సత్యభామ – యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కొత్త పౌరాణిక నవల

గత సంవత్సరం ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌గారి నవల ద్రౌపదికి కేంద్ర సాహిత్య అకాడెమి బహుమతి వచ్చినప్పుడు చాలా వివాదం చెలరేగింది (ఈ విషయంపై నా వ్యాసం ఇక్కడ చూడవచ్చు). ఆ వివాదం అలా సాగుతూ ఉండగానే లక్ష్మీప్రసాద్‌గారు సత్యభామ పేర ఇంకో పౌరాణిక నవలను నవ్య వారపత్రికలో సీరియల్‌గా ప్రచురించటం మొదలు పెట్టారు. ఆ నవలను ఇప్పుడు ఎమెస్కోవారు పుస్తకరూపంలో అందిస్తున్నారు. ద్రౌపది నవలపై జరిగిన రచ్చ మూలాన ఈ పుస్తకంపై చాలా కుతూహలం ఉండటం సహజం. ద్రౌపదిలో లాగానే ఈ పుస్తకంలోనూ లక్ష్మీప్రసాద్ గారి కొన్ని ప్రతిపాదనలు వివాదాస్పదం కావచ్చు.

ద్రౌపది మహాభారత కథని ఇంకోసారి చెప్పింది. సత్యభామ భాగవతాన్ని మళ్ళీ చెప్తుంది. ఐతే ద్రౌపది జీవితంలో ఉన్నన్ని నాటకీయ ఘట్టాలు సత్యభామ జీవితంలో లేకపోవడంవల్ల కాబోలు, ద్రౌపదితో పోల్చుకొంటే సత్యభామ నవల పరిమాణంలో చిన్నది.

ద్వారకలో ముసలం పుట్టి యాదవులంతా ఒకరినొకరు చంపుకొన్న తరువాత, శ్రీకృష్ణుడి పనుపున అర్జునుడు వచ్చి ద్వారకను ఖాళీ చేయించి మిగిలిన స్త్రీబాలవృద్ధులతో హస్తినాపురం ప్రయాణం కావటంతో ఈ నవల ప్రారంభమౌతుంది. ద్వారకను సముద్రం తనలో కలిపేసుకొంది. బలరామకృష్ణులు చనిపోయిన విషయం తనకు తెలిసినా, అర్జునుడు ఎవరికీ ఆ విషయం చెప్పలేదు. మార్గమధ్యంలో పంచనద ప్రాంతంలో మజిలీ చేస్తే దస్యుల దండు వీరిని దోచుకోవటానికి ప్రయత్నిస్తుంది. అర్జునుడి దివ్యాస్త్రాలు సమయానికి పనిచేయలేదు. అతని శక్తి, పరాక్రమం దస్యుల్ని అడ్డుకోలేకపోయాయి. దస్యులు ధనసంపదలని దోచుకొని చాలామంది యాదవస్త్రీలని చెరబట్టి తీసుకుపోగా, మిగిలినవారితో అవమానభారంతో హస్తిన చేరాడు అర్జునుడు. ఆ పిమ్మట సత్యభామకు, ఇతర కృష్ణపత్నులకు కృష్ణుడి మరణవార్త తెలియజేశాడు. ఆ తరువాత వేదవ్యాసుని వద్ద తపోదీక్ష తీసుకొని తపం మొదలుబెట్టిన సత్యభామ తన గతాన్ని గుర్తుకు తెచ్చుకొంటుంది.

మగధ నుంచి ద్వారక వచ్చి ఉంటున్న యాదవప్రముఖుడు సత్రాజిత్తు. నిత్యసూర్యోపాసకుడైన సత్రాజిత్తును సూర్యభగవానుడు కరుణించి జాజ్వల్యమాన్యము, శక్తివంతము ఐన శ్యమంతకమణిని అతనికి కానుకగా ఇచ్చాడు. అతని ఏకైక కుమార్తె సత్యభామను పెళ్ళి చేసుకొనటానికి యాదవకులంలో ప్రముఖులైన శతధన్వుడు, కృతవర్మ, అకౄరుడు ప్రయత్నిస్తున్నారు. ఆమెను పెళ్ళాడినవారికి తన దగ్గర ఉన్న శ్యమంతకమణిని ఇవ్వటానికి నిర్ణయించుకొన్నాడు సత్రాజిత్తు. శ్రీకృష్ణుడు తన ఇంటికి వచ్చి, శ్యమంతకమణిని చూసి ముచ్చటపడి ఆ మణిని తన తాత గారు, మహారాజు ఉగ్రసేనుడికి ఇవ్వమని కోరినా కాదన్నాడు సత్రాజిత్తు.

అప్పటికే శ్రీకృష్ణుడి గురించి విని ఉన్న సత్యభామ ఆ సమయంలోనే ఆయనను చూసి తన మనసు పారేసుకొంది. శ్రీకృష్ణుని పెళ్ళాడాలన్న తన కోరికను తల్లి సత్యవతికి చెప్పితే ఆమె మందలించింది. కృష్ణుడు సత్యభామలది ఒకటే గోత్రం. వారిద్దరి ప్రపితామహులు ఒకే తల్లి కడుపున పుట్టారు. సగోత్రికులు, సపిండీకులు ఐన వారిద్దరికీ వివాహం జరపటం సంప్రదాయ విరుద్ధమని చెప్పిందావిడ. సత్యభామ దిగులుపడుతుండగా, వారి ఇంటికి వచ్చిన నారదుడు ఆమె సమస్యను విని, సత్యభామ శ్రీకృష్ణుల వివాహం సరి ఐనదేనని, శాస్త్రవిరుద్ధం కాదని ఆమె తల్లితండ్రులను ఒప్పిస్తాడు. ఈలోపు వేటకు వెడుతూ తనతో పాటు శ్యమంతకమణిని తీసుకుపోయిన సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు మాయమైపోయాడు. శ్రీకృష్ణుడే తన తమ్ముని చంపి మణిని కాజేసి ఉండవచ్చని ఇతరులు చెప్పిన మాటలు విన్న సత్రాజిత్తు కృష్ణుని అనుమానించాడు. అది తెలిసిన శ్రీకృష్ణుడు ఆ మణి ఎక్కడున్నా సంపాదించి సత్రాజిత్తుకిచ్చి తనపై పడిన నిందను తొలగించుకోగల్గితేనే ద్వారకకు తిరిగి వస్తానని శపథం చేసి ప్రసేనుని వెదకడానికి అడవికి వెళ్ళాడు. కొన్నాళ్ళ తర్వాత గిరిజన కన్య జాంబవతితోనూ, శ్యమంతకమణితోనూ తిరిగి వచ్చాడు. తప్పు తెలుసుకొన్న సత్రాజిత్తు శ్రీకృష్ణుడికి సత్యభామనిచ్చి పెళ్ళి చేసి శ్యమంతకమణిని కానుకగా ఇచ్చాడు. శ్రీకృష్ణుడు ఎట్టకేలకు ఒక యాదవకన్యను పెళ్ళాడినందుకు బలరాముడు, ఇతర యాదవులు ఆనందించారు. (శ్రీకృష్ణుడి మొదటి భార్య రుక్మిణి క్షత్రియ కన్య; ఆమె తరపు బంధువులు కృష్ణుడు యాదవుడని చిన్న చూపు చూశారని యాదవులకు కోపం.)

