల్డెన్ ఒక పురాణపాత్ర స్థాయినందుకున్నాడు; దీని రచయిత శాలింజర్ హఠాత్తుగా ప్రవక్త అయికూర్చున్నాడు. టీనేజర్ మనసును ఆయన అర్థం చేసుకోగలిగినంతగా ఏ రచయితా అర్థం చేసుకోలేదన్నారు పాఠకులు. అమెరికన్ సాహిత్య పరంపరలో మార్క్‌ట్వయిన్ “హకల్‌బెరీఫిన్” తర్వాత కథనంలో అలాంటి గొంతును అంత సమర్థంగా వాడుకున్న నవల “కేచర్ ఇన్ ద రై” మాత్రమే అన్నారు విమర్శకులు. అయితే శాలింజర్ ఒక టీనేజర్ ప్రధానపాత్రగా నవల రాయాలనుకున్నాడే గానీ, టీనేజర్స్ కోసం నవల రాయాలనుకోలేదు. ఇప్పుడీ ప్రఖ్యాతినీ, ప్రవక్త హోదానూ ఆయన ఊహించనూ లేదు, ఆశించనూ లేదు. ఈ అనూహ్యమైన తాకిడికి తట్టుకోలేకపోయాడు. నెమ్మదిగా తన్నుతాను ప్రపంచానికి దూరం చేసుకోవటం మొదలుపెట్టాడు. న్యూయార్క్ మహానగరం నుంచి, న్యూహాంప్‌షైర్లో “కోర్నిష్” అనే మారుమూల పట్టణానికి మకాం మార్చాడు.

1953లో శాలింజర్‌ మరో పుస్తకం వచ్చింది. “కేచర్ ఇన్ ద రై” నవల కన్నా ముందుగానో లేక సమకాలికంగానో రాసిన తొమ్మిది కథల్ని సంపుటిగా కూర్చి “నైన్ స్టోరీస్” పేరిట విడుదల చేశాడు. ఇందులో ప్రతీ కథా ఒక అద్వితీయమైన ఆణిముత్యమే అనిపిస్తుంది నాకు (ఒక్క “టెడ్డీ” అన్న చివరి కథ తప్పించి). ఏ రెండు కథలకీ ఏ సామ్యమూ ఎత్తి చూపలేని ఊహాతీతమైన కల్పనాశక్తి, కథల్లో అందీ అందక దోబూచులాడే భావం, కథల నడకలో అలవోకడ, వచనం పోకడలో సాటిలేదనిపించే స్పష్టత, సంభాషణల అల్లికలో శాలింజర్‌కు దాదాపు దైవదత్తమేమో అనిపించే సహజ నైపుణ్యం… ఇవన్నీ కలిసి ఈ మలి పుస్తకాన్ని కూడా అందరికీ ప్రేమపాత్రం చేశాయి. అయితే, “కేచర్…” నవల ప్రభావం ఎంత గాఢమైందంటే, అంతా ఈ కథల్లో కూడా దాని ఛాయల్నే వెతుక్కోవడం మొదలుపెట్టారు. కానీ శాలింజర్‌ కౌమారప్రాయాన్ని ఒక ఇతివృత్తంగా అప్పటికే విడిచిపెట్టేశాడు. తనకు సొంత జీవితంలో ఎదురవుతున్న ప్రశ్నల వేపు అప్పుడప్పుడే కొత్త ఇతివృత్తాల్ని ఎక్కుపెడుతున్నాడు.

ప్రపంచం పట్ల తనలో రగిలే ప్రశ్నల్ని సజీవంగా నిలుపుకోగలిగినన్నాళ్ళే ఏ రచయితైనా పాఠకులకు మిగులుతాడు. ఆ ప్రశ్నలకు ఏవో కొన్ని జవాబుల్ని కిట్టించుకుని సమాధానపడిపోయిననాడు, రాయటం ఆపేస్తాడు. ఈ పరిణామం సానుభూతితో అర్థం చేసుకోదగ్గదే. వయసు ఉడిగే కొద్దీ, జీవితాకాశంలో దేహం మలిసంధ్యకు క్రుంగే కొద్దీ, ఇంకా మొండి ప్రశ్నలతో సావాసం అంటే దుర్భరమే అనిపిస్తుంది ఎవరికైనా. ముసలితనం పరీక్ష హాల్లో మృత్యువు ప్రశ్నాపత్రంతో ఎదురవబోయే వేళకు, ఎవరైనా సమాధానాల్తో తయారుగా వుండాలనుకుంటారే గానీ, ఇంకా ప్రశ్నలతో తెల్లమొహం వేయాలనుకోరు కదా. అప్పుడిక సమాధానాలు దొరికినా దొరక్కపోయినా దొరికిన దాంతోనే సమాధానపడిపోతారు కొందరు. మన చలం అలానే రమణమహర్షి దగ్గర సమాధానపడిపోయాడేమో అనిపిస్తుంది. శాలింజర్‌ కూడా ఈ దశలో ఆధ్యాత్మికత వైపు మళ్లాడు. హిందూ అద్వైత వాదాన్నీ, ఉపనిషత్తులనూ, రామకృష్ణపరమహంస బోధనల్నీ, జెన్ తాత్త్వికతనూ ఆకళింపు చేసుకోవటం మొదలుపెట్టాడు. అయితే వాటితో సమాధానపడిపోయాడని మాత్రం చెప్పలేం. తన ప్రశ్నలకు సమాధానాలు వాటిలో వెతుక్కునే ప్రయత్నం మొదలుపెట్టాడంతే. తర్వాతి రెండు పుస్తకాల్లోనూ ఈ అన్వేషణే కనిపిస్తుంది. ఈ రెండిట్లోనూ ఒక్కో పుస్తకంలోనూ రెండేసి పెద్ద కథలు (లేదా నవలికలు) ఉంటాయి.

1961లో అచ్చైన “ఫ్రానీ అండ్ జోయీ“లో ఉండటం రెండు కథలున్నా, అవి ఒకదానికొకటి కొనసాగింపుగా ఉండటం వల్ల, ఒకటే పెద్దకథగా లెక్కలోకి తీసుకోవచ్చు. దీని తర్వాత 1963లో అచ్చైన “రైయిజ్ హై ద రూఫ్ బీమ్, కార్పెంటర్స్ అండ్ సేమోర్: ఏన్ ఇంట్రడక్షన్“లో కూడా రెండు కథలుంటాయి. కానీ ఇవి వేటికది వేర్వేరు. మొత్తంగా చూస్తే, రెండు పుస్తకాల్లోని ఈ నాలుగు కథల్లోను, ఒక్క “రైయిజ్ హై ద రూఫ్ బీమ్, కార్పెంటర్స్” అన్న కథే స్వయం సమృద్ధమైన కథగా అనిపిస్తుంది. అంటే రచయిత ఏ బయటి ఉద్దేశ్యంతోనూ ముడిపెట్టకుండా రాసిన కథ. మిగతా మూడింటిలోనూ రచయిత తన ఆధ్యాత్మిక అన్వేషణను కథ అనే చట్రంలో ఇమిడ్చేందుకు ప్రయత్నించటం కనిపిస్తుంది. అవి ఒకప్రక్క కథకు కావాల్సిన కళాత్మక పరిపూర్ణతను సాధించేందుకు ప్రయత్నిస్తూనే, మరోప్రక్క రచయిత తనలో ముసురుకుంటున్న ప్రశ్నా ప్రహేళికల్ని ఓ కొలిక్కి తీసుకొచ్చేందుకు వాడుకున్న పనిముట్లుగా కూడా పన్చేస్తాయి. ఈ విషయంలో ఆయన గొప్పగా సఫలీకృతుడయ్యాడనే చెప్తాను నేను. నాకాయన ప్రశ్నలూ నచ్చాయి, వాటి పరిష్కారానికి ఇలా కథల రూపంలో చేసిన ప్రయత్నమూ నచ్చింది. కానీ ఈ రెండు పుస్తకాలూ విడుదలైనపుడు వచ్చిన స్పందన మాత్రం భిన్నంగా వుంది. శాలింజర్‌ నుంచి “కేచర్ ఇన్ ద రై” తరహాలో యువతరానికి మరో ప్రవచనం రాబోతోందని ఎదురుచూసిన అధికశాతం పాఠక జనమూ విమర్శక బృందమూ కలిసి, వీటిని చేట చెరిగి వదిలిపెట్టారు. వీటిలో వాళ్ళాశించిందేదో దొరకలేదు. అంతే, అప్పటినుండి, మొన్న జనవరి ఇరవయ్యేడున చనిపోయే వరకూ — అంటే నలభయ్యేడేళ్ళు! — ఆయన మరే రచనా పుస్తకంగా తీసుకురాలేదు. (1965లో “హాప్‌వర్త్ 16, 1924” అనే రచన చేసినా పుస్తకీకరణకు నిరాకరించాడు.)