సత్యభామ శ్రీకృష్ణుని మనస్సు ఆకట్టుకొంటుంది. అనంగరంగంలోనే కాక సంగీత నృత్యకళలలోనూ, యుద్ధకళలోనూ నైపుణ్యమున్న సత్యభామకు కృష్ణుడు దాసుడయ్యాడు. వారిద్దరూ మంచి స్నేహితులు సన్నిహితులు అయ్యారు.

ఇంద్రప్రస్థంలో పాండవులకు బాసటగా శ్రీకృష్ణుడు వెళ్ళి అర్జునిచే ఖాండవ వన దహనం గావించి అతనికి గాండీవాది ఆయుధాలు సమకూరేట్లు చేశాడు. ఆ సమయంలోనే విష్ణుదేవుని పతిగా గోరి తపస్సు చేసుకుంటున్న సూర్యుని పుత్రిక కాళిందిని కృష్ణుడు వివాహమాడాడు. అవంతీ రాజకుమారి మిత్రవింద తన స్వయంవరానికి వచ్చి తనను పెళ్ళి చేసుకొమ్మని చెలికత్తెతో కబురు పంపింది. ఆమెను దుర్యోధనుడికి ఇచ్చి పెళ్ళి చేయాలని ఆమె తండ్రి ఉద్దేశం. ఆలా జరిగితే దుర్యోధనుడి బలం పెరుగుతుంది. పాండవులకు, యాదవులకు నష్టం కలుగుతుంది. సత్య సమ్మతితో ఆ స్వయంవరానికి వెళ్ళి మిత్రవిందను పెళ్ళి చేసుకొన్నాడు కృష్ణుడు. ఆ తరువాత యాదవ సామ్రాజ్య విస్తరణ కోసం శ్రీకృష్ణుడు మరో మూడు వివాహాలు చేసుకున్నాడు. కోసల రాజకుమారి నాగ్నజితిని, కేకయరాజు కుమార్తె భద్రను, మద్రరాజు కుమార్తె లక్షణను పెళ్ళి చేసుకొని యాదవ సామ్రాజ్యాన్ని మునుపెన్నడూ లేని విధంగా బలోపేతం చేశాడు.

ప్రాగ్జ్యోతిషపుర మహారాజు నరకాసురుడి అఘాయిత్యాలు భరించలేక దేవేంద్రుడు శ్రీకృష్ణుని సహాయం అర్థించాడు. నరకుడు అదితి కుండలాలని పెరికి తీసుకు వచ్చాడని విన్న సత్యభామకు చాలా కోపం వచ్చింది. ఆమె కూడా కృష్ణుడితో పాటు నరకుడిపై యుద్ధానికి తరలివెళ్ళింది. యుద్ధంలో కృష్ణుడు అలసిపోతే సత్యభామ యుద్ధం చేసి నరకుణ్ణి సంహరిస్తుంది. నరకుడు భూదేవి పుత్రుడని, భూదేవి అంశ ఉన్న తనకు కుమారుడి వంటివాడనీ, తన చేతిలో మాత్రమే అతడు మరణించగలడని అతనికి వరం ఉన్నదనీ ఆమెకు తర్వాత తెలుస్తుంది. నరకుడు చెరబట్టిన పదహారువేలమంది రాజకన్యలు తమ ప్రాంతాలకు తిరిగివెళ్ళక శ్రీకృష్ణుని మోహించి సత్యభామ అనుమతితో వారివెంట ద్వారకకు చేరుకొన్నారు. ఒక యాదవ కన్య దేవేంద్రుణ్ణి కూడా భయపెట్టిన రాక్షసుణ్ణి చంపి యాదవుల ప్రతిష్టను అన్ని లోకాలకూ తెలియజెప్పిందని బలరాముడూ, ఇతర యాదవులూ పొంగిపోయారు.

ఇది జరిగిన కొద్ది కాలానికి శ్రీకృష్ణుడు రుక్మిణి ఇంట ఉండగా వచ్చిన నారదుడు దేవేంద్రుడు పంపిన పారిజాతపుష్పాన్ని అందించాడు. అక్కడే వున్న రుక్మిణి దాని అందుకుని అలంకరించుకుంది. ఆ విషయాన్ని, అప్పుడు నారద కృష్ణుల మధ్య జరిగిన సంభాషణను చెలికత్తెల ద్వారా విన్న సత్యభామ మండిపడింది. కోపగృహంలో చేరిన ఆమెను కృష్ణుడు అనునయించే ప్రయత్నంలో ఉండగా ఆమె కాలు శ్రీకృష్ణుడి ముఖానికి తగిలి ఆయన కిరీటం కిందబడింది. స్వర్గంలో ఉన్న పారిజాత వృక్షాన్నే ఆమె పెరటి చెట్టుగా నాటిస్తానని ఆమెకు మాట ఇచ్చిన కృష్ణుడు ఆమెతో పాటు స్వర్గానికి వెళ్ళి దేవేంద్రుని జయించి పారిజాత వృక్షాన్ని సాధించాడు. ఆ తరువాత భర్త పూర్తిగా తన వశంలో ఉండటం కోసం నారదుని సలహాపై సత్యభామ పుణ్యక వ్రతాన్ని చేసుకొని, తన భర్తను నారదుడికి దానమిచ్చి, తదుపరి తన ఆభరణాలన్నీ నారదుడికి మూల్యముగా చెల్లించి ఆయన నుంచి తన భర్తను మరల వెనుకకు తీసుకొంది.