తనను తాను మూసేసుకున్నాడు. కోర్నిష్‌లో పెద్దగా ఇరుగూపొరుగూ లేని తన ఇంటిలో ఒంటరిగానే ఎక్కువకాలం గడుపుతూ, ఎవ్వర్నీ కలవకుండా, కెమెరాలకు చిక్కకుండా, ఇంటర్వ్యూలు నిరాకరిస్తూ, తన రచనల్ని సినిమాలుగా తీస్తామన్న వాళ్ళ ప్రతిపాదనల్ని తిరస్కరిస్తూ, ప్రైవసీని ప్రాణప్రదంగా కాపాడుకుంటూ ఈ నలభయ్యేడేళ్ళూ గడిపాడు. ఆయన్ను కలవాలని వచ్చే పాఠకాభిమానులకు చివరికి ఆ ఊరివాళ్ళు కూడా చిరునామా చెప్పేవారు కాదట. ఈ మధ్యే ఒక మాజీ ప్రేయసి, సొంతకూతురూ ఆయన్ను గూర్చి ఏదో అక్కసుతో రాసినట్టనిపించే రెండు పుస్తకాలు విడుదలయ్యాయి. వాటిలో లభ్యమైన కొన్ని వివరాలు తప్ప, వేరే వ్యక్తిగత వివరాలు ఎవ్వరికీ తెలియవు. (తన ప్రైవసీని అంతగా కాపాడుకునే వ్యక్తి జీవిత వివరాల్ని పుస్తకరూపేణా సంతలో అమ్మకానికి పెట్టి సొమ్ము చేసుకోవాలనుకునే వాళ్ళ ధోరణిలో అక్కసు లాంటి నీచపుటుద్దేశాలు తప్ప ఇంకేం చూడగలం?) అయితే ఈ పుస్తకాల్లోని సమాచారం తోబాటూ, ఎప్పుడో ఇచ్చిన ఓ అరుదైన ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యల్ని బట్టి చూస్తే, ఒక ఆశ్చర్యకరమైన, ఆశ కలిగించే విషయం మాత్రం తెలుస్తుంది. శాలింజర్‌ ప్రచురణకు ఏమీ ఇవ్వకపోయినా, చనిపోయేవరకూ ఏవో రాస్తూనే ఉన్నాడట! నిజానిజాలు ఇంతదాకా ఎవరూ నిర్థారించకపోయినా, పాఠకలోకం మాత్రం ఆ రచనలకు ఏం రాత రాసిపెట్టి వుందోనని ఉత్సుకంగా ఎదురుచూస్తోంది.

ఇలా స్థూలంగా చూస్తే, “కేచర్ ఇన్ ది రై” నవల తర్వాత శాలింజర్‌ రచనాజీవితం ఇటువంటి అరుదైన మార్గం ఎందుకుపట్టిందన్న దానికి, ఆ నవల్లోంచి నేను పైన ఇచ్చిన నాలుగు వాక్యాల్లోనే బాహటమైన క్లూ దొరుకుతుంది. అక్కడ హోల్డెన్ ఒక పియానో ప్లేయర్ గురించి మాట్లాడుతున్నాడు. రచయితలు తమ రచనల్లో ఏ కళ గురించి మాట్లాడినా (చిత్రకళ, శిల్పకళ, సంగీతం…), అవి తరచూ తమ రచనావ్యాసంగం గురించే వేరే కళ ముసుగులో చేస్తున్న వ్యాఖ్యానాలయి వుంటాయి. అందుకే, పై వాక్యాల్లో “పియానో ప్లేయర్” అన్న పదాన్ని “రచయిత” అన్న పదంతో పక్కకు నెట్టి ఇలా చదువుకోవచ్చు:

“ఒట్టేసి చెప్తున్నా, నేనే గనుక రచయితనైతే, ఆ వెర్రికుంకలంతా నేను గొప్పగా రాస్తున్నానంటే, నేనది అసహ్యించుకుంటాను. వాళ్ళు చప్పట్లు కొట్టినా నాకు సయించదు. జనం ఎప్పుడూ తప్పుడు విషయాలకి చప్పట్లు కొడతారు. నేనే గనుక రచయితనైతే, నా రాతల్ని ఓ అల్మరాలో బిడాయించుక్కూర్చుని రాసుకుంటాను.”

ఇక్కడ శాలింజర్‌ తన కథానాయకుని గొంతుతో వెళ్ళగక్కుతోన్న కోపమంతా తప్పుడు విషయాలకు చప్పట్లు కొట్టేవాళ్ళ మీద; తన పుస్తకాల్ని కేవలం పఠనానందం కోసం గాక, వాటిని ఏవో ధోరణులకు ప్రతిబింబాలుగా చూడ్డమో, లేక ఇంకేవో ధోరణులకు విరుగుడుగా చూడ్డమో, ఇలా ఆయన ఉద్దేశించని సంగతుల్ని వాటిలో వెతుక్కుని మెచ్చుకునే వాళ్ళ మీద; విమర్శకుల మీద, విశ్లేషక పండితుల మీద, పండిత పాఠకుల మీద; ఒక్కముక్కలో హోల్డెన్ మాటల్లో చెప్పాలంటే: Phonies అందరి మీదా! శాలింజర్‌ తన చివరి పుస్తకానికి రాసిన అంకితం చూస్తే, ఆయన తన ఆదర్శ పాఠకులుగా ఎవర్ని కోరుకున్నాడో అర్థమవుతుంది:

“If there is an amateur reader still left in the world — or anybody who just reads and runs — I ask him or her, with untellable affection and gratitude, to split the dedication of this book four ways with my wife and children.”

నేను జె.డి. శాలింజర్‌ పేరు మొదటిసారి విని చాలా యేళ్ళే అవుతుంది. కానీ “కేచర్ ఇన్ ది రై” నవలని ఆవరించి వున్న హంగూ ఆర్భాటమూ, అది టీనేజర్లకు  బైబిల్ కమ్ ఖురాన్ కమ్ భగవద్గీత అన్నంత హడావిడీ… కలిసి ఎందుకో ఆయన మన తరహా రచయిత కాదేమో అనిపించేలా చేసాయి. రెండేళ్ళ క్రితమనుకుంటా, నా అభిమాన రచయిత నబొకొవ్ 1978లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ చదివాను. దాంతో శాలింజర్‌పై నాలో ఆసక్తి ఉవ్వెత్తున పెరిగిపోయింది. అనేవాణ్ణి బట్టి మాటకో విలువ ఏర్పడుతుంది. విమర్శిస్తూ రాయటం చాలా సులభమనీ, పొగుడుతూ రాయడమే కష్టమనీ; అయినా ఎప్పుడోకప్పుడు శాలింజర్‌ని ఆకాశానికెత్తుతూ ఏవన్నా రాయాలనుందనీ, ఆ ఇంటర్వ్యూలో అన్నాడాయన. నబొకొవ్ పఠనాభిరుచులూ, వాటిని వ్యక్తం చేయడంలో ఆయన నిక్కచ్చితనమూ, అన్నింటికన్నా ముఖ్యంగా ఆయన రచనలూ తెలిసిన నాలాంటి వాడికి, ఆయన నోటమ్మటా ఒక రచయిత గురించి — అందునా ఒక సమకాలీన రచయిత గురించి — ఇలాంటి వ్యాఖ్యానం వచ్చిందంటే దానికెంత విలువుందో వెంటనే అర్థమైపోతుంది. ఈ సిఫారసుతోనే నేను “కేచర్ ఇన్ ద రై” కొన్నాను. నచ్చింది. కానీ నబొకొవ్ నుంచి శాలింజర్‌కు ఆ స్థాయి మెచ్చుకోలు ఇప్పించగల సత్తువేమీ అందులో కనపడలేదు. ముందైతే బోలెడు “goddam”లూ, “and all”లూ, “swear to God”లూ, “I know it’s crazy”లూ మాత్రం కొట్టొచ్చినట్టూ కనపడ్డాయంతే. “మాట్లాడే” రచనలు నన్ను పెద్దగా ఆకట్టుకోవు. అలాంటి రాతల్లో chatty tone చిరాకు కలిగిస్తుంది. “రాయబడిన” రచనలే నచ్చుతాయి. వాటిలో ఏదో నిశ్శబ్దం నా ఏకాంత పఠనానికి అందంగా అమరుతుంది. ఇందులో కథానాయకుడు, పుస్తకం మొదలుపెట్టిందే తరువాయి, సూటిగా కలివిడిగా మనతో మాట్లాడేస్తుంటాడు. ఈ పదిహేడేళ్ళ పసివాడు అడపాదడపా మనుషుల ప్రవర్తన మీద చేసే ముదిపేరయ్య పరిశీలనలు మాత్రం బాగా నచ్చాయి. అతని కొన్ని మాటలు పైకి తేలికగానే కనిపిస్తూ, తరచి చూస్తే ఎంతో లోతైన అవగాహన (బహుశా అతనికే తెలియని అవగాహన) వెలిబుచ్చుతాయి. అలా నన్ను బాగా ఆకట్టుకుందీ పుస్తకం. తరువాత “నైన్ స్టోరీస్” చదవటం మొదలుపెట్టాను. ఇక్కడ అర్థమైంది శాలింజర్‌ని నబొకొవ్ ఎందుకలా పొగిడాడో! పైనే చెప్పినట్టు ప్రతీ కథా ఆణిముత్యమే. కథల్ని అలా రాయవచ్చని అంతకుముందు నిజంగా నాకు తెలియదు. (శాలింజర్‌ని చదవాలనుకునే వాళ్ళు ముందు ఈ పుస్తకంతో మొదలుపెడితే బాగుంటుందని నా సలహా.) పైగా హోల్డెన్ లాంటి కబుర్లపోగు కూడా ఇక్కడ అడ్డంగా లేకపోవటంతో, శాలింజర్‌ ప్రపంచం నాకు మరింత దగ్గరగా వచ్చి చేరినట్టనిపించింది. ఇక తర్వాత “ఫ్రానీ అండ్ జోయీ”, “రైయిజ్ హై…” చదివాకా శాలింజర్‌తో జీవితకాలపు ప్రేమ స్థిరపడిపోయింది.