ప్రద్యుమ్నుడి కొడుకు అనిరుద్ధునికి రుక్మి (రుక్మిణి సోదరుడు, విదర్భ రాజు) మనవరాలైన రోచనకు వివాహం కుదిరింది. వివాహానికి వచ్చిన యాదవులను క్షత్రియులు చిన్నచూపు చూశారు. కళింగ రాజులు రుక్మిని రెచ్చగొట్టి బలరామునితో జూదం ఆడించారు. విదర్భేయులు, కాళింగుల అండతో రుక్మి బలరాముణ్ణి, యాదవులను అవమానిస్తూ పరిహాసం చేశాడు. కోపగించిన బలరాముడు రుక్మిని, కాళింగ రాజునూ, ఇతర రాజులు చాలామందిని సంహరించాడు.

కృష్ణుడు భగవత్స్వరూపుడని, ఇంద్రుడని పేరు తెచ్చుకోవటాన్ని చాలామంది క్షత్రియులు సహించలేకపోయారు. కరూశదేశాధిపతి పౌండ్రక వాసుదేవుని వారు రెచ్చగొట్టారు. తానే నిజమైన వాసుదేవుడినని, కృష్ణుదు శంఖచక్రాదులను వదిలి పేరు మార్చుకొని శరణు కోరకపోతే యుద్ధంలో వధిస్తానని పౌండ్రకుడు కృష్ణుడికి కబురు పంపాడు. కోపగించిన శ్రీకృష్ణుడు పౌండ్రకుని, అతనికి తోడు వచ్చిన కాశీరాజుని, ఇతర క్షత్రియుల్ని చంపివేశాడు.

దుర్యోధనుడు తన కుమార్తె లక్షణకు స్వయంవరం ప్రకటిస్తూ, యాదవులను ఆహ్వానించలేదు. కోపగించిన కృష్ణుడు జాంబవతీ పుత్రుడైన సాంబుని పంపగా అతను హస్తినాపురం వెళ్ళి లక్షణను అపహరించి తీసుకురాసాగాడు. కౌరవులు అతన్ని ఎదుర్కొని నిర్బంధించారు. ఆ విషయం తెలిసిన బలరాముడు హస్తినకు వెళ్ళి రాయబార ప్రయత్నాలు చేశాడు. అవి ఫలించకపోతే కోపంతో తన హలాయుధంతో హస్తినాపురాన్ని భూమినుంచి పెకలించబోయాడు. భయపడిన కౌరవులు లక్షణను సాంబునికిచ్చి పెళ్ళి చేసి భూరి కానుకలిచ్చి సత్కరించారు.

జరాసంధుడి చెరలో ఉన్న రెండువేల ఎనిమిది వందలమంది రాజులు తమను రక్షించమని కృష్ణుడికి రహస్యంగా కబురు పంపారు. ధర్మరాజు రాజసూయ యాగం తలపెట్టినప్పుడు అతనికి సహాయంగా వెళ్ళిన కృష్ణుడు భీమునితో తన శత్రువు జరాసంధుని చంపిస్తాడు. రాజసూయాన్ని దిగ్విజయంగా జరిపిస్తాడు. పాండవులలో యదు రక్తం ఉన్నదని (కుంతి శ్రీకృష్ణుని మేనత్త) కృష్ణుడికి ప్రత్యేకమైన అభిమానం. రాజసూయం సమయంలో ధర్మరాజు అగ్రపూజని శ్రీకృష్ణుడికి చేస్తుండగా అభ్యంతరం చెప్పి కృష్ణుని దూషించిన చేది రాజు శిశుపాలుని కృష్ణుడు చక్రంతో సంహరించాడు. దానితో కోపం వచ్చి యాదవులని సంహరించుతానని పంతం పట్టిన సాళ్వుణ్ణీ, దంతవక్త్రుణ్ణీ, అతని సోదరుడు విదూరథుడినీ సంహరించాడు.

కృష్ణుడు, సత్యభామల ప్రోత్సాహంతో సుభద్రార్జునుల వివాహం జరిగింది. అరణ్య, అజ్ఞాత వాసాలు ముగించుకొన్న పాండవులు తమ రాజ్యం కోసం కౌరవులతో యుద్ధం చేసి శ్రీకృష్ణుడి సాయంతో గెలిచారు. ఆ తరువాత శ్రీకృష్ణునికి రాజకీయ విషయాలపై ఇఛ్ఛ తగ్గిపోయింది. ధర్మరాజు చేసిన అశ్వమేధంలో కేవలం ప్రేక్షకపాత్ర మాత్రమే వహించాడు. ఇంకొన్నాళ్ళకి ద్వారకలో ముసలం పుట్టడం, కృష్ణుడి నిర్యాణం జరిగిపోయాయి. తమకు ఎంతో అండగా ఉన్న యాదవుల ఋణం తీర్చుకోవటానికా అన్నట్లు అర్జునుడు వారికి తాము జయించిన అనేక ప్రాంతాలను అప్పజెప్పాడు. కృతవర్మ కుమారుడికి మృత్తికావతపురాన్ని అప్పగించాడు. సాత్యకి కుమారుడిని సరస్వతీ నగరాధీశుడుగా పట్టం గట్టాడు. ఇంద్రప్రస్థ నగరానికి వజ్రుడిని రాజుగా చేసాడు. ద్వారకలో యాదవసామ్రాజ్యం సముద్రంలో కృంగిపోయినా భరతఖండం ఉత్తరాదిన అనేక ప్రాంతాల్లో యాదవ కేతనం ఎగురసాగింది. ఈ పరిణామాన్ని చూసి సంతోషించడానికి శ్రీకృష్ణుడు లేడని సత్యభామ చింతించింది.

వేదవ్యాసుని ఆశ్రమంలో తపోధ్యానంలో ఉన్న సత్యభామకు శ్రీకృష్ణుని దివ్యమంగళస్వరూపం ప్రత్యక్షమైంది. ఆ స్వామిలో సత్య తనను తాను ఐక్యం చేసుకొంది. ఒక రస రమ్య ఘట్టం ముగిసిపోయింది.