ఇప్పుడు జె.డి. శాలింజర్‌ అనే రచయిత మరణించాడు. ఇన్నాళ్ళూ నాతో సన్నిహితంగా మాట్లాడిన ఓ గొంతు తాలూకూ మనిషి ఇప్పుడు లేడు. కానీ ఆ గొంతు మాత్రం నాతోనే వుంది, వుంటుంది: ఎప్పటికీ పసితనాన్ని వీడలేకపోయిన గొంతు; ప్రపంచంలో దేంతోనో అస్సలు రాజీపడలేకపోయిన గొంతు; ఎవరికోసం రాయాలన్న ప్రశ్న కలిగినపుడల్లా “లావంటావిడ” కోసం రాయమని గుర్తు చేసే గొంతు; భౌతిక ప్రపంచపు లెక్కల ప్రకారం ఇప్పుడు చనిపోయినా, నేను నాతో పాటూ చిరకాలం సజీవంగా మోసుకెళ్ళే గొంతు…. లాంగ్ లివ్ శాలింజర్‌!

X ——— X ——— X

కొన్ని ఆసక్తికరమైన లింకులు:

You Might Also Like

10 Comments

  1. Sirish Aditya

    I discovered Salinger pretty young with The Catcher in the Rye, and like you can tell from the tagline of my blog, the book read at that highly impressionable age of 16 left a huge mark on me. Not only does Salinger manage to get the right tone of an intelligent, frustrated, ill-fitting 17 year old, he also manages to raise some extraordinary existential questions- the nature of happiness, the purpose of society and compliance to its rules, a transcendental need to move to the countryside. The paragraph where he tells his sister about his dream, where he’d ” just be the catcher in the rye and all. I know it’s crazy.. ” is probably one of the greatest pieces in world literature. Even right now, after all these years, that scene is playing in my head. That probably is the power of great art. Also, like you said, every story in Nine Lives is the work of a master. I especially love For Esme- With Love and Squalor and consider it to be one of the best bittersweet stories I’ve ever read.

    And as to your beautiful ending, that the voice of the author will always stay with those who love him, couldn’t have been articulated better. I have been a huge fan of Garcia Marquez and I didn’t feel too much when I learnt of his death last week. He’s created such extraordinary worlds, caught the soul of life and transported it into his writing, and leaves behind such a treasure of art that he will always be remembered. With love, fondness and gratitude.

  2. పుస్తకం » Blog Archive » 2010లో నా పుస్తకాలు

    […] Catcher in the Rye –  JD Salinger. శాలింజర్ మరణం తర్వాత మళ్ళీ […]

  3. వార్త్తిక్

    ఆదిశంకరుడు ముప్పైరెండేళ్ళ లోపే వేదోపనిషద్ బ్రహ్మసూత్రాల్ని అవపోశన పట్టి అద్వైతం ప్రతిపాదించాడంటే హాశ్చర్యపోయే సంశయాత్మకుల చేత ఇరవైయేడేళ్ళ వయస్సులో మెహెర్ రాసే వ్యాసాలు చదివించాల్సిందే. ఈ జ్ఞానేంద్రుడు శాలింజర్‌ లా సమాజానికి దూరంగా ఓ అల్మరాలో బిడాయించుక్కూర్చోకుండా ప్రతి సంవత్సరం మూడు కథలు, ఆరు వ్యాసాలుగా తన రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తాడని ఆశిద్దాం.

  4. జంపాల చౌదరి

    శాలింజర్‌నీ, అతని రచనల్నీ, మీ స్పందననీ వివరంగా, విపులంగా, మంచి విశ్లేషణతో పరిచయం చేశారు. ధన్యవాదాలు.

  5. మెహెర్

    @budugoy:

    మీరంటున్నది అర్థమైంది. నా వరకూ అయితే “చాటీ టోనే” ప్రధాన అభ్యంతరమనిపించింది. నేను “టు కిలె మాకింక్ బర్డ్” చదివాను. ఆ “చాటీ టోన్”ను మినహాయిస్తే, నచ్చింది. చదివినంత సేపూ ఆ Scout Finch పిల్ల నన్ను ఎక్కడా పుస్తకం వదిలిపెట్టనీయకుండా తన కథ చెప్తూ లాక్కుపోయింది, ఏదో మోచేయి పట్టుకుని తీర్థంలోకి లాక్కుపోతున్న గడుసు చుట్టాల పిల్లలా. కానీ పునఃపఠనానికి ఈ రెండు పుస్తకాల్లోనూ ఒకటి ఎన్నుకోమంటే ఎప్పటికైనా “కేచర్ ఇన్ ద రై”కే నా ఓటేస్తాను. దీనికి ఆయా ఇతివృత్తాలు కారణం కాదు. అలాగే నేను హోల్డెన్‌ను కౌమారప్రాయంలోని తిరుగుబాటుకు ప్రతీకగానో, లేక అమెరికన్ టీనేజ్‌లైఫ్‌కు ప్రతీకగానో భావించలేదు. Holden is not ANY teenager for me; he is one PARTICULAR teenager, that’s all. మీలానే నేను కూడా అతను చుట్టూ వున్న జనాన్ని “ఫోనీస్” అని తీర్మానించేయడాన్ని ఒప్పుకోలేకపోయాను. అయితే “ఎవరిగొడవలు వాళ్ళవీ” అనుకుంటూ మీరు అతని చుట్టుపక్కల జనాన్ని ఎలా అంగీకరించగలిగారో, అలాగే నేను హోల్డెన్ గొడవ హోల్డెన్‌దని ఒప్పేసుకోగలిగాను. కాబట్టి నాకు అతని గొంతు ఆ విషయకంగా ఎక్కడా అభ్యంతరం అనిపించలేదు. ఏదో ఒక దశలో, ఏదో ఒక మోతాదులో స్కౌట్ పించ్‌లోని పసితనమూ, హోల్డెన్‌లోని తిరుగుబాటూ అందరిలోనూ వుండే వుంటాయి. నా వరకూ ఓ పాత్రతో ఐడెంటిఫై చేసుకోగలగడం, చేసుకోలేకపోవటం ఆయా పుస్తకాల విలువను ఎప్పుడూ నిర్థారించలేదు. నాకు బాగా రాసిన పుస్తకాలూ, రాయని పుస్తకాలూ వుంటాయంతే.