మామూలుగా భాగవతంనుంచి ఇతర పురాణాలనుంచి మనం చెప్పుకొనే కృష్ణుడి కథలను, లీలలనూ, విజయగాధలను లక్ష్మీప్రసాద్‌గారు వేరే కోణంలో చూశారు. ఆయన దృక్పథంలో కృష్ణుడు అసమాన శూరుడు, గొప్ప రాజతంత్రజ్ఞుడు. భగవత్స్వరూపుడని కృష్ణుణ్ణి మిగతా పాత్రలందరూ వర్ణిస్తున్నా, రచయిత మాత్రం ఎక్కడా ఆయనను భగవంతుడిగానో భగవదవతారం గానో చూపించలేదు. శ్రీకృష్ణుడి రాజతంత్రమంతా యాదవులకు ఉద్ధతి కల్పించటం చుట్టూనే సాగింది. వారిని చిన్నచూపు చూసిన క్షత్రియులని ఓడించి యాదవ సామ్రాజ్యాన్ని విస్తరించి సుస్థిరం చేయటం కృష్ణుడి ముఖ్య ఆశయం. పాండవులతో స్నేహ బాంధవ్యాలు కూడా ఈ తంత్రంలో భాగమే. యదువంశ రక్తం ఉన్న క్షత్రియులైన పాండవులను కృష్ణుడు బలోపేతం చేయటంలోనూ, సంబంధ బాంధవ్యాలు పెంచుకోవడంలోనూ యాదవకుల లాభ దృష్టి ఉంది. కోరి కబురు పంపిందని క్షత్రియ కన్యను చేసుకొన్నా వైదర్భులతో కృష్ణుడికి కయ్యమే తప్ప నెయ్యం కలుగలేదు.

ఇంతటి కులాపేక్ష ఉన్నప్పుడు, శ్రీకృష్ణుడికి స్వకుల వధువైన సత్యభామపై మిగతా భార్యల కన్నా ఎక్కువ ప్రేమ ఉండటం సహజం. దానికితోడు సత్యభామలోని పలు విశేషాలు, ఆమె అందం, అనురాగం, సకల కళానైపుణ్యం, రాజనీతిజ్ఞత, వీరత్వం శ్రీకృష్ణుని సత్యా వశీగతుణ్ణి చేశాయి.

రాజ్యతంత్రం వరకూ ఈ యాదవ క్షత్రియ వైరుధ్యాల ప్రస్తావన ఆలోచించదగ్గ విషయమే. కానీ, యాదవ కన్య అని ద్వారకా వాసులందరూ సత్యభామను చూసి  మురిసిపోయే విధానం మాత్రం  ఈ నవలలో అతిగా చిత్రించారు. అంత పిచ్చిని భరించటం కష్టం అనిపించింది. ముఖ్యంగా బలరాముడు సత్య పట్ల చూపించే అభిమానం ఆ పాత్రను విపరీతమైన కులపిచ్చి ఉన్న వ్యక్తిగా అపహాస్యం పాలు చేసింది.

ద్రౌపది పుస్తకానికి విపులమైన ముందుమాట వ్రాసిన లక్ష్మీప్రసాద్ గారు ఈ పుస్తకానికి ముందుమాట వ్రాయలేదు. ఈ నవలలో ఆయన దృక్పథానికి కారణాలు, ఆధారాలు ఈసారి చెప్పలేదు.

ముందే చెప్పినట్లు ఇది చిన్న పుస్తకం. ముఖ్య కథ తెలిసిందే ఐనా, కొన్ని అంతగా ప్రసిద్ధం కాని విషయాలను చెప్పడం వల్ల ఉత్సాహంగానే చదివిస్తుంది. ఉండవలసిన శృంగార ఘట్టాలు ఉన్నా అతిగా లేకుండా కథలో కలిసిపోయాయి. వివిధ యాదవ వంశాలు, కృష్ణుడి అష్టభార్యలు, సత్యభామ పదిమంది పుత్రులు వంటి కొన్ని విషయాల గురించి ఆసక్తికరమైన కొన్ని వివరాలు తెలుస్తాయి. లక్ష్మీప్రసాద్‌గారి శైలి చదివించే విధంగా ఉంది.

ద్రౌపదిలో లాగానే ఈ పుస్తకంలోనూ సత్యభామకూ ద్రౌపది మధ్య ఒక సంభాషణ ఘట్టం ఉంది. ద్రౌపది కృష్ణుల మధ్య ఉన్న సంబంధం గురించి ద్రౌపది ఈసారి చెప్పిన మాటలు మరింత అయోమయాన్ని కలుగజేస్తాయి.

ముఖచిత్రానికి బాపు గారి బొమ్మ చక్కగా అమరింది. బాపుగారి అభిమానులకు ఈ బొమ్మ ఇంతకుముందు చూసినట్లు అనుమానం వస్తే, మీ అనుమానం నిజమే. ఈ బొమ్మ ఇంతకు ముందు ఎక్కడ చూశారో చెప్పుకోగలరా?

పుస్తకం ముద్రణ అందంగా ఉంది. అక్కడక్కడా అచ్చుతప్పులు, ఆ కారణం చేతో, మరో కారణం చేతో అన్వయం సరిగా కుదరని వాక్యాలు ఉన్నాయి. అక్కడక్కడా కొన్ని వాక్యాలు అనుచితంగా అనిపించాయి. ఒక సంపాదకుడి (డా.  డి. చంద్రశేఖర రెడ్డి), మరొక సహాయ సంపాదకుడి (ఆ. ఆనందీశ్వరరెడ్డి) పేర్లు పుస్తక వివరాల పేజీలో ఉండటం కొద్దిగా ఆశ్చర్యాన్ని కలుగజేసింది. వారి సంపాదకత్వం ఈ పుస్తకానికే పరిమితమో లేక మిగతా ఎమెస్కో పుస్తకాలకి కూడానేమో అన్న విషయం అర్థం కాలేదు. ఈ పుస్తక ప్రచురణలో సంపాదకుల పాత్ర ఏమిటో స్పష్టంగా తెలియలేదు.

సత్యభామ
యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
డిశంబర్ 2010
ఎమెస్కో బుక్స్, 1-2-7 బానూ కాలనీ, గగన్‌మహల్ రోడ్, దోమలగూడ, హైదరాబాద్ 500 029
ఫోన్: 040 2326 4028
ఈమెయిల్: emescobooks@yahoo.com
www.emescobooks.com
144 పేజీలు; 50 రూ.

********************
చికాగో మెడికల్ స్కూల్‌లో సైకియాట్రీ ప్రొఫెసర్ డా. జంపాల చౌదరికి తెలుగు, సాహిత్యం, కళలు, సినిమాలు అంటే అభిమానం. తానా పత్రిక, తెలుగు నాడి పత్రికలకు, మూడు తానా సమావేశపు సావెనీర్లకు, రెండు దశాబ్దాలు కథాసంపుటానికి సంపాదకత్వం వహించారు. తానా, ఫౌండేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారంస్ ఇన్ ఇండియా (ఎఫ్.డి.ఆర్.ఐ.), మరికొన్ని సంస్థలలోనూ, కొన్ని తెలుగు ఇంటర్నెట్ వేదికలలోనూ ఉత్సాహంగా పాల్గొంటుంటారు; చాలాకాలంగా తానా ప్రచురణల కమిటీ అధ్యక్షులు. పుస్తకం.నెట్‌లో జంపాల గారి ఇతర రచనలు ఇక్కడ చదవవచ్చు.

********************

You Might Also Like

14 Comments

  1. ఏల్చూరి మురళీధరరావు

    సాంకేతిక కారణాల వల్ల కాబోలు లేఖలో సంజ్ఞల మధ్య భాగం తొలగిపోయింది. అందువల్ల పునారచించాను. వీలయితే, వెనుకటి లేఖను తొలగింపవలసినదిగా పుస్తకం.నెట్ సంపాదికలకు విన్నపం.

    1) యదువంశంలోని రాజులు:
    యదువంశంలో జన్మించిన రాజుల పేర్లు పురాణాలలో, భారత – భాగవతాలలో ఒక్క తీరున లేవు. పురాణాలలోని రాజవంశాలపై ప్రామాణిక పరిశోధనలను చేసిన విల్సన్, పర్గీటర్, అగర్వాలా, హజ్రా వంటివారు, ఇతరులు పెక్కుమంది, చేసేదేమీ లేక రాజవంశాల తులనాత్మక పట్టికలను ఇచ్చి ఊరుకొన్నారు. సంస్కృత భారతంలో ఉన్న యదువంశీయుల క్రమప్రథను నన్నయగారు చాలాచోట్ల విడిచివేశారు. పోతన గారి భాగవతం సుపరిష్కృతం కానందువల్ల నవమ స్కంధంలోని యదువంశరాజుల నామావళి సరిగా లేదు. అందువల్ల యదువంశీయుల గోత్రనామాంకనం స్పష్టంగా చెప్పటం కష్టం.

    2) సత్యా కృష్ణుల ప్రపితామహులు:
    కార్తవీర్యార్జునునికి పద్దెనిమిదవ తరంలో హృదీకుడు; అతనికి దేవవాహుడు, గదాధన్వుడు, కృతవర్మ, శూరుడు (శూరసేనుడు అని తెలుగువారి వాడుక); వారిలో శూరునికి వసుదేవుడు; వసుదేవునికి దేవకి యందు శ్రీకృష్ణుడు జన్మించారు. ఇది భారత భాగవతాలు రెండూ అంగీకరించిన క్రమం. ఆ ప్రకారం శ్రీకృష్ణునికి హృదీకుడు ప్రపితామహుడవుతాడు.
    కార్తవీర్యార్జునుని కొడుకులను పరశురాముడు సంహరింపక మునుపు మధునికి వృష్ణి జన్మించాడు. అతనికి యుధాజిత్తు; యుధాజిత్తుకు అనమిత్రుడు; అతనికి స్నిగ్ధుడు (నిమ్నుడని భాగవత పాఠం); స్నిగ్ధునికి ప్రసేన సత్రాజిత్తులు జన్మించారు. (ప్రసేనుడు సత్రాజిత్తుకు సవతి తమ్ముడని మహాభారతం అంటున్నది) సత్రాజిత్తు కూతురు సత్యభామ. ఆ ప్రకారాన సత్యభామకు అనమిత్రుడు ప్రపితామహుడవుతాడు. ఇది మహాభారత కథనం.
    హృదీకుని తల్లి పేరు, అనమిత్రుని తల్లి పేరు భారత భాగవతాలలో లేవు. కనుక శ్రీ లక్ష్మీప్రసాద్ గారు సత్యా కృష్ణుల “ప్రపితామహులు ఒకే తల్లి కడుపున పుట్టారు” అని చెప్పటానికి ఆధారమేమిటో తెలియదు.

    3) సగోత్ర విషయం:
    సత్యభామ, శ్రీకృష్ణుడు ఒకే గోత్రానికి చెందినవారు కావటం వల్ల సగోత్రవివాహం చెల్లదు కనుక నారదుడు వచ్చి సమర్థించినట్లున్నది. నారదుడు ఏమని చెప్పి సమర్థించాడో – గ్రంథాన్ని నేను చదవలేదు కాబట్టి చెప్పలేను.

    వసుదేవుడు, దేవకి కూడా సగోత్రికులే అని శ్రీ జంపాల చౌదరి గారు కూడా వ్రాశారు.

    అసలు విషయం ఇది:

    ఒకే గోత్రానికి చెందిన కుటుంబాలలో ఏడు తరాల వఱకు సగోత్ర వివాహం జరుగనట్లయితే, ఎనిమిదవ తరంలో వివాహం చేసుకోవచ్చునని ధర్మశాస్త్ర నిర్ణయం. యదువంశంలో ఇరవైరెండవ తరంలో పృష్ణి; అతనికి చిత్రరథుడు; చిత్రరథునికి విడూరథుడు (విదూరథుడు అని పోతన గారి భాగవతంలో ముద్రితమైనది అపపాఠం); అతనికి శూరుడు; శూరునికి శిని; శినికి భోజుడు; అతనికి హృదీకుడు జన్మించారు. హృదీకుని మనుమడు వసుదేవుడు. వసుదేవునికి ఏడు తరాల మునుపు సగోత్ర వివాహం జరుగలేదు కాబట్టి ఏ విధంగా చూసినా దేవకీ వసుదేవుల వివాహం శాస్త్రసమ్మతం.