    అయితే మీ ఈ పోలిక వల్ల నాకింత దాకా తట్టని ఓ కొత్త విషయం స్ఫురించింది. శాలింజర్‌కు మల్లే “టు కిలె మాకింగ్ బర్డ్” రచయిత్రి హార్పర్ లీ కూడా పెద్ద ఒంటికాయ సొంఠికొమ్మే అని విన్నాను. ఆమె కూడా శాలింజర్‌లానే తన మొదటి ఒక్క పుస్తకమూ సంపాయించిపెట్టిన పేరుప్రఖ్యాతులకు బెంబేలెత్తిపోయిందనిపిస్తుంది. (ఇక్కడే ఆమెకు భిన్నంగా శాలింజర్ మొండిగా ముందుకెళ్లాడు — చివరికి తన పాఠకుల్ని, తన గెలుపోటముల్నీ, జనం అంగీకారానంగీకారాల్నీ కూడా లెక్కచేయకుండా రాసుకుంటూపోయాడు.) వాళ్ళిద్దరి రిక్లూసివ్‌నెస్‌కీ, ఇద్దరి నవలల్లోనూ కనిపించే ఈ పసి నేరేటర్లకీ, ఇద్దరి నవలల కథనంలోనూ వున్న ఆ “chatty tone”కీ ఏదో ఒకే మూల కారణం వుండుంటదనిపిస్తోంది! హ్మ్, ఈ విషయం ఏదో పరిశోధించాలి 🙂

    ఇక మీరెత్తి చూపిన రెండో విషయం. అలుపొచ్చి ఎక్కడోకక్కడ చతికిలపడకుండా మొండిగా ప్రశ్నిస్తూ సాగే సత్తువ వుండాలేగానీ, చావొచ్చి మన అన్వేషణకు అర్థాంతరంగా కామా పెట్టేసరికి, మిగిలేవి ఎప్పటికీ ప్రశ్నలే తప్ప సమాధానాలు కావని నేన్నమ్ముతాను; ఆ సత్తువలేక వాళ్ళు ఇక ప్రశ్నించడం ఆపి సమాధాపడాలనుకుంటే తప్ప. (ఈ ఆద్యంతాల్లేని అనంతమైన ప్రశ్నావాక్యానికి మన సొంత చావెప్పుడూ ఓ బుల్లి కామానే అవుతుంది, పుల్‌స్టాప్ కాలేదు.) ఇలా సమాధానపడటం “బలహీనత” అని నేను అనటం లేదు; సానుభూతితో అర్థం చేసుకోదగ్గ “పరిణామం” అని మాత్రమే అన్నాను. సానుభూతి ఎందుకంటారా? కారణం ఏదైనా అవనీ, నేను అభిమానించే రచయిత నాకు కాకుండాపోతుంటే బాధ కలగడం సహజం; అలా దూరం చేస్తున్న పరిణామాలపై కోపం, విసుగూ కూడా కలుగుతాయి. కానీ అవి అలా విసుక్కోవాల్సిన పరిణామాలు కాదూ; సానుభూతితో అర్థం చేసుకోదగ్గవే అని నేనక్కడ అంటున్నాను. ఇప్పుడు శాలింజర్ చివరి రాతల్లో కూడా సమాధానాలు ఉంటాయని నేననుకోను, బహుశా సమాధానపడటం వుంటుందంతే.

    >>> చలం, సాలింగర్ జీవితాల్లో జరిగిన పరిణామాల్లో నాకు నచ్చి వారిమీద గౌరవాన్ని పెంచే విషయమేంటంటే “సమాజం/కట్టుబాట్లు/సక్సెస్-ఫెయిల్యూర్ కొలమానాలను గాలికి వదిలి తమ మార్గాన్ని తామే ఎంచుకొని ఒక నిజాయితీతో ఎక్స్‌ప్లోర్ చేయడం.

    అవును, నిజం!

  6. budugoy

    frankly speaking, నేను ఈ ప్రశ్న ఆత్మపరిశీలనకోసం అడిగాను. నేనూ మీలానే క్యాచర్ ఇన్ ద రై నవల హై20స్ లో చదివాను. ఆహా ఓహో అని నాకు రిఫర్ చేసినంతగా మెచ్చుకోలేకపోయాను. నిజానికి అమెరికన్ టీనేజర్ లైఫ్ చాలా దగ్గుర్నుండి చూసి, అంత సజీవంగా ఒక పాత్రను చిత్రికరించాడని తెలిసీ నేను ఎందుకో అంత ఎంజాయ్ చేయలేకపోయానీ పుస్తకాన్ని. నా మట్టుకు చాటీ టోన్ మాత్రం కారణం కాదు. ఎందుకంటే అదే చాటీ టోన్ తో రాసిన్ ‘టు కిల్ అ మాకింగ్ బర్డ్’ నవలని ఇప్పటికి నేనెంతో ఇష్టంగా చదువుకుంటాను. బాగా ఆలోచించిన మీదట నాకనిపించిందేమింటంటే (కంక్లూజన్ కాదు అందుకే బహుశా అంటున్నాను) కేచర్ ఇన్ రై లో ఉన్న teenage angst నాలో లేకపోవడమేమోనని. హోల్డెన్ అంతలా విసుక్కొనే ఫోనీస్ ని నేను ఫోనీస్ అనుకోకుండా ‘ఎవరిగొడవలు వాళ్ళవీ అని ఆక్సెప్ట్ చేయడం వల్లేనేమో నని.