    సాత్త్వతుని వంశక్రమంలో శ్రీ చౌదరి గారు అనుబంధ వ్యాఖ్యలో ఉదాహరించిన పేర్లు భాగవత ముద్రితపాఠాన్ని అనుసరించి కొంత దోషయుక్తంగా ఉన్నా ఆ క్రమం అదే. ఆ ప్రకారాన చూసినా దేవకికి ఏడు తరాల మునుపు సగోత్ర వివాహం జరుగలేదు కనుక దేవకీ వసుదేవుల వివాహం శాస్త్రసమ్మతమే. అది సగోత్రవివాహంగా పరిగణింపబడదు.
    దేవకీ వసుదేవులది సగోత్ర వివాహం కాదు కనుక శ్రీకృష్ణుడు సత్యభామను వివాహం చేసుకోవటం కూడా ధర్మవిరుద్ధం కాదు. దానికి నారదుడు వచ్చి సమర్థింపవలసినది ఏమీ లేదు. తన “నారదీయ ధర్మసూత్రం”లోనూ, “నారదీయ పురాణం”లోనూ పాపం నారదుడు ఈ విషయాన్ని గురించి చర్చింపనే లేదు!

    శ్రీ చౌదరి గారి సమీక్షను బట్టి శ్రీ లక్ష్మీప్రసాద్ గారు సత్యాకృష్ణులు సపిండీకులు అని కూడా వ్రాసినట్లున్నది.

    4) సత్యాకృష్ణుల పూర్వజన్మ విషయం:
    పద్మపురాణం ఉత్తరఖండంలో దేవశర్మ కుమార్తె గుణవతి కార్తీకమాసంలో శ్రీమహావిష్ణువును ఆరాధించి ఉత్తర జన్మలో శ్రీకృష్ణుని భర్తగా పొందగల వరానికి నోచుకొన్న కథ ఉన్నది. ఆ కథానుసారం సత్యాకృష్ణుల వివాహం పూర్వనిర్ణీతమే కనుక అందులో ఈ సగోత్రాదిక విమర్శనీయం ఉండకూడదు.

    దురదృష్టవశాత్తు ఈ భాగాన్ని మడికి సింగన తన “పద్మపురాణం”లో అనువదింపలేదు. భాగవత పాత్రల పూర్వజన్మ వృత్తాంతాలనేకం పేర్కొన్న “గర్గ భాగవతం”లోనూ ఈ ప్రస్తావన లేదు.

    5) శ్రీకృష్ణుని పాండవాభిమానం:
    కుంతీదేవి కారణంగా శ్రీకృష్ణునికి పాండవులపై విశేషాభిమానం ఉన్నందుకు మూలం కొంతకు కొంత “దేవీ భాగవతం”లో కనబడుతుంది. శ్రీ లక్ష్మీప్రసాద్ గారి చిత్రీకరణకు ప్రాకరం లేదనలేము.

    6) సుభద్రార్జునుల వివాహం: సత్యాకృష్ణుల ప్రోత్సాహం:
    సుభద్రార్జునుల వివాహానికి సత్యాకృష్ణుల సమ్మతి, ప్రోత్సాహం ఉన్నదని ఎంతోమంది కవులు వర్ణించారు. సంస్కృతంలో నారాయణ పండితుని “సుభద్రాహరణం”, మాధవ భట్టు “సుభద్రాహరణం”, ధనంజయ కవి “సుభద్రాహరణ కావ్యం”; తెలుగులో చేమకూర వెంకటకవి “విజయవిలాసం” చదివినవారికి ఈ విషయం స్ఫుటగోచరమే కనుక ఇక్కడ విస్తరించి ఉదాహరణలను ఇవ్వటం లేదు.

    7) “యాదవ” శబ్దప్రయోగం:
    ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం వారు చాలా సంవత్సరాల కృషి ఫలితంగా “యాదవ విజ్ఞాన సర్వస్వము”ను ప్రకటిస్తున్నారు. అందులో ఈ శబ్దప్రయోగాన్ని గురించి అత్యంత విపులమైన చారిత్రిక వివరణను ఇచ్చారు. ఆ గ్రంథం త్వరలో వెలుగుచూడనున్నది.

    శ్రీ లక్ష్మీప్రసాద్ గారు ప్రఖ్యాతేతివృత్తానికి ఉత్పాద్యాన్ని మేళవించి తమదైన శైలిలో మిశ్రబంధాన్ని చాలా పరిశోధించిన తర్వాత జాగ్రత్తగానే వ్రాస్తుంటారు. అయితే, కాథికతలో పూర్వవృత్తంలోని యాథాతథ్యాని కంటె స్వీయాన్వయానికి ప్రాధాన్యం ఇచ్చాక ఏవో కొన్ని పొరపాట్లు తప్పవు. సుభద్రా ద్రౌపదీ సంవాదం పాట సత్యా ద్రౌపదీ సంభాషణగా మారిన ఘట్టం ఇటువంటిదే. అటువంటి వాటిని సందర్భోచితంగా సవరించటం సంపాదకుల బాధ్యత. లేదా, రచయిత తన కథాసన్నివేశానుసారం స్వతంత్రించి చేసిన కల్పన అనుకోవాలి.

    శ్రీ జంపాల చౌదరి గారి గుణావగుణసమీక్ష ప్రకాశ్యార్థప్రకాశకంగా ఇంకా ఎన్నో ఆలోచనీయ విషయాలను ఆలోచింపజేసేదిగా ఉన్నందుకు వారికి నా హార్దికాభినందనలు!

    1. Jampala Chowdary

      మురళీధరరావుగారు:

      ఓపికగా, విశదంగా వివరించినందుకు ధన్యవాదాలు.
      పోతన భాగవతంలో సరిగా లేకపోయినా యదువంశపరంపర విషయాలు వ్యాసమాతృకలో ఉండాలికదా?
      మధుడు కార్తవీర్యార్జుని కొడుకు, హృదీకుడు కార్తవీర్యార్జుని 18వ తరంవాడు ఐతే, సత్యభామ కృష్ణుడికన్నా చాలా ముందు తరాల మనిషి ఔతుంది కదా?

    2. Jampala Chowdary

      యాదవశబ్దప్రయోగం గురించి రాబోతున్న వ్యాసంలో తెలపబోతున్న విషయాలను మీరు క్లుప్తంగా చెప్పగలరా?

  2. Avinash

    meku telusa krishnudu nanu yadhu vamsiyudini yadava raju ni ani bagavatham lo antadu
    telisthe rayadandi teliyakapothe dont write

    meku kopam ravachhu andhukante yadavalaki antha paru kabatti

    1. Jampala Chowdary

      మీరు తెలుగుని ఇంగ్లీషులో టైపు చేసే ప్రయత్నంలో మీరు ఉద్దేశించని అపస్వరాలు పలికాయి. ఇకముందు పూర్తిగా ఇంగ్లీషులోనో, లేకపోతే తెలుగులో టైపు చేయడమో చేస్తే ఈ ఇబ్బంది ఉండదు.

      శ్రీకృష్ణుడు యదు వంశస్థుడు, యాదవుడు అన్న విషయాలను ఇక్కడ ఎవరూ శంకించటం లేదు. ఐతే, చారిత్రకంగా యాదవుడు అన్న మాటను ఏ అర్థంలో ఉపయోగించారు అన్న ప్రశ్నకు విపులమైన జవాబు అవసరం.

  3. Kinige Newsletter V2.1 | Kinige Blog

    […] సత్యభామసమీక్ష ‘కినిగె’పై […]

  4. Jampala Chowdary

    @రాఘవ and Manasa:

    భాగవతం నవమ స్కంధంలో యదు వంశ వృక్ష వివరణ ఉంది. సాత్త్వతుడు అనే యదు వంశీయునికి ఏడుగురు కొడుకులు.

    సాత్త్వతుని నాలుగవ కుమారుడు వృష్ణి మునిమనవడి కొడుకు నిమ్నుడి కుమారులు సత్రాజితుడు, ప్రసేనుడు. సత్రాజితుని కుమార్తె సత్యభామ.

    సాత్త్వతుని ఐదో కుమారుడు అంధకునికి భజమానుడు, కుక్కురుడు, మరి ఇద్దరు కొడుకులు. భజమానుడి మునిమనవడి మనవడు దేవమీఢునికి మారిష అనే భార్య ద్వారా వసుదేవుడు, అతని తమ్ములు పది మంది, పృథ, శృతదేవ, శృతశ్రవస, వారి చెల్లెళ్ళు ఇంకో ఇద్దరు పుట్టారు. వసుదేవుని కొడుకు కృష్ణుడు. పృథ కుంతిభోజుని దగ్గర కుంతిగా పెరిగి కర్ణ యుధిష్టిర భీమార్జునులకు జన్మనిచ్చింది. శృతదేవ కుమారుడు దంతవక్తృడు. శృతశ్రావసకు, చేది రాజు తమఘోషుడికి శిశుపాలుడు జన్మించాడు.

    కుకురుడి మునిమనవడి మునిమనవడి మనవడు ఆహుకుడు. ఆహుకునికి ఇద్దరు కొడుకులు దేవకుడు, ఉగ్రసేనుడు. దేవకునికి నలుగురు కొడుకులు, ఏడుగురు కూతుళ్ళు. ఆఖరు కూతురు దేవకి. (వసుదేవుడు దేవకినీ, ఆవిడ అక్కలు ఆరుగురినీ, వీరితో పాటు ఇంకో ఆరుగుర్ని పెళ్ళి చేసుకొన్నాడు. ఆయనకి రోహిణి యందు బలుడు, దేవకి యందు కృష్ణుడు, సుభద్రలతోసహా కనీసం 74 మంది సంతానం). ఉగ్రశేనుడికి పెద్ద కొడుకు కంసుడితో కలిపి తొమ్మిదిమంది కొడుకులు, నలుగురు కూతుళ్ళు. వసుదేవుడి తమ్ముళ్ళు ఉగ్రసేనుడి కూతుళ్ళను పెళ్ళి చేసుకున్నారు.

    సాత్త్వతుని ఏడవ కుమారుడు మహాభోజుని వంశము వారు భోజులని పిలవబడ్డారు. ఈ వంశము వాడైన కుంతి భోజుడికి పిల్లలు లేకపోవడంతో అతని మిత్రుడు దేవకుడు తన కూతురు పృథ (వసుదేవుని తోబుట్టువు)ని పెంపుకి ఇచ్చాడు.

    పై లెక్కన సత్యభామ, కృష్ణులే కాదు, దేవకి, వసుదేవులు కూడా సగోత్రీకులే.

    ఒక మేనత్త పిల్లలు పాండవులతో సన్నిహితంగా ఉన్న కృష్ణుడు, ఇంకో ఇద్దరు మేనత్తల పిల్లలు శిశుపాల దంతవక్తృలని చంపాడు. ఇంకో మేనత్త భర్త కేకయ రాజునీ చంపాడు.
    శిశుపాలుడి తల్లి యదువంశజ ఐనా, అతనికి రుక్మిణితో పెళ్ళి కుదిరింది.
    ఇవన్నీ చూస్తే ఈ యాదవ, క్షత్రియ వైషమ్య సిద్ధాంతం పరీక్షకు నిలబడదని తోస్తుంది.

    1. KUMARBABJI

      NAMASHKARAMULU.

      ASALU (KSHATRIYA YADAVA) OR YADAVULA MULAM YAKKADA,
      YADAVA RAJU YAVARU ,MANUVU PUTRUDA LEKA???????.
      BALARAMA,SRIKRISHNA YADAVA VAMSHAM,SHAPA VASHATTU SAMULAM GAA
      MARANAM CHENDI NARU ANI KADA, MARI E NATI YADAVULU YAKKADI VARU.?