    ఇక మీ వ్యాసంలో మరో విషయం –> ” ఆ ప్రశ్నలకు ఏవో కొన్ని జవాబుల్ని కిట్టించుకుని సమాధానపడిపోయిననాడు, రాయటం ఆపేస్తాడు రాయటం ఆపేస్తాడు. ఈ పరిణామం సానుభూతితో అర్థం చేసుకోదగ్గదే. ” –> ఎందుకలా కిట్టించుకున్నారనుకుంటారు? బహుశా కొందరికి నిజంగానే సమాధానాలు దొరికాయేమో. అందుకు చలం కూతురు సౌరిస్ ఒక ఉదాహరణ. నా ఉద్దేశ్యంలో ఈ పరిణామం సానుభూతితో అర్థం చేసుకోవాల్సిన బలహీనత కాదనుకుంటాను. ఎక్కడో ఒకచోట ప్రశ్నకు సమాధానాలు దొరకడమో/దొరికాయానుకోవడమో పరిణామక్రమంలో భాగం. కాకపోతే చలంకు, సాలింగర్ కు దొరికిన సమాధానాలు (జెన్, పరమహంస, రమణమహర్షి ల బోధలు) ఏవీ కూడా ఇన్స్టంట్ ఫలితాలిచ్చేవి కావు. ఆ బోధనల ప్రకారం జీవిత కాలం సాధనలు చేశాక ఒక కొలిక్కి వచ్చేవి. సాలింగర్ కు దొరికిన సమాధానం సరైనదా కాదా అన్నది అతని చివరి రోజుల్లో రాతలు చూస్తే తప్ప తెలుసుకోలేం. చలం రమణ మహర్షి అనుభవాలు రాసినప్పుడు ఇంకా ఆ మార్గాన్ని సరిగా ఎక్స్‌ప్లోర్ చేసినట్టు కూడా అనిపించదు. అందుకే చలంలో రాసిన దాంట్లో angst ఉంటుంది. అదే సౌరిస్ అనుభవాన్ని చూస్తే she seemed happy with what she found. చలం, సాలింగర్ జీవితాల్లో జరిగిన పరిణామాల్లో నాకు నచ్చి వారిమీద గౌరవాన్ని పెంచే విషయమేంటంటే “సమాజం/కట్టుబాట్లు/సక్సెస్-ఫెయిల్యూర్ కొలమానాలను గాలికి వదిలి తమ మార్గాన్ని తామే ఎంచుకొని ఒక నిజాయితీతో ఎక్స్‌ప్లోర్ చేయడం.
    anyways this discussion is beyond the scope of article. Let me stop here.

  7. మెహెర్

    @budugoy: రెండేళ్ళ క్రితం, పాతికేళ్ళప్పుడు, చదివాను. మీ ప్రశ్న నాకు అర్థమైంది. అది ఇంకా ముందు చదివుంటే ఇంకా బాగా నచ్చేదేమో. కానీ ఎప్పటికీ శాలింజర్ తర్వాతి రచనల్తో సాటి రాలేదనిపిస్తుంది. శాలింజర్ మిగతా పుస్తకాలు “కేచర్ ఇన్ ద రై”లా వయసుతో పాటూ వెనక విడిచిపోయేవి కావని నా అభిప్రాయం. చూడాలి కాలమేమంటుందో 🙂

  8. budugoy

    meher, just curious. At what age did you read ‘catcher in the rye’?

  9. మెహెర్

    @Purnima: Hell of a quote Purnima, thank you for sharing it in here. 🙂

  10. Purnima

    “A man will die, a writer, the instrument of creation: but what he has created will never die! And to be able to live for ever you don’t need to have extraordinary gifts or be able to do miracles. Who was Sancho Panza? Who was Prospero? But they will live for ever because – living seeds – they had the luck to find a fruitful soil, an imagination which knew how to grow them and feed them, so that they will live for ever.” (from Six Characters in Search of an Author, 1921)

    True! Long Live, Salinger! 🙂

Leave a Reply