      NAKU TELIYADU,TELUPA GALARU.
      TAPPULU VUNTE SARIDIDDA GALARU.
      SWASTHI.
      KUMARBABJI

  5. Jampala Chowdary

    @శ్రీరమణ: బాపు గారి బొమ్మ గుర్తు చెప్పటానికి శ్రీరమణగారు పుస్తకంలోకి స్వయంగా రావటం మాఊళ్ళో క్రికెట్ టూర్నమెంట్‌కి సచిన్ టెండుల్కర్ వచ్చి ఆడటం లాంటిది. చాలా సంతోషం. శ్రీరమణ గారు సిక్సర్ కొట్టేశారు. ఈ బొమ్మ తిరుప్పావై ఇరవయ్యో పాశురానికి వేసిన బొమ్మ.

    భాగవతంలో యాదవులు అన్న మాట యదువంశజులు అన్న అర్థంలోనే ఉంది. కులం అన్న పదం కూడా వంశం అన్న అర్తంలోనే వాడినట్లు ఉంది కాని గోపాలక వృత్తికి చెందినట్లుగా లేదు. భాగవతంలో యదు వంశస్థులు రాజులు. ఇతర రాజులతో బాంధవ్యాలు ఉన్నవాళ్ళు. ప్రస్తుతార్థంలో యాదవ పదం వాడుక ఎప్పుడు ప్రారంభమయ్యిందో?

  6. సుజాత

    సత్యభామ కూడా ఏదో సాధించడానికే పుట్టింది.

    మళ్ళీ అవార్డేమోనండీ :-))

  7. శ్రీరమణ

    డా. జంపాల – సత్యభామ చదివాక శ్రీరమణ –

    ముఖచిత్రం బాపు తిరుప్పావై (పాశురాలకు) వేసిన బొమ్మ. ఒక ఎడిషన్ ఎమెస్కో వారు వారింటికి పెళ్లి సందర్భంగా తిరుప్పావైని అందంగా ప్రచురించి కానుకగా యిచ్చారు.

    సత్యభామ కథలో చాలా అసంబద్ధాలున్నాయి.

    కృష్ణుడు బలరాముడు యదువంశీకులే గాని యాదవకులస్థులు కాదు. పాండవ కౌరవులకు కృష్ణుడికి నిజంగానే బంధుత్వం వుంది. వుద్యోగ విజయాలు (తిరపతి వేంకటకవులు) నాటకంలో “కౌరవ పాండవుల్ పెనగు కాలము చేరువయ్యె… ఎక్కుడగు బంధు సముద్రడవీవు గాన” అంటాడు పడక సీన్‌‍లో – యస్వీ భుజంగరాయ శర్మ “తెలుగింటి సత్యభామ” చదివితే సత్యభామ జాణతనం తెలుస్తుంది. స్థానం వారి “మీరజాలగలడా…”, కూచిపూడి వారి “భామనే సత్యభామనే…” అనాదిగా భామ వ్యక్తిత్వాన్ని సూచిస్తున్నాయి. భర్తని చెప్పుచేతల్లో పెట్టుకున్న ఇల్లాలిని సత్యభామగా వర్ణించడం మామూలే. నవల మీద ఎలాంటి వ్యాఖ్యా చేయలేను. గతంలో వచ్చిన ద్రౌపది మీద కూడా. పైగా విజ్ఞాననిధులైన ముగ్గురు న్యాయ నిర్ణేతలు అకాడమి అవార్డ్‌‍కి సిఫార్స్ చేశాక దాని మీద మాట్లాడడం అపరాధం అవుతుంది. సత్యభామ కూడా ఏదో సాధించడానికే పుట్టింది. నరకాసుర వధలో ఆమె బాణం గురి తప్పలేదు.

    – శ్రీరమణ

  8. సౌమ్య

    నాక్కూడా ఇదే సందేహం కలిగింది. మళ్ళీ, అడిగితే, గొడవలౌతాయేమో అని ఆగాను :))
    అయితే, ఇద్దరు సగోత్రీకులైతే – నారదులవారు ఏం చెప్పి ఇది శాస్త్ర సమ్మతం అన్నారు?
    సగోత్రీక వివాహాలు శాస్త్ర సమ్మతం అయితే – ఉన్నట్లుండి కొత్త ఈక్వేషన్లు పుట్టవూ…వర్తమానంలో! 😛

  9. Manasa

    Interesting..I have the same question too – is this true?

    ౨. కృష్ణుడూ సత్యభామా సగోత్రీకులా? నారదులవారు వచ్చి వారి వివాహం శాస్త్రసమ్మతమే అని చెప్పారా?

  10. రాఘవ

    ఇందులో కచ్చితంగా వివాదాస్పదమైన అంశం:

    ౧. యాదవులంటే మిగతావారికి చిన్నచూపు అన్నది మాటిమాటికీ చెప్పటం. ఎన్.టీ.ఆర్. తెలుగువారి ఆత్మగౌరవం అన్నచందాన బలరాముడు యాదవుల ఆత్మగౌరవం గుఱించి చాలా బాధపడిపోయినట్టుగా చెప్పటం. పైగా కృష్ణునికి సత్యభామ అంటే అందరికంటె కొంచెం ఎక్కువ ఇష్టం ఉండటానికి కారణం ఆవిడ యాదవకన్య కావటం అని కూడా వాక్రుచ్చటం!

    నాకు చాలా ఆశ్చర్యం వేసిన విషయం:

    ౨. కృష్ణుడూ సత్యభామా సగోత్రీకులా? 😮 నారదులవారు వచ్చి వారి వివాహం శాస్త్రసమ్మతమే అని చెప్పారా? 😮

    క్రింద చెప్పబోయే ఈ రెండూ పెద్దగా వివాదాస్పదాలు కాకపోవచ్చు. ఐనా కొంచెం భిన్నంగా ఉన్నాయి.

    ౩. “పాండవులలో యదు రక్తం ఉన్నదని (కుంతి శ్రీకృష్ణుని మేనత్త) కృష్ణుడికి ప్రత్యేకమైన అభిమానం.” ధర్మాధర్మాలతో సంబంధమే లేకుండా ఇంతకంటె నాటకీయంగా ఎవరూ చెప్పలేరేమో!

    ౪. కృష్ణుడు, సత్యభామల ప్రోత్సాహంతో సుభద్రార్జునుల వివాహం జరిగిందా? ఇక్కడ సత్యభామ ఎందుకు వచ్చింది? ఔను కదూ, మరిచిపోయాను, నవల రుక్మిణిగుఱించో జాంబవతిగుఱించో కాదు కదా!

Leave a Reply